తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

రెండు ప్రభుత్వాలకూ భాషావిధానం లేదు!

  • 43 Views
  • 0Likes
  • Like
  • Article Share

    లావేటి వేణుగోపాలనాయుడు

  • హైదరాబాదు
  • 8008019258

‘నిరంతరం కవిత్వం కోసం జీవించడమే నా భవిష్యత్తు. మంచి సమాజాన్ని సృష్టించడానికి.. మంచి సాహిత్యం రచించడం, ప్రచారం చేయడమే జీవితంగా సాగిపోతాను’ అని చెప్పే కవి నందిని సిధారెడ్డి. పల్లె జీవితాన్ని ప్రభావవంతంగా కవిత్వీకరించిన ఆయన, తెలంగాణ ఉద్యమ శంఖారావాన్నీ అంతే బలంగా వినిపించారు. ‘నాగేటిచాల్లల్ల నా తెలంగాణ..’ అంటూ ఇక్కడి సాంస్కృతిక ఔన్నత్యాన్ని మనసారా గానంచేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘విశిష్ట సాహితీ పురస్కారం’ అందుకున్న ఆయనతో ‘తెలుగు వెలుగు ముఖాముఖి...
తె.వె: విశిష్ట సాహితీ పురస్కారం స్వీకరించడం ఎలా అనిపిస్తోంది?.
సిధారెడ్డి:
ఏ కవికైనా అవార్డులు, రివార్డులు ఆనందాన్నిస్తాయి. అందులోనూ తెలుగు విశ్వవిద్యాలయం మూడేళ్లకోసారి ఇచ్చే అత్యున్నత పురస్కారం.. నా నలభై యాభై ఏళ్ల సాహిత్య యాత్రకి ఇచ్చిందిగా భావిస్తున్నాను. ఏ పురస్కారం అయినా కవిని నిలబెడుతుంది. అతని సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంది. నాకు పురస్కారం వచ్చినపుడు అందరూ తమకు వచ్చినట్టుగా భావించడం, నా కవితలకు ప్రజలిచ్చిన పురస్కారం. 
‘విప్లవగీతాలకే పరిమితం కావడం వల్ల మిగతావి కోల్పోయిన అన్న బాధ ఏమీ లేదానే’ అని కేసీఆర్‌ అన్నట్లున్నారు కదా! 
‘ఒక పువ్వు.. ఒక నవ్వు’ అనే ప్రేమగీతాన్ని రాసిన సందర్భంలో ఇలా అన్నారాయన. ఏదైనా ఇష్టపడే రాశాను. నన్ను ఎవరూ ప్రోత్సహించలేదు. తన ప్రతిభ సంపూర్ణంగా, సమగ్రంగా రాణించాలన్న తపన సాహిత్యకారుడికి ఉంటుంది. అయితే, అన్ని కోణాల్లో రాస్తేనే ఇది సాధ్యం అవుతుంది. జీవితంలోని అన్ని కోణాలనూ రాయాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. కానీ కాలం రచయితలమీద మోపే బాధ్యత కూడా ఒకటుంటుంది. మొదట విప్లవ సాహిత్యం.. తర్వాత తెలంగాణ సాహిత్యం ఇలా నా ప్రయాణం సాగిపోయింది.
రచనలో ఎంత స్థానికత ఉంటే అంత సార్వజనీనత వస్తుందా?
ప్రాంతీయత అంటనిదే ఒక కళారూపానికి జీవం రాదు అని గురజాడ అప్పారావు అన్నారు. ఏ కళకైనా స్థానికత పొదిగినప్పుడే అది సజీవమై కళకళలాడుతుంది. భాషలో కావచ్చు.. వస్తువులో కావచ్చు.. కవి ఆలోచనలో కావచ్చు.. అన్ని కోణాలనుంచి స్థానిక దృష్టి ఉన్నప్పుడే జీవితాన్ని గాఢంగా చిత్రించగలం. 
‘నాగేటచాల్లల్ల...’ పాట రచనకు ప్రేరణ?
1996 నాటికి తెలంగాణ భావన అంతగా లేదు. కానీ, ఆధిపత్య భావజాలం తెలంగాణ భాషను, పలుకుబడులను, సంస్కృతిని, సాహిత్యాన్ని చిన్నచూపు చూస్తోంది. నేనూ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. అప్పుడే తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చిత్రించాలనిపించింది. అప్పటికి తెలంగాణకు ఏ వనరులు కొరవడ్డాయో చెప్పే పాటలు, ఈ నేల దుఃఖాన్ని గానం చేసే పాటలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతీ ఔన్నత్యాన్ని ఇతరులకు తెలిసేలా చేయాలనుకున్నాను. తెలంగాణకు ఏమి ఉన్నాయో చెప్పాలని, వాటిని గర్వకారణంగా నిలపాలని చేసిన ప్రయత్నమే ఈ పాట. ఇక్కడి పండగల్ని, పద్ధతుల్ని, జీవితాన్ని ఉన్నతీకరించాలనే ఈ పాట రాశాను. 
సాహిత్యంతో చిన్నప్పటి నుంచే పరిచయం ఉందా?
మాది అచ్చమైన రైతు కుటుంబం. మా బాపు, అవ్వ చదువుకోలేదు. సాహిత్యం గురించి తెలుసుకుని చర్చించేదీ లేదు. ఓ రోజు గ్రామ పంచాయతీ గ్రంథాలయ పుస్తకాలు చదువుతున్నప్పుడు ‘పుస్తకాలు చదువుడు కాదు... రాసుడు గొప్ప’ అన్నారు మా బాపు. రచయితలు, సాహిత్యం తెలియకపోయినా, ఆయన నోటి నుంచి వచ్చిన ఆ మాట నన్ను సాహిత్యంవైపు నడిపించింది. సాహిత్యం లోతులు చూసే దాకా తీసుకెళ్లింది. విపరీతమైన ఆలోచనకు తావిచ్చింది.  
కవిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది?
మా ఊళ్లో జరిగే ‘శారద కథ, ఒగ్గు కథ, చిందు భాగవతం’ ప్రదర్శనలు నాలో కళపట్ల ఓ ఆకర్షణను పెంచాయి. ‘ఆ దేశంలో తెలుగు’ ఎనిమిదో తరగతి పాఠంలో కరుణశ్రీ రాసిన ‘బీద పూజ’ పద్యాలు నన్ను కరుణరసం వైపు, కవిత్వం వైపు నడిపించాయి. మా తెలుగు ఉపాధ్యాయుడు అష్టకాల నరసింహరామశర్మ ‘శిథిల విపంచి’ ఖండకావ్యాన్ని నాకిచ్చారు. ఛందస్సు గురించి చెప్పారు. అలా తొమ్మిది పదో తరగతుల్లోనే పద్యాలు రాయడం ప్రారంభించాను. డిగ్రీ చదువుతున్నప్పుడు శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ చదివాక వచన కవిత్వంవైపు గాఢంగా ఆకర్షితుడినయ్యాను. అక్కడి నుంచి వదలకుండా.. తెలంగాణ జీవిత చిత్రాన్ని నలుగురికీ చాటాను. ఇప్పటికీ అదే పనిలో కొనసాగుతున్నాను. 
కవికి మీ నిర్వచనం? ఎలాంటి అంశాలను కవిత్వీకరించడం మీకిష్టం? 
‘కష్టజీవికి ఇరువైపులా నిలిచేవాడే కవి. కవిత్వం అంటే జీవితమే. జీవితాన్ని గానం చేసేవాడే కవి’ అన్నారు శ్రీశ్రీ.  నా భావనా ఇదే. జీవితాన్ని దర్శించి, అనుభవాలను అందరికీ చేరవేసే వాడే కవి. తన భావాల్ని పాఠకుల హృదయంలో ప్రతిష్ఠించగలిగేవాడే అసలైన కవి. జీవితంలో ఉండే అన్ని కోణాలనూ రాయడం నాకిష్టం. సంఘర్షణలను, విషాద సంఘటనలను, సామాజిక సందర్భాలను చిత్రించడం ఇష్టం. మానవుణ్ని సంస్కారవంతుడిగా తీర్చిదిద్దే ప్రతి అక్షరమూ నాకిష్టం. కవిగా ఎవరికైనా రాసినవన్నీ సంతృప్తిని ఇస్తాయి. నావరకైతే ‘నది పుట్టువడి’, ‘తిక్కడి చెట్లగాలి’.. ఇలా కొన్నింటి మీద కాస్త ప్రేమ ఎక్కువ. 
సమకాలీన తెలుగు కవిత్వం మీద మీ పరిశీలన?
వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో కవిత్వం బాగా కనిపిస్తోంది. ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ వచ్చిన తర్వాత విరివిగా పుస్తకాలు వస్తున్నాయి. అయితే ఉత్సాహం ఉన్నంత గాఢంగా కవిత్వం రావట్లేదు. శిల్పరీత్యా, వస్తు రీత్యా వర్తమాన సమాజాన్ని, ఆవేదనను అందుకునే దిశగా అవి లేవు. వర్ధమాన కవులు కవిత్వం పట్ల లోతైన అవగాహన, జీవితం పట్ల, విలువలపట్ల స్పష్టమైన దృక్పథం ఏర్పరుచుకోవాల్సి ఉంది. అస్తిత్వవాదులు వికసించిన తర్వాత కవిత్వం బహుముఖాలుగా విస్తరించిందనేది వాస్తవం. వెలుగు చూడని అనేక సమూహాల అనుభవాలు సాహిత్యంలోకి రావడమూ ఆహ్వానించదగ్గదే. అయితే కవిత్వం మరింత సుసంపన్నం కావాల్సి ఉంది. 
ఈ తరం డిప్లమసీ పెరిగిపోతోందని ఓ సందర్భంలో అన్నారు మీరు... అది వాళ్లకి చేటు చేస్తోందా? 
ఆ మాట వాస్తవమే. కొత్తతరం విమర్శలను స్వీకరించేంత విశాల మనస్తత్వంలో లేరు. చిన్న విషయాలకే విపరీతంగా ఆలోచించే తత్వం, ఒత్తిడిని తట్టుకునే స్థితి లేకపోవడం, నిశితత్వం లేకపోవడం వల్ల ఈ తరానికి ఏ విషయమైనా వివరించడానికి పెద్ద కవులు కూడా జంకుతున్నారు. దీంతో అనేక రకాలుగా డిప్లమసీ ఏర్పడుతోంది. కవులు స్పష్టంగా అన్ని విషయాలు చెప్పగలిగి.. అవసరమైతే విమర్శలను చేసి ఒప్పించగలిగే వాతావరణం పెంచాలి. ఈ డిప్లమసీ వల్లే కొత్తతరం కవులు గొప్ప సాహిత్యాన్ని అధ్యయనం చేసే అవకాశాలు కోల్పోతున్నారు. దానివల్ల సహజంగా మంచి సాహిత్యాన్ని సృష్టించే ప్రతిభ ఉండీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. కొత్త తరానికి అధ్యయనం అవసరం. విశాల మనస్తత్వం మరింత అవసరం. 
మధ్యలో ఆపేసిన కథారచనను కొనసాగించే ఆలోచన ఉందా?
విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు కథలు రాశాను. కథారచన నాకిష్టం. ఆ రోజుల్లో కథారచన ద్వారా వచ్చిన పారితోషికంతో చదువుకున్నాను కూడా.  తర్వాత కొనసాగించలేకపోయాను. ఆనాటి కథలను ఈమధ్యే ‘చిత్రకన్ను’ సంపుటిగా ముద్రించాను. వీలుచిక్కితే మా ఊరి జీవితాలను కథలుగా మలచాలని ఉంది. మా బాపు అనుభవాలను, వ్యక్తిత్వాన్ని కథలుగా రాయాలని ఉంది. 
తెలంగాణకంటూ ఓ ప్రామాణిక భాష తయారు చేసుకోవాలని చెప్పారు మీరు..? 
తెలంగాణ భాష.. ఆ మాటకొస్తే ఏ ప్రాంతపు భాష అయినా తీయనిదే. జీవితాన్ని పరిమళించే భాష అత్యంత సౌందర్యవంతమైంది. తెలంగాణలోని అన్ని జిల్లాల యాసలోనూ, పలుకుబడుల్లోనూ మాధుర్యం ఉంది. ఆ సొగసులను సమన్వయం చేసి ఒక ప్రామాణిక భాషను రూపొందించుకోవాలి. తెలంగాణ పలుకుబడులు, సామెతలు, నుడికారాలను ఆ భాషలోకి తీసుకురావాలి. అప్పుడే భాషకు తెలంగాణ పరిమళం వస్తుంది. 
తెలుగులో చదువుకునే వాళ్లు తగ్గిపోతున్నారు కదా!  
ఉద్యోగాలకోసం ఆంగ్లమాధ్యమం వెంబడి విద్యాసంస్థలు, విద్యార్థులు పరుగులు తీస్తున్నారు. కుటుంబ పెద్దలు, పాలకులు కూడా అటువైపే ప్రోత్సహిస్తున్నారు. నిజానికి ఒక జాతి వికాసానికి, అభివృద్ధికి మాతృభాష అత్యంత ఆవశ్యకం. అసలైన సృజనాత్మక ప్రతిభ సొంతభాష ద్వారానే సాధ్యం అవుతుంది. అనుకరించిన భాషద్వారా ఆత్మను ఆవిష్కరించలేం. సాంస్కృతిక వికాసంలో మాతృభాష పాత్ర కీలకం. దీన్ని గుర్తించి ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు తెలుగు భాషను గుండెలకు హత్తుకోవాలి. ఉద్యోగాలు కల్పించడంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తే విద్యార్థులూ ఆకర్షితులవుతారు. విశ్రాంత అధ్యాపకుడిగా భాషా సేవలో విస్తృతంగా భాగస్వామిని అవడానికి నేనెప్పుడూ ముందుంటాను. 


అవిశ్రాంత క‌లం!
‘వట్టిపోతున్న తరానికి మనిషిని కానుకగా ఇవ్వాలె’ అంటూ కవిలోకానికి ఓ లక్ష్యాన్ని నిర్దేశించిన నందిని సిధారెడ్డి స్వస్థలం మెదక్‌ జిల్లా కొండపాక మండలం బందారం. మే 02, 1954న జన్మించారు. తల్లితండ్రులు బాలసిధారెడ్డి, రత్నమాల. మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పదవీ విరమణ చేశారు. ‘దివిటీ, సంభాషణ, ప్రాణహిత, భూమిస్వప్నం, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం’ తదితర కవితా సంపుటాలను వెలువరించారు. ‘కులవృత్తులు- తెలంగాణ సాహిత్యం’ వ్యాసాలూ సృజించారు. సిధారెడ్డి రచించిన ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ’ పాటను ఆర్‌.నారాయణమూర్తి ‘వీరతెలంగాణ’ చిత్రంలో వినియోగించుకున్నారు. ఆ పాటకు రాష్ట్రప్రభుత్వ ‘నంది పురస్కారం’ లభించింది.  (నందిని సిధారెడ్డి: 94403 81148)


సొంత భాషకు దూరమైన సమాజం ఆత్మగౌరవంతో బతకగలదా? 
‘అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అన్నారు కాళోజీ. మనవాళ్లే మన భాషలో మాట్లాడకపోవడాన్ని చూసి ఆయన చెందిన వేదన ఇది. ఆ మాటకొస్తే తెలంగాణ ఉద్యమం సగం భాష నుంచి వచ్చిందే. ఏ మనిషి అయినా, జాతి అయినా మాతృభాషను కోల్పోతే ఆత్మగౌరవంతో జీవించలేదు. పరభాషతో న్యూనత పెరుగుతుంది. ‘భాషకు ఆత్మలను వశం చేసుకునే శక్తి ఉంది’ అంటారు ఆఫ్రికన్‌ రచయిత గుగి. భాషను తాకట్టుపెట్టడం అంటే మన ఆత్మలను తాకట్టుపెట్టడమే. ఏ సమాజమైనా సగౌరవంగా మనుగడ సాగించాలన్నా, వికాసం పొందాలన్నా సొంత భాష... మనవరకూ తెలుగు తప్పనిసరి.
రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ బడులనూ ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నారు కదా? 
ఇది తప్పు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ భాషపట్ల సరైన విధానం లేదు. ఉద్యోగాల ఎర కేవలం తాత్కాలికమే.. దృష్టిలోపమే. ప్రపంచీకరణ సాకుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాలను ప్రవేశపెట్టడం కంటే ఒక భాషగా ఆంగ్లాన్ని నేర్పించడం మంచిది. మూడు భాషల విధానం వల్ల విద్యార్థికి ఏ భాషలోనూ రాసే, చెప్పే నైపుణ్యం రావట్లేదు. దీన్ని ప్రభుత్వం గుర్తించి సరైన భాషా విధానాన్ని, సమగ్ర దృక్పథాన్ని సంతరించుకోవాలనేది నా సూచన. 
తెలంగాణ సాహితీ సృజనలోకి తీసుకురావాల్సిన జీవితం ఇంకా చాలా ఉందన్నది మీ మాట కదా...
తెలంగాణ జీవితంలోని అనేక పార్శ్వాలు తెలుగు సాహిత్యంలోకి రావాల్సి ఉంది. సాహిత్యం ఇప్పటివరకూ స్థానిక జీవితంలోని పోరాట, విప్లవశీల కోణాన్ని మాత్రమే చిత్రించింది. దీంతోపాటు అన్ని ప్రాంతాల మాదిరిగానే తెలంగాణ జీవితంలోనూ సాధారణ జీవన సన్నివేశాలు కూడా ఉంటాయి. హాస్యం, కరుణ, ప్రణయం తదితర అతి ముఖ్యమైన అంశాలెన్నో సాహిత్యంలోకి ఎక్కలేదు. అవన్నీ రావాలనేది నా భావన. 
మెదక్‌ స్టడీ సర్కిల్, మంజీరా రచయితల సంఘాల స్థాపన వెనక మీ ఉద్దేశం?
1992లో మద్యపాన వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైనపుడు ‘ఈనాడు’ ప్రోత్సహించింది. తర్వాత మంజీర రచయితల సంఘం మద్దతు తెలిపింది. 40 గ్రామాల్లో మద్యానికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చాం. మడిపడగ అనే గ్రామంలో ఊరేగింపు జరుపుతున్నపుడు లక్ష్మి అనే అపరిచిత మహిళ అప్పటికప్పుడు ఆశువుగా కట్టి పాడిన పాటను వెంటనే కాగితం మీద రాసుకున్న అనుభవాన్ని మరిచిపోను. 1984లో నాకు ఉద్యోగం వచ్చి మెదక్‌ వెళ్తున్నప్పుడు నా గురువు డా।। సి.నారాయణరెడ్డిని కలిశాను. ‘మెదక్‌లో సాహిత్య వాతావరణం లేదు కదా? ఎలా మనుగడ సాధిస్తావు’ అని ఆయన అడిగినప్పుడు, సాహిత్య వాతావరణం ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పం కలిగింది. అక్కడ ఉన్న రచయితలు కూడా ఎవరికి వారై, స్వీయ ధోరణులతో చీకట్లోనే ఉండిపోయారు. వాళ్లను సాంప్రదాయక వాతావరణంలోనించి ఆధునిక, సామాజిక సందర్భంలోకి తీసుకురావాలని అనుకున్నాను. కొత్త చైతన్యాన్ని, ఆలోచనలను పెంచడానికి జిల్లా రచయితలను ఒకచోటకు చేర్చి ‘మంజీరా రచయితల సంఘం’ ప్రారంభించాం. మెదక్‌ స్టడీ సర్కిల్‌ పట్టణానికి సంబంధించిన ప్రగతిశీల భావుకులకు మాత్రమే పరిమితం అయ్యింది. దాన్ని విస్తరించే ప్రయత్నమే ఈ సంఘం. 30 ఏళ్ల సంస్థ ‘మరసం’ ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలు, మరుపురాని అనుభవాలున్నాయి. ఎందరో రచయితలు, గాయకులు, కళాకారులు తయారు కావడానికి భూమికగా నిలిచిందీ సంస్థ. దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, దరువు ఎల్లయ్య వంటి కళాకారులు... తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య, మురళీకృష్ణ, పప్పుల రాజరెడ్డి వంటి రచయితలు మరసం నుంచి వెలుగులోకి వచ్చినవారే. 
తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులేంటి?  
96లోనే మంజీర రచయితల సంఘం తెలంగాణ రాష్ట్రం కోసం తీర్మానం చేసింది. అన్ని జిల్లాల రచయితలను సమీకరించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం ఆరంభించాం. ‘తెలంగాణ సాంస్కృతిక వేదిక’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. అప్పటికి కొనసాగుతున్న నిర్బంధంతో దాన్ని విస్తరించలేకపోయాం. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైన తర్వాత తిరిగి ప్రజాస్వామిక ఆలోచనలతో ఒక వేదిక ఏర్పడింది. ఆ నేపథ్యంలో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషి కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించి, 2001లో తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు చేశాం. ఇక్కడి రచయితలందరిలో నెలకొన్న భావాలు, ఉద్యమ ఆలోచనలకు అనుగుణంగా విశాల ప్రాతిపదిక మీద సంస్థను నిర్వహించాం. అనూహ్యంగా అన్ని జిల్లాల నుంచీ విపరీతమైన స్పందన వచ్చింది. కొద్ది రోజుల్లోనే సాంస్కృతిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. ‘సోయి’ అనే పత్రికను నిర్వహించడం.. అన్ని జిల్లాల్లో సభలు, సదస్సులు, కళాప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ఉద్యమాన్ని ఉత్తేజపరిచాం. 
కవిత్వ రచన ఓ సామాజిక బాధ్యత అన్నది మీ అభిప్రాయం కదా. ప్రతి రచనలోనూ ఆ ‘సామాజిక కోణం’ కనిపించాలా?
సమాజం దుఃఖంలో ఉన్నపుడు, ఘర్షణ పడుతున్నప్పుడు సాహిత్యం బాధ్యతాయుత పాత్ర నిర్వహించాలి. వ్యక్తి జీవితంలోని అనుభవాలు, అనుభూతులు సాహిత్యంలో ఉండాల్సిందే. అయితే వ్యక్తి సమాజంలో భాగం కనుక తన బాధతో పాటు సమాజం బాధను కూడా ప్రకటించాలి. ఒక్క తన అనుభూతులకే పరిమితం అయితే సమాజం పట్టించుకోదు. రచయిత బాధ్యత పరిపూర్ణం కూడా కాదు. వ్యక్తిగత జీవితంలోని అన్ని అనుభవాలనూ ఆవిష్కరించడంతో పాటు సామాజిక సందర్భంలో రచయిత కీలకపాత్ర పోషించాలి. ప్రపంచ బాధను చిత్రించినందువల్లే శ్రీశ్రీ మహాకవి అయ్యారు. ఆ వారసత్వాన్నే నేనూ ఇష్టపడతాను. 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం