తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

కీరవాణి సరిగమలు...!

  • 421 Views
  • 6Likes
  • Like
  • Article Share

సమ్మర్‌లో మా elder son software పూర్తి చేశాడండీ.. jobs apply చేశాడు. infact ఢిల్లీలో ఓ reputed company మంచి offer కూడా ఇచ్చింది. ఈ year marriage కూడా అయిపోతే once for all settle అయిపోతాడు. ఇకపోతే మా second son...
      ఇంగ్లీషు మేఘాలు ముసురుతుంటే మధ్యమధ్యలో బిక్కుబిక్కుమంటూ తొంగిచూస్తూ.. అంతలోనే హిందీ రాహువు, మరేదో కేతువు మింగెయ్యడానికి తరుముకొస్తూ ఉంటే అల్లాడిపోతూ.. కొట్టుమిట్టాడుతున్న తెలుగు చందమామకి ఇక శుక్లపక్షం లేదేమో - రాదేమో? 
ఇకపై రానున్న ప్రతీనెలకీ 30 అమావాస్యలేమో! 
      రి‘త’మ్‌ ఉన్న సాంగ్సు నాకిష్టం.
      నేను ‘క’డ్గం సినిమా చూశాను.
      మనది ‘బా’రతదేశం. ‘గం’టసాల గారి గొంతు బాగుంటుంది. 
      ‘చ’త్రపతి శివాజీ ఇక్కడే పుట్టాడు. ఎందరో మహానుబావులు - పరుషాలు పలకడం తెలుగువాడికి చాతకావట్లేదు ఈ మధ్య పౌరుషం చచ్చింది మరి!
      గడగడా ఇంగ్లీషు తెలుగు మాట్లాడితే విదేశాల్లో ఉద్యోగ అవకాశం వస్తుంది సరే! ఒప్పుకున్నాం... - తెలుగు తప్పనిసరిగా విద్యావిధానంలో ప్రవేశపెడితే?
      1. తెలుగు నేర్చుకుంటారు. 
      2. మాతృభాషపై మమకారం పెరుగుతుంది. 
      3. మాతృభాషపై గౌరవం పెరుగుతుంది. 
      4. ఇది నాది, వీళ్లు నా వాళ్లు, ఇది నా ప్రాంతం అనే అభిమానాలు మెండు అవుతాయి. 
      5. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. 
      6. ఓ పక్క ఇతర భాషలు కూడా వంటబడుతూ ఉంటాయి. 
      7. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసినప్పుడు తెలుగు రాని చవట సన్నాసుల్లోలేని ఆత్మవిశ్వాసం వీరిలో ఉండడం వల్ల వారిపై పైచేయి సాధిస్తారు.
- ఈ ప్రతిపాదన ఆకర్షణీయంగా లేదా? 
      మన శరీరంలో ఉష్ణోగ్రతని కొలవగలిగినట్లుగా మనసులో ఎగిసే క్రోధావేశాల్ని కొలవగలిగే సాధనం ఉంటే నాకనిపిస్తుంది - తెలుగువాడికి ఇంగ్లీషులో తిట్టించుకున్నప్పుడు వచ్చిన కోపంకంటే అచ్చతెలుగులో తిట్టించుకున్నప్పుడు వచ్చేకోపం రెండింతలైనా ఎక్కువ ఉంటుంది అని..
      మరి మాతృభాషలో అంత శక్తి ఉన్నందుకు మానవ జీవన విధానంలో, పరిపాలనా వ్యవస్థలో నిత్య సమాజ సంబంధాలలో... మాతృభాషకి పెద్దపీట ఎందుకు వేయకూడదు! 
      పలకరింపుల్లో సైతం ‘హాయ్‌’ అంటూ తెలుగు వచ్చికూడా తెలుగులో మాట్లాడటానికి సిగ్గుపడేవాడు, తెలుగు వాడినని చెప్పుకోవడాన్ని చులకనగా భావించేవాడు.. నేను ఫలానా వారి కడుపున పుట్టాను... అని చెప్పుకోలేని బతుకు బతుకుతున్నట్టు. (కాదు.. బతికీ చచ్చినట్టు)
      దరిద్రమంతా ఎక్కడొచ్చిపదడిందంటే ఏడాదిలో ఓ రోజుకి ‘మదర్స్‌ డే’ అని పేరుపెట్టుకుని తల్లిని గౌరవించుకోవడం వాళ్ల పద్ధతి ‘తల్లిని మించిన దైవములేదు’ అని ప్రతిరోజూ భావించి తరించడం మన పద్ధతి - మనమూ ‘మదర్స్‌ డే’లు జరుపుకోవచ్చు మనమూ పరభాషల్లో నిష్ణాతులమైపోవచ్చు కానీ మన భాషనీ సంస్కృతినీ మరిచిపోయేంత తీవ్రంగా అవసరంలేదేమో! 
      తమిళ సోదరులూ మరాఠీ సోదరులూ ప్రపంచంలో మనుగడ సాగిస్తూ తలెత్తుకునే తీరుగుతున్నారు మనమెందుకు చెయ్యలేము? దేశ భాషలందు తెలుగు Less అనా?
      నిల్చున్నపాటుగా కార్గిల్‌ సరిహద్దులకెదురెళ్లిపోయి ప్రాణాలర్పించేసి దేశ సేవ చెయ్యక్కర్లేదు! ఐదేళ్లకోసారి ఓటు హక్కుని వినియోగించుకుంటే చాలు! 
      సినిమా వాళ్ల వరకూ వస్తే.... ముందు తెలుగులో సినిమా పేర్లు పెట్టుకుని ‘కాస్తంత తెలుగుని బ్రతికిస్తే చాలు - సినిమాలో సంభాషణలన్నీ సంస్కరించొద్దు!’
      నా వరకు నేను ప్రతి సినిమాలో ఒక్క పాటైనా పూర్తి తెలుగులో సాహిత్యం రాయించి స్వరపరుస్తానని ప్రమాణం చేస్తున్నాను!

- ఎం.ఎం.కీరవాణి
ప్రముఖ సంగీత దర్శకులు 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి