తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ప్రతి రాష్ట్రమూ స్వాగతించాలి

  • 89 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వై.అమ‌రేంద్ర‌

పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకుని, ఆ అమ్మభాషే భూమికగా ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) ఉపకులపతి స్థాయికి ఎదిగారు ఆచార్య ఏర్పుల సురేష్‌ కుమార్‌. ఇటీవలే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సభ్యుడిగా నియమితులైన ఈయన, మన చుట్టూ మాట్లాడే భాషలో విద్యాబోధన జరిగితేనే పిల్లల మేధో వికాసం బాగుంటుందని అంటున్నారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని కూలంకషంగా పరిశీలించిన ఆచార్య సురేష్‌తో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి...
జాతీయ నూతన విద్యా విధానంలో భాషకు ఎలాంటి ప్రాధాన్యం లభించింది?

నూతన విధానం ద్వారా పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషా మాధ్యమంలో చదువుకునే అవకాశం కలుగుతుంది. అయితే, అమ్మభాష, ప్రాంతీయ భాష వేరుగా ఉండొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రాంతీయ భాష తెలుగే. నూతన జాతీయ విద్యా విధానంలో ప్రధానంగా అయిదో తరగతి వరకు వీలైతే ఎనిమిదో తరగతి దాకా మాతృభాషలో విద్యా బోధనకు ప్రాధాన్యవిచ్చారు. తద్వారా పిల్లలు త్వరగా విద్య నేర్చుకునేందుకు వీలవుతుంది. చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. అలాకాకుండా ఇంట్లో తెలుగు మాట్లాడుతూ, పాఠశాలలో ఆంగ్లంలో బోధన జరిగితే అసౌకర్యంగా ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆంగ్లం కూడా పిల్లల భవిష్యత్తుకు ముఖ్యమే కాబట్టి ఆ భాషను తర్వాత వివిధ దశల్లో నేర్చుకోవచ్చు. 
ఇప్పటి వరకు ఎన్నో కమిటీలు మాతృభాషలో విద్యా బోధన ఉండాలని చెప్పాయి. కానీ వాటి సిఫారసులు అమలు కాలేదు కదా. మరి ఈ కొత్త విధానం ఆచరణలోకి వస్తుందా?
గతంతో పోల్చితే ప్రస్తుత సమాజంలో చాలా పరిణతి కనిపిస్తోంది. గతంలో కమిటీలు ఏవైనా ప్రతిపాదిస్తే సరిగా అర్థం చేసుకోలేకపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుని అమలు చేసే వ్యవస్థలున్నాయని నా అభిప్రాయం. అదీగాక కేంద్రంలో బలమైన, సుస్థిర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ నూతన జాతీయ విద్యా విధానం ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తుందని నా నమ్మకం. 
మాతృభాషలో బోధన వల్ల విద్యార్థులకు కలిగే లాభాలు?
విషయాన్ని అన్వయించుకోవడం సులువవుతుంది. విద్యార్థులు త్వరగా బోధనకు అలవాటుపడతారు. ఇంట్లో, పాఠశాలలో ఒకే భాష ఉంటే సులువుగా ఉంటుంది. అలా కాకుండా వేర్వేరు భాషల్లో ఉంటే అనువాదం చేసుకుని చదవడం కష్టమవుతుంది. ఒకే భాష ఉంటే గ్రహణ శక్తి పెరిగి విద్యార్థి మనోవికాసానికి దోహదపడుతుంది.
మీరు చదువుకునే రోజులకు, ఇప్పటికి విద్యా విధానంలో వచ్చిన మార్పులు?
ఆ రోజుల్లో పోటీతత్వం తక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువ. అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ. ప్రైవేటు స్కూళ్లు తక్కువ. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలను సేవాభావంతో ఏర్పాటు చేసే వారు తక్కువే. తల్లిదండ్రులు పాఠశాలల్లో నాణ్యమైన ఉపాధ్యాయులున్నారా? ఆటస్థలం ఉందా? అని చూడకుండా; పెద్ద భవనం ఉందా? ఏసీ ఉందా? లాంటివి చూసి పిల్లల్ని చేర్పిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తి తక్కువ వేతనాలు చెల్లించే వ్యవస్థగా కాకుండా ఎక్కువ వేతన చెల్లింపులతో కూడి ఉండాలి. తక్కువ వేతనాల వల్ల ఉపాధ్యాయులు తరచూ వేరొక పాఠశాలలకు మారుతుంటారు. దీనివల్ల అంకితభావంతో పనిచేయడం తగ్గిపోతుంది. 
జాతీయ విద్యా విధానం అమలు ఎంత వరకు సాధ్యమవుతుంది?
నూతన జాతీయ విద్యా విధానం వెనక ఎంతో మేధామథనం జరిగింది. జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో సాగిన అనేక చర్చలు, లక్షల మంది అభిప్రాయాలను గౌరవించి కేంద్రం ఈ విధానాన్ని ప్రకటించింది. అయితే, దీని అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. విద్యార్థులు బాగుపడాలనే ఏ రాష్ట్రమైనా కోరుకుంటుంది. అయితే, కేంద్రం తెచ్చిన విధానం మాకెందుకులే అని ఏ రాష్ట్రమైనా అనుకుంటే అక్కడి ప్రజలు, విద్యార్థులే నష్టపోతారు. ఎంతో ఆలోచించి, వ్యవస్థీకృతంగా అన్ని అంశాలను చర్చించి, పరిశీలించి, క్రోడీకరించి తెచ్చిన విధానమిది. ఈ కొత్త విద్యా విధానం మొత్తాన్నీ అధ్యయనం చేశాను. గతంలో విద్యా విధానాలు ఉద్యోగ కల్పనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. దీనివల్ల ప్రాథమిక అంశాల మీద పట్టు లేకుండానే విద్యార్థులు చదువులు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యకు ప్రాధాన్యం దక్కనుంది. కొత్త విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తేనే విద్యార్థులకు మంచి విద్యను అందించినట్లవుతుంది. లేకపోతే విద్యార్థులకు అన్యాయం చేసిన వాళ్లవుతారు. 
మీరు చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు ఎలా ఉండేవారు. మీకు బాగా స్ఫూర్తినిచ్చిన ఉపాధ్యాయులెవరు?
నేను తొమ్మిది, పదో తరగతి చదివేట ప్పుడు ఖమ్మం జిల్లాలో రంగారావు అనే ప్రధానోపాధ్యాయులు ఉండేవారు. ఆయన ఆంగ్లం బోధించేవారు. నేను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను. రంగారావు గారి వల్లనే ఆంగ్లం మీద ఆసక్తి పెరిగింది. ఆయన నేర్పిన పాఠాలతోనే ఆ భాష మీద పట్టు సాధించాను. మా పాఠశాలలో మూడు సెక్షన్లుండేవి. మూడింట్లోకీ ఆంగ్లంలో అత్యధిక మార్కులు నాకే వచ్చేవి. మిగిలిన సబ్జెక్టుల్లో మాత్రం సగటు మార్కులే! అలాగే మా నాన్న పోలీసు అధికారి. నన్ను దగ్గర కూర్చో బెట్టుకుని చుట్టూ పరిసరాల్లో ఉండే వాటిని ఆంగ్లంలో చెబుతూ నేర్పించేవారు. ఆ తర్వాత ఆంగ్లంలో వార్తలు విని, ఆ వ్యాఖ్యాత తరహాలో మాట్లాడాలని ప్రయత్నించేవాణ్ని. కొత్తగూడెంలో ఇంటర్, డిగ్రీల్లో సైన్సు కోర్సులు చేశాను. కాన్పూరులో చదువుకునేటప్పుడు ఏదైనా మాట్లాడాలంటే, నా స్నేహితులు నన్ను ముందుంచేవారు. అలా హిందీ నేర్చుకున్నాను. స్నాతకోత్తర, పరిశోధక విద్యలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తిచేశాను. ఇంటర్‌ నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి వచ్చాను. కానీ, చిన్నతనం నుంచీ ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకున్న విద్యార్థులు కూడా ప్రిన్సిపల్‌కు ఏవైనా లేఖలు రాయాల్సొస్తే నా దగ్గరికి వచ్చేవారు. 
ఆంగ్లం రాకపోతే భవిష్యత్తు లేదనే అపోహ ఎలా వ్యాపించిందంటారు?
మనం ఆంగ్లం మాట్లాడే దేశం వెళ్లి జీవించాలంటే ఆంగ్లం తప్పనిసరి. అదే జర్మనీకి వెళ్తే జర్మన్, ఫ్రాన్స్‌ వెళ్తే ఫ్రెంచ్‌ వచ్చి ఉండాలి. మనం 200 ఏళ్ల పాటు బ్రిటిష్‌ పాలనలో ఉండటం వల్ల ఆంగ్లం మాట్లాడితే గొప్ప అన్న ఓ అపోహ వచ్చిందనుకుంటాను. ఓ సమావేశంలో అందరూ తెలుగులో మాట్లాడి, ఒకరు ఇంగ్లిష్‌లో మాట్లాడితే.. అతణ్ని గొప్పవాడిగా చూస్తారు! దేశంలో ఆంగ్లం మీద తెలియని గౌరవం తరతరాలుగా ఏర్పడుతూ వచ్చింది. కానీ, మాతృభాష అనేది పునాది లాంటిదని గుర్తుంచుకోవాలి. పునాది లేకుండా ఎన్ని అంతస్తులు కట్టినా భవనం నిలవదు. మాతృభాషలో మాట్లాడటం గొప్పతనంగా భావించాలి. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా విధానం తీసుకొస్తున్నారు. దాని ప్రకారం ఆంగ్లం, రెండు భారతీయ భాషలు నేర్చుకోవాలి. దీనివల్ల అదనపు ప్రయోజనం కలుగుతుంది. 
మాతృభాషలో చదువుకుని ఈ స్థాయికి రావడం ఎలా అనిపిస్తుంది?
మాతృభాషలో విద్యాభ్యాసం నాలో  సృజనాత్మకతను మరింతగా పెంచింది. పాఠశాలలో బోధించే భాష, ఇంట్లో మాట్లాడే భాష ఒక్కటే కావడంతో సులువుగా పాఠాలు అర్థమయ్యేవి. పాఠశాలలో బోధించే అంశాలు అర్థమైతే, మిగిలిన వాటి మీద దృష్టి పెట్టేందుకు ఎక్కువ సమయం చిక్కుతుంది. ఈ ఖాళీ సమయాన్ని నేను కరాటే, సంగీతం, ఆటలకు కేటాయించుకునేవాణ్ని.  చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల మీద దృష్టిపెడితే సమగ్ర వికాసం సాధ్యమవుతుంది.
నూతన విద్యా విధానంతో చదువుల్లో ఎలాంటి మార్పులు వస్తాయని భావిస్తున్నారు? 
ఈ విధానంలో బోధన పరంగా ఎంతో స్వేచ్ఛ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీనివల్ల భాషపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మకతకు ప్రాధాన్యముంటుంది. విద్య ఉత్సాహంగా సాగుతుంది. ఎడ్యుకేషన్‌ అనేది ఎడ్యుటైన్‌మెంట్‌గా మారుతుంది. పాఠశాల అంటే కష్టం పోయి ఇష్టం కలుగుతుంది. ఈ విధానం పరంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఐఏఎస్‌ అధికారి వరకూ మాతృభాష ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని ఈ విధానాన్ని అమలు చేయాలి. దీని ద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించగలమని గుర్తించాలి. ప్రతి రాష్ట్రమూ ఈ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి