తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

బతుకునిచ్చిన భాష

  • 146 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పద్మ కంటిపూడి

  • హైదరాబాదు, padmaavasu@gmail.com

‘తెలుగు ఎందుకూ పనికిరాదనే వారికి నా ఎదుగుదలే సమాధానం. చిన్నప్పుడు భాషను అంతగా ప్రేమించాను కాబట్టే ఇప్పుడు చలనచిత్ర గీత రచయితనయ్యా. చిన్న వయసులోనే ఫిలింఫేర్‌ పురస్కారాన్ని అందుకోగలిగా’... గుండెల నిండా ఆత్మవిశ్వాసం, మదినిండా మాతృభాషాభిమానం నింపుకున్న పాతికేళ్ల కుర్రాడు పాగోలు గిరీష్‌ను పలకరిస్తే చెప్పిన మాటలివి.
ఎవరీ గిరీష్‌? గుర్తుపట్టలేదా? అయితే, శ్రీమణి అంటే జ్ఞప్తికి వస్తాడేమో! అవును... అతడే! యువతరం నుంచి మలితరం వరకూ అందరినీ ఆకట్టుకున్న ‘గగనపు వీధి వీడి...’ (అత్తారింటికి దారేది?) పాట రచయిత. కశాశాల చదువు కూడా పూర్తి చేయని శ్రీమణి ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాహితీ సంచలనం సృష్టిస్తున్నాడు. పదో తరగతి పూర్తయ్యే నాటికే తెలుగు సాహిత్యంలోని మేరునగాలను చదివేసిన ఈ కుర్రాడు... ఆ తెలుగే పెట్టుబడిగా పైకెదిగాడు.
గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం

      భావసంద్రం అనే పదానికి నిర్వచనంగా ఈ పాటను ఉదాహరిస్తే సరిపోతుందేమో! ఇంత చక్కటి అక్షరాలను ఎలా కూర్చారంటే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను తల్చుకుంటాడు శ్రీమణి. ఆ పాట రాయించుకునే ముందు తన దగ్గర ఆయన పావుగంట కూర్చొని రెండు కథలు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు.
      మొదటి కథ... చెట్టు మీద ఓ పిట్ట గూడు పెట్టింది. కొన్నాళ్లకి ఆ పిట్ట  ఎగిరివెళ్లిపోయింది. అది తిరిగి రాలేదని చెట్టే పిట్ట కోసం కదిలి వెళ్లింది.
      రెండో కథ... ఆకాశం గుండెల్లో మేఘాలు ఇమిడి ఉన్నాయి. కొన్నాళ్లకి మేఘాలు వెళ్లిపోయాయి. చివరికి తనని వదిలి వెళ్లిన మేఘం కోసం ఆకాశమే కదిలి వెళ్లిపోయింది.
      ‘ఈ రెండు కథలతో నాకు సందర్భం అర్థమయ్యేలా చెప్పారు త్రివిక్రమ్‌. ఎంత సమయమైనా తీసుకో... నీకు సంతృప్తిగా అనిపించినప్పుడే పాట నాకివ్వు అన్నారు. ముప్ఫై రోజులు పట్టింది ఆ పాట రాయడానికి. అందుకే అది అంత పెద్ద హిట్టయ్యింది. ఆ గొప్పదనమంతా త్రివిక్రమ్‌ గారికే దక్కుతుంద’ని  అంటాడు శ్రీమణి వినయంగా. తనకు కావాల్సిన పాట కోసం త్రివిక్రమ్‌ చెప్పిన కథల్లో భావుకతకు శ్రీమణి సృజనాత్మక అక్షరాలు తోడవటంతోనే ఆ పాటకు ఇప్పటికీ నీరాజనాలు అందుతున్నాయి.
వారి ఒడిలోనే...
శ్రీమణి సొంతూరు ప్రకాశం జిల్లా చీరాల. నాన్న వెంకటాచలం చనిపోయినప్పుడు తనకు ఎనిమిదేళ్లు. మరో నాలుగేళ్లు గడిచాయో లేదో అమ్మ నాగమణి కూడా వెళ్లిపోయింది. అప్పటి నుంచి అమ్మమ్మ రమణమ్మా, తాతయ్య దత్తాత్రేయలే పెంచారు. ఏడో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్న శ్రీమణి... బడి నుంచి రాగానే అమ్మమ్మా తాతయ్యలతో పురాణ పఠనం చేసేవాడు. పిల్లాడికి వినోదం, విజ్ఞానం కలిపి అందించడానికి ఆ పెద్దవాళ్లు చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది. మనవడిలో భాషాభిమానం పెంచింది. తాను కూడా ఏదైనా రాయాలన్న స్ఫూర్తిని రగిలించింది.


కశాశాలలో కవిసమ్మేళనాలు పెట్టాలి
శ్రీశ్రీ, ముళ్లపూడి గార్ల భాష, భావజాలం నాకు చాలా ఇష్టం. శ్రీశ్రీ సాహిత్యాన్ని చదివితే సోమరి కూడా శక్తిమంతుడిగా తయారవుతాడు. ఇక, స్వతైరు అనే పదాన్ని సృష్టించిన ముళ్లపూడి గారి గురించి ఏం చెప్పగలం? సెటైర్‌ అంటే ఎదుటి వాళ్ల మీద వేసేది, స్వతైర్‌ అంటే మన మీద మనం వేసుకునేది అని చాలా చక్కగా చెప్పారాయన. ఆ మాటకు నేను ఫిదా అయ్యా. సినారె, యండమూరి, యద్దనపూడి రచనలు బాగుంటాయి. దర్గమిట్ట కథలు అద్భుతం. వాటిలో భావోద్వేగాలు, సందేశాలు చాలా బాగుంటాయి. అనుభవాలను బాగా విశ్లేషించి రాయడంలో రచయిత ప్రజ్ఞ కనిపిస్తుంది. రావూరి భరద్వాజ గారి ‘వెలుతురు చినుకులు’, మల్లాదిగారి ‘చలవ మిరియాలు’, ‘అసురుడు’ కూడా నాకు బాగా ఇష్టం.
      చలనచిత్ర రచయితల్లో చంద్రబోస్‌ గారి సాహిత్యంలో భావుకత బాగుంటుంది. కళ్లు కళ్లు ప్లస్‌ పాటలో... ‘ప్రాయానికే పరీక్షలా’ అని కౌమారంలో ఉండే ఇబ్బందులను భలే వర్ణించారు. వేటూరి, సిరివెన్నెల గార్లూ నాకూ స్ఫూర్తినిచ్చిన రచయితలే. సిరివెన్నెల కొత్త బంగారులోకంలో ‘నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా... నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా’ అంటూ పాట మొదలవుతుంది. ఆయన రాసిన ప్రతి పాటలో ఓ సందేశం ఉంటుంది. ‘దళం’ అనే సినిమాలో ‘ఎటెళ్లినా అరణ్యమే... స్థితి గతీ అగమ్యమే’ పాట సాహిత్యం చాలా బాగుంటుంది. తెలుగు సినిమా పాటల్లో ఆంగ్ల పదాలంటే, సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు తప్పవు. కశాశాల నేపథ్యంలో పాట అంటే అవి వస్తాయి. గ్రామీణ నేపథ్యం, కుటుంబం బంధాలు అంటే ఆంగ్ల పదాల వినికిడి దాదాపు ఉండదు. యువతరానికి తెలుగును దగ్గర చేయాలంటే    కశాశాలల్లో భాషా సదస్సులు, శతావధానాలు నిర్వహించాలి. కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయాలి. తెలుగు పాఠాలను ఆసక్తికరంగా చెప్పాలి.                      

- శ్రీమణి


      చేమకూర వేంకటకవి విజయవిలాసం నుంచి ఆరుద్ర త్వమేవాహం వరకూ, మార్క్‌ ట్వెయిన్‌ రచనల నుంచి కన్నడ భైరప్ప పుస్తకాల వరకూ అన్నింటినీ ఆపోశన పట్టాడు శ్రీమణి. ‘పరిశ్రమలో అడుగుపెట్టాలనుకున్నప్పుడే చలంగారి పుస్తకాలు, తిలక్‌ అమృతం కురిసిన రాత్రి చదివా. నా మీద ప్రభావం చూపిన పుస్తకం... కన్నడ రచయిత భైరప్ప రాసిన ‘పర్వ’. మాయలూ, మంత్రాలు లేకుండా మహాభారతాన్ని రాశారాయన. అందులో భావాలూ, భావోద్వేగాలు మనసును హత్తుకుంటాయి. ఒక దశారీ పశ్చాత్తాపం కూడా బాగా నచ్చింది. ప్రపంచ బ్యాంకు ఉద్యోగి జీవితం అది. అతని దృష్టిలో అతను చేసింది తప్పుకాదు. సమాజం దృష్టిలో మాత్రం అది అవినీతి. పుస్తకం గొప్పగా ఉంటుంది. రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. మార్క్‌ ట్వెయిన్‌ రచనలు నాకిష్టం. అలాగే, శ్రీపాద గారు ఓ కథలో వందేళ్ల అవతల నుంచి రాసుకుంటూ వచ్చారు. స్వాతంత్య్రానికి పూర్వం సగటు భారతీయుడు ఎలా ఉండేవాడు... ఆ తర్వాత ఎలా మార్పులు వచ్చాయనేది విశ్లేషిస్తూ రాశారు. ఆ రచనలు బాగా నచ్చాయి’ అనే శ్రీమణి చిన్నప్పుడే పద్యాలంటే ఆసక్తి కనబరిచేవాడు.   ఇంటర్‌కి వచ్చాక తరగతి గదిలో కనిపించే సందర్భాలను తీసుకుని పద్యాలుగా, కవితలుగా మలచేవాడు. నూనుగు మీసాల వయసులోనే పద్యరచనా నైపుణ్యం ఎలా వచ్చిందంటే, ‘అప్పట్లో తాతయ్య పెద్దబాలశిక్ష, తెలుగు పద్యాలు, కవితలూ బాగా చదివించేవారు. ఆ చదువే దారి చూపింద’ని చెబుతాడు. ఈ కాలం పిల్లలకు పద్యాలను మూసధోరణిలో కాకుండా ఆసక్తికరంగా అర్థమయ్యేట్టు విడదీసి చెప్పాలి ... వర్ణిస్తూ, దృశ్య కావ్యంలా వాళ్ల కళ్లకు కట్టాలి... అప్పుడే వాళ్లు పద్యసాహిత్యంపై ఆసక్తి పెంచుకుంటారని అంటాడు. 
ఊరికే రాలేదు...
పద్యాలు, కవితల రచనలతో సాహితీ సేద్యంపై ఆసక్తి పెంచుకున్న శ్రీమణి...కళాశాల చదువుకి టాటా చెప్పేసి హైదరాబాద్‌ వచ్చేశాడు. చలనచిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. 2006 - 10 మధ్యలో ప్రైవేటు రవాణా కంపెనీలో గుమాస్తా, పిజ్జా డెలివరీ బాయ్, మార్కెటింగ్‌ ఉద్యోగిగా పని చేశాడు. పద్యాలు రాసే చేత్తో లోడింగ్‌ లెక్కలు రాశాడు. పిజ్జాలను అందించాడు. అలా కష్టపడుతూనే సినీ ప్రయత్నాలు చేశాడు. రోజంతా అలా పని చేస్తూ పుస్తక పఠనానికి సమయం ఎలా మిగుల్చుకునే వారని అడిగితే... ‘అప్పటికే ఎన్నో పుస్తకాలు చదివా. ఉద్యోగంలోకి వచ్చాక మాత్రం వ్యక్తులను, వ్యక్తిత్వాలను చదవడానికి సమయం కేటాయించుకున్నా. ఎక్కడ ఎవరితో ఎలా మెలగాలో తెలుసుకున్నా. అప్పుడే నాకు తెలిసిన వ్యక్తి దర్శకుడు సుకుమార్‌ దగ్గర చేరాడు. అతనే సుకుమార్‌ గారిని పరిచయం చేశాడు. కట్‌ చేస్తే, నా పాటలు ఆయనకు బాగా నచ్చాయి. 100% లవ్‌లో అవకాశం ఇచ్చారు. తర్వాత సుకుమార్, తివిక్రమ్‌గార్ల ప్రోత్సాహంతో నిలదొక్కుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.
      100% లవ్‌లో ‘అహో బాలు’ పాట (మొదటిసారి ఈ పాట సాహిత్యాన్ని చూసినప్పుడు శ్రీమణిని హత్తుకుని మరీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ అభినందించారట) నుంచి ‘గగనపు వీధి’ వరకూ రెండేళ్లలో దాదాపు డెబ్భై గీతాలు రాశాడు శ్రీమణి. అంత తక్కువ కాలంలో అన్ని పాటలు రాసిన సినీ రచయితలు అరుదు. అంతేకాదు, ‘గగనపు.Å..’ పాటకు ఫిలింఫేర్‌ పురస్కారాన్ని అందుకున్నాడు. చిన్న వయసులోనే ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో ఓ అమ్మాయి సెగ సినిమాలోని ‘వర్షం ముందుగా...’ పాట పాడినప్పుడు బాలసుబ్రహ్మణ్యం, ‘కొత్తవాడైనా చక్కటి సాహిత్యం అందించిన శ్రీమణికి అభినందనలు’ అన్నారు. ఆ కార్యక్రమాన్ని చూసే, శ్రీమణికి ‘జులాయి’లో పాటలు రాసే అవకాశమిచ్చారు త్రివిక్రమ్‌. గీత రచయిత చంద్రబోస్‌ కూడా ‘ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంద’ని అంటుంటారు. 
      అవును మరి... శ్రీమణి నమ్ముకుంది అమ్మభాషను కదా!


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి