తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగు భాషే ‘పల్లవి' ంచి...

  • 139 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కె.ఆదినారాయణమూర్తి

  • బెంగళూరు
  • 9972513029

అటు చూస్తే ఇటు చూస్తే ఎవరూ 
చిరునవ్వూ, చేయూతా ఇవ్వక - 
మురికితనం కరుకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే - 

ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో తన ఇరవయ్యో ఏట హైదరాబాదులో అడుగుపెట్టిందా అమ్మాయి. ప్రోత్సాహం లేదు సరికదా... అవహేళన ఎదురైంది. కారణం... తన నేపథ్యం! 
నిప్పులు చిమ్ముకుంటూ 
నింగికి నే నెగిరిపోతే 
నిబిడాశ్చర్యంతో వీరు - 
నెత్తురు క్రక్కుకుంటూ 
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే... 

      ఆ అమ్మాయి బెదిరిపోలేదు. పట్టుదలతో సివిల్స్‌కు సిద్ధమైంది. రెండో ప్రయత్నంలో గెలిచింది. నిరుత్సాహపరచిన వాళ్లే పొగడ్తల వర్షం కురిపించారు. అయినా... ఆ ఆమ్మాయిలో అసంతృప్తి. లక్ష్యాన్ని పూర్తిగా సాధించలేదు. దాంతో అందివచ్చిన అవకాశాన్ని వదిలేసింది. మళ్లీ పరీక్షకు సన్నద్ధమైంది. ఫలితం తిరగబడింది. పొగిడిన వాళ్లు మళ్లీ రాళ్లేశారు. 
నేనుసైతం 
భువన భవనపు 
బావుటానై పైకి లేస్తాను!

      గెలిచినప్పుడు పొగిడి... ఓడినప్పుడు తెగిడే వారి గురించి ఆలోచించడం మానేసిందా అమ్మాయి. చెదరని ఆత్మవిశ్వాసంతో నాలుగోసారి ‘సివిల్స్‌’ తలుపు  తట్టింది. అంతిమ లక్ష్యాన్ని అవలీలగా అందుకుంది. 
      మరోమాట... అన్నింటి కంటే ముఖ్యమైన మాట... తెలుగు మాధ్యమంలో సాధారణ డిగ్రీ విద్యార్థిని అయిన ఆ అమ్మాయి - తెలుగులో పరీక్ష రాసి ఐఏఎస్‌ సాధించిన తొలి మహిళ. అప్పటికా అమ్మాయి వయసు 27 ఏళ్లు మాత్రమే!
      తెలుగు చదివితే భవిష్యత్తు లేదనే వాళ్ల నోళ్లను మూయిస్తూ... ‘తెలుగు’ విద్యార్థుల ప్రతిభను జాతీయస్థాయిలో చాటుతూ... మాతృభాషాబ్జపు తెల్లరేకై పల్లవించిన ఆ అతివ... ఆకురాతి పల్లవి. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గ విద్యుత్‌ సరఫరా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌. మనసు మొద్దుబారినప్పుడల్లా శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చదివి ‘ముందడుగు’ వేస్తాననే పల్లవితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి... 
తె.వె.: ఐఏఎస్‌ సాధించాలన్న ఆలోచన ఎప్పుడు మొగ్గతొడిగింది? 
పల్లవి: మా స్వస్థలం కృష్ణా జిల్లా విజయవాడ. నాన్న ఆకురాతి కోదండరామయ్య కశాశాల ఉపన్యాసకులుగా ఉంటూ గ్రూప్‌-1 ఉత్తీర్ణులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖలో సంచాలకులుగా పని చేశారు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు ఆయనకు ఆదిలాబాద్‌ జిల్లాలో ఉద్యోగం. అప్పట్లో ఒకసారి అక్కడి కలెక్టర్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి కొందరు గ్రామీణులు వచ్చారు. వాళ్లు కలెక్టర్‌ను కలిసి మాట్లాడేటప్పుడు నాన్నతో పాటు నేనూ అక్కడే ఉన్నా. ఇంటికి వచ్చిన తర్వాత, వాళ్లెందుకు కృతజ్ఞతలు చెప్పారని నాన్నను అడిగా. పొలాలకు కలెక్టర్‌ సాగునీటి సదుపాయం కల్పించడమే కారణమన్నారు నాన్న. ‘ఐఏఎస్‌’ పాసయితే ఇలా అందరికీ సేవ చేసే అవకాశం వస్తుందని చెప్పారు. ఆ మాట నా మనసులో బాగా నాటుకు పోయింది. బడిలో చదివేటప్పుడే, పెద్దయిన తర్వాత కలెక్టరవుతానని చెప్పేదాన్ని. కానీ, సివిల్స్‌ సాధించడానికి ఎంత శ్రమించాలో అప్పట్లో నాకు తెలియదు. తర్వాత అనుభవంలోకి వచ్చింది. 
విజయం సాధనలో మీ అనుభవాలు...
తెలుగు మాధ్యమంలో బీఏ చదివి 2001లో పట్టభద్రురాలినయ్యా. డిగ్రీ మొదటి ఏడాది దూర విద్య విధానంలో, తర్వాతి రెండేళ్లు విశాఖ ఏవీఎన్‌ కశాశాలలో చదివా. సివిల్స్‌ శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు ఎన్నో చేదు అనుభవాలు. తెలుగు మాధ్యమం నుంచి వచ్చానని తెలిసి చాలా చులకనగా చూశారు. సివిల్స్‌ ఆంగ్లంలో రాయాలి... నువ్వు రాయలేవు... ఏపీపీఎస్సీ పరీక్షలనైతే తెలుగులో రాసుకోవచ్చు... వాటికి ప్రయత్నించు అని కొందరు సలహాలిచ్చారు. నాలో పట్టుదల పెరిగింది. నేను దేనికి తగనన్నారో... దాన్ని సాధించి, నా సామర్థ్యాన్ని నిరూపించాలనుకున్నా. ఇదే విషయాన్ని నాన్నకు చెప్పా. ‘నీకు డాక్టరేట్‌ లేదు... ఇంజనీరింగ్‌ పట్టా కూడా లేదు... వట్టి బీఏతో ఎందుకింత పట్టుదల’ అన్నారు నాన్న. ఊహా లోకాల్లో విహరించకూడదని హితబోధ చేశారు. ఐఏఎస్‌ రాకపోతే భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. ‘ఈనాడు’ పత్రికలో విలేఖరిగా చేరి పేదలకు సేవ చేస్తానని బదులిచ్చా. లక్ష్యంపై స్పష్టత ఉండటంతో నాన్న నా మాట కాదనలేకపోయారు. 
ఆ తర్వాత ఎలా సహకరించారు?
ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత గ్రూప్‌ ఒన్‌కు కట్టి గెలిచారు నాన్న. ఆ ‘కష్టమే’ నాకు మార్గదర్శి. నేను పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు మంచి స్నేహితుడిలా సహకరించారాయన. అమ్మ బోగేశ్వరి గృహిణి. ఇంటర్మీడియట్‌ చదువుతున్నపుడు తండ్రిని (మా తాత గారిని) కోల్పోయింది. అప్పుడే పెళ్లి కూడా అయింది. అయినా, బిఏ పూర్తి చేసి ఎంఏకూ కట్టింది. ఆమే నాకు పెద్ద స్ఫూర్తి. ఆడవాళ్లు పిల్లల్ని కనే యంత్రాలుగా మాత్రమే మిగిలిపోకూడదని అమ్మ ఎప్పుడూ చెప్పేది. మనలో ఉన్న ప్రతిభను సమాజ వికాసానికి వినియోగించాలన్నది తన సిద్ధాంతం. ఆ ఆలోచనే నన్ను నడిపించింది. 
తెలుగులో సివిల్స్‌ రాయడానికి కారణం?
నాన్న గాంధేయ వాది. అందుకే, పిల్లలను మాతృభాషా మాధ్యమంలోనే చదివించారు. నేను ప్రభుత్వ, ప్రభుత్వ సాయంతో నడిచే బళ్లలోనే చదివాను. చిన్నప్పటి నుంచే నాకు తెలుగుపై పట్టు ఎక్కువ. ఆరో తరగతిలోనే కవితలు రాసేదాన్ని. అయితే... హైదరాబాద్‌ వెళ్లినప్పుడు చెవినబడ్డ మాటల ప్రభావంతో సివిల్స్‌ను ఆంగ్లంలో రాయాలనుకున్నా. కానీ, నాకు ఆ భాష అసలు రాదు. హిందూ పత్రికలో చిన్న పేరా చదివి అర్థం చేసుకోవటానికి మూడు, నాలుగు గంటలు పట్టేది. వ్యాకరణ దోషాల్లేకుండా ఒక ఆంగ్ల వాక్యం కూడా రాయలేకపోయే దాన్ని. అందుకే, రెండేళ్ల పాటు ఆంగ్ల నైపుణ్యాన్ని పెంచుకోవడానికి శ్రమించా. తర్వాత పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఐచ్ఛికాంశంగా తీసుకుని సివిల్స్‌కు చదవడం ప్రారంభించా. అయితే, పరీక్ష గెలవగలనన్న ఆత్మవిశ్వాసం మాత్రం కలగలేదు. ఇలా అయితే కష్టం అనుకుంటున్న సమయంలో, 2003లో అనుకుంటా... భానుప్రకాశ్‌రెడ్డి తెలుగులోనే సివిల్స్‌ రాసి నెగ్గారన్న సంగతి తెలిసింది. ఆంగ్లం వస్తేనే సివిల్స్‌ ఉత్తీర్ణులవుతారనే వారి మాటలు తప్పని అర్థమైంది. అప్పుడే ఆంగ్లాన్ని వదిలేశా.
పరీక్షకు ఎలా సిద్ధమయ్యారు?
తెలుగు మాధ్యమంలో పరీక్ష రాయాలని నిర్ణయించుకున్న తర్వాత నా ఐచ్ఛికాంశాన్ని చరిత్రకు మార్చుకున్నా. రోమిల్లా థాపర్, బిపిన్‌చంద్ర, సతీశ్‌చంద్ర వంటి వారు రాసిన ఆంగ్ల పుస్తకాలను చదువుతూ... రోజుకు 15 - 16 గంటలు శ్రమించి వాటిని తెలుగులోకి అనువదించుకునే దాన్ని. యూపీఎస్సీ పాఠ్యాంశాల ప్రకారం సుమారు 240 రిజిస్టర్లు, సొంత నోట్సును ‘తెలుగు’లో సిద్ధం చేసుకున్నా. 2004లో మొదటి సారిగా పరీక్ష రాశా. కానీ, మౌఖిక పరీక్షలకు ఎంపిక కాలేకపోయా. కారణం.. జనరల్‌ స్టడీస్‌లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అప్పటికి నాకు కంప్యూటర్‌తో ఎక్కువ పరిచయం లేదు. అంతర్జాలాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల వెనుకపడ్డాననిపించింది. ఆ లోపాన్ని సరిదిద్దుకుంటూ జనరల్‌ స్టడీస్‌ను బాగా అధ్యయనం చేశా. 2006లో రెండో సారి పరీక్ష రాశా. అఖిల భారత స్థాయిలో 101 ర్యాంకు వచ్చింది. ఆదాయపు పన్ను విభాగానికి ఎంపికయ్యాను. చిన్న వయసులోనే ఎంపికయ్యావు... నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ టాక్సెస్‌కు చేరుకుంటావని అందరూ అభినందించారు.
మరి ఐఏఎస్‌ ఎలా అయ్యారు?
ఆదాయపు పన్ను శాఖాధికారులకు శ్రీమంతులతోనే పని. కనుచూపు మేరలో పేదలు కనిపించరు. అందుకే, నాకు దాంతో సంతృప్తి కలగలేదు. ఉద్యోగంలో చేరనని నాన్నకు చెప్పా. ఆయన బాధపడ్డారు. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా, చేరిపో అని పోరుపెట్టారు. దాన్ని భరించలేక నాగపూరులోని డైరెక్ట్‌ టాక్సెస్‌ అకాడమీలో శిక్షణకు వెళ్లా. వారం రోజుల పాటు ఉన్నానక్కడ. కానీ, పాఠాలేవీ బుర్రలోకి వెళ్లలేదు. దాంతో అకాడమీ డైరెక్టర్‌ను కలిశా. ఐఏఎస్‌ కోసం ప్రయత్నించాలనుకుంటున్నా. ఇంటికి వెళ్లిపోతానని చెప్పా. ఆయన అంగీకరించారు. ఏడాది పాటు అసాధారణ సెలవు ఇచ్చారు. దాన్ని వల్ల జీతం రాదు, సీనియారిటీ పోతుంది. అయినా సరే, వచ్చేశా. గట్టిగా చదివి మూడో సారి పరీక్ష రాశా. రాతపరీక్షలో గతంలో కంటే వంద మార్కులు ఎక్కువగా వచ్చాయి. ముఖాముఖీ అప్పుడు సర్వీస్‌ ఐచ్ఛికాల్లో ‘ఐఏఎస్‌’ను మాత్రమే ఎంచుకున్నా. ఇంటర్వ్యూ బోర్డుకు అధిపతి ఫారిన్‌ సర్వీస్‌కు చెందిన మహిళ. ఫారిన్‌ సర్వీస్‌ను ఎంచుకోలేదెందుకని అడిగారావిడ. అప్పుడు నా సమాధానం అంత పరిణతితో లేదు. అందువల్లే నాకు ముఖాముఖీలో 300కు 136 మార్కులే వచ్చాయి. ఫలితంగా ర్యాంకు 101 నుంచి 194కు పడిపోయింది. శ్రీశ్రీ ‘ఆ..’ (నిప్పులు చిమ్ముకుంటు...) అప్పుడే అనుభవంలోకి వచ్చింది. అందరూ రకరకాల విమర్శలు చేశారు. పెళ్లి చేయమని అమ్మానాన్నలకు సలహాలిచ్చారు. కానీ, నా సిద్ధాంతం ఒకటే. మనల్ని మనం ఒక ఆశయానికి సంపూర్ణంగా అంకితం చేసుకుంటే పంచభూతాలు కూడా సహకరిస్తాయి. దాన్ని నమ్మి చివరి ప్రయత్నంగా 2008లో పరీక్ష రాశా. దేవుడి ఆశీస్సులతో 55వ ర్యాంకు వచ్చింది. తెలుగు మాధ్యమంలో రాసి జనరల్‌ కేటగిరీలో ఐఏఎస్‌ అయిన తొలి మహిళగా గుర్తింపూ లభించింది.
పేదలకు సేవ చేయాలన్న కోరిక తీరుతోందా?
కర్ణాటకలో పోస్టింగ్‌ వచ్చాక చిక్కమగళూరు జిల్లా సకలేశ్‌పుర సబ్‌ కలెక్టర్‌గా పని చేశా. అక్కడ పేద ప్రజల పొలాలకు వెళ్లే దారుల్ని కొందరు భూస్వాములు, రాజకీయ నాయకులు కబ్జా చేసేవారు. పేదలు తమ భూముల్ని అయినకాడికి అమ్ముకునే పరిస్థితిని కల్పించే వారు. దీన్ని గుర్తించి ఆక్రమణలను తొలగింపజేశా. నాకు బదిలీ అయినప్పుడు స్థానిక పేద మహిళలు వచ్చి కలిశారు. కబ్జాలను అరికట్టి తమ బతుకులను నిలబెట్టారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యోగంలో చేరినందుకు సార్థకత చేకూరిందనిపించింది. గుల్బర్గ జిల్లా పంచాయతీ సీఈవోగా కూడా చేశా. ఇక్కడా నాకు చేతనైనంత సేవ చేయగలిగాననే తృప్తి ఉంది. ప్రస్తుతం నిర్వర్తిస్తున్న బాధ్యతలు భిన్నమైనవి. వినియోగదారుల సంతృప్తి, సిబ్బంది సంక్షేమాలపై దృష్టిపెట్టి పని చేస్తున్నా. ఇక్కడ సామాజిక సేవ, వ్యాపారం రెండూ చేయాలి. వాటి మధ్య సమతూకం సాధించడానికి ప్రయత్నిస్తున్నా. 
తెలుగుపై అభిమానం తగ్గుతోంది కదా... 
విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తొలిసారిగా తెలుగును విన్నపుడు ఇది భాషా, పాటా అని ప్రశ్నించారు..తెలుగు ఉచ్చరణ అంత మధురంగా ఉంటుందన్న మాట. తమిళ సాహితీవేత్త సుబ్రమణ్య భారతి ‘సుందర తెలుంగు’ అని ప్రశంసించారు. అంత గొప్ప భాషపై మనకే గౌరవం లేకపోతే ఎలా? ఉద్యోగాల కోసం అమ్మభాషకు దూరమవడం సబబు కాదు. డిగ్రీ వరకూ తెలుగును ద్వితీయ భాషగానైనా చదవాలి. తల్లి పాల లాంటి అమ్మభాషను నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే.
తెలుగుపై నవతరానికి ఆసక్తి పెంచాలంటే?
ముఖ్యంగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. వాళ్లే పిల్లలకు తెలుగు గురించి చెప్పాలి. ప్రసార మాధ్యమాల్లో నేర, నేరపరిశోధన ధారావాహికలను ప్రసారం చేస్తున్నారు. అవి యువతను పెడదోవ పట్టించేలా ఉంటున్నాయి. వాటి స్థానంలో భాషకు సేవ చేసిన వారి గురించి ఎందుకు చెప్పకూడదు? నన్నయ, తిక్కన వంటి వారి పైనా, పింగళి సూరన కశా పూర్ణోదయం, పోతన భాగవతం వంటి గ్రంథాల ఆధారంగా ధారావాహికల్ని ఎందుకు తీయకూడదు? రోజు వారీ ప్రసార వ్యవధిలో కనీసం ఇరవై శాతం సమయాన్ని వీటికి కేటాయిస్తే యువతకు తెలుగుపై మమకారం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే కవిత్రయం అంటే ఎవరనే భయంకరమైన రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ దుస్థితిని నివారించేందుకు నేటి తరానికి మన సాహిత్యం గొప్పదనాన్ని తెలియజేయాలి. తమిళంలో 12వ శతాబ్దానికి చెందిన అవ్వయ్యార్‌ సూక్తుల్ని కార్టూను చిత్రాలుగా తీశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకటి, రెండో తరగతి పిల్లలైనా సరే వాటిని చూస్తే, వాటిలోని నీతిని చక్కగా గ్రహించగలరు. మన వేమన, సుమతి, కుమార శతకాల్ని కూడా ఈ రూపంలోకి మార్చాలి. వీటివల్ల చిన్నారులకు తెలుగు తెలుస్తుంది. విలువలూ అబ్బుతాయి.
కన్నడ నేలపై ఉంటున్నారు కదా... తెలుగుదనాన్ని ఎలా కాపాడుకుంటున్నారు?
ఇప్పటికీ కవితలు రాస్తుంటా. చిన్నప్పుడు విజయవాడ ఘంటసాల సంగీత సంస్థలో కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నా. సీడీలు, అంతర్జాలం ద్వారా ఇప్పుడు మరింత సాధన చేస్తున్నా. గుల్బర్గలో సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి. భ్రూణహత్యలకు వ్యతిరేకంగా వాటిలో నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నాం. దానికి నృత్య దర్శకత్వం వహిస్తున్నా. 
పని ఒత్తిడిని దూరం చేసుకోవడానికేం చేస్తారు?
నా కార్యాలయంలో, ఇంట్లో శ్రీశ్రీ మహాప్రస్థానం గేయ సంపుటి ఉంటుంది. విధి నిర్వహణలో నిరాశ నిస్పృహలకు గురైనప్పుడు దాన్నే చదువుతా. ఆ గేయాల స్ఫూర్తితో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటా. ఆ తర్వాత ఆత్మ ప్రబోధానుసారం నడుచుకుంటా. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి