తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

పాఠ్యపుస్తకాలు వస్తాయో లేదో!

  • 89 Views
  • 0Likes
  • Like
  • Article Share

వివిధ రాష్ట్రాల్లోని తెలుగువాళ్లందరినీ ఏకతాటి మీదకు తెస్తున్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అయిదో మహాసభలు జూన్‌ 28న అంతర్జాల వేదికగా జరిగాయి. కొవిడ్‌-19 నేపథ్యంలో మొదటిసారి సభల్ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు రాళ్లపల్లి సుందరరావుతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి..
ఆన్‌లైన్‌లో మహాసభలు నిర్వహించడం ఎలా అనిపించింది?

మామూలుగా అయితే ఈ మహాసభల్ని జాతీయ స్థాయిలో నిర్వహించాలి. కానీ ‘జూమ్‌’ ద్వారా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాం. అమెరికా, న్యూజిలాండ్, మారిషస్, దక్షిణాఫ్రికా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర ఎనిమిది దేశాలు, మన దేశంలోని పన్నెండు రాష్ట్రాల నుంచి మూడు వందల మంది వీటిలో పాల్గొన్నారు. వందల సంఖ్యలో తెలుగు అభిమానులు వీక్షించారు. కేవలం పన్నెండు రోజుల వ్యవధిలోనే అందరితో సమన్వయం చేసుకుని వీటిని నిర్వహించాం. సమయ పాలన కచ్చితంగా పాటించాం. ఈ మహాసభలకు హోసూరుకు చెందిన ఎమ్మెస్‌ శ్రీనిధి, ఖరగ్‌పూర్‌ ఐఐటీ నుంచి కె.వేణుగోపాల రావు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు పి.సౌరభ్, రాఘవరావు, ఎస్‌.ఫణికుమార్, వై.హనుమంత ప్రసాద్, ఎం.సంపత్‌కుమార్‌ తదితరులు స్వచ్ఛందంగా సాంకేతిక సహకారం అందించారు. 
సభలు ఎలా జరిగాయి?
ఖరగ్‌పూర్‌లోని మా ఇంటి నుంచి ఉదయం తొమ్మిదింటికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించాం. ఖరగ్‌పూర్‌ నుంచి సభ్యులు పద్మా ప్రసాద్, అరుణ, అనూరాధలు ‘మా తెలుగు తల్లికి’ గీతం ఆలపించారు. అహ్మదాబాదు నుంచి సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.వి.పి.సి.ప్రసాద్‌ వార్షిక నివేదిక అందించారు. తర్వాత ప్రముఖులు పంపిన సందేశాలు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షల సందేశం పంపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రత్యక్ష ప్రసారంలోకి వచ్చి మాట్లాడారు. సతీమణితో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను పూర్తిగా వీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి మాజీ ఛైర్మన్‌ ఎ.చక్రపాణి, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి సందేశ వీడియోలు పంపారు. అనంతరం సమాఖ్య సలహా సంఘం సభ్యులు ప్రసంగించారు. కరోనా కష్టకాలంలో వలస కూలీలకు రాజస్థాన్, తమిళనాడు కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని తెలుగువాళ్లు అందించిన సాయం, ఇతర సేవల గురించి నలభై నిమిషాలు మాట్లాడారు. మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 3.30 నుంచి కవి సమ్మేళనం జరిగాయి. సమాఖ్య పశ్చిమ భారత అధ్యక్షురాలు రవీనా చవాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సినీ నటులు తనికెళ్ల భరణి, సాయికుమార్‌ తెలుగు భాష గొప్పదనం గురించి చక్కగా మాట్లాడారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దీర్ఘాసి విజయభాస్కర్, తెలుగు రక్షణ వేదిక వ్యవస్థాపకులు పొట్లూరి హరికృష్ణ తదితరులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. కవితలు చదివి వినిపించారు. మేము అనుకున్న దాని కన్నా సభలు చాలా బాగా జరిగాయి. 
ఆన్‌లైన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా సాధ్యమయ్యాయి?
మా అభ్యర్థన మేరకు కళాకారులు తమ ఇళ్ల వద్ద నుంచే ప్రత్యక్ష ప్రసారంలో పదీ పదిహేను నిమిషాల చొప్పున ప్రదర్శనలు ఇచ్చారు. అమెరికా నుంచి లావణ్య ఈమని శాస్త్రీయ సంగీతం వినిపించారు. నెల్లూరు వాసి ఎస్‌.కె.నదియా కూచిపూడి శైలిలో నటరాజ నాట్యహేల ప్రదర్శించారు. కళాకృష్ణ పేరిణి శివతాండవం, గుమ్మడి గోపాలకృష్ణ పాండవోద్యోగ విజయాలు పద్యాలు, వంగపండు ప్రసాదరావు జానపద గీతాలు, ఉప్పులూరి సుబ్బరాయ శర్మ ఏకపాత్రాభినయం, ‘హాస్యబ్రహ్మ’ శంకర నారాయణ చతురోక్తులు, జి.వి.ఎస్‌.రాజు, జితేందర్‌ల మిమిక్రీ, నేమాని పార్థసారథి గీతాలాపనలు ఆద్యంతం అలరించాయి. మైసూరు దత్తపీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ ప్రవచనం చేశారు.
కవి సమ్మేళనం విశేషాలు?
‘కరోనా’ అంశంగా కవి సమ్మేళనాన్ని ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి, రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. తుర్లపాటి రాజేశ్వరి సమన్వయం చేశారు. దేశవిదేశాల నుంచి 350 మంది కవులు పేర్లు నమోదు చేసుకున్నారు. సమయాభావం వల్ల 35 మందే తమ కవితలు వినిపించారు. మిగిలిన వారి కోసం జులై 5న మరోసారి ఉదయం 10 గంటల నుంచి కవి సమ్మేళనాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించాం.
మీరు అధ్యక్షులైన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు?
2019 నవంబరులో ఈ బాధ్యతలు తీసుకున్నాను. అంతకు ముందు సమన్వయకర్తని. వ్యవస్థాపక సభ్యుణ్ని కూడా. అధ్యక్షుణ్ని అయ్యాక తమిళనాడులో తెలుగు విద్యార్థుల సమస్యల మీద తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని కలిసి వినతిపత్రం అందించాం. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ని కలిసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందించేలా చూడాలని కోరాం. ఒడిశా, పశ్చిమబంగ, తమిళనాడుల్లో తెలుగు ఉపాధ్యాయుల కొరత గురించి కూడా చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు బీఈడీ చేసిన వారిని ఇతర రాష్ట్రాల్లో ఉపాధ్యాయులుగా నియమించేలా చర్యలు తీసుకోవాలని, మా సమాఖ్య సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు వీలైనంత ఆర్థిక సాయం చెయ్యాలని కోరాం. 
పాఠ్యపుస్తకాల విషయంలో ఇబ్బంది ఉందా?
ఇతర రాష్ట్రాల్లోని తెలుగు పాఠశాలలకి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ఇన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు ఇస్తూ వస్తోంది. ఆంధ్రాలో ఆంగ్ల మాధ్యమం నిర్ణయం నేపథ్యంలో ఈ ఏడాదికి పాఠ్యపుస్తకాలు అందుతాయో లేదోనన్న సందిగ్ధత నెలకొంది. దాని గురించే గవర్నర్‌ని కలిశాం. పుస్తకాలు వస్తాయో లేదో స్పష్టంగా తెలియట్లేదు. రాజకీయ నేతలు, అధికారుల్ని కలవాలని ప్రయత్నిస్తే అవకాశం దొరకలేదు.    
మీరు ఖరగ్‌పూర్‌ ఎప్పుడు వెళ్లారు?
రైల్వే ఉద్యోగం నిమిత్తం 1965లో ఖరగ్‌పూర్‌ వచ్చాను. 45 ఏళ్లు ఇక్కడి రైల్వే ముద్రణాలయంలో సూపర్‌వైజర్‌గా పనిచేశాను. మా స్వస్థలం విశాఖ జిల్లాలోని రావికమతం. పుట్టి పెరిగింది, చదివింది విజయనగరం. 45 ఏళ్లు వచ్చే వరకూ విస్తృతంగా నాటకాల్లో నటించాను. తెలుగు రాష్ట్రాల్లో అన్ని నాటక పరిషత్తులు తిరిగాను. 2000 నుంచి పన్నెండేళ్ల పాటు అఖిలభారత నాటక పోటీల్ని ఖరగ్‌పూర్‌లో నిర్వహించాను. సినీ, నాటక ప్రముఖులు చాలా మందిని వాటికి ఆహ్వానించాను. ఇక్కడి ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్తుకి 1991లో కార్యదర్శిగా ఎన్నికయ్యాను. రైల్వే వాళ్లు ఇచ్చిన స్థలంలో దాతల నుంచి సేకరించిన రూ.25 లక్షలతో ఆడిటోరియం, కల్యాణమండపం నిర్మించాం. 2012 నుంచి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. సమాఖ్య ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పి.వి.పి.సి.ప్రసాద్‌ దీని ఏర్పాటు కోసం విపరీతంగా కష్టపడ్డారు. అన్ని రాష్ట్రాలూ తిరిగి అందరినీ కూడగట్టారు. 
ఖరగ్‌పూర్‌లో తెలుగువారు ఎక్కువే కదా?
ఒకప్పుడు ఇక్కడ 70 శాతం తెలుగువాళ్లే ఉండేవారు. ఉద్యోగాల్లో వారసత్వ నియామకాలు తగ్గాక చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయినా కోల్‌కతా, శ్రీరామ్‌పూర్, ఖరగ్‌పూర్, టిటాగర్‌ అన్నిచోట్లా తెలుగువాళ్లు వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు. పశ్చిమ బంగ మొత్తంగా నాలుగు లక్షల మందికి పైగా తెలుగువారుంటారు. ఇక్కడ 35 ప్రాథమిక, తొమ్మిది ఉన్నతస్థాయి తెలుగు పాఠశాలలున్నాయి. ఒక్క ఖరగ్‌పూర్‌లోనే మూడు తెలుగు హైస్కూళ్లున్నాయి. ఇవి తెలుగువారు స్వయంకృషితో ఏర్పాటు చేసుకున్నవి. ప్రభుత్వం జీతాలు తదితర సాయం చేస్తోంది. ఖరగ్‌పూర్‌లో ఎక్కడికెళ్లినా తెలుగుదనం కనిపిస్తుంది. ఇక్కడున్న నాలుగు బాలాజీ మందిరాల్లో ఏటా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గ్రామ దేవతల జాతరలు కూడా తెలుగువారు భారీ స్థాయిలో నిర్వహిస్తారు. 
బయటి రాష్ట్రాల్లో తెలుగు చదువుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది?
ఖరగ్‌పూర్‌లోని ఆంధ్రా హైస్కూల్లో ఒకప్పుడు పదిహేను వందల మంది విద్యార్థులు, 35 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రస్తుతం పిల్లల సంఖ్య అయిదారు వందలకి తగ్గింది. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్త వారిని ప్రభుత్వాలు నియమించట్లేదు. కర్ణాటక, ఒడిశాలోని పర్లాఖిముండి తదితర ప్రాంతాల్లో కూడా తెలుగువారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే, అక్కడి ప్రభుత్వాల సహకారం మనకి లభించడంలేదు. తమిళనాడులో కూడా ఇదే సమస్య. కానీ, హోసూరు, కృష్ణగిరి జిల్లాల వాళ్లు పట్టుబట్టి తెలుగు మాధ్యమాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. పశ్చిమబంగలో అలాంటి ఇబ్బంది లేదు. తెలుగు పాఠ్యపుస్తకాలు దొరికితే చాలు. ముంబయి తెలుగు పాఠశాలలకు అక్కడి ప్రభుత్వమే పుస్తకాలు ముద్రించి ఇస్తుండటం ఆనందదాయకం. దిల్లీలో ఉన్న తెలుగు పాఠశాలల్లో కూడా పెద్ద సంఖ్యలో మన పిల్లలు చదువుతున్నారు. ఇతర భాషల వాళ్లు కూడా ఇష్టంగా అక్కడ తెలుగు నేర్చుకుంటున్నారు. తెలుగు మాధ్యమంలోనే చదువుతాం, ఆంగ్లం కూడా నేర్చుకుంటాం అన్నది మా సమాఖ్య నినాదం. మాతృభాష మాధ్యమం వల్ల ఆంగ్లం రాదు అనే భావనని ప్రస్తుతం బలవంతంగా ప్రజల బుర్రల్లో కుక్కుతున్నారు. ఇది బాధాకరం.  
సమాఖ్య భవిష్యత్తు లక్ష్యాలు?
ఈ మహాసభల స్ఫూర్తితో ఇక మీదట పిల్లలకు తెలుగు గొప్పదనం తెలియజేసేలా ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహించాలనుకుంటున్నాం. బహుమతులు, ధ్రువపత్రాలు అందిస్తాం. సభ్యత్వాన్ని పెంచుకోవడంతోపాటు సాహిత్యం, సంస్కృతి మీద దృష్టి పెట్టి అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నాం. సమాఖ్యని రాబోయే రోజుల్లో ఇతర దేశాలకూ విస్తరిస్తాం. గతేడాది విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకి మూడు గంటలు వేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు భాష పరిరక్షణ మన ఇంటి నుంచే మొదలవ్వాలని మా తరఫున అందరితో ప్రమాణం చేయించడం మర్చిపోలేని అనుభూతి. 
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాఖ్య ఆశిస్తున్న సహకారం?
మాతృభాషలో విద్యాబోధన, తెలుగు భాష అభివృద్ధి కోసం రాష్ట్రేతర తెలుగు సమాఖ్య నిరంతరం కృషిచేస్తోంది. ఇందులో సఫలం కావాలంటే బయటి రాష్ట్రాల్లోని పిల్లలకు పాఠ్యపుస్తకాలు కావాలి. వాటిని అందజేయడానికి చొరవ తీసుకోవాలి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో మా కార్యకలాపాల నిర్వహణ కోసం వసతి ఏర్పాట్లకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రేతర తెలుగు వాళ్ల బాగోగులు చూసుకోవడానికి ఆంధ్ర, తెలంగాణల్లో ప్రత్యేక మంత్రిత్వ శాఖల ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అవి ఏర్పాటైతే చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.   
సమాఖ్య తరఫున నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాలు..?
రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకు 18 రాష్ట్రాల్లో 270 మంది సభ్యులున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ఆంధ్ర సంఘాలు, తెలుగు సంస్థలకూ సమాఖ్యలో సంస్థాగత సభ్యత్వం ఉంది. సమాఖ్య ఆధ్వర్యంలో ఏటా జాతీయ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఈసారి దీనికి ఒడిశాలోని పర్లాఖిముండి తెలుగు సంఘం ఆతిథ్యం ఇస్తోంది. కరోనా వల్ల సమ్మేళనం వాయిదా పడింది. వ్యాధిభయం తగ్గాక కచ్చితంగా నిర్వహిస్తాం. ఏటా నాటకోత్సవమూ ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి బర్హంపురంలో జరుగుతుంది. చివరిసారిగా చెన్నైలో నారాయణ తీర్థుల జయంతి ఉత్సవాలు జరిపాం. దీనికి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సినీ గాయని పి.సుశీల, నటి ప్రభ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి