తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

కొత్త మాటల్ని వాడటానికి మీరెవరు?

  • 240 Views
  • 0Likes
  • Like
  • Article Share

యూదులు తమ స్వస్థలాన్ని వదిలి ప్రపంచం నలుమూలలకూ చెదిరిపోయారు. కానీ, వాళ్ల భాషను, సంస్కృతిని కాపాడుకున్నారు. మనం ఎక్కడికీ పోకుండానే తెలుగు మర్చిపోతున్నాం.
   రసాయన శాస్త్రం లోతుపాతుల నుంచి విశ్వంతరాళాల రహస్యాల వరకూ అన్నింటిపైనా సాధికారికంగా, సులభగ్రాహ్యమైన తెలుగులో అయిదు పుస్తకాలు రాశారు. వందల వ్యాసాలు ప్రచురించారు.
   విజ్ఞానశాస్త్ర ఆచార్యుడిగా విశ్వవిద్యాలయంలో పిల్లలకు పాఠాలు చెబుతూ, శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తూ, తెలుగు - ఆంగ్లం, ఆంగ్లం - తెలుగు నిఘంటువులు కూర్చారు.
*    వైజ్ఞానిక, సాంకేతిక రంగాలతో సహా అన్ని చోట్లా వెల్లువెత్తుతున్న ఎన్నో ఆంగ్ల పదాలకు కొత్తగా తెలుగు మాటలను సొంతంగా సృష్టించారు.
*     అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(బర్కిలీ)లో తెలుగు పీఠం ఏర్పాటు చేయించారు. కాలికి బలపం కట్టుకుని, జోలె పట్టుకుని మరీ విరాళాలు సేకరించి అక్కడ తెలుగు బోధనను ప్రారంభింపజేశారు. 
ఈ పనులన్నింటినీ చేసింది ఒక్కరే. ఆయనే ఆచార్య వేమూరి వెంకటేశ్వరరావు. అర్ధ శతాబ్దం కిందట తెలుగు నేలను విడిచిపెట్టి వెళ్లిన ఆయన, తెలుగును విడిచి అర క్షణం కూడా ఉండలేరు. అందుకే వృత్తి జీవితంలో తీరిక లేకున్నా తెలుగు కోసం సమయం మిగుల్చుకున్నారు. ఏడు పదులు దాటినా తరగని ఉత్సాహంతో తెలుగు కోసం పని చేస్తున్న ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
తె.వె.: ఆంగ్ల పదాలకు ఏకపద తెలుగు ప్రత్యామ్నాయాలను ఎలా సృష్టించగలిగారు?
వేమూరి: వ్యాక్సినేషన్‌ను తెలుగులో ఏమంటాం? టీకాలు వేయడం. ఇందులో రెండు పదాలున్నాయి. కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే? లాటిన్‌ భాషలోని ‘వక్కా’ నుంచి ఈ వ్యాక్సీనేషన్‌ వచ్చింది. వక్కా అంటే ఆవు. దానికి సంస్కృతంలో దగ్గర పదం ‘వత్స’. దీని అసలు అర్థం దూడ. పూర్వం ఎవరినైనా గౌరవంగా పిలవాలంటే... పెద్దవాళ్లనయితే ఎద్దుతో, పిల్లలను దూడ (పెయ్య)తో పోల్చేవాళ్లు. వక్కా, వత్సలకు పోలిక ఉంది కాబట్టి వ్యాక్సీనేషన్‌ను ‘వత్సీకరణ’ అన్నా. ఇలా కొన్ని వందల ఆంగ్ల మాటలను, వాటి వ్యుత్పత్తులను అధ్యయనం చేశా. వాటికి తెలుగు పదాలను తయారు చేయడం కోసం ఎంతో శ్రమిస్తా. ఎన్నో పుస్తకాలు చదువుతా. లాజికల్‌గానే మాటలు సృష్టిస్తా. ఉదాహరణకు అపాయింట్‌మెంట్‌... దీనికి సరైన తెలుగు మాట లేదు. నేను ‘అభిసారం’ అన్నా. అభిసారిక అనే మాట నుంచి దీన్ని తీసుకున్నా. ముందే అనుకున్న స్థలానికి వెళ్లి ప్రియుణ్ని కలుసుకునే ప్రియురాలే అభిసారిక. ఈ అర్థంలోంచే అపాయింట్‌మెంట్‌కు ‘అభిసారం’ అని లాగా. కొత్తగా తయారు చేసిన మాటలను ప్రచారంలోకి తేవడానికి కథలు రాస్తా. వాటిలో ఆ మాటలను వాడతా. కానీ, నిఘంటువుల్లో లేని పదాలను మీరెలా వాడతారని కొందరు వాదిస్తారు. కథలను ప్రచురణ కోసం పంపినప్పుడు... మమ్మల్ని అడగకుండా కొత్త మాటలు ఎలా వాడతారని ఒకరిద్దరు పత్రికా సంపాదకులూ తగువేసుకుంటారు. ఎంతమందిని అడగాలి? ఎందుకు అడగాలి? అలా అని నేను చెప్పినవే వాడాలని కాదు. ఇంకాస్త సులువుగా చేయగలం అనుకుంటే కొత్త మాటలు తయారు చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే, తెలుగు మాటల్నే వాడాలి. వాడుతున్న కొద్దీ భాష వాడిగా తయారవుతుంది. లేకపోతే వాడిపోతుంది.
మరి విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో వెల్లువెత్తుతున్న ఆంగ్ల పదాలను తెలుగు చేసుకోవడమెలా?
అన్ని పదాలనూ తెలుగులోకి మార్చక్కర్లేదు. కంప్యూటర్‌ సైన్స్‌ లాంటి కృత్రిమ విజ్ఞానశాస్త్ర శబ్దాలను తెలుగులోకి అనువదించడం కష్టం. సహజ విజ్ఞానశాస్త్ర (నేచురల్‌ సైన్స్‌) పదాలను సులువుగా అనువదించుకోవచ్చు. ఉదాహరణకు క్రోమోజోమ్‌ అంటే గ్రీకులో అర్థం రంగు పదార్థం. క్రోమోజోమే డీఎన్‌ఏ. కాబట్టి తెలుగులో దాన్ని ‘వారసవాహిక’ అనవచ్చు. ఇలా ఎన్నో మాటలను తయారు చేసుకోవచ్చు. అయితే, ఈ క్రమంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. పోలరైజేషన్‌ను ధ్రువీకరణం అని అనువదించారు పెద్దలు. పోలరైజేషన్‌లో పోల్‌ ఉంది. పోల్‌ అంటే ధ్రువం. కాబట్టి ధ్రువీకరణ అనేశారు. కానీ, కాంతిలో ధ్రువాలెక్కడ ఉన్నాయి? ఫోటాన్స్‌ ఉంటాయి. కాంతి గురించి తెలియని రోజుల్లో... ధ్రువాలు ఉండేవి అనుకుని ఆంగ్లేయులు పోలరైజేషన్‌ అన్నారు. తెలియక వారు పప్పులో కాలేశారు. వాళ్ల కాళ్లు పట్టుకుని మనం వేలాడుతున్నాం. 
      సైన్స్‌లో మాట వినగానే అర్థం స్ఫురించాలి. అందుకే, పోలరైజేషన్‌కు ‘తలీకరణ’ అని ప్రతిపాదించా. కాంతి తరంగాలు రెండు వేర్వేరు తలాల్లో కంపిస్తుంటాయి. వాటికి అడ్డంగా అద్దం పెడితే ఒక తలంలో ఉండేది మాత్రమే అవతలికి వెళ్తుంది. రెండోది వెళ్లదు. అదే పోలరైజేషన్‌. అదే తలీకరణ. కానీ, చాలామంది ఒప్పుకోరు. ధ్రువీకరణ అనేది ఇప్పటికే నిఘంటువుల్లో పడిపోయింది.... దాన్నెందుకు మార్చాలంటారు! మరికొందరేమో, కొత్త పదాలను ప్రతిపాదించడానికి మీకు తెలుగులో పీహెచ్‌డీ ఉందా అని ప్రశ్నిస్తారు. సరే, నాకు లేదు. మరి అది ఉన్న వారికి భౌతికశాస్త్ర జ్ఞానం ఉందా? ఉండదు. కానీ, ధ్రువీకరణం అని అనువదించేస్తారు! వాస్తవాలను వారు ఆలకించరు. 
మీ పదాల్లో సంస్కృతమే ఎక్కువగా ఉంది...?
ఆంగ్లంలోని వైజ్ఞానిక పారిభాషిక పదాలన్నీ గ్రీకు, లాటిన్‌ల నుంచి వచ్చాయి. మనం వాటి వ్యుత్పత్తులను అర్థం చేసుకుంటే, సంస్కృతంలో వాటికి సరైన పదాలు దొరుకుతాయి. సంస్కృతం మన భాషలో ఇముడుతుంది. ఆంగ్లం వాడటం కంటే ఇది మెరుగే కదా. 
తెలుగులో వైజ్ఞానిక రచనలు చేయడానికి ప్రేరణ?
ఇంటర్మీడియట్‌లో మాకో ఉపవాచకం ఉండేది. తేలికగా ఉండే ఆంగ్లంలో సైన్స్‌పై వ్యాసాలు ఉండేవి అందులో. ఇలాంటి పుస్తకాలు తెలుగులోనూ ఉంటే బాగుణ్ను కదా అనుకునేవాణ్ని. ఇది 1952-54 నాటి మాట. ఆ తర్వాత అమెరికాలో పీహెచ్‌డీ చేస్తున్న రోజుల్లో రాయడం ప్రారంభించా.
అప్పట్లో లాస్‌ఏంజెలిస్‌ లాంటి ఊళ్లో పదిమందిమి మాత్రమే తెలుగు వాళ్లం ఉండేవాళ్లం. సాయంత్రం అందరం ఒకరింట్లో కలుసుకుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. అలా ఓరోజు ఏదో మాటల సందర్భంలో ‘తెలుగులో సైంటిఫిక్‌ ఐడియాస్‌ చెప్పలేం’ అని అన్నారెవరో. ప్రయత్నిస్తే ఆ పని చేయవచ్చని వాదించా. ఇంటికి వెళ్లిన తర్వాత ఆలోచించా. ఆ రోజుల్లో కంప్యూటర్లు చాలా ప్రాథమిక దశలో ఉన్నాయి. సరే, కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి అన్న విషయంపై తెలుగులో నాలుగు పేజీలు రాద్దామని కూర్చున్నా. ఏకబిగిన రెండొందల పేజీలు రాశా. అయితే, దాన్నేం చేయాలి? తెలుగు పత్రికలకు పంపిద్దామా అంటే, సుదీర్ఘంగా ఉంది కాబట్టి వేసుకోరు. దాన్ని పక్కనపెట్టి పనిలో పడిపోయా. ఆర్నెల్లు గడచిపోయాయి. ఆ తర్వాత చిన్న ఉత్తరం వచ్చింది. అట్లాంటాలో ఓ తెలుగు పత్రిక స్థాపించడానికి ప్రయత్నిస్తున్నాం... సైన్సు విషయాలనే అందులో వేసుకుంటాం... మీకు ఓపిక ఉంటే ఒకటి రెండు పేజీలు రాసి పంపండని సారాంశం. కింద సంతకాలు... పెమ్మరాజు వేణుగోపాలరావు, జి.సత్యనారాయణ. రెండు పేజీల వ్యాసం రాయమన్నారు... నా దగ్గర రెండొందల పేజీలున్నాయి! పంపించా. మూడేళ్ల పాటు సీరియల్‌గా వేశారు. చదివిన వాళ్లందరూ ఫోన్లు చేసి మెచ్చుకున్నారు. నాకు రాయడం వచ్చు అని అప్పుడే అనిపించింది. కథ రాద్దాం అనుకున్నా. ‘గాలి దోషం’ అనే సైన్స్‌ ఫిక్షన్‌ కథ రాసి ఆంధ్ర పత్రికకు పంపా. ప్రచురితమైంది. ‘భూతద్దాలు’ అని మరో కథ రాశా. అదీ అచ్చయ్యింది. 
మరి పుస్తకాలు...?
కథలు ప్రచురితమవుతుండటంతో మెల్లిమెల్లిగా పుస్తకాలు రాయడం ప్రారంభించా. అణువు, పరమణువులతో మొదలెట్టి ఈ ప్రాణులు ఎలా వచ్చాయన్న అంశాలను తెలుగులో చెప్పా. అదే ‘జీవరహస్యం’. తర్వాత రక్తం గురించి వివరిస్తూ ‘జీవనది’. ‘నిత్యజీవితంలో రసాయనం’ అని రసాయనశాస్త్రంపై మరో రచన చేశా. ఈ విశ్వం ఎలా ఏర్పడిందన్న దానిపై ‘విశ్వస్వరూపం’ రాశా. అది త్వరలో ప్రచురితం కాబోతోంది. అయితే, నా పుస్తకాలను చాలా తక్కువ మంది చదివారు. చదివిన వాళ్లు మాత్రం మెచ్చుకున్నారు. చాలామంది పుస్తకం తెరచి చదవరు. తెలుగులో సైన్స్‌ అనగానే పక్కన పెట్టేస్తారు. కానీ, రాస్తూనే ఉంటా. చదివిన వాళ్లు కొôదరైనా సరే, తమకు విషయం సులువుగా అర్థమైందని అంటారు. ఆత్మసంతృప్తిగా ఉంటుంది. అయితే, కొందరు మాత్రం నన్ను ఆక్షేపిస్తుంటారు. 
అదేంటి? ఎందుకు?  
ఓ పత్రికలో మూడేళ్ల పాటు సైన్స్‌పై తెలుగులో శీర్షిక నిర్వహించా. అంతర్జాల పత్రిక ‘ఈమాట’లో వైజ్ఞానిక వ్యాసాలు రాస్తుంటా. వాటికి కొందరు ఎలా స్పందిస్తా రంటే... విషయం బాగుంది, బాగోలేదు అని చెప్పరు! మీరు తెలుగులో ఎందుకు రాస్తారు, మమ్మల్ని తెలుగు నేర్చుకోమంటారా? ఆంగ్లంలో రాయొచ్చు కదా అని గొడవపెడతారు. తెలుగులో కవిత్వం రాయమంటారు కానీ, వైజ్ఞానిక వ్యాసాలు మాత్రం రాయకూడదంటారు. నేను చెప్పే సైన్స్‌ విషయాలు వారికి కావాలి. కానీ, ఆంగ్లంలో కావాలి! ఎందుకంటే, పిల్లలకు తెలుగు నేర్పిస్తే ఆంగ్లం రాదంటారు. అందులో న్యాయం ఉందా? నన్ను ఆక్షేపించే వాళ్లంతా రచయితలే! పీహెచ్‌డీ పట్టభద్రులే! పిల్లల్ని తెలుగులో చదివించకూడదని వారిప్పటికే నిర్ణయించేసుకున్నారు.
ఆంగ్లం కోసం తెలుగు మర్చిపోవాలా?
అందరూ ఆంగ్లం నేర్చుకోవాలి. బాగా నేర్చుకోవాలి. అయితే, దానికోసం తెలుగును మానేయక్కర్లేదు. తెలుగు వచ్చినంత మాత్రాన ఆంగ్లం రాకుండా పోదు. అదో దురభిప్రాయం. నాలుగేళ్ల కిందట ఆంగ్ల ఉపాధ్యాయులైన కొందరు అమెరికన్లతో కలిసి ఇక్కడకు వచ్చా. వారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఆంగ్ల పాఠాలు చెప్పడానికి వెళ్లారు. తర్వాత కలిసినప్పుడు వారేమన్నారంటే... ‘అక్కడి పిల్లలకు హిందీ రాదు. వాళ్లేదో ఆంగ్లం మాట్లాడేస్తున్నా మనుకుని హిందీ నేర్చుకోవడం మానేశారు. కానీ, వాళ్లకు ఆంగ్లం కూడా రాదు. వారి ఆంగ్లం మాకు అర్థం కాలేదు. అందులో కర్త ఉంటే కర్మ ఉండట్లేదు. కర్మ ఉంటే క్రియ కనపడట్లేదు. అదే ఆంగ్లం అనుకుని మాట్లాడేస్తున్నారు. మాతృభాషే రానప్పుడు వారికి ఇక ఆంగ్లం ఎలా వస్తుంది? ముందు మీరు హిందీ నేర్చుకోండని సలహా ఇచ్చాం’! 
భాష ఉంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికే కదా. తెలుగు పోతే ఏంటి అని కొందరంటున్నారు...?
జాతి సాంస్కృతిక ఔన్నత్యం భాషతో ముడిపడి ఉంటుంది. దాన్ని కాపాడుకోవాల నుకున్నప్పుడు భాష... సంభాషణల స్థాయి దాటిపోతుంది. మన కుటుంబం... మన పిల్లలు... మన భాష. నేర్చుకోవాలంతే. మాతృభాష మాకు రాదు అనడానికి సిగ్గేయాలి. మనకు భాషపై అభిమానం కాదు ఆత్మగౌరవం ఉండాలి. అయితే, ఒక్క మాట... సాంస్కృతిక చొరబాట్లను ఆపలేం. కానీ, సంస్కృతిని మనం రక్షించుకోగలం.  
బర్కిలీలో తెలుగు పీఠం గురించి...?
అక్కడ సంస్కృతం, హిందీ, ఉర్దూ, బెంగాలీ, తమిళ్, పంజాబీ భాషల్ని ఎప్పటి నుంచో బోధిస్తున్నారు. మరి ఇన్ని కోట్ల మంది మాట్లాడే మన తెలుగు ఎందుకు లేదు? అదే ఆలోచనతో విశ్వవిద్యాలయం పెద్దలతో మాట్లాడా. మిగిలిన భాషలకు ఉన్న ప్రాముఖ్యం మా తెలుగుకు ఎందుకు లేదు? తెలుగు కూడా నేర్పించాలని అడిగా. రూ.ఆరు కోట్లు (మిలియన్‌ డాలర్లు) తీసుకొస్తే పీఠం ప్రారంభిస్తాం అని చెప్పారు. ఆ డబ్బుల్ని బ్యాంకులో వేసి వచ్చే వడ్డీతో ఉపాధ్యాయుల్ని పెట్టి పాఠాలు చెప్పిస్తాం అన్నారు. అప్పటి నుంచి జోలె పట్టుకుని తిరిగా. చాలామంది ఇచ్చారు. అమెరికాలో, ఇండియాలో... అవకాశమున్న చోటల్లా సేకరించా. అలా ఏడెనిమిదేళ్లు తిరిగాక సొమ్ము సమకూరింది. దాంతో ఈమధ్యే తెలుగు బోధన మొదలెట్టాం. 
విరాళాల సేకరణ అనుభవాలు...?
బెనారస్‌ విశ్వవిద్యాలయం కోసం మదన్‌ మోహన్‌ మాలవ్యా... దారి పక్కన అంగవస్త్రం వేసి, ఎంత వేయాలనుకుంటే అంత వేయండని వచ్చిపోయే వారిని అడిగేవారట. అంత పనీ చేశాన్నేను. ఎక్కడ తెలుగు వారి సమావేశాలు జరుగుతున్నా, బయట బల్ల వేసుకోవడం, డబ్బా పెట్టుకోవడం, తోచినంత వేయండని అడగడం! ఓ సమావేశంలో అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆవుల మంజులత గారు కలిశారు. చేతనైనంత సాయం చేస్తానని చెప్పారావిడ. ఇక్కడకు వచ్చాక ప్రభుత్వంతో మాట్లాడి రూ.30 లక్షల గ్రాంటు వచ్చేలా చూశారు. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వలేదన్నట్లు మధ్యలో అధికారులు తగిలారు. అంత మొత్తాన్ని ఒకేసారి ఇవ్వం, ఏడాదికి రూ.6 లక్షలు చొప్పున అయిదేళ్లలో ఇస్తామన్నారు. సరే అన్నా. మొదటేడు ఇచ్చారు. చాలా కష్టపడితే రెండో ఏడాదిలో కూడా సొమ్ములందాయి. తర్వాత ఇవ్వడం మానేశారు. కాగితాలు పట్టుకుని అక్కడికి ఇక్కడికి తిరిగా. ఫలితం లేకపోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలయ్యాయి కదా. ఎవరిని అడగాలో తెలియదు! ఏదైనా తేలికగా అయిపోతే గొప్పేం ఉంటుంది... కష్టాలు పడితేనే ఫలితాన్ని ఆస్వాదించగలం. 
బర్కిలీలో ఇప్పటి వరకూ ఎంతమంది తెలుగు నేర్చుకున్నారు?
దాదాపు వంద మంది. సెమిస్టర్‌కు 12 మంది వరకూ ఉంటారు. మన తెలుగు పిల్లలతో పాటు అమెరికన్లు, తమిళులు, గుజరాతీలు కూడా ఉన్నారు. వీళ్లకు తెలుగు గురించి తెలియదు. తెలుగు సంస్కృతిపై అవగాహన ఉండదు. కొత్త భాష నేర్చుకోవాలన్న ఉత్సుకతతో వస్తారు. చాలా కొద్దిమంది మాత్రం భవిష్యత్తులో తులనాత్మక భాషాధ్యయనం చేయడానికి ఉపకరిస్తుందని తెలుగు నేర్చుకుంటారు. మూడు సెమిస్టర్లలో వారికి తెలుగు మాట్లా డటం, రాయడం, చదవడం వచ్చేస్తుంది. 
అన్యభాషీయులకు తెలుగు బోధించడం ఎలా ఉంది?
తమిళంతో పోల్చినప్పుడు మీకు చాలా అక్షరాలున్నాయి, నేర్చుకోవడం కష్టం అంటారు ఇతర భాషీయులు. ఇదే కారణంతో తెలుగును నేర్చుకోవడానికి ఇష్టపడని వారూ ఉన్నారు. అందుకే మన వర్ణమాలను కాస్త సరళీకరించుకోవాలి. ‘ఋ’తో ఉన్న పదాలు ఎన్ని ఉంటాయి చెప్పండి? మూడో నాలుగో! దాన్ని తీసేస్తే తప్పేంటి? అయితే, ఆ అక్షరంతో పదాలు లేవు కానీ, దాని ఒత్తు వటృసుడితో చాలా ఉన్నాయి. అలాంటి వాటిని మార్చి రాసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణకు బదులు క్రిష్ణ అని రాస్తారు. దాంట్లో నష్టమేంటి? కానీ, కొన్నిచోట్ల ఆ వటృసుడిని తీసేస్తే సమస్యలు వస్తున్నాయి. అదీ సంస్కృతం నుంచి వచ్చిన పదాలతోనే. అలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ తెలుగు పదాలను వాడుకోవచ్చు. ఐ, ఔలను కూడా తీసేయవచ్చు. వీటి మీదే ‘తేలికగా తెలుగు’ అనే పుస్తకం రాస్తున్నా. 
ఇలా అక్షరాలు తీసేసుకుంటూ వెళ్తే తెలుగు స్వరూపం దెబ్బతినదా?
నేను చెప్పిన అక్షరాలను మొత్తం తీసేయక్కర్లేదు. బయట వారికి బోధించే సందర్భంలో మాత్రమే ఇలా సరళీకరించిన వర్ణమాలను వాడాలి. వారు ఒకస్థాయికి వచ్చాక మొత్తం వర్ణమాల నేర్పాలి. 
ప్రాంత ఆర్థికాభివృద్ధికీ భాషాభివృద్ధికీ సంబంధముందా?
మా చిన్నతనంలో ఆంగ్లానికి ఇంత ప్రాముఖ్యం లేదు. అందరూ జర్మన్‌ నేర్చుకునే వారు. ఎందుకంటే వైజ్ఞానిక పరిశోధనలన్నీ ఆ భాషలోనే జరిగేవి. శాస్త్రవేత్తలందరూ అక్కడి వారే. అమెరికా బలోపేతం అయ్యాక ఆంగ్లం దశ మారింది. ఇప్పుడు చైనీస్‌కు ప్రాముఖ్యత పెరుగుతోంది. కారణం... చైనీయులు చైనీస్‌లోనే మాట్లాడతారు. అందులోనే రాస్తారు. కంప్యూటర్లు కూడా ఆ భాషలోనే ఉంటాయి. చైనాతో వ్యాపారం చేయాలంటే మనం చైనీస్‌ నేర్చుకోవాలి. హైదరాబాద్‌తో వ్యాపారం చేయాలంటే అవతలి వాళ్లు తెలుగు నేర్చుకోవక్కర్లేదు. మనమే కష్టపడి ఆంగ్లం నేర్చుకుని వాళ్లకు సమాధానాలు చెబుతాం! ఎక్కడో ఓ చోట మనం కూడా గీత గీయాలి. మాతో వ్యాపారం చేయాలంటే తెలుగు నేర్చుకోవాల్సిందే అని.
తెలుగు ‘విజ్ఞాన’ సర్వస్వం 
ఆచార్య వేమూరి వెంకటేశ్వరరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తుని. బందరు హిందూ కళాశాల, కాకినాడ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుకున్నారు. 1961లో అమెరికా వెళ్లారు. డెట్రాయిట్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేశారు. దశాబ్దాల పాటు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా సేవలందించారు. 150కి పైగా పరిశోధన పత్రాలను, సాంకేతిక ప్రచురణలను, పాఠ్యగ్రంథాలను వెలువరించారు. దాదాపు ఇరవై ఏళ్ల పాటు శ్రమించి తెలుగు - ఆంగ్లం, ఆంగ్లం - తెలుగు ఏకపద నిఘంటువులను తయారు చేశారు. అనేక ఆంగ్ల పదాలకు తెలుగు మాటలను సృష్టించారు. విజ్ఞానశాస్త్ర సంబంధిత విశేషాలను సులువైన తెలుగులో వివరిస్తూ పుస్తకాలు రచించారు. రెండు చిన్న కథల సంపుటాలనూ ప్రచురించారు. వివిధ తెలుగు   పత్రికల్లో ఆయన వ్యాసాలు వందకు పైగా అచ్చయ్యాయి. వెంకటేశ్వరరావు శ్రమ, సేకరించిన విరాళాలతోనే బర్కిలీ విశ్వవిద్యాలయంలో 2007 నుంచి తెలుగు బోధన ప్రారంభమైంది. అక్కడ తెలుగు నేర్చుకునే విద్యార్థులకు ఆయనే స్వయంగా పాఠాలు చెప్పారు. ఇప్పటికీ చెబుతూనే ఉంటారు.
అక్కడి నుంచి వచ్చి...
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ బృందం ‘రామోజీ ఫౌండేషన్‌’ కార్యాలయాన్ని సందర్శించింది. ‘తెలుగు వెలుగు’ కృషిని, కార్యకలాపాలను పరిశీలించారు. తెలుగు వెలుగు, బాలభారతం పత్రికల సిబ్బందితో సమావేశమై తమ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకున్నారు. విశ్వవిద్యాలయంలో తెలుగు బోధనకు సంబంధించి రెండు సంస్థల మధ్య సహాయ సహకారాలు కొనసాగాలని ఆకాంక్షించారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి