తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

అమ్మభాషంటే అమ్మే

  • 173 Views
  • 2Likes
  • Like
  • Article Share

    స్వాతి కొరపాటి

  • హైదరాబాదు, swathi926chowdary@gmail.com

సుబ్బరాజు అంటే... మోటు మనిషి.
కత్తులు పట్టుకుని పరిగెత్తే రౌడీమూకకు నాయకుడు.
అది చలనచిత్రాల్లో!
మరి నిజజీవితంలో...
సుబ్బరాజు అంటే... వాల్మీకీ రామాయణాన్ని గుక్క తిప్పకుండా చెప్పగల వ్యక్తి. పద్యకావ్యాలంటే చెవి కోసుకునే సాహిత్యాభిమాని. అంతేనా... శ్రీశ్రీ ‘మహాప్రస్థానా’న్ని అర్థం చేసుకుంటూ విశ్వనాథ ‘రామాయణ కల్పవృక్షం’ కింద సేదతీరే పుస్తక ప్రేమికుడు. ఈ ఆరడుగుల ఆజానుబాహువుకి అమ్మభాషంటే అమితమైన అభిమానం. సుబ్బరాజుతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖీ...


తె.వె.: తెలుగు గురించి రెండు వాక్యాల్లో చెప్పమంటే...?
సుబ్బరాజు: అమ్మ గురించి చెప్పమంటే ఎంత మధురంగా ఉంటుందో తెలుగు గురించి చెప్పాలన్నా అంతే గొప్ప భావన. మాటలకందని తీయదనం తెలుగు పలుకుల్లో ఉంది.
తెలుగులో ప్రత్యేకంగా, గొప్పగా అనిపించే అంశాలేంటి?
అవధానం. ఇతర భాషల్లో లేనిది, తెలుగు భాషలో ప్రత్యేకంగా కనిపించేది ఇదే. మా అన్నయ్య తిరుపతిలో ఆచార్య కోర్సు చదివేటప్పుడు శతావధానం చూసేందుకు వెళ్లేవాణ్ని. నిజంగా అది అద్భుతమైన ప్రక్రియ. వంద మంది పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలు విన్న అవధాని అదే క్రమంలో వంద సమాధానాలూ తడుముకోకుండా చెప్పడం నిజంగా గొప్ప విషయమే కదా! ఇది ఏ ఇతర భాషల్లో ఉందో చెప్పండి?
మీ నాన్నగారు తెలుగు మాస్టారు కదా. చిన్నప్పుడు ఇంట్లో ప్రత్యేకంగా తెలుగు నేర్పేవారా?
ఆయన తెలుగు వ్యాకరణం గురించి ఏ రోజూ ప్రత్యేకంగా బోధించ లేదు. తెలుగు నేర్చుకోవడం వల్ల కలిగే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం గురించి తరచూ చెప్పేవారు. పుస్తకాలను చదివితే వచ్చే ప్రయోజనాలను చెప్పేవారు. దీనికి ప్రత్యేకించి సందర్భం లేకపోయినా నిరంతరం తెలుగు గురించి చర్చ మాత్రం ఇంట్లో ఎప్పుడూ నడుస్తూనే ఉండేది.
మీరు పుస్తకాలు చదువుతారా? ఎలాంటి రచనలంటే ఇష్టం?
మా ఇల్లే ఓ పెద్ద గ్రంథాలయం. సుమారు పదివేల పుస్తకాలు ఉండేవి. ఇంట్లో నాన్న, అన్నయ్య, పెద్దనాన్న అంతా తెలుగు భాషాభిమానులే కాబట్టి తెలుగు భాషా చర్చలు, పుస్తకాల సమీక్షలు వంటివి ఎప్పుడూ సాగుతూ ఉండేవి. పెదనాన్న వెంకట్రాజు ‘ఆత్మవిద్య’ అనే పుస్తకమూ రాశారు. దాంతో నాకూ సహజంగానే పుస్తకాలపై ఇష్టం పెరిగింది. నేను చిన్నప్పుడు ఇష్టపడి చదివింది శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’. తరువాత విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’, ‘రామాయణ కల్పవృక్షం’. యండమూరి వీరేంద్రనాథ్‌ రచనలు ఇష్టం. పద్యకావ్యాలు, కథలంటే మరీ ఇష్టం. వాల్మీకి రామాయణమంతా కంఠోపాఠమే. బాగా నచ్చిన రచన అయితే యండమూరి ‘గేయం’. అందులోని నాయికలా నాకూ ఓ స్నేహితురాలు ఉంటే ఎంత బాగుంటుందో అనుకునే వాణ్ని. గుర్రం జాషువా పద్యాలు, కవితల పోటీల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ని కూడా. 
మహాప్రస్థానం, రామాయణ కల్పవృక్షం... ఈ రెండు విభిన్న దృక్పథాలకు ప్రతిబింబాలు కదా. ఈ రెండింటిపై మీరు ఇష్టం ఎలా పెంచుకున్నారు?
మీరన్నట్లు ఈరెండింటి దృక్పథాలు వేర్వేరు. ఇవే కాదు నేను రంగనాయకమ్మగారి విషవృక్షమూ చదివా. విషయం ఏమిటంటే.... నేను చదివింది వాటిలోని మంచి చెడులను విశ్లేషించేందుకు కాదు. నేను సమాజాన్ని ఏ మాత్రం అర్థం చేసుకోగలనో అవగాహన తెచ్చుకునేందుకు. ఒక వస్తువు అందరికీ ఒకేలా కనిపించదు. పుస్తకాలూ అంతే. నిజానికి ఇవి విభిన్న దృక్పథాలకు చెందినవే అయినా నేను ఈ మూడు రచనల్నీ బాగా ఇష్టపడతా.
పద్య పఠనం వల్ల కలిగే లాభం ఏమిటి?
పద్యాలు తెలుగు భాష సొగసుని తెలియజేస్తాయి. భాషపై పట్టు తెచ్చుకోవడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఒకప్పుడు చదువులో ఇది భాగం, అయితే ఇప్పుడు పద్యాలు నేర్పేవారు కరవయ్యారు.
ఎలాంటి కథలంటే ఇష్టం?
అన్ని కథలూ చదువుతా. అందరు రచయితలవీ చదువుతా. మొదట్నుంచి చివరి వరకూ ఆసక్తిని రేకెత్తించే యండమూరి కథలంటే ఇష్టం. ‘గేయం’ నాకెంతో ఇష్టమైన నవల. కాలేజీ సమయంలో నేనది చదివినప్పటికీ ఇప్పటికీ దానిలోని ఓ అమ్మాయి పాత్ర నాకు అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుంది. 
జాషువా పద్యాల పోటీలో పాల్గొనే వాణ్ని అన్నారు కదా? జాషువా అంటే ప్రత్యేక అభిమానమా?
చిన్నప్పుడు నాన్నే గుర్రం జాషువా పద్యాల పోటీల్లో పాల్గొనమని ప్రోత్సహించారు. పోటీల కోసం జాషువా పద్యాలను నేర్చుకునేవాణ్ని. 
పుస్తకానికి మీరిచ్చే నిర్వచనం?
నేస్తం.
మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో పుస్తకం ఎంతవరకు సాయపడుతుంది?
జీవితం కొన్ని అనుభవాలను నేర్పుతుంది. అలాంటి అనుభవాలను కొంతమంది పుస్తకాల రూపంలో అందరికీ అందిస్తుంటారు. పుస్తకంలో జీవితపు విలువలు నేర్చుకున్న వాడికి నేర్చుకున్నంత.
మీకు బాగా నచ్చిన సినీ సంభాషణ? 
అత్తారింటికి దారేదీ చిత్రంలోని ‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు’ అనేది బాగా నచ్చింది. నిజంగానే ఎక్కడ ఏ మాటలు వాడాలో త్రివిక్రమ్‌  శ్రీనివాస్‌కు తెలుసు.
సినీ రచయితల్లో ఎవరి శైలి అంటే ఇష్టం?
భారవి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ముఖ్యంగా సిరివెన్నెల ‘మనసంతా నువ్వే’లో ‘కిటకిట తలుపులు తెరిచిన’ పాట రాశారాయన. దాంట్లో చరణాలు (కంటతడి నాడు నేడు చెంపతడి నిండే చూడు/ చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా) మనసుకు హత్తుకుంటాయి. ఆంగ్ల పదాల రీమిక్సులు కాదు ఇలాంటి అర్థవంతమైన పాటలు ఎన్నో ఉన్నాయి మనకు.
ఇటీవల వచ్చిన చిత్రాల్లో ‘తెలుగు’ పరంగా మీకు బాగా నచ్చిన చిత్రమేంటి?
ఇటీవల అని చెప్పలేను కానీ, ‘శశిరేఖా పరిణయం’లోని అచ్చ తెలుగింటి వాతావరణం బాగా నచ్చింది.
అమ్మభాష, సొంత సంస్కృతులను ఉపయోగించుకుంటూ చక్కటి చిత్రాలను తీయడంలో ముందున్న వారెవరు?
కచ్చితంగా తమిళులు, మలయాళీలే. నేను ఇటీవల ‘సౌండ్‌ తోమా’ అనే మలయాళీ చిత్రం చేశా. ఆ సమయంలో నేను సంభాషణలను సరిగ్గా ఉచ్చరించలేకపోతే... అది పలికే వరకూ నాతో సాధన చేయించారు. అదీ వారి భాషాభిమానం.
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సంభాషణల నుంచి పాటల వరకూ ఆంగ్లమే కనిపిస్తుంది. యువతరం ఇష్టపడుతుంది కాబట్టే అలా చేస్తున్నామంటున్నారు రచయితలు, దర్శకులు. అచ్చతెలుగు సినిమా చూపిస్తే విజయాలు దక్కవా?
పుష్పక విమానం ఎలా విజయం సాధించిందన్నది మీ ప్రశ్నకు జవాబు. 
ప్రస్తుతం తెలుగు పరిస్థితి ఎలా ఉంది...?
నిజం చెప్పాలంటే గత కొన్నేళ్ల కంటే ఇప్పుడే బాగుంది. ఎందుకంటే తెలుగు భాషాభిమానుల్లో చైతన్యం పెరిగింది. దీనికోసం ప్రత్యేకించి తెలుగు భాషోద్ధరణకు  వేదికలు ఏర్పడుతున్నాయి. అంతర్జాలంలో కూడా తెలుగు వాడకం పెరిగిందనేది నా భావన.
తెలుగుని యువతరానికి దగ్గర చేయాలంటే...
కశాశాలలు, పాఠశాలలే కాదు ముందు తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలోనూ మార్పురావాలి. మాతృభాష వస్తేనే ఇతర భాషల్లో పట్టు లభిస్తుందనే విషయాన్ని సైద్ధాంతికంగా ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి కూడా. అమ్మభాషలోని మాధుర్యాన్ని పిల్లలకు రుచి చూపించగలిగితే వారూ దాన్ని విడిచిపెట్టరని నా నమ్మకం.
మీ చిన్నతనంలో పండుగల వేళ ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది? 
భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంది. రుతువులు, ఆయా కాలాల్ని బట్టి వాటికా ప్రత్యేకత వచ్చింది. సంక్రాంతి సమయంలో బంధుమిత్రులతో ఇల్లంతా సందడిగా ఉంటే... కొమ్మదాసర్లు, బుడగ జంగాలు వంటి వారంతా ఊరంతా సందడి చేసేవారు. ఇప్పుడు అదేమీ లేదు. పండుగంటే ఓ సెలవు. వీలైతే ఆరోజు టీవీలో వచ్చే కార్యక్రమాలు చూసి ఆనందించడం. పండుగంటే కోడిపందాలు మాత్రమే అనుకునేవారూ లేకపోలేదు.
ఇప్పటి విద్యావ్యవస్థ ఎలా ఉంది? 
విద్యావ్యవస్థ గురించి మాట్లాడే కంటే ఆ వ్యవస్థను, విలువలను దూరం చేసిన చదువుల్ని కోరుకుంటున్న తల్లిదండ్రుల గురించే మాట్లాడుకోవాలి. వారి ఆలోచనా దృక్పథం మారినప్పుడే దానిలోనూ మార్పులు వస్తాయి. ఇంట్లోనూ తల్లిదండ్రులు విలువలను బోధించినప్పుడే ఇంటా, బయటా చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలకు చక్కటి విలువలు వంటపడతాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి