తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

రాసేకొద్దీ అర్థం చేసుకున్నా!

  • 121 Views
  • 3Likes
  • Like
  • Article Share

    సతీష్‌ కామాద్రి

  • సిద్ధిపేట
  • 8074966329

కథానాయకులను హుషారెత్తించే పాటలతో పరిచయం చేసినా.. ‘ఆశాపాశం..’ అంటూ ఆలోచనను రగిలించే గీతాలను గుండెల్లో మోగించినా.. ‘డోలే డోలే..’ అంటూ.. సొగసైన పదాలతో సరాగాలు అల్లినా.. ఆయనకే చెల్లింది! తెలుగు సినీ పాటకు సాహిత్యాన్ని, బాణీలను అందించడమే కాకుండా ప్రతినాయకులకు గాత్రాన్ని అరువిస్తూ దూసుకుపోతున్న బహుముఖ ప్రతిభాకెరటం విశ్వ.  ‘తెలుగువెలుగు’తో ఆయన తన ప్రయాణ విశేషాలను ఇలా పంచుకున్నారు..
పాటలు రాయాలన్న ఆసక్తి ఎలా కలిగింది?
నా కుటుంబం వల్లే పాటల మీద ఆసక్తి పెరిగింది. అమ్మకు సంగీతంలో, నాన్నకు సాహిత్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. అలా బాల్యం నుంచే తెలుగు సాహిత్యం, సంగీతం, లలిత కళల మీద ఇష్టం ఏర్పడింది.
మీ సొంతూరు కూచిపూడి ప్రసిద్ధ కళా కేంద్రం. దాంతో మీ జ్ఞాపకాలు?
మా నాన్నగారిది కూచిపూడి అయినా ఉద్యోగరీత్య హైదరాబాద్‌కు వచ్చేశారు. నేను పుట్టిపెరిగిందంతా ఇక్కడే. కుటుంబంతో కలిసి కూచిపూడిలో బంధువులను పలకరించి వస్తుంటాం.  
ఇంజినీరింగ్‌ చదివిన మీరు భాష మీద ఇంత పట్టు ఎలా సాధించారు?
ఇంజనీరింగ్‌ అనే కాదు.. నా చదువంతా ఆంగ్ల మాధ్యమంలోనే సాగింది. మా నాన్న గారికి సాహిత్య అభిరుచి ఎక్కువ. ఆయన భాగవత కథలన్నీ చదివి వినిపించేవారు. మహామహుల పుస్తకాలు, ప్రబంధ గ్రంథాలను ఆయన నాకు చిన్నతనంలోనే పరిచయం చేశారు. ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండటం వల్ల మాతృభాష మీద మమకారం పెరిగింది.
బాగా ప్రభావితం చేసిన పుస్తకం? నచ్చిన రచయిత?
విశ్వనాథ వేయి పడగలు, సినారె సంకలనాలు, పానుగంటి, ముళ్లపూడి రచనలు, పోతన భాగవతం, శ్రీనాథుడి శృంగార నైషధం, భీమఖండం, కృష్ణరాయల ఆముక్త మాల్యద ఇవన్నీ నన్ను బాగా ప్రభావితం చేశాయి. పరవస్తు చిన్నయసూరి రచనా శైలీ చాలా ఇష్టం. సినీ గీత రచయితల్లోనైతే అందరూ గురువులే.. నన్ను ప్రేరేపించిన ప్రతి ఒక్కరికీ నా నమస్సులు.  
పాఠశాల రోజుల్లోనే నాటకాల్లో నటించారు కదా.. ఆ అనుభవాలు..
అయిదేళ్ల వయసులో మేముండే బీహెచ్‌ఈఎల్‌లోని కనకదుర్గ సేవా సమితి కళాక్షేత్రంలో పాటలు పాడేవాణ్ని. యద్ధనపూడి సులోచనారాణి సోదరుడు నెమలికంటి రాధాకృష్ణమూర్తి ఓరోజు నేను పాడుతుంటే చూశారు. పాడే విధానం నచ్చి రాళ్లపల్లి గారు రాసిన ‘ముగింపు లేని కథ’ నాటకంలో హాస్య పాత్ర వేసే అవకాశం ఇచ్చారు. దానికి ఉత్తమ బాలనటుడు పురస్కారాన్ని జంధ్యాల చేతుల మీదుగా అందుకున్నాను. అప్పటి నుంచి పదేళ్ల వయసు వచ్చే వరకు నాటకాల్లో పాల్గొన్నాను.
తొలి పాట అవకాశం ఎలా వచ్చింది?
మణిశర్మ దగ్గర శివరామ్‌ అని కీబోర్డు ప్లేయర్‌ ఉండేవారు. ఆయన వల్లే మణిగారితో పరిచయం ఏర్పడింది. నాతో ఆయన ఇంగ్లీషు పాటలు, పద్యాలు పాడించుకున్నారు. అప్పుడే నాకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. నేను చేసిన ‘మస్తీ’ ఆల్బమ్‌ పోయిందని తెలుసుకున్న ఆయన తన స్టూడియోలో ఆరు పాటలు రికార్డు చేసుకునే అవకాశం ఇచ్చారు. అక్కడే నా ప్రతిభను దగ్గరినుంచి గమనించారు. అలా చిత్రసీమలో నా తొలి అడుగుపడింది.
సంగీత దర్శకుడిగా అనుభవాలు?
దక్కన్‌ సినిమా ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాను. ‘నేను నా రాక్షసి’లో పడితినమ్మో పాటను ఒకే రోజులో బాణీ కట్టి, పాట రాసి, పాడి రాత్రికల్లా పూర్తిచేశా. దానికి మంచి స్పందన లభించింది. మంగళ, పోలీస్‌ పోలీస్‌ సినిమాలకు బాణీలందించాను.
తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన ప్రక్రియ?  
నాకు పాట అంటేనే ఇష్టం. గీత రచనలో నాకు చాలా సంతృప్తి లభిస్తుంది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం పాటల ద్వారా దొరుకుతుంది. అయితే ఏ ప్రక్రియ అయినా దానిలో ఓ వైవిధ్యం, సొబగు ముఖ్యం. శైలీ ఉదాత్తంగా ఉండాలి. ప్రజల ఆలోచన పరిధిని పెంచి ఉత్తేజాన్ని కలిగించాలి. వికాసం, విజ్ఞానం, వివేకం అందివ్వాలి. ఏ రచన అయినా జీవితానికి అన్వయించుకునేలా ఉండాలి.
పద్యాలు రాగయుక్తంగా పాడటంలో మీకు మంచి పేరుంది కదా..?
చిన్నప్పుడు రేడియోలో రంగస్థలం అనే కార్యక్రమం వచ్చేది. అందులో ఈలపాటి రఘురామయ్య, అబ్బూరి వరప్రసాద్, ఘంటసాల, మాధవపెద్ది పద్యాలు వచ్చేవి. అవి ఎక్కువగా వింటూ ఉండేవాడిని అలా బాల్యం నుంచే పద్యాలపై మక్కువ ఉండేది.
సంగీతం, సాహిత్యం రెండింటిలో ఏదంటే ఎక్కువ మక్కువ?
రెండూ నా కళ్లలాంటివే. సంగీతం ఆనందాన్నిస్తుంది. సాహిత్యం ఆలోచన ఇస్తుంది. లలిత కళలకు సంబంధించిన అంశాలన్నీ నాకు ఆనందాన్నిచ్చేవే. ఏది ఎక్కువంటే చెప్పడం కష్టం.
చాలా సినిమాలకి టైటిల్‌ గీతాలు రాశారు.. వాటిలో ఇతర భాషా పదాలు ఎక్కువ కనిపిస్తాయి కదా?  
పరిశ్రమకు వచ్చినప్పుడు ఇంగ్లీషు పాటలు ఎక్కువగా వింటూ ఉండేవాణ్ని. దానికి తోడు మొదట్లో ఎక్కువగా క్లబ్‌పాటలు, పాప్‌ గీతాలే వచ్చాయి. పరిశ్రమ నుంచి కూడా అలాంటి పాటలు రాసేలా ప్రోత్సాహం లభించింది. అందుకే వాటిల్లో ఆంగ్ల పదాలు ఎక్కువగా వచ్చేవి. కానీ ఆ తర్వాత అతడు, పోకిరి చిత్రాల పాటలతో అచ్చ తెలుగులో కూడా పాటలు బాగానే రాస్తానని నిరూపించుకున్నాను.
టైటిల్‌ గీతాల్లో అతిశయోక్తులు విపరీతంగా గుప్పిస్తారనే వాదన కూడా ఉంది? మీకేమనిపిస్తుంది..?
కథానాయకుడి గుణగుణాలను వర్ణించేటప్పుడు కొంత అతిశయోక్తి ఉండటంలో తప్పులేదు. కానీ అది పరిధిని దాటకూడదు. విస్తృతమైన ఊహాగానాలు ఉండకుండా చూసుకోవాలి. పాటలో కథ, కథనాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. ఉపమానాలు శృతిమించితే పాట పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. పదాలతో ఏ ప్రయోగం చేసినా నమ్మశక్యంగా ఉండాలి.
రచయితే గాయకుడు కూడా అయితే ఏదైనా అదనపు ప్రయోజనం ఉంటుందా?
కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఆ పాట అనుభూతిని ఇంకా శ్రోతలకు బలంగా అందించే ప్రయత్నం చేయగలడు. పరిపూర్ణంగా నిమగ్నమై మంచి పాటను అందించగలడు. ‘అతడు’ టైటిల్‌ సాంగ్‌కి నా గాత్రం అయితేనే సరిపోతుందని మణిశర్మ బలంగా నమ్మారు. కాబట్టే నాకు ఆ పాట పాడే అవకాశం దక్కింది. ఇతర సంగీత దర్శకులు కూడా నా గాత్రం మీద నమ్మకం ఉంచడంతోనే నాకు పాడే అవకాశాలు దక్కాయి.
గతంలో పాట రాశాక దానికి బాణీలు కట్టేవారు.. ఇప్పుడు ముందుగా బాణీ ఇచ్చి పాట రాయమంటున్నారు. దీనివల్ల గీతాల్లో మంచి సాహిత్యం రావడం లేదనే వాదన ఉంది..?
దీన్ని అంగీకరించలేను. బాణీకి తగ్గట్టుగా రాయడమన్నది కవి ప్రతిభావ్యుత్పత్తికి నిదర్శనం. అష్టావధానాలు, శతావధానాల్లాంటి ప్రక్రియల్లో ఇరుకు సందుల్లో కూడా అందమైన పదాలను కూర్చి ప్రతిభాపాటవాలు చూపిన కవులు మన దగ్గరున్నారు. బాణీకి పాట రాయడం వల్ల మంచి సాహిత్యం రావట్లేదంటే అంగీకరించను.
డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎలా అవకాశం వచ్చింది?
ఇంజినీరింగ్‌ చదివే రోజుల్లోనే కె.అచ్చిరెడ్డి గారు మా కళాశాలకు ఓ కార్యక్రమానికి వచ్చారు. నా గొంతు నచ్చి తన సినిమాలో అవకాశం ఇస్తానని మాటిచ్చారు. అంతేకాదు డబ్బింగ్‌ కార్డు ఆయనే తీసుకుని ఒక సంవత్సరం పాటు మెలకువలు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందించారు. ఛత్రపతిలో కాట్రాజ్, సింహాద్రిలో రాహుల్‌దేవ్, రక్తచరిత్రలో బుక్కారెడ్డి ఇలా చాలా వరకు విలన్‌ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పినవే ఎక్కువ పేరు తెచ్చాయి. లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌లో సీనియర్‌ ఎన్‌టీఆర్‌కు గాత్రం అందించే అవకాశం రావడం జీవితంలో మరిచిపోలేనిది.
సినీ గీత రచయితకు ఉండాల్సిన లక్షణాలు?
దర్శకుడు చెప్పిన సందర్భాన్ని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకోవాలి. ఇచ్చిన బాణీకి తగ్గట్లుగా భావాన్ని పదాల్లో వ్యక్తీకరించే సమర్థత ఉండాలి. పదాలను అందంగా కూర్చి ఆ సన్నివేశాన్ని రక్తికట్టించే నైపుణ్యం సాధించాలి. తెలుగుకు అపూర్వ పద సంపద ఉంది. పరభాష మాయలో పడిపోకుండా తేనెలొలికించే పదాలతో తెలుగు పాటను రక్షించుకోవాలి. ప్రజలకు ఆనందాన్ని కానీ, ఆలోచనను కానీ కలిగించేలా పాటలు రాయగలగాలి. సముద్రాల, మల్లాది, సినారె, వీటూరి, కొసరాజు, వేటూరి, సిరివెన్నెల లాంటి గొప్పవారెందరో తెలుగుపాటకు బంగారు బాటలు వేశారు. వాళ్ల బాటలోనే నడిచి పాటను కాపాడుకోవాలి. ఆలోచన సరళి విస్తారంగా ఉండాలి. సినీ రచయితకు ప్రపంచ పోకడలపై చక్కటి అవగాహనతో పాటు అన్ని రంగాలపైనా కనీస పరిజ్ఞానం ఉంటే బాగుంటుంది. సమాజాన్ని నిశితంగా పరిశీలించాలి. అందుకు తగినట్లు కసరత్తులు చేయాలి.
దాదాపు రెండొందల గీతాలు రాశారు.. ప్రారంభంతో పోల్చితే గీత రచయితగా ప్రస్తుతం మీలో వచ్చిన పరిణతి?
తెలుగు భాష వైవిధ్యాన్ని అర్థం చేసుకున్నాను. భాష మీద మరింత ప్రేమ పెరిగింది. మొదట్లో ఇంగ్లీషు, హిందీ మిళితం చేసి రాశాను. కానీ పాటలు రాసేకొద్ది తెలుగు గొప్పదనాన్ని అర్థం చేసుకున్నాను. గీతాల్లో తెలుగుతనాన్ని మరింత చొప్పించే ప్రయత్నం చేస్తున్నాను.
కేరాఫ్‌ కంచరపాలెంలోని ‘ఆశాపాశం’, ఉమామహేశ్వర చిత్రంలోని ‘నింగిచుట్టే..’ లాంటి భావాత్మక గీతలు రాయడానికి ఎలాంటి కసరత్తులు చేశారు?
ప్రశాంతంగా ఉన్నప్పుడే పాటలు రాసేందుకు ఇష్టపడతాను. పాట సందర్భాన్ని విశ్లేషించుకుంటాను. అలాంటి సందర్భాల్లో ఇంతకు ముందు వచ్చిన పాటలను, సాహిత్యాన్ని గమనించి పూర్తిగా సన్నద్ధమై పాట రాసేందుకు ఉపక్రమిస్తాను. పాత రోజుల్లోలా భావాత్మక గీతాలు రాసే అవకాశాలు ఇప్పుడు తగ్గాయన్నది వాస్తవమే. కళన్నది సమాజంలోంచే పుట్టుకొస్తుంది. ప్రజలు వేటిని ఆస్వాదిస్తున్నారు, సామాజిక స్థితిగతులేంటి అన్నది ముఖ్యం. నేను రాసిన పాటల్లో ‘అతడు’ నేపథ్యగీతం, ఆశాపాశం, నింగిచుట్టే, డోలే డోలే, ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో వయోలిన్‌ పాటలో అల్లిన పద ప్రయోగాలు ఇష్టం. ఈమధ్యకాలంలో రాసిన ‘ఆశాపాశం, నింగిచుట్టే’ పాటలు మంచి గుర్తింపునిచ్చాయి.
పాటలు తక్కువగా రాస్తారనే మీ మీద ఓ ఫిర్యాదు?
అవును నిజమే. ఇకపై ఎక్కువగా రాసేందుకు ప్రయత్నిస్తాను. వీలైనంత మేర నా పాటల్లో మంచి సాహిత్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. వచ్చే ఏడాదిలో రాబోయే చిత్రాల్లో పెద్ద హీరోలకు పలు పాటలు రాశాను. అవన్నీ సూపర్‌ హిట్‌ అవుతాయనే గట్టి నమ్మకం ఉంది. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా పెద్ద ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి.
సొంతంగా అల్బమ్స్ కూడా రూపొందిస్తున్నారు కదా?
సినిమా పాటలు ఆ సందర్భాలకు అనుగుణంగా దర్శకులు, సంగీత దర్శకులు కోణంలో రాసేవి. ఆత్మావిష్కరణ చేసుకునే ప్రయత్నంలో సొంతంగా ఆల్బమ్స్‌ని రూపొందిస్తున్నాను. నాలోని వేరే కోణాన్ని ప్రజలకు పరిచయం చేసే అవకాశం వీటి ద్వారా దక్కుతోంది. త్వరలోనే మరో కొత్త ఆల్బమ్‌తో అందరినీ పలకరిస్తాను.
వ్యక్తి రాణింపులో మాతృభాష ప్రాధాన్యమేంటి?
మాతృభాషను బాగా ఆకళింపు చేసుకుంటే ఇతర భాషలను కూడా అలవోకగా నేర్చుకునే నైపుణ్యం ఏర్పడుతుంది. ఇది పరిశోధనల్లో కూడా రుజువైంది. ఆత్మన్యూనత భావంతో తెలుగు మాట్లాడకపోవడం సరికాదు. తల్లిదండ్రులు మాతృభాష గొప్పతనాన్ని పిల్లలకు చెప్పాలి. తెలుగును గౌరవించడం నేర్చుకోవాలి. సాహిత్య పోకడలను పరిచయం చేయాలి. అలాగే, పరభాష వ్యామోహాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే మనకు అంతమంచిది. తెలుగువాడిగా పుట్టి తెలుగును విస్మరిస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినంత పాపం.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి