తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఇంటి నుంచే ఆరంభిద్దాం!

  • 431 Views
  • 55Likes
  • Like
  • Article Share

మాతృభాష పరిరక్షణ తమ ప్రథమ కర్తవ్యంగా పౌరులు భావించాలి. తల్లి భాష ఇంటివద్ద తల్లిదండ్రుల నుంచే మొదలుకావాలి. మనమంతా తప్పనిసరిగా మన పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం కలిగేలా ఇంట్లో వాతావరణం కల్పించాలి. పౌరులుగా ఇది మనందరి బాధ్యత. 

- పద్మశ్రీ శోభానాయుడు, ప్రముఖ కూచిపూడి కళాకారిణి

"ఒక సంగీతమేదో పాడినట్లు, భాషించునపుడు వినిపించు భాష" అని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు కీర్తించిన భాష మనది. తెలుగు ఎంత కర్ణ పేయమైందో ఈ ఒక్క వాక్యం చూస్తే అర్ధమవుతుంది. 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్' అనే గౌరవాన్ని మన తెలుగు పొందడానికి కారణం ఇదే. నాటి నన్నయ నుంచి నేటి నారాయణరెడ్డి వరకు తెలుగు ఎన్ని సొగసులు, ఎన్ని సోయగాలు ఆవిష్కరించిందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. తల్లి భాషకు మించిన భాష మరొకటి లేదు. అలాంటి భాషకు ఇప్పుడు ఏమాత్రం ఆదరణ ఉంది? ఆలోచిస్తే బాధ కలుగుతుంది. మాతృభాషకు సంబంధించిన ఉద్యమాల్లో ప్రజా ప్రతినిధుల ప్రాతినిథ్యం అంతగా కనిపించదు. ఇది అభిలషణీయం కాదు. భాషా పరిరక్షణ ఉద్యమాల్లో వీరు ఎక్కువగా పాలుపంచుకోవాలి. మన చుట్టూ వాతావరణాన్ని గమనిస్తే ఐటీ చదువులు, ఐటీ ఉద్యోగాలు. వీటి జోరు ఆరంభమైన తరువాత యువతరం వాటి పట్ల ఏ స్థాయిలో ఆకర్షితమైందో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలాగే కొనసాగితే ఇక ముందు యువత రంలో తెలుగు కాగడా వేసి వెతికినా కనిపించదు. దీనికి ప్రత్యామ్నాయం సామాజికవేత్తలు తప్పక సూచించాలి. లేకపోతే కొన్ని దశాబ్దాల తరువాత తెలుగు వినే అవకాశమే మృగ్యమైపోతుంది.

     మాతృభాష పరిరక్షణ తమ ప్రథమ కర్తవ్యంగా పౌరులు భావించాలి. తల్లి భాష ఇంటివద్ద తల్లిదండ్రుల నుంచే మొదలుకావాలి. మనమంతా తప్పనిసరిగా మన పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం కలిగేలా ఇంట్లో వాతావరణం కల్పించాలి. పౌరులుగా ఇది మనందరి బాధ్యత. మాధ్యమాల విషయానికొస్తే ప్రచురణ, ప్రసార మాధ్యమాలు తెలుగు భాషపై అత్యంత శ్రద్ధకనబరచాలి. ప్రచురణ మాధ్యమం కొంత సంతృప్తికరంగానే ఉన్నా ప్రసార మాధ్యమం పరిస్థితి అధ్వాన్నం. ఈ స్థితి నుంచి వెంటనే బయటపడాలి. వంకర టింకర మాటల సంకర భాష ఈ వేళ ప్రసార మాధ్యమాల్లో రాజ్యమేలుతోంది. రేడియో, టీవీ సంభాషణ ల్లో తెలుగు మాటలు వెతికి పట్టుకోవాలి. ఒక వేళ ఒకటి రెండు మాటలు దొరికినా వాటి ఔచిత్యమేంటో తరచి చూసినా అర్ధం కాదు. వ్యాఖ్యాతలకు మితిమీరిన స్వేచ్చ, భాషకు సంబంధించిన అవగాహనారాహిత్యం రెండూ ప్రధాన కారణాలే. నిజానికి ప్రసార మాధ్యమం భాష విషయంలో అద్భుతమైన సేవ చేయగలదు. రేడియో, టీవీలు సవ్యమైన భాషను ప్రజలకు అందించగలిగితే, భాషా పరిరక్షణలో సగానికిపైగా బాధ్యతను నిర్వర్తించినట్లే. దోషం ఎవరిదైనా, ఎక్కడున్నా సవరించుకుని తీరాలి. అందరం కలిసి తెలుగును రక్షించుకుందాం. భావి తరాలకు తెలుగు మాధుర్యాన్ని మనమే అందిద్దాం. 


అలా కల నెరవేర్చాను
మా నాన్న వెంకయ్య నాయుడుకి నాట్యమంటే అంతగా ఆసక్తి ఉండేది కాదు. ఆయన పీడబ్ల్యూడీలో ఇంజనీరు. నన్ను డాక్టర్‌గా చూడాలను కున్నారు. అమ్మ మాత్రం నేను మంచి నాట్య కళాకారిణి అవ్వాలని ఆశపడేది. నేను పుట్టాక బాగా కలిసొచ్చిందని నా ఇష్టాన్ని కాదనలేక నాట్యం నేర్పించడానికి నాన్న ఒప్పుకున్నారు. ఆయనతో పనిచేసే లయన్స్‌ క్లబ్‌ మిత్రులు కొంతమంది ‘‘అమ్మాయి బాగా చేస్తోంది. ప్రదర్శన ఏర్పాటు చేద్దాం!’’ అన్నప్పుడు అన్యమనస్కంగానే అంగీకరించారు. రాజమండ్రిలో శ్రీరామనవమి పందిళ్లలో నా మొదటి నాట్య ప్రదర్శన జరిగింది. చాలా బాగా చేసిందని అందరూ మెచ్చుకోవడంతో నాన్న పొంగిపోయారు. అప్పటి నుంచి ఎక్కడ నాట్య ప్రదర్శన జరిగినా ముందు వరుసలో కూర్చుని చూసేవారు. ఇంటికొచ్చాక ‘‘నేను ఎలా చేశాను నాన్నా?’’ అని అడిగితే ఒక నవ్వుతోనే సమాధానమిచ్చేవారు. జీవితంలో చాలా నిబద్ధతగా జీవించారాయన. ఒక పద్ధతిగా అన్నీ జరగాలని అనుకునేవారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నన్ను డాక్టరేట్‌తో గౌరవించినప్పుడు నా కళ్లు చెమర్చాయి. నాన్న నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. ఈ విధంగా ఆయన కల కొంతవరకు నెరవేరిందన్న సంతృప్తి కలిగింది.


మళ్లీ బంగారు రోజులు

కూచిపూడి గురించి ఆలోచించడం, మాట్లాడటం, వేడుకలు చేసే రోజులు మళ్లీ వచ్చాయి. భారతదేశ సంప్రదాయ నాట్యాల్లో కూచిపూడి విశిష్టమైంది. దాన్ని నేర్చుకోవడం నాకు దొరికిన గొప్ప అవకాశం. కళలు వేటికైనా ఎగుడుదిగుడులు ఉంటూనే ఉంటాయి. వాటిని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం స్ఫూర్తిదాయకం. రెండేళ్లకోసారి నాట్య సమ్మేళనం నిర్వహిస్తూ, కళాకారులందరికీ ప్రత్యేక గుర్తింపు తేవడానికి చేస్తున్న ప్రయత్నం అద్భుతం. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.

(అంతర్జాతీయ నాట్యసమ్మేళనానికి ఎక్కడెక్కడి గురువులూ, కళాకారులూ కదిలివచ్చారు. దశాబ్దాల నుంచి కూచిపూడికే తమ జీవితాలను అంకితం చేసినవాళ్లలో కొంతమందిని ‘తెలుగువెలుగు’ పలకరించింది. ఆ సందర్భంగా శోభానాయుడు పలికిన మాటలు...)


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి