తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

శిక్షణా లేదు... శిక్షా లేదు

  • 120 Views
  • 0Likes
  • Like
  • Article Share

    దండవేణి సతీష్‌

  • హైదరాబాదు
  • 8008112353

పాత్రకు తగిన ఆహార్యం... ఆహార్యానికి తగిన భాష... భాషకు తగిన భావం పలికిస్తూ కడుపుబ్బా నవ్వించగలరు. క్రూరత్వాన్ని కళ్లలో నింపుకుని భయపెట్టగలరు. సందర్భానుసారంగా సంభాషణలకు మాండలికాల మట్టివాసనలను అద్ది రక్తిగట్టించనూగలరు. నాటక రంగం నుంచి వచ్చి వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఆయనే కోట శ్రీనివాసరావు. తెలుగు మాటంటే కోటకు అమితమైన గౌరవం. చలనచిత్ర వేడుకల నుంచి సాధారణ సభల వరకూ ప్రతిచోటా అవకాశమొచ్చినప్పుడల్లా తెలుగు భాష ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. భాషాభిమానులను చైతన్యపరచడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి అమ్మభాషాభిమానితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖీ...


తె.వె: తెలుగు మాట్లాడటం నామోషీగా భావించే వారు పెరుగుతున్నారు...
కోట: మన తెలుగు చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే... దాని గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అంత కమ్మటి భాషను చేజేతులా భ్రష్టుపట్టించుకుంటున్నాం. అయిన దానికీ, కాని దానికీ ఆంగ్లం మాట్లాడుతున్నాం. బతుకుదెరువు కోసం పరాయిభాషను మాట్లాడటం తప్పు కాదు. కానీ, పరాయి భాషను మన భాషగా చేసుకోవడమే దౌర్భాగ్యం. బిడ్డ ఎదుగుదలకి అమ్మపాలు ఎంత అవసరమో... బిడ్డ మానసిక వికాసానికి అమ్మభాష అంత అవసరం. బాధాకరమైన విషయం ఏంటంటే, నవమాసాలు మోసి బిడ్డను కన్న తల్లే ‘అమ్మా’ అని పిలిపించుకోవడానికి ఇష్టపడట్లేదు. మమ్మీ అనిపించుకుంటోంది. తల్లే తెలుగులో పిలిపించుకోకపోతే... ఇక మన అమ్మభాషను ఎలా కాపాడుకుంటాం? తెలుగు పలుకులు తియ్యనివంటాం. కానీ మాట్లాడటానికి చేదుముఖం పెడతాం. ఎప్పుడు మారుతుందో ఈ పరిస్థితి!
తెలుగు ప్రత్యేకత ఏంటి? 
పిల్లలను నిద్రపుచ్చడానికి అమ్మలు జోలపాట పాడుతుంటారు. ఆ పాట పాడబోయే ముందు నాలుకతో ఓ శబ్దాన్ని ఆలపిస్తారు. ‘ఒలలలలలలలలలాయియియియియి’ అంటారు. ఆ లాయిలో ఎంత రమ్యత ఉంది! హాయిగా నిద్రపోరా కన్నా... లేవడానికి తొందరపడకు! జీవితం హాయిగా లేదురా... తొందరపడకుండా నిద్రపోరా చిన్నా... అనే వాత్సల్యం ఉంది అందులో. ‘చందమామ రావే... జాబిల్లి రావే’ అంటాం. అదంతా అబద్ధం. అయినా దాంతోనే పిల్లల్ని జోలపుచ్చుతాం. కచ్చితంగా నిద్రపోతారు కాబట్టే అలా చేస్తాం. మన భాషలో ఉన్న వేదాంతమిది. తరచిచూడాలే గానీ తెలుగులో ఉన్న భావవ్యక్తీకరణలన్నీ మేలిమి బంగారాలే.
మాండలికాల ఉచ్చరణలో పట్టు ఎలా సాధించారు?
చాలామంది నాలాంటి వేషాలు వేశారు. నేను మాట్లాడిన భాష మాట్లాడారు. కానీ... కోట వేసిన వేషం, మాట్లాడిన భాష మాత్రమే ఎక్కువ మందికి గుర్తుంటాయి. ఎందుకంటే, మాతృకకి నా భాష, భావాలు దగ్గరగా ఉంటాయి. సరిగా మాట్లాడటం వల్ల వేషం పండుతుంది. సరైన విధంగా మాట్లాడటం వల్ల సరైన నటన వస్తుంది. ‘గణేష్‌’ చిత్రంలో ఓ సంభాషణ ఉంది... ‘తమ్మీ నాకైతే చార్మినార్‌కున్నంత చరిత్రుంది. డేట్‌ ఆఫ్‌ బర్త్‌ లేదు. ఓ కుప్పతొట్లో ముష్టోడికి దొరికిన్నంట. అప్పటి నుంచి ముష్టోళ్లతో ముష్టెత్తిన... కుప్పతొట్లో పన్న. చీచీ అన్లే. కుక్కలు కూడా పండవ్‌... ...అట్ల నన్ను కూడా ఇడిసేయరాదే’. ఈ సంభాషణల్లో వినోదం కూడా ఉంది. దాంతో ప్రేక్షకుల్లో కోపం రాలేదు. మాండలికాలను సరైన విధంగా పలికితే ఎవరికీ కోపమూ రాదు. నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం యాసలనూ అలాగే పలికాను కాబట్టే పాత్రలు పండాయి. తెలంగాణ మాండలికం కూడా చాలా చక్కటిది. ఇంగ్లం దేవుడు, అచ్చిండు, పోయిండు... ఇవన్నీ చాలా మంచి పదాలు. వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడంలోనే ఉంటుంది. నేను ఆ పదాలను సరిగా పట్టుకుని ఉచ్చరించాను కాబట్టే విజయవంతమయ్యాను. 
మీ దేహ భాష కూడా భిన్నంగా ఉంటుంది కదా?
‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నది నా నమ్మకం. ఏ భాషైనా, ఏ మాండలికమైనా గమనించడం, అన్వయించుకోవడం, నేర్చుకోవడం వల్లే నాకు తెలిశాయి. చలనచిత్రాల్లో నా ఆహార్యానికి తగిన భాషను మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటా. అదే ప్రేక్షకులను రంజింపజేస్తుంది. నిజజీవితంలో అందరిలాగే మాట్లాడతా. కానీ మాట్లాడే ప్రతి మాట... మనదనే విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడతా. ముఖ్యంగా నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించి మాట్లాడతా. వ్యక్తులను పరిశీలిస్తాను కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సినిమాల్లో మనమే మాటలు రాసుకోవాలి... మాట్లాడాలి కాబట్టి, ఆచితూచి మాట్లాడుతుంటాను. అందుకే నా భాష, నా దేహభాష వేర్వేరుగా ఉంటాయి.
ఇన్నేళ్ల మీ చలనచిత్ర ప్రస్థానంలో భాషను వినియోగించడంలో మీరు గమనించిన మార్పులు? 
రోజులు గడుస్తున్న కొద్దీ తెలుగు రాష్ట్రంలో తెలుగుదŸనం పోయింది. మహానుభావుడు జంధ్యాల, కె.విశ్వనాథ్, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి... ఇలా ఎంతో మంది ఉన్నారు. వాళ్లంతా వినోద ప్రధానమైన సినిమాలు తీశారు. తీస్తున్నారు. కానీ ఎక్కడా భాషను కించపరచరు. కొత్తకొత్త ప్రయోగాలు చేస్తారు కానీ మాతృత్వాన్ని దెబ్బకొట్టరు. రేలంగి నర్సింహారావు, జంధ్యాల లాంటి వాళ్లు చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు ఎంత గొప్పవంటే... ఎవరైనా... ఏ వయసులో ఉన్నవారైనా... ఎక్కడైనా, ఎవరితోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెప్పుకోవచ్చు. అలాంటి ఆరోగ్య సంభాషణలుండేవి. ఇప్పుడు వస్తున్న హాస్యం ఏంటి? నాలుగు వంకర మాటలు మాట్లాడి... మూడు వెకిలి నవ్వులు నవ్వితే అదే హాస్యం! దాన్ని కొంతమందితో, కొన్నిచోట్ల, కొంత వరకే చెప్పుకోగలం. ఆడపిల్లలుంటే మాట్లాడుకోలేం. పెద్దవాళ్లుంటే చెప్పుకోలేం, పిల్లలుంటే అసలే చెప్పుకోలేం. కథానాయకుడు, కథానాయికలతో పాటు వాళ్ల చుట్టుపక్కల ఉండే పాత్రల సంభాషణల్లోనూ ద్వందార్థాలు ధ్వనిస్తున్నాయి. వాటిని అర్థం చేసుకునేదాన్ని బట్టి అర్థాలు మారుతున్నాయి. పాటల విషయానికి వస్తే... వేటూరి గారు లేరు! కొద్దోగొప్పో... ఒకరో ఇద్దరో కుర్రాళ్లు బాగానే రాస్తున్నారు. కానీ, ఎక్కువ శాతం ‘ఖాళీలను పూరించు... నీకిష్టమైన పదాలతో... నీకిష్టమైన భాషలో’.
ఆఖరికి తెలుగు చలనచిత్రాల పేర్లు కూడా తెలుగులో ఉండట్లేదు?
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది... ఎంత చక్కటి పేర్లండీ! ఆ సినిమాలు విజయవంతం కాలేదా? తెలుగు పేర్లు పెట్టినా సినిమాలు ఆడతాయి. తమిళుల్లా సినిమా పేర్లు తెలుగులో ఉండేలా దర్శకులు చూసుకోవడం మంచిది. అలా అని ఏదో ఒక పేరు పెడితే ప్రేక్షకులు రారు కదా. మనకు పేరు పెట్టేందుకు అమ్మానాన్న ఎంత ఆలోచిస్తారో... సినిమాలకు పేరు పెట్టేందుకు దర్శకులు కూడా అంతే ఆలోచిస్తారు. కానీ, ప్రస్తుత ధోరణికి తగ్గట్టుగా పొడిపొడి పదాలతో పేర్లు పెడుతున్నారు. అలా ఆంగ్ల పదాలు కూడా పేర్లుగా మారిపోతున్నాయి. రాన్రానూ ఇంకేం పేర్లు వస్తాయో! 
జంధ్యాలతో మీ అనుబంధం?
జంధ్యాల, సుబ్బరాయశర్మ, సుత్తి వీరభద్రరావు, నిర్మాత అశ్వినీదత్‌... వీళ్లంతా నా జూనియర్స్‌. ఒకే కళాశాలలో చదువుకునేవాళ్లం. నాటకాలు రాసేటప్పుడు జంధ్యాల పరిచయం అయ్యారు. భాష మీద మంచి పట్టున్న మనిషి ఆయన. అందువల్లే ఆయన హాస్యంలో మంచి మంచి పదాలు పడుతుంటాయి. ‘నాన్నా ఇదేనా రావడం? లేదురా... మొన్ననగా వచ్చి మెట్ల కింద దాక్కున్నా’ ఇదీ సంభాషణ. మామూలుగా చెబితే మామూలుగా నవ్వుతాం. కానీ, ఆ పదాలను చెప్పించడంలో జంధ్యాల విధానమే వేరు. ఉచ్ఛస్వరంలో వ్యంగ్యంగా చెప్పడంతో అది ఇప్పటికీ నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. ‘నాన్నా ఇదేనా రావడం? లేదు నాయనా... మొన్ననగా వచ్చీ... మెట్ల కింద దాక్కున్నా’ ఆ శ్రుతి అట్లా ఉంటుంది. 
‘ఏమండీ బాగున్నారా?
ఆ... లేదు... గవర్నమెంటు ఆస్పత్రిలో పడుకోబెట్టి... సెలైన్‌ ఎక్కించి... అయినోళ్లందరికీ టెలిగ్రామ్‌లిస్తున్నారు...
ఆంబోతులా ఎదురుగుండా కనబడుతుంటే... ఏమండీ బాగున్నారా? ఇదో ప్రశ్నా.’
ఈ భాషలో ఎక్కడా ఇబ్బంది ఉండదు. కానీ, వ్యంగ్యం ఎక్కువగా ఉంటుంది. దాంతో చక్కగా నవ్వుకుంటాం. ఇలాంటివి ఇప్పుడెక్కడ ఉన్నాయండీ! 
దాదాపు 20 ఏళ్లు నాటకరంగంలో ఉన్నారు. మీకు నచ్చిన నాటకమేంటి?
నా జీవితమే నాటకాలతో ప్రారంభమైంది. మా బడి వార్షికోత్సవం కోసం పినిశెట్టి శ్రీరాంమూర్తి గారు ‘ఆడది’ అనే నాటకం రాశారు. అందులో శతభిషం అనే వేషం వేశా. దాంతోనే నా నాటక జీవితం ఆరంభమైంది. ఉద్యోగం కోసం హైదరాబాదుకు వచ్చాక నాటకాలపై మరింత ఇష్టం పెరిగింది. బ్యాంకు ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేసేవాణ్ని. ఒక దశలో నాటకాల కోసం పదోన్నతినీ వదులుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఉద్యోగాన్ని విడిచి సినీరంగంలో స్థిరపడ్డా. చిన్నప్పటి నుంచి ఎన్ని నాటకాల్లో నటించినా... ‘మళ్లీ పాత పాటే’ అనే నాటకం నాకు చాలా ఇష్టం.
ప్రస్తుతం తెలుగు నాటక రంగం ఏ స్థితిలో ఉంది?
నాటకాలు వేసేవారు తక్కువయ్యారు. వేసినా చూసేవారు ఒక్కరో ఇద్దరో. అప్పుడప్పుడూ హైదరాబాదు రవీంద్రభారతి, లలితకళాతోరణం, కళాశాలలు, పాఠశాలల్లో పిల్లల చేత ఏవో నాటకాలు వేయిస్తున్నారు. కానీ, అవేవీ అప్పుడున్నంతగా ఉండట్లేదు. పైగా అవన్నీ ఆంగ్ల నాటకాలు. అచ్చమైన తెలుగు నాటకాల్లేవు. నాటకాల్లో వేసేవారంతా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏదో ఒక వేషం దొరక్కపోతుందా అంటూ నిర్మాతలు, దర్శకుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, వాళ్లలోని ప్రతిభను నిర్మాతలు, దర్శకులు గుర్తించట్లేదు. నాటక రంగాన్ని కాపాడాలంటే... మాటలు కాదు ఆచరణ కావాలి. ప్రభుత్వమూ నాటక సమాజాలను, నటులను గుర్తిస్తూ ప్రోత్సహిస్తే వాళ్ల కుటుంబాలు బాగుంటాయి. కొత్త తరాలు అందులో ప్రవేశిస్తాయి.
కొత్త తరాలకు తెలుగును అందించడం...
‘ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌స్టార్‌... హౌవ్‌ ఐ వండర్‌ వాట్‌ యూ ఆర్‌’ అని చదువుతుంటే... మా పిల్లలకు రైమ్స్‌ వచ్చేశాయని తల్లిదండ్రులు తెగ సంబరపడిపోతారు. కానీ దాంట్లో ఏమన్నా సామాజిక స్పృహ ఉందా? నీతి ఉందా? పిల్లలు తెలుసుకోవాల్సిన విజ్ఞానపరమైన విషయాలు ఉన్నాయా? అదే తెలుగు విషయానికొస్తే... సుమతీ శతకం ఉందనుకోండి. బతుకుదెరువు కోసం మనం నేర్చుకోవాల్సిన ఎన్నో మంచి విషయాలుంటాయి. నీతి బోధలుంటాయి. సులభంగా అర్థమవుతాయి.
‘అక్కరకు రాని చుట్టము
మొక్కిన వరమీయని వేల్పు
మోహరమున తానెక్కిన పారని గుర్రము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!’

మంచికి, చెడుకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. 
‘ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ!’

చుట్టుపక్కల ఉండే వారి గురించి తెలుసుకుని జాగ్రత్తగా బతకమని చెప్పే అక్షరాలివి. ఎవరు ఎప్పుడు ఏది నేర్చుకోవాలో అది నేర్పుతుంది మన భాష. ఏంతైనా ‘అమ్మ’భాష కదా. 
బతుకుదెరువు కోసం పెట్టిన భాష వేరు. జ్ఞానం సంపాదించుకోవడం కోసం ఉద్దేశించిన భాష వేరు. జ్ఞానమిచ్చేది మాతృభాషే. విద్య నేర్పేవాడు గురువు. జీవించడం నేర్పేది అమ్మ. ఎక్కడ కూర్చోవాలో, ఏం తినాలో.. ఎలా తినాలో తనే నేర్పుతుంది కదా. అలాగే, ఏ భాషను ఎందుకు ఉపయోగించాలో కూడా పిల్లలకు అమ్మే నేర్పాలి. 
ఆంగ్లం రాకపోతే భవిత లేదనుకుంటున్నారు కదా?
నా చిన్నతనంలో ఆంగ్లం రెండో భాషగా ఉత్తీర్ణులైనవారున్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లైన వారున్నారు. డాక్టర్‌ అచ్చమాంబ, సరోజినీదేవి, సరోజిని పుల్లారెడ్డి... వీళ్లంతా ఆంగ్లం బాగా చదువుకున్నారు. కానీ, తెలుగు బాగా మాట్లాడతారు. ఆంగ్లం నేర్చుకోవడం వల్ల వాళ్లు గొప్పవారు కాలేదు. తెలుగును మర్చిపోకపోవడం వల్ల గొప్పవాళ్లయ్యారు. మనల్ని పరిపాలించిన ఇందిరాగాంధీ, ప్రస్తుతం ఉన్న సుష్మాస్వరాజ్, షీలాదీక్షిత్, నన్నపనేని రాజకుమారి, పురందేశ్వరి... వీళ్లందరి కట్టూబొట్టులో భారతీయత కనిపిస్తుంది. మాతృభాష, సంస్కృతులను మర్చిపోకుండా ఉన్నవాళ్లంతా గొప్పవాళ్లవుతున్నారు. మిడిమిడి జ్ఞానంతో సొంతభాషను వదిలేసి పరాయిభాషను పట్టుకు వేలాడుతున్న వాళ్లంతా వ్యక్తిగతంగా నష్టపోతున్నారు. దేశంలో, రాష్ట్రంలో చాలా పెద్దపెద్ద ప్రైవేటు పాఠశాలలున్నాయి. ‘చదువు చారెడు... బలపాలు దోసెడన్నట్లు’ బోలెడంత ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఎల్‌కేజీ వాణ్ని చదివించాలన్నా లక్షల్లో ఖర్చు. ఎందుకండీ ఇదంతా అంటే ‘మా టీచర్లు వెల్‌ట్రైన్డ్‌’ అంటారు. వెల్‌ట్రైన్డ్‌ అంటే పీజీ విద్య. ఆ చదువు చదివిన వారు ఎవరికి పాఠాలు చెబుతున్నారు? ఎల్‌కేజీ పిల్లలకు. వీడు కేజీ... వాడు పీజీ. వాడు దిగి వీడి స్థాయికి తగిన పాఠం చెప్పలేడు. వీడి స్థాయికి వాడు ఇంకా ఎదగలేదు. ఏదో నాలుగు ఆంగ్లం ముక్కలు నేర్పించి వదిలేశామా అన్నట్లుగా ఉంది. 
మీ ఇంట్లో...?
చక్కగా తెలుగు మాట్లాడుకుంటాం. మా పెద్ద అమ్మాయి చక్కగా నాన్నగారూ అని పిలుస్తుంది. మనవళ్లు తాతయ్యా అంటూ ఫోన్లో పలకరిస్తారు. పెద్దోడు ఆరు, చిన్నోడు రెండో తరగతి చదువుతున్నారు. వాళ్లకిప్పుడే చదవడం వస్తోంది. రామాయణం, మహాభారతానికి సంబంధించిన చిన్నచిన్న కథలు చదువుతుంటారు. కానీ రాయడం ఆలస్యం అవుతోంది. మా ఇంట్లో మమ్మీ, డాడీ అంటే ఊరుకోను. పనివాళ్లను కూడా ఆంటీ వచ్చింది, అంకుల్‌ వచ్చాడు అంటే ఒప్పుకోను. అలా ఉండబట్టే... ఇవాళ మా పిల్లలు, మనవళ్లు చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు. అర్థం చేసుకుంటున్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాల విలువ నేటి తరానికి తెలిసేదెలా?
నేడు యూత్‌ అంటే పెద్ద బూత్‌ అయిపోయింది. ఎవరు ఏం మాట్లాడుతారో... ఎలా మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ స్థితిలో సంస్కృతి, సంప్రదాయాల గురించి చెబితే ఏం ఎక్కుతుంది? పరాయి భాషను, వ్యక్తుల కట్టుబొట్టును అనుకరిస్తున్నారు తప్ప మన సంస్కృతిని ఆచరించట్లేదు. నైసర్గికంగా మనకు ఉండే పరిస్థితులను బట్టి మన అలవాట్లు ఉండాలి. కానీ, ఆ పరిస్థితి ఎప్పుడో మారిపోయింది. భాష విషయంలోనూ అంతే. మనది కాని దానికి ఎప్పుడైతే ప్రయత్నించామో... అప్పడే మనదనేది పోతుంది. నేటి యువత పాడైపోవడానికి కారణం సాధన తక్కువ... వాదన ఎక్కువ. సాక్షాత్తు పోలీస్‌ కమిషనరే వచ్చి అంతా ఎడమ పక్కన నడవాలి అంటే... వెంటనే కుడి పక్కన నడిస్తే ఏమవుతుంది అంటాడొకడు. తప్పు చేయకుండా ఉండటానికి శిక్షణ లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష లేదు. ఇంకా దేశం ఎట్లా బాగుపడుతుంది? అన్నీ తెలిసే మనం నాశనం చేసుకుంటున్నాం. తెలిసిచేసే వాణ్ని ఎవడు బాగు చేస్తాడు. ఇదివరకు ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే వాళ్లం. ఇప్పుడు భాషతోపాటు జీవితం కూడా ‘లెస్‌’ అయిపోయింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి