తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

‘ఇది చేయడానికి మీరెవరు?’ అన్నారు!

  • 169 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బి.మదనమోహన్‌ రెడ్డి

  • పరిశోధక విద్యార్థి, కేంద్రీయ విశ్వవిద్యాలయం,
  • హైదరాబాదు.
  • 9989894308

ఏడెనిమిదేళ్ల కిందట అనుకుంటా, తరగతిగదిలో పాఠం చెబుతుంటే పాఠ్యాంశ రచయిత వివరాలకు మాత్రమే పరిమితమైపోతున్నామని అనిపించింది. ఫొటోల సాయంతో ఎందుకు పాఠం చెప్పలేకపోతున్నామని నాలో నాకే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ కోణంలో కొన్ని చిత్రాలతో ప్రయత్నించి చూశా. పిల్లలు మునుపటి కంటే చురుకుగ్గా పాఠం నేర్చుకున్నారు. ఎంతో ఆనందమేసింది. నా పాఠశాల పిల్లల సంగతి సరే. మిగలిన పిల్లల పరిస్థితి ఏంటన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఓ రోజు మా ఆవిడతో ఈ ఫొటోల సేకరణ మనమే ఎందుకు చేయకూడదన్నాను. తానూ ‘‘సరే, ప్రయత్నిద్దాం’’ అంది. అలా అక్కడ నుంచి పుట్టుకొచ్చిందే మా ఈ ఆలోచన, ఆచరణ.
      మాది అనంతపురం జిల్లాలోని కదిరి. మా ఇద్దరివీ గ్రామీణ నేపథ్యాలే. తాత, నాన్న (ఉపాధ్యాయుడు) గ్రామంలో పండుగలప్పుడు నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. దాంతో ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. వీటితో పాటు అప్పట్లో ఊరంతా తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు, జానపద పాటలతో మార్మోగి పోతుండేది. ఇవన్నీ కలిసి నన్ను వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మే తెలుగు చేసేలా చేశాయి. ఆ కళలు ఇప్పుడు కనమరుగైపోతున్నా నాలో మాత్రం సజీవంగా ఉండిపోయాయి. అవే నన్ను ఇక్కడిదాకా నడిపించాయి. విశ్వవిద్యాలయంలో జి.యన్‌.రెడ్డి, పి.సి.నరసింహారెడ్డి, పి.నరసింహారెడ్డి, సర్వోత్తమరావు, జి.నాగయ్య లాంటి ఉద్దండ గురువుల ప్రభావమూ నా మీద ఉంది. 
మంచీ చెడూ..
మాకు తెలియదు ఇది ఇంత పెద్దప్రాజెక్టు అవుతుందని. మొదట్లో తెలుగు పాఠ్యాంశాల రచయితల వరకే సేకరిద్దాం అనుకున్నాం. బడి పిల్లలకోసం ఏదైనా చేయాలన్న సంకల్పం బలంగా నాటుకుపోవడంతో కష్టనష్టాల గురించి ఆలోచించకుండా సేకరణ పరిధిని ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ వెళ్లాం. మా అబ్బాయికి ఏదో చిన్న ఆరోగ్య సమస్య తలెత్తితే, చికిత్స కోసం హైదరాబాదుకు తీసుకెళ్లాం. వాడు కోలుకున్నాక తిరుగు ప్రయాణంలో ‘‘నాన్నా! ఎలాగో ఇంతదూరం వచ్చాం, మన సేకరణ ఇక్కడి నుంచి మొదలుపెడితే ఎలా ఉంటుంది’’ అన్నాడు. మంచిదే కదా అనుకుని, మొదటగా రావూరి భరద్వాజ గారింటికి వెళ్లాం. ఇన్నేళ్ల ఈ సేకరణ యజ్ఞంలో ఎన్నో అనుభవాలెదుర య్యాయి. అందులో మంచివి, చెడ్డవి ఉన్నాయి, మన జీవితంలో లానే! రావూరి భరద్వాజ గారింటికి వెళ్లినప్పుడు ఆయన కోడలు సుభద్రాదేవి ఓ మాట అన్నారు.. ‘మా మామయ్య గురించి అటు ఆంధ్రవాళ్లు గాని, ఇటు తెలంగాణ వాళ్లు గాని ఎవరూ పట్టించుకోలేదు. ఇన్నాళ్లకు ఎక్కడో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మీరు వచ్చి వివరాలు అడుగుతుంటే చాలా ఆనందంగా ఉంది’’ అని! ఆ మాట గుర్తు చేసుకున్న ప్రతిసారీ ఆనందంగా ఉంటుంది. మరో సందర్భంలో విజయవాడకు వెళ్లాం. అక్కడ రచయితల సంఘానికి సంబంధించిన ఓ ప్రముఖ వ్యక్తిని కలిశాం. సమాచార విషయంలో సహకరించాలని కోరాం. ‘‘ఇది చేయడానికి మీరెవరు? డబ్బులు కోసం చేస్తున్నారా?’’ అంటూ తెలిసిన వాళ్లను సైతం సహకరించకుండా చేశారు. కన్నీళ్లు పెట్టించిన చేదు అనుభవమిది. ఇలా ఎన్నో..!  
వ్యయప్రయాసలను లెక్కచేయలేదు
సాహితీవేత్తల ముఖచిత్రాలు, జీవిత విశేషాల సేకరణ ప్రారంభించే ముందు కొంత అధ్యయనం చేశాం. గురజాడ శ్రీరామమూర్తి ‘కవి జీవితాలు’, కందుకూరి వీరేశలింగం ‘కవుల చరిత్ర’, పింగళి లక్ష్మీకాంతం రచనలు, ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ పుస్తకాలు మాకు చాలా ఉపయోగపడ్డాయి. అయితే, వాటికి, మా సేకరణకు తేడా ఏమంటే మా ప్రచురణల్లో ముఖచిత్రాలతో పాటు పిల్లలకు అర్థమయ్యే రీతిలో సాహితీవేత్తల జీవిత విశేషాలు ఉంటాయి. ఇంతకు ముందు తెలుగు విశ్వవిద్యాలయం ఈ కోణంలో కొంత ప్రయత్నం చేసింది. తూమాటి దొణప్ప ఉపకులపతిగా ఉన్నప్పుడు అనుకుంటాను.. 20, 30 మంది రచయితలని మాత్రమే ముద్రించారు. అవి కూడా బాపుతో వేయించిన బొమ్మలు. మావి దాదాపు 400 మంది రచయితల ముఖచిత్రాలు, వారి వారసులు ఇళ్లల్లో దాచుకున్న అరుదైన ఫొటోలను వెలుగులోకి తెస్తున్నాం. 
రచయితల ఫొటోల కంటే, వారి తల్లిదండ్రుల పేర్ల సేకరణకే ఎక్కువ శ్రమించాం. కొంత మంది రచయితల మీద పరిశోధనలు చేసిన వారు కూడా ఆయా విషయాలు చెప్పలేకపోయారు. పిలకా గణపతిశాస్త్రి గారి తల్లిదండ్రుల పేర్ల కోసం చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అప్పటికీ తండ్రి పేరు మాత్రమే లభించింది. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, మన రచయితల్లో ఎక్కువ మంది ఎందుకో తమ తల్లిదండ్రుల ప్రస్తావనను ఎక్కడా చేయలేదు. ఆధునిక రచయితల వివరాలు త్వరగానే సేకరించాం. పాతతరం వారి కోసమే ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాదులతో పాటు బెంగళూరు, మైసూరు, బళ్లారి, చెన్నై లాంటి చోట్లకూ వెళ్లాం. ఈ క్రమంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు చాలానే ఉన్నాయి. ఒక ప్రాంతానికంటూ వెళ్లినప్పుడు అక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వచ్చేదో కచ్చితంగా తెలిసేది కాదు. అక్కడే బస చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో తిరగాల్సి ఉంటుంది. ఈ విశేషాల ముద్రణకు బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణాలు కూడా తీసుకున్నాం. మొత్తమ్మీద రూ.25 లక్షలకు పైగా వ్యయం అయ్యింది. మా అబ్బాయి కూడా బెంగళూరులో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేసి, ఈ యజ్ఞంలో భాగస్వామి అయ్యాడు.  
వారసులకే తెలియదు!
నాలుగు వందల మంది రచయితల ఫొటోలు, జీవిత వివరాలు ఒకేసారి ముద్రిస్తే చాలా బరువుగా ఉంటుంది. అందుకే కొన్ని భాగాలుగా తీసుకువస్తున్నాం. సొంత ప్రచురణ సంస్థ ఉంటే తక్కువలో అవుతుందని విన్నాం. అందుకే మా అమ్మాయి పేరు మీదగా ‘హర్షిత పబ్లికేషన్స్‌’ ప్రారంభించాం. నూట పదకొండు మంది సాహితీమూర్తుల విశేషాలతో మొదటి భాగాన్ని ప్రచురించాం. దాని ఆవిష్కరణకు  అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అంతలో లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో నిర్వహించలేకపోయాం. పోతుల రామకృష్ణారెడ్డి సహకారంతో సెప్టెంబరు 27న గోరంట్లలో ‘తెలుగు సాహితీ మూర్తులు’ మొదటి భాగాన్ని ఆవిష్కరిం చాం. దీనికి మంచి స్పందన వస్తోంది.  
      ఈ ఫొటోలు, జీవిత విశేషాల సేకరణకు రెండు రకాలుగా ప్రణాళిక వేసుకున్నాం. ఒకటి.. నిర్ణయించుకున్న ప్రాంతానికి వెళ్లి అక్కడి రచయితల గురించి సేకరించాం. ఎక్కువ మంది రచయితలు ఏ ప్రాంతం వారో తెలుసుకుని ఆయా చోట్లకు వెళ్లి కూడా విషయ సేకరణ చేశాం. రచయితల కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రంథాలయాలను ప్రధాన ఆధారాలుగా చేసుకున్నాం. మేం వెళ్లినప్పుడు ఆయా రచయితల కుటుంబ సభ్యుల స్పందన మిశ్రమంగా ఉండేది. తండ్రి ఏం రాశారో కొంతమంది పిల్లలకు అవగాహన ఉండేది కాదు. ‘‘మా నాన్న నిజంగా అంత గొప్పవాడా సార్‌’’ అని తిరిగి మమ్మల్నే ప్రశ్నించేవారు. మన తెలుగు సమాజంలో చాలా మందిలాగే ఆయా సాహితీమూర్తుల సంతానంలో కూడా కొంత మందికి రచయితల స్థాయి ఏంటో తెలియదు. చాలా దురదృష్టకరమిది.
అదే మా ఆకాంక్ష
రచయితల ఫొటోలు, విశేషాల సేకరణ, ప్రచురణలో  నా పూర్వ విద్యార్థి మంజునాథ్‌ రెడ్డి, డాక్టర్‌ బోలుగద్దె అనిల్‌ కుమార్‌ (హైదరాబాదు), మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫణికుమార్, అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల, పౌర, వేటపాలెం గ్రంథాలయాలు, శ్రీకాకుళం కథానిలయం బాధ్యులు బాగా సహకరిం చారు. మేము తలపెట్టిన పని గురించి తెలిసిన సాహితీవేత్తలెందరో మమ్మల్ని ప్రోత్సహించారు. రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి, శాంతినారాయణ, సింగమనేని నారాయణ, కేతు విశ్వనాథరెడ్డి, పీఎల్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఓల్గా, శరత్‌ జోత్స్నారాణి లాంటి వారి అభినందనలు మాకు మంచి ఉత్సాహాన్ని అందించాయి. 
      పాఠశాల విద్యార్థుల అవసరాలరీత్యా చేసిన సేకరణ ఇది. మా లక్ష్యం ఒక్కటే, ఫలానా రచయిత ఈయనేనని పిల్లలు గుర్తుంచుకోవాలి. ఉపాధ్యా యులకూ ఆయా సాహితీవేత్తల గురించి తెలిసి ఉండాలి. జయంతి, వర్ధంతులప్పుడు వారిని స్మరించుకోవడానికి మేం సేకరించిన ముఖచిత్రాలు ఉపయోగపడాలి. ఇదే మా అభిలాష. ఇలాంటి కార్యక్రమాలకు మేం రూపొందించిన ‘తెలుగు సాహితీ కాలచక్రం’ క్యాలండర్‌ చాలా ఉపయోగ పడుతుంది. ఎవరైనా తాము చదువుకున్న పాఠశాలకు వీటిని జ్ఞాపికగా అందజేయా లనుకుంటే తక్కువ మొత్తానికే ఇస్తాం. అలా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలకు ఇవి చేరాలన్నదే మా ఆకాంక్ష. అలాగే, మాతృభాషను పిల్లలు మరింతగా ఆస్వాదించేలా మా ప్రచురణ సంస్థ తరఫున కృషి చేయాలనుకుం టున్నాం. అందుకు తగ్గట్టుగా పుస్తకాలు, శ్రవణ, దృశ్య రూపాల్లో భాషా సాహితీ విశేషాలను అందుబాటులోకి తీసుకురాబో తున్నాం. పిల్లాడికి బాల్యదశలోనే మన తెలుగు పట్ల ఇష్టాన్ని పెంచాలన్నది మా ప్రధాన ఉద్దేశం. అందుకు వీలైన అన్ని ప్రయత్నాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.


ప్రణాళికాబద్ధంగా..
నేను సైన్స్‌ విద్యార్థిని. మావారి సాహిత్య పిపాస నాకు కొంత అబ్బింది. ఆయన ప్రోత్సాహంతోనే తెలుగు భాషోపాధ్యాయురాలిని అయ్యాను. మాకు షణ్ముఖ, హర్షిత ఇద్దరు పిల్లలు. సాహితీమూర్తుల ఫొటోలు, జీవిత విశేషాల సేకరణను ప్రణాళికాబద్ధంగా చేశాం. ఒక నెలలో ఎన్ని సెలవులు దొరుకుతాయో ముందుగానే చూసుకునే వాళ్లం. రెండో శనివారం, ఆదివారాలకి తోడుగా మా వ్యక్తిగత సెలవులని దీనికి వాడుకున్నాం. ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంతి జీవితంలోకి వెళ్లిపోవాలనుకోవట్లేదు. కొన్ని ప్రణాళికలు ఉన్నాయి.. మా అబ్బాయివి. ఈ ‘సాహితీమూర్తులు’ ప్రాజెక్టులో వాడి ఆలోచనలే ప్రధానం. తన భవిష్యత్తు ఆలోచనలకు సహకరించాలనుకుంటున్నాం. 

- వజ్రాల యశోద


సాహితీ కాలచక్రం
బెంగళూరులో ఎంబీఏ చేస్తున్నప్పుడు మా విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో గాంధీ, నెహ్రూ ఫొటోల మధ్య ఒకరి ఫొటో ఉండేది. అది ఎవరిదో తెలియక అక్కడి సిబ్బందికి అడిగా. ‘‘గిరీష్‌ కర్నాడ్‌ గారు.. గొప్ప రచయిత, నటుడు, జ్ఞానపీఠ్‌ కూడా వచ్చింది’’ అన్నారు. ఒక రచయితని దేశ నాయకుల మధ్య ఉంచి ఆరాధించే వాళ్ల భాషాభిమానానికి ఆశ్చర్యపోయా. ఈ విషయాన్ని ఇంటికి ఫోన్‌ చేసి చెప్పబోయా. కానీ అమ్మానాన్నలే నాకు మరో ఆశ్చర్యకర విషయం చెప్పారు. తెలుగు రచయితల ఫొటోలు, జీవిత విశేషాలు సేకరించాలని నిర్ణయించుకున్నాం అన్నారు. చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరాక అమ్మానాన్నలతో కలిసి వారి సేకరణ యజ్ఞంలో భాగం కావాలనిపించింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా, వాళ్లతో కలిసి ప్రయాణించడం, వివరాలు సేకరించడం ఇలా అన్నీ వరసగా జరిగిపోయాయి. నాకు చిన్నప్పటి నుంచీ తెలుగు అంటే ఇష్టం. బహుశా! అమ్మానాన్నలిద్దరూ భాషోపాధ్యాయులు కావడంతో అది సహజంగా ఏర్పడిందనుకుంటాను. మేం సేకరించిన ఫొటోలు, వివరాల ఆధారంగా ‘సాహితీ కాలచక్రం’ పేరిట ఓ క్యాలెండర్‌ కూడా ప్రచురించాం. ఆయా నెలల్లో జన్మించిన, కీర్తిశేషులైన రచయితల ఫొటోలను ఇందులో పొందుపరచాం. ఇది పిల్లలకు, ఉపాధ్యాయులకు, సాహితీ కార్యక్రమాల నిర్వాహకులకు చాలా ఉపయోగపడుతుంది. తెలుగు కోసం జీవితాలను ధారపోసిన వాళ్లు ఉన్నారు. నేను కేవలం జీతాన్ని వదులుకున్నాను. ఇక పూర్తిస్థాయిలో భాష కోణంలోనే పనిచేస్తాను. ఆధునిక కాలంలో ప్రజల దగ్గరికి దేన్ని తీసుకెళ్లాలన్నా సాంకేతికత తప్పనిసరి. తెలుగు సాహిత్యం కూడా అందుకు అతీతం కాదు. అందుకే దృశ్య- శ్రవణ మాధ్యమాల ద్వారా పిల్లల్లో, యువతలో భాషాభిమానం పెంపొందించాలి. ఓ డాక్యుమెంటరీతో పాటు 400 ఎపిసోడ్లతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నాం. మా ‘హర్షిత ప్రచురణలు’ తరఫున కూడా ఈ కృషిని నిరంతరం కొనసాగిస్తాం.            

 - షణ్ముఖ 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి