తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

నన్ను ‘ఆంధ్రాశరత్‌’ అన్నాడాయన!

  • 105 Views
  • 0Likes
  • Like
  • Article Share

శతాధిక గ్రంథ రచయిత అక్కిరాజు రమాపతిరావు. ముఖ్యంగా జీవిత చరిత్రల రచనలో ఆయనది అందెవేసిన చెయ్యి. కథలు, నవలల నుంచి సాహితీ పరిశోధన, విమర్శల వరకూ విభిన్న ప్రక్రియల్లో తెలుగు సాహిత్యానికి వెలుగులద్దిన ఘనత ఆయన సొంతం. అరున్నర దశాబ్దాలుగా తెలుగు అక్షరాలతో మమేకమై ప్రయాణిస్తున్న అక్కిరాజుతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి..
చిన్నప్పుడు మీ ఇంట్లో సాహితీ వాతావరణం ఉండేదా?

నా ముందు తరం వారైన అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు నవద్వీప (విద్యలకు కాణాచి అయిన పశ్చిమబంగ పట్టణం) పండితులు. మా పెదనాన్న కుమారుడు రాధాకృష్ణ కూడా రచనలు చేసేవాడు. నాకు తెలియకుండానే ఈ వాతావరణం అంతః ప్రేరణకు కారణమై ఉంటుంది. 
రచనల మీద ఆసక్తి ఎట్లా కలిగింది?
స్కూలు ఫైనలు చదువుతుండగా వార్షికోత్సవం వ్యాసరచన పోటీకి నాకు మొదటి బహుమతి వచ్చింది. అప్పుడు మా హెడ్మాస్టరుగారు నాయని సుబ్బారావు. ఆధునిక కవితా జగత్తులో నాయని చాలా గొప్ప కవి. వార్షికోత్సవం నాడు ఆయన ముద్దుకృష్ణ సంకలితమైన ప్రశస్త కవితా సంకలనం ‘వైతాళికులు’, ఓ పార్కర్‌ కలమూ బహూకరించారు. ఆ కవితా సంకలనాన్ని ఇంచు మించు రోజూ చదివేవాణ్నేమో! ఆ కవితలు అర్థమైనా కాకపోయినా మొత్తం చదివేవాణ్ని. అలా నాలో రచనాసక్తి జనించింది. పిచ్చిపిచ్చి గేయాలు రాయడం మొదలైంది. 
‘మంజుశ్రీ’ అనే కలం పేరు పెట్టుకోవటం వెనక విశేషం ఉందా?
లేకేం! అడవి బాపిరాజు రచనలంటే నాకు చాలా ఇష్టం. ఒకవిధంగా ఆరాధన. ఆయన నవల ‘హిమబిందు’లో శాతవాహన చక్రవర్తి రెండో కుమారుడి పేరు మంజుశ్రీ. అదీకాక అవి నేను ఇంటరూ, బియ్యే చదివేరోజులు. అప్పట్లో ఇంట్లో వాళ్లకు నేను రచనల్లో పడి చదువు అశ్రద్ధ చేస్తున్నాననే భావం కలగకూడదన్నదీ ఈ కలంపేరు వెనక ఓ కారణం. నా మొదటి రచన ‘తెలుగు స్వతంత్ర’లో 1953 డిసెంబరులో వచ్చిందనుకుంటాను. తర్వాత 1956లో చిన్న నవల ‘జారుడుమెట్లు’ స్వతంత్రలోనే ప్రచురితమైంది. అప్పట్లో ‘జ్యోతి, అభిసారిక’ లాంటి పత్రికలలో తెలిసీ తెలియని శృంగార రచనలు చేసేవాణ్ని. ఆ సమయంలో నాకో కవచంగా ఈ కలంపేరు స్థిరపడింది!  
సృజనాత్మక రచనల నుంచి పరిశోధన, విమర్శ వైపు ఎప్పుడు మళ్లారు?
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1958 - 60లో ఎమ్మే చదివాను. అప్పుడే న్యూ సైన్స్‌ కాలేజీలో తాత్కాలిక ఉద్యోగం దొరికింది. నా విద్యార్హత, యోగ్యత మెరుగుపరచుకోవటానికి పీహెచ్‌డీ చేయాల్సి వచ్చింది. ఎమ్మేలో నా సహాధ్యాయి తాను వీరేశలింగం రచనల మీద పరిశోధన చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. దురదృష్టవశాత్తూ తను చనిపోయాడు. అప్పటికి వీరేశలింగం గురించి నాకేమీ తెలియదు. మా ఆచార్యులు ఖండవల్లి లక్ష్మీరంజనంతో వీరేశలింగం మీద నేను పీహెచ్‌డీ చేస్తానని చెబితే చాలా సంతోషించారు. నాకు అవకాశం కలిగించారు. మా ఎమ్మే బ్యాచ్‌లో నాదే మొట్టమొదటి పీహెచ్‌డీ. కందుకూరి మీద తెలుగునాట మొదటి పీహెచ్‌డీ నాదే కావచ్చు. సి.నారాయణరెడ్డి గారికీ నాకూ దాదాపు ఒకే సమయంలో ఈ పట్టా లభించింది. అలా నాకు మిత్రబృందంలో, సాహితీప్రముఖుల్లో మంచి పేరు వచ్చింది. వీరేశలింగం ఆధునిక తెలుగు సాహిత్య యుగపురుషుడు. ఆయన రచనలు పది సంపుటాలను నేను సవ్యాఖ్యానంగా విశాలాంధ్ర ప్రచురణాలయం వారితో ప్రకటింప చేశాను. అప్పట్లో అన్ని సంపుటాలకు నోట్సు రాశాను. అదే పది వేల పేజీలుండవచ్చు. తెలుగు సాహిత్యంలో రెండే యుగాలు- నన్నయ్య యుగం, వీరేశలింగ యుగం అన్నారు పింగళి లక్ష్మీకాంతం. అంతటి కందుకూరి రచనలు, ఆయన మహోన్నత సాహితీ వ్యక్తిత్వం గురించి పరిశోధన చేయడం నా సుకృతం.  
ముప్పయి జీవిత చరిత్రల రచనకు ప్రేరణ?
1976లో కొమర్రాజు లక్ష్మణరావు శతవర్ధంతి వచ్చింది. ఆ సందర్భంగా ఏటుకూరి బలరామమూర్తి నన్ను కొమర్రాజు జీవిత చరిత్ర రాయాల్సిందిగా కోరారు. నాకు చాలా ఉత్సాహం కలిగింది. వెంటనే కొమర్రాజు వారి చరిత్ర గ్రంథాలన్నీ సంపాదించి బలరామమూర్తి గారి కోరిక సఫలం చేశాను. ఆ పొత్తాన్ని ప్రఖ్యాత చరిత్రవేత్త దిగవల్లి వెంకట శివరావుకు అంకితం చేశాను. లక్ష్మణరావు జీవిత చరిత్ర మీద ‘భారతి’ పత్రికలో బులుసు వేంకట రమణయ్య లాంటి గొప్పపండితులు ఓ సమీక్షా వ్యాసం ప్రచురించారు. వావిలాల గోపాలకృష్ణయ్య రెండు లేఖలు రాశారు. గిడుగు జీవిత చరిత్ర రాయమని అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి తూమాటి దొణప్ప అడిగారు. ‘గిడుగు రామమూర్తి జీవితం- ఉద్యమం’ పేరిట నేను రాసిన పుస్తకాన్ని విశ్వవిద్యాలయం ప్రచురణగా తెచ్చారు. దాంతో జీవితచరిత్ర రచన పట్ల ఆసక్తి బలపడింది. ఓ పుస్తక ప్రదర్శనోత్సవ సందర్భంగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రతిభారేతో మాట్లాడుతున్నప్పుడు నేను రాసిన 30 జీవిత చరిత్రల ప్రస్తావన వచ్చింది. ‘సాహిత్యప్రక్రియల్లో జీవిత చరిత్ర చాలా కష్టసాధ్యం’ అని ఆవిడ మెచ్చుకున్నారు. స్వీయచరిత్రలు తెలుగులో 400 దాక ఉన్నాయి. అందులో 300 చదివి ఉంటాను. అలా జీవిత చరిత్రల పట్ల ఆసక్తి ఇంకా పెరిగింది. 
ఆయా వ్యక్తుల జీవిత విశేషాలు సేకరించటంలో ఎదురైన అనుభవాలు?
వాళ్ల గ్రంథాలు చదవటం, అనాటి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని అధ్యయనం చేయడం మాత్రమే చేశాను. ఎవరినీ ముఖాముఖి కలిసే అవకాశం లేదు కదా! కేంద్ర సాహిత్య అకాడమీ వారికి తర్వాతి కాలంలో నోరి నరసింహశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, నానాలాల్‌ లాంటి గుజరాతి మహాకవి సంక్షిప్త జీవిత చరిత్రలు (మోనోగ్రాఫ్‌) రాశాను.
బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలను వచనంలోకి తేవాలన్న ఆలోచనకు ప్రేరణ? 
నాకు దగ్గరివాడు, శైవమతాభిమాని ధూపం బసవనాగయ్య ‘బసవకృష్ణ’ అనే మాసపత్రిక నిర్వహించేవాడు. దానికి నేను గౌరవ సంపాదకుణ్ని. పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణం ఉంది. శ్రీశైల క్షేత్రానికి సంబంధించింది అది. దీనిని వచనీకరించమని బసవనాగయ్య అడిగాడు. అదేకాకుండా, నేను అమెరికాలో ఉన్నప్పుడు కాలాన్ని వ్యర్థం చేయకుండా మంచి రచనల్లో గడపాలని అనుకున్నాను. 800 సంవత్సరాలుగా ఈ రెండు మహాగ్రంథాలను ఎవరూ వచనంలోకి తేలేదు. అదో  ఆసక్తికర ప్రేరణ అయ్యింది. అమెరికాలో ఉన్నప్పుడే ఈ రెండింటినీ వచనంలో రాశాను. 
మీ రచనల్లో మీకు బాగా నచ్చిందేంటి? 
మీ పిల్లల్లో మీకెవరు ఎక్కువ ప్రీతిపాత్రులు అంటే ఏం చెబుతాం! నా స్వీయచరిత్ర ‘జీవనవాహిని’ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అలాగే, ‘ఆంధ్రకేసరి ప్రకాశం’ పుస్తకం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదో తరగతి ఉపవాచకంగా ఉంది. ప్రభుత్వం ద్వారా లక్షల కొద్దీ ప్రతులు వేశారు. అదీ ఇష్టం.  అప్పట్లో తెలుగునాట రాజకీయ సంక్షోభం ఉండేది. విద్యార్థులు నా పుస్తకాన్ని ఎంతో ఉల్లాసంతో చదివేవారు. నా మీద ప్రభావం చూపిన రచయితల్లో అడవి బాపిరాజు ముఖ్యలు. తెలుగేతర రచయితల్లో శరత్‌ బాబు, విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. కోడిగానికి కుందుర్తి ఆంజనేయులు నన్ను ‘ఆంధ్రాశరత్‌’ అన్నాడోసారి. దానికి నేను తగను. పాలపిట్టకు, నెమలికి ఉండే తారతమ్యం- కుందుర్తి ప్రస్తావనలో ఉంది. 
తెలుగు అకాడమీతో సుదీర్ఘ అనుబంధం ఉంది కదా?
34 ఏళ్లు (1965- 1993) తెలుగు అకాడమీలో వివిధ స్థాయిల్లో పనిచేశాను. 1972లో అకాడమీ తరఫున ఓ మాసపత్రిక వెలువరిద్దామనుకున్నప్పుడు దానికి ‘తెలుగు’ పేరు పెట్టాల్సిందిగా సూచించాను. ఎందుకంటే, గిడుగు వారు తమ భాషాసాహిత్య నవీకరణ సమర శంఖారావానికి ఆసరాగా నడిపిన పత్రిక ‘తెలుగు’. దాని ప్రతి పుట సువర్ణం. తెలుగు భాషా చరిత్రలో అదొక గొప్ప అధ్యాయం. విదేశీ భాషా సాహిత్య వేత్తలూ ఈ పత్రికను మెచ్చుకున్నారు. సుప్రసిద్ధ గణితశాస్త్ర మేధావి ఎస్‌.రామానుజన్‌ నోట్‌ పుస్తకాల్లోని ఓ వ్యాసాన్ని ‘తెలుగు’ పత్రికలో ప్రచురించాను. చాలా కాలం వరకు ఈ పత్రిక సంపాదకుడిగా ఉన్నాను.  
కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు కన్వీనరుగా ఉండి అక్కడి వ్యవహారాల మీద పెద్ద యుద్ధమే చేశారు..?
అప్పుడు చేయాల్సి వచ్చింది. దీర్ఘనిద్రకూ గాఢనిద్రకూ అర్థభేదం తెలియని ఓ మహారచయితకు అకాడమీ వారు అవార్డు ఇచ్చారు. ఇది అన్యాయం, అనైతికం, అర్థరహితం అని ఎదురు తిరిగాను. కానీ, నిలువరించ లేకపోయాను. రాజీనామా చేద్దామనుకున్నాను కానీ, మంచి రచయితలకు గుర్తింపు కలగజేయవచ్చునని ఆ ఆలోచన విరమించుకున్నాను. అకాడమీ లాంటివి రాజకీయాలకు నిలయాలైతే సాహిత్యానికి చాలా నష్టం జరుగుతుంది. స్వార్థపరత్వం, దురాశ, పారదర్శకతకు బదులు వ్యాపార దర్శకత ఉంటే కచ్చితంగా నష్టమే. మీకు తెలుసో.. లేదో.. ఏ ఉత్తమ గ్రంథానికైనా అవార్డు పరిగణనార్హత మూడే సంవత్సరాలు. ఆ తర్వాత అది చెల్లని నాణెం అవుతుంది అకాడమీ వారి దృష్టిలో! దీంతో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చింతా దీక్షితులు, దాశరథి రంగాచార్య, వాసిరెడ్డి సీతాదేవి, ఘండికోట బ్రహ్మజీరావు లాంటి గొప్ప రచయితలకు అన్యాయం జరిగింది. ఏం చెప్పాలి!?
అరవై అయిదేళ్ల మీ రచనా జీవితాన్ని తలచుకుంటే మీకేమనిపిస్తుంది?
ఎంతో ఓదార్పు, సంతోషం కలుగుతాయి. కలకత్తా భారతీయ భాషా పరిషత్తువారు ఎంటీ వాసుదేవన్‌ నాయర్, కేదార్‌సింగ్, ఇందిరాగోస్వామి, అరుణ్‌ సాహూ లాంటి భారతీయ సాహిత్య దిగ్గజాలతో పాటు నాకూ సమగ్ర రచనా పురస్కార్‌ అందించారు. ఇలాంటి గొప్ప అదృష్టం నా సమకాలికుల్లో ఎవరికీ దక్కలేదేమో! 
మీరు అమెరికాలో 13 ఏళ్లు గడిపారు. భాషా సంస్కృతి పరిరక్షణ పరంగా విదేశాల నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి?
వాళ్ల ఉదాత్త ఉత్తమ అభిమానం, మమత్వం. అక్కడి ధనవంతులు విశ్వవిద్యాలయాలలో విద్వాంసక భృతి ఏర్పాటు చేస్తారు. పలనాటి వీరచరిత్రపైనా, త్యాగరాజుపైనా, ఆధునిక తెలుగు కవితా రీతులపైనా ఆ విశ్వవిద్యా లయాలు ఆసక్తి చూపి పరిశోధనలకు సదుపాయాలు కలిగిస్తాయి. పైడిమర్రి రాజా రామచంద్రరావు అనే మనస్వి 15 సార్లు అమెరికా పర్యటించి మన వాస్తు శిల్ప సంపద, దేవాలయ నిర్మాణ వైశిష్ట్యం గూర్చి ఉపన్యాసాలిచ్చారు. బర్కిలీ విశ్వవిద్యాలయంలోనే 18 మంది నోబెల్‌ పురస్కార గ్రహీతలు అధ్యాపకులుగా ఉన్నారని ఆయన స్వీయచరిత్ర చెబుతోంది. గదర్‌ విప్లవం మీద అక్కడ స్మారకసంస్థ ఉంది. మనకు కవిత్రయం పైనే కృతజ్ఞతా మమత్వం లేదు. అలాగే, అమెరికాలోని తెలుగువారి భాషాభిమానం, సాహితీసేవలను చూస్తే నమస్కారపూర్వకంగా వారిని ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది. పుట్టింటికీ.. సంస్కృతికి, సంస్కారానికి, సమాజానికి దూరమైపోతామేమోనన్న ఆందోళన, ఆరాటం వారితో ఎన్నో మంచి పనులు చేయిస్తోంది. 
ప్రస్తుతం ప్రభుత్వాలు అమ్మభాషలో చదువులు అవసరం లేదంటున్నాయి కదా!
అట్లా అనడం శిక్షర్హమైన నేరం. వంట చేసుకోవటం కష్టం.. బ్రడ్డూ, కోలా సరిపోవా ఆకలి తీర్చుకోవటానికి అనడం లాంటిదే ఇదీ!  ఇలా ఈడిగిలబడితే తెలుగు.. ప్రాకృతం, పైశాచీ, పాలీ, మాగధి లాంటి భాషల్లా అయిపోతుంది. తెలుగువారికి, కాలక్రమంలో విశ్వమానవులకు ప్రాణదానం చేసే ఔషధాలు కనిపెట్టిన ఎల్లాప్రగడ సుబ్బరావు, తెలుగులో రచనలు చేశారు. 1920ల నాటి ‘ధన్వంతరి’ పత్రికలో ఇవి కనపడతాయి. విశ్వవిఖ్యాతులు స్వామి జ్ఞానానంద తెలుగులో రాసిన లేఖలు 2 సంపుటాలున్నాయి. తెలుగు వద్దంటే తల్లిని దూరం ఉంచి దాది ఒడికి చేరినట్లవుతుంది. అంతేకాదు, రెండు వేల ఏళ్లకు పైగా తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక సంపదకు దూరమై భ్రష్టులమై, దీనులమైపోతాం. ఇంగ్లీషును గొప్పగా నేర్చుకోవాల్సిందే. కానీ అది లేకపోతే పురోగతి లేదనుకోవటం అథోగతికి దారితీస్తుంది. 
మొత్తంగా చూస్తే మీరు 140 పుస్తకాలు తెచ్చారు. మామూలు విషయం కాదు కదా!
అవునో కాదో నాకు తెలియదు. నేను సంపాదకత్వం వహించిన సావనీర్లు, మహామహుల స్వీయచరిత్రలకు నేను రాసిన పీఠికలు కలుపుకుంటే ఈ సంఖ్య 200 దాటుతుంది. ఇది నా అక్షరార్చన.. పైపెచ్చు అదృష్టం.
కొత్త తరం రచయితలకు సూచనలు?
తెలుగు సాహిత్యం బాగా అధ్యయనం చేయాలి. యాభై పుస్తకాలన్నా చదివాకే రచన చేయాలి. అప్పుడే భాష మీద పట్టు వస్తుంది. రచనలో మెలకువలూ తెలుస్తాయి. తెలుగు వాక్యాలన్నీ ఇంగ్లీషుతో సంకరమై పోతున్నాయి. అలా చేయకూడదు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి