తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

నాది కవితా కులం

  • 108 Views
  • 0Likes
  • Like
  • Article Share

    నర్వ అంజప్ప

  • అనంతపురం.
  • 8008001833

‘‘పద్యం కమ్మగా పాడువాడు.. పద్యవిద్యను కాపాడువాడు.. పద్యద్వేషనలతో రాపాడువాడు’’ అంటూ ఆశావాది ప్రకాశరావును కీర్తించారు సినారె. కఠినమైన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ఎదురొడ్డి అష్టావధానిగా ఎదిగారు ఆశావాది. తెలుగువారికే సొంతమైన అవధాన విద్యకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని సముపార్జించి పెట్టారు. పద్యమే శ్వాసగా జీవిస్తున్న ఆయనతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి..
మీ కుటుంబ నేపథ్యం?

మాది శింగనమల మండలం పెరవళి గ్రామం. నాన్నగారు పక్కీరప్ప ఎలిమెంటరీ స్కూల్‌ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అమ్మ కుళ్లాయమ్మ. మేము మొత్తం పదిమంది సంతానం. ఏడుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. ఆరు నుంచి ఎమ్మే వరకు అనంతపురంలోనే చదువుకున్నాను. ప్రాథమిక విద్య మొత్తం నాన్నగారి దగ్గరే జరిగింది. నాన్నగారు టీచరే కాకుండా పద్యాలూ రాసేవారు. అలా నాకూ పద్యం కొంత ఒంటబట్టింది. పాఠశాల, కళాశాల స్థాయుల్లోనూ మంచి పండితులు గురువులుగా దొరకడంతో నాలో ఉన్న పద్యాసక్తి మరింత అధికమైంది. బీఏ పూర్తయిన తర్వాత మూడు సంవత్సరాలు తెలుగు పండితుడిగా పనిచేశాను. తర్వాత ఎమ్మే చేశాను. తర్వాత కళాశాల అధ్యాపకుడిగా వచ్చాను. విధులు నిర్వహిస్తూనే సాహితీ వ్యాసాలు, పరిశోధనాత్మక పుస్తకాలు రాయడం, అవధానాలు చేయడం ప్రారంభించాను. 170 అవధానాలు చేశాను. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రాంతాల్లోనూ అవధానాలు చేశాను. తెలుగు సాహిత్య అకాడమీ సభ్యుణ్ని కావడం మూలాన బెజవాడ గోపాలరెడ్డి, దాశరథి, సినారె లాంటి వారితో సాన్నిహిత్యముంది. 60కి పైగా పుస్తకాలు వివిధ ప్రక్రియల్లో రాశాను. నామీద ఇతరులు రాసిన పుస్తకాలు 20 దాకా వచ్చాయి. 
అవధానాలు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? 
సాయిబాబా కళాశాలలో శతావధాని సీవీ సుబ్బన్న అవధానాన్ని, కళాశాలలో కుక్కుటేశ్వరరావు అవధానాన్ని చూశాను. ఇదేదో ప్రక్రియ బాగుంది.. ఇంతమందితో శభాష్‌ అనిపించుకోవచ్చుననే ఆలోచన కలిగింది. వసతిగృహంలో సహ విద్యార్థులు కొందరు పద్యాలు రాసేవారు. వారి దగ్గరకెళ్లి ‘మీరు ప్రశ్న వేయండి నేను సమాధానం చెబుతాను’ అని అడిగేవాణ్ని. అలా సాధన మొదలుపెట్టాను. 
మీ ఇంటిపేరు ఆసాదిని ఆశావాదిగా మార్చారు కదా నండూరి రామకృష్ణమాచార్య?
వసతిగృహంలో నేను చేసిన అవధానం గురించి కళాశాలలో అందరికీ తెలిసింది. అప్పుడు తెలుగు విభాగ అధ్యక్షులు నండూరి రామకృష్ణమాచార్యులు పిలిచారు.  ‘ఏదో అవధానం చేశావట కదా! నేను ఓ సమస్య ఇస్తాను పూరించు’ అన్నారు. దాన్ని నేను పూర్తి చేసిన విధానానికి ఆయన సంబరపడిపోయారు. ‘అవధానంలో నీకు మంచి భవిష్యత్తు ఉంది.. నువ్వు ఇదే మార్గంలో ఉండు’ అన్నారు. అప్పుడే ‘ఈయన ఆసాది’ కాదు ఆశావాది’ అని వారు అనడం.. అదే మా ఇంటిపేరుగా శాశ్వతంగా మారిపోవడం జరిగిపోయాయి. 
ఆ రోజుల్లో దళితులు చదువుకోవాలంటే ఎన్నో సవాళ్లు ఎదురయ్యేవి కదా.. మీ విషయంలో అలా జరిగిందా?
జరిగిన మాట వాస్తవం. సహనంతో కార్యసాధన చేసుకుంటూ వచ్చాను. 9వ తరగతిలో ఉన్నప్పుడు అస్పృశ్యత మీద వ్యాసం రాశాను. ‘స్వాతంత్య్రం వచ్చి పదేళ్లయ్యింది.. ఇంకా ఎక్కడుందోయి అస్పృశ్యత’ అని దాన్ని నా మొహాన విసిరి కొట్టారు ఓ ఉపాధ్యాయుడు. తర్వాత నేను అవధానం చేసేటప్పుడు ఆయనే నన్ను పిలిచి సన్మానం చేశారు. కాబట్టి ప్రతీకారం కాదు పరిష్కారమే ముఖ్యం. నేను ఐఏఎస్‌ అధికారి భోగిశెట్టి జోగప్ప దగ్గర పెరిగాను. వారు వీరశైవులు. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తిగా చేరిన నేను, తర్వాతి కాలంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకడిగా మారిపోయాను. ఆయన వల్లే ఆనాడు సర్వేపల్లి వారి ఆశీస్సులు పొందగలిగాను. జోగప్ప గారు నన్ను చాలా ప్రోత్సహించారు. ఆ కృతజ్ఞతతో డిగ్రీ చదివే రోజుల్లోనే ఆయన మీద ‘విద్యావిభూషణ’ అనే పుస్తకం రాశాను. అయితే, ‘అవధానం బ్రాహ్మణుల సొత్తు, దాన్ని నువ్వెలా చేస్తావు’ అని కొంతమంది అవహేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను ఎక్కడా న్యూనతకు లోను కాలేదు. అర్జునుడు గురువు గారికి నమస్కార బాణం వేసి యుద్ధంలో ఎలా గెలిచాడో తెలుసు కదా! నేను అర్జునుణ్ని కాకపోయినా హరిజనుడిని కాబట్టి తెలివితో విజయం సాధించాను. అవధానం బ్రాహ్మణుల అంశం నీకెందుకు అని అగ్రవర్ణాలు, దండోరా వాయించకుండా ఈ అవధానం ఏంటని మా వర్గం వారు నిరుత్సాహపరిచేవారు. ఇన్ని సవాళ్ల మధ్య అవధానిగా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. 
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి మీకు బాలకవి బిరుదును ఇచ్చారు కదా..?
ఒకసారి సర్వేపల్లి వారు శ్రీశైలం వచ్చినప్పుడు జోగప్పగారు నన్ను తీసుకెళ్లారు. డిగ్రీ చదివే కుర్రాడు పద్యాలు రాస్తున్నాడు అని చెబితే, ఆయన నా పద్యాలను విని ఆనందించారు. అక్కడి నుంచి ఆయన వెళ్లేటప్పుడు వీడ్కోలు పలకడానికి వెళ్లాం. నన్ను చూడగానే ‘బాలకవి గారూ రండి’ అని వారు సంబోధించడంతో ఆ పేరు అలా నిలిచిపోయింది. ఆయన ఆశీస్సులు పొందిన అయిదు నెలలకే అవధానిగా రూపాంతరం చెందాను. మేధావులైన వారు ఎవరైనా ప్రశంసిస్తే ఆనందమే కదా! అంతటి వారి ఆశీర్వాదం పొందవచ్చుననే భావానికి వచ్చి ఇందులోనే ఘనత సాధించాలని పట్టుదలతో సాధన చేశాను. అలా కీర్తి కోసం శారదా మాత సన్నిధిలో నిలబడ్డాను. 
శతావధాని సి.వి.సుబ్బన్నను మీరు గురువుగా భావిస్తారు కదా..?
కళ్యాణదుర్గం ప్రాంతంలోని వెంకటాద్రిపల్లి హైస్కూల్‌లో పనిచేసేటప్పుడు ఆ గ్రామం వాళ్లు నాతో అవధానం చేయించారు. నాకప్పుడు ఇరవై ఏళ్లే. అవధానం పూర్తయిన తర్వాత ‘సి.వి.సుబ్బన్న గారు అని ప్రొద్దుటూరులో ఉంటారు. అద్భుతమైన అవధాని. ఆయనను పిలిచే ప్రయత్నం చేయండి’ అని సూచించాను. వారు నా మాటను అంగీకరించి ఆయనను ఆహ్వానించారు. నాటికి ఆయన వయసు 37. అందుకని 37 ఎద్దుల బండ్ల మీద ఊరేగింపుగా వారిని సభా ప్రాంగణానికి తీసుకొచ్చాం. గ్రామస్థులు ఆయన మీద పూలవర్షం కురిపించారు. అవధానం చక్కగా పూర్తయింది. ‘ఇంతకుముందే ఇక్కడ ఆశావాదితో అవధానం చేయించాం’ అని సభా నిర్వాహకులు చెప్పారు. అవధానంలోని ప్రశ్నలు, నా సమాధానాలు సుబ్బన్న గారికి వినిపించారు. వారికి నేను పంచరత్న పద్యాలు రాసి సమర్పించాను. తర్వాత ఆయన నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ‘నాయనా.. చిరంజీవ! వెంకటాద్రిపల్లి కొత్తిమీర పరిమళం ఇంకనూ నాకు మరపురాకున్నది (ఆ ప్రాంతంలో కొత్తిమీర పంట ఎక్కువ). నీవు రాసిన మొదటి పద్యంలోని చివరి పాదంలోని విశేషమేమో? వారం రోజులు తిరగకుండానే ఒక సభలో నాకు వజ్రఖచిత సరస్వతి స్వర్ణ ప్రతిమ బహుమతిగా వచ్చింది. నీపై ప్రేమ హెచ్చినది. నువ్వు నా దగ్గర నిర్భయంగా ఉండు. నిన్ను చక్కటి అవధానిగా తయారుచేస్తాను. నాకూ కీర్తి వస్తుంది’ అని రాశారు. తర్వాతి లేఖలో ‘త్వరలోనే ప్రొద్దుటూరులో అవధానం చేయదలిచాం. నీవు హరిజనుడవా? హరిజన క్రైస్తవుడవా?’ అని ప్రశ్నించారు. ‘ఇలా అడుగుతున్నందుకు మరోలా అనుకోవద్దు. నువ్వు ఏ వర్గానికి చెందినవాడవో ఆ వర్గం వారితో అక్కడక్కడా సభలు ఏర్పాటు చేయిస్తా’ అన్నారు. దానికి సమాధానంగా ‘దైవీయ భావంతో బతకడానికి మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను హిందువునే’ అని చెప్పాను. దీంతో ఆయన ప్రొద్దుటూరులోని అగస్తేశ్వరాలయంలో నన్ను అవధానిని చేసి, అక్కడ మహాపండితుల మధ్య పరీక్షింపజేశారు. అందులో విజయం సాధించాను. అప్పటి నుంచి వారికి శిష్యుడిగా మారిపోయాను.
అవధానాల విషయంలో మీకు ఎదురైన సవాళ్లు..?
ఒకచోట శ్రీరామనవమి సందర్భంగా అవధానం చేసేటప్పుడు మందాక్రాంత ఛందస్సులో సమస్య పూరించమన్నారు. నిజానికి నాకు ఆ ఛందస్సు తెలీదు. సభలో ‘నాకు రాదు’ అనే మాట వినపడకూడదు. ఉపాయంతో వారితోనే సమాధానం రాబట్టాలి. వారిని మాటల్లో పెట్టి ఆ ఛందస్సులో నాకు వచ్చిన పద్యాలు ఏవైనా ఉన్నాయా? అని ఆలోచించాను. కాళిదాసు మేఘసందేశం మొత్తం మందాక్రాంతలోనే రాశారని గుర్తొచ్చింది. అందులో నాకు వచ్చిన శ్లోకాన్ని మనసులోనే పరిశీలించాను. అక్కడ సంస్కృతంలో ఏ విరుపులైతే ఉన్నాయో అదే విరుపులతో నాకు ఇచ్చిన సమస్యకు జోడించి పద్యం చెప్పాను. నాకు ఛందస్సు తెలీదు అనే అపవాదు రాకుండా అలా తప్పించుకున్నాను. ఒకచోట ఒకాయన విజయవిలాసం పుస్తకానికి మహాభారతం అట్ట వేసి నాకు కనిపించేటట్టు తన ముందు పెట్టుకున్నాడు. అందులోంచి ఒక పద్యం చదివి పురాణ పఠనం చేశాడు. అంటే నన్ను కావాలనే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. కనీస అవగాహన కూడా నాకు లేదు అని అందరూ భావించాలని అలా చేశాడు. మహాభారతం అట్ట వేసిన చేమకూర వెంకట కవి రచించిన విజయవిలాసం అనే గ్రంథం నుంచి పురాణ పఠనం చేశారని చెప్పేసరికి తేలుకుట్టిన దొంగలాగా అయిపోయాడు. ఒకసారి కడపలో అవధానం చేసేటప్పుడు రక్తాక్షి నామ సంవత్సర శుభాకాంక్షలను అచ్చ తెలుగులో చెప్పండని అడిగారు. అప్పుడు ఒక పద్యం చెబుతూ ‘కెంగన్‌నేడు’ అనే ప్రయోగం చేశాను. కెంపు+కన్ను- కెంగన్ను, ఏడు- సంవత్సరం.. ఎరుపు కన్ను సంవత్సరం అనే అర్థంతో రక్తాక్షికి ముడిపెట్టాను. ఇలా అప్పటికప్పుడు సమాధానాలను చెప్పడం కష్టమే. కానీ సాధనతో సాధ్యమే. నేనెక్కడ అవధానం చేసినా సీవీ సుబ్బన్న గారే గుర్తుకొస్తున్నారని అనేవారు. 
తొలి దళిత అవధాని కదా మీరు..?
దళితుల్లో అవధానులు లేరు. కొంతమంది ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయారు. దీనికి కారణం పాండిత్యం లేకపోవడమే. ఎక్కడ అవధానం చేసినా పండితులతోనే పోటీ పడాల్సి ఉంటుంది. కేవలం ఛందస్సు తెలిసినంత మాత్రాన అవధానం చేయలేం. పాండిత్యం రావాలంటే సంస్కృతం తెలిసి ఉండాలి. అన్ని గ్రంథాల మీదా పట్టు ఉండాలి. ఆ అవకాశం దళితులకు ఎక్కడిది? ఈ కారణంగా దళితులెవరూ ధైర్యంగా నిలబడలేకపోయారు. కానీ, నేను నిలబడ్డాను. ఒకచోట నన్ను నీదే కులం అని అడిగారు. కవితా కులం అని అన్నాను. అంటే ఏంటి అని అడిగారు. కవులందరూ పెరిగిన కులం అని ఒకర్థం; కవి..తా కులం అని మరో అర్థం చెప్పాను. అంటే సాటికవులే చిన్నబుచ్చుతున్నారనే విరుపుతో సమాధానమిచ్చాను. 
ద్విగుణిత అష్టావధానం చేశారు కదా..?  
ఇదీ అష్టావధానం లాంటిదే. దీంట్లో ఒక్కో అంశానికి ఇద్దరు చొప్పున పృచ్ఛకులు ఉంటారు. నిషిద్ధాక్షరి, దత్తపది, సమస్య దత్తపది తప్పనిసరిగా ఉంటాయి. అలా 16 మంది పృచ్ఛకులు ఉంటారు. ఒక్కొక్కరికి సమాధానం చెప్పి చివరిలో అన్నింటిని అప్పగించాలి. 
ఏలూరులో ఉద్యోగాన్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? 
నేను ఇక్కడ చదువుతున్నప్పుడే ఏలూరులో గుమస్తాగా ఉద్యోగం వచ్చింది. మూడు నెలలే అక్కడ పనిచేశాను. జీతం చాలా తక్కువ. రూ.71 ఇచ్చేవారు. పని ఎక్కువగా ఉండేది. ఆ మూడు నెలలు కూడా ఇంటి అద్దె భరించలేక ఆఫీసులోనే మకాం పెట్టాను. నాన్నకు కూడా వచ్చేది తక్కువే. తమ్ముళ్లు అప్పటికి ఇంకా చదువుకుంటున్నారు. నా జీతంతో నేను బతకాలి.. మళ్లీ ఇంటికి కొంత పంపించాలి. దీంతో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకే అక్కడ వద్దనుకుని వచ్చేశాను. తర్వాత కనేకల్‌లో తెలుగు పండితుడిగా చేరినప్పుడు కుల వివక్ష కారణంగా నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించారు. ఇల్లు దొరకపోతేనేం పూరిగుడిసె వేసుకుని దాంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఒకాయన పిలిచి తన ఇంట్లోనే ఉండమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో పల్లెల్లో ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకుని ఎమ్మే చేయడానికి మళ్లీ అనంతపురానికి తిరిగి వచ్చాను. 

 


అప్పటితో పోలిస్తే ప్రస్తుతం తెలుగు బోధన, అధ్యయనం పరంగా వచ్చిన మార్పులేంటి? 
భాష పట్ల చిన్నచూపు అనేది అన్ని స్థాయుల్లోనూ ఉంది. వ్యవహారం నడిస్తే చాలు అనే ధోరణి పెరిగిపోయింది. ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో చాలా వరకు ఉద్యోగ దృష్టి తప్ప భాష మీద మమకారం ఉండటం లేదు. వేలంవెర్రిగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు. చెప్పేవాళ్లకు అరకొర భాషా నైపుణ్యం ఉండటంతో వినేవాళ్లకు అసలే అర్థం కాకుండా పోతోంది. విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి మరింత దిగజారింది. ప్రవేశ పరీక్షలు లేకుండా కేవలం ముఖాముఖుల ద్వారానే నియామకాలు చేస్తుండటం ప్రధాన కారణం. కాబట్టి అక్కడ బోధన, శోధన రెండూ లేకుండా పోయాయి. నాసిరకంగా పరిశోధనలు జరుగు తున్నాయి. హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుణ్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘నాయనా పద్యమొకటి చెప్పి సార్థముగా తాత్పర్యముగావించు’ అని అల్లారు ముద్దుగా అడిగేవాడు. నేడు పద్యానికి ఆ విలువ లేదు. తల్లిదండ్రులు అలాంటి చొరవ చూపడం లేదు. విద్యార్థుల్లో పునశ్చరణకు అవకాశం కల్పిస్తే భాష అలవడుతుంది. అది ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. 
మీరు ఉమ్మడి రాష్ట్రంలో సాంస్కృతిక శాఖ తరపున పద్య శిక్షణ తరగతులు నిర్వహించారు కదా?  
కడపలో పద్య శిక్షణా తరగతులు నిర్వహించాం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పద్యం అనే ప్రక్రియ అంతరించిపోతే మేలు, మా గుర్తింపునకు పద్యకవులే అడ్డం అని కొందరు భావిస్తున్నారు. ప్రక్రియల మేరకు కాకుండా భావజాలాల మేరకు కవులు విడిపోయిన కారణంగా సామూహిక కృషి కనిపించడం లేదు. ఇటీవల ఒక అధ్యాపకుడికి నా పుస్తకాలు ఇచ్చి చదవమన్నాను. కొద్ది రోజుల తర్వాత ఫోన్‌ చేసి పుస్తకాలు చదివారా? అని అడిగితే.. లేదు అని సమాధానమిచ్చారు. ఎందుకని, అడిగితే.. మీ పద్యాలు చదివితే మేము మారిపోతాం అని చెప్పారు. ‘పోన్లెండి మిమ్మల్ని మార్చగలిగే శక్తి నా పుస్తకాలకు ఉందని ఒప్పుకున్నారు చాలు’ అని వదిలేశాను. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు పద్య ధారణ అలవాటు చేయాలి. పాఠశాలల్లో ఆ సాధన రోజూ జరగాలి. అప్పుడే పిల్లలకు పద్యం పట్ల ఆసక్తి కలుగుతుంది. పూర్వకాలంలో విద్యార్థులతో పద్యాలు సాధన చేయించేవారు. పండితులతో ప్రత్యేక తరగతులు నిర్వహించేవారు. ఎన్ని ఎక్కువ పద్యాలు వస్తే అంత పద సంపద విద్యార్థి సొంతం అవుతుంది. మేము చదువుకునే సమయంలో మాధవరాజు అనే తెలుగు మాష్టారు ఉండేవారు. ఒక్కో పాఠానికి 40 పేజీల నోట్స్‌ ఇచ్చేవారు. దానివల్లే మాకు ఇంత పద సంపద సొంతమైంది. ఇప్పుడంతా ప్రశ్న సమాధానాలే కదా!
తెలుగు నాట అవధానాలు క్రమంగా తగ్గిపోతున్నాయి కదా?
ఆరోజుల్లో ఆటవిడుపు పద్యాలు అని నేర్పించేవారు. రోజుకో పద్యం బోర్డు మీద రాసి నేర్చుకోమని చెప్పేవారు. మళ్లీ మరుసటి రోజు అప్పజెప్పాలి. అలా కొన్ని వందల పద్యాలు విద్యార్థుల సొంతం అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పద్యం రాని కారణంగా అవధానం అనే ప్రక్రియ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కానీ, అత్యద్భుతంగా ఈ తరంలోని కొందరు పిల్లలు అవధానం చేస్తున్నారు. ఇటీవల పత్రికలో చూశాను.. ఒక కుర్రాడు ఆమెరికాలో పుట్టి పెరిగినా అవధానం చేస్తున్నాడు. అతణ్ని చూసి నా హృదయం ఉప్పొంగిపోయింది. 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులుగా కూడా చేశారు కదా.. అకాడమీ చేయాల్సినంత సాహిత్య సేవ చేయలేదనే విమర్శ ఉంది..?
బెజవాడ గోపాలరెడ్డి గారి బృందంలో సభ్యుడిగా ఉన్నాను. సాహిత్య అకాడమీ అనేది ఒక పాఠశాలో, విద్యాలయమో కాదు. ప్రజల్లోకి వెళ్లాల్సిన సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలను ముద్రించి ఇస్తుంది. దాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, విద్యావ్యవస్థల మీద ఉంటుంది. నేను సభ్యుడిగా ఉన్నప్పుడు మా ద్వారా లభించే ప్రయోజనాల గురించి ప్రచారం కల్పించి ప్రజలు వినియోగించుకునేలా చేశాను. ఆనాడు అకాడమీ కోసం ఖర్చు చేసిన డబ్బు కూడా చాలా తక్కువ. కాబట్టి అకాడమీ ఏమీ చేయలేదనే నింద సరికాదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, అప్పుడున్న అకాడమీలకి ఇప్పటి అకాడమీకి చాలా తేడా ఉంది. 
అధికార భాష సంఘం ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా అధికార భాషగా తెలుగును అమలు చేసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నాం?
దీనికి ప్రధాన కారణం తెలుగురాని ఐఏఎస్‌ అధికారులు. అలా అని తప్పు వారిది కూడా కాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలకు ఇక్కడి భాష రాదు. అలాంటప్పుడు వారు తెలుగును అధికారిక భాషగా ఎలా అమలు చేస్తారు.? ఇంకో విషయం ఏంటంటే తాము ఏం రాశామో ఎవరికీ అర్థం కాకుండా ఉంటేనే కదా తప్పు చేసినా తప్పించుకోవడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల కూడా తెలుగులో రాయగలిగిన సామర్థ్యం ఉండి కూడా చాలా మంది సుముఖత చూపడం లేదు.
మాతృభాషలో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనం?
మాతృభాషలో చదువుకుంటే అవగాహన సామర్థ్యం పెరుగుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. మా నండూరి వారు ఒక మాట చెప్పేవారు.. ఒక భాష వచ్చిన వారు ఒక హృదయం కలిగిన వారు అని! మొట్టమొదటగా మాతృభాష మీద పట్టు సాధిస్తే ఇతర భాషలను నేర్చుకోవడం చాలా సులభం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి