తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

అలా ఇప్పటికీ నేనొక్కణ్నే!

  • 199 Views
  • 1Likes
  • Like
  • Article Share

    కృష్ణంరాజు పి.వి.జి.

  • ఈ-ఎఫ్‌ఎమ్‌ ప్రొడ్యూసర్,
  • హైదరాబాదు.
  • 9963028590

మల్లాది వెంకట కృష్ణమూర్తి.. తెలుగు పాఠకులకు పరిచయం అక్కర్లేని పేరిది. 1970లో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి, ఇప్పటి వరకు 109 పత్రికల్లో 3500కి పైగా కథలు, 1200కి పైగా వ్యాసాలు, 70కి పైగా వివిధ శీర్షికలు, సంపాదకత్వాలు, 106 నవలలు రాశారు. 22 సినిమాలు, 9 టీవీ ధారావాహికలకు కథలు అందించారు. రచయితగా 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న మల్లాదితో ‘తెలుగువెలుగు’ ముఖాముఖీ..  
రచయితగా స్వర్ణోత్సవం జరుపుకుంటున్న మీకు అభినందనలు!
ధన్యవాదాలు.. యాభయ్యేళ్లుగా నా రచనలని ఆదరిస్తూ ఈ సుదీర్ఘ సాహితీ ప్రయాణానికి ముఖ్య కారకులైన పాఠకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు!
అసలు మీకు సాహిత్యం మీద ఆసక్తి ఎలా కలిగింది?
మా అమ్మగారు శారదాంబ అప్పట్లో పుస్తకాలు బాగా చదివేవారు.. అలా నాకు చిన్నప్పటి నుంచీ పుస్తకాలు చదవడం అలవాటైంది. కథలు చదువుతూ కథ ముగుస్తుందీ అనే సమయంలో ముగింపు ‘ఇలా వుంటుంది’ అని ఊహించేవాణ్ని. కానీ, ఆ కథ ముగింపు మరోలా ఉండేది. అలా చదవడం మీద ఆసక్తి పెరిగింది. అలా కథలను ఎలా విస్తరించవచ్చు అని నా అంతట నేనే అధ్యయనం చేసేవాణ్ని. నాకు మొదట్లో కొమ్మూరి సాంబశివరావు రచనలంటే చాలా ఇష్టం ఉండేది. ఆ పదాలు, చిన్న చిన్న వాక్యాలు, ఆ శైలి నన్ను బాగా ఆకర్షించాయి. నాలో రాయాలనే ఆసక్తిని పెంచాయి. 


ఇంట్లో మీ నాన్నగారు, తాతగారు ఎవరైనా రాసేవారా? సాధారణంగా అంటుంటారు కదా ‘అది వాళ్ల రక్తంలోనే ఉంది’ అని..?   
మా తాతగారు మల్లాది బలరామ సిద్ధాంతి మంచి జ్యోతిష్కులు. అప్పట్లో నిజాం సంస్థాన ఆస్థాన జ్యోతిష్కులుగా ఉండేవారట. అదే మా నాన్నగారు దక్షిణామూర్తి గారికి కూడా అబ్బింది. ‘జోతిస్సాముద్రికాచంద్రిక’ అనే పుస్తకానికి సంపాదకులుగా చేశారు. ఇంకా కొన్ని పుస్తకాలు కూడా రాశారు. అయితే ఏదైనా కుటుంబంలోనో వంశంలోనో ఉంటే అది తర్వాత తరాలకు జన్యుపరంగా వస్తుందన్న మాటను నేను నమ్మను. ఆయా రంగాల్లో సొంతగా కృషి చేయాల్సిందే. ఒక మంచి రచయిత కావాలంటే బాగా చదవాలి. 
మీ మొదటి కథ ఎప్పుడు ప్రచురితమైంది?
చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చాను. అప్పుడే 1970 ఫిబ్రవరిలో నా మొదటి కథ ‘ఉపాయశాలి’ రాశాను. అదే సంవత్సరం ఆగస్టు ‘చందమామ’లో అచ్చయ్యింది. ఆ తర్వాత ‘సబల’ పేరుతో ‘ఆంధ్రప్రభ’లోను, ‘అపరాధశోధన’లో ‘శివాజ్ఞలేనిదే’ అనే నేరగాథ, ‘ఆంధ్ర పత్రిక’లో మరో కథ వరుసగా ప్రచురితమయ్యాయి. నా మొదటి నవల లేదా నవలిక అనొచ్చు.. ‘అద్దెకిచ్చిన హృదయాలు’. ఒక కథకి ఆలోచన రాగానే దానిలోని ముఖ్యాంశాలను క్లుప్తంగా రాసి పెట్టుకుని ఆ తర్వాత దాన్ని కథగానో నవలగానో మలిచేవాణ్ని. అలా నా పదహారో ఏట రాసుకున్న అంశాల ఆధారంగా రాసిన నవలే ‘మిసెస్‌ పరాంకుశం’. నలభయ్యేళ్ల కిందటి దీని ఆధారంగానే ఆ మధ్య ఛార్మీ ప్రధాన పాత్రగా పూరీ జగన్నాథ్‌ ‘జ్యోతిలక్ష్మి’ చిత్రాన్ని నిర్మించారు. 
అంటే ఇప్పటి పరిస్థితులకు సరిపోయేలా అప్పట్లోనే రాశారన్న మాట... 
ఇలాంటిదే ఇంకో విషయమూ చెప్పాలి.. 1978లో ‘చతుర’కు ‘కొత్త శత్రువు’ అని ఒక నవల రాశాను. అది కరోనా లాంటి ఒక వ్యాధి వస్తే సమాజం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం.
బయటి దేశాల్లో పుస్తకాలు చదివే వారి సంఖ్య పెరుగుతోందంటున్నారు..
అమెరికా, ఐరోపా దేశాల్లో చిన్నతనం నుంచీ పుస్తకాలు చదవడం అలవాటుగా మారుతుంది. అక్కడ బడుల్లో ఇతర పుస్తకాలు చదివేందుకు ఒక ప్రత్యేక సమయాన్ని పెట్టి చిన్నప్పటి నుంచీ వయసుకు తగ్గ పుస్తకాలు చదివిస్తారు. అలాగే ఇంట్లో కూడా రోజూ రాత్రి పడుకునేటప్పుడు తల్లోతండ్రో కచ్చితంగా ఒక కథ చెబుతారు. ఆ దేశాల్లో పెద్దవాళ్లు కూడా ఎక్కడకెళ్లినా వెంట ఒక పుస్తకాన్ని తీసుకెళ్తారు. వేచి ఉండాల్సి వచ్చినపుడు, ప్రయాణాల్లోనూ వాటిని చదువుతూ గడుపుతారు. ప్రచురణలూ, వాటికి ప్రోత్సాహకాలూ బాగా ఉంటాయి. 
తెలుగులో ఎక్కువ కథలు రాసింది మీరే కదా. కానీ, నవలా రచయితగా వచ్చినంత గుర్తింపు కథకుడిగా రాకపోవడానికి కారణం?
1972- 80 మధ్యలోనే ఆరువందలకు పైగా కథలు రాశాను. ఏ పత్రికలో చూసినా తరుచుగా నా కథలు కనిపించేవి. అప్పట్లో నాలుగైదు నవలలు రాసినప్పటికీ ముందు కథా రచయితగానే పాఠకులు గుర్తుపెట్టుకున్నారు. ఇక 1980కి వచ్చేసరికి నాటి ఆంధ్రభూమి సంపాదకులు సికరాజు (సి.కనకాంబర రాజు) అక్షరాల చాటున ఉండే రచయితలని ప్రత్యక్షంగా పాఠకుల ముందుకు తీసుకురావడం ప్రారంభించారు. ఫొటోలు ప్రచురించడం, పాఠకులతో ముఖాముఖిలు, వేదికలు లాంటివి నిర్వహించడం ద్వారా రచయితలకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు. మిగిలిన పత్రికల్లో రచయిత ఫొటోనే ప్రచురించేవారు కాదు. ఏదో పోటీల్లో బహుమతి వచ్చిన సందర్భాల్లో వేసేవారంతే. అప్పట్లో నాకు, వీరంద్రనాథ్‌కు, సి.ఆనందరామం, చందు సోంబాబు, కొమ్మనాపల్లి గణపతిరావు, చల్లా సుబ్రహ్మణ్యం.. ఇలా ఆ రోజుల్లో రచయితలకు మంచి గుర్తింపు తీసుకొచ్చారు. నా ఫొటో ప్రచురించడానికి అంగీకరించను కాబట్టి నాది వేయలేదు.
తెలుగులో ఇప్పుడు నిఖార్సైన నవలలు రావడం లేదన్న విమర్శ ఉంది..?
దీనికి కారణం నవలా రచయితలకు వచ్చే పారితోషికం తక్కువ కావడం. ఒక నవల రాయాలంటే కనీసం రెండు నుంచి మూడు నెలలు పడుతుంది, పరిశోధనాత్మక నవలలైతే ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. ఇంతా రాస్తే రచయితకొచ్చేది మూడు వేలు, అయిదు వేలు, పదివేలు... అందుకే నవలా రచయితలు ఉన్నా ఎక్కువగా రాయట్లేదు, కొత్తవాళ్లు రావట్లేదు. ఇంకొకటి పరిపూర్ణమైన అధ్యయనం, వస్తువు మీద అవగాహనతో రాసే నైపుణ్యమున్న కొత్త రచయితలు కరవవడం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతో కష్టపడి రచయిత ఒక నవల రాస్తే దాన్ని ఎలాంటి అనుమతి లేకుండా ఎవరో ఒకరు సామాజిక మాధ్యమాల్లో పెట్టడం! చదవాలనే ఉత్సాహమున్న వారు కూడా పుస్తకం కొనకుండా ఉచితంగా వస్తుంది కదా అని అక్కడే చదవడం! కాపీరైట్‌ ఉంది కదా అని నాలాంటి వాళ్లు ఫిర్యాదు చేసినా ఆ తర్వాత దానికి అతీగతీ ఉండదు. 
పత్రికలకి ధారావాహికలు రాసేటపుడు మొత్తం నవలను ఒకేసారి రాసిచ్చే వారా?  
మొదట్లో అలాగే ఒకేసారి పంపేవాళ్లం. అయితే సికరాజు గారి సహకారంతో తొలిసారిగా నేను ఏ వారం నవలాభాగం ఆ వారం రాసి పంపడం మొదలుపెట్టాను. దాంతో ముందు భాగాన్ని మంచి ఉత్కంఠ కలిగిస్తూ ఆపడం ద్వారా వచ్చే వారం ఎప్పుడొస్తుందా అని పాఠకులు ఎదురుచూసేలా చేసే అవకాశం కలిగింది. ఉదాహరణకి ‘ఈ గంట గడిస్తే చాలు’ అనే నా ధారావాహికలో హీరో మెడకి ఉరితాడు బిగించి మంచు గడ్డ మీద నిలబెడతారు. మంచు నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది.. ఆ వారం అక్కడ ఆపుతాం. ఆ తరవాత ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ పాఠకుణ్ని వెంటాడుతుంది. వీరేంద్రనాథ్‌ కూడా అలాగే వారం వారం పంపేవారు. ఎందులో అయినా కొత్తదనం తేవడానికి ధైర్యం చేసినప్పుడే అది తర్వాతి తరాలకి మార్గదర్శకత్వమవుతుంది. ఇప్పుడు రామోజీరావు గారినే తీసుకోండి పత్రికారంగంలో అప్పటివరకు ఉన్న సంప్రదాయాలకు భిన్నంగా ‘ఈనాడు’లో కొత్త పంథా అవలంభించి ఓ నూతన ఒరవడి తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చే పత్రికలకు అదో మార్గదర్శకమైంది.  
మీరెన్నో కథలు, నవలలు రాశారు.. ఇంత విస్తృతంగా ఇతివృత్తాలను ఎలా దొరకబుచ్చుకున్నారు? 
దైనందిన జీవితంలో అనుభవాలు, చూసిన సంఘటనలు, చదివిన సమాచారాల నుంచి ఇతివృత్తాలను తీసుకుంటాను. ఉదాహరణకి అమెరికా పేపర్లో వచ్చిన ఒక వార్త చదివాను, అది అక్కడ నిజంగా జరిగింది. ఒక ఆసుపత్రిలో పుట్టిన ఇద్దరు పిల్లలు నర్సు పొరపాటు కారణంగా తారుమారు అవుతారు. ఆ సంగతి ఏడేళ్ల తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఈ వార్త ఆధారంగా నేను ‘మా బాబు’ అనే నవల రాశాను. హైదరాబాద్‌ వచ్చిన మొదట్లో ఆఫీసుకెళ్లడానికి రోజూ వెళ్లే బస్టాప్‌కి ఎదురుగా ఒక ప్రహరీ గోడ మీంచి అయిదారుగురు అమ్మయిలు రోడ్డు చూస్తూ కనిపించేవారు.. ఆ గోడ వెనక ఉన్న పెద్ద భవనంలోని వివిధ గదుల్లో అద్దెకున్న వారు కావచ్చు. రోజూ వారిని గమనించే బ్రహ్మచారినైన నాకు ఆ లోగిలిలో ఒక గది అద్దెకు దొరికితే బాగుండు అనే ఆలోచన కలిగింది. దానికి ప్రతిరూపమే నా ‘అద్దెకిచ్చిన హృదయాలు’ నవలిక. అలాగే ఓ జోక్‌ చదివాను. బ్యాంకులో దొంగలు పడి మొత్తం నగదంతా దోచుకెళ్లిపోయాక ఆ క్యాషియర్‌ ‘హమ్మయ్య నేను కొట్టేసిన పది లక్షలు కూడా ఈ లెక్కల్లో కలిసిపోతాయి’ అనుకుంటుంది. దీన్నుంచి నాలుగువందల పేజీల ‘హుష్‌.. గప్‌చిప్‌’ నవల రాశాను. అలాగే వెంగళప్ప జోకులు, భార్యాభర్తల జోకులు.. రకరకాల చతుర్లను కలిపి ‘మిస్టర్‌ మిరియం’ నవల రాశాను. ‘చతుర’లో వచ్చింది. అది విడివిడిగా జోకుల్లానే ఉంటుంది. అంతర్లీనంగా ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన కథ నడుస్తుంది. ఇదొక ప్రయోగం.  
‘మీ నత్తలొస్తున్నాయి జాగ్రత్త’ నవల బాగా పాఠకాదరణ పొందింది. ఆ ఇతివృత్తం ఎలా తట్టింది?  
హైదరాబాదు అబిడ్స్‌లోని ఓ పాతపుస్తకాల దుకాణంలో కోరొనెట్‌ అనే పాత ఆంగ్ల పత్రిక చూస్తుంటే ఒక వ్యాసం కనిపించింది. అమెరికాలోని హవాయి దీవులకి ఆఫ్రికా నుంచి కొన్ని రాక్షస జాతి నత్తలను తెచ్చారెవరో. అక్కడ వాటి సంతతి అనూహ్యంగా పెరిగి ఆ దీవులని అవి ఎలా చిన్నాభిన్నం చేశాయన్నది ఆ వ్యాసంలో రాశారు. ఇదే కనుక భారత దేశంలో సంభవిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో రాసిందే ‘నత్తలొస్తున్నాయి జాగ్రత్త’.    
మీ నవలలు సినిమాలుగా వచ్చాయి కదా.. 
గోల్‌మాల్‌ గోవిందం, చంటబ్బాయ్, తేనెటీగ, రెండురెళ్లు ఆరు, డబ్బెవరికి చేదు, నీకు నాకు పెళ్లంట, ష్‌..గప్‌చుప్, శ్రీవారి శోభనం, విచిత్రం.. ఇలా మొత్తం 22 నవలలు సినిమాలుగా వచ్చాయి. తొలిసారి ‘రేపటి కొడుకు’ నవల కన్నడంలో సినిమాగా వచ్చింది. జంధ్యాల దర్శకత్వంలో ఎక్కువగా వచ్చాయి. 
నవలను సినిమాగా తీసినప్పుడు దానిలోని ఆత్మ పోతుందంటారు..?
నాకే చాలాసార్లు అనిపించింది. జ్యోతిలక్ష్మి సినిమాగా వచ్చిన నా నవల ‘మిసెస్‌ పరాంకుశం’ ఆత్మ మొత్తం విస్మృతికి గురైంది. అయితే కథను ఛార్మీ పాత్రకనుగుణంగా మార్చిన విధానం బాగుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఎప్పుడో పదో తరగతిలో ఉన్నపుడు ‘మిసెస్‌ పరాంకుశం’ నవల చదివారట. ఏదో సందర్భంలో అయన మొదటిసారి నన్ను కలిసినపుడు ఆ కథ ఎవరికైనా ఇచ్చే ముందు నాకు చెప్పండి సర్‌ అన్నారు.. ఆ తర్వాత రెండు మూడు సార్లు ఫోన్‌ చేసి ఇంకా ఎవరికీ ఇవ్వలేదు కదా అని అడిగారు.. సినిమా తీసే సందర్భం కుదరగానే దాన్ని తెరకెక్కించారు.  
ఇతర దక్షిణాది భాషల్లో వచ్చినంతగా తెలుగులో ఇప్పుడు నవలా చిత్రాలు రావట్లేదెందుకు?
ఇప్పటి దర్శక నిర్మాతలు నవలలు చదవరు.. ఒకవేళ ఏదైనా మంచి నవల తారసపడినా సాహసం చేయడానికి ఇష్టపడరు. ఒక నవల తెరమీద ఎలా ఉంటుంది అని చూసే దార్శనికత లేదు. ఇతర భాషల్లో ఏదైనా నవల సినిమాగా వచ్చి విజయం సాధిస్తే అప్పుడు దాన్ని తెలుగులో తీస్తారు. ఒకప్పుడు క్రాంతికుమార్, మిద్దే రామారావు, కె.ఎస్‌.రామారావు లాంటి వాళ్లు మంచి అభిరుచితో నవలలను సమర్ధవంతంగా సినిమాలుగా రూపొందించి చక్కటి విజయాలను అందుకున్నారు.
కథ, నవల. .ఈ రెండింటిలో ఏది ఇష్టం? ఏది రాయడం కష్టం?
నాకు రెండూ ఇష్టమే. ఇక రాయడమైతే నవల కంటే చిన్న కథ రాయడం కష్టం. ‘సొంతిల్లు’ అని ఒక కథ రాశాను. ఒక ఉద్యోగికి సొంత ఇల్లు ఓ కల. ఎన్నో కష్టాలు పడి చివరికి ఎలాగో ఒక ఇల్లు కట్టుకుంటాడు. అంతలోనే ఆకస్మికంగా మరణిస్తాడు. అతని శవాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి ఇష్టపడక రోడ్డు మీదే ఉంచుతారు భార్యాపిల్లలు. అతని ఆశ ఆశగానే మిగిలిపోతుంది. విషయాన్ని కథగా మలచడంలోనే రచయిత ప్రతిభ కనబడుతుంది.  
రాబోయే తరాలకి భాషా సాహిత్యాల మీద ఆసక్తి పెంచాలంటే ఏం చేయాలి? 
ఇంటిపన్ను రసీదు చూస్తే ‘లైబ్రరీ సెస్‌’ అని కొంత మొత్తాన్ని చూపిస్తారు. దీన్ని ఉచిత పథకాలకు బదిలీ చేయకుండా ప్రభుత్వాలు గ్రంథాలయాలు అభివృద్ధి చేసి ప్రజల్లో చదివే అలవాటును పెంచాలి. గ్రంథాలయాలకి గత ఆరేళ్ల నుంచీ తెలుగులో పుస్తకమే కొనలేదు. దీని గురించి నా ‘నవల వెనుక కథ’ పుస్తకంలో వివరంగా రాశాను. అలాగే, వచ్చే విద్యా సంవత్సరం నుంచే చిన్న తరగతుల నుంచీ గ్రంథాలయ పిరియడ్‌ పెట్టి చదివించాలి. ముఖ్యంగా తెలుగు పుస్తకాలు చదివించాలి. పిల్లలకి పడుకోబోయేముందు తప్పనిసరిగా పెద్దవాళ్లు ఒక కథ చదివి వినిపించాలి. ఇక పత్రికల బాధ్యత విషయానికొస్తే కొత్త రచనలను ప్రోత్సహించడం, వివిధ పత్రికలకు సమీక్షల కోసం పంపే పుస్తకాలను అవగాహన ఉన్నవారితో సమీక్ష చేయించడం, పుస్తకాలు దొరికే చోటును స్పష్టంగా పేర్కొనడం చేయాలి. టీవీలు కూడా కొత్త రచయితలను పరిచయం చేయడం, పుస్తకాల సమీక్ష లేదా చర్చ లాంటివి పెడితే బాగుంటుంది. 
రచయితగా ఆధ్యాత్మికం వైపు ఎలా వెళ్లారు?
నాకై నేను వెళ్లలేదండి.. 1999 ఆగస్టులో కర్నాటకలోని కొల్లురు మూకాంబిక ఆలయానికి వెళ్లాను. అక్కడేం జరిగిందో తెలియదు కానీ, లోపలికెళ్లిన మనిషి వేరు.. బయటికొచ్చిన మనిషి వేరు. అప్పట్నుంచి నాలోని చెడు అలవాట్లు దూరమయ్యాయి. రచనా వ్యాసంగం ఆధ్యాత్మికం వైపు మళ్లింది. అంటే మిగతావీ వదిలెయ్యలేెదు. నా మొదటి ఆధ్యాత్మిక నవల ‘జయం’. ఆ విభాగంలో ఇది అత్యధిక విక్రయాలు సాధించింది.  ఇప్పటికీ ఆధ్యాత్మిక నవలల్లో అమ్మకాల పరంగా దీనిదే మొదటిస్థానం. అలాగే ‘కర్మ-జన్మ’ అని రాశాను. దీనికోసం పన్నెండేళ్ల పాటు రామాయణం, భారతం, భాగవతం తదితరాల గ్రంథాలను కూలంకషంగా చదివి అందులో కర్మకి సంబంధించిన శ్లోకాలన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకున్నాను. అవన్నీ క్రోడీకరించి కర్మ సిద్ధాంతం అందరికీ అర్ధమయ్యేలా రాసిన పుస్తకమది. ఇదీ బాగా పాఠకాదరణ పొందింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి