తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

సాహిత్యాకాశంలో సగం

  • 187 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

ఆమె అక్షరాలను ప్రేమిస్తారు... పదాలుగా జతకట్టి ప్రయోగాలెన్నో చేస్తారు. అధ్యాపకురాలిగా తరగతిలో అనుభవాలను కావ్యాలుగా మలుస్తారు. భాషను బతికించుకోవాలనే ఆరాటం ఓ వైపు... జనాల్లో చైతన్యం తీసుకురావాలనే పోరాటం మరోవైపు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ... రచయిత్రిగా ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ... ఎన్నో రచనలు చేసిన ఆ రచయిత్రే కాత్యాయనీ విద్మహే. ‘సాహిత్యాకాశంలో సగం’ అనే పుస్తకానికిగానూ పురస్కారం అందుకున్న ఆమెతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖీ.
తె.వె. సాహిత్యాకాశంలో సగం గురించి నాలుగు విషయాలు...
అణచివేతకు గురవుతున్న స్త్రీలు పురుషులతోపాటు అన్ని హక్కులు, అవకాశాలు పొందదగిన వారే అని బలంగా ఉద్ఘాటించే క్రమంలో చైనా విప్లవ నాయకుడు మావో... ‘సగం ఆకాశాన్ని స్త్రీలు మోస్తున్నారు’ అన్నాడు. ఆకాశంలో సగం నీవు... అనంత కోటి నక్షత్రాల్లో సగం నీవు... అని స్త్రీని సంబోధించాడాయన. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల ఉద్యమాలు, స్త్రీవాదం ఆ మాటల్లోని సంపూర్ణశక్తిని తెలుసుకుని సొంతం చేసుకొన్నాయి. ఆకాశంలో సగం అన్నప్పుడు ఆ ఆకాశం సామాజిక ఆర్థిక, రాజకీయ రంగాలే కాక సాహిత్య సాంస్కృతిక రంగాలు కూడా అవుతాయి. సాహిత్య రంగంలోనూ స్త్రీలు ఉపాంతీకరణకు గురైన వాళ్లే. సాహిత్యాకాశంలోనూ సగం మహిళలు ఉంటారన్న స్పృహ కలిగించాలన్న ఉద్దేశంతో వేసిన వ్యాసాల సంకలనం ఇది. ఆధునిక స్త్రీల కవిత్వాన్ని, కథలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, విమల, మహజబీన్, శీలా సుభద్రాదేవి వంటి వాళ్ల కవిత్వ విమర్శ వ్యాసాలు, రంగనాయకమ్మ, సత్యవతి, నల్లూరి రుక్మిణి వంటి వాళ్ల కథల విశ్లేషణలు ఇందులో ఉన్నాయి. స్త్రీల సాహిత్యం ఎందుకు చదవాలో, చదవాల్సిన పద్ధతి ఏమిటో చర్చించిన వ్యాసాలు కూడా ఉన్నాయి. స్త్రీల అస్తిత్వ చైతన్యం ప్రతిఫలించే రచనలుగా వాటికి ఉన్న ప్రాధాన్యతను, ప్రయోజనాన్ని నిరూపించటం లక్ష్యం. 
రచయిత్రిగా మీ ప్రస్థానం, స్ఫూర్తి...
మా ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలే కనిపించేవి. అప్పట్లో వాటికి మించిన వినోద సాధనం మరొకటి లేదు. మొదటిసారి ఆరో తరగతి సెలవుల్లో ‘వేయిపడగలు’ చదివాను. అప్పట్నుంచి ఆసక్తి పెరిగింది. మా అమ్మ ఇందిరా దేవితో కలిసి దినపత్రికల్లో వచ్చే ధారావాహికలను బాగా చదివేదాన్ని. రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణి నవలలు వదలకుండా చదివేదాన్ని. నేను కూడా అలా రాయాలని కలలుకనేదాన్ని. ఒకసారి నాన్న ప్రోత్సాహంతో ఇండో పాక్‌ యుద్ధ నేపథ్యంలో ఓ కథ రాసి ‘తెలుగు విద్యార్థి’ పత్రికకు పంపాను. అది అచ్చుకావడంతో నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. అలా భాషకూ నాకూ అవినాభావ సంబంధం ఏర్పడింది. అందుకే తెలుగు ఎం.ఏ.లో చేరాను. పరిశోధనాంశంగా నవలను ఎంచుకున్నాను. వివిధ ప్రాంతాల పుస్తకాలు చదివాను. వాటిద్వారా దేశాలూ, కాలాలూ వేరయినా జీవితం హద్దులు లేని మహా ప్రవాహమని తెలుసుకున్నాను. మానవ సంబంధాలను శాసిస్తున్న... వర్గ, వర్ణ, లింగ, రాజకీయాల స్వరూప స్వభావాల గురించి అవగాహన పెరిగింది. అదే సమయంలో విశ్వనాథ వారి ‘గిరికుమారుని ప్రేమ గీతాలు’ అనే కావ్యం చదివి... నాన్న సాయంతో సాహిత్య విమర్శను మొదటిసారి రాయడం మొదలుపెట్టా. అందుకే నాకు సాహిత్యంలో తొలి గురువు నాన్న అని గర్వంగా చెప్పుకుంటాను. 
మీకు ఇష్టమైన సాహిత్య ప్రక్రియ... వ్యాసాలు కాకుండా మీ సాహితీ ప్రస్థానం...
నాకు ఇష్టమైన సాహిత్య ప్రక్రియ నవల. తరువాత కథ. బీఏ చదివేటప్పుడు స్నేహాలు, ఆదర్శాలు వస్తువుగా నవల ఒకటి రాసే ప్రయత్నం చేశాను. ఎం.ఏ. అయ్యాక వృత్తిపరంగా విమర్శలో అభిరుచి పెరిగి కథలు, నవలలు రాసే వైపు ఆలోచన పోలేదు. కానీ స్త్రీవాద సాహిత్య ఉద్యమం మాత్రం అమ్మ, అమ్మమ్మ, బామ్మల జీవితానుభవాలను, మౌన జీవన సంఘర్షణలను కథలుగానో, నవలలుగానో రాయమని ఒత్తిడి చేస్తోంది.
స్త్రీవాద సాహిత్యం ప్రభావం ఏంటి?
స్త్రీ వాద సాహిత్యం నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఒక ప్రభంజనం. గొప్ప వెలుగు. కొత్త వస్తువును, అభివ్యక్తి రీతులను ఇచ్చి తెలుగు సాహిత్యాన్ని విస్తృతీకరించింది. అంతకుమించి తెలుగు సమాజంలో స్త్రీ పురుష సమానత గురించి ఆలోచించగల నూతన ప్రజాస్వామిక సంస్కారాన్ని అంటుకట్టింది. స్త్రీలు తమను తాము తెలుసుకోవటానికి అది దారి దీపం అయింది. పురుషుల ఆత్మవిమర్శకు ప్రేరణ అయింది. స్త్రీవాద కవిత్వం జడ సమాజానికి షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తే స్త్రీవాద కథ ఆలోచన రేకెత్తించే రాజకీయ సాధనమైంది. రెండూ హృదయమున్న వాళ్లను కదిలించాయి. గొప్ప కుదుపునకు లోను చేశాయి. ఇవాళ అవి భిన్న సామాజిక వర్గాల స్త్రీల అనుభవాలతో, ఆందోళనలతో సమగ్రమూ, శక్తిమంతమూ అవుతున్నాయి. ఇక లక్ష్యం సంగతి... అది నిరంతర ఆంతరిక సంఘర్షణలతో, భిన్న బాహ్య పోరాట రూపాలతో సాధించవలసింది. దీర్ఘకాలికమైంది. స్త్రీవాద సాహిత్యం అందుకు కావాల్సిన భావజాలాన్ని సమర్థవంతంగా నిర్మించి వాతావరణాన్ని సిద్ధం చేసింది.
తెలుగులో రచయిత్రులపై పరిశోధన జరగాల్సి ఉందని మీరు అంటున్నారు. మీ ఆలోచనేంటి?
సాహిత్యంలో ఎందరో రచయితల గురించి సమగ్రమైన జీవిత వివరాలు తెలుస్తున్నాయి. వీరి గురించి తెలిసినంతగా రచయిత్రుల గురించి తెలియటం లేదు. ఎందరో మహిళలు రచనలు చేసినట్లు తెలిసినా వారి వివరాలు చరిత్రలోకి ఎక్కలేదు. నేను పత్రికలనుంచి 600 రచయిత్రుల పేర్లను, వారి రచనలు సేకరించాను. అయితే వారి జీవితాల గురించి సమగ్రమైన సమాచారం అలభ్యం.
ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక కోణంలో ఎలా చూడగలిగారు? 
ప్రాచీన సాహిత్యంలో స్త్రీ పాత్రల మనస్తత్వ విశ్లేషణ స్త్రీవాదం వచ్చిన తరువాతే మొదలైంది. ప్రాచీన సాహిత్యాన్ని మార్క్సిస్టు దృక్పథంతో వ్యాఖ్యానించగలిగినప్పుడు ఇదీ చేయొచ్చు అన్నదే దీనికి మూలం. ఇదెందుకు అంటే చరిత్రలో మరుగునపడ్డ మహిళల సమస్యల మూలాలు ఏమైనా తెలుస్తాయనే అన్వేషణ కోసం. ప్రాచీన సాహిత్యాన్ని చదివితే ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు ఎన్నో తెలుస్తాయి. ఉదాహరణకు ద్రౌపది పాత్ర. తనలో గూడు కట్టుకున్న బాధ వల్ల ఆమె కౌరవులతో సంధి కాకుండా యుద్ధాన్ని కోరుకునేలా చేసింది. 
      ఇక కథాకావ్యాల్లో అయితే స్త్రీవాదం పేర్కొన్న పునరుత్పత్తి హక్కుల లాంటి ఆధునిక భావాలూ కనిపిస్తాయి. 13వ శతాబ్దివాడైన మంచన రాసిన ‘కేయూర బాహు చరిత్ర’లో... భర్త భార్యను సమీప గ్రామంలో జాతరకు వెళ్లమంటాడు. దానికి ఆమె... ‘‘వెళ్తాను’’ సరే ఇల్లెవరు చూస్తారంటుంది. నేను చూసుకుంటానంటాడు. మరి నేను ‘‘నిండు చూలాలిని’’, దీని సంగతి... అంటే తాత్కాలికంగా నాకిచ్చి వెళ్లమంటాడు. జాతరలో స్వేచ్ఛగా గడిపిన ఆమెకు మళ్లీ ఇల్లు, గర్భం గుర్తుకువచ్చి, నేనెందుకు బాధపడాలి అనుకొని భర్త దగ్గరికి వెళ్లదు. ఈ కథను కొండేపూడి నిర్మల రాసిన ‘లేబర్‌ రూం’తో అన్వయిస్తేనే పునరుత్పత్తి హక్కుల మూలం తెలుస్తుంది. లైంగిక స్వేచ్ఛ, కుటుంబ కట్టుబాట్ల నుంచి విముక్తి, పాతివ్రత్యం లాంటి భావనలు నిరసించిన సంఘటనలు మనకు కథాకావ్యాల్లో కనిపిస్తాయి.
      ఇబ్బందుల విషయానికి వస్తే... ఇలాంటి ధోరణులను సంప్రదాయ సమాజం ఆమోదించదు. మొల్ల రామాయణంలో సీతా రాముల మధ్య మానవ సంబంధాలను విశ్లేషిస్తూ ఒక సభలో మాట్లాడుతుంటే... మీరు మాట్లాడేది సాహిత్య సంబంధం కాదు, సామాజిక శాస్త్రాంశంలా ఉందని వ్యతిరేకించారు. ఆ సభలో పాపినేని శివశంకర్, టి.నిర్మల, పద్మావతి ఈ ముగ్గురు మాత్రమే దన్నుగా నిలిచారు. ‘రసం- మహిళల అనుభూతి’ అనే వ్యాసంపై నిరసన వ్యక్తమైనా తిరుమల రామచంద్ర, చేకూరి రామారావు లాంటివారు సరైన ప్రయత్నం చేస్తున్నావంటూ మెచ్చుకోవడం మరచిపోలేనిది.
సాహిత్య విమర్శలో మీకు మార్గదర్శకంగా ఉండే సిద్ధాంతం ఏది?
మనోవైజ్ఞానిక విమర్శ పద్ధతిని ఉపయోగించి ‘చివరకు మిగిలేది’ నవలపై పరిశోధన చేశాను. మాలపల్లి నవలను, రావిశాస్త్రి బల్లచెక్క, శ్రీశ్రీ ఐశ్వర్యం ఎదుట దారిద్య్రం వంటి కథలను విశ్లేషించే క్రమంలో మార్క్సిస్ట్‌ విమర్శ పద్ధతి సాహిత్యాన్ని అయినా, దానికి ముడిసరకు అయిన జీవితాన్ని అయినా సందేహాలకు తావు లేకుండా మూలాల నుంచి అర్థం చేసుకోవటానికి ఉపకరిస్తుందని స్పష్టం అయింది. 90లలో స్త్రీవాద సిద్ధాంత అవగాహన దానికి తోడయింది.
తెలుగు చదివే వారి సంఖ్య తగ్గుతోదంటున్నారు...  
తెలుగు చదివే వారి సంఖ్య ఇప్పుడు కొత్తగా తగ్గుతున్నదేమీ లేదు. మన విద్యావ్యవస్థలో ఎప్పుడూ అది ద్వితీయ భాషే. బి.ఎ.లో తెలుగు మెయిన్‌ సబ్జెక్టుగా చదవటం, ఎం.ఏ. తెలుగు చెయ్యటం కొద్దిమందే... ఇప్పుడు జరుగుతున్నది విద్యాబోధన మాధ్యమం తెలుగు నుంచి పూర్తిగా ఇంగ్లిష్‌కి మారటం. ప్రాంతీయ భాషల అవసరం, ప్రయోజనం ఏమీ లేదన్న సామ్రాజ్యవాద భావ ప్రచారం పెరగటం. ఇదివరకు వృత్తి ఏదైనా సాహిత్యాభిలాష చాలామంది ప్రవృత్తిలో భాగంగా ఉండేది. ఇప్పుడు దానిని చంపేసే కుట్ర చాప కింద నీరులాగా జరుగుతుంది. తక్షణ లాభాల సంస్కృతి మాయ కమ్ముకుంటుంది. ఈ పరిస్థితుల్లో తెలుగు భాషకు భవిష్యత్తు లేనట్టే ప్రచారం జరుగుతుంటుంది. కానీ భయపడాల్సిందేమీ లేదు. ప్రజల వ్యవహారంలో తెలుగు సజీవంగా ఉంది. ప్రజల పక్షాన నిలబడిన రచయితల రచనల్లో అది ప్రతిఫలించి తీరుతుంది. ఈ క్రమంలోనే బాధ్యత కల రచయితలు తమ మాండలిక భాష, యాసల్లోని సహజ సౌందర్యాన్ని సాహిత్యంలో భాగం చేస్తారు. బుద్ధిజీవులు, విద్యావంతులు స్వప్రయోజనాలను, తక్షణ లాభాలను కాస్త పక్కకు పెట్టి జీవితాన్ని, మనుషులను, చరిత్రను తెలుసుకునేందుకు సాహిత్యాన్ని చదవటానికి కాస్త సమయం కేటాయించుకోవాలి. అమెరికా నుంచి నేర్చుకోనవసరం లేనివి నేర్చుకోవటంలో ఉత్సాహం చూపే తెలుగు వాళ్లు, పుస్తకాలు చదవడం అక్కడ బాల్యం నుంచే ఎట్లా అలవరుచుకుంటారో, అందుకు అనుగుణంగా పౌర గ్రంథాలయ వ్యవస్థ, విద్యావ్యవస్థ అక్కడ ఎలా పరిపోషితమవుతున్నాయో అర్థం చేసుకోగలిగితే తెలుగు భవిష్యత్తుకు కొంతైనా ప్రేరణ పొందవచ్చేమో!
యువతరానికి భాషను దగ్గర చేయాలంటే ఏం చేయాలి?
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాంతీయ భాషలు ప్రాముఖ్యతను కోల్పోతున్న గడ్డుకాలమిది. మార్కెట్‌ ప్రయోజనాల పరంగా ప్రాంతీయ భాషల ఉపయోగంలేదని చాలామంది అనుకొంటున్నారు. అందుకే తెలుగు సాహిత్య విద్యార్థులన్నా, అధ్యాపకులన్నా చిన్నచూపు. కానీ జీవితంతో దగ్గరి సంబంధం, సామాజిక పరిణామాలనూ, సంఘర్షణలనూ చూపగలిగిన శక్తీ సాహిత్యానికి ఉన్నాయని వాళ్లు విస్మరిస్తున్నారు. సాహిత్యాన్నీ, చరిత్రనూ ప్రయోజనాల దృష్ట్యా కాక విలువల పరంగా గుర్తించాలి. గౌరవించాలి. భాషా, సాహిత్య రంగాల్లో ఉన్నవారు అనుకున్న వెంటనే ఓ వస్తువును సృష్టించలేకపోవచ్చు. లాభాలను కళ్లకు చూపించలేకపోవచ్చు. కానీ అది జాతి జీవన సంస్కృతిలో భాగం. కాలాంతరాలకు విలువలను ప్రవహింప చేయగల సహజ సామాజిక మాధ్యమమని గుర్తించాలి. కౌలాలంపూర్‌లో జరిగిన ఓ సంఘటన నన్నెంతో ఆశ్చర్యానందాలకు గురిచేసింది. అక్కడి తెలుగు వాళ్లు అమ్మభాష మీద మమకారంతో పాఠశాలలను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు ఇంట్లో తెలుగు మాట్లాడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్జాలాన్నీ వాడుకుని  భాషను బతికించుకునేందుకు ఎంతో ఆరాటపడుతున్నారు. మనవాళ్లంతా గ్లోబల్‌ సంస్కృతిలో ఇంగ్లిష్‌ ఒక్కటే భాష అనుకుంటున్న వైఖరిలో మార్పు రావాలి. మన నుంచి మనం దూరమవుతున్నామనే స్పృహ ప్రతి ఒక్కరికీ కలగాలి. భాషను బతికించుకోవాలనే చైతన్యం నలుదిశలా విస్తరించాలి.

మీపై మీ నాన్నగారు రామకోటి శాస్త్రి గారి ప్రభావం?
మా నాన్న మాకు చిన్నప్పటి నుంచి చదువే జీవితమని, సాధనమని, శక్తి అని దానిపట్ల శ్రద్ధ ఉండాలని చెప్తుండేవారు. సులభంగా ఏదీ పొందలేమని చెప్తూ కష్టపడటాన్ని నేర్పించారు. స్వతంత్రంగా ఎదిగేందుకు వాతావరణాన్ని కల్పించారు. ఆయన అభిరుచులు నా మీద రుద్దే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. పరిస్థితులకు అనుగుణంగా తను మారుతూ ఇతరులు మారటానికి ప్రేరణ అయ్యారు. కొత్త తరాలను, వారి నూతన జీవిత దృక్పథాలను అర్థం చేసుకుంటూ అధ్యయనం చేసిన ప్రజాస్వామికవాది. నా మార్క్సిస్టు అధ్యయనాలకు ప్రేరణ ఇస్తూనే నాతో పాటు స్త్రీవాద సాహిత్యం, స్త్రీవాద సిద్ధాంతాలు అధ్యయనం చేస్తూ వచ్చారని నాన్న మరణానంతరం ఆయన నోట్సులు చూస్తే అర్థమైంది. అది ఆయన వ్యక్తిత్వం. అది నాకెప్పుడూ స్ఫూర్తిదాయకమే. మా నాన్న నిరంతరం ఏదో చదువుకుంటూనో, రాసుకుంటూనో ఉండేవాడు అది తప్ప ఆయనకు మరొక రాజకీయం లేదు. ఆ క్రమంలో పరిశోధన కేవలం వృత్తికాక ఆయన ప్రవృత్తి అయింది. అందువల్లనే అది ఉన్నత ప్రమాణాలను అందుకోగలిగింది. ఆసక్తి, ఆదర్శం, సత్యనిరూపణ, విలువల నిర్ధారణ వంటి ఉత్తమ లక్ష్యాలు కనుమరుగవుతూ తక్షణ అవసరాలు, ప్రయోజనాలు ప్రాధాన్యత వహించటం వర్తమాన దృశ్యం. సీరియస్‌గా, నిజాయితీగా పరిశోధనలు జరిగే అవకాశాలు తగ్గుతున్న మాట నిజమే అయినా సాహిత్యపు లోతులను, విలువలను విశ్లేషించి నిరూపించే సృజనాత్మక పరిశోధనలు, సమాజంలో ఖాళీలను పూరించే పరిశోధనలు పూర్తిగా లేకపోలేదు. అవి త్రిగుణం, బహుళం కావాలన్నది ఆకాంక్ష.
మీ వ్యక్తిగత జీవితం
పుట్టింది ప్రకాశం జిల్లా మైలవరం. మా నాన్న ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ అధ్యాపకుడిగా వరంగల్‌లో స్థిరపడటంతో నా బాల్యం, విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. నా జీవిత సహచరుడు డాక్టర్‌ వెంకటేశ్వర్లు. మాకొక అమ్మాయి.
తెలుగును భద్రంగా కాపాడుకోవాలంటే ప్రభుత్వం, ప్రసార మాధ్యమాలు ఎలాంటి పాత్ర పోషించాలి?
టీవీ ఛానల్స్‌ మీదైతే ఏమాత్రం నమ్మకం లేదు. వాటికి వ్యాపార దృక్పథం, రేటింగ్‌ను పెంచుకోవడంపైనే ఆసక్తి. యాంకర్ల భాష గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లాభాపేక్ష లేకుండా ఎవరైనా ఛానళ్లలో తెలుగుకు పెద్దపీట వేస్తే వాళ్లకు నా వందనాలు. అధికార భాషా సంఘం ఉన్నా అధికార భాషగా తెలుగు అమలు అంతంత మాత్రమే. న్యాయమూర్తులు తీర్పులు తెలుగులోనే ఇవ్వాలి. సెలవు ఉత్తరాల మొదలుకొని వివిధ దరఖాస్తుల వరకూ అన్నింటికీ తెలుగు నమూనాలు తయారు చేయాలి. రాష్ట్రం అంతటా ఒకేలా ఉండాలి. వీటిని అందరి చేత అభ్యాసం చేయించాలి. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాలను ఆంగ్లంలోనే నిర్వహిస్తున్నారు. పాక్షికంగానైనా తెలుగులో ప్రారంభిస్తే కొంతకాలం తరువాత అదే ఊపందుకుంటుంది. ప్రభుత్వ కార్యకలాపాలు కేవలం ఏవో కొన్ని దినోత్సవాలకే పరిమితం కాకూడదు. తెలుగు మన జీవితాల్లో భాగం కావాలి. 
మాతృభాషపై విద్యార్థుల్లో సానుకూల దృక్పథం ప్రోది చేయాలంటే ?
మీరు ఇది చేయగలరని నమ్మించగలిగితే ఎవరైనా నమ్ముతారు. అధ్యాపకులు బోధన పట్ల గౌరవం, అంకితభావం కనబరిస్తేనేే విద్యార్థుల్లో సానుకూల దృక్పథం కల్పించగలం. ఎం.ఏ. తెలుగు చేస్తే మీకు ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పగలిగితే కొందరన్నా దాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. దేనిపట్లైనా అభిరుచి కలిగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంత తొందరగా, సులభంగా న్యాయం చేయలేం. నేను విద్యార్థులకు తెలుగుపై అభిరుచి కలిగించేందుకు హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీలో ప్రతి శుక్రవారం ‘వారం వారం తెలుగు సమరం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాను. ఇందులో విద్యార్థులను వారు చూసిన సినిమాను విశ్లేషించమనడం, ప్రాచీనకవుల గురించి చెప్పమనడం లేదా చదివిన పుస్తకాన్ని విశ్లేషించమనేదాన్ని. వాళ్లు చాలా బాగా స్పందించారు. పాల్గొనడానికి ఎంతో ఉత్సుకత చూపేవారు. తరువాత ఎంతో మంది మేం లెక్చరర్‌ ఉద్యోగం సాధించాం... ఏపీపీఎస్సీలో ర్యాంకు తెచ్చుకున్నాం అని చెబితే ఎంతో గర్వంగా ఉంటుంది. అందుకే అధ్యాపకులే తమ వృత్తిలో లీనమై పనిచేయాలి. అప్పుడే తెలుగుకు గౌరవం దక్కుతుంది. 
మీ భవిష్యత్‌ ప్రణాళికలు
స్త్రీల సాహిత్యంపై పరిశోధనలు విస్తరించటం. అలాంటి పరిశోధనలు శ్రద్ధతో చేయగల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం. మరీ ముఖ్యంగా స్త్రీల సాహిత్య చరిత్ర రాయటం.
సాహిత్య అకాడమీ పురస్కారం నలుగురు మహిళలకే వచ్చింది...
‘సాహిత్యాకాశంలో సగ’మే దీనికి సమాధానం. ఇప్పుడు దీనికి పురస్కారం వచ్చింది కనుక అందరూ దీనిని గుర్తిస్తారు. భవిష్యత్తులో సగం మహిళలదే. ఆ చైతన్యం రావాలి. అదే నా ఆకాంక్ష.


నాలుగు దశాబ్దాల ప్రస్థానం
ముప్ఫై ఎనిమిదేళ్లలో మూడొందల సాహిత్య విమర్శ వ్యాసాలు రాశారు. అధ్యాపకురాలిగా ఎదురైన అనుభవాలే నేను విజయవంతంగా రచనలు చేయడానికి దోహదం చేశాయంటారావిడ. రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక మండలి.. ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించి రచనలు చేస్తున్నందుకు రంగవల్లి స్మారక మహిళా విశిష్ట పురస్కారం లభించింది. సామాజిక రంగంలో అధ్యయన, అధ్యాపక రంగాల్లోనూ స్త్రీ సమస్యలపై పని చేస్తూ, పరిశోధనలు కొనసాగించడానికి 1982లో ‘స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ’ను స్థాపించారు. గృహహింస బాధితుల పక్షాన నిలిచి న్యాయ పోరాటాలెన్నో చేశారు. మారుమూల ప్రాంతాల్లో వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్న వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడం, మహిళల సమస్యలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి