తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని...

 

  • 207 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శ్రీసత్యవాణి

  • హైదరాబాదు.
  • 8008578174

సముద్రాన్ని అన్వేషించే కొద్దీ   ఆణిముత్యాలు దొరుకుతాయి. అన్నమయ్య సంకీర్తనా సాహిత్యమూ అంతే... సారస్వత క్షీరసముద్రం. ప్రతి పలుకునీ పాటగా మార్చిన ఆయన సంకీర్తనల్లో  వెలకట్టలేని తెలుగు పదాలెన్నో! లాలిపాటలూ, జోలపాటలూ... అలిసిన మనసుకు సేదనిచ్చే జానపదుల జాజరలు... సమాజంలో అసమానతలపై ఎక్కుపెట్టిన తూటాల్లాంటి ఆ పాటల గురించి ఆయన పాటలపై ముప్ఫైఐదేళ్లుగా అధ్యయనం చేస్తున్న గాయని శోభారాజు ఏం చెబుతున్నారో చూద్దాం...
తె.వె.: అన్నమయ్యకు కీర్తనలు వాటంతటవే వచ్చాయా, ఎవరి ప్రభావమైనా ఉందా?
శోభారాజు: అన్నమయ్య జన్మతః వాగ్గేయకారుడు. తల్లిదండ్రులు భక్తి సంపన్నులు. వేంకటేశ్వరస్వామి అంటే శిలావిగ్రహం కాదు. శక్తి అంశ అని నమ్మిన కుటుంబం. అందుకే తల్లి లక్కమాంబ స్వామివారి నందక ఖడ్గమే తన గర్భాన జన్మిస్తోందని నమ్మింది. అందుకేనేమో ఆయన నమ్మిన భావాలని తన రచనల్లో అంత పదునుగా చొప్పించగలిగారు. అవి సాంఘిక దురాచారాలను వ్యతిరేకించడంలో కావొచ్చూ, వ్యవస్థలో ఉన్న అంతరాలపై తన పాటల ద్వారా నిరసించినప్పుడు కావొచ్చు. కత్తి ఝళిపించినట్టుగా ఉంటాయవి. గమనిస్తే ఆయన రచనల్లో ఆధ్యాత్మిక ధోరణి ఎంతగా కనబడుతుందో అంతగా సామాజిక శ్రేయస్సు కోసం పడిన తపన కూడా స్పష్టంగా తెలుస్తుంది. అలాగని సున్నితత్వం లేదా అనొద్దు. ‘ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి...’ పాటలోని సున్నితత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయనపై ఇతరుల ప్రభావం అంటారా! ముందు తరానికి చెందిన పోతనా, జయదేవుడూ, పంచమహాకావ్యాలూ, భగవద్గీతల ప్రభావం ఎక్కువగానే ఉందని శైలితో స్పష్టమవుతోంది.
అన్నమయ్య పేరుతో ప్రచారంలో ఉన్న సంకీర్తనలన్నీ ఆయనవేనా?
కచ్చితంగా ఆయనవే! ఆయన పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్య, తిరుమల దేవాలయంలో సంకీర్తనా భాండాగారంలో తాళపత్రాలుగా ఉన్న గ్రంథాల్ని రాగిరేకులపై రాయించి భద్రపరిచినట్టుగా తెలుస్తోంది. దీన్ని బలపరిచేందుకు వీలుగా ప్రతి రాగిరేకుపైనా ‘అన్నమాచార్య విన్నపం’ అని రాసి ఉంటుంది. అయితే ఆయన రచనలపై కొన్ని సంశయాలూ ఉన్నాయి. ‘వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని’ సంకీర్తన మనందరికీ తెలుసు. ఆ పాటలో వేంకటేశ్వర ముద్ర ఉంది కాబట్టి ఆయనదే అనుకోవాలి. కానీ రచనా శైలిలో కొంత సంశయం ఉంది. ‘కంటి శుక్రవారం..’ కీర్తనలో ఆయన ముద్ర లేకపోయినా రచనాశైలి ఆయనదేనని స్పష్టమవుతోంది.
ఆయన రచనల్లోని విశిష్ట పద ప్రయోగాలు?
అన్నమయ్య ఉపయోగించిన తెలుగు ఆరువందల ఏళ్ల నాటిది. మూసకు భిన్నంగా రాసిన రచనల్లో విలక్షణమైన శైలి కనిపిస్తుంది. తరువాతి తరాలు ఆయన శైలిని అనుకరించాయి కానీ ఆయన ఎవరినీ అనుకరించలేదు. సహజసిద్ధమైన పదాలు, వాటిల్లో రాయలసీమ మాండలికం కనిపిస్తుంది. అయితే కొన్నిచోట్ల మాత్రం భారత, భాగవతాల ప్రభావం కనిపిస్తుంది. ‘అలరులు కురియగ అలమేల్మంగ’ ఈ పాటలో ‘కందువ’ వినిపిస్తుంది. కందువ అంటే చాలా గొప్పది, శ్రేష్ఠమైంది అనే సందర్భంలో ఈ అచ్చతెనుగు పదం వాడారు. అలాగే ‘గద్దరి’ అనే పదం ఉంది. గద్దరి అంటే తెలివైన. ‘బంధం’ అనే పదాన్ని మనం తరచూ వాడతాం. నిజానికిది సంస్కృత పదం. మరి తెలుగు పదమేది? ‘కొండ వంటిది ఆశ, గోడ వంటిది తగులు..’  కీర్తనలో ‘తగులు’ అంటే ‘బంధం’. ‘జ్ఞానం’ అనే పదానికి ‘ఎరుక’ అనే తెలుగు పదాన్ని అందించారు.
ఆయన రచనల్లో అలనాటి సంస్కృతీ పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా?
‘వాడవాడలా వెంట తిరిగేవో బేహారి’ పాటలో బేహారి అంటే వ్యాపారి. అంటే భగవంతుడు వ్యాపారా? ఇక్కడ అన్నమయ్య తను చూసిన, తను గమనించిన ఆనాటి సాంఘిక పరిస్థితుల్ని కూడా తన పాటల్లో జోడించి అక్కడా భక్తితత్వాన్ని కలిపాడు. భగవంతుడు పంచభూతాలు అనే నూలుతో చీరలు నేస్తూ, చంచలత్వం అనే గంజి పెడతాడనీ, గుణాలనే కండెలుగా వాడతాడని వర్ణించాడు. అలాగే ‘మంచి మంచి చీరలు అమ్మే మారు బేహారి’కి అతని భార్య మహాలక్ష్మి చిట్టిపొట్టి అలుకలనే బంగారు రంగులని ఆ చీరలపై అద్దుతుంది. ఆకట్టుకొనేలా ఆ చీరని తీర్చిదిద్దడానికి కుటిలంపు చేతలని వాడి ఆకట్టుకొనేలా ఆ చీరని తీర్చిదిద్ది అందంగా కనిపించేలా చుట్టూ కుచ్చిళ్లు కుడుతుంది. ఆ తరువాత వేంకటేశ్వరస్వామి సంతలోకెళ్లి ఆ చీరని అమ్మి కర్మధనాన్ని ప్రతిఫలంగా తీసుకొంటాడు. ఇదే పాటలో ‘ఇచ్చ కొలదులు..’అనే ప్రయోగం ఉంటుంది. అంటే అప్పట్లో పన్నుల వ్యవస్థ ఉన్నా ఈయన కట్టలేదని ఒక అర్థం స్ఫురిస్తోంది. లేదంటే పన్నుల వ్యవస్థ లేకపోవడానికీ ఆస్కారం ఉంది. అలాగే ‘పుట్టుభోగులము మేము/ భువి హరిదాసులము/ నట్టినడిమి నాకేమీయవలే’ ఆనాటి విజయనగర రాజుల పాలనలో ఉన్న లోపాలు ఎత్తిచూపుతూ నిలదీసిన పాటలివి. రాచరికం తాలూకూ అధికారాన్ని నిరసిస్తూ అన్నమయ్య అన్న పలుకులివి. నేను హరిదాసుడిని... హరిని మనసావాచా నమ్మిన వాడిని. స్వతహాగానే  సంపన్నుడిని. మీరు మాకు భోగాలు ఇవ్వడం ఏంటని నిలదీశాడాయన. అంతేకాదు ఆనాటి సమాజంలో ఉన్న కుల తత్వాన్నీ నిలదీశాడు. ఉన్నతవర్గం అనిపించుకునే కులంలో పుట్టి కూడా ఉన్నతవర్గాల అరాచకాల్ని ఎండగట్టాడు.
‘ఎక్కువ కులజుడైన/ హీన కులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’ అన్నాడు. ఇక్కడ ‘నిక్కం’ తెలుగు పదం. ‘నిజం’ సంస్కృత పదం. ఆదిశంకరాచార్యుల వారు గతంలో ఉన్నది, ఇప్పుడు ఉన్నదీ, భవిష్యత్తుల్లో ఉండేది ఏదో అదే సత్యం అన్నారు. శరీరం అశాశ్వతం, కానీ శరీరంలో ఉన్న పరమాత్మజ్యోతి మాత్రమే శాశ్వతం అన్నారు. కానీ ఇదే సత్యాన్ని అన్నమయ్య ఎంత తేలికగా చెప్పారంటే
‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ అన్నారు. ఉపనిషత్తుల సారాంశాన్ని ‘బ్రహ్మమొక్కటే’ అని ఒకే ఒక్క వాక్యంలో చెప్పి మనుషుల మధ్య తారతమ్యాలెందుకు అంటూ ఎంత తేలికగా చెప్పాడు!
వేదములు చదివియు విముఖుడై హరిభక్తి
ఆదరించని సోమయాజి కంటే
ఏదియు లేని కులహీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు

ఇవన్నీ కులాల అంతరాలని వ్యతిరేకించే పాటలే! ఒక్కమాటలో చెప్పాలంటే అన్నమయ్య వాఙ్మయాన్ని సారస్వత క్షీరసముద్రం అని చెప్పొచ్చు. దాన్ని కొలవలేం. మహాసముద్రం. అర్థం చేసుకొన్నవాడికి చేసుకొన్నంత.
త్యాగరాజ కీర్తనల తరహాలో అన్నమయ్య కీర్తనలకు ఇతర భాషల వారిని మెప్పించే లక్షణాలు ఉన్నాయా? ఈ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరిగాయా?
పాతికేళ్ల క్రితంతో పోలిస్తే ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. దక్షిణాదిలో ఎవరైనా మాకు అన్నమయ్య కీర్తనలు రావు అనడానికి సిగ్గుపడతారు. ఆ పరిస్థితి కూడా ప్రస్తుతం లేదనుకోండి. ఎమ్‌.ఎస్‌ సుబ్బులక్ష్మి ఈ పాటలు పాడినవారే! అయితే వీటిని ఉత్తరాదిలో కూడా విస్తృతంగా తీసుకెళ్లడానికి నేను హిందీలో తర్జుమా చేసి సీడీలుగా రూపొందించాను.
అన్నమయ్య కీర్తనలకు బాణీలు కట్టడంలో, కొత్తవి వెలికితీయడంలో మీరెంత వరకూ సఫలీకృతం అయ్యారు?
నిజానికి మన సంగీతమే కావాల్సివస్తే ఒక త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితార్, క్షేత్రయ్య, రామదాసు ఇలా చాలామంది ఉన్నారు. కానీ అన్నమయ్య సంకీర్తనలు భావ ప్రధానమైనవి. ఆయన రచనల్లో సంగీత, సాహిత్యాల కన్నా భావానికే ప్రాధాన్యం ఎక్కువ. ఎందుకంటే ఎన్నో పాటలు ఉన్నా అవి ఎలా పాడాలో ఎక్కడా చారిత్రక ఆధారాలు లేవు. నొటేషన్లు లేవు. అలాగే ఆయనకు పెద్దగా శిష్య పరంపర కూడా లేదు. ఇవన్నీ ఆయనకు ఆ రచనల్లో భావాన్ని చొప్పించడమే ప్రధానం తప్ప తక్కినవి కావు అనే భావాన్ని బలపరుస్తున్నాయి.
కొన్నింటికి సామంతం, దేశాక్షి వంటి రాగాలు రాశారు. సామంతంలో కొన్ని వందల పాటలు రాసినా ఆ రాగం ప్రచారంలో లేకపోవడంతో ఆ రాగంలో పాడితే అవి జనాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఒకవైపు పాప్‌ గీతాలూ, సినిమా సంగీతం జోరెత్తుతూ యువతరాన్ని ముంచెత్తుతున్న పరిస్థితి. ఇలాంటప్పుడు వాటిని ప్రచారంలోకి తీసుకెళ్లడానికి సొంతగా బాణీలు కట్టాల్సి వచ్చింది. ‘ఛీ ఛీ నరులదేటి బతుకు’ అనే పాటనే తీసుకొందాం. ఆనాడు రాజులను కాకాపడుతూ ముసుగు వేసుకొని పబ్బం గడిపే జనాల్ని నిందిస్తూ పాడిన పాట ఇది. దాంట్లో భావానికి మాత్రమే ప్రాధాన్యముంది. అలాంటి పాటల్ని సామంతం లాంటి రాగాల్లో పాడితే బాగుండదు. 

అన్నమయ్య పాటల్లో స్త్రీ వర్ణన గురించిన మాటేంటి?
ఆయన పాటల్లో అలమేలుమంగని ఆసాంతం అంగాంగ వర్ణన చేశారు కదా అనేవాళ్లు ఉంటారు. రెండేళ్ల పిల్లాడిని తల్లి దగ్గరకు చేర్చుకొని పాలిస్తుంది. అప్పుడు తన చీరకట్టు ఎలా ఉందని ఆలోచిస్తుందా? ఎందుకంటే ఆ సమయంలో ఆ వయసులో బిడ్డది ప్రాపంచిక కల్మషాలు లేని మనస్తత్వం. అలా పాలను ఇవ్వడం ఆ తల్లికి కానీ, బిడ్డకు కానీ అభ్యంతరం కాదు. ఆ జగన్మాత ముందు అందరూ పాలుతాగే పిల్లలే! అదే ఆర్తితో అదే పసితనంతో రాసిన పాటలు అవన్నీ! మనమూ అదే భావనతో వాటిని పాడాల్సి ఉంటుంది. కొన్ని పాటల్లో తారస్థాయి శృంగారమూ కనిపిస్తుంది. దానికి కారణం ఏ సాధకుని మనసులోంచీ కూడా పూర్తిగా శృంగార భావనలు లేకుండా ఉండవు. కానీ ఇక్కడ ఆ భావనలోనూ తన భక్తితత్వాన్ని చాటాడు అన్నమయ్య. ఎలా అంటారా? ఆయన దృష్టిలో వేంకటేశ్వరస్వామి మాత్రమే పురుషుడు, తక్కినవాళ్లంతా జీవననాయికలే (అందరూ ఆడవాళ్లే)! అందుకే ఆయన ‘అంగనలీరే హారతులు’ అన్నాడు. అంటే స్త్రీలు మాత్రమే హారతులివ్వాలని కాదు దాని అర్థం.
అన్నమయ్యను స్త్రీవాది అనొచ్చా?
కచ్చితంగా! ‘పొలతులూ జీవులే’ అని కచ్చితంగా చెప్పిన వ్యక్తి ఆయన. పొలతి అంటే స్త్రీ. జయలక్ష్మి, వరలక్ష్మి, సంగ్రామ వీరలక్ష్మి అన్నాడు. అంటే ఒక స్త్రీగా మహాలక్ష్మికి యుద్ధంలో జయించే వీరత్వం ఉంది, కానీ ఒదిగి శ్రీహరి హృదయంలో నిలిచి ఉందని చెబుతాడు. అలా అంటూనే లక్ష్మి లేకపోతే శ్రీహరి జీవితానికి విలువ లేదని కూడా అన్నాడు. ఆయన సాహిత్యంలోనే కాదు, నిజ జీవితంలోనూ స్త్రీలకు ఉన్నతస్థానమిచ్చి ప్రోత్సహించారు.
అన్నమయ్య భావం గురించి ఇంత లోతుగా చెబుతున్నారు కదా... ఆయన పట్ల మీకంత మక్కువ కలగడానికి కారణం?
అన్నమయ్య అంతగా భావుకతతో స్వామివారికి తనని తాను సమర్పించిన వ్యక్తి మరెవరూ లేరు. పాటంటే ఇష్టం, వేంకటేశ్వరస్వామి అంటే భక్తి. ఆ దారిలోనే నడిచిన మహా భక్తుడు అన్నమయ్యకు నన్ను దగ్గర చేశాయి. ఓ పాతికేళ్ల క్రితం ఆయన గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ అంటే మీకు నమ్మకం కలుగుతుందో లేదో! అంతెందుకు మా తెలుగు తల్లికి మల్లెపూదండలో అన్నమయ్య ప్రస్తావన ఎక్కడైనా వినిపిస్తుందా? ఆయన సొంత ఊరికి వెళ్లి ఇలా అన్నమయ్య ప్రాజెక్ట్‌ చేస్తున్నామంటే ‘ప్రాజెక్టా! అదెక్కడ కడుతున్నారండీ?’ అనేవారు. అదీ ఆనాటి పరిస్థితి. ఎనభై నుంచి ఆ ప్రచారం మొదలయ్యింది. 89లో అన్నమయ్య జీవితంపై పరిశోధించి ఒక కథని తయారుచేశాం. అది అన్నమయ్య భావజాలాన్ని ఊపందుకొనేలా చేసింది. అన్నమయ్య సినిమాకు కూడా అదే మూలంగా నిలిచింది. ఇప్పుడు అన్నమయ్య మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ ఆరాధ్యుడు.
అన్నమయ్య భావనా వాహిని గురించి...
ఆయనలో నన్ను బాగా ప్రభావితం చేసిన అంశం.. పాటకంటే కూడా ఆ పాటలోని సందేశం. ఆ సందేశాలు అందితే మనుషులు ఇలా జాతి, కుల, మత వైషమ్యాలతో కొట్టుమిట్టాడరనిపించింది. అలా జరగాలంటే మనుషుల్లోని మానసిక కల్మషాలు దూరం చేయాలని నిశ్చయించుకొన్నాను. దానికి ప్రతి ఒక్కరూ భక్తి సంగీతాన్ని కాసేపయినా వినాలి. అందుకే 83లో భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ అనే నినాదం తీసుకొచ్చాను. అదే ‘అన్నమాచార్య భావనా వాహిని’గా మారింది. ఇప్పటి వరకూ ఆ సంస్థ నుంచి 16వేలమంది శిష్యులను తయారుచేశాను. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా గొప్ప గాయకులు అని అనడంలేదు కానీ ప్రధాన లక్ష్యం ఒక్కటే. భావ కాలుష్యం దూరం చేయడం. అన్నమయ్య భావజాలాన్ని విస్తరించడం. జాతీయ స్థాయిలో సంగీత పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నాం. కాకపోతే సంగీతం అంటే ఇదే అని భక్తి సంగీతాన్నే నమ్ముకున్నవాళ్లు నాకు ఇంతవరకూ దొరకలేదు. విదేశాల్లో ప్రచారం చేయడం ద్వారా ఆయన పదాలను ప్రచారం చేస్తున్నాను. ‘సంకీర్తనా ఔషధం’, ‘ఉపశమన సంకీర్తనం’ పేరుతో జైళ్లకు వెళ్లి ఆలపించడంవంటివన్నీ ప్రయోగాత్మకంగా చేసినవి. ఏటా అన్నమాచార్య జయంతి, వర్ధంతులను నిర్వహిస్తాం. దసరాలో నాద బ్రహ్మోత్సవం జరుగుతుంది. నిధులు కొరత లేకుంటే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ఉంది.
అన్నమయ్య ఆలయాన్ని నిర్మించేందుకు సంకల్పించారు కదా!   
అన్నమయ్యపురం పేరుతో నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి నేను పాటలు పాడగా వచ్చిన సొమ్ము కొంత.. నాకు చెందిన చిన్న స్థలాన్ని అమ్మగా వచ్చిన సొమ్ము కొంత ఉపయోగించాను. పది శాతం సొమ్ముని మాత్రం కొంతమంది దాతలు మంచి మనసుతో విరాశాలుగా ఇచ్చారు. తితిదే, ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. ఇంకా గరుడాశ్వారునీ, జయవిజయులనీ ప్రతిష్ఠించాలి. కుంభాభిషేకం చేయించాలి. ఇక్కడే సంగీత విశ్వవిద్యాల యాన్ని స్థాపించాలనేది నా కల.
మీ సంగీత గురువుల గురించి...
నా తొలి గురువు మా అమ్మ రాజ్యలక్ష్మి. తర్వాత శేషగిరిరావు, పాకాల మునిరత్నం, తిరుత్తణి కృష్ణమూర్తి , ఆచార్య కల్పకం, నేదునూరి కృష్ణమూర్తిగార్ల దగ్గర శిక్షణ తీసుకొన్నాను.
ఇంతవరకూ ఎన్ని కీర్తనలు పాడారు?
ఇంతవరకూ అన్నమయ్య రచించిన 600 పాటలకు సొంతంగా బాణీలు కట్టి పాడాను. ఇతరులు స్వరపరిచినవీ కలిపితే 1100 వరకూ పాడాను.
రచనలు...
పెద్ద తిరుమలయ్య పరిచయం, శ్రీహరి పదార్థం, అన్నమయ్య గుప్త సంకీర్తనా నిధి, అన్నమయ్య సుప్రభాతం వంటివి కొన్ని. నిజానికి సమయాభావం వేధిస్తోంది. లేకపోతే మరిన్ని పుస్తకాలు రాయాలనే ఉంది.
తెలుగు గురించి...
తెలుగు మాట్లాడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుందనే చెప్పాలి. తెలుగు భాష పాటగా మలచడానికి అనువైన భాష. మాట్లాడినా పాడినట్టే ఉంటుంది. అదే దాని ప్రత్యేకత. 


నాకు మూడేళ్ల వయసు ఉండగా అనుకొంటా, నాన్నగారు అప్పట్లో డిప్యుటేషన్‌ మీద నేపాల్లో పనిచేస్తున్నారు. కృష్ణుణ్ని తలుచుకొని ఓ రోజు అలవోకగా పాట పాడటం మొదలుపెట్టాను. అంత చిన్న వయసులో ఎలా పాడానంటే..పక్షులు ఎలా సహజసిద్ధంగా పాడతాయో అలానే పాడాను. అది మొదలు ఆ గోవిందుణ్ని తలుచుకొని పాటలు పాడుతూనే ఉన్నాను. కానీ నా మొదటి గురువు అంటే మాత్రం మా అమ్మ (రాజ్యలక్ష్మి) అని చెప్పాలి. నాకింకా గుర్తుంది. దేవుడి దగ్గర కూర్చొని ఆమె బాధతో, ఆర్తితో పాడేది. అంత చిన్నతనంలో ఆ బాధకు కారణం నాకు తెలియదు కానీ, మేం తొమ్మిదిమంది సంతానం. నాన్నగారు బీడీవోగా పనిచేసేవారు. ఇంతమందితో ఈ సంసారాన్ని ఎలా నడిపించుకుని రావాలా అని కారణం కూడా కావొచ్చు. కానీ నాతో మాత్రం ‘మన బాధలని పక్కింటి వాళ్లతో చెబితే ఒరిగేదేముండదు. కానీ భగవంతునితో చెబితే ఫలితం ఉంటుంది. అది కూడా పాట ద్వారా నివేదిస్తే భగవంతుడికి ఎంతో ప్రీతి’ అనేది. అది నా మనసులో నాటుకుపోయింది. నాకు పదేళ్లు వచ్చేసరికి ఆల్‌ఇండియా రేడియోలో వచ్చే బాలానందంలో సొంతంగా కన్నయ్యపై పాట కట్టి పాడాను. నేను తిరుపతి యూనివర్సిటీలో సంగీతం ప్రత్యేకాంశంగా బీఏ చేశాను. అప్పట్లో మా కాలేజీకి తితిదే ఛైర్మన్‌ అన్నారావు గారు తదితరులు తరచూ వస్తుండేవారు. గోవిందునిపై భక్తి పాటల్ని నేనంత ఆసక్తిగా, తియ్యగా ఆలపించడం, సొంతంగా స్వరపరచడం, పాడటం చూశాక అప్పుడే ప్రత్యేకించి నాకు ఉపకారవేతనం ఇచ్చారు. ఆ ఉపకారవేతనాలు ఇవ్వడం నాతోనే మొదలయ్యింది. కళాశాలలో ఉండగా అందరూ నీగొంతు బాగుంది సినిమాల్లో పాడితే మంచి భవిష్యత్తు ఉంటుందనడంతో సినీరంగంవైపు ఆసక్తి పెరిగింది. కానీ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. ముఖ్యంగా అన్నకి, నాన్నకి అస్సలు ఇష్టం లేదు. అయితే నా పోరు భరించలేక మద్రాస్‌ వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నాం. కానీ ఆ ముందు రోజే తితిదే నుంచి నన్ను కళాకారిణిగా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. నిజానికి ఆయనకు కావాలంటే దేశంలో ఎంతోమంది గొప్పగొప్ప కశాకారులు ఉన్నారు. కానీ ఆ అవకాశం నాకే రావడంలో ఆంతర్యమేంటి అని ఎంతోసేపు ఆలోచించాను. చివరికి ఒక స్థిర నిర్ణయానికి వచ్చాను. నేను బతికినన్నాళ్లు నీ పాటలు పాడుతూ గడిపేస్తాను స్వామీ! అని వేంకటేశ్వరునికి మాట ఇచ్చాను. ఆ మాట కోసం గడిచిన 35 ఏళ్లుగా కష్టాలనీ... అవమానాలని మరిచి స్వరార్చన చేస్తూనే ఉన్నాను.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి