తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

పల్లవించే పల్లె జీవితమే నా తొలిగురువు

  • 154 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శ్రీసత్యవాణి

  • హైదరాబాదు.
  • 8008578174

భూమిలో ఉన్నప్పుడు అవి రాళ్లే! సానపెట్టిన తర్వాతే అవి విలువైన వజ్రాలవుతాయి. ప్రస్తుతం గురువుగా రామాచారి చేస్తోంది ఇదే. వినసొంపైన గాత్రం ఎక్కడున్నా వెలికితీయడం, సంగీత ప్రపంచంలో వారిని వజ్రాలుగా తీర్చిదిద్దడం. ఆయన ప్రారంభించిన లిటిల్‌ మ్యుజీషియన్స్‌ అకాడమీ వేలమంది గాయనీగాయకులని ప్రపంచానికి పరిచయం చేసింది. అందులోంచి వచ్చిన కొన్ని ఆణిముత్యాలే గీతామాధురి, కారుణ్య, దీపూ... హేమచంద్ర, ఇర్ఫాన్‌లు. ఇలా సంగీత సరస్వతికి సేవ చేస్తున్న రామాచారితో ముఖాముఖి...
తె.వె.: ఎంతోమంది ప్రముఖ గాయనీగాయకులను తయారుచేసిన మీకు తొలి గురువు ఎవరు?

రామాచారి: అడుగడుగునా సంతోషం పల్లవించే పల్లెజీవితమే నా తొలి గురువు. అదెలానో తెలియాలంటే ముందుగా మా ఊరు గురించీ, మా నాన్నగారి గురించీ చెబుతాను. మాది మెదక్‌ జిల్లా శివంపేట మండలం పెద్దగొట్టిముక్ల గ్రామం. మా నాన్నగారు కొమాండూరి కృష్ణమాచార్యులు. అమ్మ య‌శోద‌మ్మ‌. నాన్న వేదపండితులు. అర్చకత్వం చేసేవారు. మాది కరవు ప్రాంతం. ఆ కరవులోనూ వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకొని జీవించే సామాన్య కుటుంబీకులే మా ఊళ్లో అధికం. వాళ్లిచ్చే తృణమో, ఫణమో తీసుకొని సంతృప్తిగా జీవించిన కుటుంబం మాది. ప్రభుత్వ పాఠశాలలో చదువు. గురువుగారి దగ్గరికి వెళ్లి సంగీత పాఠాలు నేర్చుకొనేంత ఆర్థిక స్తోమత లేదు. ప్రకృతీ, ఊరూ, మా నాన్నగారు వీళ్లే నా పాటకు ప్రాణం పోసింది. మా ఊరికి అడవి దగ్గరగా ఉండేది. చెట్లూ, పుట్టలూ, మోటబావులూ, ఈతబావులూ ఇవే నా నేస్తాలు. చెక్కభజనలూ, ఒగ్గుకథలూ, కోలాటాలూ, యక్షగానం, జానపద పాటలతో నిత్యం మా గ్రామం సందడిగా ఉండేది. జానపదాల్లో ఉండే తత్వాలైతే భలే ఆకట్టుకునేవి నన్ను. ఆ తత్వాల్లో వినిపించే పల్లెజీవనాన్ని గ్రామస్థులతో తిరుగుతూ నేనూ పాడేవాణ్ని. సాయంత్రం పూట నాన్న హార్మోనియం వాయిస్తూ రామాయణ, భారత, భాగవతాలను పాడుతూ వాటిలోని క్లిష్టమైన పదాలని విశ్లేషించి వినిపించేవారు. అలా చెప్పడంలో ఆయనదో అందమైన శైలి. హరికథలు నిల్చుని చెబుతారు, పురాణాలు కూర్చుని చెబుతారు. కానీ నాన్న కూర్చుని లలిత   జానపద శైలిలో చెప్పే తందనాన రామాయణ కథాగానం వినడానికి భలేగా ఉండేది. ఆయనతో నేనూ వంతపాడేవాణ్ని.
      ‘దశకంఠుడు కోపమునందా
      తనలోతానే తాపమునందా’
      దశరథ సుతుని చంపదలిచినాడే  రావణుడు
      రామయ్య...రామయ్య.. రామయ్యా’
లలితంగా, జానపదంగా సాగే విధానం ఇది. ఇలాంటి పాటలని నాన్న సాయంత్రం ఇంటి దగ్గరా, కోవెల్లో పాడుతుండేవారు. అలా నాకు భాషమీద చక్కని పట్టు ఏర్పడింది. జానపదాలని పాడటంవల్ల పాటకు ఉండే పరిపూర్ణత్వం ఏంటో అర్థమైంది. మా ఊళ్లో గొంగళ్లు నేసేవాళ్లు ఉండేవాళ్లు. వాళ్లే నా శ్రోత‌లు. వాళ్లు పనిచేసుకుంటున్నప్పుడు అలుపు రాకుండా, శ్రమ తెలియకుండా ఉండటం కోసం నన్ను పాటలు పాడమనేవారు. అలా పాడినందుకు నాకు వాళ్లు చిక్కటి పాలూ, వెన్న, పళ్లూ కానుకలుగా ఇచ్చేవారు. వాటిని నా స్నేహితులతో కలసి పంచుకుని తినేవాణ్ని. పదోతరగతి వరకూ ఆ పల్లెలోనే ఎలాంటి నిర్బంధాలూ లేకుండా నా చదువూ, ఆటా... పాటా సాగాయి. ఇవి కాకుండా రేడియో పాటలు ఎక్కువగా వినేవాణ్ని. అలా నాన్న, పల్లె, రేడియోలే నా తొలి గురువులు.
పల్లె నుంచి నగరానికి రావడానికి కారణాలు ఏంటి?
మేడ్చల్‌లో ఇంటర్‌ చదువుతుండగా... మా ఊరికి స్వచ్ఛంద సంస్థ తరఫున ఆరోగ్య సేవలందించడానికి వచ్చిన భారతిగారు నా పాట విని చాలా సంతోషించారు. ‘హైదరాబాద్‌లో మ్యూజిక్‌ కాలేజీ ఉంది. అక్కడికి వెళ్లి నీపాటకు పదును పెట్టుకో’ అన్నారు. అలా మా ఊరు నుంచి హైదరాబాద్‌ పయనమయ్యా.
హైదరాబాద్‌లో తొలి రోజులు...
పల్లెలో ఉన్నంత ఆనందంగా అయితే నగర జీవితం సాగలేదు. చేతిలో డబ్బు ఉండేది కాదు. ఎక్కడికి వెళ్లినా కాలి నడకనే. రోడ్‌కా రాజా అన్నట్టుగా ఉండేది జీవితం. మెట్లకింద గదుల్లో ఉంటూ కాలం గడిపిన రోజులున్నాయి. కాలేజీ పిల్లలతో పాటూ వాళ్ల పనులు చేసేవాణ్ని. వాళ్ల గదిలో ఉచితంగా ఉన్నందుకా సాయం. సాయంత్రం పూట మ్యూజిక్‌ కాలేజీలో తరగతులకు వెళ్లేవాణ్ని. ఆపై డిగ్రీ చేసి ఒక కాలేజీలో సంగీత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ బీఎడ్‌ పూర్తిచేశా.
పాడుతా తీయగా కార్యక్రమానికి ఎలా ఎంపికయ్యారు?
ఇంటర్మీడియెట్‌ చదువుతుండగానే ఆకాశవాణిలో అవకాశాలు రావడం ప్రారంభించాయి. యువవాణి, పిల్లల కార్యక్రమాల్లో పాటలు పాడుతూ ఉండేవాణ్ని. దూరదర్శన్‌లో అయితే అప్పటికే పాటలు పాడిన అనుభవం ఉంది. ఈటీవీలో ప్రారంభమైన ‘పాడుతా తీయగా’ తెలుగు బుల్లితెర    చరిత్రలో మొదటి రియాల్టీషో. ఆ కార్యక్రమానికి అప్పటికే గాయకులుగా రాణిస్తున్న కొందరిని నేరుగా కూడా ఎంపిక చేశారు. అందులో నేనూ ఒకణ్ని.
‘పాడుతా తీయగా’ కార్యక్రమం మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది?
‘పాడుతా తీయగా’కు ఎంత ఆదరణ ఉండేదంటే.... టీవీలో రామాయణ, భారతాలు ప్రసారమయ్యేటప్పుడు ప్రేక్షకులు ఎలా అతుక్కుపోయేవారో... అలానే వందశాతం ప్రేక్షకాదరణ పొందిందీ కార్యక్రమం. నాకైతే మొదటి ఎపిసోడ్‌ కూడా సెమీఫైనల్స్‌లా అనిపించేది. 64 ఎపిసోడ్లయ్యాక నేనూ, పార్థసారథి, నిష్మ, ఉష ఫైనలిస్టులుగా మిగిలాం. విజేత పార్థసారథే అయినా ఫైనలిస్టులుగా మాకొచ్చిన ఆదరాభిమానాలు అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా నాకు సెలబ్రిటీ హోదా వచ్చింది. జనాలు బాలుగారితో సమానంగా మమ్మల్నీ ఆదరించేవారు. రైల్వేస్టేషన్లలో బ్యానర్లు కట్టి స్వాగతం పలికేవారు. ఎక్కడ చూసినా ఫైనల్స్‌లో మేం పాడిన పాటల సీడీలు కనిపించేవి. పాడుతా తీయగా తర్వాత ఎన్నో సంగీత విభావరుల్లో పాడాను. ఇలా... నా జీవితాన్ని ‘పాడుతా తీయగా’ మలుపు తిప్పింది. పాటనే జీవితంగా మలుచుకొనేట్టు చేసింది. 
సినిమా అవకాశాలపై దృష్టి పెట్టలేదా?
అప్పటికి సినిమా రంగం మద్రాసులో ఉంది. మా కుటుంబానికి నేనే ఆధారం. తమ్ముడూ, చెల్లెలూ, నాయనమ్మ. నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు. ఇంతమంది నా మీద ఆధారపడ్డారు. కుటుంబం గడవడానికి నా భార్య కూడా ఉద్యోగం చేసేది. చేతిలో కుటుంబానికి ఆధారంగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని అక్కడికి వెళ్లలేకపోయా. అప్పటికీ శ్వేతనాగు, బాల రామాయణం, సంబరం, శ్రీరామదాసు వంటి పది సినిమాల్లో పాడాను. కొన్ని చిత్రాలకు సహాయ సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాను.
లిటిల్‌ మ్యుజీషియన్స్‌ అకాడమీ ఆలోచన ఎలా వచ్చింది?
కొన్నాళ్లకు సినిమా రంగం ఇక్కడకు వచ్చేసింది. కానీ సంగీత శాఖ మాత్రం రాలేదు. ఎందుకంటే అది రావాలంటే ఇక్కడ తగినంతమంది గాయనీగాయకులు ఉండాలి. ముఖ్యంగా కోరస్‌ పాడేవాళ్లు కావాలి. ఆ కొరత ఇక్కడ చాలా ఎక్కువ. అప్పుడే ‘పాడుతా తీయగా’కి చక్కని ఆదరణ రావడంతో ఇతర ఛానళ్లూ ఆ తరహా కార్యక్రమాలు ప్రారంభించాయి. ఆ కార్యక్రమాల్లో పాడాలంటే తగినన్ని నైపుణ్యాలు కావాలి. సినిమాల్లో పాడిన అనుభవంతో పాటూ పైన చెప్పిన అనుభవాలన్నీ నాకు ఉన్నాయి. వీటన్నింటికి మించి నేనో సంగీత ఉపాధ్యాయుణ్ని. ఎవరికి ఎలా చెప్పాలో తెలుసు. సంగీత రంగానికి అవసరమైన నైపుణ్యాలను అందించి గాయనీగాయకులుగా తీర్చేదిద్దే పనిని మనమే ఎందుకు చేయకూడదనే నా ఆలోచనని బాలసుబ్రహ్మణ్యం గారితో పంచుకొన్నా. ఆయనకు నా ఆలోచన నచ్చడంతో ప్రోత్సహించారు. అలా 1998లో ‘లిటిల్‌ మ్యుజీషియన్స్‌ అకాడమీ (littilemusiciansacademy.com)ని ప్రారంభించాను.
వేదికలమీద పాటలు పాడేందుకు మైకు పట్టుకోవడం నుంచీ సంగీత మెలకువల వరకూ అన్నీ నేర్పిస్తున్నాం. అలా మా  అకాడమీ నుంచి వచ్చిన వాళ్లలో కారుణ్య, హేమచంద్ర, గీతామాధురి, ప్రణవి, దీపూ, ఇర్ఫాన్‌లు మొదటి బ్యాచ్‌ పిల్లలు.
మీ అకాడమీలో ఎంపిక విధానం?
చక్కని గాత్రమే ప్రాతిపదిక. ఇది పూర్తిగా ఉచితంగా నడుస్తున్న సంస్థ. పదహారేళ్లగా డబ్బులు, కానుకలు తీసుకోకుండా ఈ పనిచేస్తున్నా. 5-18 ఏళ్ల పిల్లలకు మాత్రమే ఇక్కడ సంగీతం నేర్పిస్తాం. కేవలం హైదరాబాద్‌ నుంచే కాకుండా అన్ని జిల్లాల నుంచీ ఎంపికలు చేస్తుంటా. ఇక్కడ పాటలు నేర్చుకోవడం కోసం అమ్మమ్మల ఇంట్లో, నాయనమ్మల ఇంట్లో ఉండి నేర్చుకొంటున్న పిల్లలు బోలెడుమంది. అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలు, అంధ పిల్లల్లో ప్రతిభ ఉంటే వారినీ తీర్చిదిద్దుతున్నా. ‘బ్లాక్‌’ కార్యక్రమం విజేత శ్రావణి మా అకాడమీ విద్యార్థినే. బాలసుబ్రహ్మణ్యం గారు ఏటా మా అకాడమీకి లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నారు.
ఇప్పుడంతా ఆంగ్లమాధ్యమం పిల్లలు కదా! వాళ్లతో మీకు ఏ ఇబ్బందీ తలెత్తడం లేదా?
ఉచ్చారణ, తెలుగు పదాలకు అర్థం తెలియకపోవడం వారితో ఎదురయ్యే ప్రధానమైన ఇబ్బందులు. పాటలో అర్థాలు చెప్పి, అప్పుడు పాట నేర్పిస్తా. చాలామందికి ష, శ, సలకు మధ్య తేడా తెలియదు. కొన్ని చోట్ల వత్తులు పెడతారు. ఉంచాల్సిన చోట తీసేస్తారు. జాబిలి అనడానికి బదులుగా ‘ఝాబిలి’ అంటారు. ఇవన్నీ వాళ్లకు ఓపిగ్గా వివరిస్తా. పిల్లలు ఆంజనేయస్వామితో సమానం. ఆయన శక్తి ఆయనకు తెలియనట్టుగా పిల్లలకూ వాళ్ల శక్తి వాళ్లకు తెలియదు. వాళ్లకి స్ఫూర్తినిస్తే ఎంతైనా నేర్చుకొంటారు. పదహారేళ్లలో ఎవరినీ కోప్పడింది  లేదు. సంగీత పాఠాలవల్ల వాళ్లలో వికాసం ఏర్పడి, పాఠాలు సులువుగా అవగాహన చేసుకొంటారు. లెక్కలు తేలిగ్గా అర్థమవుతాయి. దాంతో సంగీతాన్ని వాళ్లు ప్రేమిస్తున్నారు. ఇష్టంగా నేర్చుకొంటున్నారు. ఇక్కడ గురుకుల పద్ధతిలో పాఠాలు నేర్పిస్తుంటా. నేనూ, మా అబ్బాయి సాకేత్‌ కాకుండా సీనియర్‌ బ్యాచ్‌ల నుంచి వెళ్లిన దీపూ సహా ఎవరుంటే వాళ్లు తరగతులు తీసుకొంటూ ఉంటాం. పిల్లలతో పాటూ తల్లిదండ్రులకూ తరగతులు చెప్పడం ప్రత్యేకత. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రాకపోకల ఖర్చులూ మేమే భరిస్తాం. భూమిలో దొరికే వజ్రం లాంటిది గాత్రం. అది దేవుడి ఇచ్చే వరం. దాన్ని సానబెట్టడం మాత్రమే నా పని. అలాంటి మంచి గాత్రం ఎవరికి ఉందో గుర్తించి, ప్రాథమికంగా కొంత నేర్చుకొంటే ఆపై అడ్వాన్డ్స్‌ తరగతులు నేనే  చెబుతాను. లేదా ఎక్కడ నేర్చుకోవాలో సూచిస్తాను.
వీటివల్ల ఉపయోగం ? 
బాలగీతాలే కదా అనుకొంటాం కానీ.. అందులో బోలెడు నీతి, ఆరోగ్య సూత్రాలు కూడా ఉంటాయి. వీటిని పొందుపరచడమే మనవాళ్ల ముందుచూపునకు నిదర్శనం.  ఉదాహరణకు ‘చిట్టిమిరియాలు చిట్టి మిరియాలు చెట్టుకింద పోసి’ గేయాల్లాంటివి ముందుతరాలకు అందించడం కోసమే ఈ ప్రయత్నం. అలాగే వృద్ధ గాయకులకు ఓ ఆరామాన్ని ఏర్పాటు చేయాలనుకొంటున్నా.  ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి అర్జీ కూడా పెట్టాం. తగినంత స్థలం దొరికితే ఈ ప్రయత్నం వెలుగు చూస్తుంది.
మీ శిష్యుల్లో ఎవరంటే ఇష్టం? వారిలో వృత్తి గాయకులుగా స్థిరపడ్డవాళ్లు?
ఒకరని చెప్పలేను. కానీ వాళ్లు విజయాలు సాధిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇర్ఫాన్‌ జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పుడూ, ఇక్కడ సిగ్గుతో ముడుచుకుపోయిన గీతామాధురి ఇప్పుడు ధైర్యంగా పాడ్డం నేను ఆనందించే విషయాలే. కృష్ణచైతన్యకి తండ్రిలేడు. వాడి పెళ్లిలో నేనే పెద్దను. ఒకరకంగా చెప్పాలంటే తండ్రి స్థానంలో నన్ను ఉంచాడు. అదీ నాకూ నా శిష్యులకూ ఉన్న అనుబంధం. వీళ్లేకాదు... ఇంకా ప్రణవి, పర్ణిక, రఘురామ్, రేవంత్, రమ్య బెహరా, భువనకృతి, యామిని, దామిని, నూతన, సాహితి... ఇంకా చాలామంది వృత్తి గాయకులుగా స్థిరపడ్డారు.
విదేశాల్లో ఉండే విద్యార్థులతో భాష పరంగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి?
సాధారణంగా విదేశాల్లో ఉండే పిల్లలు ఒత్తులు సరిగ్గా పలకలేరు. మొదట్లో ‘గననాయకా నమః’ అని పాడేవారు. దాంతో ణ, న, చ, ఛ, శ, ష, స, ళ, ల వంటి అక్షరాలను స్పష్టంగా నేర్పించడం మొదలుపెట్టా. చాలా మందికి తెలుగు అర్థమవుతుంది కానీ... తిరిగి తెలుగులో సమాధానం చెప్పరు. ఆంగ్లంలో చెబుతారు. అయితే ఓ విషయంలో వాళ్లని ప్రశంసించాల్సిందే. ఓ పనిని నచ్చితే వంద శాతం ఇష్టంగా ఇస్తారు. నచ్చకపోతే అస్సలు ఆసక్తి చూపరు. అక్కడి విద్యావిధానం ప్రకారం.. మంచి కశాశాలలో సీటు రావాలంటే సంగీతం, ఆటపాటల్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూస్తారు. అందుకే అక్కడి తల్లిదండ్రులు పిల్లలను ఇలాంటి పాఠ్యేతర బోధన కృత్యాల వైపు నడిపిస్తారు. కానీ మనకా విధానం లేదు. అది ఉంటే ఇక్కడింకా ఎక్కువ మంది పిల్లలు సంగీతంలో శిక్షణ పొందుతారు. మనోవికాసం పెరుగుతుంది. ఇక్కడ తెలివైన పిల్లలు సగటు విద్యార్థులుగా ఉంటారు. వాళ్లు పుస్తకాల పురుగుగా మారి టాప్‌ ర్యాంకర్ల‌వుతారు. ఆ టాప్‌ ర్యాంకర్‌ని విదేశాలకి పంపితే అతను ఉన్నతస్థానంలో ఉండలేడు. కారణం అక్కడ చదువు ఒక్కటే చూడరు. అన్నికోణాల్లోనూ ప్రతిభను అంచనా వేస్తారు. 
మన కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో    తెలుగుని నామమాత్రంగా బోధిస్తున్నారు. అది కూడా పరీక్షల్లో వస్తాయనుకున్న ప్రశ్నలని మాత్రమే బట్టీ వేయించి మార్కులు తెప్పిస్తున్నారు. చదువంటే గణితం, విజ్ఞానశాస్త్రాలు మాత్రమేనా?
ఇక్కడి పిల్లలు భాషా సాహిత్యాల పట్ల ఎలాంటి ఆసక్తి చూపిస్తున్నారు?
పిల్లలు కొత్త గోడల్లాంటి వారు. ఏ సున్నం వేస్తే ఆ రంగే వారి మనసులపై పడుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులూ, సమాజం చెప్పిన దాన్నే మనసుకి ఎక్కించుకొంటారు. భాషమీద అభిమానమైనా, సంస్కృతిని ప్రేమించే తత్వమైనా వీళ్లందరూ చెబితేనేగా పిల్లలకు తెలిసేది. వాళ్లలో సహజంగా భాషా, సంస్కృతులని ప్రేమించే గుణం ఉంది. అది కొనసాగాలంటే ఆ స్ఫూర్తిని నింపాల్సింది మనమే. జీవితం గురించి చెప్పడానికి.. ఒక వేమన పద్యం చాలు. కానీ అది మనం చెబుతున్నామా?
అకాడమీ నిర్వహణకు నిధులు ఎలా?
విదేశాల్లో పాడినప్పుడు వచ్చిన విరాశాలతో పాటూ, ఇంతవరకూ సుమారు వెయ్యి ప్రైవేట్‌ పాటలు పాడి క్యాసెట్లుగా విడుదల చేశాను. వాటిపై వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాను. ఆ ఆదాయాన్ని ఇలా వెచ్చిస్తున్నాం. పిల్లలకు ఉచిత తరగతులతో పాటూ, పాటలు పాడటమే లక్ష్యమనుకునేలా ప్రోత్సహిస్తాం. ముందే చెప్పానుగా... కారుణ్య, హేమచంద్ర, ఇప్పటి దామిని, నూతన, రోహిత్, ఇర్ఫాన్‌ వరకూ ఇలా పాఠాలు నేర్చుకొన్నవాళ్లే. ఇప్పటికి వెయ్యిమందికి తరగతులు నిర్వహించా. అలాగే విదేశాల్లో మరో వెయ్యిమంది వరకూ నేర్చుకొన్నారు. జూన్, జులైలో అమెరికా వెళ్లి నేర్పిస్తుంటాం. మొత్తం నాలుగు బ్యాచులుంటాయి. గ్రూప్‌1 నుంచి గ్రూప్‌ 3 వరకూ. ఈ మూడూ  దాటిన వారే ప్రొఫెషనల్‌ బ్యాచ్‌ అవుతారు. వీరికి సంజ్ఞామానం (నొటేషన్లు) రాయడం, మనోధర్మం పాడటం వంటివి నేర్పిస్తా. ఇంతవరకూ వచ్చిన పిల్లలే రియాల్టీషోల్లో మీకు కనిపిస్తున్నారు. ఆదివారం ఉదయం పదింటి నుంచి ఆరింటి వరకూ ఈ తరగతులు జరుగుతాయి. నా భార్య కూడా ఈ అకాడమీలో కీలక పాత్ర పోషిస్తుంది.
భవిష్యత్‌ లక్ష్యాలు?
త్వరలో సంగీత ఆలయాన్ని నిర్మించాలని ఉంది. ఇందులో ప్రపంచ సంగీతానికి సంబంధించిన విశేషాలను పొందుపరచడంతోపాటూ, తెలుగు సాహిత్యాన్నీ చేర్చి పెట్టాలన్నది కోరిక. అందుకోసం ఇప్పటి నుంచే తెలుగు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాలగీతాలూ, లలిత గీతాలూ, జానపద గీతాలూ, వేమన, సుమతీ పద్యాలూ సేకరిస్తున్నా.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి