తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

మంచి వచనం కావాలిప్పుడు

  • 81 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

ఖండాంతరాలలో తెలుగుకు గుర్తింపు తేవడానికి అలుపెరగకుండా కృషి చేస్తున్న వారిలో అగ్రగణ్యులు వెల్చేరు నారాయణరావు. విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయం దక్షిణాసియా అధ్యయన విభాగంలో అధ్యాపకుడిగా 1971లో అమెరికాలో అడుగుపెట్టారాయన. దాదాపు 40 ఏళ్ల పాటు అక్కడ తెలుగును బోధించారు. ఆచార్యులుగా పదవీ విరమణ చేసినా వివిధ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తూ విదేశీయులకు తెలుగును దగ్గర చేస్తున్నారు. మరోవైపు... కళాపూర్ణోదయం, బసవపురాణం, ప్రభావతీ ప్రద్యుమ్నం, క్రీడాభిరామం, క్షేత్రయ్య పదాలు, అన్నమయ్య కీర్తనలు, కన్యాశుల్కం, చాసో కథలు.... ఇలా ఎన్నో ఆపాతమధురాలను ఆంగ్లంలోకి అనువదించారు. తెలుగు సాహితీ పరిమళాలను పడమటి దేశాలకు పరిచయం చేశారు. భారతీయులకు చారిత్రక స్పృహ లేదన్న మాట తప్పని చెబుతూ పరిశోధనాత్మక రచనలు చేశారు.
భాషా బోధన నుంచి పరిశోధన వరకూ తెలుగు కోసం ఎంతో శ్రమిస్తూ కూడా... ‘నేను చేసే పని చిన్నది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. బతికుంటే ఇంకొంత చేస్తాన’నని చెప్పే నిగర్వి నారాయణరావు. నాలుగు దశాబ్దాల నుంచి అమెరికాలోనే ఉంటున్నా, తెలుగు వారితో మాట్లాడేటప్పుడు ఆయన నోటివెంట ఆంగ్ల పదాలు రావు. ఆంగ్ల యాస అసలు ధ్వనించదు. భాషాపరంగా నిండుకుండ లాంటి వెల్చేరు నారాయణరావుతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖీ...
తె.వె.: అమెరికాలో తెలుగు వాళ్లు గణనీయంగా ఉన్నారు కదా. మరి అమెరికన్లలో ఎంతమందికి ‘తెలుగు’ గురించి తెలుసు?
వెల్చేరు: అమెరికాలో తెలుగు బాగా ప్రచారంలో ఉందనుకోవద్దు. అక్కడ విశ్వవిద్యాలయాల్లో ఉండే కొద్దిమందికి మాత్రమే తెలుగు తెలుసు. ఇప్పటికీ నా భాష తెలుగు అంటే... దాన్ని ఎక్కడ, ఎవరు మాట్లాడతారని అడుగుతారు. అలా అని మనం చింతించక్కర్లేదు. అమెరికా గురించి మనకు ఎంత తక్కువ తెలుసో... వాళ్లకూ తెలుగు గురించి అంతే తెలుసు. 
అమెరికన్లలో తెలుగును నేర్చుకునేవారున్నారా?
విశ్వవిద్యాలయాల్లో సాంకేతిక, విజ్ఞానశాస్త్రాలను చదివే వాళ్లు... ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఇతర భాషలను నేర్చుకుంటారు. మన దేశ భాషల్లో సంస్కృతం, హిందీ, తమిళం, బెంగాలీలను ఎక్కువ మంది అభ్యసిస్తారు. అతి తక్కువ విశ్వవిద్యాలయాల్లో మాత్రమే తెలుగు బోధన అందుబాటులో ఉంది. తమిళనాడు ప్రభుత్వం తమ భాషకు విపరీతంగా మద్దతు ఇస్తుంది. అందుకే ఆ భాషను నేర్పేవారు, నేర్చుకునే వారు ఎక్కువగా ఉన్నారు. మన విషయానికొస్తే.... విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్య పీఠాన్ని నెలకొల్పడానికి అవసరమైన విరాళాన్ని కూడా అందించే వారు లేరు. 
తెలుగును చదివే విదేశీయుల సంఖ్య అందుకే తక్కువంటారా?
అవును. ఆ తక్కువ మందిలోనూ కొందరు మాత్రమే కొంచెం పై స్థాయికి వస్తారు. వాళ్లలో చాలా తక్కువ మంది తెలుగులోని సమాచారం ఆధారంగా పీహెచ్‌డీలు చేస్తారు. నా శిష్యుల్లో ఆముక్తమాల్యదపై పరిశోధన చేస్తున్న అమ్మాయి ఉన్నారు. ‘ఆముక్తమాల్యద’ను అర్థం చేసుకోవాలంటే చాలా తెలుగు రావాలి. మనలో ఎంతమందికి అంత తెలుగు వచ్చో నాకు తెలియదు. కానీ, అక్కడి వాళ్లు అంత వరకూ తెలుగు నేర్చుకుంటారు. ‘పారిజాతాపహరణం’లో సత్యభామ పాత్రపై పరిశోధన చేసి పుస్తకం రాసిన వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య తక్కువే అయినా... ఉన్న ఆ కొద్దిమందీ చాలా ముఖ్యమైన వాళ్లు. ఎందుకంటే, వారు తెలుగును పరిశోధించి ఆంగ్లంలో పుస్తకాలు రాస్తున్నారు. వాటిని ఎక్కువ మంది చదువుతున్నారు. దీని వల్ల తెలుగు సాహిత్య గొప్పదనం ప్రపంచానికి తెలుస్తోంది. 
విదేశీయులకు తెలుగు నేర్పడంలో ఇబ్బందులేంటి?
ఆంగ్లం చదువుతుంటే... వాక్యంలో ఏది పదమో, అది ఎక్కడ ఆగిపోతుందో తెలుస్తుంది. వాక్యంలో ‘ట్రబుల్‌’ అనే మాట వచ్చిందనుకోండి. అది అర్థం కాకపోతే నిఘంటువు చూస్తాం. అదే తెలుగు చదువుతుంటే, ఏ పదం ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఉదాహరణకు... ‘ఉండదల్చుకున్నవాళ్లు’ అనే మాట ఉందనుకోండి! దీని అర్థం ఏ నిఘంటువులోనూ ఉండదు. ఉండు, తలచు అనే క్రియలు కలిసి ‘ఉండదల్చుకున్న’ అనే క్రియావిశేషణం తయారైంది... దానికి ‘వాళ్లు’ చేరి ‘ఉండదల్చుకున్నవాళ్లు’ అయిందని చెప్పే పుస్తకాలేవి? ఆంగ్లంలో మొత్తం వాక్యాన్ని తెలుగులో ఒక్క మాటలో చెప్పవచ్చు. అది మన భాష ప్రత్యేకత. ఐ వజ్‌ నాటేబుల్‌ టూ కమ్‌ అనే వాక్యానికి ‘రాలేకపోయాను’ అనే ఒక్క పదమే అనువాదం!    ‘రాలేకపోయాను’లో ‘ను’ ఉంది కాబట్టి.... కర్త ‘నేను’ అని తెలుస్తుంది; ‘లేకపో’ ఉంది కాబట్టి.... కర్త ‘నిస్సహాయత’ అర్థమవుతుందని ఏ నిఘంటువులు చెబుతాయి? తెలుగులో పుట్టి పెరిగాం కాబట్టి మనకిది పెద్ద సమస్యగా కనిపించదు. భాష నేర్చుకునే క్రమంలో అక్కడి వారికిదే ప్రధాన ఇబ్బంది. 
ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి తెలుగును సరిగా నేర్పించలేమా?
మీరు సంగీతం నేర్చుకుంటే... దాన్ని నాకు నేర్పగలరు. దాన్ని ఎలా నేర్చుకున్నారో మీకు జ్ఞాపకం ఉంటుంది కాబట్టి నాకు సులువుగా బోధించగలరు. మనం ఏం నేర్చుకున్నామో అవతలి వాళ్లకు అదే నేర్పగలం. మరి మనం తెలుగును ప్రత్యేకంగా నేర్చుకున్నామా? లేదు. తెలుగు మన శరీరంలో భాగం. చూడటం, తినడం, పాలు తాగడం ఎలా అబ్బాయో... తెలుగూ మనకు అలాగే అబ్బింది. కాబట్టి, తెలుగు మాట్లాడగలిగిన వాళ్లందరూ... దాన్ని నేర్పించలేరు. ముఖ్యంగా తెలుగు గురించి ఏమాత్రం తెలియని విదేశీయులకు బోధించడానికి ప్రత్యేక పద్ధతిని పాటించాలి. దానికోసం ప్రత్యేకంగా వ్యాకరణాలు రాయాలి. గత యాభై ఏళ్లుగా అమెరికాలో మేం ఈ ప్రయత్నం చేస్తున్నాం. కానీ, ఎక్కువ దూరం వెళ్లలేదు. 
ఉన్న వ్యాకరణాలు ఉపయోగపడవంటారా?
‘మా ఇంటికి రండి’ అని అంటాం. ‘మా కారు దగ్గరికి రండి’ అని పిలుస్తాం. అక్కడ ‘కి’ అంటూ ఇక్కడ ‘దగ్గరికి’ అని వాడుతున్నామెందుకు? భోజనం చేసేటప్పుడు ఏ వస్తువులను ‘వేయ’మంటాం? వేటిని ‘పెట్ట’మంటాం? వేటిని ‘పోయ’మంటాం? మీ ఇంటికి మీరొక్కరే యజమాని. కానీ ‘మా’ ఇల్లు అంటారెందుకు? మీ తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానం అయినా ‘మా’ అమ్మ అని చెబుతారెందుకు? ఈ తేడాలు చెప్పే వ్యాకరణం ఏదైనా ఉందా? ఎందుకు లేదంటే... పుట్టుకతోనే మనకు తెలుగు వచ్చు. ఆ పైస్థాయిలో భాష గురించి తెలుసుకోవడానికి ‘బాలవ్యాకరణం’ తయారు చేసుకున్నాం. అది చదివితే విదేశీయులకు తెలుగు రాదు.   తెలుగు రాని వాళ్లకు తెలుగును బోధించే పద్ధతులను రూపొందించడానికి మేధోమథనం జరగాలి. ఆ పని మొదలుపెట్టాలంటే... అలాంటి అవసరం ఉంది అని మనం గుర్తించాలి. కానీ మనకు ఆ దృష్టి కూడా లేదు. అదే సమస్య. కొత్త వ్యాకరణాలు రాయకపోతే మన భాషను వాళ్లకు నేర్పించలేం. 
కొత్త వ్యాకరణాల రూపకల్పనలో దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలేంటి?
తమిళులు, బెంగాలీలు, మలయాళీలు, హిందీ వాళ్లకు తెలుగును బోధించడం చాలా తేలిక. ఎందుకంటే... వాక్య విన్యాసం, మాటల వెనుక ఉండే అర్థ పరిణామాలు భారతీయ భాషలన్నింటికీ సమానమే. ‘నాకు ఆకలి వేస్తోంది’ అంటాం మనం. ‘ముఝే భూఖ్‌ లగ్తా హై’ అంటారు హిందీ వాళ్లు. ‘నేను ఆకలి వేస్తోంది’ అని అనం కదా. కానీ, ఇంగ్లీషు వాళ్లంటారు ‘ఐ యామ్‌ హంగ్రీ’  అని. మనకు ‘ఆకలి’... ‘నేను’ చేసే పని కాదు. దానంతç అదే వేస్తోంది. ఆకలేసినప్పుడు ‘నేను’ అన్నం తిన్నాను అని చెబుతాం. ఎందుకంటే, ఆ పని(తినడం) మనం చేశాం కాబట్టి. భయాలు, కోరికలు, నమ్మకాలు, అనుభవాలు, ఊహలు మొదలైన వాటికి తెలుగులో ప్రత్యేకమైన వాక్య విన్యాసం ఉంది. వాటికి కర్తగా ‘నేను’ ఉండదు. ఇలాంటి విషయాలన్నింటినీ వివరించాలి.  
దక్షిణ భారతంలో చరిత్ర రచన... సాహిత్య రచనలో అంతర్భాగమన్నది మీ వాదన కదా?
పురాణాలు, కట్టుకథలు ఉన్నాయి కానీ భారతీయులకు చరిత్ర లేదు అంటారు ఆంగ్లేయులు. వారు వచ్చాకే మనం చరిత్ర రాయడం నేర్చుకున్నామని చెబుతారు. కానీ, మనకు చారిత్రక స్పృహ ఉంది. మనవాళ్లు సాహిత్య రూపంలో చరిత్ర రాశారు. కొన్ని గ్రంథాలు (రంగరాయ యుద్ధం, కుమార రాముని కథ) పైకి సాహిత్య పొత్తాల్లా కనిపిస్తాయి కానీ అవి చరిత్ర పుస్తకాలు. తెలుగుతో పాటు తమిళం తదితర భాషల్లోనూ ఇలాంటి గ్రంథాలున్నాయి. అయితే, వాటిలో ఉన్నది చరిత్రేనని ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తారు కొందరు.  సాహిత్యాన్ని రాసే భాష వేరు. చరిత్ర గురించి చెప్పే భాష వేరు. ఈ భేదాన్నే ‘శైలి’ అంటారు. కొత్తగా భాష నేర్చుకునే వాళ్లకు దీని గురించి తెలియదు. అందుకే, అప్పట్లో ఆంగ్లేయులు ఆ గ్రంథాలను అర్థం చేసుకోలేకపోయారు. భాష బాగా తెలిసిన వాళ్లు... శైలీ, సందర్భాలను బట్టి ఈ భేదాన్ని గుర్తించగలరు. ఆ సమయంలో ప్రజల ఆదరణ ఎక్కువగా ఉన్న సాహిత్య రూపాల్లో మనవాళ్లు చరిత్ర రాశారు. అప్పటికి పాట ప్రధానంగా ఉంటే పాట, పద్యం ఉంటే పద్యకావ్యం రూపంలో చరిత్రను చెప్పారు.
సమకాలీన తెలుగు సాహిత్యం ఎలా ఉంది?
తెలుగులో కవిత్వానికి ఢోకా లేదు. వచనం రాసే వాళ్లే లేరు. ప్రపంచీకరణ వల్ల కలిగే లాభనష్టాలపై కవిత్వం ఎక్కువ వచ్చింది. కానీ వ్యాసాలు రాలేదు. వాటిని చర్చించే పుస్తకాలు ఎన్ని ఉన్నాయి మనకు? ఆలోచన వచనం వల్లే వృద్ధి చెందుతుంది. ఆవేశపడే భాష మనకు అక్కర్లేదు. ఉద్రేకాలు పెంచే భాష అవసరం లేదు. పద్యం/కవితలో తార్కికంగా చెప్పడానికి జాగా ఉండదు. ఆలోచన, సమాచారం, విశ్లేషణ, దృక్పథం... వ్యాసంలోనే దర్శనమిస్తాయి. మంచి వచనం రాయకపోతే భాష బాగుపడదు. శుభ్రమైన వచనం రాయలేని జాతికి భవిష్యత్తు లేదు. తార్కికంగా ఆలోచించి క్లిష్టమైన ఊహను చెప్పే వచనాన్ని రాసేవాళ్లు కావాలి. నాకు కవుల కంటే అలాంటి వారిపైనే భక్తి, గౌరవం. 
తెలుగు వచన రచనలో నాణ్యత లోపించిందంటారా?
విషయాన్ని సవిమర్శకంగా, సమగ్రంగా ఆలోచించి పాఠకుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించేలా రాసే అలవాటు 50 ఏళ్ల కిందటి రచయితల్లో ఉండేది. ఇప్పటి వారిలో అది కనిపించట్లేదు. దేన్ని గురించి అయినా ప్రేమగా నాలుగు మంచి మాటలు చెబితే తప్పు కాదు కానీ... మరీ పొగడ్తలే రాస్తే ఎలా? నన్నయ్య గురించి రాస్తే... ‘నన్నయ్య మహాకవి’ అంటారు. ఎందుకు మహాకవి అంటే... ‘మహాకవి కాబట్టి’ అంటారు. విమర్శనాత్మకంగా ఆలోచించే పద్ధతి తెలుగు రాసేవాళ్లలో కనిపించట్లేదు. అందుకే కొత్త ఆలోచనలను ప్రేరేపించే పుస్తకాలు రావట్లేదు. 
ఈ పరిస్థితికి కారణమేంటి?
మాటలను మాట్లాడటంలో, భాషను వాడటంలో మనకున్న శిక్షణ తక్కువ. దాని మీద శ్రద్ధ పెట్టేవాళ్లు చాలా తక్కువ. మా అమ్మాయి అయిదో తరగతిలో ఉన్నప్పుడు షేక్‌స్పియర్‌ హామ్లెట్‌ నాటకంపై వ్యాసం రాయమని తన పాఠశాలలో చెప్పారు. రాతలో వాస్తవం (పాయింట్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌), అభిప్రాయం (పాయింట్‌ ఆఫ్‌ ఒపీనియన్‌), వ్యాఖ్యానం (పాయింట్‌ ఆఫ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌) అనే మూడు ఉంటాయి... వాటిని కలపకూడదని సూచించారు. షేక్‌స్పియర్‌ హామ్లెట్‌ రాశాడు... వాస్తవం. హామ్లెట్‌ గొప్ప నాటకం... అభిప్రాయం. ఫలానా కారణాల వల్ల అది గొప్ప నాటకం... వ్యాఖ్యానం. అక్కడ అయిదో తరగతి విద్యార్థికి చెప్పే ఈ విషయాన్ని ఇక్కడి పీహెచ్‌డీ విద్యార్థులకు కూడా మనం చెప్పట్లేదు. దాంతో మనవాళ్లలో చాలామంది అభిప్రాయాలను వాఖ్యలుగా చెబుతున్నారు. ఉదాహరణకు తెలుగు అందమైందంటారు.. ఎందుకు అందమైందో చెప్పరు! అందమైన భాష, అమ్మభాష... ఈ పదాలతో తెలుగు గొప్పదని చెప్పలేం. తెలుగులో మేం ఇలాంటి ఆలోచనలు చేశాం. వాటిని ఇతరులు చేయలేదు. కాబట్టి మీరు మా భాష గొప్పదని చెప్పగలగాలి. 
అలా నాణ్యంగా రాయాలంటే ఏయే అంశాలపై దృష్టిపెట్టాలి?
ఎక్కడ ‘.’ పెట్టాలి, ఎక్కడ ‘,’ పెట్టాలి, ఎక్కడ మాటల్ని కుదించి రాయాలి, ఎక్కడ వాటిని విస్తృతపరచి రాయాలి, ఎక్కడ ఎలాంటి మాటలు వాడాలనేది తెలియాలి. వాక్యం తరువాత వాక్యం ఎలా రావాలి, పేరా ఎక్కడ ఆగాలి? మనం ఏ విషయం చెబుతున్నాం? అది అవతలి వాళ్లకు సులువుగా అర్థమవుతుందా? ఇందులో నేనేమైనా కొత్త ఆలోచనను ప్రతిపాదిస్తున్నానా? అయితే, ఆ కొత్త ఆలోచన ఏంటి... ఈ ప్రశ్నలు వేసుకుంటే తప్ప తెలుగును బాగా రాయలేం! కొత్త ఆలోచనలను రేకెత్తించేలా వాక్యాలను రాయలేకపోవడం, అలాంటి వాక్యాలను అవతలి వాళ్లకు అర్థమయ్యేలా రాయాలన్న పట్టుదల మనకు లేకపోవడమే పెద్ద సమస్య. రాతలో పెద్దపెద్ద మాటలు, సమాసాలు అక్కర్లేదు. వాక్యంలో స్పష్టత, ఆలోచనల్లో క్లిష్టత కావాలి. 
ఆంగ్లాన్ని, తెలుగును కలిపి సంకరభాషను మాట్లాడే అలవాటు ప్రబలుతోంది కదా?
చదువుకున్న వారి వల్లే ఈ పరిస్థితి. ఏ మాత్రం ఆంగ్లాన్ని చదివిన వారెవరైనా సరే, వాక్యానికి నాలుగు ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడలేకపోతున్నారు. దానివల్ల క్రమక్రమంగా వారి మాటలకు ఉండే బలం తగ్గిపోతుంది. స్పష్టంగా ఏ అభిప్రాయం చెప్పలేని స్థితిలోకి వచ్చేస్తున్నారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండే వ్యక్తులు, అఖిల భారత సర్వీసుల్లోని అధికారులను చూడండి... వాళ్లు ఏ ఒక్క భాషనూ పూర్తిగా మాట్లాడలేరు. ఏ ఒక్క భాషలోనూ తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేరు. కొంచెంసేపు ఆంగ్లం... కొంచెంసేపు తెలుగు. ఇలా మాట్లాడటమే గౌరవం కాబోలనుకుని కిందిస్థాయి వాళ్లు కూడా వీరిని అనుకరిస్తున్నారు. చదువుకున్న వారి వల్ల భాష చెడిపోతోందన్నది అందుకే. 
తెలుగులోకి చొరబడుతున్న ఆంగ్ల పదాలను అడ్డుకోవడమెలా?
మన పలుకులోకి ఇతర భాషా పదాలు వెల్లువెత్తడానికి కారణాలు... కొత్త భావనను చెప్పడానికి మన భాషలో సరైన పదం లేకపోవడం, పరాయి భాషను మాట్లాడటం గౌరవం అని అనుకోవడం. నాన్నను ఫాదర్‌ అని ఎందుకు పిలవాలి? మంగళవారాన్ని ట్యూస్‌డే  చేయడమెందుకు? ఇలాంటివి గొప్ప కోసం తెచ్చుకున్నవి. వాటిని వదిలించుకోవాలి. ఇప్పటికే తెలుగులో స్థిరపడ్డ బస్సు, కారు లాంటి వాటిని మార్చక్కర్లేదు. కానీ, కొత్త భావాలను చెప్పడానికి సరిపోయే పదాలను తెలుగులో తయారు చేసుకుందాం. ‘డెమోక్రసీ’ అనే మాట ఒకప్పుడు మనకు కొత్త. దాన్ని ‘ప్రజాస్వామ్యం’గా మార్చుకున్నాం కదా. మిగిలిన వాటిని కూడా అలా ఎందుకు చేయలేం! కొత్తగా వస్తున్న ఆంగ్ల పదాలను తెలుగులోకి మార్చుకుందామనే ఆలోచన కూడా చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా వాడుకునే అలసత్వం వచ్చింది. దాన్ని విడనాడాలి. ఆంగ్ల ప్రభావం జలపాతం లాంటిది. దాన్ని తట్టుకుని నిలబడే శక్తిని సంపాదించాలి. ఆంగ్లంపై వ్యామోహం చాలా ప్రమాదం. ఆ భాష అవసరం కోసం ఉన్నది మాత్రమేనని తెలుసుకోవాలి. ఆంగ్లం రానివాళ్లంతా తెలివితక్కువ వాళ్లన్న అభిప్రాయం పోవాలి. 
భాషా స్వచ్ఛతను కాపాడటంలో ప్రధాన పాత్ర పోషించాల్సిందెవరు?
పత్రికలు, ప్రసార మాధ్యమాలే. నార్ల వెంకటేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు వంటి వారు సంపాదకులుగా ఉన్న సమయంలో పత్రికలు తెలుగు భాషను బతికించాయి. ఆధునిక తెలుగుకు ఓ ఆకారాన్ని ఇచ్చాయి. ఇప్పుడా భాషను ప్రసార మాధ్యమాలు చెడగొడుతున్నాయి. షేర్లను సేల్‌ చేయవచ్చు, కొంచెం హోల్డ్‌ చేయండి, రూపీ డ్రాప్‌ అవుతోంది... టీవీల్లో ఈ భాష వినపడుతోంది. ‘మాట్లాడటం జరిగింది, వెళ్లడం జరిగింది’ అంటూ మాట్లాడుతున్నారు చాలామంది. ప్రతి క్రియకూ ‘జరిగింది’ని జోడించే అలవాటు టీవీ తెలుగు వల్లే వ్యాప్తిలోకి వచ్చింది. ‘బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింద’ంటూ పత్రికల్లో రాస్తున్నారు. ‘ద్రోణి’ అనే మాట చాలా బాగుంది. ప్రజలు ఆ పదాన్ని వాడుతున్నారు. పత్రికలు, ప్రసారమాధ్యమాలు ఏది రాస్తే, ఏది మాట్లాడితే అదే తెలుగు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 
తెలుగు కోసం చాలా చేస్తున్నామంటున్నారు పాలకులు? 
భాషపరంగా ప్రభుత్వాలు చేయగల పని కొంత ఉంటుంది. అది తప్ప మిగిలినవన్నీ చేస్తారు పాలకులు. ఇప్పటిదాకా వారు తెలుగుకు చేసిందేమీ లేదు. మన దగ్గర రంగాలన్నింటినీ ‘రాజకీయం’ చేశాం. అందుకే అన్నీ భ్రష్టుపట్టాయి. గతంలో తెలుగు అకాడెమీ ప్రభుత్వ అకాడెమీ అవడానికి కారణం రాజకీయాలే. ముఖ్యమంత్రిని పట్టుకుంటే అకాడెమీకి సంచాలకులైపోవచ్చనే పరిస్థితి ఉండేది అప్పట్లో. విశ్వవిద్యాలయాలు ఎలా పని చేయాలి, వాటికి ఎవరు ఉపకులపతులవ్వాలన్నది నిర్ణయించాల్సింది విద్యారంగంలోని వారు. కానీ ఆ పనిని రాజకీయ నేతలు చేస్తారు! ఏ రంగంలోని ప్రమాణాలను ఆ రంగంలోని వారే నిర్ణయించాలి. ఆ నిర్ణయాలకు ఆమోదం తెలిపే పాత్ర మాత్రమే పాలకులకు ఉండాలి. పాఠ్యపుస్తకాల ప్రచురణ నుంచి భాషను కాపాడటం వరకూ ఇదే వర్తిస్తుంది. 
సాంకేతికపరంగా మన భాషాభివృద్ధి ఏ దశలో ఉంది?
వేగంగానే అభివృద్ధి జరుగుతోంది. కంప్యూటర్లో రాతకు అవసరమైన అందమైన ఖతులూ వచ్చాయి. వీటిని తయారు చేసిన వాళ్లంతా... ప్రభుత్వం చెబితే చేయలేదు. గుర్తింపు లేకపోయినా సొంత ఆసక్తితో చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఆంధ్రభారతి వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. వారి వల్ల నిఘంటువులన్నీ కంప్యూటర్లోకి వచ్చాయి. ఎవరికి పెద్దపేరు లేదో వారు ఎక్కువ పని చేస్తున్నారు. 
తెలుగుకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం దక్కాలంటే ఏం చేయాలి?
మన దగ్గర వ్యాపార సంస్థలన్నీ ఆంగ్లంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కాబట్టి తెలుగు రాకపోయినా ఇక్కడ పని చేయవచ్చన్న భావన బయటివాళ్లలో స్థిరపడింది. ఆర్థికంగా మన వల్ల ప్రయోజనం పొందాలంటే తెలుగు నేర్చుకోవాలన్న పరిస్థితిని మనం కల్పించలేకపోయాం. ఎన్నో సాఫ్ట్‌వేరు సంస్థలు హైదరాబాదుకు వచ్చి కార్యాలయాలను పెట్టాయి. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేరు, నిర్వహణ వ్యవస్థ(‘నివ్య’)లను మీరు తెలుగులో తయారు చేయాలి. లేకపోతే మీరిక్కడ వ్యాపారం చేయలేరని వారికి చెప్పగలిగామా? ఇజ్రాయిల్‌ వాళ్లు చెప్పారు. అందుకే అక్కడి కంప్యూటర్ల ‘నివ్య’లు హిబ్రూ, ఆంగ్లంలలో ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా కోకాకోలా పేరు (సీసాపై) ఆంగ్లంలోనే దర్శనమిస్తుంది. ఇజ్రాయెల్‌లో మాత్రం హిబ్రూలో ఉంటుంది. ఎందుకంటే, మా ప్రాంతంలో వ్యాపారం చేయాలంటే మా భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని కరాఖండీగా చెప్పారు వాళ్లు. ఎనిమిది కోట్ల మందిమి ఉండి మనం ఆ మాట ఎందుకు అనలేకపోయాం? భాష విషయంలో కొంత ఆభిజాత్యం ఉండాల్సిందే.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి