తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

నిరాడంబరుడు... నిగర్వి

  • 64 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆర్‌.శాంతసుందరి

  • 9490933043

పిల్లల్ని భయపెట్టి చెప్పిన మాట వినేట్టు చేయడం, లేకపోతే గారాబం చేసి వాళ్లు ఆడించినట్టు ఆడటం, రెండూ తప్పే అన్నది మా నాన్న కొడవటిగంటి కుటుంబరావు గారి అభిప్రాయం. ఆదేశాలూ, ఉపదేశాలూ మనిషి వ్యక్తిత్వాన్ని కించపరుస్తాయనీ, స్వానుభవం నుంచీ, సొంత ఆలోచనల నుంచీ నేర్చుకునేదే వ్యక్తిత్వాన్ని తట్టి లేపుతుందనీ నమ్మేవారు. ఆయన నిరాడంబరుడు, నిగర్వి. తను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ చివరి దాకా కొత్త విషయాల ఆకళింపు ప్రయత్నంలోనే జీవించారు. కీర్తి ప్రతిష్ఠలకూ, ధనార్జనకూ ప్రాధాన్యం ఇవ్వని వ్యక్తి. ఆ గుణం వారసత్వంగానో, లేక నేర్చుకోవడం వల్లో నాకూ కొద్దో గొప్పో అబ్బిందనే అనుకుంటున్నాను.
అయితే, నాన్నలా విస్తృత అనుభవాన్ని విశ్లేషించుకుని వైవిధ్యభరిత రచనలు చేసే శక్తి నాకు లేదు. అందుకే అనువాదాలకే పరిమితమయ్యాను.
      ఇంట్లో పెద్దలు ఉపయోగించే భాషనే పిల్లలు నేర్చుకుంటారు. మద్రాసులో పుట్టి పెరిగి, పెళ్లి చేసుకుని దిల్లీ వెళ్లినా, హిందీలోనే అనువాదాలు ఎక్కువగా చేసినా, తెలుగు నుడికారం మీద పట్టు సాధించానంటే దానికి కారణం నా మాతృభాషకి దూరం కాకపోవడమే.
      అనువాదాలు చేసేప్పుడు వీలైనంత పొందికగా, సరళంగా రాయడం అనేది బహుశా మా నాన్న ప్రభావమే. సొంతంగా కొన్ని వ్యాసాలూ రాశాను. వాటిలో కూడా సూటిగా చెప్పడం, నిజాయతీగానూ క్లుప్తంగానూ రాయడమనేది కూడా నాన్న రచనల ప్రభావమేనేమో!
      నాన్న తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ, సమస్యల్లో చిక్కుకున్నవారి గురించి రాస్తూ పరిష్కారాలని పాత్రల ద్వారానే సూచించి వదిలేశారు. తన రచనలను పాఠకులు ఎంత త్వరగా చదవడం మానేస్తే అంత సంతోషిస్తానని ఆయన అనడంలో అర్థం, తను రచనల్లో చర్చించిన సమస్యలు త్వరగా సమసిపోవాలనే. ఆయన రచనల్లోని జీవిత సత్యాలనే కాకుండా, ఎటువంటి అలంకారాలూ లేని సరళ భాష, అద్భుత శిల్ప చాతుర్యమూ, అచ్చ తెలుగు నుడికారమూ ఈ తరం రచయితలకి స్ఫూర్తినిస్తాయి. అలాగే నాన్న రచనలు చదివే పాఠకులకి కూడా ‘మరోప్రపంచం’ ఎలాంటిదో తెలియజేసి వారిలో చైతన్యాన్ని నింపడం అనే బాధ్యతని నెరవేర్చడం సాధ్యమౌతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం