తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

వద్దు బాబోయ్‌! ‘బొన్సాయి సంగీతం’

  • 215 Views
  • 0Likes
  • Like
  • Article Share

    టి.ఉదయ్‌కుమార్‌

  • చెన్నై,
  • 9003063571

ఉపాధ్యాయుడు, నాటక రచయిత, పాత్రికేయుడు, చలనచిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు... బహుముఖ ప్రజ్ఞకు పర్యాయపదం సింగీతం శ్రీనివాసరావు. అర్ధ శతాబ్దపు చలనచిత్ర ప్రయాణంలో ఆణిముత్యాల్లాంటి ఎన్నో వెండితెర కావ్యాలకు రూపమిచ్చిన సృజనశీలి ఆయన. భాషా సంస్కృతులంటే ప్రాణం పెట్టే సింగీతం... ‘మార్పు’ను స్వాగతిస్తారు. కాలానుగుణంగా వచ్చేవాటిని అంగీకరించకపోతే ఏవీ మనుగడ సాగించలేవని చెబుతారు. ఇంతకూ ఆయన ఏ విషయంలో ఎలాంటి మార్పులు రావాలని ఆశిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు...  తెలుసుకోవాలంటే ‘తెలుగు వెలుగు’తో ఆయన పంచుకున్న అభిప్రాయాలను అవలోకించాల్సిందే. 
తె.వె.: ఉపాధ్యాయ వృత్తిని వదిలి చలనచిత్రాల్లోకి రావడానికి కారణం?

సింగీతం: నాకిష్టమైనవి రెండు. ఒకటి ఉపాధ్యాయవృత్తి. రెండోది చలనచిత్ర రంగం. నా ఆదర్శాలతో సొంత బడి పెట్టుకోవాలనేది నా ఆశ. అందుకనే ఉపాధ్యాయుడిగా పనిచేశాను. నెలకోసారి నా తరగతికి నేను పరీక్ష పెట్టాలి. ప్రశ్నపత్రాన్ని తయారు చేసి పిల్లలకు పంచాను. ఆనవాయితీ ప్రకారం పిల్లలు వాళ్ల పుస్తకాలు నా బల్లమీద పెట్టాలి; కాపీ కొట్టకుండా. నేనదేం పట్టించుకోకుండా పుస్తకం చదువుతూ కూర్చున్నాను. ‘వీడెవడో కొత్తవాడు, అమాయకుడ’ని వాళ్లు లోలోన నవ్వుకుంటూ, కాపీ కొట్టి పరీక్ష రాశారు. రాసిన పత్రాలు నాకివ్వబోతే... ‘వద్దు మీ దగ్గరే ఉంచుకోండి. ఇప్పుడు మీ పుస్తకాలు తీసి మీ జవాబులు మీరే దిద్దుకొని, మార్కులు వేసుకోండి’ అన్నాను. ‘ఇప్పుడు మీకెన్ని మార్కులు వచ్చాయో ఎవరికీ చెప్పకుండా ఈ బుట్టలో పడేయండి’ అన్నాను. అంతా నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత మళ్లీ ఏ పరీక్షలో పిల్లలు కాపీ కొట్టలేదు. ఇంతవరకు వాళ్లలా చేయడం తల్లిదండ్రులు కోపగించుకుంటారనో, ఉపాధ్యాయుణ్ని మెప్పించడానికో అనుకుంటా. ఇప్పుడు పరీక్ష తమ మంచికే అని వాళ్లకు అర్థమైంది. ఆ తర్వాత కేవీ రెడ్డిగారి దగ్గర్నుంచి కబురు రావడంతో ఇటువైపు వచ్చేశాను.
తెలుగుభాషా సంస్కృతులపై మీ అభిప్రాయం?
రాయలవారు ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని సగర్వంగా చెప్పారు. కానీ నాకో అనుమానం... రాయలవారన్న తెలుగుభాష రాజ్యంలో ప్రజలు మాట్లాడుకొనేదా, లేక అష్టదిగ్గజాలు రోజూ తనకు వినిపించే కావ్యాలభాషా? అని. ఎలాగైతేనేం ఉర్దూ, ఇంగ్లిషు, ఇంకా ఎన్నో భాషల పదాలు చేరి ఆధునిక తెలుగు తయారైంది. ‘గద్య కావ్యము వ్రాయుట ఒక ప్రజ్ఞకాదు’ లాంటి విమర్శలు ప్రజాశక్తి ముందు నిలవలేకపోయాయి. నవలలు, కథలు, పత్రికలు మనకు లభ్యమయ్యాయి. భాష జీవనదిగా ప్రవహిస్తుండేది. ఎందుకో ఈమధ్య ఆ నది నిలిచిన నీళ్లతో ఉన్న చెరువులా మారింది. భాషను యువత కాకుండా ఇంకా పెద్దలే నడిపించడం దీనికి కారణం. యువత ముందుకు వచ్చి పగ్గాలు చేజిక్కించుకుంటేనే భాష జీవనదిలా ప్రవహిస్తుంది.
సాహిత్యంలో మీకు ఇష్టమైన ప్రక్రియ...
చిన్నప్పుడు ఛందస్సు నేర్చుకోగానే ప్రబంధం రాయాలని ఆవేశపడ్డా. సినిమాల్లో చేరక ముందు ఏవో కథలు, నాటికలు రాశా. చేరాక ‘స్క్రీన్‌ప్లే’ అనే కొత్త ప్రక్రియకు పరిచయమయ్యా. దాని వ్యాకరణం వేరు. ఛందస్సు వేరు. దృక్పథం వేరు. ఇదో ప్రత్యేక కళ అని తెలుసుకున్నా. దాంతో మమేకమైపోయా. ఇప్పుడు ఇదే నా ఊపిరి.
మీపై ప్రభావం చూపిన తెలుగు పుస్తకాలు
అనుభవాలు మారే కొద్దీ ప్రభావాలు మారుతుంటాయి. పోతన ప్రాసలంటే ఇష్టం. నా గురువు పింగళి రాసిన ‘ఎంతహాయి ఈ రేయి...’ పాటలోని ‘చందమామ చల్లగా మత్తుమందు చల్లగా’ లాంటివి విన్నప్పుడు పోతన పద్యాల్లోని ప్రాసలు గుర్తొచ్చేవి. దర్శకుడైన తర్వాత అదే పోతన మరో అవతారంలో కనిపించాడు. ఓ ఫ్రెంచి చిత్రంలో సముద్రంలో ఈదుకుంటూ కొందరు ఒకతన్ని వెంటాడుతుంటారు. అతను ఒడ్డుకు చేరతాడా, వాళ్ల నుంచి తప్పించుకుంటాడా అన్న ఉత్కంఠ. ఇదే ఉత్కంఠ అంబరీషోపాఖ్యానంలో కనిపించింది. ‘అని శ్రీవల్లభు డానతిచ్చిన...’ పద్యంలో వివిధ కోణాల నుంచి తీసిన షాట్లతో అద్భుతమైన స్క్రీన్‌ప్లే కనిపించింది. ప్రాస కనిపించలేదు. గద్య రచనలో ఎందరో మహానుభావులు నాకు ఆదర్శమూర్తులు. ఆత్రేయ, కాళీపట్నం  రామారావు... ఇలా. నాకు జీవనమార్గాన్ని సూచించింది పఠాభి. అంతేకాదు పఠాభి వ్యక్తిగా నాకు దగ్గరివాడు. శ్రీశ్రీ, నేను జయంతి స్టూడియోలో రోజూ కలిసేవాళ్లం. గంటల తరబడి మాట్లాడుకునే వాళ్లం.   ఆరుద్ర అన్నా అభిమానమే. 
దర్శకుడిగా రచయితలను మీరేం అడుగుతారు? వారేం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు?
ఏమీ అడగను. రచయిత ఏం చెప్తాడో వినడానికి కుతూహలపడతాను. రచయిత మనం చెప్పింది రాసే గుమాస్తా కాదు. దర్శకుడి మనసులో మెదిలే సాధకబాధకాలకు ఆతీతంగా, సమస్యలను పట్టించుకోకుండా స్వచ్ఛమైన దృశ్యాన్ని ఆలోచించే ప్రక్రియ అతనిది. అతనితో కనీసం రెండు వారాల మేధోమథనం ఉంటుంది. ఇద్దరి భావాలూ ఒకే శ్రుతిలో, ఒకే తాళంలో నడిచేట్లు చూసుకుంటాం. అప్పుడే మేం అనుకున్నది అనుకున్నట్టు తెరమీద కనిపిస్తుంది. ఆదిత్య 369లో నా మొదటి కథనం వేరు. ప్రజాస్వామ్యంలోనే ఇన్ని రాజకీయాలు నడుస్తూంటే, రాచరికపు రోజుల్లో ఎంతుండాలి? కొత్త కవులెవరైనా వస్తే తమ స్థానానికి ఏ ముప్పు వస్తుందో అని అష్టదిగ్గజాలు దిగులుపడతారా? రాజకీయాలు చేస్తారా? పైపైన నవ్వుకున్నా లోలోపల ఒకరిమీద ఒకరు చెడు ప్రచారాలు చేస్తుంటారా? రాయలవారు వాళ్ల వెనక గూఢచారులను పెట్టారా? రాయలవారి అంతరంగం కనిపెట్టడానికి ధూర్జటి రాణీవాసంలోని అమ్మాయిలతో స్నేహం చేశాడా? ఇదంతా చూసిన ఈ కాలపు హీరో ఆ కాలం కన్నా మనకాలమే గొప్పదని తేల్చడం నా ధ్యేయం. నిన్నటికన్నా నేడు, నేటికన్నా రేపు గొప్పది. జీవితం ప్రతిక్షణం మెరుగుపడుతూ ముందుకు సాగిపోయేదేగాని వెనకడుగు వేసేదికాదని నా నిశ్చితాభిప్రాయం. ఈ సినిమా కథా రచయిత జంధ్యాల కూడా ఎంతో ఉత్సాహం కనబరిచాడు. వారం రోజులు చర్చించాం. కథ అద్భుతంగా తయారైంది. ఉన్నట్లుండి ఒక నిజం గుర్తుకొచ్చింది. అది ఇవాళ్టి మన సమాజంలో నిండుకుపోయిన మితిమీరిన అసహనం. సినిమా విడుదల కాగానే ‘అల్లసాని పెద్దనను కించపరుస్తావా? రాయల వారిని అంతహీనంగా చూపిస్తావా?’ అంటూ ఎవరైనా గొడవకొస్తారేమో అని! అంతే ఒక్కసారిగా కథను మార్చేశాం. పూర్తి వినోద ప్రధానంగా చేశాం.
ప్రస్తుత నాటకరంగంపై మీ అభిప్రాయం?
ప్రస్తుత తెలుగు నాటకరంగంపై నాకంత అవగాహన లేదు. కాకపోతే నా మిత్రుడు క్రేజీమోహన్‌ చెన్నైలోనే సంవత్సరానికి వంద  తమిళ నాటక ప్రదర్శనలిస్తారు. నాకు తెలిసి బాలచందర్‌గారి దగ్గర్నుంచి చో, సుందరం లాంటి వాళ్లతో తమిళ నాటకరంగం ఇంకా వెలుగులీనుతోంది. కర్ణాటకలోనూ నాటకాలు జనాదరణ పొందుతున్నాయి. ఇక్కడ అలాంటి పరిస్థితి ఎందుకు లేదో అర్థంకావడం లేదు. ఈ మధ్య నేను డా.యల్లాప్రగడ సుబ్బారావు జీవితాన్ని నాటకంగా రాశాను. దీన్ని కాలేజీల్లో ప్రదర్శించాలని, ఆయన సేవ యువతను ఉత్తేజపరచాలన్నది నా ఆశ.
భారతీయ సంప్రదాయ కళలకు ఆదరణ ఎలా ఉంది?
సంప్రదాయ కళలు ఎప్పటికప్పుడు కొత్తదాన్ని జత చేసుకొని సాగిపోతుంటేనే అవి సజీవ కళలుగా తరతరాలు నిలిచిపోతాయి. లేకపోతే ఒక సంగ్రహాలయానికి పరిమితమై పోతాయి. ఉదాహరణకు, సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితర్‌ సోదరుడు బాలుస్వామి దీక్షితర్‌ని పన్నెండేళ్లప్పుడు వాళ్ల నాన్న మద్రాసుకు తీసుకెళ్తే, అక్కడ ఈస్టిండియా వయొలిన్‌ వాయించడం చూశాడు. బాలుస్వామి దాన్ని తీసుకొని అరగంటలో అద్భుతంగా వాయిస్తే, అతనా ‘వయొలిన్‌’ను బాలుస్వామికి బహుమతిగా ఇచ్చాడు. బాలుస్వామి మొట్టమొదటిసారిగా శాస్త్రీయ కర్ణాటక సంగీతంలోకి వయొలిన్‌ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు వయొలిన్‌ లేనిదే కర్ణాటక సంగీతం ఉందా? ఇది పాశ్చాత్య వాయిద్యమని తోసెయ్యగలమా? ఇది లేకుంటే మనకు ద్వారం వెంకటస్వామినాయుడు, లాల్‌గుడి జయరామన్‌ లాంటి వాళ్ల సంగీతం దక్కేదా? అంతేకాదు, ముత్తుస్వామి దీక్షితర్‌ కర్ణాటక సంగీత మనోధర్మానికి భిన్నంగా, నిర్ధారిత స్వరాలతో సృష్టించిన పాశ్చాత్య సంగీతాన్ని అనుసరిస్తూ సుమారు నలభైౖ ‘నోటు స్వరాల’ను స్వరపరిచాడు. అదో మహత్తర సృష్టి. మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించే మహానుభావులు వాళ్లు. అందుకే కర్ణాటక సంగీతం ఒక జీవకళగా ముందుకు సాగుతూనే ఉంది. సంప్రదాయం అంటే ఇదే. అంతేకాని ‘ఇందులో ఏదీ చేరకూడదు, మలినమైపోతుంది’ అనుకున్నంత కాలం ఏ కశా వృద్ధి పొందదు. అవి మరుగునపడక తప్పదు. ‘వాటిని పైకి తేవాలి. రక్షించాలి’ అనే ఉపన్యాసాలే మిగులుతాయి.
సంగీత సాహిత్య ప్రధానంగా చిత్రాలు తీస్తే ఈ తరం ఎలా స్వీకరిస్తుంది... 
ప్రతి సినిమాలోనూ పాటలుంటాయి. కానీ సంగీత ప్రధానమనే సర్టిఫికెట్టు వాటికి రాదు. శాస్త్రీయ సంగీతపు పై మెరుగులు పూసుకున్న పాటలుంటే అవి సంగీత ప్రధాన చిత్రాలుగా చెలామణి అవుతాయి. మర్రిచెట్టు పెద్దది. గంభీరంగా ఉంటుంది. గులాబీ మొక్క చాలా చిన్నది. అందంగా ఉంటుంది. రెండూ గొప్పవే. కానీ మర్రిచెట్టు వేళ్లను కత్తితో కాస్త చెక్కి నాటితే అది రెండు అడుగుల మర్రిచెట్టుగా తయారవుతుంది. ఇదే ‘బొన్సాయి’ కళ. నవమన్మథాకారుడిగా పుట్టవలసిన వాణ్ని మరుగుజ్జుగా పుట్టించే కళ. ఈ కళ అంటే నాకు ఒళ్లు మంట. సినిమా సంగీతంలోనూ ఇంతే. గంటసేపు ఆలాపన చేసి తన్మయపరిచే తోడి రాగమూ గొప్పదే. మూడు నిమిషాల్లో తన తియ్యదనాన్ని వెదజల్లే ‘రావోయి చందమామ’ పాటా గొప్పదే. అటూఇటూ కాక పుట్టుకొచ్చిన ‘సినిమా’ శాస్త్రీయ సంగీతమే ‘బొన్సాయి’ సంగీతం. బాగా తెలిసిన వాళ్లు మాట్లాడరు. తెలియని వాళ్లూ మాట్లాడరు. సగం తెలిసి, సగం తెలియని వాళ్లతోనే వస్తుంది సమస్య అంతా. ‘భైరవద్వీపం’లోని ‘శ్రీతుంబుర నారద..’లో సురేష్‌ సంగీతమూ వేటూరి రచన, రెండూ అద్భుతంగా ఉన్నాయి. కానీ ‘నరుడా ఓ నరుడా’ లాంటి పాటలూ తక్కువేం కావు. స్వరాలు వినగానే చప్పట్లు కొట్టెయ్యడం అలవాటైపోయింది. జ్యూరీ సభ్యులు కూడా ఇంతే. వంద పాటలు వింటూంటే, ఉన్నట్టుండి ఎక్కడో స్వరాలు వినిపించగానే ‘ఆహా దీనికే అవార్డు’ అనేస్తున్నారు. సినిమాలు సంగీత ప్రధానంగా ఉండటం భారతీయ సినిమా ప్రత్యేకత. ఈ పాటల్లో పరిమళం ఉంది. సంప్రదాయం ఉంది. శాస్త్రీయ సంగీతం ఇతివృత్తంగా తీసుకోవచ్చు. దానికే... తగిన పాటలు అందులో పొందుపరచవచ్చు. కానీ ఆ పాటలే మిగిలిన వాటికన్నా గొప్పవనడం ‘బొన్సాయి’ సంగీతానికి పట్టంకట్టడమే.
మీకు సంతృప్తినిచ్చిన స్వీయరచన
పెద్దగా రచనలు చెయ్యలేదు. ఎప్పుడో రాసిన నాటిక ‘అంత్యఘట్టం’ అప్పుడప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రదర్శిస్తుంటారు. ఇటీవల రాసిన 21 కథల సంపుటి ‘కరాజు కథలు’. టంగుటూరి సూర్యకుమారి నటించి నేను రచించి, దర్శకత్వం వహించిన నాటకం ‘చిత్రార్జున’ నెహ్రూ ప్రశంసలనందుకుంది.  స్కాట్లండ్‌ రచయిత టామ్‌బుకన్‌ దీన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.
సాంకేతిక ప్రగతి సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుందా?
ముమ్మాటికి. రాతప్రతులతో సరిపెట్టుకున్న ప్రపంచం అచ్చు పుస్తకాలొచ్చేసరికి కొన్ని వేల రెట్లు సాహిత్య ప్రభావం చూసింది. ఒకప్పుడు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే కొన్ని నెలలు లైబ్రరీల చుట్టూ తిరిగే వాణ్ని. ఇప్పుడు అంతర్జాలం ద్వారా క్షణాల్లో  లభ్యమవుతోంది. హాలీవుడ్‌ రచయిత మార్క్‌ జస్లోవ్‌తో నెలరోజులు రోజూ ‘చాట్‌’ చేసి స్క్రిప్టు తయారు చేసుకున్నా. సాంకేతిక ప్రగతి అంటే ప్రజల ప్రగతి.
తెలుగు సినిమాల్లో తెలుగు తప్ప అన్ని భాషలూ వినిపిస్తున్నాయనే విమర్శ ఉంది
ఒక్క ఇంగ్లిషు ముక్కా రాని ఓ ముసలావిడ ‘బస్సు లేటుగా వచ్చింది’ అంటూంటే విన్నాను. ఆమె మాట్లాడింది ఇంగ్లిషా, తెలుగా? ప్రజల స్పందన శక్తిమంతమైంది. ఒంటబట్టని మాట ఎంతమంది రుద్దినా స్వీకరించరు. వాళ్లకు ఉపకరిస్తుందంటే, లక్ష మంది వద్దన్నా ఏ భాషా పదాన్నైనా స్వీకరిస్తారు. ఆ దృష్టితో చూస్తే ఈ సినిమాల్లోని భాష తెలుగులా కనిపించొచ్చు. కల్తీ లేని స్వచ్ఛమైన తెలుగు సంభాషణలతో ఒక చిత్రం తీసి చూపిస్తే, సినిమా బాగుంది. తెలుగులో డబ్‌ చేస్తే ఇంకా బాగుంటుంది అనే పరిస్థితి ఇవాళ.
మాతృభాష సంస్కృతుల విషయంలో విదేశీయుల్లో మీరు గమనించింది... 
ముందు చెప్పకోవాల్సింది వాళ్ల ఆత్మాభిమానం. అదే వాళ్ల భాషను, సంస్కృతిని కాపాడుతోంది. హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలిసిన వాళ్లు. మనం గౌరవప్రదంగా నడుచుకుంటే మన జాతికి దేశానికి గౌరవప్రదంగా ఉంటుందని నమ్మిన వాళ్లు. ఉదాహరణకు కాపీరైట్‌ చట్టాన్ని బాధ్యతతో అనుసరిస్తారు. ఇక్కడిలాగా కాపీ కొట్టు ఎవరు చూడొచ్చారు? అనే రకంకాదు. పైగా వాళ్ల భాష, సంస్కృతులను కాపాడుకోవటానికి కావాల్సిన ఆర్థికబలం కూడా వాళ్లకుంది.
ఆంగ్లపదాలు తెలుగులోకి వెల్లువెత్తుతున్నాయి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఏది తెలుగో, ఏది కాదో సాధికారికంగా నిర్ధరించే ప్రక్రియ లేకపోవడం ఈ సమస్యకు కారణం. ఆంగ్లభాష అంత అభివృద్ధి చెందడానికి కారణం ఏ భాష నుంచైనా ఏ మూలనుంచైనా ఒక కొత్త పదం వచ్చిందంటే ఆంగ్ల ప్రజల దైనందిన జీవనానికి ఉపకరిస్తుందంటే, ఆ పదాన్ని వాళ్లు స్వీకరిస్తారు. నిఘంటువులో చేరుస్తారు. ముఖ్యంగా సాంకేతిక పరిభాషా పదాలు లాటిన్, గ్రీక్‌ భాషల నుంచి వచ్చినవే. ఉదాహరణకు సల్ఫర్, కార్బొనేట్, ఆల్జీబ్రా, లాంటివి. ఇవే వాడాలి గాని ప్రత్యామ్నాయ పదాలు వాడనివ్వరు. మనకు రోడ్డు, సినిమా, ఓటు లాంటి ఎన్నో పదాలు మొదట్లో ఆంగ్లపదాలైనా ఇవన్నీ తెలుగు పదాలయ్యాయి. నేను డాడీ, మమ్మీ పదాల్ని గురించి మాట్లాడటం లేదు. తెలుగుగా నిర్ధరించిన పదాల్ని నిఘంటువులోకి చేర్చాలి. ఇది తెలుగు అనే సంప్రదాయాన్ని సృష్టించాలి. పరిమిత పరిధిలో ఆలోచించకుండా రెక్కలు విప్పి కాస్త ఎగరడానికి ప్రయత్నిస్తే చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ముఖ్యంగా పరిశోధన రంగంలో వైద్యశాస్త్రానికి సంబంధించి మనం చాలా వెనకబడి ఉన్నాం. అనువాదాలు వెతుక్కుంటూ పోతే, మనం రెండు సాంకేతిక పదాలను అనువదించేలోగా వంద కొత్త పదాలు పుట్టుకొస్తాయి. ఇక ఆటిజం, ఏస్పెర్జర్స్‌ సిండ్రోమ్‌ ఉన్న పిల్లలు అన్ని దేశాల్లో లాగే మనదేశంలోనూ అధికంగా ఉన్నారు. వాళ్లకు కొన్ని మానసిక సమస్యలున్నాయి. కాని వాళ్లలో ఐన్‌స్టీన్‌ లాంటి మేధావులుంటారు. అన్ని దేశాల్లో వాళ్లను ప్రత్యేకంగా చూసుకొంటారు. మన దేశంలో ఇలాంటిదొకటి ఉన్నట్టుగా కూడా చాలా మందికి తెలిసినట్లు లేదు. ఇలాంటి సందర్భాలలో భాషను గురించిన నిర్ణయాలు ఉద్దేశపూరితంగా కాక, శాస్త్రీయంగా ఆలోచించి చెయ్యాలి. మనకు ఇవాళ, మళ్లీ పోతనలు, శ్రీనాథుళ్లు రావాలి. కానీ అంతకంటే ముందు యల్లాప్రగడ సుబ్బారావులు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు రావాలి.


నెల్లూరులో పుట్టి... మద్రాసులో ఎదిగి... 
సింగీతం శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సెప్టెంబరు 21, 1931న జన్మించారు. తండ్రి రామచంద్రరావు ప్రధానోపాధ్యాయుడు. తల్లి శకుంతలాబాయి సంగీత విద్వాంసురాలు. సింగీతం మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నారు. హరీంద్రనాథ చటోపాధ్యాయ వంటి వారి ముందు అప్పట్లోనే నాటకాలు ప్రదర్శించారు. ఆ తర్వాత సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ సమయంలో ‘బ్రహ్మ’, ‘అంత్యఘట్టం’ అనే రెండు ప్రయోగాత్మక నాటకాలు రాశారు. వాటిని తన విద్యార్థులతో ప్రదర్శింపజేశారు. అవి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత రోజుల్లో ‘అంత్యఘట్టం’... ఆంధ్ర విశ్వవిద్యాలయం థియేటర్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకమైంది. ‘తెలుగు స్వత్రంత్ర’ పత్రిక కోసం ప్రముఖుల ముఖాముఖిలు చేశారు సింగీతం. ప్రఖ్యాత దర్శకుడు కేవీ రెడ్డికి సహాయకుడిగా 1954లో సినీ జీవితం ప్రారంభించారు. 1972లో వచ్చిన ‘నీతి నిజాయతీ’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ‘మయూరి, అమావాస్య చంద్రుడు, పుష్పకవిమానం, భైరవద్వీపం’ తదితర చిత్రాలతో తెలుగువారికి చిరపరిచితులయ్యారు. తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు తీశారు. సాలూరి రాజేశ్వరరావు శిష్యుడైన సింగీతం కొన్ని కన్నడ చిత్రాలకు సంగీత దర్శకత్వమూ వహించారు. ‘సన్‌ ఆఫ్‌ అల్లాద్దీన్‌’ 3డీ యానిమేషన్‌ చిత్రానికి అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రత్యేక జ్యూరీ పురస్కారం లభించింది.


ఆంగ్ల మాధ్యమ చదువులపై మీ మాట... 
నిజంగా ఆంగ్ల మాధ్యమం కన్నా తెలుగు మాధ్యమంలో నేర్చుకుంటేనే విషయం సులభంగా అర్థమవుతుంది. మన భాషలో మాట్లాడినంత హాయిగా పరాయి భాషలో మాట్లాడలేం. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ‘టేక్‌ ఎ బీకర్‌ ఆఫ్‌ వాటర్‌ ఎండ్‌ పుట్‌ ఫైవ్‌ డ్రాప్స్‌ ఆఫ్‌ సల్ఫ్యూరిక్‌ ఏసిడ్‌’ అనడం కన్నా ‘నీళ్లున్న ఒక బీకరు తీసుకొని అందులో అయిదు చుక్కలు సల్‌ఫ్యూరిక్‌ ఆమ్లం’ పోయాలి అనడం సులభం. మరీ ఛాందసానికి పోయి ‘ఒక ద్రవధారణిలో అయిదు బిందువుల గంధకీకామ్లాన్ని పోయవలెను’ అనమంటే విద్యార్థి భయపడి పారిపోతాడు. నేను తెలుగు మాధ్యమం బడిలో ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు భౌతికశాస్త్రానికి ఎందుకో నాలుగు పుస్తకాలొచ్చాయి. ‘కోన్‌’ అన్న పదానికి ఒకరు ‘కోను’ అని రాశాడు. మరొకరు ‘శంకువు’ అని రాశారు. మరొకరైతే ‘అథోవృత్త ఊర్ధ్వాగ్రము’ అని రాశారు. ఈ విషయాన్ని నేనప్పుడు పైఅధికారులకు చెప్తే పట్టించుకున్న నాథుడు లేడు. ఇలాగైతే పిల్లలు ఏం కావాలి? వాళ్ల భవిష్యత్తు ఏంటి? ఇలాంటి పరిస్థితులను చూసి భయపడే చాలామంది ఆంగ్ల మాధ్యమం కోరుకుంటున్నారు.
మాతృభాషను ఎందుకు కాపాడుకోవాలి?
మాతృభాష మన ఆస్తి. మన తల్లి. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. ఎందుకు కాపాడుకోవాలి? ఒక జాతి ఆనందం, û•ప్పి అని ధ్వనించేది మాతృభాషలోనే. కానీ నేడు దానిని గురించిన కృషి హృదయంలోంచి కాకుండా, నోటిమాటల్లో సాగుతోంది. ఇప్పుడు సదస్సులు, చర్చలు అంటే ఎక్కువ భాగం అదే భారత భాగవతాలు, అష్టదిగ్గజాలు... ఆధునికం అంటే శ్రీశ్రీ... నాటకం అంటే కన్యాశుల్కం... ఇంకా భువనవిజయాలు, దుర్యోధన ఏకపాత్రాభినయాలు... ఇంతకుమించి లేవు. నేటి యువతరంలో చెలరేగుతున్న భావాలు, ఉద్భవించే కవితలూ ఎక్కడా కనిపించవు. నేû•క సదస్సును నిర్వహిస్తే అందులో యువకులే ప్రధాన పాత్రధారులు. చర్చలు చేసేదంతా వారే. నలభై ఏళ్లకు పైబడ్డవాళ్లు ఓ మూలకూర్చొని చూడొచ్చు. పాల్గొనడానికి వీల్లేదు. ఇలా జరిగితే అయిదు సంవత్సరాలలో తెలుగు గడ్డమీద తెలుగు భాష ఎలా విజృంభిస్తుందో మీరే చూస్తారు. ఇక మాతృభాష అంతరిస్తే అంటారా? అసంభవమది.
భాషా సంస్కృతుల విషయంలో ఎక్కడైనా స్ఫూర్తిదాయక కృషి జరుగుతోందా?
నేను చదివింది, విన్నది. కొన్ని ఐరోపా దేశాల్లో ఇంటర్నెట్‌ ద్వారా పిల్లలు తమంతట తామే నేర్చుకునే పద్ధతి పెట్టారు. ఇలా భాషను వాళ్లమీద రుద్దకుండా వాళ్లే ఇష్టపడేట్టు చేస్తున్నారు. మరోవైపు వ్యాపార, సాంకేతికాభివృద్ధికి వేరే భాషలు నేర్చుకోవడం అవసరమైతే దానిని రెండో భాషగా పెడతారు. విద్యార్థులు కూడా ఈ రెండో భాషను దీక్షతో అభ్యసిస్తారు. ఏది దేశ భవిష్యత్తుకు ఉపకరిస్తుందో దాన్నే పాటిస్తారు. అదే మనం నేర్చుకోవాల్సింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి