తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

జీవితాన్నిచ్చే భాషకావాలి

  • 24 Views
  • 1Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

ఆర్థిక వ్యవస్థతో తెలుగును అనుసంధానించుకోకపోతే, మన మాతృభాష తన అస్తిత్వాన్ని కోల్పోవడానికి మరెంతో కాలం పట్టదని హెచ్చరిస్తున్నారు కన్నెగంటి అనూరాధ. ఉత్పాదకతే (ప్రొడక్టివిటీ) భాషకు బతుకునిస్తుందని చెబుతున్నారావిడ. పారిస్‌ (ఫ్రాన్స్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న అనూరాధ... పారిశ్రామిక రంగంలో తెలుగు వినియోగం మీద పరిశోధన చేస్తున్నారు. యువతలో నైపుణ్యాల అభివృద్ధికి తెలుగును వినియోగిస్తే... మన భాషను నేర్చుకోవడానికి నవతరం ఎందుకు ముందుకు రాదంటూ భాషాభివృద్ధిలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్న ఆవిడతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
తె.వె.: ఆర్థిక రంగానికి భాష మనుగడకు సంబంధమేంటి?

అనూరాధ: మాట్లాడటం, మాట్లాడించడం, చదివించడం ద్వారా మాత్రమే మాతృభాషను బతికించుకోలేం. తెలుగును పారిశ్రామిక రంగంతోపాటు ఇతర] రంగాల్లోని అన్ని విభాగాల్లోనూ విస్తరించే ప్రణాళికలు రూపొందించాలి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాష కీలకపాత్ర పోషిస్తుంది. మన దురదృష్టం ఏంటంటే, భాషను కేవలం సాంస్కృతిక, రాజకీయపరంగానే గుర్తిస్తున్నాô. కానీ, భాషలో ఆర్థికరంగ భాగస్వామ్యం ఏమిటన్నది తెలుసుకోవట్లేదు. మన భాష ఇంకా పూర్తిస్థాయిలో పారిశ్రామికంగా ఉపయోగంలోకి రాలేదు. ఇదే విషయంపై పరిశోధన చేస్తున్నా. ‘లాంగ్వేజ్‌ అండ్‌ ఎకనామిక్స్‌’ ఇప్పుడు వస్తున్న కొత్త విధానం. ఎవరైనా తాము నేర్చుకున్న ఇతర భాషలతో కంటే మాతృభాష ద్వారానే ఆర్థికంగా మరింత ఉన్నతంగా ఎదిగే అవకాశాలున్నాయి. దాన్ని నిరూపించడమే నా పరిశోధన లక్ష్యం.
ఇప్పటి వరకూ మీ పరిశోధనలో ఏం గమనించారు?
నా పరిశోధన, విశ్లేషణలు ముఖ్యంగా మూడు అంశాలపైనే. తెలుగులో సాంకేతిక భావవ్యక్తీకరణ ఎలా ఆవిర్భవించింది, ఎలా అభివృద్ధి చెందింది, దాని సాహిత్య లక్షణాలేంటి, దాన్ని ఎలా రూపొందించారు, ఎలా స్వీకరిస్తున్నారన్న దొకటి. పారిశ్రామిక వ్యవస్థలో భాషా వినియోగం - ఆంగ్లం/ తెలుగు అంతరాల వల్ల ఉత్పత్తిపై పడే ప్రభావం మరొకటి. చివరగా తెలుగు/ ఆంగ్ల ఆధారిత ఆర్థిక వ్యవస్థల మధ్య వ్యత్యాసాలు. అయితే, దేశీయ భాషలన్నీ సేవాభాషలుగానే మిగిలిపోయాయి. విద్యావ్యవస్థలోని కింది స్థాయుల్లోనే ఉనికి చాటుకుంటూ, ఉన్నతస్థాయిని కోరుకునే అతికొద్ది మంది విద్యార్థులను ఆంగ్లాధారిత ఆర్థిక వ్యవస్థకు అందించే వనరులుగా మారిపోయాయి. సాంస్కృతిక పరిశ్రమ (దృశ్య-శ్రవణ, చిత్ర), సంప్రదాయ వృత్తుల (వ్యవసాయం, వర్తకం, చేతివృత్తులు)ను మినహాయిస్తే, నూతన ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి, వస్తుసేవల ఉత్పత్తి, వినియోగ వ్యవహారాల్లో ఈ భాషలకు ఏ స్థానమూ లేదు. స్థానిక భాషాధారిత ఉత్పాదక పని ద్వారా జరిగే సంపద సృష్టి... తద్వారా ఉనికిలోకి వచ్చే స్థానిక ఆర్థిక వ్యవస్థ పరిధి, పరిమాణాలను గుర్తించడానికి అవసరమైన ప్రమాణాల అభివృద్ధిపైనా పరిశోధిస్తున్నా. మరోవైపు... పాఠ్యపుస్తకాలను మినహాయించి తెలుగులోని సాంకేతిక గ్రంథాలన్నీ సాహిత్య పరిభాషలో ఉంటున్నాయి. వాటికి ఆచరణాత్మక ప్రాతిపదిక ఉండట్లేదు. పారిశ్రామిక రంగాన్ని పరిశీలిస్తే, తెలుగులో సాంకేతిక అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినట్టు అర్థమవుతోంది.
భాష, ఉపాధులకు ఉన్న ప్రత్యక్ష సంబంధమేంటి? 
మన రెండు రాష్ట్రాలనే తీసుకుంటే, తెలుగు ద్వారా మాత్రమే ఉపాధి పొందుతున్న వారి శాతం అతి తక్కువ. ఆంగ్లాన్ని నేర్చుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. ఇది ఆంగ్లం గొప్పతనమని నేననుకోవట్లేదు. తెలుగులో చదువుకోవాలనుకునే వారికి అవసరమైన బోధన పూర్తి స్థాయిలో లభించట్లేదు. అందువల్లే పరభాషపై ఆధారపడాల్సి వస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థి మధ్యలో కుటుంబ అవసరాల కోసం బడి మానేస్తే అతనికి ఉపాధి దొరకడం కష్టం. ఎందుకంటే అతనికి ఆంగ్లం రాదు. అప్పటి వరకూ చదివిన దాంతో తెలుగుపైనా పూర్తిపట్టు ఉండదు. దాంతో అతను నైపుణ్యం లేని శ్రామికుడిగా ఏదో ఒక పరిశ్రమలోనో, దుకాణంలోనో పనిచేయాల్సిన పరిస్థితి. అదే పదో తరగతిలోపు చదివిన విద్యార్థికి తెలుగులో అతను చదవగలిగే స్థాయిలో అతనికి ఇష్టమైన వృత్తి పుస్తకాలను రూపొందిస్తే... తన మాతృభాష అతణ్ని మరోమెట్టు ఎదిగేలా చేస్తుంది. వడ్రంగి, బంగారపు పని, విద్యుత్తు, నిర్మాణ రంగాలు, మోటారు మెకానిక్‌ పని వంటి అనేక చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి అతడి నైపుణ్యాన్ని పెంచే అమ్మభాషా పుస్తకం ఒక్కటీ లభ్యం కావట్లేదు. ఈ కారణంగానే నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని వ్యక్తుల స్థానంలో చదువుకున్న, చదువులేని వ్యక్తులుగా సమాజంలో వారు విభజనకు గురవుతున్నారు. యువత మాతృభాషను మర్చిపోతోంది, తెలుగులో చదువుకోవట్లేదని నిందించడం సరికాదు. పారిశ్రామికంగా విస్తరిస్తే భాష ఎదుగుదల సాధ్యం.
నేటి యువత ఆంగ్ల మాధ్యమాన్నే ఎక్కువ ఎంచుకోవడానికి కారణమిదే అని కచ్చితంగా ఎలా చెప్పగలం?
విద్యార్థులు తెలుగు మాట్లాడటం, చదవడమే తెలుగు భాషా వ్యాప్తికి ముఖ్యమని మన పాలకులు భావిస్తున్నారు. దీనిపైనే ప్రాథమికంగా దృష్టి పెడుతున్నారు. ప్రపంచీకరణలో అవకాశాలూ మెండుగా ఉంటున్నాయి. నన్నయ, తిక్కన, వేమన సాహిత్యాల గురించి, పురాణాల గురించి చెప్పి ఇదీ మన సంస్కృతి అని చెప్పినా వినిపించుకునే స్థితిలో నేటి తరం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా భాషను ఆర్థికరంగంలో ఎలా అభివృద్ధి చేసుకోవాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. భాషాభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ భాషలో చదువుకున్న వారికి ఉపాధి కల్పించాలి. తెలుగులో చదువుకున్న వారు కూడా ఆంగ్లం వంటి ఇతర భాషల్లో చదువుకున్న వారితో పోటీ పడగలిగే స్థాయి వచ్చినప్పుడు భాషా వికాసం జరుగుతుంది. ఇంట్లో మాట్లాడటానికి, చలనచిత్రాలు చూడటానికి, సంగీతం వినడానికి మాత్రమే భాషను వెచ్చిస్తే సరిపోదు. మాతృభాష ద్వారా నాకు మంచి ఉద్యోగం వచ్చింది అనే తృప్తి యువతలో తీసుకురాగలిగితే భాష ఎప్పటికీ కనుమరుగు కాదు. ఇందుకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి. వసతులు కల్పించాలి. సాంకేతిక వనరులు అభివృద్ధి చేయాలి. అప్పుడు భాష ద్వారా ఉత్పాదకత పెరుగుతుంది. సాంస్కృతికంగానూ అభివృద్ధి చెందుతుంది.
భాషను కాపాడుకోవడంలో సాంస్కృతిక, సంప్రదాయ కోణాల్నీ పరిగణనలోకి తీసుకోవాలి కదా! లేకపోతే అందులో ఇమిడి ఉండే నైతిక, వైద్య, సామాజిక విలువలు కొత్తతరానికి అందేదెలా?
భాషాపరంగా వచ్చే సాంస్కృతిక, వారసత్వ సంపదలను రక్షించుకోవాల్సిందే. వాటిని భావితరాలకు అందించాల్సిందే. అయితే, వీటికే పరిమితం చేసి...  సాంకేతికంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ఉపయోగపడే భాషగా దాన్ని వినియోగించుకోకపోవడం మంచిది కాదు. ఫ్రెంచ్‌ సామాజిక శాస్త్రవేత్త పియర్రీ బోర్‌డియూ ‘భాషాపరమైన మార్కెట్‌’ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. దీని ప్రకారం... ఒక భాష వల్ల ఒనగూరే ప్రయోజనాలను బట్టి ప్రజలు ఆయా భాషలను ఎంచుకుంటారు. కానీ, ప్రస్తుతం   ప్రజలు అవకాశాలను పెంచుకోవడం, అభివృద్ధి చెందడం కోసమే ప్రత్యేకంగా కొన్ని భాషలను ఎంచుకుంటున్నారు. ఈ విపణిలో మన భాషా పోటీపడాల్సిందే. 
భాషా వికాసానికి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలేంటి? 
మన తెలుగు రాష్ట్రాల్లో భూములు అమ్ముకుని అయినా పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదివించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆంగ్లం మీద మోజు కన్నా తెలుగులో చదివితే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న ఆలోచనే వారితో అలా చేయిస్తోంది. అదే తెలుగులోనూ ఉద్యోగాలు పుష్కలంగా ఉంటాయన్న భరోసా ప్రభుత్వం కల్పిస్తే అందరూ భాషను ప్రేమిస్తారు. నిజ జీవితంలో భాష ఉపయోగపడాలి. అప్పుడే అది సాంస్కృతికంగానూ అభివృద్ధి చెందుతుంది. భాషను లాభదాయక వ్యవహారంగా మార్చాలి. దాని వ్యాప్తికి కొత్త అవగాహనతో సంస్కరణలు, పెట్టుబడులు పెట్టాలి. ఫ్రాన్స్‌లో అన్ని రంగాల్లోనూ ఫ్రెంచే ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడా ఆంగ్లం ఉన్నా... ఆ భాషపై ఆధారపడే పరిస్థితి మాత్రం ముమ్మాటికీ లేదు.
ఆర్థిక కోణంలో భాషనెలా విస్తరించాలి?
ఓ చిన్నగ్రామంలో అనేక రకాల ఉపాధి అవకాశాలు, వృత్తులు ఉంటాయి. కుట్టుపనీ ఓ వృత్తే. అయితే, ఆ వృత్తిని నేర్చుకునేందుకు తెలుగులో పుస్తకం దొరుకుతుందా? సరిగ్గా ఇక్కడే భాషను, మానవ వనరులను సమ్మిళితం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చు. తెలుగులో శిక్షణ ఇవ్వడం ద్వారా మంచి అవకాశాలు కలిగేలా చూడాలి. వడ్రంగి, కార్‌ మెకానిక్‌లు కూడా భాషపై ఆధారపడాలి. ఇలాగే, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఒక ఎలక్ట్రీషియన్‌ను తీసుకుంటే, అతనికి సరైన శిక్షణ ఉండదు. అలాంటి వారికి తెలుగులో శిక్షణ ఇవ్వగలగాలి. టెక్నికల్‌ మాన్యువల్స్‌ అన్నీ తెలుగులో చేయాలి. అవసరమైతే ఆంగ్ల పదాలను ఉపయోగించాలి. అవి ప్రాథమికంగా మాత్రమే ఉండాలి. ఏ భాషలో అయినా వ్యవస్థ అభివృద్ధి చెందాలి. పారిశ్రామిక, విద్యా విధానాల్లో భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫ్రెంచి పరిశ్రమలు ఈ పనే చేస్తున్నాయి. మన ఐటీ శిక్షణ ఉన్నంత గొప్పగా కిందిస్థాయిలో సిబ్బంది లేరు. మానవ వనరుల అభివృద్ధిలో విద్య పాత్ర ఉండట్లేదు. మన భాష ద్వారానే యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచాలి. దీనివల్ల భాష బతుకుతుంది. మనదేశంలో మాదిరిగానే యూరోపియన్‌ దేశాలకూ ఆంగ్ల ఒత్తిడి ఉంది. కానీ, అవి ఆ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నాయి.
ఆంగ్లం రావడంవల్లే భారత్‌ ఐటీలో గొప్పగా ఉందని చెబుతున్నారు కదా?
కేవలం ఐటీ కోసమే ఆంగ్లంలో చదువుకోవాలా? కొంతమంది కోసం భాషను వదులుకోవడాన్ని మీరు సమర్థిస్తారా? ఆంగ్లం నేర్చుకోవడంవల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు సంపాదించే అవకాశం ఉంటుంది. అది కాదనలేని విషయం. అయితే, మన విద్యావ్యవస్థ తప్పుదారుల్లో నడుస్తోంది. ఐటీ కాకుండా బతకడానికి ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. ఆంగ్లం మీద వ్యామోహంతో తెలుగు విద్యార్థులు వెళ్తున్నారు. చివరికి తెలుగు, ఆంగ్లం రెండిటి మీదా సరైన పట్టు లేకుండా మిగిలిపోతున్నారు. ప్రపంచమంతా ‘అందరికీ విద్య’ నినాదంతో ముందుకు వెళ్తుంటే మన వాళ్లు మాత్రం ‘అందరికీ ఆంగ్లం’ నినాదంతో వెళ్తున్నారు. భాష, విద్య, ఉపాధి... ఈ త్రికోణంపై అవగాహన రావాలి. యూరప్‌ దేశాల్లో సొంత భాషతో పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు యువత. భాష విషయంలో ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఒక భాష మాట్లాడే వ్యక్తిని ఆ భాషీయుడిగానే కాదు, ఉత్పత్తిదారుడిగా చూడాలి. భాష ఆధారంగా పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టాలి. అన్ని రంగాల్లోనూ సొంత భాషలో కొత్త కొత్త పుస్తకాలు తీసుకురాగలిగితే భాషాభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. 
పారిశ్రామిక, విద్యావిధానాల్లో భాషకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అది ఎలా ఉండాలన్నది మీ ఆలోచన?
ఇక్కడ అతి పెద్ద సమస్యేంటంటే, వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మానవ వనరుల అవసరాలను తీర్చే విద్యా ప్రణాళిక కొరవడటం - విద్య, శిక్షణ కార్యక్రమాల రూపకల్పనలో విఫలమవడం. ప్రస్తుతం జాతీయ నైపుణ్య శిక్షణా మిషన్‌ కొద్దిమేరకు దీనిపై పనిచేస్తోంది. వాస్తవానికి మన దగ్గర ఎక్కువ మంది ప్రాథమిక దశలో స్థానిక భాషల్లోనే చదువుకుంటున్నారు. కాబట్టి, ఆయా భాషల్లోనే సాంకేతిక శిక్షణ ఇవ్వడం మంచిది. అవసరాన్ని బట్టి కొన్ని ఆంగ్ల పదాలను వాడుకుంటూనే, స్థానిక భాషల్లో సంపూర్ణ నైపుణ్య శిక్షణా వ్యవస్థను రూపొందించుకోవాలి. దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. మనకు ఓ అంచెల వారీ వ్యవస్థ ఉండాలి. అది వివిధ దశల్లోని వారి నైపుణ్యాలను వృద్ధి చేసే ఉపకరణాలు, శిక్షణ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించాలి. ఉదాహరణకు ఆ దశలు... ప్రాథమిక అక్షర జ్ఞానం కలవారు, మూడో తరగతి చదివిన వారు, ఏడో తరగతి ఉత్తీర్ణులు, పదో తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్‌ పూర్తి చేసిన వారు, పట్టభద్రులు.


ఉత్పాదకత భాషను మెరుగుపరచాలి. అప్పుడు భాషకు గుర్తింపు వస్తుంది. గౌరవం పెరుగుతుంది. అలా చేస్తే, తెలుగు స్థాయిని పెంచవచ్చు. అప్పుడు అందరూ తెలుగు చదవడం మొదలుపెడతారు.


మాతృభాషలను సమర్థంగా కాపాడుకుంటున్న యూరప్‌ దేశాలేవి?
ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీలాంటి దేశాల్లో ఒకే జాతీయ భాష ఉంది. స్విట్జర్లాండ్, బెల్జియం, స్పెయిన్‌ లాంటి దేశాల్లో అనేక భాషలు మాట్లాడతారు. ఆయా భాషలు ఆయా దేశాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి దోహదం చేశాయి. ఆ దేశాల అనుభవాల నుంచి మనం ఏం నేర్చుకోగలం అంటే... భాషాభిమానం ఉండటం ముఖ్యమైనా, బలమైన కాలమాన పరిస్థితులకు ఎదురొడ్డి నిలవడానికి అది సరిపోదు. గుర్తించదగిన రీతిలో ఒక భాషలో మూలధన సృష్టి జరుగుతోందంటే, ఆ భాష భవిష్యత్తు పదిలమే. అది ఎలాంటి భవిష్యత్తు అని అడగవచ్చు. ఆ భాష ఎలా వ్యవహారంలో ఉందన్నదే దానికి మూలం. ఉదాహరణకు ఫ్రాన్స్‌లో వైన్‌/ వెన్న ఉత్పత్తిని తీసుకుంటే, వారు స్థానిక సంస్కృతి, జ్ఞానంపైనే ఆధారపడతారు. ఆంగ్ల భాషతో దీనికి సమస్య లేదు. మరోవైపు, కొత్తగా వస్తున్న ఆంగ్ల పదాలకు ఫ్రెంచి మాటలను తయారు చేయడానికి ఫ్రెంచి అకాడమీ పని చేస్తోంది. కొన్నిసార్లు అందులోని భాషావేత్తలు చాలా తెలివిగా హైబ్రిడ్‌ (సంకర) పదాలు సృష్టిస్తున్నారు. 
ఉదాహరణకు ‘ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ’ అనే పదానికి బదులుగా ఫ్రెంచ్‌ పదంలా అనిపించే ‘ఇన్‌ఫర్మాటిక్‌’ అనే పదాన్ని తీసుకొచ్చారు. దాన్నే అందరూ వాడుతున్నారు. ఈ-మెయిల్‌కు బదులుగా ‘కొరియల్‌’ (ఫ్రెంచ్‌లో దీనికి ఉత్తరం అని అర్థం) అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. పదసృష్టిలో వాళ్లు అనుసరిస్తున్న విధానం ఏంటంటే, వీలైనంత వరకు స్థానిక భాష ఉచ్చరణకు అనుగుణంగా ఉంచడం, సులువైన పదాలను వాడుకలోకి తేవడం, అవసరమైతే ఆంగ్ల పదాల సంకరంతో కొత్త మాటలను పుట్టించడం. 


కావ్యాలు, నాటకాలు, పద్యాలతో పాటు సాంకేతిక రచనలు కూడా ఓ సంస్కృతి. విద్యుత్‌ సంబంధిత పని, మేస్త్రీ పనుల్లోని  సాంకేతిక నైపుణ్యం... వైద్యం, ఇంజినీరింగ్‌లకు తీసిపోదు. కాబట్టి, ఆ నైపుణ్యాన్ని మాతృభాషలో అందించే పని సాహిత్యకోణంలో చాలా ముఖ్యమైనది. భారతీయ భాషల్లో సాంకేతికాభివృద్ధి ఒకరకంగా సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది పలుకుతుంది. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానికంగా ఉంటూనే సొంతకాళ్లపై నిలబడగలిగిన శక్తినిస్తుంది. పారిశ్రామిక సృజనాత్మకతకు బాటలు వేస్తుంది.

- కన్నెగంటి అనూరాధ


భవిష్యత్తు లక్ష్యాలేంటి?
ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపై అందరిలో అవగాహన పెంచడానికి తెలుగులో పుస్తకాలు  ప్రచురించాలన్న ఆలోచన ఉంది. ప్రస్తుతం దానిపైనే పని చేస్తున్నా. తెలుగుకు బ్రాండింగ్‌ రావాలి. తెలుగుకు సంబంధించిన పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సమాచార కేంద్రం ఉండాలి. తెలుగు భాషా పుస్తకాలకు తమిళం తరహాలో గౌరవం తీసుకురావాలన్నదే నా ఉద్దేశం. మన భాషతో అనుసంధానమయ్యే సాంస్కృతిక సంపదలన్నీ లభ్యమయ్యేలా హైదరాబాద్‌లో ఓ హబ్‌ ఏర్పాటు చేయాలి. భాషలో రకరకాల ఉపకరణాలను అభివృద్ధి చేయడం ద్వారా భాషను ఎక్కువ కాలం రక్షించుకునే అవకాశం ఉందని భావిస్తున్నా. భాష ద్వారా మానవ వనరుల అభివృద్ధి అనే విషయంలో సరిగ్గా వ్యవహరిస్తే తెలుగుకు అంతర్జాతీయ స్థాయి వచ్చే అవకాశం ఉంది. సెనగల్, మొరాకో, ఆఫ్రికా దేశాల ప్రజలు హిందీ నేర్చుకుంటున్నారు. అది తెలుగుకీ విస్తరించాలి. తెలుగులోనే చదివి పెద్ద పారిశ్రామికవేత్తలుగా మన పిల్లలు ఎందుకు మారకూడదన్నదే నా ప్రశ్న. దానికి సమాధానం వెతికే ప్రయత్నంలో ఉన్నా.


గణితం నుంచి తెలుగు వరకూ... 
విదేశాల్లో ఉంటూ తెలుగుపై ఇంతటి అభిమానాన్ని ఎలా పెంచుకోగలిగారని కన్నెగంటి అనూరాధను అడిగితే... ‘మా అమ్మే స్ఫూర్తి. అమ్మ వాళ్ల కుటుంబంలో కిందటి తరాల ఆడవాళ్లు కూడా చాలా విద్యావంతులు. అమ్మకు పదేళ్లున్నప్పుడు, విజయవాడలో వాళ్లింట్లో విశ్వనాథ సత్యనారాయణ గారు అద్దెకుండేవారట. ఆయన వెళ్లిపోతూ తన పుస్తకాలను వదిలేసి వెళ్లారు. వాటన్నింటినీ అమ్మ చదివింది. తర్వాత చలం, లత, రంగనాయకమ్మల సాహిత్యం. ఆ భాషాభిమానంతోనే నాకు, ఇద్దరు చెల్లెళ్లకు తెలుగును దగ్గర చేసింద’ని చెబుతారు.  అనూరాధ తండ్రి వైద్య కళాశాలలో ఆచార్యులు. గుంటూరు, వరంగల్, హైదరాబాదుల్లో పని చేశారు. 


భాషలో వివిధ ఉపకరణాలు... అంటే?
యూరోపియన్లకు తెలుగు బోధించేటప్పుడు పదకోశం విషయంలో ఇబ్బంది పడ్డా. మనకంటూ గుర్తించదగిన సరైన పదకోశం లేదు. అందుబాటులో ఉన్న నిఘంటువుల్లో ఓ పదాన్ని వెతికితే కేవలం దాని అర్థాల జాబితా కనిపిస్తుంది. ఆ పదాన్ని ఏ సందర్భంలో ఎలా వాడాలన్నది సంక్లిష్టంగా ఉంది. బీహెచ్‌ కృష్ణమూర్తి 1968లో ఆంగ్లంలో ప్రచురించిన తెలుగు భాషావ్యాకరణం మినహా ఈ 45 ఏళ్లుగా భాషాభ్యాసం చేసేవారికి కొత్తగా ఇంకో పుస్తకమే లేదు. మాతృభాష మాత్రమే తెలిసిన వారికి నిత్యజీవితంలో ఉపయోగపడే సాహిత్యం లేదు. ఆయా రంగాల్లో ఆయా విషయసూచికల వారీగా పుస్తకాలు ప్రచురించి తెలుగు అకాడమీ గొప్ప ప్రయత్నం మొదలుపెట్టింది కానీ, ప్రోత్సాహం లేక ఆ పని ముందుకు సాగలేదు. భాషా ఉపకరణాలు, మౌలిక వసతుల విషయానికొస్తే... ఉదాహరణకు ఓ ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో కొత్తగా వచ్చిన సాంకేతికతపై, యంత్రపరికరాలపై కార్మికులకు పర్యవేక్షకులు (సూపర్‌వైజర్లు) అవగాహన కల్పించడంతో శిక్షణనివ్వాల్సి వస్తుంది. అయితే, అందుకు ఉపకరించే సాంకేతిక పదాలు తెలుగులో లేవు. కాబట్టి విషయాన్ని తెలుగు కార్మికులకు ఎలా చెప్పాలో వారికి అర్థం కాదు. దాంతో బండిని అలా నడిపిస్తుంటారు. తెలుగు పదకోశాలు, అనువాదాలు చేసేవారు ఈ పరిశ్రమలతో అనుసంధానమవరు. వారికి భాషపై శిక్షణనివ్వరు. ఇలాంటి విషయాలను చర్చించేందుకు ప్రత్యేక సంఘం అంటూ ఏమీ లేదు. ఉత్పాదకతకు భాష చాలా ముఖ్యమని ప్రజలు భావించట్లేదు. సిబ్బంది పనితీరుపై, ఉత్పత్తి నాణ్యతపై భాష ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో భాషాభివృద్ధికి సంఘటితంగా, ప్రణాళికాబద్ధంగా పని చేసే వ్యవస్థ కావాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం