తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

విజ్ఞాన బోధనకు మాతృభాషే మంచిది

  • 97 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కొత్తపల్లి దొరబాబు

  • అమలాపురం
  • 8008574163

తెలుగు వెలుగు: విజ్ఞానాన్ని సామాన్యప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాతృభాష ప్రాధాన్యం ఏంటి?
శర్మ: కేవలం శాస్త్ర విజ్ఞానమే కాదు, ఏ విషయమైనా సరే మాతృభాష ద్వారానే అందరికీ అందుతుంది. బుర్రకథలు, కథలు, పాటల ద్వారా చెబితే ఎలాంటి పాఠ్యాంశాన్నైనా మనసులో నాటుకునేలా సామాన్యులకు సైతం ఆసక్తికరంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకైతే ఆంగ్లంలో చెప్పినా మాతృభాషలో వివరిస్తే ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. విద్యార్థిలో వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు పెంపొందేలా సిలబస్‌ ఉండాలి. తెలుగు వాచకంలో పిల్లల్లో సృజనాత్మకతను మేల్కొలిపే విజ్ఞానశాస్త్ర పాఠం ఉండాలి. భవిష్యత్‌లో తమజీవితంలో ఉపయోగపడేలా ఉండే పాఠాలను పుస్తకాల్లో రూపొందించాలి. విద్యార్ధికి లక్ష్యం, లక్ష్యసాధన, కాన్సెప్టు ఉండేలా పాఠాలను తయారు చేయాలి. 
పుస్తకాల్లో విజ్ఞాన శాస్త్ర పరంగా పరభాషపదాలు ఎక్కువగా, సంక్లిష్టంగా ఉంటున్నాయి. దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయా..?
1971నుంచి తెలుగు అకాడమి పుస్తకాలను రూపొందిస్తోంది. అప్పట్లో కొంతమంది మేధావులు శాస్త్రరంగంలోని అనేక ఆంగ్ల పదాలకు తెలుగు పదాలను రూపొందించారు. ప్రస్తుతం వాడుకలో ఉన్నవి అప్పుడు రూపొందించినవే. విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం బోధనేకాదు, వీలైనన్ని ఎక్కువ అంశాలను ప్రయోగాత్మకంగా చేసిచూపించడం. అయితే ఏ అంశమైనా సరే పిల్లలకు అర్థమయ్యేలా ఉంటూ, వారి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఉండాలన్నది నా అభిప్రాయం. ఇక కష్టమైన ఆంగ్లపదాల విషయానికి వస్తే... మంచి నిఘంటువు తయారు చేయవచ్చు. అయితే దీనికి రెండు సమస్యలు ఉన్నాయి. ఏ పుస్తకమైనా సరే ఎంతో కృషి చేస్తేకాని తయారవదు- ముఖ్యంగా నిఘంటువు విషయంలో, రెండోది ఏంటంటే అది విస్త్రృతంగా ప్రజల్లోకి వెళ్లాలి. ఇక నిఘంటువును ఎంత బాగా రూపొందించినా ఎక్కడో అక్కడ తప్పులు దొర్లుతాయి. ఇవన్నీ చేయడం ఒక్కరివల్ల అయ్యేపనికాదు. ప్రభుత్వం తనవంతు చేయూత అందిస్తేనే ఇది సాధ్యం.
విద్యార్థుల్లో శాస్త్రీయ భావాలు పెంపొందించేందుకు ఏం చేస్తే బాగుంటుంది?
పిల్లలకు శాస్త్రీయ దృక్పథం చిన్నప్పటినుంచే అలవాటు చేయాలి. విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు చేసే అవకాశం చిన్నతనం నుంచే పిల్లలకు కల్పించాలి. ఇలా చేయడంవల్ల ప్రయోగాలు చేసిన అనుభవం వారికి జీవిత కాలం గుర్తుంటుంది. తాము కూడా స్వతంత్రంగా ప్రయోగాలు రూపొందించగలమనే ఆత్మవిశ్వాసం వారిలో నెలకొంటుంది. ఉదాహరణకు ఒక సభలో ఓ ప్రయోగం చేసి చూపించాను. ఒక బీకరు నీటిలో విద్యార్థులతో అగ్గిపుల్లలు వేయించాను. అవి క్షితిజ సమాంతరంగా నీటి మీద పైకి తేలాయి. నేను కూడా ఓ అగ్గి పుల్లను ఆ బీకరులో వేశాను. అది నిటారుగా తేలింది. విద్యార్థులు ఆశ్చర్యంగా చూశారు. అలా ఎందుకు తేలిందని వారంతా ఆసక్తిగా అడిగారు. నేను వేసిన అగ్గిపుల్ల అడుగున గుండుసూది గుచ్చాను. ఫలితంగా అగ్గిపుల్ల గరిమనాభి కిందకి దిగింది. దానివల్లే అలా నిటారుగా తేలిందని వివరించాను. అది తెలియగానే పిల్లల ఆశ్చర్యాన్ని, సంభ్రమాన్ని చూడాలి. అందులో శాస్త్రీయత తెలియకపోతే అది  మాయో మంత్రమో అనుకుంటారు. అందుకే ఉపాధ్యాయులు తమ ప్రయోగాత్మక బోధనతో విద్యార్థుల్లో నిద్రాణంగా ఉన్న ఆసక్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని వెలికితీసే ప్రయత్నం చేయాలి.
శాస్త్రీయ వైఖరిని పెంపొందించేందుకు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం?
విజ్ఞాన శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థికి అందుబాటులో ఉండి, అంతగా ఖర్చు చేయాల్సిన పనిలేని, వీలైతే ఇంట్లో పనికిరాకుండా పడున్న వస్తువులతో కృత్యాలను చేయించగలిగేలా పాఠ్యాంశాలు ఉండాలి. విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం చదవడమే కాదు, ప్రయోగాలూ చేయాలి. ప్రయోగాలు చేయడం వల్ల విజ్ఞాన శాస్త్ర ప్రాథమిక సూత్రాలు విద్యార్థుల మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. పాఠాల్లో కృత్యాలు రాసి ఫలితాలు మీరే తెలుసుకోండని వదిలేయడంవల్ల తగినంత సమాచారం పిల్లలకు తెలియదు. ఎక్కువ విషయాన్ని పాఠ్యపుస్తకం ద్వారా అందించడం కష్టమవుతుంది. కనుక ఒక అంశాన్ని వివరించేందుకు ఒకటి లేదా రెండు కృత్యాలు తప్పనిసరిగా రాయాలి.
విజ్ఞాన శాస్త్ర భావనలు సులభంగా అర్థమయ్యేలా ఉండాలంటే ఏం చేయాలి?
పాఠ్య పుస్తకాల రచన కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను అనుసరించి చేస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన అనేక తరగతుల పాఠ్యపుస్తకాల రచయితగా, సంపాదకునిగా వ్యవహరించిన అనుభవంతో చెబుతున్నాను. ఉపాధ్యాయుడు నిత్యం విద్యార్థిలో నూతనత్వం పరిఢవిల్లేందుకు తన నైపుణ్యాన్ని వినియోగించాలి. సైన్సు పట్ల విద్యార్థులకు భయం లేకుండా సులువుగా అర్థ్ధమయ్యే రీతిలో కథలు, పాటలు, నాటికలు, సంగీతం, నాట్యం మొదలైన వాటిద్వారా చెప్పాలి. విశాఖపట్టణంలో 2004లో నిర్వహించిన కోనసీమ సైన్సు పరిషత్‌ సభల్లో నాకో వింత పరీక్ష ఎదురైంది. ఓ ఉపాధ్యాయుడు లేచి సాపేక్షతా సిద్ధాంతాన్ని కవితా రూపంలో చెబితే ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. అప్పుడు...
‘సాపేక్షతా..
గీత పక్కన రేఖ ఉంది
అందుకే గీత పొట్టి.. రేఖ పొడవు
రాత్రి పక్కన పగలు ఉంది
అందుకే రాత్రి చీకటి.. పగలు వెలుగు
మొత్తం అంతా పగలైతే..
వెలుగుకు విలువేమిటి?
చీకటికి దిగులేమిటి?’
అని చెప్పేసరికి సభలో అందరూ ఆశ్చర్యానందాల్ని వ్యక్తం చేశారు.
మన సంస్కృతీ సంప్రదాయాల్లో ఉన్న వైజ్ఞానిక అంశాలు ఇప్పుడు రూపుమాసిపోతున్నాయి. వీటిని బతికించుకోవడం ఎలా?
ఇళ్ల ముందు కళ్లాపి చల్లడం, మామిడాకుల తోరణాలు గుమ్మాలకు కట్టడం లాంటివి ఇప్పటికీ చాలామంది పాటిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిపై నేను విజ్ఞాన శాస్త్ర కోణం నుంచి ఆలోచించడం కానీ, దృష్టిపెట్టడం కానీ చేయలేదు. ప్రధానంగా ఎనిమిది నుంచి ఇరవై ఏళ్ల వయసు విద్యార్థులే లక్ష్యంగా నేను కృషి చేస్తున్నాను. వాళ్లు ఏ దిశలో విజ్ఞాన శాస్త్ర రంగంలో ముందుకెళ్లగలరో, ఆ దిశగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఏ విషయమైనా అందరూ ఒప్పుకుంటేనే దానికి శాస్త్రీయత. నేను కథల ద్వారా విద్యార్థులకు శాస్త్ర పాఠాలు చెబుతాను.
ఓసారి ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లాను. మాటల మధ్యలో వాళ్ల అబ్బాయి ‘‘అంకుల్‌.. బస్సులో వెళ్తుంటే చెట్లు వెనక్కి వెళ్తున్నట్లనిపిస్తుంది. మరి చంద్రుడేమో మనతో వస్తున్నట్లు ఉంటుందెందుకు?’’ అని అడిగాడు. బస్సుకు చెట్టుకు మధ్య ఉన్న దూరం తక్కువ అందువల్ల అవి వెనక్కి వెళ్తునట్లు కన్పిస్తాయి. అదే బస్సుకు చంద్రుడికి మధ్య దూరం చాలా ఎక్కువ. దాంతో చందమామ స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే మనవెంట వచ్చినట్లు అనిపిస్తుంది. చందమామకు బస్సుకు మధ్య ఉన్న దూరంతో బస్సు పోటీపడివెళ్తే చందమామ కూడా వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తుందని వివరించాను. శరీరంలో అవయవాలు జతలుగా ఎందుకుంటాయి?, సాపేక్షతా సిద్ధాంతాన్ని పద్యంలా చెప్పడం ఇలాంటివే. పిల్లల సందేహాలను హేతుబద్ధంగా నివృత్తి చేయాలి.
వ్యవసాయ విజ్ఞానాన్ని అన్నదాతలకు అందించేందుకు ఏం చేస్తున్నారు?
వ్యవసాయానికి సంబంధించి అందరికీ అర్థమయ్యేలా సులభశైలిలో ‘శాస్త్రీయ విజ్ఞానంతో వ్యవసాయం’ అనే పుస్తకం రాశాను. ఇంకా కోనసీమ సైన్సు పరిషత్‌ ఆధ్వర్యంలో రైతులకు అవగాహనా సదస్సులు నిర్వహించి, ఎన్నో మెలకువలను వివరించాం. సేంద్రియ ఎరువులను వాడే పద్ధతులు, వాటి ఉపయోగాలు తెలియజేశాం. రేడియోధార్మిక శక్తిని వాడుకొని వ్యవసాయం చేయడాన్ని న్యూక్లియర్‌ వ్యవసాయం అంటారు. ఈ విధానంలో పొలంలో మధ్యభాగంలో ఓ నిటారు స్తంభాన్ని నిర్మిస్తారు. దాని పై చివరన ఎల్‌- ఆకారపు ఇనుప బద్దెను బిగించి, ఒక కప్పీని అమరుస్తారు. కప్పీ నుంచి సీసపు దిమ్మె వేలాడుతూ ఉంటుంది. దీనిలో రేడియో ధార్మిక కాడ్మియం ఉంచుతారు. దీనినుంచి వెలువడే గామా కిరణాలు పంటలను ఆశించే చీడపీడలను నాశనం చేస్తాయి. ఈ విధానంవల్ల కాలుష్య సమస్య ఉండదు. అయితే రైతులు దీనిని చాలా జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. లేకపోతే రేడియో ధార్మికత సోకే ప్రమాదం ఉంటుంది.
భాషను బతికించుకోవడానికి, తెలుగులోకి చొరబడుతున్న ఆంగ్ల పదాల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం ఎలా?
చాలా పదాలకు ప్రామాణికమైన తెలుగు పదాలు ఇప్పటికే వాడుకలోకి వచ్చాయి. అయితే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పదాలు ఇంగ్లిష్‌లో వస్తున్నాయి. ప్రభుత్వం ఈ పదాలకు తెలుగు పదాల సృష్టికి నిపుణులను ఆహ్వానించాలి. కొంతవరకు ఈ కృషి జరిగింది. తెలుగు భాషమీది అభిమానంతో కొంతమంది స్వతంత్రంగా పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఎంతైనా ప్రభుత్వం ముద్రించిన పుస్తకంలోని పదాల్లా ఇతరులు రూపొందించిన పదాలు వాడుకలోకి రావు కదా! అందుకే ప్రభుత్వం ఈ పనిని కనీసం మూడు నాలుగేళ్లకొకసారి అయినా చేపట్టాలి. పాత పుస్తకం పునర్ముద్రించేటప్పుడు అందులో కొత్తవాటిని చేర్చాలి. అప్పుడేే ఆంగ్ల పదాల చొరబాటును సులువుగా నిరోధించగలం.


పాటలో పదార్థ ధర్మాలు
విజ్ఞానాన్ని కథలు, సంగీత నృత్య రూపకాల ద్వారా కూడా ప్రజలకు చేరువ చేయవచ్చు.
బంగారురంగు దుస్తులు ధరించిన ఓ అమ్మాయి ఇలా పాట పాడుతుంది.
ఈ సృష్టిలో నేను గొప్ప
అందరికీ నేనంటే ఇష్టం
నా కోసం ఆరాటం పడేవాళ్లు ఎందరో!
నేను లేకపోతే వీరంతా ఏమయ్యేవారో?

అంటూ నృత్యం చేస్తుంది. ఇంతలో తెల్లని దుస్తులు ధరించిన మరో అమ్మాయి నృత్యం చేస్తూ అక్కడకు వస్తుంది.
నువ్వు ఎవరివి? నీకెంత ధైర్యం?
ఏమనుకున్నావ్‌? ఏమనుకున్నావ్‌?

పోపో వెళ్లిపో.. అంటూ బంగారు వర్ణం దుస్తులు ధరించిన అమ్మాయి ఒక శూలంతో తెల్లని దుస్తులు ధరించిన అమ్మాయి మీదకు వస్తుంది.
ఎందుకు పోతాను? ఎలా పోతాను?
నీ గొప్ప నీది.. నా గొప్ప నాది
నా కోసం ఆరాట పడేవాళ్లు ఎందరో?
నువ్వూ గొప్పే.. నేనూ గొప్పే
గొప్పవాళ్లు కలిసి ఉంటే కలదు వారికి గౌరవం

అంటూ తెల్లని దుస్తులు ధరించిన అమ్మాయి నృత్యం చేస్తుంది. దీంతో రామ్మా కలుద్దాం.. కలిసి శాసిద్దాం అంటూ మొదటి అమ్మాయి ఆహ్వానిస్తుంది. అప్పుడు రాగి రంగు దుస్తులతో మరో అమ్మాయి వీరి వద్దకు నాట్యం చేస్తూ వస్తుంది.
నీచం... నీచం...
నీవెవరివి? నీ తాహతేమిటి?
మా సరసకు వస్తున్నావు?
ఇది గొప్పవారుండే ప్రాంతం..
పో.. పో.. నీ స్థాయి వారు ఉండే ప్రాంతానికి

అంటూ మొదటి ఇద్దరమ్మాయిలూ గేలి చేస్తున్నారు.
ఎందకమ్మా మీకంత కోపం
మీరు గొప్పైనా.. మీ బతుకులు మెతక
మీలో నేను చేరితేనే కదా మీకు గట్టిదనం
ఎందుకమ్మా నా మీద చిరాకు
అంటూ నృత్యం చేస్తుంది.
నిజం.. నిజం.. గొప్పవాళ్లకు
కావాలి నీలాంటి వారి సేవలు
ఉండమ్మా మాకు రక్షగా

అంటూ మొదటి ఇద్దరమ్మాయిలూ అంగీకరిస్తారు. వీరు ముగ్గురూ కలిసి ఉండగా నల్లరంగు దుస్తులు ధరించిన మరో అమ్మాయి వీరి వద్దకు రాబోతుంది.
ఛీ.. ఛీ అంటరాని దానివి.. ముట్టరానిదానివి!
మాతో నీకేంటి.. దూరం దూరం..
నీ చోటు వేరు.. పో పో అచ్చటకు పో

అంటూ వీరు ముగ్గురూ నల్ల దుస్తులు ధరించిన అమ్మాయి వద్దకు వెశ్తారు.
ఎందుకమ్మా మీకంత అసహనం..
నేను దహనం చెందితేనే కదా..
మీరు ఒకరితో మరొకరు కలవగల్గేది.
అప్పుడే కదా.. మిమ్మల్ని ప్రజలు ఇష్టపడేది?

అంటూ నల్లరంగు(బొగ్గు) తిరగబడుతుంది. ఇంతలో మరో ముగ్గురు బాలికలు అక్కడకు వస్తారు. నా పేరు ప్రోటాన్, నా పేరు ఎలక్ట్రాన్, నా పేరు న్యూట్రాన్‌.. మేం మీ ముగ్గురిలో ఉన్నాం.. కాకపోతే వేర్వేరు నిష్పత్తుల్లో ఉన్నాం..
మీలో మీకెందుకు హెచ్చు తగ్గులు?
మీలో ఉన్నది మేమే.. మరువకండి..
మనమంతా ఒక్కటిగా ఉందాం..
వద్దంటే వద్దు హెచ్చు తగ్గులు

అంటాయి. ఇలా వివిధ ప్రక్రియలను మేళవించి చెబితే పిల్లలకు విజ్ఞాన శాస్త్రం సులభంగా అర్థమవుతుంది.


విజ్ఞాన శాస్త్ర వారధి
ఎమ్మెస్సీ భౌతిక శాస్త్రంలో బంగారు పతకం అందుకున్న శర్మ తన పదహారో ఏటనుంచే రచనలు మొదలుపెట్టారు. 1958నుంచి ఇప్పటివరకు 100కథలు, వివిధ పుస్తకాలు, 8వేలకు పైగా విజ్ఞాన శాస్త్ర వ్యాసాలు, 20పాటలను రచించారు. వందలాది నాటికలు, రేడియో ప్రసంగాలు నిర్వహించారు. విజ్ఞాన శాస్త్రంలో ఈయన కృషికి ఎన్నో పురస్కారాలు లభించాయి. 1985లో ‘కొత్త శక్తిజనకాలు’ పుస్తకానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం పొందారు. కోనసీమ సైన్సు పరిషత్‌ను 1984లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో విజ్ఞాన శాస్త్రంలో కృషి చేస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా పురస్కారాలు ఇవ్వాలన్నది శర్మ సంకల్పం.
     విజ్ఞానాన్ని ప్రజలకు అందించాలన్న తపనే కోనసీమ సైన్స్‌ పరిషత్‌ స్థాపన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. విజ్ఞాన శాస్త్రాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి రైతులు, మహిళలు, విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. విద్యార్థుల కోసం వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహించింది. ప్రజల్లో మూఢ నమ్మకాలను పారదోలేందుకు కృషిచేసింది. మహిళలు, వృద్ధుల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పాటలు, కథలు, నృత్య రూపకాల ద్వారా మన జీవనానికి ఉపయోగపడే విజ్ఞాన శాస్త్రాన్ని పరిషత్‌ ప్రచారం చేస్తోంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి