తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

పార్లమెంట్‌లో తెలుగు వినపడాలి

  • 161 Views
  • 0Likes
  • Like
  • Article Share

    నాదెండ్ల తిరుపతయ్య

  • కాకినాడ
  • 8008779721

ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అసలే కనిపించదన్నది చాలా మంది అనుకునే మాట. కర్నూలు జిల్లా శ్రీశైలం భూసేకరణ విభాగంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ నూర్‌బాషా రహంతుల్లా లాంటివారు ఈ అభిప్రాయానికి మినహాయింపుగా నిలుస్తారు. మూడు దశాబ్దాలుగా తెలుగును పాలనా భాషగా అమలు చేసేందుకు కృషి చేస్తున్న ఆయన... ‘తెలుగు దేవభాషే’ అంటారు. రహంతుల్లాతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
తెలుగుపై అభిమానమెలా పెంచుకున్నారు?

మాతృభాష నాకు తల్లి లాంటిది. నా తల్లిని నేను గౌరవించుకోనా. చిన్నప్పటి నుంచి తెలుగంటే చెప్పలేనంత మమకారం. తీయనైన తెలుగును మింగేస్తున్న ఇతరభాషల ఆధిపత్యంపై అసంతృప్తి, ఆవేదనల నుంచే మాతృభాషాభివృద్ధి, పరిరక్షణకు ఏదో ఒకటి చేయాలన్న తపన కలిగింది.
మూడు దశాబ్దాలుగా భాషాభివృద్ధి, పరిరక్షణలకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో మీ అనుభవాలు, విజయాలు?
అమ్మభాషలోనే మన ఆలోచనలు వికసిస్తాయి. అందులోనే మన భావాలను సూటిగా, స్పష్టంగా రాయగలం. పశ్చిమ గోదావరి జిల్లాలో తహశీల్దారుగా పనిచేస్తున్నప్పుడు 23 రిట్‌పిటీషన్లకు తెలుగులోనే సమాధానాలు రాసి పంపితే పైఅధికారులు కోప్పడ్డారు. అయినా చలించలేదు. న్యాయస్థానంలో విజయం సాధించా. నా కార్యాలయానికి వచ్చే విద్యార్థుల నుంచి రైతుల వరకు దరఖాస్తులు, అభ్యర్థన పత్రాలను వారే రాసుకునే విధంగా నమూనాలను తెలుగులో తయారు చేయించి అందించా. ఇస్లాం, క్రైస్తవ మతాల మీద తులనాత్మక అధ్యయనం చేస్తూ తెలుగులో 10 పుస్తకాలు రాశా. తెలుగు సామెతలతో 1986 నుంచి 1991 వరకు గీటురాయి వారపత్రికలో ‘ఉబుసుపోక’ శీర్షికతో వ్యంగ్య వ్యాసాలు రాశా. 2003లో అధికారభాషా సంఘం నుంచి విశిష్ట భాషా పురస్కారం అందుకున్నా. తెలుగులో డిగ్రీ చదివిన నాకు 5 శాతం ప్రాధాన్యత మార్కులు ఇవ్వడంవల్లే ఉద్యోగం వచ్చింది. గుంటూరు జిల్లాలో భూసేకరణ అధికారిగా పనిచేసేటప్పుడు భూసేకరణ అవార్డు పత్రాలను తొలిసారి మాతృభాషలో ఇచ్చాం. చేయాలన్న సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదు.
మాతృభాష పరిరక్షణ గురించి ఏమంటారు?
‘మాతృభాషను ప్రేమించే వాడే నిజమైన దేశభక్తుడు’ అని గిడుగు రామమూర్తి అన్నారు. మాతృభాషలో చదువుకుంటేనే ఆలోచనలు వికసిస్తాయి. భావ వ్యక్తీకరణా సవ్యంగా ఉంటుంది. కోర్టుల్లో వాదనలు, తీర్పులు ఆంగ్లంలో ఉండటంవల్ల బాధితులు, ముద్దాయిలకు మధ్య లాయర్లు దుబాసీలుగా వ్యవహరించాల్సి వస్తోంది. శాస్త్ర సాంకేతిక విషయాలు ఆంగ్లంలో ఉండటంవల్ల ఆయా రంగాల ఫలాలు ఆ భాష రానివారికి ఆమడ దూరంలో ఉండిపోతాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చెప్పినట్లు, ‘విద్యార్థుల గ్రాహ్యతకు, భావవ్యక్తీకరణకు మాతృభాష కీలకం. మాతృభాషలో విద్య నేర్పడం, నేర్వడం ఎంతో సులభం.’ అన్న అంశాన్ని బలంగా నమ్ముతాను.
తెలుగును పాలనా భాషగా ఎందుకు అమలు చేయలేకపోతున్నాం?
తెలుగులోనే ఉత్తర, ప్రత్యుత్తరాలు జరగాలని అవిభాజ్య రాష్ట్ర ప్రభుత్వం గతంలో నాలుగు ఉత్తర్వులను ఇచ్చింది. వాటిని అమలు చేసే అధికారులే లేరు. నల్గొండ జిల్లాలో కలెక్టర్‌ ముక్తేశ్వరరావు ఈ ఉత్తర్వుల ఆధారంగానే ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండేలా చేయగలిగారు. పాలనా వ్యవహారాల్లో తెలుగుకు పెద్దపీట వేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు దీనిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రభుత్వం తెలుగు అమలు తప్ప వేరే గత్యంతరంలేని పరిస్థితి కల్పించాలి. అప్పుడు పాలనా భాషగా తెలుగుకు ఆదరణ వస్తుంది. తెలుగు మాతృభాషగా ఉన్న ఉద్యోగులు లక్షలాదిమంది పనిచేస్తున్నారు. మీ మాతృభాషలోనే దస్త్రాలు (ఫైళ్లు) రాయండి, మీ మాతృభాషలోనే కార్యాలయ కార్యక్రమాలు నిర్వహించండి అని ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఏ ఉద్యోగీ వెనుకాడరు. కార్యాలయాల్లో కంప్యూటర్ల వినియోగం అధికంగా ఉంది. వాటిని మాతృభాషకు అనుసంధానం చేసుకోలేకపోతున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఉచితంగా ఇచ్చినా దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఆంగ్లాన్ని సులువుగా టైప్‌ చేస్తున్నట్లు తెలుగును కూడా టైప్‌చేసే విధానం తీసుకురావాలి.
తెలుగు మాధ్యమ విద్యపై ఇప్పటి వారిలో అయిష్టత పెరుగుతోంది.  కారణం?
ఆంగ్లం నేరిస్తేనే వేగంగా ఉద్యోగాలు వచ్చి, అధిక సంపాదనకు అవకాశం ఉంటుందనే భ్రమతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ భాషమీద మోజు చూపుతున్నారు. తెలుగువారి హృదయభాషను మన ప్రభుత్వం పాఠశాలల్లో తప్పనిసరి చేయలేకపోతోంది. తన దగ్గరికి వచ్చే భక్తులకు తెలుగులోనే సందేశాన్నిచ్చే వారు సత్యసాయి బాబా. అలా తెలుగు వినక తప్పని పరిస్థితి కల్పించారు. నా ఉద్దేశంలో రాజకీయ రంగంలో ఎన్టీరామారావు లాగా ఆధ్యాత్మిక రంగంలో సత్యసాయి తెలుగు భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చి పెట్టారు. ఇక్కడ బాగా చదువుకుని ఎక్కువ జీతం వస్తుందని డాలర్ల కోసం విదేశాలకు వెళ్తున్న వారి గురించి ‘ఎబ్రాడ్‌లో ఏముంది బ్రాడ్‌నెస్‌ మీలోనే ఉంది. దానిని వదిలిపెట్టి విదేశాల కు పోవడం పొరపాటు’ అని బాబా చెప్పిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
ఆధునిక సాంకేతిక అవసరాలకు తగ్గట్టు తెలుగు లిపిలో మార్పులు అవసరమా?
‘‘56 అక్షరాలు ఉన్న తెలుగుభాష కంటే 26 అక్షరాలే ఉన్న ఇంగ్లిషు ఎక్కువ వాడుకలోకి వచ్చింది. ప్రపంచ భాష అయింది. కాబట్టి తెలుగుభాషకు 16 అక్షరాలే పెట్టి నంబర్‌వన్‌ పొజిషన్‌కు తెస్తాను చూడండి’’ అం టాడో నాయకుడు ఓ సినిమాలో. భాషా సంస్కర్తలు ఈ పనికి పూనుకోవచ్చు. తెలుగులో ఎదురయ్యే మొదటి సమస్య గుణింతాలు, ఒత్తులు. అనవసరమైన అక్షరాలను, ఒత్తులను వదిలించుకోవాలి. బ్రౌన్‌ కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా తెలుగు ముద్రణ చాలా లోపాలతో సాగుతూ వచ్చింది. ముద్రాక్షరాల సంఖ్యను 405కన్నా తగ్గించడం ఎవరికీ సాధ్యం కాలేదు. బందరులోని కశ్యాణి టైపు ఫౌండ్రీ అధిపతి కె.వి. కొండయ్య అక్షరాల సొంపు చెడకుండా ముద్రణా యంత్రానికి ఒదిగే విధంగా టైపు తయారీలో సాంకేతిక మార్పులు చేసి 350కి తెలుగు లిపి రూపాలను కుదించారు. దీన్ని ‘కశ్యాణి’ టైపు అన్నారు. ఇది కంప్యూటర్‌ యుగం. వేగం నేటి యుగధర్మం. ఈ వేగానికి తట్టుకోలేనిదేదీ నేడు నిలువలేదు. తెలుగుభాషకు ఇది సంధిదశ. మద్రాసులో మురళీకృష్ణ అనే ఇంజినీరు బాపు అక్షరాలతో సహా అందంగా అక్షర స్వరూపాలను కంప్యూటర్‌ ప్రింటింగ్‌కు అనువుగా కీబోర్డు రూపొందించారు. లిపిని ఇంకా సంస్కరించి తెలుగుభాషా స్వరూపాన్ని ఆధునికీకరించడానికి ప్రయత్నించాలి. చిన్నారులపై లిపి భారం అధికంగా ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.
కంప్యూటర్లలో తెలుగు వాడుక ఎలా ఉంది. ఇంకా పెంచాలంటే ఏం చేయాలి?
ఇప్పుడు మంచి సాంకేతిక ఉపకరణాలు వచ్చాయి. కొన్ని సమస్యలు తీరాయి. ఇంకా కొన్ని సమస్యలు తీరాలి. అన్ని రకాల ఖతుల(ఫాంట్ల)ను యూనికోడ్‌లోకి మార్చుకునే వెసులుబాటు ఉండాలి. రకరకాల కీబోర్డులు, ఖతులతో కుస్తీపడుతున్నాం. ఈ అవస్థ తీరాలంటే యూనికోడ్‌లో మాత్రమే పుస్తకాలు ముద్రించమని కోరాలి. అలా చేస్తే ప్రపంచంలో ఉండే తెలుగువాళ్లు ఎక్కడి నుంచైనా తెలుగు పుస్తకాలను, వ్యాసాలను కంప్యూటర్లలో సులభంగా చదవగలుగుతారు, రాయగలుగుతారు. విషయాలను వెతకగలుగుతారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్‌సైట్లను తెలుగులోకి అనువదించనున్నారు. తెలుగు రాయడానికి, తెలుగులో సమాచారం చదవడానికి, చూడటానికి అనుకూలంగా బ్రౌజర్లు ఉండేలా చూడాలి. సమాచారం అంతా తెలుగులో డాక్యుమెంట్‌ రూపంలో అందుబాటులో ఉండాలి. ఆరు భిన్న రూపాల్లో ఏక సంకేత లిపి తెలుగు ఫాంట్‌ అభివృద్ధి చేయాలి. తెలుగు అక్షర క్రమం సరిచూసుకోవడానికి పదాల విశ్లేషణ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయాలి. ఇది ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండాలి. గౌతమి, వేమన, పోతన, ఆకృతి వంటి 50కి పైగా యూనికోడ్‌ ఫాంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న తెలుగు వాడే పద్ధతులను ప్రజల్లో ప్రచారం చేయాలి.
మీ ‘మహా నిఘంటువు’ యజ్ఞం ఎంతవరకు వచ్చింది... దాని లక్ష్యం?
మహా నిఘంటువు నిర్మాణం తెలుగు భాషాభివృద్ధికి దోహదం చేస్తుంది. అదింకా ఆరంభ దశలో ఉంది. తెలుగునేల భిన్న ప్రాంతాల్లోని ప్రజల తెలుగు మాండలికాలు, ఆయా ప్రాంతాలకే పరిమితమైన కొన్ని వేల ప్రత్యేక పదాలు ఇప్పుడున్న నిఘంటువుల్లో లేవు. దీంతో ప్రస్తుతమున్న నిఘంటువులు కొంతమేరకే ఉపయోగపడుతున్నాయి. ఆయా కొత్త పదాలన్నింటినీ సేకరించి, వరుసక్రమంలో పేర్చి కొత్తగా నిఘంటు నిర్మాణం చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొల్లేరు ప్రాంతంలో పదుల సంఖ్యలో చేపల పేర్లు వాడుకలో ఉన్నాయి. కమ్మరి, కంసాలి ఇలా ప్రతీ కులానికి, వృత్తికే ప్రత్యేకమైన పద సంపద ఎంతో ఉంది. ఇదంతా నేడు కనుమరుగై పోతోంది. ఇవన్నీ నిఘంటువులో చేర్చాలి.  హైదరాబాద్‌లోని ‘ఫ్లైఓవర్‌’లను చూసి కొందరు పల్లెవాసులు ‘పైదారులు’ అన్నారు. తాను చూసిన వస్తువుకు తన భాషలో ప్రతిమనిషీ ఒక పేరు పెట్టుకుంటాడు. ఆ పేరును గౌరవించి నిఘంటువుల్లో చేర్చుకున్న జాతి, ఆ జాతి భాషా బలపడతాయి. మన పాలకులు, సాహితీవేత్తలు, అధికారులు ఈ సత్యాన్ని గ్రహించి ముందుకు నడవాలి.


తెలుగు కీర్తనలకు దిగివచ్చిన దేవుళ్లు
బమ్మెర పోతన, కంచర్ల గోపన్న (రామదాసు), త్యాగయ్య, అన్నమయ్య, ఉమర్‌ అలీషాలాంటి ఆధ్యాత్మికవేత్తలు, సంగీతకారులు, మహాభక్త గాయకులు, భగవంతుని దయానుగ్రహాలపై తమకు హక్కు ఉన్నట్లుగా రచించిన కీర్తనలన్నీ తెలుగులో ఉన్నాయి. ఆ కీర్తనలు విని దేవుళ్లే దిగి వచ్చారని బడాయిపోతుంటాం. వాళ్ల భాషను మాత్రం దైవ భావన లేకుండా అగౌరవ పరుస్తాం. ఇదేం నీతి? రామభద్రుడు పలికిస్తేనే భాగవతం తాను పలికానని పోతనే స్వయంగా చెప్పుకొన్నాడు. ఇక పోతన రాయలేక వదిలేసిన పద్యాలను రాముడే వచ్చి తెలుగులో పూరించాడనీ, తానీషాకు డబ్బు చెల్లించి రామదాసును చెర విడిపించాడనీ ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం కదా! అలాంటప్పుడు తెలుగు దేవభాషే కదా! ఒకవేళ అలా అనిపించకపోతే మనలో ఏదో తేడా ఉన్నట్లే.

- రహంతుల్లా


భాషా పరిరక్షణలో ప్రసార మాధ్యమాల పాత్ర?
తెలుగుభాషా పరిరక్షణకు రామోజీరావు చిత్తశుద్ధితో తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వ్యక్తిగా చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వాలు ఒక వ్యవస్థగా చేయాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు సాఫ్ట్‌వేర్‌ వినియోగంలో అధికారులు పడుతున్న ఇబ్బందుల్ని ‘ఈనాడు’ వంటి తెలుగు పత్రికలు సునాయాసంగా అధిగమిస్తున్నాయి. ఇలాంటి సులభమైన సాంకేతిక మెలకువలు అందరికీ వివరించి, ఆయా సాఫ్ట్‌వేర్‌లను ప్రభుత్వానికి అందించి సాధారణ పౌరులు సైతం వినియోగించేలా సాయం చేయాలి. పత్రికలు తెలుగుపై అనురక్తిని పెంచేందుకు కృషి చేయాలి. తెలుగుభాషకు సేవచేసే వాళ్లను గుర్తించి వారి పరిచయాలను అందరూ ప్రచురిస్తే ఆ స్ఫూర్తి మరింత మంది భాషాభిమానులను తయారు చేస్తుంది.
మీ కార్యాలయంలో తెలుగు వినియోగంపై ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు?  ఈ విషయంలో సహోద్యోగుల తోడ్పాటు?
 మా కార్యాలయంలో గతంలో ఆంగ్లంలో ఉన్న అన్ని దరఖాస్తు నమూనాలను తెలుగులోకి మార్పించా. మా నుంచి జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ విధిగా తెలుగులోనే నిర్వహించాలని ఆదేశించా. దాన్ని వందశాతం అమలు చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అన్ని అధికారిక కార్యక్రమాల్లో తెలుగుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ముఖ్యంగా న్యాయస్థానాలతో చేసే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నాను.
ఉన్నతాధికారులకు పని ఒత్తిడి ఉంటుంది మరి మీరు తెలుగుకు సమయం ఎలా కేటాయిస్తున్నారు? అధికారభాష అమలు కావడానికి ఉన్నతాధికారులే ఆటంకం అన్న వాదనలున్నాయి. మీరేమంటారు?
నెలలో రెండు, మూడు రోజులు అమ్మభాష సేవ కోసం కేటాయించలేనంత పని ఒత్తిడి ఏమీ లేదు. ఉన్న సమయాన్నే ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటున్నాను. వ్యక్తిగా ఏ ఉన్నతాధికారీ అధికారభాష అమలయ్యేందుకు ఆటంకమని నేను అనుకోను. వ్యవస్థలో ఉన్నతాధికారులు అధికారభాష తెలుగును పక్కాగా అమలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు తొలగించాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో ఉంటూ ఇతర రాష్ట్రాలు, కేంద్రంతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు ఆంగ్లంలో ఉన్నా ఫర్వాలేదు. అయితే అంతర్గత ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలన్న నిబంధన, అమలయ్యేలా అధికారభాషా సంఘం ఒత్తిడి తీసుకురావాలి.
ఏ కార్యాలయంలోనైనా కీలక పత్రాలు ఆంగ్లం, హిందీల్లోనే ఉంటాయి. మరి సగటు తెలుగువాళ్ల పరిస్థితి ఏంటి?
దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య, ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య సేతుభాషగా ఇంగ్లిషు రూపొందడమే అధికారభాషగా తెలుగు అమలుకు ప్రధాన అవరోధంగా కనిపిస్తోంది. ఆంగ్లం ప్రభావం ముందు ప్రాంతీయ భాషలు వెలవెలబోతున్నాయి. తెలుగుజాతికి గౌరవం దక్కాలంటే రెండో జాతీయ అధికారభాష తెలుగు కావాలి. అందుకు తెలుగు ఎంపీలందరూ కృషి చేయాలి. పార్లమెంటులో రాష్ట్ర విభజన సమయంలో తెదేపా ఎంపీ హరికృష్ణ తెలుగులో మాట్లాడతానంటే స్పీకర్‌ ఎగతాళిగా చూశారు. రెండో అధికారభాషగా గుర్తిస్తే హిందీ వాళ్లలా పార్లమెంట్‌లో తెలుగులోనే మాట్లాడొచ్చు. కేంద్ర ఉత్తర్వులను తెలుగులో పొందవచ్చు. హిందీవల్ల హిందీ మాట్లాడేవాళ్లు ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నారో అవన్నీ తెలుగువాళ్లూ కూడా పొందవచ్చు.
స్థానిక భాషలోనే సమాధానాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం నిబంధన. ఇక్కడేమో తెలుగులో సమాచారం ఇవ్వడం లేదు...
ప్రభుత్వ దస్త్రాలు తెలుగులో ఉంటే సమస్యే లేదు. సమస్య అంతా ఆంగ్లంలో ఉండటం వల్లనే. ఎన్నికల్లో బ్యాలెట్‌పేపర్‌ తెలుగులోనే ముద్రిస్తారు ఎందుకో తెలుసా? చట్టం గట్టిగా చెబుతుంది కాబట్టి. ఇదే చట్టం తెలుగుభాష అమలుకు కూడా వర్తించాలి. చట్టం, నిర్బంధం ఉంటే తెలుగు అమలుకు ఆటంకమే ఉండదు.
ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో పరిశోధన ఎలా ఉంది?
మన భాషను మనమే పాడుచేసుకుంటూ పోతున్నాం. తెలుగుమీద అన్యభాషల ప్రభావం ఉందని పరిశోధనలు చేశారేగానీ, ఫలానా భాష మీద తెలుగు ప్రభావం ఉందని ఒక్కరూ పరిశోధన చేయలేదు. ఈ పని తెలుగు విశ్వవిద్యాలయం చేయాలి. విద్యార్థులను ప్రోత్సహించాలి.
ముస్లింలకు తెలుగులోనే నిఖానామా రూపొందించారు. దానిపై స్పందన...
తెలుగులో పెళ్లి తంతు జరగాలనే కోరిక తెలుగువారిలో పెరుగుతోంది. వివాహ విధి విధానమంతా మనకు తెలియాలి అంటూ సామల రమేష్‌బాబు తన ఇద్దరు కొడుకుల పెళ్లి తెలుగులోనే చేశారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి పెళ్లిళ్లన్నీ తెలుగులోనే చేయాలని ఉద్యమం చేపట్టారు. వెనిగళ్ల సుబ్బారావు ‘పెండ్లి మంత్రాల వెనుక బండారం’ అనే పుస్తకంలో తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు ఉర్దూలో ముద్రించిన 8 పేజీల పెళ్లిపుస్తకం నిఖానామా ఖాజీలకు సరఫరా చేస్తుంది. దీన్ని తెలుగులో ముద్రించాలని వక్ఫ్‌బోర్డుకు రాశాను. ప్రస్తుతం తెలుగులో కూడా నిఖానామాలు అందుతున్నాయి.
ప్రస్తుతం మన సాహిత్యం పరిస్థితి? తెలుగు సాహిత్యాన్ని యువత ఆకర్షించాలంటే... ?
ప్రస్తుతం తెలుగులో చదివితే మంచి జీతాలొచ్చే ఉద్యోగాలు రావేమో అన్న భ్రమలో ఉన్నారు. ఇక తెలుగులో విజ్ఞాన శాస్త్ర సాహిత్యం అంత ఎక్కువగా రాలేదు. కంప్యూటర్‌ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఆంగ్లం బాగా రావాలి అనుకుంటున్నారు. కంప్యూటర్‌ కోసం తెలుగును బలిపెట్టడమంటే ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడమే. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాతృభాష కన్నడం కానివారైనా సరే... మూడోభాషగానైనా కన్నడం చదవాల్సిందే. కన్నడం లేకుండా అక్కడ పాఠశాల విద్య పూర్తికాదు. ప్రభుత్వోద్యోగాల్లో 15శాతం మార్కులు కన్నడ మాధ్యమం వాళ్లకు ప్రోత్సాహకంగా కేటాయించారు. ఇలాంటి విధానాలు మనమెందుకు అమలు చేయలేకపోతున్నాం. మౌలనా అబుల్‌ కలాం ఆజాద్‌ చెప్పినట్లు... భాషను సాహిత్యానికి, కవిత్వానికి మాత్రమే పరిమితం చేస్తే భాషతోపాటు ఆ భాష మాట్లాడేవారూ వెనుకబడిపోతారు. అందుకే భాషను ఉపాధితో ముడిపెట్టాలి. అప్పుడే యువతరంలో తెలుగుపై అభిమానాన్ని ప్రోది చేయగలుగుతాం.


నూర్‌బాషా రహంతుల్లా 1959 ఏప్రిల్‌ 18న గుంటూరు జిల్లా కంకటపాలెంలో జన్మించారు. నూర్‌బాషా రోషన్‌బీ, మౌలాలీ దంపతులు ఆయన తల్లిదండ్రులు. ఎం.కాం. చదివిన రహంతుల్లా వివిధ పత్రికల్లో తెలుగు భాష, పరిపాలన సంబంధమైన వ్యాసాలు ప్రచురించారు. వివిధ అంశాలపై 10 తులనాత్మక పరిశీలనా గ్రంథాలు రాశారు. అన్ని మాండలికాల పదాలతో ఆధునిక అవసరాలు తీరేట్లుగా తెలుగు మహా నిఘంటువు నిర్మాణం, తెలుగు లిపి సంస్కరణ, పాలనా వ్యవహారాలు తెలుగులో సాగించడం కృషి చేస్తున్నారు.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి