తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

రెండే మంత్రాలు.. గురువుల శిక్షణ! శిష్యుల క్రమశిక్షణ!!

  • 1772 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఒకటా రెండా! నలభై ఏళ్లకు పైబడిన రంగస్థలానుభవం... పద్యనాటకంతోనే మమేకమైపోయిన జీవితం... తెలుగు గడ్డ నుంచి సింగపూర్, లండన్, అమెరికాల వరకూ విస్తరించిన అభిమాన జనసందోహం... గుమ్మడి గోపాలకృష్ణ పేరు చెప్పగానే గుర్తొచ్చే విషయాలివి. దేశవిదేశాల్లో పదిహేను వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన అవిశ్రాంత కళాకారుడాయన. కాలం ఒరిపిడికి కుదేలవుతున్న పద్యనాటకాలను కాపుగాయడానికి అహరహం శ్రమిస్తున్న గుమ్మడి గోపాలకృష్ణకు 2016 సంవత్సరానికి గానూ ‘ఎన్టీ రామారావు రంగస్థల పురస్కారం’ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి... 

తె.వె.: ఈ ప్రయాణం ఎలా అనిపిస్తోంది?
గోపాలకృష్ణ:
పద్యనాటకంతో చేస్తున్న ఈ ప్రయాణం ఎప్పటికప్పుడు నూతనోత్తేజాన్ని కలిగిస్తోంది. నేను కృష్ణాజిల్లా బందరు ప్రాంతం వాణ్ని. 1982 దాకా అక్కడే ఉన్నా. అదొక జీవితం, నిరాశ నిస్పృహలే అప్పటిదాకా నా వెంట ఉన్నాయి. కానీ నా గొంతు మీద నాకు నమ్మకం ఉండేది. నేను పాడే పద్యాలు, తత్త్వాలను అందరూ మెచ్చుకుం టుండేవారు. కానీ ప్రోత్సహించి నాటకరంగంలో నిలబెట్టిన వారు లేరు. 1982లో హైదరాబాదు వచ్చాక జీవితం మారిపోయింది. ఏఆర్‌ కృష్ణ, జీఎస్‌ఎన్‌ శాస్త్రి, సిద్ధప్పనాయుడు, వేమూరి రామయ్య, ధూళిపాళ సీతారామశాస్త్రి వంటి గురువుల చేయూతతో పైకి ఎదగగలిగాను. 
అసలు నాటకాలతో అనుబంధం ఎలా మొదలైంది?
బళ్లొ చదువుకునే రోజుల్లో బ్రహ్మంగారి నాటకంలో ఓ ఆడపాత్ర ధారణతో ప్రారంభమైంది. ఆ నాటకంలోని తత్త్వాలు నన్ను బాగా ఆకర్షించాయి. వాటిని పాడుకుంటూ ఉండేవాణ్ని. ఆ తర్వాత పదో తరగతి పూర్తి చేశాను. ఆ రోజుల్లో ఆచంట వెంకటరత్నం నాయుడు లాంటి వారి ప్రదర్శనలు చూసి స్ఫూర్తిపొందాను. వాళ్లలా పాడాలని, నటించాలని ఉండేది. మాది చిన్న వ్యవసాయ కుటుంబం కావటంతో ప్రత్యేకించి నటనలో శిక్షణ పొందేందుకు అవకాశం దొరకలేదు. అంతా శ్రుత పాండిత్యంలానే ఒంటబట్టింది. దాంతోనే ఈ పిల్లాడు పద్యం బాగా పాడుతున్నాడని పెద్దలు ఆశీర్వదించే స్థితికి ఎదిగాను. హైదరాబాదు వచ్చాక మాత్రం గురువుల దగ్గర మంచి శిక్షణ పొందాను.
తెలుగునాట ఇప్పుడు రంగస్థల ప్రదర్శనలకు ఆదరణ అంతగా లేదు. టికెట్టు పెడితే ప్రేక్షకులు రావట్లేదు కదా!
ఆదరణ లభించట్లేదంటే దానికి అందరి బాధ్యతా ఉంటుంది. అందరూ తలా ఓ చేయి వేస్తేనే విజయం దక్కుతుంది. టికెట్టు పెడితే ప్రేక్షకులు రావట్లేదని అనుకునేముందు ఓ విషయం గమనించాలి. ఒక సినిమా ఉందంటే దాన్ని ఒకే థియేటర్లో వరసగా చాలా రోజులపాటు ప్రదర్శిస్తారు. మొదటిరోజు చూడలేనివారు రెండోరోజు, అయిదో రోజు ఎప్పుడో ఒకప్పుడు తమకు వీలు కుదిరినప్పుడు చూస్తారు. అలాంటి పరిస్థితి తెలుగు నాటక రంగంలో ఉందా? లేదు. ఆ లేదనే దాన్ని లేకుండా చేయడానికే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓ నాటకాన్ని ఒకే వూర్లో ఒకేచోట కనీసం యాభై రోజులపాటు ప్రదర్శింపజేస్తే, టికెట్టు కొని నాటకాన్ని చూసే ప్రేక్షకులు బాగానే వస్తారు. అయితే దానికి ప్రత్యేకమైన థియేటర్‌ ఉండాలి. అలాంటి థియేటర్ల నిర్మాణం కోసమే ప్రయత్నిస్తున్నాను. దీనికి ప్రభుత్వాలు, ప్రజలూ సహకరించాలి.
నాటకమే కాదు అసలు పద్యాన్నే మనవాళ్లు మర్చిపోతున్నారు. పద్య వారసత్వాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలి?
ఇది దురదృష్టకరం. పద్యప్రక్రియ ఎంతో హృద్యమైంది. ఎన్నెన్నో అంశాలను ఒక చిన్న పద్యంలో గుదిగుచ్చి అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన చేయడం మన కవులకే చెల్లింది. పోతనగారి పద్యాలు కావచ్చు. వేమన, సుమతీ శతకకర్త బద్దెన, శ్రీనాథ మహాకవి సీసపద్యాలు, పెద్దనామాత్యుడి జిగిబిగి పద్య రచనాశైలి ఇవన్నీ దేనికవే ఆణిముత్యాల్లాంటివి. ఇవన్నీ మన సంస్కృతీ సంప్రదాయాలను, శాస్త్రాల ఔన్నత్యాన్ని చాటిచెబుతాయి. నిఘంటువులు, గణితం లాంటివి కూడా పద్యంలో ఇమిడి ప్రకాశించిన సంస్కృతి మనది. పద్యంలో ఒదిగిన అంశం జీవితాంతం గుర్తుంటుంది. యతి ప్రాసలతో లయబద్ధంగా ఉండే పద్యాలను సాధన చేయటం వల్ల ముఖానికి, వూపిరితిత్తులకు కూడా మంచి వ్యాయామం కలుగుతుంది. అలాగే ప్రజాకవి వేమన లాంటివారు చిన్నచిన్న ఆటవెలది, తేటగీతుల్లో కొండంత వ్యక్తిత్వ వికాసాన్ని సమకూర్చి మనకందించారు. వాటిని చదివి అర్థం చేసుకుంటే జీవితం సార్థకమ వుతుంది. అంత గొప్పది తెలుగు పద్యం.
కొత్తనటుల్లో ఉచ్చారణ ఎలా ఉంది?
అందరూ అని అననుగానీ తెలుగుభాష, ఉచ్చారణ మీద అవగాహన లేనివాళ్లు, పరభాష మోజులో ఉన్నవాళ్లు మాట్లాడుతుంటే నాలాంటి వాళ్లకి కష్టంగానే ఉంటుంది. మనకు చక్కటి వర్ణమాల ఉంది. ప్రతి పద్యాన్నీ ప్రత్యేకంగా పలకడానికీ, అర్థవంతమైన భావాన్ని తెలపడానికి వర్ణమాలలోని ప్రతి అక్షరమూ, పొల్లూ అన్నీ సాధనాలే. వాటిమీద సరైన దృష్టి పెట్టకపోవడం, ఏ అక్షరాన్ని, ఏ పదాన్ని ఎలా పలకాలో తెలియకపోవడం, పద్యంలో పద విభజన సరిగా చేయకపోవడం లాంటి వాటితో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అది పౌరాణికం కావచ్చు, సాంఘికం కావచ్చు, చారిత్రకమూ కావచ్చు, ఏదైనా సరే పాత్రోచిత సంభాషణ ఉన్నప్పుడే నాటకం రక్తికడుతుంది. ఈ విషయాన్ని నటుడిగా స్థిరపడాలనుకున్న ప్రతివారూ తెలుసుకుని తీరాల్సిందే. పాతకాలం నటులు రాయలేకపోయారేమో కానీ ఉచ్చరించే విషయంలో అణువంతైనా దోషం ఉండేది కాదు. దానికి కారణం ఆనాటి గురువుల శిక్షణ. శిష్యుల క్రమశిక్షణ. ఇప్పుడు కూడా ఆ పద్ధతిలో శిక్షణ పొందుతున్న వారు ఉత్తమ స్థాయిలోనే ఉన్నారు. లేనివారే లేనట్టుగా మిగిలిపోతున్నారు.
రచయితలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రచయితలుగా ఎదగాలనుకున్నవారు ఎవరైనా సరే ముందుగా భాషా సాహిత్యాల గురించీ, నాటకానికి ఎంచుకున్న ఇతివృత్తం గురించీ, రచనాశైలీ శిల్పాల గురించీ తెలుసుకొని తీరాలి. విస్తృత పఠనాసక్తి ఉండాలి. అతి సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా ముచ్చటగా, తేలికగా ఉండే పదాలతో రసవత్తర భావ ప్రకటనలతో రచన సాగాలి. ఏదో రాయమన్నారు రాసేశాం అంటే సరిపోదు. ఆనాటి తిరుపతి వెంకటకవుల నాటకాలను చూసి ఈనాటికీ పండిత పామరులంతా ఎలా రసాస్వాదన చేయగలుగుతున్నారో... అలా రచనలుండాలి. పౌరాణిక పద్యనాటకాలకు సంబంధించి మన ఇతిహాసాల్లో చాలా కథలు ఉన్నాయి. కానీ, అలాంటి వాటిని నాటకీకరించటంలో మన వాళ్లెందుకో కొంత వెనకడుగులో ఉన్నారు. మనకు అష్టాదశ పురాణాలున్నాయి. అవి కాక రామాయణం, భారతం లాంటి ఎన్నెన్నో ఆదర్శ గ్రంథాలు, ఉపనిషత్తులు, సంహితలోని నైతిక విలువలను ప్రబోధించే అంశాలూ కోకొల్లలు. వాటన్నిటినీ నాటకాలుగా మలుచుకోగలిగితే తెలుగు పౌరాణిక పద్యనాటకం నిత్యనూతనంగానే ఉంటుంది.
విశ్వవిద్యాలయాల్లో థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సుల మీద మీ అభిప్రాయం?
ఆ కోర్సులు ఉండటం ఎంతో అవసరం. అసలవి ఉండాలని పట్టుబట్టి ప్రవేశపెట్టింది మా గురువుగారు ఎ.ఆర్‌.కృష్ణ. ఇక వాటివల్ల మేలేంటి అనంటే సాంఘిక నాటకం వరకు కొంత వరకు ఫర్వాలేదు. కానీ, పౌరాణిక నాటక రంగానికి పూర్తి అన్యాయమే జరుగుతోంది. అక్కడున్న ఆచార్యులు పాశ్చాత్య ధోరణిలో బెర్నార్డ్‌ షా లాంటి వాళ్ల నాటక శైలి మీద ఆసక్తి చూపుతున్నారు. స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, బళ్లారి రాఘవ లాంటి మహామహులను కనీసం తలచుకోకుండానే అక్కడ శిక్షణ పూర్తవుతోంది. మన నాటకాన్ని మనమే పాడుచేసుకుంటే ఎలా? వృత్తిపరంగా మంచి నటులుగా గుర్తింపు పొందిన పౌరాణిక నటులను ఆచార్యులుగా పెట్టి తీరాలి. అక్కడున్న ఆచార్యులు ప్రజల్లోకొచ్చి ప్రదర్శనలిచ్చి మెప్పు పొందగలగాలి.
మన రంగస్థల ప్రదర్శనలు కాలానుగుణంగా మారుతున్నాయా?
సృష్టిలో ప్రతిదీ పరిణామ శీలమే. కాలం కూడా మారుతూనే ఉంటుంది. తొలి రోజుల్లో ఆరుబయట పందిళ్లు వేసి కాగడాల వెలుతురులో నాటక ప్రదర్శనలు జరుగుతుండేవి. ఆ తర్వాత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతెంతో అభివృద్ధి చోటు చేసుకుంది. అలాంటి అభివృద్ధే నాటకరంగంలో కూడా జరిగి తీరాలి. చలనచిత్రాల్లాంటి వాటి పోటీని తట్టుకునే పరిజ్ఞానం నాటకానికి ఎప్పటికప్పుడు సమకూరుతూనే ఉంది. సురభి వారి సాంకేతిక పరిజ్ఞానంలాంటివి దీనికి ఉదాహరణ. ప్రపంచ దేశాల్లో నాటకానికి అనువుగా ఉండే సాంకేతిక పరిజ్ఞానం ఇంకా గొప్పగా ఉంది. ఆ సాంకేతిక విశేషాలను జత చేసుకుంటూ ప్రదర్శిస్తున్న నాటకాలు సంవత్సరాల తరబడి ప్రేక్షకాదరణ పొందుతూనే ఉన్నాయి. అలాంటి అధునాతన పరిజ్ఞానాన్ని మన తెలుగు నాటక రంగం కూడా అంది పుచ్చుకోవాలి. కృష్ణ తులాభారం నాటకంలో రుక్మిణి వేసే ఒక్క తులసి ఆకుకు త్రాసు సమంగా తూగటమనే అంశాన్ని నేను చూపించగలిగాను. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ప్రదర్శనలోనూ చూపించగలగాలి. రంగాలంకరణతో సహా అన్నీ గొప్పగా ఉండాలి. కానీ, వీటికయ్యే ఖర్చు, శ్రమ అందరూ భరించలేరు. ప్రభుత్వం, ప్రజలు సహకరిస్తే తప్ప అలాంటి అద్భుత ప్రదర్శనలు చేయలేం.
నాటకాల పరిధి పెరగడానికి ప్రభుత్వం తరఫున చేయాల్సిందేంటి?
ఏ దేశంలో మాటో కాదు... మన పొరుగు రాష్ట్రాల్లో నాటకం పరిస్థితి చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం ఇట్టే స్ఫురిస్తుంది. ఎందుకోగానీ ఆయా రాష్ట్రాల్లో జరిగినంత నాటకరంగ అభివృద్ధి మన దగ్గర జరిగినట్టు కనిపించదు. నాటకం అనే ప్రక్రియ ప్రజలందరికీ ఒకేసారి అందింది. అదొక గొప్ప చైతన్యవంతమైన సాధనమని పూర్వకాలంలోని రాజుల కథలు చూసినా, భారత స్వాతంత్య్ర సంగ్రామం చరిత్ర చూసినా తెలిసిపోతుంది. ఇది వాస్తవం. అయితే ఈ వాస్తవాన్ని పొరుగు రాష్ట్రాల వారు మనసులో ఉంచుకుని, నాటక ప్రక్రియను ఎప్పటికప్పుడు నిత్య నూతనం చేసుకుంటున్నారు. మన దగ్గర అదే లోపం. దీన్ని అందరం కలిసి చక్కదిద్దాలి. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇస్తున్నంత చేయూతను మన ప్రభుత్వాలూ ఇస్తేనే నాటకం బతికి బట్టకడుతుంది.
కళాకారుల ఆదాయానికి సంబంధించి నిరాశ ఉందా? పూర్తిస్థాయిలో నటనను వృత్తిగా తీసుకొని ఎందుకు రాలేకపోతున్నారు?
గుర్తింపు పొందిన ఉత్తమస్థాయి కళాకారులకు మాత్రం నిరాశ లేదు. కళతో జీవితం హాయిగానే గడిచిపోతుంది. దానికి నేనే ఓ ఉదాహరణ. అలాగే తెనాలిలో ఎ.వి.సుబ్బారావు గారి కుమారుడు, సుప్రసిద్ధ నటులు లక్ష్మణరావు ఇలా ఎంతమందైనా కనిపిస్తారు. కానీ ప్రశ్నలోని రెండోభాగాన్ని విశ్లేషిస్తే కొంత తేడా కనిపిస్తుంది. నాటకం మీద ఆసక్తి ఉన్నా, నటుడిగా ఎదిగేందుకు కావాల్సిన అన్ని అర్హతలు, శక్తులు ఉన్నా ఈనాడు నాటక సమాజంలోకి వచ్చి పూర్తిస్థాయిలో నటనను వృత్తిగా తీసుకోలేక పోతున్నారు చాలామంది. కారణం ఆర్థికపరమైన అంశాలే. అది జీతమనుకోండి, గౌరవ వేతనమనుకోండి, ఉపకార వేతనమనుకోండి ఏదైనా సరే, శ్రమకు తగ్గ ఫలితం అందితే ఈ కళలో స్థిరపడటానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు.
పద్యనాటకాలను ఆధునిక మాధ్యమాల్లో భద్రపరుస్తున్నట్లున్నారు కదా?
అవును వాటిని సీడీలుగా, డీవీడీలుగా చేసి విడుదల చేశాను. వాటిని కొనుక్కొని నేనే వాళ్లింట్లో ఎదురుగా ఉండి పాడుతున్నట్లు అనుభూతి చెందే ప్రేక్షకులు కోకొల్లలు. వాటిని చూసి నటనను నేర్చుకుంటున్నవాళ్లూ ఉన్నారు. ఇక పద్యనాటకాలు టీవీ సీరియళ్లుగా వచ్చినప్పుడు ఇంకా గొప్ప మంచి స్పందన లభించింది. ఈ స్పందన, స్ఫూర్తితోనే శ్రీనాథ, వేమన లాంటివి చేశాను. ఇలాంటి వాటి అవసరం ఇంకెంతో ఉంది.
అమెరికా పిల్లలకు శిక్షణ ఇచ్చి శ్రీకృష్ణ రాయబారం నాటకం వేయించారు కదా. అక్కడి చిన్నారులు ఎలా ఉన్నారు?
అమెరికాలోని పలు ప్రాంతాలకు దాదాపు పదిసార్లుపైనే వెళ్లుంటాను. నేను ప్రదర్శనలు ఇవ్వటంతోపాటు అక్కడి చిన్నారులకు శిక్షణ ఇచ్చాను. విశేషం ఏంటంటే అక్కడ ప్రభుత్వపరంగా మంచి ఉత్తర్వులున్నాయి. ఏ విద్యార్థి అయినా సరే తప్పనిసరిగా ఏదో ఒక కళను నేర్చుకుని తీరాలి. అందుకే అక్కడ అందరి ఇళ్లలోనూ ఏదో ఒక సంగీత వాయిద్యమో, కళకు సంబంధించిన వస్తువులో కనిపిస్తుంటాయి. ఇక చిన్నారులు అక్కడా ఇక్కడా ఒక్కటే. చెప్పింది చెప్పినట్టు గ్రహించేశక్తి వాళ్లలో ఉంటుంది. అమెరికాలో నా దగ్గరకొచ్చి నేర్చుకున్న పిల్లలంతా మెరికల్లాంటి వారు. తెలుగుభాష మీద వాళ్లకు ఆసక్తి ఉంది. మన సంస్కృతి, సంప్రదాయాల మీద విశేష ఆదరణ చూపిస్తుంటారు. వాళ్లు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం అక్కడ చాలా ప్రజాదరణ పొందింది.
మరి తెలుగునాట పరిస్థితులు ఎలా ఉన్నాయి?
పొరుగు రాష్ట్రాల ప్రజలకు వారి మాతృభాషల మీద ఉన్న మమకారం మన భాష మీద మనకూ ఉండాలి. నా మటుకు నేను ఏ సభకు వెళ్లినా ‘తెలుగుదేలయన్న’ పద్యాన్ని చెబుతూ ఉంటాను. ఆ భావాన్ని మనసుకు పట్టించుకుని ప్రతి తెలుగువాడూ ముందుకు నడవాలి. అమ్మభాషకు దూరమైతే సొంత సంస్కృతి దూరమవుతుంది. సంస్కృతే లేకపోతే సమాజం సంస్కార హీనమవుతుంది. సంస్కారం లేని వాళ్లను ఎవరూ గౌరవించరు కదా!

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి