తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తల్లిభాషను తలమీద పెట్టుకోవాలె

  • 229 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నడు కాళోజీ. అక్షరాన్ని అస్త్రంగా మార్చి ప్రయోగిస్తే, గట్ల ప్రయోగించడంలో పట్టుంటే, లక్షలు కాదు కోట్ల మెదళ్లల్ల ప్రకంపనలు పుట్టించొచ్చు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాట పోషించిన పాత్ర అజేయమైంది. కవి గాయకుల గొంతుల నుంచి ఉరికొచ్చిన ప్రతి అక్షరం ఉద్యమాన్ని అల్లంత ఎత్తుకు తీస్కపోయింది. గసోంటి పాటల్లో ప్రత్యేకమైంది, 2009 నవంబరు 1 నుంచి తెలంగాణ బళ్లల్లో ప్రార్థన గీతమైంది, కోట్ల గొంతుకల్లో పలికింది, సకలజనుల స్వప్నం స్వరాష్ట్రంగ సాకారమైన వేళ తెలంగాణ రాష్ట్రగీతంగ తొలి నీరాజనాలందుకుంటున్నది... ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’.
      ఆదిలాబాదు నుంచి చిత్తూరు వరకు, అనంతపురం నుంచి విజయనగరం వరకు అందరి నోట్ల మార్మోగిన, సెల్లుఫోన్లల్ల రింగుటోనుగ వలికిన ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు’ పాట కయిగట్టిన కవే... జననీ జయకేతనమంటూ తెలంగాణ జెండను బుజానమోసిండు. పేదరికంలో పుట్టి... పేదరికంలో పెరిగి... పేదరికంలో బతికినా... అక్షరసంపదల మాత్రం ఆ కవి ఆగర్భశ్రీమంతుడు. పద్యాలతో పుట్టి పాటతో పెరిగిన ఆ తెలుగు తల్లి ముద్దుబిడ్డ అందెశ్రీ. ఆయన పాటలు పుటంబెెట్టిన బంగారం లెక్క తళ తళ మెరుస్తై. గరీబోడి గుండెల్లదిగిన గునపపు గుర్తుల్ని యాదికి తెస్తై.   

మనిషి మాతృభాషలో మాట్లాడితే మట్టి వాసనొచ్చినట్లుంటది. సరిగ్గా గదే అనిపిస్తది అందెశ్రీతో ముచ్చట్లువెడితే. ఎంతసేపు మాట్లాడిన ఆయన జెప్పెటిదేమిటి? మన భాష మన నోట్లనే ఉంటది. తల్లి చనుబాలెంతనో మనకు మన భాషంతే... మన యాసంతే. మల్లెపాదులెక్క మన భాష ఒల్లంత అల్లుకోవాలె... చిన్ననాడు గసోంటి తీగను నాటితే మనిషి కనుమూసే దాకా మర్వడు బిడ్డా... అని అంటడు. ఇగ మనిషైతే కూసింత గర్రు లేకుండగ మల్లెపువ్వులెక్క నవ్వుతడు. నీకింత మంచిగ పేరొచ్చింది గందా! ఇంత సాదగున్నవేెందే అంటే ‘‘బరిబాతలొస్తం... బరిబాతలవోతం... మధ్యలో సోకులువోవుడెందుకు’’ అంటడు. ‘తెలుగు వెలుగు’తో అందెశ్రీ జెప్పిన ముచ్చట్లన్నీ ఒక్కపారి మీరుగూడ వినుండ్రీ...
తె.వె.: పాటలు ఎప్పటి నుంచి రాస్తున్నరు?
అందెశ్రీ: ముప్ఫై ఏళ్ల సంది. పాటలనే కంటే పద్యాలు అంటే బాగుంటది. ఎందుకంటే మొదట్ల పద్యాలే బాగా రాస్తుండే. సీసపద్యాలు, తేటగీతి, ఆటవెలది గిట్ల ఛందస్సులో కొన్ని వేల పద్యాలు రాసిన. వచిన కవిత్వం కూడా రాసిన. 
‘జయజయహే’ గీతం ఎన్నడు రాసిన్రు?
2002 సెప్టెంబరు 30న కామారెడ్డి ధూంధాం అప్పుడు ఈ పాట మనసుల పడ్డది. అప్పటి సంది 2009 వరకు దీన్ని పూర్తిచేసిన. తెలంగాణ సభలు మొదలైనప్పుడు పెట్టుకునేందుకు, పాడుకునేందుకు పాటలేదన్న ఆలోచనే దీని పుట్టుకకు కారణమైంది. అయితే రాష్ట్రగీతం అయితదని రాయలే. మామూలు పాటలెక్కనే మనసుపెట్టి రాసిన. కాకపోతే తెలంగాణ చరిత్రను బాగా తవ్వుకుని రాసిన. దీనికి ఈ గౌరవం రావడం వెనుక ఎంతో మంది కృషి ఉన్నది. మొదలు తెలంగాణ రచయితల వేదిక మీద పురుడుపోసుకుంది. కేసీఆరే విద్యార్థి సభల ప్రారంభ పాటగ పాడిచ్చిండు. తరువాత నాలుగు చరణాలు తీసి తెలంగాణ జాతిగీతంగా పాడుకున్నరు. 
మీ పాట రాష్ట్ర గీతమైంది కదా... 
తెలంగాణ మనోభావాలను ఆకాశమెత్తుజేసి నిలబెట్టి, గంతమందిని నడిపించి, తెలంగాణ ఆత్మగౌరవానికి గుర్తుగ నిలవడుతున్న గా పాటను నా పాట అంటే, తెలంగాణ వచ్చిందన్న వాళ్లందరి సంతోషాన్ని, పాట అర్థాన్ని తక్కువ జేసినట్టె. ఎంతమంది దాన్ని గర్వంగ పాడితే నా పాటైంది, ఎంతమంది దాన్ని సంతోషంగ అనుభవిస్తే నాపాటైంది. గీ పాట అంత మంచిగ్గావడం వెనుక జయశంకర్‌ సారు, కేసీఆర్, రసమయి బాలకిషన్, నందిని సిధారెడ్డి సారు ఇంకా చెప్పాలంటే లక్షల మంది విద్యార్థులు, తెలంగాణ బిడ్డలు ఎందరో ఉన్నరు. గాపాట వాళ్లందరిది. 
ఈ ‘జయజయహే’ పాటలో ‘ఒక జాతిగ నీ సంతతి...’ అన్నరు గదా. దానర్థం?
ఇందుల ఉన్నది శ్లేషార్థం. తెలుగోళ్లకు రెండు రాష్ట్రాలైనా భాష ఒకటే. అక్షరాలూ యాభై ఆరే కదా! అందరూ ఒకటిగుండాలె అనేది అందులో అర్థం. అందుకే, గిది తెలుగు జాతికే గీతమన్నడు మా నాన్న గారు బిరుదురాజు రామరాజు. లేదు ఆంధ్రప్రదేశ్‌కు ఇది వర్తించదు... అనుకుంటే మంచిదే. తెలంగాణ బిడ్డలందరూ ఒక్కటిగా ఉండాలె అనే అనుకోవచ్చు. 
మీ సిన్ననాటి ముచ్చట్లు...
పశువుల కాపరిగా నా బతుకు పాదు మొదలయ్యింది. నన్ను ఎడ్డోడు అనేవాళ్లు. కొట్టేవాళ్లు. తిట్టేవాళ్లు. ఊళ్లో జీతమున్న.  మా ఇంట్లో తీగలు సాగె అన్నం పెట్టి తినమని కొట్టేటోళ్లు. గది తింటే నాభిల నుంచి గడ్డపారేసి పెకలించినట్లు నొప్పొచ్చేది. వాళ్ల ముందు ఆ అన్నం కక్కినా తప్పే. నా తొమ్మిదో ఏట పూజల మల్లారెడ్డి నన్ను చేరదీసిండు. ఆయన నాకు తండ్రి కన్నా, గురువు కన్నా ఎక్కువ. వాళ్లమ్మ రాధమ్మ నా ఆకలి తీర్చిన తల్లి. పనినేర్పిన అమ్మ. చాన్నాళ్లు ఉప్పరపని చేసిన. శృంగేరి సాధువు శంకరమహరాజ్‌ నాకు ఆధ్యాత్మిక గురువు. దేవుని గొడవొద్దు గానీ ఆధ్యాత్మిక మార్గంల మాత్రం నడుస్త. గిదేంది అనొచ్చు. ఆధ్యాత్మికత తలవంచుకొని బతకాలంటుంది. భక్తి తలదించుకొని బతకాలంటుంది.
మీ ప్రయాణం...
నా కొడుక్కు బాగలేనప్పుడు, నా కుటుంబ పరిస్థితి కూడ గట్లనే ఉండేది. అందరం విషం దాగి సద్దమనుకున్నం. ఐదు సంవత్సరాలు చేతుల మీదనే వాణ్ని ఎత్తుకోవల్సొచ్చింది. మందులు కొననీకి నా తాన పైసల్లేవ్‌. ఆ ఐదేళ్లు హైదరబాద్‌ నగరమంత కాళ్లమీద నడిచిన. నా కొడుకుకు 40 రూపాయల పాలడబ్బకి ఎన్ని కాళ్లు మొక్కుంటనేను?! మందు తాగనీకి వేలకు వేలు ఖర్చు చేసొటోళ్లు పిలగాని పాలడబ్బకడిగితే పదిరూపాయలియ్యనీకి సోంచాయించుతరు. నాకివ్వన్నిజూస్తే చిత్రమనిపిస్తది. గానీ గసోంటోళ్లంత ఇప్పుడు నాతో మంచిగ మాట్లాడ్తరు. నాకు గమ్మత్తనిపిస్తది. 
ఆకలి నన్ను దహించివేస్తున్నప్పుడల్లా హంతకుడిగా మారాలనిపిస్తుంది.... ఎందుకో నా అంతరాత్మ వద్దని ప్రబోధిస్తుంది. ఆ అంతర్వాణి మాట విననివాడు ఎవడూ నిలబడడు. అది విన్నప్పుడే ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదుగుతడు.  దాని మాట విన్నందువల్లే గప్పుడు విషం తాగుదామనుకొని ఆగిపోయిన. నువ్వు చనిపోతే సామాన్యుడి బతుక్కి అర్థముండదురా ... బతకాలె అని చెప్పింది. ఆ క్షణంలో ఇలా పాడు కున్న ... 
వాగ్దేవి నీ చూపు వసుధ నాపై నుండ
           కవితకేమీ కొదువ కన్నతల్లి
కావ్యమాలగ నీదు కంఠాన తరియించ
            కవిత ఉప్పొంగదా కల్పవల్లి
సంగీత సాహిత్య సౌరభాలను చాట
         పరిగెత్తు నా పాట ప్రజల నోట
సహజంగా వర్షించు సలలితంబుగా నాలో
                 సాహితీవిలువల సాక్షిగాను
కవితనేరాయ చేయిచాచి కాసులడగ
సిరులకెప్పుడు నిన్నమ్మ సిగ్గుమాలి
మట్టిమోసైనా బ్రతుకిలానెట్టుకొందు
వసుధ వినిపించు నీ ఆన వాక్కులమ్మ
సాహిత్య పరిచయం?
ఆశ్రమాల్ల పెరిగిన. వైదిక సంప్రదాయాలు నాలో జీర్ణించుకుపోయినై. రామాయణ, భారత, భాగవతాల కథలన్ని తెలుసు. నేను అక్షరాలు నేర్వలే. ఇప్పటికీ నాకు చదవడం వస్తది గాని రాయడం రాదు. వాసిలి వసంతకుమార్‌ అనే ఆయన నాకు సాహిత్యాన్ని పరిచయం చేసిండు. అప్పటిదాన్క శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, కృష్ణశాస్త్రి... తెలుగు సాహిత్యంలోని మహనీయులెవరూ నాకు తెల్వదు. ఆ సారు వల్లనే నాకు చలాన్ని చదువుకునే అదృష్టం కలిగింది. విశ్వనాథ ‘వేయిపడగలు’ చదువుకునే అదృష్టం కలిగింది. కృష్ణశాస్త్రి నాకు చాలా ఇష్టమైన కవి. శ్రీశ్రీని చదవనోడు, ఆయన గాలి సోకనోడు తెలుగు నేలపై ఉండడనుకుంట. ఆయన ప్రభావం కూడా ఉంది తెలవకుండా. మా సినారె... ఒకరా ఇద్దరా! గుంటూరు శేషేంద్రశర్మ... ఆధునిక కవిత్వం ఎట్ల ఉన్నదంటే, ‘ఏమున్నది పత్రికా శీర్షికలే కదా, కొత్తగా ఏం రాస్తున్నరు’ అంటడు. ఎంత సత్యమది.  


తెలంగాణ రాష్ట్రగీతం
అందెశ్రీ ‘జయ జయహే తెలంగాణ’ మొత్తం పాట ఇది. ఇందులోని నాలుగు చరణాలను తెలంగాణ రాష్ట్రగీతంగ తీసుకున్నరు.

జయ జయహే తెలంగాణ... జననీ
జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన 
శుభతరుణం
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 

పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
బృహత్‌ కథల తెలంగాణ కోటిలింగాల కోన
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 

ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన 
తెలుగులో తొలి ప్రజాకవి పాల్కురికి సోమన
రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి
కవిరాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 

కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
మల్లినాథసూరి మా మెతుకుసీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధువతడు
ధిజ్ఞాగుని కన్న నేల ధిక్కారమె జన్మహక్కు
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
 
పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 

రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల
సర్వజ్ఞ సింగభూపాలుని బంగరు భూమి
వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు మాలో రుద్రుడు
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 

సమ్మక్కలు సారక్కలు సర్వాయిపాపన్నలు
సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు
ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ
దండు నడిపే పాలమూరు పండుగోల్ల సాయన్న
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
డప్పు డమరుకము, డక్కి, శారద స్వరనాదాలు
పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
అనునిత్యము నీ గానం అమ్మనీవే మా ప్రాణం
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! 

జానపదా జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
 
బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
 
సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద
సిరులు పండె సారమున్న మాగాణమె కదా! నీ యెద
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
 
గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలి
సకల జనుల తెలంగాణ స్వర్ణయుగం కావాలి
జై తెలంగాణ! జైజై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!  


తెలంగాణ ఉద్యమంలో భాష పాత్ర?
నా చిన్నప్పుడు పాటల్ల భామా, భామా అంటే ...మామా మామా... అని పాడెటోళ్లు. గది ఆత్రేయ సినిమా పాట. మామ అంటె భామ అంటడేందనిపించేది. ఆంధ్రల అక్కకూతుర్ని చేసుకుంటరట. (కోడలు వరుస) ఇక్కడ గట్ల చేసుకోం. అంటే అక్కడికి ఇక్కడికి సంస్కృతులు తేడా. అయితే వీళ్లిద్దరి మధ్యా వంతెన కట్టింది భాష ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర విభజనకు కూడా భాషే ముఖ్య కారణం. తెలంగాణ వాళ్లు అవులెగాళ్లు అన్న అభిప్రాయం వాళ్లల్ల లేకుండ ఉంటే ఈనాడు రాష్ట్ర విభజనే జరిగేది కాదు. 
ఇదొక్కటే గాదు, మేమొచ్చి వ్యవసాయం నేర్పినం.. తెలంగాణోళ్లకు తినిపండటం తప్ప ఏమీ తెల్వదట.. ఇట్లాంటి మాటలన్నీ! ఎప్పటి నుంచో తెలంగాణలో సముద్రాలు సిగ్గుపడేంత తటాకాలున్నై, గొలుసుకట్టు చెర్వులున్నై. అస్సలు చానమందికి తెల్వని విషయం ఒకటి జెప్పాలె. మహాభారతం గదా భారతదేశానికి గొప్ప గ్రంథం. నన్నయ్య రెండున్నర పర్వాలు రాసి, కాలం జేసిండు. తతిమా 15 పర్వాలు తిక్కన రాసిండు గదా. తర్వాత ఎర్రన రాసిండు. ఈ పద్దెనిమిది పర్వాలలో కొంత రాయించిన రాజరాజనరేంద్రుడు అంత గొప్పోడైతే భారతానికి... మరి 15 పర్వాలు రాయించిన రాజ్యమేది ఎందుకు జెప్పలే? 
అయితే గదీ ఏ రాజ్యం?
ఇది తెల్వాలిప్పుడు. నెల్లూరు రాజైన మనుమ సిద్ధి దగ్గరున్న తిక్కనామాత్యుడు 15 పర్వాలు రాసిండు అని జెప్పుతరు తప్ప... అది రాసేందుకు కారణమైందెవరో చెప్పలే. మనుమసిద్ధి కాకతీయ సామ్రాజ్య సామంతరాజు. రాజ్యం దారిద్య్రరేఖకు దిగువునున్నది క్షమాభిక్షపెట్టమని రాజు పక్షాన కాకతీయుల దగ్గరకు తిక్కనామాత్యుడు వచ్చినప్పుడు ఆయనకు అతిథి మర్యాదలు చేసి, సత్కరించి పండితునిగా నీకేం కావాలో కోరుకొమ్మని చెప్పింది గణపతిదేవుడు. అప్పుడు కొంగు జాపి, మహాభారత రచన ఆగిపోయున్నది. దీన్కి మీరు కరుణించాలెనని అడిగితే మిగతా 15 పర్వాలు పూర్తి చేయించింది కాకతీయ సామ్రాజ్యాధిపతి గణపతిదేవుడు. ఇది ఎవ్వడు జెప్పడే. 200 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా కాకతీయ సామ్రాజ్యం వింధ్య పర్వతాల ఇవతల నుంచి కేరళ సముద్రతీరం దాకా ఏలింది. మరి గా భాష ఎటుపోవాలె. వాళ్ల శిల్పసంపద ఎక్కడ పోతది. వాళ్ల కళలెక్కడపోతై. వాళ్ల పేరిణి శివతాండవమెక్కడపోతది. అందుకే చరిత్ర ఉన్నదున్నట్టు చెప్పగలగాలె. 
తెలుగు గురించి రెండు మాటల్లో...
కొన్ని కోట్ల డబ్బపాలు చిన్న పిల్లలకు కొంటరు. కానీ అమ్మచనుబాలు ఎక్కడన్న అమ్ముకుంటరా? నిజమైన తెలుగు భాష అమ్మ చనుబాల లాంటిది. దాన్ని డబ్బాలల్లపోసి అమ్మలేరు. అది మార్కెట్‌ వస్తువు కాదు. అది రాయలసీమ, శ్రీకాకుళం, తెలంగాణ కావచ్చు... కోస్తా, నైజాం ఏదన్నకావచ్చు. తల్లిభాష తల్లిభాషే.
భాష ఒకటే అయినప్పుడు తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అని ఇద్దరు తల్లులెందుకు?
అవన్నీ మనం పెట్టుకున్నవి. అస్తిత్వ సమస్య, ఆత్మగౌరవ సమస్య. ఇప్పుడు ఆ గొడవైపోయింది కదా! ఆ ఇద్దరు తల్లుల గొడవ ప్రాంతాలకు గానీ భాషకు కాదు. ఇద్దరూ మాట్లాడేది తెలుగే కదా. భాషలూ వేరే అనుకున్నప్పుడు లిపులు కూడా తయారు చేయించుకోవాల్సి వస్తే తడసిమోపెడవుతది!
తెలుగు మాట్లాడేవాళ్లే తక్కువైపోతున్నరు?
తెలుగును చిన్నతనం నుంచి నేర్పకుండా, చదువులో పరాయీకరణకులోనైనం. ఈ భాషను చంపుకునేది మనమే. ఇప్పటికే ఇది అవసాన దశకు వచ్చింది. పుట్టిన పిలగాడికి పదిహేనో సంవత్సరందాకా తలకెక్కేటట్లు తల్లిభాషను నేర్పిస్తే జీవితాంతం వాడిని అంటిపెట్టుకొని ఉంటుంది. అయితే పాశ్చాత్య భాషలను ఆదరించొద్దని కాదు. ఎన్ని భాషలు నేర్పినా ఇంటర్మీడియెట్‌ నుంచి నేర్పాలె. నీకు పట్టెడన్నం పెడతదంటే ఏ భాషైనా నేర్చుకోవచ్చు. కానీ, చనుబాలతో నేర్చుకున్న తల్లిభాషను మాత్రం తలమీద పెట్టుకోవాలె. ఆంగ్లానికి పెత్తనం చేసే బుద్ధితో పాటూ అన్నం పెట్టే తత్వం కూడ ఉన్నది. అన్నం పెట్టే పని మన భాష కూడా చేస్తే అందరూ అమ్మభాషనే చదువుతరు.
ఒకప్పటితో పోలిస్తే పిల్లల్లో సృజన తక్కువవుతోందా?
పిల్లల్లో సృజన ఎప్పుడూ ఉంటుంది. అది చనిపోవడానికి మనమే కారణం. కార్పొరేట్‌ బళ్లుబెట్టి, అందుల ర్యాంకుల కోసం వెంటపడుతున్న పంతుళ్లది తప్పు. మా పిల్లలకు ఎన్ని మార్కులొస్తున్నయని దండకర్ర పట్టుకొని టీచర్లను వేధించే తల్లితండ్రులది తప్పు. వాళ్ల సృజన తప్పక భాషలోనే దాగుంటది. వేరే భాషలను రుద్దితే అదంతా పోతుంది. 
ఇష్టమైన పుస్తకాలు?
రామాయణం, మహాభారతం, భాగవతాలను చదివి, తలకెక్కించుకుంటే భాషకు కొదవేలేదు. నాలో కంపనం పుట్టించిన పుస్తకం ఏడుతరాలు. ఒక యోగి ఆత్మకథ, హిమాలయ యోగులతో స్వామి రామ, స్వామి వివేకానంద లేఖలు, ఆల్కెమిస్ట్, గాంధీ ఆత్మకథ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జీవిత చరిత్ర లాంటివి చాలా చదివాను. అయితే నేను మార్కుల కోసం చదవలే. మార్పు కోసం చదివిన.


కన్నీళ్లింకిన కళ్లకు పాటే కనురెప్ప
అందెశ్రీ పాటల్ల ఎంత ఆర్ధ్రత ఉంటదో... గాపాటల్ల ఎనకున్న మనసుల అంత తడి ఉంటది. పుట్టినగడ్డ మీద ఆయనకు ఎంత ప్రేమ ఉన్నదో... ఆయన బతుకుల అంత కష్టమున్నది. వరంగల్‌ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో 1961 జులై 18 నాడు పుట్టిండట. బడికిపోయి అక్షరం నేర్వకపోయినా స్వశక్తితో అక్షరశక్తిని ఒడిసిపట్టిండు అందెశ్రీ. కాకతీయ విశ్వవిద్యాలయం, అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌పీస్‌ అమెరికన్‌ యూనివర్శిటీ నుంచి (‘లోకకవి’ బిరుదుతో పాటు) గౌరవ డాక్టరేట్లు అందుకునే స్థాయికి ఎదిగిండు. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు’, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా’, ‘పల్లెనీకు వందనాలమ్మో’, ‘కాలం’ తదితర వందల పాటలు ఆయన కలం నుంచి జాలువారినయ్‌. దత్తపీఠం గౌరవ సత్కారం నుంచి ‘నంది’ బహుమతి (2006లో ‘గంగ’ చిత్రంలోని ‘యెల్లిపోతున్నావా తల్లి’ పాటకు) వరకూ ఎన్నో పురస్కారాలను అందుకున్నరు. అన్నింటికీ మించి ‘మాయమైపోతన్నడమ్మ’ పాటైతే... డిగ్రీ రెండో ఏడాది తెలుగు పాఠ్యాంశాల్లో భాగమైంది. 
అందెశ్రీ, మల్లూబాయి దంపతులకు నలుగురు పిల్లలు. వాళ్ల పేర్లలో కూడా తెలుగుదనం కన్పిస్తది... వెన్నెల, వాక్కు, వేకువ, దత్తసాయి. అందెశ్రీ రచనలు ‘అందెల సందడి’ (వచన కవిత), ‘పాటల పూదోట’ (లలితగీతాలు) పుస్తకాలుగా అచ్చయ్యాయి. 
ఇలా నది నడచిపోతున్నది. 


రాష్ట్రాలు వేరయ్యాయి. పుస్తకాల్లో ఎలాంటి భాష ఉండాలి?
అక్కడ, ఇక్కడ ప్రజలు మాట్లాడుకునే పదాలతో కూడిన ప్రామాణికభాష ఉండాలి.
మీ మీద ఏ ఉద్యమాల ప్రభావం ఉంది? 
ప్రతీ ఉద్యమం ప్రభావం ఉంటది. తెలంగాణ సాయుధ పోరాట వీరగడ్డ బైరాన్‌ పల్లి మా ఊరు పక్కనే ఉంటది. దాని గురించి రాసిన పాç మరింత చారిత్రకమైనది. తల్లిదండ్రుల ప్రేమకు నోచని నేను ప్రకృతి ఒడిలో సేదతీరిన. తెలియనంత అనుభవాలను ఒక పాటగ నేర్చుకున్న. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటరు గదా! నన్ను గన్నతల్లి తెలంగాణ. అంతటి ఉద్యమంలో నేను భాగస్వామ్యంగాకపోతే రేపు ముఖం మీద ఉమ్ముతది కాలం.
దళిత, స్త్రీవాద ఉద్యమాల రీతిలో తెలంగాణ ఉద్యమంతోని భాషకు జరిగిన మేలేంది?
కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రబంధ భాషను నేలకు దించినయ్‌. తరువాత వచ్చిన విప్లవోద్యమాలు కొత్త కొత్త పదాలకు కొత్త కొత్త పదబంధాలకు ప్రాణం బోసినయ్‌. కానీ దళితోద్యమం మొత్తం పునాదులనేగాదు కుదుళ్లనే పెకిలించింది. అది సముచితంగా నిలబడి ఉంటే ఎంత గొప్ప భాష వచ్చేదో. అదే రీతిగ తెలంగాణ మలిదశ ఉద్యమం... ఆ ఉద్యమం ఎన్ని పలుకుబళ్లు, ఎన్ని పదబంధాలు, సజీవ నుడికారాలు తెచ్చింది. ఊపిరి సలుపుకోని ఉద్రేకాన్నేకాదు, ఎంత ఉన్నత భాషకు పట్టాభిషేకం చేసింది. వేల మంది పాటగాళ్లొచ్చారు. వచన కవులు సైతం పాట రాయకపోతే ఉనికి లేదన్న భావనను కలిగించింది పాట. మా ఉద్యమం లో పద్యాలు కూడా రాసినవాళ్లున్నరు. 
తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన పాటకు ఇప్పుడు ఎలాంటి గౌరవం దక్కబోతోంది?
మలిదశ ఉద్యమాల్లో పాట పెట్టని కోటగ నిలబడింది. కోట్లాది మంది తెలంగాణను తలలుదిప్పి చూసేటట్టు చేసింది. పతాక శీర్షికల్ల నిలిచింది. ధూంధాం, తెలంగాణ రచయితల వేదిక ఉద్యమానికి కుడి, ఎడమ భుజాలుగా పనిచేసినయ్‌. ఆ నేపథ్యానికి సముచిత గౌరవం దక్కాలి. ఆ పాటల రచయితలు, పాడిన వాళ్లకు, ఆటగాళ్లకు అందరికీ ఆ గౌరవం దక్కుతుంది. 
ఇప్పుడు తెలంగాణ కవులు, రచయితల ప్రయాణం ఎటువైపు?
వేల కిలోమీటర్లు ప్రయాణం చేసే రైలుబండి ఇంజను మీద ఆధారపడి ఉంటది. ఇంజను సరైన దారిల బోతె బోగీలన్ని పట్టాలమీద భద్రంగ నడుస్తయ్‌.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కావాల్సిందేంటి? 
సంస్కారం. సంస్కారం పాలు రెండు చోట్లా తగ్గుతోంది. ఎవర్నెవరు గౌరవించుకోవట్లేదు. అది నేర్చుకున్నప్పుడే ఇద్దరి అభివృద్ధి. ఇద్దరి మధ్యా గౌరవప్రదమైన పోటీ ఉండాలి. ఇక్కడ గొప్ప మేలు జరిగినప్పుడు అక్కడ నొప్పులొస్తాయి. అక్కడ గొప్ప మేలు జరిగినప్పుడు ఇక్కడ నొప్పులొస్తాయి. అయితే ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ ఉండాలె. మంచిదే. అది అహంకారంతో కూడుకున్నది కావొద్దు. నాయకులు జనాల మెదళ్లను గజిబిజి మాత్రం చెయ్యొద్దు. వీళ్లు పోటీలు పడి రాష్ట్రాలను భూతలస్వర్గంగా మారుస్తాం అంటున్నరు. నాది ఒక్కటే మనవి... భూతల స్వర్గంగా మార్చకున్నా ఫర్వాలేదు. భూతాల స్వర్గంగా మాత్రం మార్చొద్దు. 

(అందెశ్రీ: 98485 60986)


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి