తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

మహిళా స్పృహ సాధించాం!

  • 1672 Views
  • 1Likes
  • Like
  • Article Share

సమాజంలో అన్ని రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన భాగస్వామ్యం ఉండాలి. స్త్రీల వ్యక్తిత్వం, జీవితం మరొకరి చెప్పుచేతల్లో ఉండే పరిస్థితి మారాలి. తల్లిగా, భార్యగా మాత్రమే ముద్ర వేయించుకునే స్థితినుంచి మనిషిగా గుర్తింపు పొందే దశకు స్త్రీలు చేరుకోవాలి... ఇదే స్త్రీవాదుల స్వప్నం. దానికోసం దశాబ్దాలుగా వాళ్లు పోరాడుతున్నారు. తెలుగునాట ఆ పోరాటం... ఓల్గా సాహితీ ప్రస్థానం సమాంతర ప్రవాహాలు. స్త్రీవాద రచయిత్రిగా, ఉద్యమకారిణిగా ఆమె అలుపెరగని కృషి చేస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆమెతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి...

తె.వె.: అకాడమీ పురస్కారం పొందిన మహిళలు అతి కొద్దిమందే. ఇప్పుడు మీరు దాన్ని సాధించారు. ఎలా అనిపిస్తోంది?
ఓల్గా:
‘విముక్త’ కథలకు పురస్కారం రావడం సంతోషంగా ఉంది. అయితే సాహిత్యంలో స్త్రీలకు ఇంకా తగిన గుర్తింపు రావట్లేదు. తప్పదు అనుకున్నప్పుడే రచయిత్రులకు పురస్కారాలు ఇస్తారు. ఎందుకంటే సాహిత్య పీఠాలన్నీ పురుషులే ఆక్రమించుకుని ఉన్నారు. సాహిత్య అకాడమీ అధ్యక్షస్థానంలో ఇంతవరకూ ఒక్క స్త్రీ లేదు. ఎప్పుడూ పురుషులే. వాళ్లందరూ మంచివాళ్లే. అందులో నాకెలాంటి సందేహం లేదు. కానీ, ఒక్క స్త్రీ కూడా ఈ 60 ఏళ్లలో అధ్యక్షురాలు కాలేకపోవడమేంటి? మహాశ్వేతాదేవి, ఇందిరా గోస్వామి లాంటి గొప్పవాళ్లు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఉన్నారు కదా! సాహిత్య రంగంలోనూ పురుషాధిపత్యం ఉంది. అయితే, మేమందరం గొంతులు విప్పి అరవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి కొంచెం కొంచెం మార్పు వస్తోంది. అది వేగంగా జరగాలి.
స్త్రీవాదం వల్ల సమాజం, సాహిత్యంలో వచ్చిన మార్పులేంటి?
కొన్ని విషయాల్లో మంచి మార్పులు వచ్చాయి. అంతకుముందు సాహిత్యంలో స్త్రీలని చిత్రించే ధోరణికి, ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. స్త్రీలపట్ల గౌరవంతో రాసే ధోరణి స్త్రీవాద సాహిత్యం వల్లే వచ్చింది. స్త్రీవాదులు తమ రచనలు, ఉద్యమాల ద్వారా దేశంలో జెండర్‌ స్పృహను పెంచారు. ఇవాళ అది అన్ని రంగాల్లోనూ పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల్లో. జెండర్‌ అన్నదాన్ని స్త్రీల దృష్టి నుంచి చూడాలి అనే స్పృహని ఈ 30 ఏళ్లలో మేం సాధించగలిగాం. స్త్రీవాదిగా దీనికి గర్విస్తూనే ఉంటాను. అయితే సాధించలేనివీ ఉన్నాయి. స్త్రీల మీద హింసను ఆపలేక పోయాం. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ అంతుపట్టడం లేదు.
స్త్రీల మీద హింస పెరగడానికి గత 20 ఏళ్లలో మన విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులు ఎంతవరకూ కారణం?
విద్యావిధానం ఒక్కటే కాదు. పేదరికం, నిరుద్యోగం, దారీతెన్ను లేని వర్గాలు కొన్ని ఉండటం, సామాజిక బాధ్యత కొరవడటం... ఇవన్నీ కారణాలే. ప్రస్తుతం స్త్రీలు అన్ని రంగాల్లో బాగా ముందుకు వెళ్తున్నారు. ఫలితంగా ఇళ్లల్లో మగవాళ్లు ప్రశ్నలు వేస్తే ధైర్యంగా సమాధానాలు చెప్పడం ఇవన్నీ పెరిగాయి. ఇంతవరకూ పురుషులు ఏం చెబితే అది జరిగేది. స్త్రీలు బయటికి వచ్చినా వారి వెనుక ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ ధోరణి మారేసరికి వాళ్లు భరించడం లేదు. స్త్రీల మీద చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపం ఇలా హింస రూపంలో వ్యక్తమవుతోంది. అలాగే నిరుద్యోగం పెరిగినప్పుడు కూడా ‘మాకు ఉద్యోగాలు లేవు. ఈ... ఆడవాళ్లకు ఉద్యోగాలేంటి’ అనే అవాంఛనీయ ధోరణి ప్రబలుతోంది. ఆడవాళ్ల చైతన్యం ఎంత పెరుగుతోందో వాళ్ల మీద వ్యతిరేకత కూడా పెరుగుతోంది. ఇదో సంధి దశ.
పిల్లల్లో కూడా హింసాధోరణి పెరుగుతోంది కదా?
సినిమాలు, టీవీల్లో ఎక్కడ చూసినా స్త్రీని ఒక వస్తువులా చూపిస్తున్నారు. ఆడవాళ్ల మీద హింసను అతిగా చూపించే సినిమాలు చాలా వస్తున్నాయి. థియేటర్‌లోగానీ, టీవీలోగానీ ఓ సినిమా వచ్చిందంటే... ఒకే సమయంలో కొన్ని కోట్ల మనసులు దానిమీద లగ్నమవుతూ ఉంటాయి. అప్పుడు వాళ్లలో కలిగే గాఢమైన భావోద్వేగాలు తప్పకుండా వాళ్ల మనసులను ప్రభావితం చేస్తాయి. అదో పెద్ద కారణం. అలాగే సాంకేతికత పెరిగి ఒక వర్గం వారికి స్మార్ట్‌ఫోన్లు, అంతర్జాలం ఇవన్నీ అందుబాటులో ఉండటం... వాటి ప్రభావానికి గురవడం కూడా కారణమే. తర్వాత మన విద్యావిధానంలో సరైన లైంగిక విద్య, జెండర్‌ స్పృహ లేకపోవడం! వీటి గురించి తల్లిదండ్రులు, గురువులు నేర్పాలి. ఆడపిల్లలు, మగపిల్లలు ఒకచోట చేరినప్పుడు ఒకరి గురించి మరొకరికి ఎలాంటి భావన ఉండాలో నేర్పాలి. వాళ్ల మధ్య ఉండాల్సిన సంబంధాల గురించి సరైన అవగాహన కల్పించడమే లైంగిక విద్య. అలాగే పాఠాల్లో కూడా స్త్రీల మీద గౌరవం కల్పించేవి ఇవ్వలేకపోతున్నారు. అలాంటివి ఒకటి రెండు పాఠాలు ఏమైనా ఉంటాయేమో! అవి కూడా ఎప్పటినుంచో వస్తున్న రుద్రమదేవి, ఝాన్సీలక్ష్మిలే! ఈ ఆధునికయుగంలో విజయాలు సాధించిన శాస్త్రవేత్తలు, ఆయా రంగాల్లో ప్రతిభావంతులు ఎవరైనా కావచ్చు, వాళ్ల గురించి పాఠాలు ఉండట్లేదు. సిలబస్‌లోనూ జెండర్‌ కోణాన్ని చొప్పించాలి. ఇప్పటి చదువుల్లో భాషకు ప్రాధాన్యం ఉండట్లేదు. చదువంటే లెక్కలు, సైన్స్‌... ఏదో బట్టీ వేయడం అయిపోతోంది. దానివల్ల విలువల గురించి స్పృహ రావట్లేదు. పరిస్థితి మారాలంటే మౌలికమైన మార్పులు చాలా రావాలి. దీనికోసం స్త్రీవాదులుగా మేం చాలా అడుగుతున్నాం. మేం అడిగిన తర్వాతే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. కానీ అవి చాలవు.
స్త్రీవాద రచనలు సమాజంలోని అన్ని వర్గాల మహిళలకూ చేరుతున్నాయా?
ఎప్పుడైనా లిఖిత సాహిత్యానికి పరిమితులు ఉంటాయి. అది చదువుకున్న వర్గాలకే చేరుతుంది. మనదేశంలో చదువురాని వారు చాలామంది ఉన్నారు. స్త్రీలలో ఇంకా ఎక్కువ. ఇక చదువుకున్న వాళ్లల్లో ఎంతమంది సాహిత్యం చదువుతారు? ఒకప్పుడు చాలా ఎక్కువగా చదివేవాళ్లు. అప్పుడు పత్రికలు ఎక్కువగా ఉండేవి. అందువల్ల దిగువ మధ్యతరగతి స్త్రీలూ, కొంత అక్షరాస్యులు కూడా... మా అమ్మ లాంటి వాళ్లందరూ పత్రికలు చదివేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. గృహిణులకేమో టీవీతో సరిపోతోంది. చదువుకున్న పిల్లలేమో ఇంగ్లీషు తప్ప తెలుగు చదవరు. వాళ్లకు అసలు తెలుగు చదవడం రాదు. ఇళ్లలో, బళ్లలో తెలుగు మాట్లాడనివ్వరు. చదవనివ్వరు. లిఖిత సాహిత్యానికి ఇవన్నీ పరిమితులే. అందుకే నేను రకరకాల మార్గాల్లో ప్రయత్నించాను. నృత్యరూపకాలు రాశాను. వాటిద్వారా కొన్ని వర్గాల్లోకి తీసుకెళ్లాం. వీధి నాటకాల ద్వారా గ్రామీణుల దగ్గరకి వెళ్లగలిగాం. మా సంస్థ ‘అస్మిత’ నాకు ఈ విషయంలో ఉపయోగపడింది. పల్లెటూళ్లలో నిర్వహించిన జాతాల్లో అమ్మాయిలతో ఈ నాటకాలు వేయించి, పాటలు పాడించి అక్కడివాళ్లలో అవగాహన కల్పించాం. ఇలా రకరకాల రూపాల ద్వారా అన్ని వర్గాల స్త్రీలనూ చేరాలి. పాట, నాటకం అనేవి చాలా ఉపయోగపడతాయి. కాకపోతే నాటకాలకు ఇప్పుడు గుర్తింపు లభించడం లేదు. ఇప్పటికీ జనంలోకి దూసుకెళ్లే శక్తి ఒక్క పాటకే ఉంది. అందుకే ఆయా సమస్యలపై పాటలు రాసి, రికార్డు చేయించి, మావాళ్ల ద్వారా క్షేత్రస్థాయికి పంపుతూ ఉంటాను.
అస్తిత్వవాద రచనల్లో ఆయా వర్గాల మహిళల సమస్యల చిత్రణ...?
మొదట్లో దళిత కవితా సంకలనాలు వచ్చినప్పుడు స్త్రీల గొంతు అంత బలంగా లేదు. ఇప్పుడు చల్లపల్లి స్వరూపరాణి, జూపాక సుభద్ర, గోగు శ్యామల, జాజుల గౌరి దళిత సమస్యల్ని బాగా చెబుతున్నారు. ‘నల్లపొద్దు’ సంకలనం వచ్చిన తర్వాత దళిత స్త్రీ స్వరాలను వినిపించాలి అనే ఆకాంక్ష బలీయమైంది. మైనార్టీల్లో షాజహానా గొంతు బలంగా వినపడుతోంది. అయితే, ఈ వర్గాల స్త్రీల గురించి ఇంకా రావాల్సి ఉంది. స్థూలంగా చూస్తే వీళ్లందరూ పితృస్వామ్యం గురించి, అగ్రవర్ణాల ఆధిపత్యం గురించి బాగా మాట్లాడుతున్నారు. అయితే దళితుల లోపలా పితృస్వామ్యం ఉంటుంది. దాన్ని గురించి ఇంకా మాట్లాడాల్సి ఉంది. దానికీ సమయం వస్తుంది. తప్పకుండా మాట్లాడతారు.
స్త్రీల సమస్యలకు సంబంధించి ఇంకా రాయాల్సినవి ఉన్నాయా?
స్త్రీల మీద శారీరకంగా, మానసికంగా ఎన్నో అణచివేతలు. వాళ్ల సంతానోత్పత్తి శక్తి, లైంగికత్వం మీద అణచివేత, ఇంటి చాకిరీ ఇలా ఒకటి కాదు... కాబట్టి రాసింది చాలా తక్కువ. వాటన్నింటి గురించి రాయాలంటే ఒకరిద్దరు చాలరు. చాలామంది రాయాలి. అప్పుడుగానీ అన్నీ బయటికి రావు. అందులోనూ పితృస్వామ్యం రూపు మార్చుకుంటోంది. యాభై ఏళ్ల కిందటి అణచివేత వేరు, ఇప్పుడున్న అణచివేత వేరు. ప్రపంచీకరణ తర్వాత మనం అర్థం చేసుకోలేనంతగా అణచివేత సాగుతోంది. ప్రపంచీకరణ స్త్రీల వెన్నెముకలను విరిచేస్తోంది. ఒకవైపు గ్రామాల్లో కుటుంబ భారం అంతా స్త్రీలపై పడుతోంది. మగవాళ్లు వలసలైనా పోతున్నారు లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బతికి ఉన్న మగవాళ్లలో చాలామంది తాగుడుకు బానిసలవుతున్నారు. ఇంట్లో డబ్బులివ్వరు. దాంతో పిల్లలను, పెద్దవాళ్లను పోషించుకునే బాధ్యత స్త్రీల మీద పడుతోంది. గ్రామీణ స్త్రీల కష్టాలను వింటూంటే మనం ఏం చేయాలి? ఎక్కడ మొదలుపెట్టాలి? దీనికి అంతం ఎక్కడ? అనే ప్రశ్నలు వస్తుంటాయి.
ప్రస్తుతం తెలుగు పరిస్థితి ఎలా ఉంది?
భాషను ఇంత నిర్లక్ష్యం చేసుకుంటున్నాం... జాతి ఏమైపోతుందో అనిపిస్తుంది. మనం మన భాషలో మాట్లాడుకోవట్లేదు. పిల్లలు మాట్లాడితే పెద్దలు వూరుకోవడం లేదు. జాతి ఆత్మ భాషలోని జాతీయాలు, సామెతలు, నుడికారాలు వీటన్నింటిలో ఉంటుంది. ఆ ఆత్మ పోతోంది. మనం పరాయీకరణ చెందుతున్నాం. జపాన్‌ వాళ్లు వాళ్ల భాషలోనే చాలా ముందుకెళ్లారు గదా! అది పట్టించుకోరు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం పెద్ద మోజు అయిపోయింది. దానికి కారణం ప్రభుత్వమే. ఇంటర్లో సంస్కృతం, ఫ్రెంచి... తీసుకోవచ్చు! మరి తెలుగు? వెంటనే వాటిని తీసేసి తెలుగు తప్పనిసరిగా చదవాలి, ఇన్ని మార్కులు రావాలి అంటే అప్పుడు తెలుగు కొంతవరకు బతుకుతుంది. అలాగే పదో తరగతి చదివిన పిల్లల్లో కూడా ఎంతమంది తెలుగులో చక్కగా రాయగలరు? అసలు చెప్పలేం. తెలుగు పరీక్షల్లో పిల్లలు ఏం రాశారో చెబుతూ కొంతమంది ఖమ్మం అధ్యాపకులు ఓ పుస్తకం వేశారు. ‘వాల్మీకి ఆశ్రమంలో సీత జీవితాన్ని వర్ణించండి?’ అన్న ప్రశ్నకు ఓ అబ్బాయి ‘రాముడు పచ్చితాగుబోతు. సీతను బాగా కొడుతుంటే, సీత ఇంట్లో ఉండలేక ఆశ్రమానికి వెళ్లిపోయింది. అక్కడ ఓపెన్‌ యూనివర్సిటీలో చదువుకొని, ఉద్యోగం సంపాదించి తన ఇద్దరు పిల్లల్ని పోషించుకుంది’! అని రాశాడు. వాడికి తెలివి ఉంది. కానీ విషయం తెలియదు. నేటితరం పిల్లలకు తెలివితేటలు బాగున్నాయి. కానీ వాటిని సరైన మార్గంలో పెట్టే విద్యావిధానం లేదు. పోటీ ప్రపంచంలో ఎదగడానికి ఆంగ్లం కావాలి. కానీ, తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. బళ్లొ పరిస్థితి మారితే ఇంట్లో కూడా మార్పు వస్తుంది.
తెలుగులోకి వస్తున్న ఆంగ్ల పదాలను ఎలా తగ్గించాలి?
దానికి నిరంతర ప్రయత్నం అవసరం. మనవైన పదాల్ని అలవాటు చేయాలి. కొన్ని పదాలు తప్పవు. అవసరమైనప్పుడు ఏ భాషా పదాలనైనా స్వీకరించాలి. అది మంచిదే. కానీ ఒక్కోసారి ఉన్న పదాలను మర్చిపోయి, అనవసరంగా అన్యభాషా పదాలనూ వాడటం వల్ల సంకరభాషగా మారే ప్రమాదం ఉంది. అలా జరగకూడదంటే కొంత స్వచ్ఛమైన తెలుగుని, కాస్త తక్కువ విదేశీ పదాలున్న తెలుగుని పాఠశాలల్లో నేర్పాలి. టీవీల్లో యాంకర్లు, వాళ్ల మాటలు, ఉచ్చారణ ధోరణి... అంతా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది.
నేటితరానికి సాహిత్యాన్ని దగ్గర చేయాలంటే...?
ఇప్పుడు సాహిత్యానికి ఉన్న స్థలం చాలా తగ్గిపోయింది. నేనో నవల రాస్తున్నాను. దాన్ని ఏ పత్రికకు పంపాలో తెలియదు. ఇదివరకు వార పత్రికల్లో నాలుగైదు సీరియళ్లు మంచివి వచ్చేవి. అందరం చదువుకునేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్న పత్రికలకూ ఏవో పరిమితులు! అంతర్జాల పత్రికల్లో అవకాశం ఉన్నా వాటిని ఎంతమంది చదువుతారు? కాబట్టి సాహిత్యానికి ఆ ‘చోటు’ను తిరిగి తేవాలి. శతాబ్దాల తరబడి విద్యకి దూరంగా ఉన్న వర్గాల్లోంచి మొదటితరం వాళ్లు ఇప్పుడు చదువుకుంటున్నారు. కానీ వాళ్లకి ఇప్పుడు సరైన విద్యా సౌకర్యాలు లేవు. సరైన గ్రంథాలయాల్లేవు. ఉన్నత వర్గాలు చదువుకునేటప్పుడు అన్నీ ఉన్నాయి. ఇన్ని ఆటంకాల మధ్య సాహిత్యం చేరడమంటే కష్టమే. దీనికోసం మళ్లీ గ్రంథాలయో ద్యమం లాంటిది ప్రారంభం కావాలి. ఆ ఉద్యమాన్ని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లాలి.
వర్ధమాన రచయితలకు మీ సూచనలు...
రచయితలు సమాజాన్ని లోతుగా పరిశీలించాలి. పుస్తకాలు ఎక్కువగా చదివితేనే మనం రాసే దాంట్లో కొంచెం సరకు, బలం ఉంటుంది. లేకపోతే మంచి రచయితలు కాలేరు. ఒక కథ రాయాలంటే కొన్ని వందల కథలు చదవాలి. చదవడం వల్ల కథ, శిల్పం, వస్తు నిర్వహణ ఎలా ఉండాలి.. వీటన్నింటి మీదా మనకు తెలియకుండానే ఒక అవగాహన ఏర్పడుతుంది. అప్పుడే రాసే కథలు రక్తికడతాయి. మంచి చదువరులే మంచి రచయితలు కాగలరు. నేను చదువుతాను, అందరూ చదవాలని కోరుకుంటాను.


స్త్రీ సాధికారతే ఆమె లక్ష్యం:
పోపూరి లలిత కుమారి... మహిళా స్వేచ్ఛ, సాధికారత కోసం కలం, గళమెత్తి ఓల్గాగా ప్రసిద్ధి చెందిన రచయిత్రి. 1950లో గుంటూరులో జన్మించిన ఆమె, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు పూర్తిచేశారు. కొన్నేళ్లపాటు అధ్యాపక వృత్తిలో కొనసాగారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థలో స్క్రిప్టు రచయితగా పనిచేశారు. స్వతహాగా మార్క్సిస్టు అయిన ఓల్గా మీద చలం, కొడవటిగంటి కుటుంబరావుల ప్రభావం ఉంది. స్త్రీ స్వేచ్ఛను, సమానత్వాన్ని కోరుకున్న ఆమె మార్క్సిస్టు పార్టీలో ఇమడక అందులోంచి బయటికి వచ్చేశారు. తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ తన తొలి నవల ‘స్వేచ్ఛ’ రాశారు. ఇది తెలుగునాట స్త్రీవాదానికి నాంది. ఇదే కాకుండా సహజ, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, గులాబీలు, ఆకాశంలో సగం నవలలు; రాజకీయ కథలు, ప్రయోగం, విముక్త కథా సంకలనాలు, మాకు గోడలు లేవు (స్త్రీవాదం మీద పరిచయం), పలికించకు మౌన మృదంగాలను (సాహితీ వ్యాసాలు) తదితర పుస్తకాలు, స్త్రీవాద కవితలు ఆమె చేతినుంచి జాలువారాయి. వసంత కన్నాబిరాన్‌, కల్పన కన్నాబిరాన్‌లతో కలిసి ప్రసిద్ధ తెలుగు మహిళల సంక్షిప్త జీవిత పరిచయంతో ‘మహిళావరణం’ పేరుతో ప్రత్యేక పుస్తకం వేశారు. ఆమె రచనల్లో చాలావరకు ఆంగ్లం, ఇతర భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. ప్రస్తుతం అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. ఓల్గా సాహితీ సేవకు గుర్తింపుగా గతంలో తెలుగు విశ్వవిద్యాలయం ‘ఉత్తమ రచయిత్రి’, లోక్‌నాయక్‌ పురస్కారాలు లభించాయి.


*  *  *

 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి