తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

సాహిత్యమే నా బలం!

  • 154 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలుగు సినీ సాహిత్యంలో అటు హుషారు గీతాలతో, ఇటు భావాత్మక పాటలతో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న రచయిత భాస్కరభట్ల రవికుమార్‌. ‘బొమ్మను గీస్తే నీలా ఉంది...’ (బొమ్మరిల్లు), ‘పెళ్లెందుకే రమణమ్మా’ (బంపర్‌ ఆఫర్‌), ‘గాల్లో తేలినట్టుందే గుండె జారినట్టుందే’ (జల్సా), ‘కృష్ణానగరే మామ’ (నేనింతే) ఇలా మూడొందల పైచిలుకు గీతాలు భాస్కరభట్ల కలం నుంచి జాలువారాయి. ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి..
సాహిత్యం మీద ఆసక్తి ఎలా కలిగింది? 
తాతయ్యతో నాకు అనుబంధం ఎక్కువ. నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని శతక పద్యాలు, కథలు చెప్పేవారు. అవే సాహిత్యం మీద ఆసక్తి పెంచాయి. దినపత్రికలు, పుస్తకాలు కొనే స్తోమత ఉండేది కాదప్పుడు. పాతపేపర్లు అమ్మే దుకాణంలో చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర కథల పుస్తకాలని తక్కువ ధరకి కొని చదివేవాణ్ని. కొన్ని కారణాలతో సొంతూరు శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి రావాల్సొచ్చింది. అక్కడి సాహిత్య వాతావరణం, పుస్తక పఠనం నా ఆలోచనా పరిధిని విస్తరింపజేశాయి. రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్లి పాత దినపత్రికలు అమ్మే ఒక దుకాణంలో పుస్తకాలు కొని తెచ్చుకునేవాణ్ని. 
రాజమండ్రిలో మీరు పొందిన సాహిత్య స్ఫూర్తి..?
ఇన్నీసుపేట, సీతంపేట, గౌతమీ గ్రంథాలయాలకు వెళ్లేవాణ్ని. కవిత్వం ఎక్కువ చదివేవాణ్ని. కొంత చదివాక నాలో కదలిక మొదలైంది. కథలు చదువుతాను కానీ రాసింది తక్కువ. నవలలూ తిరగేసేవాణ్ని. ఎందుకో కవిత్వం వైపే నా మనసు ఒరిగింది. డిగ్రీ వరకూ రాజమండ్రిలోనే చదువుకున్నాను. అప్పుడే దానవాయిపేటలో తెలుగు విశ్వవిద్యాలయానికి అంకురారోపణ జరిగింది. విశ్వవిద్యాలయం వార్షికోత్సవం సందర్భంగా కవితల పోటీ పెట్టారు. తెలుగు భాష మీద కవిత రాసి వేదికెక్కి వినిపించాను. కవిత్వం అంటూ ఏదో రాసేసి స్థానిక పత్రికల కార్యాలయాలకు వెళ్లి ఇచ్చేవాణ్ని. అవి ప్రచురణకి నోచుకునేవి కాదు. అలా ఒక పత్రిక కార్యాలయానికి వెళ్తే ఎమ్మెస్‌ సూర్యనారాయణ అని ఒక రచయిత కనిపించి ‘నువ్వు రాసింది కవిత్వం కాదు. కవిత్వం రాసే పద్ధతి ఇదికాదు. నువ్వు వెంటనే మహాప్రస్థానం చదువు’ అనగానే ఇన్నీసుపేట గ్రంథాలయానికి వెళ్లి ‘మహాప్రస్థానం’ చదివాను. జ్వరం వచ్చింది. అప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ చింపేశాను. చాలాకాలం రాయలేదు. చదవాల్సింది చాలా ఉందని అర్థమైంది. శ్రీశ్రీ మీద వెర్రి అభిమానంతో యువ కవులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘యువ స్వరం’ సంస్థ పెట్టాను. ఎమ్వీ రామిరెడ్డి, బాణాల రమేష్‌ లాంటి వాళ్లు ఆ ప్రోత్సాహ బలంతో ఇప్పుడు శక్తిమంతమైన కవిత్వం రాస్తున్నారు. 
సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు? 
నాకు రాయడం తప్ప మరొక పని రాదు. రాసే పనితోనే బతకాలంటే అందుకు అనువైంది పాత్రికేయం. అందుకే  ‘ఈనాడు’లో కంట్రిబ్యూటర్‌గా చేరాను. రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్‌లు ఎక్కువ జరిగేవి. ‘సితార’ ఎడిటర్‌ శ్రీకాంతమూర్తి కొన్ని షూటింగులు కవర్‌ చేసి పంపమని చెప్పారు. అలా సినీ లోకం గురించి కొంత అవగాహన వచ్చింది. సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా అప్పుడే వచ్చింది. రెండేళ్లు పూర్తయ్యాక ‘సితార’లో పనిచేసే అవకాశం దక్కింది. 1994 నుంచి ఆరేళ్లు అందులో పనిచేశాను. ఆ క్రమంలో ఎక్కువ మంది కవులు, రచయితలను కలిశాను. కవిత్వం బాగా చదివాను. సినిమా సాంకేతిక నిపుణల ముఖాముఖులు చేశాను. ఈవీవీ దగ్గరికి వెళ్లి పాట అడిగాను. చాలారోజుల తర్వాత ‘గొప్పింటి అల్లుడు’ సినిమాకి అవకాశమిచ్చారు.
పాటల రచయితగా మీకు ప్రేరణ? 
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పాటలు విన్న తర్వాత, పాట ఇంత సరళంగా రాయవచ్చా అనిపించింది. పాటలు రాయాలని నాలో కదలిక తెచ్చింది సిరివెన్నెల గీతాలు. పరిశ్రమలో పాటల రచయితగా నిలదొక్కుకోవాలనే కోరిక బలపడిపోయింది. శాస్త్రిగారి పాటల్లో ‘చిలకా ఏ తోడు లేక’, ‘ఎప్పుడూ ఒప్పుకోవొద్దురా ఓటమి’ ఇలా నచ్చిన పాటలెన్నో ఉన్నాయి. వేటూరి పాటల్లో శబ్ద చమత్కారం నచ్చుతుంది.
మీ పాటల్లో సున్నిత భావాలు కనిపిస్తాయి..!
నేను చాలా సున్నిత మనస్కుణ్ని. ఏ విషయంలోనైనా నన్ను ఏదైనా అంటే బాధపడతాను. నా పాటల్లో కూడా ఆ సున్నితత్వం ప్రతిఫలిస్తుంది. ‘జో అచ్యుతానంద’లో ‘ఒక లాలన.. ఒక దీవెన... సడిచేయవా ఎదమాటున...’; ‘కాటమరాయుడు’లో ‘లాగే .. లాగే’ లాంటి పాటలు రాయడం నాకిష్టం. ఆ అవకాశం ఇప్పుడు కలుగుతోంది. 
మీ రచనల్లో మీకు బాగా నచ్చిన ప్రయోగాలు?
‘ఉన్నట్టుండి ఏం చేశావే ఎక్కేస్తున్నవే ఏనుగు అంబారీ’ అని ‘కాటమరాయుడు’ సినిమా కోసం ఓ పాట రాశా. ఇందులో ‘ఏనుగు అంబారీ’ చాలా మంచి పదం. ఇలాంటివి ఈ రోజుల్లో పెద్దగా వాడటంలేదు. ‘నాన్నకు ప్రేమతో’లోని ‘నా మనసు నీలో’ పాటలో ‘చలిగా గిల్లుతుంటే శీతాకాలం.. ముద్దులతో యుద్ధాలెన్నో చేసి వేసవిలా మార్చుదామా..’ అన్నదీ కొత్త అభివ్యక్తే. పాటలో కొత్తదనముండాలి. చమత్కారం కనిపించాలి. సరళంగా రాస్తూనే కొత్తదనం కోసం తాపత్రయపడతాను. ఒక సినిమాకి ఐటమ్‌ పాట రాస్తూ ‘నా కులుకే ఎనస్తీషియా నా వెనకే సమస్తాసియా’ అన్నాను. అలాగే ‘పట్టు పట్టు పావడా అది ఒలంపిక్‌ కాగడా..’ అన్నాను మరో పాటలో. ఇతర భాషాపదాల జోలికి పోకుండా తెలుగు పదాల్లోనే కొత్తగా చెప్పడం నాకిష్టం. ‘తంపటి.. లంకిణి.. బాగుందే కసి కుంకిణి’ లాంటి పదాలన్నీ అలాంటివే. 
సాహిత్యం విరివిగా చదువుతుంటారా?  
నాకు బాగా పరిచయమున్న కవులు, రచయితలు పంపించే పుస్తకాలు, ఫేస్‌బుక్‌ కవి సంగమంలో వచ్చే కవిత్వం చదువుతాను. పుస్తకావిష్కరణ సభలకి వెళ్తాను. పాటల రచయితగా నాకు బలాన్నిచ్చేదీ, ఇస్తున్నదీ సాహిత్యమే. సగటు పాఠకుడిగా నాకు అందుబాటులో ఉన్న ప్రతిదీ చదవకుండా వదలను. నాకు కవులంటే ఇష్టం. వీలు కుదిరినప్పుడల్లా చిన్న చిన్న కవితలు రాస్తాను. సినిమా పాట సన్నివేశానికి తగినట్టు రాయాలి. కవిత్వమంటే మనసు స్పందించినప్పుడు రాసుకునేది. దేని ఉనికి దానిదే!
అమ్మభాష ప్రాధాన్యం గురించి..? 
మన నుడికారాన్ని పోగొట్టుకోకూడదు. మన బతుకు మన భాషతోనే ముడిపడి ఉంది. అమ్మభాషను పక్కనపెడితే వచ్చే లాభమేంటో నాకర్థం కాదు. ఒక మాధ్యమాన్ని పిల్లల మీద బలవంతంగా రుద్దడం తప్పు. నన్ను తెలుగులో చదువుకో అని ఎవరూ చెప్పలేదు. ప్రస్తుత పరిస్థితే నా చిన్నతనంలో ఉండుంటే నేను తెలుగు చదువుకోలేకపోయేవాణ్ని కదా! అమ్మభాషకి మనం చేసే మహోపకారం ఏదైనా ఉందంటే దాని బతుకు దాన్ని బతకనివ్వడమే. భాష ఒక భవనం కాదు కూల్చడానికి. తరతరాలుగా వేళ్లూనుకుని శక్తి నింపుకున్న భాషను ఎవరూ పడగొట్టలేరు. మాట్లాడేవాళ్లు, ప్రేమించేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. ఆంగ్లంలో చదువుకుంటే ఏదో గొప్ప ప్రయోజనం జరిగిపోతుందని అందర్నీ ప్రలోభ పెట్టడం తప్పు.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి