తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తేలికైన తెలుగు... కంప్యూటర్‌కు వెలుగు

  • 1035 Views
  • 57Likes
  • Like
  • Article Share

    పద్మ కంటిపూడి

  • హైదరాబాదు, padmaavasu@gmail.com

రెండు దశాబ్దాల కిందట తెలుగునాట సాంకేతిక విప్లవం పురుడుపోసుకుంటున్న దశలోనే, దాని గురించి తెలుగులో రాయడం ప్రారంభించిన వ్యక్తి నల్లమోతు శ్రీధర్‌. ‘కంప్యూటర్‌ ఎరా’ పత్రిక సంపాదకుడిగానే కాదు... తన బ్లాగు రచనలు, వీడియో పాఠాల ద్వారా సాంకేతిక సమాచారాన్ని అమ్మభాషలో అందిస్తున్న వృత్తినిపుణుడాయన. వైజ్ఞానిక అంశాలను తెలుగులో వివరించేటప్పుడు సరళతే ప్రధానమనే శ్రీధర్‌తో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి.. 
తె.వె.: సాంకేతిక విషయాలను తెలుగులో చెప్పాలన్న ఆలోచన ఎలా ప్రారంభమైంది?
శ్రీధర్‌: మే, 1996లో కంప్యూటర్‌ విషయ సంబంధిత రచనలు (సైబర్‌ లిటరేచర్‌) మొదలుపెట్టాను. అప్పట్లో ‘క్రేజీ వరల్డ్‌’, ఇంకో పత్రికలో ఉపసంపాదకుడిగా చెన్నైలో పనిచేసేవాణ్ని. వీటితోపాటు కంప్యూటర్‌ సంబంధిత అంశాలతో మరో అనుబంధం (సప్లిమెంట్‌) ఇద్దామని మా సంపాదకులు అన్నారు. ఆ కాలంలో ఇలాంటి రచనలేవీ పెద్దగా లేవు. దాంతో ఏం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలా అని చాలా ఆలోచించాం. మొదట్లో గందరగోళంగా అనిపించింది. అసలు కంప్యూటర్‌కి సంబంధించిన పదజాలం ఎలా ఉండాలి, ఎలా ఉంటే విషయం పాఠకులకు అర్థం అవుతుందన్నది మాకు బోధపడలేదు. సాంకేతిక విప్లవం అనేది అప్పుడే మొదలవుతోంది. పైగా అది చాలా క్లిష్టమైంది కూడా. అందుకే, ఉన్న పద్ధతిలోనే సరళంగా చెప్పడం మొదలుపెట్టాం. దాదాపు నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించాను. తర్వాత హైదరాబాద్‌ వచ్చి సొంతంగా ‘కంప్యూటర్‌ ఎరా’ పత్రికను ప్రారంభించాను. 
పత్రిక స్థాపనలోని ఉద్దేశం?
ఏవో కంప్యూటర్‌ కోర్సుల్లో శిక్షణ తీసుకుని అమెరికా వెళ్లాలి, ఉద్యోగాలు సంపాదించాలన్న ఆలోచనలు అప్పట్లో చాలామందికి ఉండేవి. ఒకానొక దశలో నేనూ అలా ఆలోచించినవాణ్నే. ఆర్థిక పరిస్థితులు సహకరించక ప్రయత్నాలు చేయలేదు. ఈ సంగతి అలా ఉంచితే, నాకు పాత్రికేయ వృత్తి అంటే ఇష్టం. అప్పటికే కొంత అనుభవమూ ఉంది. నాకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పల్లెల వరకూ అందించాలని నిర్ణయించుకున్నాను. పత్రిక ద్వారానే ఇది నెరవేరుతుందని అనిపించింది. అలా నా దృష్టంతా ‘కంప్యూటర్‌ ఎరా’ మీదే పెట్టాను. మధ్యలో అమెరికా వెళ్లే అవకాశాలు వచ్చాయి. నాకు ఇక్కడే ప్రాజెక్టులు ఇవ్వడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. సైబర్‌ సాహితీసృజన నుంచి మళ్లితే నా లక్ష్యం దూరమవుతుందని అవన్నీ పక్కన పెట్టేశాను. రోజురోజుకీ కొత్త విషయాలు నేర్చుకుంటూ.. పత్రిక ద్వారా ఇతరులకూ ఆ నైపుణ్యాలను పంచుతున్నాను. 
ఈ ఇరవై ఏళ్ల ప్రయాణంలో మీ అనుభవాలు?
మనం ఏదైనా ఉపకరణం వాడుతున్నప్పుడు వివిధ సమస్యలు వస్తుంటాయి. నాకూ చాలాసార్లు అలాంటివి ఎదురయ్యాయి. పత్రిక తొలినాళ్లలో వీటి గురించే చెప్పేవాణ్ని. ఆయా సమస్యలను పరిష్కరించుకున్న విధానాలనూ ఇచ్చేవాణ్ని. కింద నా ఫోన్‌ నంబర్‌ కూడా రాసేవాణ్ని. రోజూ బోలెడు కాల్స్‌ వచ్చేవి. మనవాళ్లకి తెలుసుకోవాలనే తపన ఎంతుందో అప్పుడు అర్థమైంది నాకు. విషయాన్ని అవగాహన చేసుకోవడానికి సాయపడే సరైన వనరుల్లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని గ్రహించాను. అలా పాఠకుల అవసరాలు తెలుసుకుంటూ పత్రికలో వ్యాసాలు ఇవ్వడం ప్రారంభించాను. ఇంట్లో సాంకేతిక విద్య నేర్చుకునే పిల్లలు ఉన్నా, పెద్దవాళ్లకు చెప్పే సమయం, ఓపిక వారికి ఎక్కడుంటాయి! అందుకే కంప్యూటర్‌ను వినియోగించుకునే పెద్దలను దృష్టిలో పెట్టుకుని కూడా సమాచారం అందివ్వడం ఆరంభించాను. ఇక భాష విషయానికొస్తే, పదాల వాడకం గురించి చాలా ఆలోచించాను. చివరికి కంప్యూటర్‌ పరిభాషను మార్చకుండా, భావం మీదే దృష్టి పెట్టాను. సాంకేతిక పదజాలాన్ని మార్చకుండా విషయాన్ని తెలుగులో చెప్పాలని నిర్ణయించుకున్నాను. 
ఇది మంచి పద్ధతేనా? 
వైజ్ఞానిక పారిభాషిక పదజాలాన్ని తెలుగులోకి తేవడం మీద నాకు భిన్నాభిప్రాయం ఉంది. అమ్మభాషను పరిపుష్టం చేయడానికి ఇప్పుడు చాలామంది ఇలాంటి ‘అనువాద’ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వీటివల్ల పెద్దగా ఫలితం ఉండదన్నది నా అభిప్రాయం. సాంకేతిక పదజాలాన్ని అనువదిస్తే చదివేవాళ్లకు రుచించదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశోధనల సారంగా అందుబాటులోకి వచ్చే ఆ సాంకేతికతలను, వాటి భావాలను ఈ అనువాద పదాలతో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. విషయాన్ని అర్థం చేసుకోవాలనే వ్యక్తి... ముందు ఆ భాషను అర్థం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. అందుకే, ఎలాంటి పదాలతో చెప్పినా, విషయం మాతృభాషలో అర్థమైందో లేదో చూసుకోవాలి. వైజ్ఞానిక, సాంకేతిక రంగాల పరిభాషలను మన భాషలోకి తీసుకురావడం కన్నా, పాఠకుడికి అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం.
మీ రచనలకు వచ్చే స్పందన?
సాంకేతిక సమాచారం తెలుగులో అందుబాటులో లేని తరుణంలో నేను ఈ రంగంలోకి అడుగుపెట్టాను. కొన్ని వేల మందికి నా సేవలు అందించాను. ఇప్పటికీ ఫేస్‌బుక్‌లో నన్ను యాభై వేల మంది అనుసరిస్తున్నారు. వీడియో పాఠాలకూ దాదాపు అంతే సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2007 నుంచి బ్లాగు నడుపుతున్నాను. తెలుగులో వ్యాసం రాస్తే సహజంగానే చాలా ఎక్కువమంది స్పందిస్తారు. ఎందుకంటే, చెప్పిన విషయం వాళ్లకి అర్థమవుతుంది కాబట్టి. అప్పుడే దాని గురించి తిరిగి మాట్లాడగలుగుతారు. ఏవైనా సందేహాలు ఉంటే అడగగలుగుతారు. ఇలాంటి రచనల వల్ల సాంకేతిక రంగంలో మంచి తెలుగు సమాజాన్ని చూడవచ్చు.
ఇలా రాయాలనుకునే వర్ధమాన రచయితలకు మీ సూచనలు? 
ఇప్పుడు చాలామంది ఈ రంగం గురించి తెలుగులో రాయడం మొదలు పెడుతున్నారు. ఇలా రాసేటప్పుడు భాష... మనం మాట్లాడే భాష మాదిరిగా సరళంగా ఉండాలి. గ్రాంథికాన్ని జోడించి కవిత్వంలా చెబితే కృతకంగా అనిపిస్తుంది. సూటిగా విషయం చెప్పాలి. మనం పాఠకుడి ఎదురుగా నిల్చుని మాట్లాడుతున్నట్లుగా అనిపించాలి. అప్పుడే ఆ సాంకేతిక పరిజ్ఞానం గురించి అవతలి వారికి సులభంగా అర్థమవుతుంది. భాష నిలబడుతుంది. వైజ్ఞానిక సాహిత్యం ఎప్పుడైతే క్లిష్టమవుతుందో అప్పుడు నేర్చుకోవడమూ తగ్గిపోతుంది. భాష పట్ల విముఖత పెరుగుతుంది. వాక్యనిర్మాణం సరళంగా ఉంటే సమస్య ఉండదు. 
మాతృభాషాభివృద్ధిలో సాంకేతికత పాత్ర? 
పదేళ్ల కిందటితో పోలిస్తే సాంకేతికతల్లో చాలా మార్పులే వచ్చాయి. ఇక ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తదితరాలతో సమాజం ఇంకా మారింది. ఆ సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగు పుంఖాను పుంఖాలుగా కనిపిస్తోంది. ఇప్పుడు సెల్‌ఫోన్ల తయారీదారులు కూడా మొబైళ్లలో ప్రాంతీయ భాషలను కచ్చితంగా అందుబాటులో ఉంచుతున్నారు. రకరకాల కీబోర్డులు వస్తున్నాయి. ఫలితంగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల ద్వారా చాలామంది తమ భావాలను మాతృభాషలో పంచుకుంటున్నారు. ఇది తప్పకుండా భాషాభివృద్ధికి దోహదపడుతుంది. తెలుగు అంతరించిపోతుందేమో అని కొన్నేళ్ల కిందట చాలామంది భయపడ్డారు. 
ఇప్పుడు అంతర్జాలంలో, సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న తెలుగును చూస్తే, భాష భవిష్యత్తు మీద దిగులు చెందక్కర్లేదని అనిపిస్తుంది. మన కవులూ, కథకులూ సామాజిక మాధ్యమాల్లో బృందాలుగా ఏర్పడి చర్చలూ సాగిస్తున్నారు. అభిప్రాయాలను అమ్మభాషలోనే పంచుకుంటున్నారు. లోతైన భావాలను మన భాషలోనే చెబితే అవతలివాళ్లకి సులభంగా అర్థమవుతుందన్న అవగాహన యువతలోనూ పెరుగుతోంది. ఆ మేరకు వాళ్లు సామాజిక మాధ్యమాల్లో తెలుగులో రాస్తున్నారు. కాబట్టి మన భాషకు వచ్చిన ముప్పేమీ లేదు. 
విద్యావ్యవస్థ నుంచి తెలుగు దూరమవుతోంది?
ఒకప్పుడు స్థానిక భాషలో చదువుకున్నా కలెక్టర్‌, బ్యాంకు ఉద్యోగాలు వచ్చేవి. నేడు ఉద్యోగాల విస్తృతి, పరిధి పెరిగాయి. తప్పనిసరిగా ఆంగ్లం నేర్చుకోవాల్సి వస్తోంది. ఆ భాషలో సంభాషణా నైపుణ్యాలు చాలా అవసరం. అయితే, అమ్మభాషకు దూరమైతే మనిషిగా ఎదగలేం. కాబట్టి డిగ్రీ వరకూ తెలుగు తప్పనిసరిగా ఉండాలి. దీన్లో వచ్చే మార్కులనూ గణనలోకి తీసుకోవాలి. మనవాళ్లకి అన్నింటి మీదా ఆసక్తి పెరుగు తోంది. కానీ, తెలుగు మీద తరుగుతోంది. అందుకే బడిలో తెలుగు ప్రాధాన్యం తగ్గిపోతోంది. ప్రభుత్వం పూనుకుంటేనే ఈ  పరిస్థితులు మారతాయి.  


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి