తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

వారిజ నయన నీవాడను నేను!!

  • 1665 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆచారం షణ్ముఖాచారి

  • ఆంధ్రాబ్యాంకు విశ్రాంత ఉన్నతాధికారి
  • హైదరాబాదు
  • 9492954256

సంగీత సాధన ఎలా చెయ్యాలంటే- ‘‘ఏ వ్యక్తిగత ప్రయోజనం కోసమో, లబ్ధి కోసమో కాక మానసికోల్లాసానికి, స్వీయ తృప్తిని పొందడానికి మాత్రమే పరిమితం చెయ్యాలని మా గురువుల ఉవాచ. ఉపాధిని, ప్రతిఫలాన్ని ఆశించని విద్య కళాత్మకంగా, శోభాయమానమై విరాజిల్లుతుందని నా సంగీత జ్ఞానం నాకు చెప్పిన మొదటి పాఠం’’ అంటారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అచ్చంగా ఇలాగే సాధన చేశాడా కుర్రాడు. తెలుగుతో మమేకమైపోయిన కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతా చేస్తే ఆ అబ్బాయి తెలుగువాడు కాదు. అసలు భారతీయుడే కాదు. మలేసియాలో పుట్టిపెరిగిన చైనీయుడు. అయినా మన కీర్తనలను ఆపోశన పట్టాడు. ప్రదర్శనలిచ్చి సంగీతప్రియుల మన్ననలూ పొందాడు. అంతేనా... తన దేశంలో ఔత్సాహికులకు కర్ణాటక సంగీతంలో శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఇంతకూ అతనెవరంటే... చాంగ్‌ చియు సెన్‌. సంగీత కళాశిఖామణి, పద్మవిభూషణ్‌ డి.కె.పట్టమ్మాళ్‌ ఆ యువకుడికి పెట్టిన పేరు సాయి మదన మోహన కుమార్‌. ఇటీవల హైదరాబాదుకు వచ్చిన చాంగ్‌తో ‘తెలుగు వెలుగు’ముఖాముఖి...
తె.వె.: కర్ణాటక సంగీతం పట్ల ఎలా ఆకర్షితులయ్యారు?
చాంగ్‌: అసలు ‘భారత్‌’ అనే మూడక్షరాలే సంగీతానికి మూలాధారాలైన భావం, రాగం, తాళాల సంగమం అని నా భావన. ప్రపంచ సంగీత చరిత్రలో భారతీయ సంప్రదాయ సంగీతానికి, అందులోనూ కర్ణాటక సంగీతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది సంప్రదాయ మూలాలను పరిరక్షించుకుంటూ గాత్ర సంగీతానికి పెద్దపీట వేస్తుంది. భావోద్వేగాలతోనూ ముడిపడి ఉంటుంది. భావగర్భితమైన ఈ గాత్రసంగీతం నాకిష్టం. ప్రాచీన చైనా సంప్రదాయాలకు కట్టుబడిన హక్కా జాతి చైనీయుణ్ని నేను. మా కుటుంబం మలేసియాలో స్థిరపడింది. మా నాన్నగారికి సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. నాకైతే ప్రాణమే. మనసుపెట్టి వినేవాణ్ని. పక్షుల కిలకిలారావాలు, లయబద్ధంగా వర్షించే తొలకరి చినుకులు... అన్నీ ప్రకృతి ప్రసాదించిన శ్రుతిలయలేనని అనిపించేది. నాకు దైవచింతన ఎక్కువ. ముఖ్యంగా మా దేశంలో జరిగే పుట్టపర్తి సత్యసాయిబాబా భజన సమావేశాల్లో పాల్గొనేవాణ్ని. కర్ణాటక సంగీత సాధనకు ప్రేరణ ఈ సాయి భజనలే.
సత్యసాయి భక్తులా మీరు?
నాకు పదకొండేళ్ల వయసున్నప్పుడు మా కుటుంబానికి సన్నిహితురాలైన ఓ సాయి భక్తురాలు, మా నాన్నగారికి పుట్టపర్తి సత్యసాయి పటాన్ని ఇచ్చింది. దాన్ని ఇంట్లో గోడకు తగిలించారాయన. ఓసారి ఎందుకో నాన్నగారు సత్యసాయిబాబా పుస్తకం కొని చదివారు. తర్వాత నన్ను స్థానిక సాయి సేవాశ్రమానికి తీసుకుని వెళ్లారు. అలా భగవాన్‌ సత్యసాయి ఉద్యమం వైపు ఆకర్షితుడనయ్యాను. సెలవుల్లో సేవాశ్రమంలో జరిగే భజనల్లో పాల్గొనేవాణ్ని. ఎస్‌.ఎన్‌.నచ్చిముత్తు అనే ఆయన మా నాన్నగారిని ఒప్పించి నన్ను పుట్టపర్తికి తీసుకొచ్చారు. భారత్‌కు రావడం అదే మొదటిసారి. మలేసియా తిరిగి వెళ్లాక సేవాశ్రమంలో పాటలు పాడుతుండేవాణ్ని. మళ్లీ 2001లో పుట్టపర్తికి వచ్చి నెలరోజులున్నాను. ఆ తర్వాత అక్కడ ప్రదర్శన కూడా ఇచ్చాను.
సంగీత సాధన ఎప్పుడు ప్రారంభించారు?
మలేసియాలోనే ఉండే శాంతి జగదీశన్‌ దగ్గర భజన సంగీత పాఠాలు నేర్చుకున్నాను. ఆమే నా మొదటి గురువు. ‘ఓంకారం’లోంచే సప్తస్వరాలు ఉద్భవించాయని ఆమె చెప్పేవారు. భారతీయ వేదశాస్త్రం నాదమయం అనేవారు. అయితే, భజన సంగీతం నేర్చుకుంటున్నప్పుడు భాషోచ్చారణ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. స్వచ్ఛత లోపించిన ఉచ్చారణ వల్ల గమకాలు పలకలేక పోయేవాణ్ని. దాంతో మలేసియాలోని బ్రీక్‌ఫీల్డ్స్‌లో ఉన్న విజయలక్ష్మి కులవీరసింగం దగ్గర కర్ణాటక సంగీత మౌలిక సూత్రాలను నేర్చుకునే ప్రయత్నం చేశాను. అలా ఓ ఏడాది గడిచింది. తర్వాత తనతో భారత్‌కు వచ్చి కర్ణాటక సంగీతంలో మెలకువలు నేర్చుకోమని సలహా ఇచ్చారావిడ. పాఠశాల చదువయ్యాక నన్ను ఇక్కడికి పంపేందుకు మా నాన్నగారు ఒప్పుకున్నారు. అలా సంగీత సాధన కోసం తొలిసారి 2002 మార్చిలో చెన్నైకి వచ్చాను.
సంగీత శిక్షణ పొందడానికి ఇక్కడ చేసిన ప్రయత్నాలు?
చెన్నైలో మొదటిసారి ఇ.గాయత్రి వీణ కచేరి విన్నాను. వీణాపాణి సరస్వతీదేవి చిత్తరువు గుర్తుకొచ్చింది. ఆ వాద్య సంగీతం నా హృదయాన్ని తాకింది. చైనాలో హన్‌ వంశ పాలనాకాలం నుంచే ‘వీణ’ వాడుకలో ఉంది. దాన్ని నేర్చుకోవాలనిపించింది. కల్పక్కం స్వామినాథన్‌ శిష్యరికం చేశాను. అయితే కొన్ని భరతనాట్య ప్రదర్శనలను చూశాక నాట్యం మీద మనసు పారేసుకున్నాను. ఉషా శ్రీనివాసన్‌ దగ్గర నెలపాటు భరతనాట్యాన్ని నేర్చుకున్నాను. ఇంతలో నా వీసా గడువు తీరిపోవడంతో మలేసియా వెళ్లిపోయాను.
మళ్లీ సంగీతంలోకి ఎప్పుడొచ్చారు?
మలేసియాలో ఉన్నానన్న మాటే కానీ, నా మనసంతా చెన్నై వైపే. ఇంకో ఆర్నెల్లు అక్కడ ఉండి వస్తానని నాన్నగారికి చెప్పాను. ఆయన ఒప్పుకున్నారు. 2004లో మళ్లీ చెన్నై వచ్చి, భరతనాట్యం తరగతులకు హాజరయ్యా. క్రమేణా నాకు నాట్యం కంటే అందులో వినిపించే సంగీతం బాగుందనిపించేది. దీన్ని గమనించిన ఉషా శ్రీనివాసన్‌, నాకు సంగీతం నేర్పేందుకు ఇద్దరు ఉపాధ్యాయుల్ని నియమించారు. విదేశీయుణ్ని కావడంతో వాళ్లు పారితోషికం పెద్ద మొత్తంలో ఆశించేవారు. ఒక తరగతి శిక్షణకు రూ.250 రుసుమైతే నా దగ్గర రూ.1000 వసూలు చేసేవారు. దాంతో తెచ్చుకున్న డబ్బంతా మూడు నెలల్లోపే అయిపోయింది. చెబితే నమ్మరు... అప్పట్లో నా దగ్గర రూ.150 మాత్రమే మిగిలాయి. ఇంతచేసీ వాళ్లు నాకు నేర్పింది స్వల్పమే!
మరి సాధన ఆపేశారా?
నిరాశ పెరిగిపోయింది. మలేసియా వెళ్లిపోదామని నిశ్చయించుకున్నాను. ఆ బాధలోనే ఓ రోజు అడయార్‌లోని నా గదిలో అన్యమనస్కంగా తిరుగుతున్నాను. వాగ్దేవికి నా మీద దయలేదేమో అనిపించి, గోడకు తగిలించి ఉన్న సరస్వతీదేవి చిత్తరువుతోపాటు సత్యసాయి సాహిత్యాన్నీ చింపి విసిరేశాను. ఏకధాటిగా ఏడ్చాను. అది నిండు వేసవి. వేడిగాడ్పులు వీస్తున్నాయి. ఆ క్షణంలో కిటికీలోంచి బలమైన గాలి వీచింది. చిరిగిపోయిన వాగ్దేవి చిత్తరువును నాకు దగ్గరగా చేర్చింది. దాంతోబాటు ఓ ‘సంగీత దర్శిని’ పుస్తకం కూడా రెపరెపలాడుతోంది. ఒళ్లు జలదరించింది. వాగ్దేవికి నమస్కరించి, మనసులోనే క్షమాపణలు వేడుకుంటూ ఏడ్చేశాను. పక్కన పుస్తకంలో చెన్నైలో ఉండే సంగీత విద్వాంసుల చిరునామాలు తెలిపే పుట కనిపిస్తోంది. ‘సంగీతం దైవత్వం’ అన్న బాబా మాటలు గుర్తుకొచ్చాయి. అంతా భగవదేచ్ఛ అనుకుంటూ ఆ పుటలో మూడుపేర్లు గుర్తుపెట్టాను.
ఎవరు వాళ్లు? తెలిసిన వాళ్లా?
మొదటి పేరు ‘భారతరత్న’ ఎంఎస్‌ సుబ్బులక్ష్మిది. రెండో వ్యక్తి ‘పద్మవిభూషణ్‌’ డి.కె.పట్టమ్మాళ్‌. మూడో ఆయన వేదవల్లి రామస్వామి. నిజానికి వీళ్లెవరో అప్పట్లో నాకు తెలియదు. ఏదో దైవికంగా అలా గుర్తుపెట్టాను. సుబ్బులక్ష్మిగారి కోసం టెలిఫోనులో ప్రయత్నించాను. ఇంకెవరో మాట్లాడారు. ఆమె వృద్ధాప్యంలో ఉన్నారనీ, కలవడం వీలుపడదనీ జవాబిచ్చారు. పట్టమ్మాళ్‌ గారికి ఫోను చేస్తే, నా అదృష్టం కొద్దీ ఆవిడే మాట్లాడారు. ‘‘మలేసియాలో ఉండే చైనీయుణ్ని. కర్ణాటక సంగీతం నేర్చుకునేందుకు చెన్నై వచ్చాను’’ అని చెప్పాను. వచ్చి కలుసుకోమన్నారు. అందుకు శుభఘడియ కూడా ఆమే సూచించారు. ఈవార్తను ఉషా శ్రీనివాసన్‌ చెవిన వేశాను. ఆమె ఆశ్చర్యపోయారు. అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పారు. నా దగ్గర డబ్బు లేకపోవడంతో నాకు భోజనం పెట్టించి, కొంత పైకం కూడా ఇచ్చి పట్టమ్మాళ్‌ గారి దగ్గరికి పంపించారు.
పట్టమ్మాళ్‌ కలిశారా మరి?
కొట్టూరుపురం వేలయ్యన్‌ వీధిలో ఉన్న వారి ఇంటికి అద్దె సైకిలు మీద వెళ్లాను. విశాలమైన స్థలంలో, పెద్ద ప్రహరీ మధ్యలో మూడు వరస ఇళ్లున్నాయి. అందులో మొదటిది పట్టమ్మాళ్‌ గారిది. మిగిలినవి ఆవిడ కుమారులవి. విశాలమైన ఆ ఆవరణలో 85 ఏళ్ల ఓ పెద్దాయన టెన్నిస్‌ ఆడుకుంటున్నారు. ఆయన ఈశ్వరన్‌. పట్టమ్మాళ్‌ గారి భర్త. నేను కర్ణాటక సంగీతం తొలి మెట్టు మీదే ఉన్నట్టు నా మాటల ద్వారా గ్రహించారాయన. ‘వృద్ధాప్యంలో ఉన్న పట్టమ్మాళ్‌ పాఠాలు చెప్పలేరు, ఇంకెవరి దగ్గరికైనా వెళ్లు’ అన్నారు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న పట్టమ్మాళ్‌ స్వయంగా నన్ను లోపలికి పిలిచారు.
శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారా?
ఆ ఇంట్లో ఒక్కో అడుగు వేస్తుంటే అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. ఆమె కాళ్లమీద పడి భోరున ఏడ్చేశాను. ఆమె కూడా కాసేపు మాట్లాడలేక పోయారు. తర్వాత సంగీతం గురించి అడిగారు. వర్ణాల వరకు నేర్చుకున్నానని చెప్పాను. ముత్తుస్వామి దీక్షితార్‌ కృతి ‘మహా గణపతిం మనసా స్మరామి’ పాడి వినిపించాను. ఆమె కళ్లలో నీళ్లు నిండాయి. నేను సత్యసాయి భక్తుడినని చెప్పినప్పుడు చాలా సంతోషించారు. పూర్తిస్థాయి సంగీతాన్ని అభ్యసించేందుకు కనీసం మూడు నెలలు కష్టపడాలని చెప్పి, వాళ్లింట్లోనే నాకు భోజన ఏర్పాట్లు చేసిన మహాతల్లి పట్టమ్మాళ్‌. నామీద వాత్సల్యంతో గడువు దాటినా ఆవిడ శిక్షణ కొనసాగించారు. దాంతో వీసా పొడిగించుకుని అక్కడే ఉండిపోయాను.
పట్టమ్మాళ్‌ శిష్యరికం ఎలా అనిపించింది?
ఆవిణ్ని ‘మామి’ అని పిలిచేవాణ్ని. ‘సంగీతమనే సాగరంలో నేను ఓ నీటిబొట్టును మాత్రమే’ అని మామి అన్నప్పుడు, ఆవిడ ఎంత గొప్ప సంస్కారవంతురాలైన సంగీత కళానిధో తెలిసింది. ఓ రాగాన్ని ఆలపించాలంటే క్రియాశీలత ముఖ్యమని, పద ఉచ్చారణలో స్పష్టత ఉండాలని, భక్తిరసం ఉట్టిపడాలని, రాగాలాపనలో మమేకం కావాలని చెప్పారు మామి. ఆవిడ నాకు నేర్పిన మొదటి కీర్తన సంస్కృతంలోని ముత్తుస్వామి దీక్షితార్‌ ‘శ్రీ గురు గుహ తారయాశు మాం శరవణ భవ శ్రీ’. రెండోది త్యాగరాజ స్వామి తెలుగు కీర్తన ‘రామా నీపై తనకు ప్రేమబోదు సీతా’. అలా ఆవిడ దగ్గరే చాలా కాలంపాటు నేర్చుకున్నాను. వయసు మీదపడటంతో 2007లో నన్ను తన మనుమరాలు గాయత్రీ సుందరరామన్‌కు అప్పగించారు మామి. 2009 జులైలో ఆవిడ శివసాన్నిధ్యం చేరుకున్నారు. తర్వాత అభ్యాసాన్ని గాయత్రి దగ్గరే కొనసాగించాను.
పట్టమ్మాళ్‌ మీకు కొత్తగా నామకరణం చేశారు కదా?
మామి కుటుంబంలో నేనూ సభ్యుణ్ని అయిపోయాను. నన్ను దేవుడిచ్చిన మనవడిగా స్వీకరించారు ఆవిడ. ఓరోజు ‘నీకు ఏ రాగమంటే ఇష్టం’ అని అడిగారు. ‘మోహన’ రాగం అన్నాను. ‘నువ్వు సాయి భక్తుడవు కాబట్టి నీకు సాయి మదన మోహన కుమార్‌ అని పేరు పెడుతున్నాను’ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. తన కుమారులు శివకుమార్‌, లక్ష్మణకుమార్‌ పేర్లలోని ‘కుమార్‌’ను నా పేరు చివర జోడించానని చెప్పారు. ‘ఎవరైనా అడిగితే నీ పేరు మోహన కుమార్‌ అని, పట్టమ్మాళ్‌ మనవడినని చెప్పు’ అని ఆదేశించారు. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం.
తొలి ప్రదర్శన ఎప్పుడిచ్చారు?
‘శాంతి ఈశ్వరి జగన్మోహిని శాంతి నిలయే జగదీశ్వరీ’ అనే కీర్తన రాయించి, నా తొలి భజన గురువు శాంతి జగదీశ్వరన్‌కు గురుదక్షిణగా సమర్పించాను. అదే నా తొలి భజన కచేరీ. ఇక కర్ణాటక సంగీత ప్రదర్శన ఏమో 2004లో మామి ఏర్పాటు చేశారు. అప్పటికి నేను ఆవిడ దగ్గర పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టి నాలుగు నెలలే అయ్యింది. అయినా ఆ ప్రదర్శనకు వాద్యసహకారం అందించడానికి ప్రఖ్యాత వయోలిన్‌ విద్వాంసులు శ్రీరాంకుమార్‌, మృదంగ విద్వాన్‌ మనోజ్‌ శివలను పిలిపించారు మామి. వయోభారంతో ఆవిడ ప్రదర్శనకు రాలేకపోయారు. కానీ, తనకు ఫోను ద్వారా వినిపించమని శ్రీరాంకుమార్‌కు చెప్పారు. విన్నాక మామి చాలా సంతోషించారట. ఆ తర్వాత నేను మలేసియా వెళ్లాను. ఉద్యోగం చేసి కొంత సంపాదించుకుని, మళ్లీ చెన్నైకి వచ్చాను. సంగీతం నేర్చుకుంటూనే ప్రదర్శనలూ ఇచ్చాను. 2005 నవంబరులో షిర్డీలో జరిగిన 32వ జాతీయ సంగీత ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చాను. తర్వాత భారత్‌, మలేసియాల్లో చాలాచోట్ల ప్రదర్శనలు ఇచ్చాను. పురస్కారాలూ అందుకున్నాను. గతేడాది హైదరాబాదు రోటరీ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రఖ్యాత హిందుస్తానీ సంగీత విద్వాంసులు పండిట్‌ జస్రాజ్‌ చేతులమీదుగా ‘క్రాస్‌ కల్చరల్‌ అండర్‌ స్టాండింగ్‌’ పురస్కారం అందుకోవడం చాలా తృప్తినిచ్చింది.
పరభాషా విద్వాంసులు తెలుగు కీర్తనలు పాడేటప్పుడు ఉచ్చారణ అసంపూర్ణంగా ఉంటుంది కదా...!
మీరన్నది నిజమే! తమిళులు ‘ఎందరో మహానుభావులు’ కీర్తనను ‘ఎందరో మగానుభావులు’గా ఆలపిస్తారు. వ్యాకరణ విషయంలోనే కాదు, అర్థపరంగా కూడా అది లోపమే. కానీ, పట్టమ్మాళ్‌ తెలుగు భాషను స్వచ్ఛంగా పలికేవారు. తెలుగు వర్ణమాలలో ఉన్న హల్లులు... ముఖ్యంగా ‘స, శ, ష; ల, ళ; జ, ఝ’లను ఎలా పలకాలో; వాటి సంయోజ అక్షరాలను ఎలా ఉచ్చరించాలో కూడా నాకు నేర్పారు. భాషా ప్రయోగంలో స్వచ్ఛతను నేర్పారు. పట్టమ్మాళ్‌ కీర్తనలను వింటే, భాషోచ్చారణకు ఆవిడ ఎంత విలువిచ్చేవారో తెలుస్తుంది. అందుకే నా కీర్తనలూ భాషకు అపకీర్తి తెచ్చేలా ఉండవు. గురువులందరూ నాకు కృతుల అర్థాన్ని విడమరిచేవారు. ప్రతిపదానికీ అర్థం చెప్పేవారు. ఉచ్చరించడం వచ్చాక ఆ కృతిని ఎలా ఆలపించాలో నేర్పేవారు. దీని వల్ల హృదయంతో పాడగలిగాను. అలా పాడుతున్నప్పుడు తాదాత్మ్యం చెందేవాణ్ని. అందులో దైవత్వాన్ని వీక్షించగలిగాను. గాయకుడు అలా పాడినప్పుడే శ్రోతను భగవంతుడితో అనుసంధానం చేయగలడని మామి తరచూ చెప్పేవారు.
ప్రతి పదానికీ భావం తెలుసుకునేవారా?
అవును. కీర్తనల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అర్థం చేసుకోలేకపోతే, ఆ స్వరకర్తల భావోద్వేగాల్ని మనమెలా పలికించ గలుగుతాం? అందుకే కీర్తనల్లోని ప్రతీవాక్యం, వాక్యంలోని ప్రతీపదం భావం తెలుసుకుని తీరాల్సిందే. కీర్తన భావాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని, సరైన ఉచ్చారణతో పలకగలుగుతున్నానని అనిపించినప్పుడే దాన్ని పాడనిచ్చేవారు నా గురువులు.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఎవరంటే ఇష్టం?
వాళ్లలో ఎవరిని తక్కువచేసి మాట్లాడినా అది సంగీతానికే అవమానం. నాదోపాసన ద్వారా భగవంతుడి గురించి తెలుసుకోవచ్చునని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగరాజు. ఆయన తెలుగువాడు కావడం తెలుగు ప్రజల అదృష్టం. ఇరవైనాలుగు వేలకు పైగా దివ్య సంకీర్తనలను రచించి స్వరపరచిన మహనీయుడు ఆయన. ‘వాతాపి గణపతిం భజే’, ‘మహా గణపతిం మనసా స్మరామి’ కీర్తనలు వినని వాళ్లెవరైనా ఉంటారా? అవి ముత్తుస్వామి దీక్షితార్‌ సృష్టే కదా! ఇక శ్యామశాస్త్రి కామాక్షి ఉపాసకుడు. ఆయన అమ్మమీద తప్ప వేరొకరి మీద కీర్తనలు రచించలేదు. శ్యామశాస్త్రి స్వరపరచిన ‘హిమాచల తనయ’, ‘ఓ జగదంబ’, ‘హిమాద్రి సుతే పాహిమాం’ కృతులంటే నాకిష్టం.
మీరు బాగా ఇష్టపడే కీర్తనలు...
మోహన రాగంలో ‘రామా నిను నమ్మినా’, ‘మోహనరామ ముఖజిత సోమ ముద్దుగా బల్కుమా’, ‘ఎవరురా నిను వినా గతి మాకు’, ‘భవనుత నా హృదయమున రమింపుము బడలిక’ అనేవి ఇష్టం. ఇవి కాకుండా ‘నన్ను బ్రోవకను విడువను రామా (శంకరాభరణం)’, ‘అడుగు వరముల నిచ్చెను (ఆరభి)’, ‘వారిజ నయన నీవాడను నేను (కేదారగౌళ)’, ‘తనలోనే ధ్యానించి (దేవగాంధార)’, ‘శ్రీరామ జయరామ శృంగారరామా (మధ్యమావతి)’... ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో... మరెన్నో! తెలుగు భాష అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. అది చాలా మృదువుగా ఉంటుంది. గానానికి చాలా సౌలభ్యమైంది.
కర్ణాటక సంగీతాన్ని ఆదరించడంలో తమిళ, తెలుగు శ్రోతల మధ్య ఉన్న తేడాలు?
తమిళ శ్రోతలు సంగీతాన్ని ఆరాధిస్తారు, ఆదరిస్తారు. తమిళనాడులో ప్రతిరోజూ ఎక్కడో ఓచోట శాస్త్రీయ సంగీత కచేరీలు జరుగుతూనే ఉంటాయి. సాధారణంగా ఈ ప్రదర్శనలకు హాజరయ్యే శ్రోతలకు ఎంతోకొంత సంగీత పరిజ్ఞానం ఉంటుంది. గాయకులతోబాటు వీళ్లూ తాళం వేస్తూ ఉంటారు. తెలుగు శ్రోతలు కర్ణాటక సంగీతాన్ని అభిమానిస్తారు. అభినందిస్తారు. తెలుగువాళ్లు గొప్ప సంస్కారవంతులు. అందరూ మహానుభావులే... అందరికీ వందనాలు!
మలేసియాలో మీరు ఇప్పుడేం చేస్తున్నారు?
కర్ణాటక సంగీతాన్ని ప్రచారం చేస్తున్నాను. ఔత్సాహిక బాలబాలికలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాను. కచేరీలు నిర్వహిస్తున్నాను. అయితే మలేసియాలో కర్ణాటక సంగీత కచేరీలు చేయడం అంత సులభం కాదు. ఒక చైనీయుడు ఇతర దేశపు సంస్కృతిని తమదేశంలో ప్రచారం చేయడం అక్కడివారికి గిట్టదు. అయినా, నా ప్రయత్నం మానుకోను. ఆర్థికంగా నిలదొక్కుకుని... భారతీయ సంస్కృతిని అభిమానించే అన్నిదేశాల్లో కర్ణాటక సంగీతాన్ని వ్యాప్తి చేయాలన్నది నా అభిలాష.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి