తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

అమ్మ భాషతోనే గెలిచా!

  • 636 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చిత్తులూరి మురళీకృష్ణ

  • హైదరాబాదు
  • 8008513084

రోణంకి గోపాలకృష్ణ సాధించారు.. తోడుగా నిలిచిన తెలుగు పరచిన వెలుగు బాటలో పయనించి విజయపతాకం ఎగరవేశారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ విద్యాలయాల్లో తెలుగులోనే చదువుకుని... తెలుగు సాహిత్యం ఐచ్ఛికాంశంగా తెలుగులోనే సివిల్స్‌ పరీక్షలు రాసి.. ముఖాముఖిలో కూడా తెలుగులోనే జవాబులిచ్చి... అఖిల భారతస్థాయిలో మూడో ర్యాంకు సాధించిన ఈ తెలుగుతేజంతో ‘తెలుగు వెలుగు’ మాట్లాడింది. వ్యక్తి సర్వతోముఖాభివృద్ధిలో అమ్మభాష పోషించే గణనీయమైన పాత్రను వివరిస్తూ గోపాలకృష్ణ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామని న్యూనత పడేవాళ్లకు నేను చెప్పదలచుకున్నదొకటే.. చదివేది ఎక్కడ అన్నది కాదు. ఇష్టంగా, కష్టపడి చదవడం ముఖ్యం. ఇవాళ చాలామంది పిల్లలు కాన్వెంటుల్లో చదువుతున్నారు. అక్కడి ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది డీఎస్సీ తదితర పరీక్షల్లో ఉత్తీర్ణులు కానివారే. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పే ప్రతి ఉపాధ్యాయుడూ టీటీసీ, డీఎస్సీ లాంటి అర్హతలున్నవారే. లక్షలమందిలో ఒక్కరుగా రాణించి ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తారు. అయినా సమాజంలో ప్రభుత్వ పాఠశాల అంటే ఎంతో చులకన. ఇక్కడ చదివే పిల్లలంటే ఆర్థికంగా లేనివాళ్లు అనే ముద్ర వేసేస్తున్నారు. ఇది మంచిది కాదు.
      నాకు చిన్నప్పటి నుంచి తెలుగు అంటే అభిమానం. ఒక్కమాటలో చెప్పాలంటే అదే నా ఊపిరి. తెలుగులోనే సివిల్స్‌ రాయాలనుకున్నప్పుడు చాలామంది అవమానించారు. ఎందుకోగాని, మనవాళ్లకి మనభాషంటేనే చిన్నచూపు! తెలుగులో మాట్లాడితే తక్కువస్థాయి వాడిగా చూస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆయా ప్రాంతీయభాషలకు ఇంతటి అవమానం జరగట్లేదు. ఇక్కడ మన రాష్ట్రప్రభుత్వాలూ మాతృభాషకు పెద్దపీట వేయట్లేదు. అందుకే గత కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ తెలుగు చదువుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కానీ, ప్రాథమిక విద్యలో తెలుగు తగ్గిపోతే భావితరాలకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి, విద్యావ్యవస్థలో మార్పునకు ప్రభుత్వాలు కృషి చేయాలి. తెలుగు మాధ్యమ పాఠశాలలను ప్రోత్సహించాలి. 
      నా నేపథ్యం, మా కుటుంబం ఎదుర్కొన్న సామాజిక బహిష్కరణ తదితరాలు మీరు వినే ఉంటారు. ఆ కష్టాలే నాలో కసిని పెంచాయి. అబ్దుల్‌ కలాం రాసిన ‘ద వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’ పుస్తకం అంటే చాలా ఇష్టం. దాన్ని చాలాసార్లు చదివాను. ఆయన పడ్డ కష్టాల ముందు నావి చాలా తక్కువ అనుకుంటూ ముందుకెళ్లాను. తెలుగులో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. వాటి ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. నా జీవితంలో అవి చాలా ఉపయోగపడ్డాయి. పిల్లలకు పుస్తకాలు చదవడం నేర్పిస్తే మంచిది. ఖాళీ సమయాల్లో చాలామంది సెల్‌ఫోన్లు పట్టుకుని వాటిలోనే లీనమైపోతున్నారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్యలోనే మగ్గిపోతున్నారు. ఆ పరిస్థితి నుంచి బయటపడాలి.  
ఓ ఉపాధ్యాయుడిగా గర్విస్తా
మాది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పురపాలక పరిధిలోని పారసంబ. నాన్న అప్పారావు, అమ్మ రుక్మిణమ్మ. వాళ్లతో పాటు చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లోకి వెళ్లాను. అయిదో తరగతి వరకు పారసంబలోనే చదువుకున్నా. ఆరు నుంచి పదోతరగతి వరకు బ్రాహ్మణతర్లలో చదివాను. పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ (ఎంపీసీ) పూర్తి చేశా. పశ్చిమగోదావరి జిల్లా దూబచర్లలో టీటీసీ శిక్షణ తీసుకున్నా. 2006 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యా. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం సిలగాంలోని జెడ్పీహైస్కూల్‌లో పనిచేశాను. ఏడేళ్లుగా రేగులపాడులో ఎస్జీటీగా పనిచేస్తున్నా. ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా బీఎస్సీ పూర్తి చేశా. అయితే, కలెక్టర్‌ కావాలన్నది నా చిరకాల లక్ష్యం. 
      ఇక ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సివిల్స్‌కు సిద్ధం కావడం ఏమీ కష్టం కాలేదు. ఉదయం, రాత్రి, సెలవు రోజుల్లో పరీక్షకు సన్నద్ధమయ్యేవాణ్ని. ఉపాధ్యాయ వృత్తి నాకు కలిసివచ్చింది. ఆర్థికంగా నన్ను ఆదుకుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి వారధిగా నిలిచింది. భావ వ్యక్తీకరణకు బోధన వృత్తి బాగా ఉపయోగపడింది. ఉపాధ్యాయ వృత్తిలో ప్రావీణ్యం పొందడం వల్లే చెప్పాల్సింది సూటిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడం నాకు అలవాటుగా మారింది. ఇది మెయిన్స్‌లో వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడంలో అక్కరకొచ్చింది. ఓ ఉపాధ్యాయుడిగా బడిలో రోజూ నేను ఆత్మసంతృప్తి పొందేవాణ్ని. పిల్లలకు అర్థమయ్యేలా పాఠం చెప్పేందుకు కష్టపడేవాణ్ని. ఎదుటివారి హావభావాలు గుర్తించి వారికి అర్థం అయ్యేలా బోధించేవాణ్ని. ముఖ్యంగా దృశ్య రూప బోధన ద్వారా పాఠ్యాంశాలను విద్యార్థులకు వివరించేవాణ్ని. అది విషయాన్ని జీవితంలో మర్చిపోకుండా చేస్తుంది. నేను ఎక్కడ పనిచేసినా పిల్లలకు బోధన ద్వారానే దగ్గర అయ్యేవాణ్ని. ఒత్తిడిని తట్టుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సింది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే. మార్కులు ఒక్కటే జీవితం కాదని అవగాహన కల్పించాలి. నాకైతే ఇంటర్‌లో 76 శాతం మార్కులే వచ్చాయి. అయినా సివిల్స్‌ సాధించగలిగాను కదా. 
ఆంగ్లంలో కనీస పరిజ్ఞానం చాలు
మనసులోని భావాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పేందుకు మాతృభాష ఎంతో ఉపయోగపడుతుంది. మనకు పూర్తిగా నైపుణ్యం లేని భాషను ఎంచుకుని అవస్థలు పడేకంటే వచ్చిన దానిలో ముందుకెళ్లాలనేది నా అభిమతం. తెలుగులో రాస్తే మనసులో ఉన్న దాన్ని ప్రభావవంతంగా చెప్పగలమని సివిల్స్‌లో తెలుగు మాధ్యమాన్నే ఎంచుకున్నా. మొదటి నుంచి తెలుగు సాహిత్యమంటే నాకు చాలా మక్కువ. అందువల్ల దాన్నే ఐచ్ఛికాంశంగా తీసుకున్నాను. తెలుగు మాధ్యమంలో రాయాలనుకునేవారికి పెద్దగా శిక్షణ వనరులు లేవు. దాంతో సొంతంగానే సన్నద్ధమవ్వాల్సి వచ్చింది. తెలుగు పత్రికలను పూర్తిగా చదివేవాణ్ని. ముఖ్యంగా ‘ఈనాడు’ నాకు దిక్సూచిగా మారింది.   
      అయితే, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రకరకాల కారణాలతో నేడు సమాజంలో ఆంగ్లం తప్పనిసరిగా మారిపోయింది. సివిల్స్‌ను తెలుగులో రాయవచ్చు. ముఖాముఖీనీ తెలుగులోనే పూర్తి చేయవచ్చు. అయితే ప్రశ్నపత్రం ఆంగ్లంలోనే ఉంటుంది. ప్రశ్నలో ఒక పదానికి అర్థం తప్పుగా అన్వయించుకుంటే జవాబు మారిపోతుంది. అందుకే ఆంగ్లం మీద కనీస అవగాహన అవసరం. అది అలా ఉంచితే, నాకు మొదటి నుంచి రాయడం, భావాన్ని సృష్టంగా చెప్పే నైపుణ్యం ఎక్కువే. మూడో తరగతిలో మా ఉపాధ్యాయుడు కథలు చెబితే తర్వాత రోజు రాసేవాణ్ని. అందరూ మెచ్చుకునే వారు. అలా రాతలో నైపుణ్యం అబ్బింది. దాంతో ప్రిలిమినరీ నెగ్గి మెయిన్స్‌కు ఎంపికైతే ఇక తిరుగులేదని బలంగా నమ్మేవాణ్ని. మా అన్నయ్య కోదండరావు, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో నిరుత్సాహం దగ్గరకు చేరేది కాదు. నేను నమ్మినట్లుగానే మెయిన్స్‌కు ఎంపికైన తొలిసారే మూడో ర్యాంకు వచ్చింది. 
చాలామంది అంటూ ఉంటారు కానీ, తెలుగు మాధ్యమంలో చదవడం వల్ల నాకు ఎప్పుడూ వెనకబడ్డట్టు అనిపించలేదు. నిజానికి తెలియని భాషలో కంటే తెలిసిన దానిలో అయితేనే రాణించగలం అనేది నా నమ్మకం. తెలుగులో అయితే తప్పులు చెప్పననే ముఖాముఖిలో సైతం దాన్నే ఎంచుకున్నాను. బోర్డు సభ్యులకు సైతం అదే మాట చెప్పాను. వాళ్లేమి చిన్నచూపు చూడలేదు. పైపెచ్చు ముఖాముఖి చివర్లో తెలుగులో నేను పాడిన దేశభక్తి గీతానికి నిలబడి చప్పట్లు కొట్టారు.  
      సివిల్స్‌ రాసి నాలాంటి పేద విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలనుకున్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు ఎందులోనూ ఎవరికీ తీసిపోరనేది నా ద్వారా అందరికీ తెలియాలనుకున్నా. ఆంగ్లం రాదని సివిల్స్‌ శిక్షణకు వెళ్లినప్పుడు చాలామంది నన్ను చిన్నచూపు చూశారు. వారి మాటలకు తెలుగు ద్వారా సివిల్స్‌ సాధించి జవాబు చెప్పాలనుకున్నా. తెలుగు అంటే ఈసడింపు వద్దని నా విజయం ద్వారా వాళ్లందరికీ చెప్పాలనుకున్నా. అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. తెలుగును చులకనగా చూసే చాలామంది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. మాతృభాషను మించింది ఏదీలేదని గుర్తించాలి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి