తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తేనెలొలుకు భాష తెలుగు

  • 430 Views
  • 11Likes
  • Like
  • Article Share

    ఎస్‌.త్రివిక్రమ్‌

  • ప్రొద్దుటూరు.
  • 8008573443

తేనెలొలుకు తెలుగుభాష మాధుర్యాన్ని చవిచూసినవారు ఆ మధురానుభూతుల్ని మర్చిపోలేరు. ఏ వృత్తిలో స్థిరపడినా అమ్మభాషను అక్కున చేర్చుకుంటారు. తల్లిభాష సేవలో నిరంతరం పునీతులవుతారు. ఆ కోవకు చెందినవారు చాలామందే ఉన్నారు. వారిలో ఒకరు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సాహితీవేత్త, ప్రముఖ వైద్యుడు కోడూరు ప్రభాకర్‌రెడ్డి. ఆయన ఓపక్క ఊపిరి సలపని వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తూనే తెలుగుభాషకు పట్టం కడుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రజల వ్యావహారిక భాష ఆధారంగా ఆయన ‘రేనాటి పలుకుబడులు’ నిఘంటువు రూపొందించారు. నాలుగు దశాబ్దాలుగా  అమ్మభాషకు ఎనలేని సేవ చేస్తున్నఈ మాతృభాషాభిమానితో తె.వె ముఖాముఖి.
తె.వె.: మీకు తెలుగు మీద ఇంత పట్టు ఎలా అలవడింది?  
కోడూరు: మా నాన్న చెన్నారెడ్డే కారణం. ఆయన నాకు చిన్నప్పుడే భారత, భాగవత, రామాయణాలు, పంచకావ్యాలు వినిపించి, వివరించేవారు. అదే నా సాహితీ సృజనకు నాంది పలికింది. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ‘కందం వ్రాసినవాడే కవి’ అన్న అభిప్రాయంతో ప్రప్రథమంగా కంద పద్యం కూడా రాశాను. అదిప్పటికీ నాకు బాగా గుర్తు. 
అంకమునందున నా పిత
పొంకముగా పొదివిపట్టి మురిపెము తోడన్‌
శంకలు దీర్చుచు నుండగ
అంకితభావముగనేను హాయిగ వింటిన్‌!

ఇలా నాకు భాషలో పట్టు, సాహిత్య పిపాస ఏర్పడ్డాయి.
మీ కుటుంబంలో ఎవరైనా కవులు, సాహిత్య సేవకులు ఉన్నారా?
మా నాన్న చెన్నారెడ్డి కవి కాకపోయినా పండితుడు. మా పెద్దన్నయ్య పుల్లారెడ్డి (విశ్రాంత ఎస్‌ఈ) తెలుగు, ఆంగ్ల, హిందీ సాహిత్యాలను ఆపోశన పట్టారు. రచనలు కూడా చేశారు. వాళ్ల ప్రోత్సాహ ప్రోద్బలాలే నా సాహితీ కృషికి ఆలంబన.   
మీరు వైద్యులైనా సాహిత్య రచనలకు (అదీ ప్రాచీన సాహిత్యంలో) పూనుకోవడానికి స్ఫూర్తి ఏమిటి?
నేను వైద్యుడిని కాకముందే నాలో సాహితీ బీజం వేశారు కుటుంబ సభ్యులు. పద్యగ్రంథాల వివరణే ఎక్కువగా చెప్పేవారు. అందువల్ల సాహిత్యంపై ఆసక్తి, ప్రాచీన రచనలపై మక్కువ ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రాగ విపంచి, పల్నాటి భారతం, ద్రౌపది, హృదయ రాగం, చాటుకవి- సార్వభౌమ, కవి కోకిల, దువ్వూరి రామిరెడ్డి కవిత్వం- వ్యక్తిత్వం, కవితారస పానశాల, శ్రీనాథవిజయం, దేవర, బాలగేయాలు, శృంగార తిలకం, అశ్రుగీతి, మీరా గీతామృతధార, రేనాటి పలుకుబడులు తదితర రచనలు చేశాను. 
వైద్యుడిగా చాలామందిని కలుస్తారు కదా! భాష విషయంలో ఏం గమనించారు?
నా దగ్గరికి వైద్యం నిమిత్తం ఎక్కువగా తల్లులే తమ పిల్లలను తీసుకుని వస్తుంటారు. వారి పిల్లల పేర్లను నమోదు చేసుకునేటపుడు కొన్ని విచిత్రమైన పేర్లు చెబుతారు. వాటికి అర్థమేంటంటే తెలియదంటారు. కొత్తపేరు, వైవిధ్యంగా ఉండాలని అలా పెట్టామంటారు. అలాంటివారిని పేరుకు అర్థముండాలని చెబుతుంటాను. అలాగే ఎక్కువ మంది ముస్లిం మహిళలు వైద్యం నిమిత్తం నావద్దకు వస్తారు. వాళ్లెక్కువగా ఉర్దూలోనే మాట్లాడతారు. నాకు హిందీభాషలో ప్రవేశం ఉంది. అందువల్ల వారి నుంచి కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకుంటాను. అయినా వారినీ తెలుగులో కూడా మాట్లాడమని చెబుతుంటాను.
మాండలిక నిఘంటు తయారీ ఆలోచన ఎలా వచ్చింది?
మాండలికాల్లో ఉన్న రచనల్ని చదివినపుడు నేను వినని ఎన్నో పదాలు తటస్థపడేవి. అలా ఆసక్తి పెరిగింది. ‘రేనాడు’లో ఉన్న మాండలికాలను సేకరించాలనుకున్నాను. వృద్ధుల మాటల్లో ఎన్నో పలుకుబడులు వినపడేవి. ఇవన్నీ తెలుగువారి అపూర్వ సంపదగా భావించి వాటిని గ్రంథస్థం చేశాను. ప్రస్తుతానికి ఇందులో 4,500 పదాలు ఉన్నాయి.
‘రేనాటి పలుకుబడులు’ నిఘంటు నిర్మాణం అనుభవాలు?
ఈ నిఘంటు నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లు శ్రమించాను. ఎందరినో సంప్రదించాను. పలుకుబడులను అకారాది క్రమంలో గుచ్చి వాటిని రేనాటి యాసలోనే ప్రయోగించాను. అంతేకాకుండా వాటికి ఆంగ్లసమానార్థాలను కూడా సూచించాను. ఈ ప్రయత్నంలో ఎన్నో జానపద గేయాలను, శాసనాలను చదివాను. ఎందరో రైతులను సంప్రదించాను. ఈ నిఘంటు నిర్మాణంలో మా అమ్మ సహాయం కూడా మరవలేనిది.
ఇంతకు ముందు ఈ ప్రాంత మాండలికంపై నిఘంటువులేమైనా రూపొందాయా?
ఈ తరహా నిఘంటు నిర్మాణం (అకారాది క్రమంలో) నాకు తెలిసినంతవరకూ మా ప్రాంతంలో ఇంతకు ముందు రూపొందలేదు. తెలుగు విశ్వవిద్యాలయం కొన్ని జిల్లాల మాండలికాలంటూ సంపుటాలు వెలువరించింది. వాటి నిర్మాణ పద్ధతే వేరు. వాటిని నిఘంటువులు అనడానికి వీల్లేదు. వెలగా వెంకటప్పయ్య రాయలసీమ జిల్లాల పలుకుబడులు సంకలనం చేశారు. ఇది సమగ్రంగా లేదు. ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి సంపాదకత్వంలో ‘వాడుక తెలుగు పదకోశం’ రూపొందింది. అందులో ఆకారాలను చూపించలేదు. డాక్టర్‌ పి.నరసింహారెడ్డి తెలుగు నానార్థ పద నిఘంటువు వెలువరించారు. డాక్టర్‌ జిఎన్‌రెడ్డి సంపాదకత్వంలో తెలుగు పర్యాయ పద నిఘంటువు వెలువడింది. ఇవన్నీ పలుకుబడులకు సంబంధించిన నిఘంటువులు అనడానికి వీల్లేదు. ఒక్క వెలగా వెంకటప్పయ్య గారి సంకలనం తప్ప. మొత్తం మీద రేనాటి పలుకుబడుల మీద వెలువడిన నిఘంటువు నాదే. అసలు రేనాడు అంటే ఏమిటో అవగాహన కలిగి ఉండాలి. నాడు అంటే గ్రామాల కూటమి. అప్పటి కడప జిల్లాలో కలిసి ఉన్న నొస్సం, ఉయ్యాలవాడ, గండికోట ప్రాంతాలను రేనాడు అని, అక్కడి ప్రజలు పలికే పలుకు బడులనే రేనాటి పలుకుబడులు అనేవారు.
మీకు సహకరించిన జానపదులు ఎవరు?  పరిశీలించిన గ్రంథాలేంటి?
మాండలిక నిఘంటువు నిర్మాణంలో ఎందరో జానపదులను, జానపద గేయకర్తలను సంప్రదించాను. కావ్యాలను, శాసనాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మా అమ్మ ఓబుళమ్మ వివరణాత్మక సూచనలు నాకెంతో ఉపకరించాయి. ఆమె రైతు కుటుంబం నుంచి వచ్చింది. 96 ఏళ్లు జీవించింది. ఎన్నో పలుకుబడులు ఆమె అలవోకగా మాట్లాడేది. ఈ నిఘంటువు నిర్మాణానికి నన్ను ప్రోత్సహించిన మరో మహానుభావుడు కీ.శే మల్లెల నారాయణ. కొన్ని జానపద గేయాలను, శాసనాలను సూచించారాయన. నేను పరిశీలించిన గ్రంథాలను ఉట్టంకించాలంటే చాలానే ఉన్నాయి. పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథ కవి సార్వభౌముడు, కొట్టరువు తిక్కన మొదలైన కవుల రచనలెన్నో భోధించాను.
తెలుగులోకి  అన్య భాషా పదాలు చొచ్చుకొచ్చాయి కదా!
మన తెలుగు పలుకుబడుల్లోకి ఉర్దూ, కన్నడ, తమిళ పదాలు వచ్చి చేరాయి. రేనాడు సరిహద్దులో కన్నడ, తమిళ  ప్రాంతాలు ఉండటం దీనికి ముఖ్యకారణం. అక్కడక్కడ హిందీ, ఆంగ్లపదాల ప్రభావం కూడా ఉంది. వాటిని యథావిధిగా తీసుకుంటామా? లేక మనకనుగుణంగా మార్చుకుని వాడుకుంటామా అన్నది మన మీదే ఉంటుంది.
ఇప్పుడు మాండలికాల స్థానం ఎలా ఉంది?
మాండలికాలు మన జాతి సంపద. మాండలికాలు, పలుకుబడులపై నేటి యువత శీతకన్ను వేస్తున్నారు. రోజురోజుకూ అవి కనుమరుగవుతున్నాయి. వాటిని గ్రంథస్థం చేయకపోతే కొన్నేళ్ల తర్వాత అవి అంతరించిపోతాయి. ఇప్పటికే కొన్ని వేల మాండలిక పదాల జాడ లేదు. ఇకమీదటైనా తెలుగు జాతి మేల్కొని వాటిని పరిరక్షించుకోవాలి.
మన (మాండలిక) భాష అంతరించకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మాండలికాల్లో రచనలు విరివిగా చేయాలి. యువతరం వాటిని చదివేలా భాషా శాస్త్రవేత్తలు పూనుకోవాలి. ఇలాంటి రచనలను ఇబ్బడి ముబ్బడిగా ముద్రించి సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రచురణకర్తలు ముందుకు రావాలి. ఇది ప్రభుత్వ ప్రమేయం లేకుండా చేయడం సాధ్యం కాదు. మాండలిక పద ప్రయోగంతో పాఠ్యాంశాలూ రావాలి.
మీరు ఇతర భాషల్లోని సాహిత్యాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు? ఈ సందర్భంగా మీ అనుభవాలు? 
ప్రతిభాషకూ స్వస్థల ప్రాధాన్యం ఉంటుంది. మూలభాషలోని భావాన్ని ఇతర భాషలోకి రాబట్టాలంటే అసాధ్యం. అనువాదంలో దాన్ని యథాతథంగా తీసుకురావటం కుదరదు. దానికి ఎంతో ప్రజ్ఞ అవసరం. శృంగార తిలకం (సంస్కృతం), అశ్రువీధి (మూలం: హిందీలో జయశంకర్‌ ప్రసాద్‌ రచించిన ఆసూ), మీరా గీతామృత ధార   (వ్రజ భాషలోని మీరా భజనలు) అనువదించడానికి ఎంతో కష్టపడ్డాను. తేటగీతిలో చిన్నచిన్న పదాలతో భావాన్ని పొదగడానికి ఎంతో శ్రమించాను. మూలభాషలోని కొన్ని పదాలకు తెలుగులో సమానార్థకాలు దొరకటం కష్టమైంది. ఇటీవల అనువదించిన గాథా త్రిశతి (హాల ప్రాకృత గాథల్లో 300 గాథలకు ఆంధ్రాంగ్లానువాదం) కూడా సాహితీవేత్తల ప్రశంసలు అందుకుంది. ప్రాకృత భాషలో తెలుగు పదాలున్నాయి. కారణం ప్రాకృత భాషను పెంచి పోషించినవారు ఆంధ్రరాజులు. నాకు ప్రాకృతంలో ప్రవేశం లేదు. సంస్కృతచ్ఛాయానుసారం తేటగీతుల్లో అనువదించి ఆంగ్లంలోనూ భావార్థమిచ్చి విశేషవ్యాఖ్య జోడించాను.
వైద్యరంగంలో తెలుగు వాడకం?
వైద్య వృత్తిపరమైన అంశాల్లో తెలుగు వాడకం కష్టమే అయినా అసాధ్యం కాదు. మందుల కంపెనీలు, మందుల పేర్లు తెలుగులో కూడా ముద్రిస్తే ఆచరణ యోగ్యం అవుతుంది. ఆసుపత్రిలో బోర్డులు, ప్రకటనలు తెలుగులో ఉండేలా అమలు పరచడం పెద్ద కష్టం కాదు. సాధారణంగా వైద్యులు అందరూ తెలుగులోనే మాట్లాడతారు. తెలుగు రానివారు వస్తే వారితో పరభాషలో మాట్లాడటం తప్పనిసరి. తెలుగు పద్యాలు, సూక్తులు, ఆసుపత్రుల్లో ప్రదర్శించడం మొదలుపెడితే తెలుగు భాషకు మంచిరోజులు వస్తాయనడంలో సందేహం లేదు. నా ఆసుపత్రిలో కొన్ని తెలుగు పద్యాలు, సూక్తులు ప్రదర్శిస్తున్నాను.
మీకు తెలుగు సాహిత్యంలో నచ్చిన కవి? 
ఎందరో ఉన్నారు. తిక్కన, శ్రీనాథుడు, బమ్మెర పోతన, ఇలా ఎంతోమంది మహా కవులు ఉన్నారు. నాకు బమ్మెర పోతన భాగవతమంటే మరీ మక్కువ.
తెలుగు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది..?
డిగ్రీ విద్యార్థులు కూడా తప్పుల్లేకుండా ఒక్క వాక్యం కూడా రాయలేని దుస్థితి. పట్టభద్రుల స్థాయిలోనే ఈ విధంగా ఉంటే ఇక ప్రాథమిక స్థాయిలో మాతృభాష పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భాష ఈ స్థితిలో ఉండటానికి కారణాలు?
పరభాషలు నేర్చుకుంటే పిల్లలకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయన్న ధోరణి తల్లిదండ్రుల్లో బాగా పెరిగింది. అమ్మభాషకు ఆయువుపట్టు నేటితరం విద్యార్థులే. విద్యార్థి దశలో ఉన్నవారికి తల్లిభాష పట్ల మక్కువ పెంచాలి. అంటే విద్యార్థి తల్లిదండ్రుల్లో మొదట తెలుగు భాషపట్ల ఆసక్తి కలిగించాలి. మా రోజుల్లో తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులే ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారు. విషయ పరిజ్ఞానం, భావవ్యక్తీకరణ, సృజనాత్మకత ముఖ్యం. అవి ఉంటే భాష ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఆ దిశగా విద్యావిధానం కొనసాగాలి.
రానున్న రోజుల్లో భాష ఎలా ఉండాలి?
తెలుగుభాష పూర్వవైభవాన్ని చాటుకోవాలి. అంతకంటే బ్రహ్మాండంగా వెలుగొందాలి. ప్రజల నోళ్లలో తేట తెలుగుమాటలు పలకడం కంటే సంతోషకరమైన విషయం మరొకటి ఏముంటుంది? చిన్నారులు తెలుగుభాషలో అమ్మ, నాన్న అని పిలుస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. అలాంటి ఆహ్లాదకర దృశ్యాలు పునరావృతం కావాలని కోరుకునేవారిలో నేనూ ఒకణ్ని.
తెలుగు భాషాభివృద్ధికి ఏం జరగాలని మీ అభిప్రాయం?
ముందుగా తల్లిదండ్రులకు మార్గదర్శకాలు నిర్దేశించాలి. పిల్లలకు తెలుగు భాష మీద మక్కువ కలిగేట్లు చేయాలి. తెలుగును తూర్పు ఇటాలియన్‌ అని పాశ్చాత్యులే అన్నారని, తెలుగు భాష మాధుర్యం వారికి అర్థమయ్యేట్లు చేయాలి. ఆంగ్లం వద్దని అనటం లేదు. దానిపై మోజు పెంచుకుని తెలుగు భాషను చిన్నచూపు చూడవద్దంటున్నాను. ఈ దిశగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలి. తెలుగు భాషలో ప్రతిభ చూపినవారికి పారితోషికాలు ఇవ్వాలి.

             (ప్రభాకర్‌రెడ్డి: 94401 70808)


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి