తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

మాతృభాషను భూస్థాపితం చేస్తారా?

  • 64 Views
  • 0Likes
  • Like
  • Article Share

చిత్రకారుడిగా, కవిగా, కథకుడిగా, నవలా రచయితగా తెలుగు కళా, సాహితీ యవనిక మీద తనదైన చేవ్రాలు చేశారు శీలా వీర్రాజు. చిన్నతనంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ చదువు కొనసాగించిన ఆయన కుంచె చేతబట్టుకుని అక్షర ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ‘మైనా’ నవలతో ఎనలేని ఖ్యాతి అందుకున్నారు. కథలు, నవలల తర్వాత కవన సీమలో మేటి గుర్తింపు పొందారు. ఈ ఎనభై ఒక్కేళ్ల సాహితీ సైరికుడితో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి... 
మీ కుటుంబ నేపథ్యం...

అమ్మగారిది ప్రాథమిక విద్య. నాన్నగారిది మిడిల్‌స్కూలు చదువు. ఇంట్లో ఎలాంటి సాహితీ వాతావరణం లేదు. మా నాన్నగారు కలప వ్యాపారి దగ్గర పనిచేసేవారు. ధాతు కరవు వచ్చినప్పుడు మా తాతగారి కాలంలో విజయనగరం జిల్లా నుంచి పాతిక చేనేత కుటుంబాలు రాజమహేంద్రవరానికి వలసవచ్చాయి. అప్పటి సబ్‌కలెక్టర్‌ దయతో వాళ్లు అక్కడే స్థలం సంపాదించి, పాకలు వేసుకున్నారు. రాజమహేంద్రి పరిసరాల్లో మా తాత వ్యవసాయం కూడా చేసేవారట. నేను పుట్టేనాటికి మా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. చదువులో చురుగ్గా ఉండటం వల్ల బడి చదువు వరకూ ఉపకారవేతనంతో నడిచిపోయింది. ఆ తర్వాత మా పెద్దమేనమామ సాయం చేశారు. ఇంజనీర్‌ కావాలన్న ఉద్దేశంతో ఇంటర్‌లో ఎంపీసీలో చేరాను. కానీ, లెక్కలు తప్పి, సప్లిమెంటరీలో దాన్ని గట్టెక్కి, బీఏలో చేరాను.  
చిత్రకళ మీద ఆసక్తి ఎలా కలిగింది?
నేను ముందుగా చిత్రలేఖనంలోకే ప్రవేశించాను. చిత్రకళ మీద ఆసక్తి కలగడానికి కొన్ని కారణాలున్నాయి. రెండో తరగతి చదువుతున్న రోజుల్లో మా ట్యూషన్‌ మాస్టారు ఒకరోజు పాఠం కాగానే మీకొచ్చిన బొమ్మ గీసి చూపించండ్రా అన్నాడు. నేనేదో బొమ్మ గీసి చూపిస్తే అరచేతిలో శ్రీ గుర్తు పెట్టాడు. అంటే నేనే ఫస్టు అన్నమాట. పలక మీద వేసిన ఆ బొమ్మని తీసుకెళ్లి ఇంట్లో చూపిస్తే మెచ్చుకున్నారు. అదొక కారణం. అలాగే మా ఇంటి వరండా మీద చివరగా ఒక చిన్న గది ఉండేది. దానికి వీధి వైపు ఎరుపు, పచ్చరంగు అద్దాల కిటికీ రెక్కలుండేవి. మధ్యాహ్నం తర్వాత ఎండ ఆ కిటికీలోంచి నేలమీద రంగుల్ని ఒంపేది. గదంతా వింత కాంతి పరచుకునేది. ఆ కిటికీ ముందు కూర్చుని వీధిలో వచ్చేపోయే జనాల్ని రంగుల్లో చూడటం నాకు చాలా ఇష్టం. అది మరో కారణం. సాయంత్రం ఎప్పుడైనా మా నాన్నగారితో కలిసి గోదావరి గట్టుకు వెళ్లినప్పుడు ఆకాశంలో సంధ్యాకాంతులు గోదారిలో ప్రతిఫలించి చూడ్డానికి చాలా ముచ్చటగా ఉండేది. ఇది ఇంకో కారణం. ఇవన్నీ కలిసి బాల్యంలోనే నాకు రంగులపట్ల ఆకర్షణ పెంచాయి. 
చిత్రకళలో మీ గురువులు?
ప్రఖ్యాత చిత్రకారులు దామెర్ల రామారావు మిత్రుడు వరదా వెంకటరత్నం గారిని గురువుగా భావిస్తాను. ఓ పద్ధతీపాడూ లేకుండా బొమ్మలు వేస్తున్న నాకు కొద్దికాలం శిక్షణలోనే అనేక మెలకువలు నేర్పారాయన. అయితే చిత్రకళలో నాదైన ఓ ముద్ర ఉందని అనుకోవడం లేదు. దామెర్ల రామారావుగారి చిత్రకళాశైలిలోనే నేనూ వేస్తూ వచ్చాను. 
అలనాటి చిత్రకారులతో మీ అనుబంధం?
వరదా వెంకటరత్నంగారి వద్ద శిక్షణ పొంది, ఆ తర్వాత బొంబాయి జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో నాలుగేళ్లు చదివి వచ్చిన మాదేటి రాజాజీ నాకు మంచి స్నేహితుడు. మరో ప్రముఖ చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు నా చిత్రకళా పుస్తకానికి పీఠిక కూడా రాశారు. మొదటిసారి విజయనగరంలో ఆయన్ని కలిసినప్పుడు నా చిత్తరువు కూడా వేసిచ్చారు. నా తరం చిత్రకారులతో అంతంతమాత్రంగానే పరిచయాలున్నాయి. సాహితీవేత్తలతోనే స్నేహానుబంధాలు ఎక్కువ. 
రెండు దశాబ్దాలపాటు ఏ రచయిత పుస్తకం విడుదలైనా దాని ముఖచిత్రం మీదే కదా...
సుమారు వెయ్యి పుస్తకాలకు ముఖచిత్రాలు వేశాను. నేనూ సాహితీవేత్తను కావడం వల్ల చాలా మంది కవులు, రచయితలు, మిత్రులు ఏర్పడ్డారు. వారు నా మీద అభిమానంకొద్దో, గౌరవంకొద్దో వారి పుస్తకాలకు ముఖచిత్రాలు వేయిస్తుండేవారు. దానివల్ల నాకు చిత్రకళలో బాగా చెయ్యి తిరిగింది, ప్రచారమూ వచ్చింది. వారి పుస్తకాలకు ముఖచిత్రాలు వేసే క్రమంలో ఆ రచనలు చదవడం వల్ల ఎంతో లాభపడ్డాను. అలాగే నేను వేసిన తైల, నీటి వర్ణ చిత్రాలు వంద వరకు ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయి. గతంలో అద్దె ఇళ్లలో స్థలాభావం కారణంగా కొన్ని చిత్రాలను స్నేహితులకి ఇచ్చేశాను. ఇల్లు మారే సమయంలో కొన్ని దెబ్బతిన్నాయి.
మీ లేపాక్షి చిత్రాల గురించి..?
సమాచార, పౌరసంబంధాల శాఖలో పని చేస్తున్నప్పుడు మా శాఖ నాలుగు భాషల్లో ప్రచురిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పత్రిక కోసం లేపాక్షి ఆలయం, అక్కడి కుడ్యచిత్రాలు, శిల్పాల గురించి వ్యాసం రాయడానికి ఇంగ్లీషు పత్రిక కోసం గోపాల చక్రవర్తి, తెలుగు కోసం నేనూ, మాతోపాటు కుందుర్తి, ఓ ఫొటోగ్రాఫరూ, చిత్రకారుడూ వెళ్లాం. మూడు రోజులుండి వివరాలు సేకరించాం. వ్యక్తిగత ఆసక్తి కొద్దీ, మాతో వచ్చిన చిత్రకారుడితో పాటు నేనూ స్కెచ్‌బుక్‌ నిండా అక్కడి శిల్పాల్ని రేఖల్లో గీసుకొచ్చాను. కొన్ని నెలల తర్వాత వాటితో హైదరాబాదు రవీంద్రభారతిలో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాను. పర్యాటకానికి సంబంధించి 1970లో బెంగళూరు విధానసౌధలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో కూడా నా లేపాక్షి చిత్రాలు వారం రోజుల పాటు ప్రదర్శించాను. 
జర్మనీలో మీ చిత్రప్రదర్శన జరిగింది కదా...
అప్పట్లో నా మిత్రుడు దివి శ్రీధరబాబు జర్మనీలోని గోటింజెన్‌ విశ్వవిద్యాలయంలో భారతీయ తత్వశాస్త్రం మీద పరిశోధన చేసేవాడు. అతనే నా చిత్రాల్ని అక్కడికి తీసుకెళ్లి ఆ నగరంలోని ఓ హోటల్లో వారం రోజులపాటు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. నేను అక్కడికి వెళ్లలేదు. ఆ ప్రదర్శన గురించి స్థానిక పత్రికల్లో వచ్చిన కటింగ్స్, ఫొటోలు పంపించాడు. 1970వ దశకంలో హైదరాబాదు రవీంద్రభారతి కళాభవన్‌లో రెండు సార్లు నా చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశాను. నాలుగేళ్ల కిందట మరోసారి రవీంద్రభారతిలో జరిగింది. ఇంకా కావలి, విజయవాడ, యానాం, రాజమహేంద్రవరం, విశాఖల్లో నా చిత్రాల ప్రదర్శనలు జరిగాయి.  
రచన మీద ఆసక్తి ఎలా కలిగింది?
నా బాల్యమిత్రుడు కుందుం ప్రకాశరావు వల్ల సాహిత్యంతో నాకు పరిచయం కలిగింది. వాళ్లింట్లో చాలా పుస్తకాలుండేవి. వాటిని తెచ్చుకుని చదివేవాణ్ని. మా ఊళ్లో గౌతమీ గ్రంథాలయానికి అప్పుడప్పుడూ వెళ్తుండేవాణ్ని. నా కాలేజీ రోజుల్లో మా మేనమామ గారి పెద్దమ్మాయి రచనలు పత్రికల్లో రావడం చూసి నేనూ కథలు రాయడానికి ప్రయత్నించాను. రాయగా రాయగా కొన్ని స్థానిక పత్రికల్లో అచ్చవడం మొదలైంది. చెయ్యి తిరిగిన తర్వాత పెద్ద పత్రికల్లోనూ అచ్చవుతూ వచ్చాయి. కాలేజీ చదువు ముగిసేనాటికి రెండు నవలలు ధారావాహికలుగానూ, కథలు నాలుగు సంపుటాలుగానూ అచ్చయ్యే స్థాయికి చేరుకున్నాను.
ఒకవైపు చిత్రలేఖనం, మరోవైపు రచనలు.. ఎలా?
ఆర్థిక అవసరాలు ఆ రెండు మార్గాల్లో నా ప్రస్థానం సాగడానికి దోహదం చేశాయి. అద్దేపల్లి అండ్‌కో, కొండపల్లి వీర వెంకయ్య అండ్‌ సన్స్‌ లాంటి ప్రచురణకర్తలకు నా కథలు అమ్మి, వాళ్ల ప్రచురణలకు ముఖచిత్రాలు వేసి ఆ పారితోషికాలతో నా కాలేజీ చదువు పూర్తి చేశాను. ఈ ఆర్థికావసరమే నా సాహిత్య, చిత్రకళా కృషి సమాంతరంగా సాగడానికీ, నా చెయ్యి కాస్తోకూస్తో పదునెక్కడానికీ తోడ్పడింది.
కథలు, నవలలు రాసిన మీరు కవితా రచన  మీద ఎక్కువ దృష్టిపెట్టడానికి కారణం?
మొదట్లో కవిత్వం చదువుతుండేవాణ్నిగానీ నా దృష్టంతా కథలు, నవలలు మీదే ఉండేది. నేను కవిత్వంలోకి చిత్రంగా అడగుపెట్టాను. చిత్రకళలో రియలిజం, సర్రియలిజం, ఎక్స్‌ప్రెషనిజం, ఇంప్రెషనిజం లాంటి అనేక ధోరణులున్నాయి. రచనల్లోనూ అవి ఎందుకుండగూడదని అనిపించింది. ఒక ఇతివృత్తాన్ని ఎంచుకుని దాన్ని పలుధోరణుల్లో రాయాలని అనుకుని ముందుగా వచన కవిత్వంలో రాశాను. దాన్ని ఆఫీసుకి తీసుకెళ్లి తిరగరాస్తుండగా కుందుర్తి ఆంజనేయులు చదివి ‘భేష్‌’ అన్నారు. ఆ ప్రోత్సాహంతో మరింత ఉత్సాహం వచ్చి మరో రెండు ఫ్రీవర్స్‌ కథల్ని (వచన కవితలు) రాశాను. వాటిని నా మిత్రుడు శ్రీపతి ఒక పుస్తకంగా అచ్చువేశాడు. దాని పేరు ‘కొడిగట్టిన సూర్యుడు’. దానికి మంచి సమీక్షలు వచ్చాయి. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. క్రమంగా నవలలు, కథలు వెనక్కివెళ్లి పూర్తిగా కవిత్వంలో మునిగిపోయాను. అయితే, కథ, నవల, కవిత్వాల్లో మీకు ఏదిష్టమంటే సమాధానం చెప్పడం కష్టం. మూడు ప్రక్రియలూ నాకు ప్రియమైనవే. నా నవలల్లో ‘మైనా’, కథల్లో ‘ఏటిపాలైన యవ్వనం’, కవిత్వంలో నా తొలి కవితా సంపుటి ‘కొడిగట్టిన సూర్యుడు’ అంటే బాగా ఇష్టం.  
కవిగా మీకొచ్చినంత గుర్తింపు కథకుడిగా రాకపోవడానికి కారణమేమంటారు?
కథలు రాయడం 1958లో ప్రారంభించి రెండు దశాబ్దాలపాటు రాసి ఆగిపోయాను. కవిత్వం 1964లో ప్రారంభించి ఇప్పటికీ రాస్తున్నాను. అందువల్ల నా కథా రచన గురించి కొత్తతరం వారికి అంతగా తెలియకపోయి ఉండవచ్చు. అదీగాక నాకు కవులతోనే ఎక్కువ పరిచయాలున్నాయి. పైగా కవిత్వంలో ఏ కవీ చేయనన్ని ప్రయోగాలు చేశాను. ఫ్రీవర్స్‌లో కథలు రాశాను. దీర్ఘకావ్యం రాశాను. ఆత్మకథని, ఒక నవలని కూడా ఫ్రీవర్స్‌లో రాశాను. ఖండికలు కూడా మూడు గ్రంథాలుగా వచ్చాయి. అందువల్లనే నాకు కవిగా ఎక్కువ గుర్తింపు ఉందనుకుంటున్నాను.
మీ నవలలు, కథల్లో వాక్యాలు వర్ణచిత్రాల్లా అనిపిస్తాయి. ఈ శైలి ఎలా సాధించారు?
చిత్రకారులైన రచయితలందరిలోనూ ఈ ధోరణి ఉంటుంది. అడవి బాపిరాజు, బుచ్చిబాబు కూడా మంచి చిత్రకారులే. చిత్రం వేసేటప్పుడు రూపం, రంగులు, వెలుగునీడలు ఇలా అతిసూక్ష్మ విషయాల్నీ పరిగణనలోకి తీసుకుంటాం. చిత్రకారుడు రచయితో, కవో అయితే ఆ లక్షణాలన్నింటినీ పదాల్లోకి చొప్పిస్తాడు. ఈ కారణాలతో పాటు కవిత్వం విరివిగా రాస్తుండటం వల్ల నా నవలలు, కథల్లోకి కవితాత్మకత వచ్చి ఉండవచ్చు.  
కృష్ణాపత్రికలో మీ అనుభవాలు...
ఆ పత్రికలో రెండేళ్లు పనిచేశాను. అందులోనూ అనారోగ్యంతో ఆర్నెల్లు ఆస్పత్రిలోనే ఉన్నాను. రావూరి భరద్వాజ, ‘నగ్నముని’ ఎం.హెచ్‌.కేశవరావు, మంజుశ్రీ, శ్రీధరబాబు, ఉషశ్రీ లాంటి వారితో పరిచయాలు ఆ సమయంలోనే ఏర్పడ్డాయి. రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిపెట్టిన నవల ‘పాకుడురాళ్లు’ నేనున్నప్పుడే కృష్ణా పత్రికలో ధారావాహికగా వచ్చింది. ఆ నవలకు ఆయన ‘మాయజలతారు’ అని పేరుపెడితే, ‘పాకుడురాళ్లు’గా మార్చమని నేనే సూచించాను. కృష్ణాపత్రికలో పనిచేస్తున్న రోజుల్లోనే ‘మైనా’ నవలకు శ్రీకారం చుట్టాను. అందులో బర్మాకి సంబంధించిన ప్రాంతాలు, యుద్ధం తదితర వివరాల్ని కృష్ణాపత్రిక పాత సంచికల నుంచి సేకరించాను. ఆ రోజుల్లో టీబీ సోకి ఆర్నెల్లు ఆస్పత్రిలో ఉన్నాను. అక్కడ తోటి రోగుల్లో నాకు ముగ్గురు స్నేహితులయ్యారు. వారిలో ఒకరు పోలీసు. అడపాదడపా ఆయన చెప్పిన విషయాలు ‘మైనా’ నవలకు మూలం. అందులోని సంఘటనలు సగం వాస్తవం, సగం కల్పన. 
ఆనాటి ప్రసిద్ధ రచయితలతో మీ జ్ఞాపకాలు?
నాకు పరిచయాలు తక్కువ. స్వతహాగా చొరవ లేకపోవడం దానికి ఓ కారణం. బుచ్చిబాబు, సాహిత్య విమర్శకుడు శ్రీవాత్సవతో పరిచయం ఉంది. నా తొలి కథల పుస్తకానికి నాకు ఇష్టమైన రచయిత బుచ్చిబాబుతో ముందుమాట రాయించాను. శ్రీవాత్సవకు నా రచనలంటే ఇష్టం. తనే స్వయంగా నా ‘మైనా’ నవల మీద ఒక గోష్ఠి ఏర్పాటు చేశాడు. నా సమకాలీన రచయితలైన రంధి సోమరాజు, శివారెడ్డి, గోపి వంటి వారితో నాకు గాఢమైన స్నేహానుబంధాలున్నాయి తప్ప నా ముందుతరం వారితో అంతగా పరిచయాలు లేవు.
ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ పురస్కారం గురించి...
దాన్ని కుందుర్తి ప్రారంభించారు. ఆయనతో నేను, కవి గోపాల చక్రవర్తి ఆత్మీయంగా ఉండేవాళ్లం. ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌కు సంబంధించి మా సలహాలు ఇస్తుండేవాళ్లం. కుందుర్తి మరణం తర్వాత ఆయన కుమారుడు సత్యమూర్తి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ పురస్కారాన్ని కొనసాగించడానికి నా సహకారం కోరారు. నాకు ఆర్థిక భారం లేకుండా అంతా ఆయనే చూసుకున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఆయన కన్నుమూసిన తర్వాత, ఆ పురస్కారాలను నేనే కొనసాగిద్దామని అనుకున్నాను. అయితే, సత్యమూర్తిగారి భార్య శాంత పురస్కారం ఆర్థిక భారం వహిస్తానని అన్నారు. మిగిలిన బాధ్యతలు నన్ను చూడమన్నారు. ఇప్పటి వరకూ 48 ఏళ్లుగా 48 మందికి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ పురస్కారాలు ఇచ్చాం. 2018, 19 సంవత్సరాలకి పురస్కారాలు ప్రకటించాల్సి ఉండగా, కరోనా వల్ల ఆగిపోయింది. పురస్కారం కింద రూ.15 వేల నగదు, ప్రత్యేకంగా చేయించిన ఇత్తడి జ్ఞాపిక అందిస్తున్నాం.   
మీ అర్ధాంగి శీలా సుభద్రాదేవి కూడా కవయిత్రి. మీ ఇద్దరి మధ్యా సాహితీ చర్చలు, సహకారం....
మా ఇద్దరి రచనా ఇతివృత్తాలు వేర్వేరు. ఆమెకు స్త్రీల సమస్యల పట్ల ఆసక్తి. నాకు స్నేహం, సౌందర్యం, ప్రకృతి, ఆరాధనా పూర్వకమైన ప్రేమ ఇష్టం. అయినా రాసిన తర్వాత ఒకరి రచనలు మరొకరికి వినిపించుకుంటాం. విమర్శించాల్సిన చోట విమర్శిస్తూ నచ్చినచోట మెచ్చుకుంటూ ఉంటాం.
తెలుగు బోధనలో అప్పటికీ, ఇప్పటికీ వచ్చిన మార్పులు... మీ పరిశీలన..
అప్పట్లో హేమాహేమీలనదగిన సాహితీవేత్తలు తెలుగు బోధకులుగా ఉండేవారు. వారిపట్ల సమాజంలో గౌరవం ఉండేది. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పీహెచ్‌డీ, ఎంఫిల్‌ పట్టాదార్లు అధ్యాపకులైపోయి తెలుగుబోధన అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు విద్య అంటే డబ్బుసంపాదనా మార్గం. స్వేచ్ఛా జీవితానికీ, విదేశాలకి ఎగిరిపోడానికీ సులువైన దారి. అప్పుడు మాతృభాష మీద మక్కువ. ఇప్పుడు అన్యభాషంటే ఇష్టం. రాజకీయవేత్తలకు చదువు వ్యాపారమార్గం. విద్యాపరంగా విలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయిప్పుడు.
అమ్మ భాషామాధ్యమంలో చదువులు తగ్గిపోతున్నాయి కదా..?  
ఒక భాష వస్తే మరో భాష తేలిగ్గా నేర్చుకోవచ్చు. పుట్టుకతో ఏ భాష మనకు అలవడుతుందో ఆ అమ్మభాషలోనే మనకు ఏ విషయమైనా తేలిగ్గా అర్థమవుతుంది. చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలే చిరకాలం గుర్తుంటాయి. చదువు కూడా అంతే. అందుకే మాతృభాషలోనే చదువు సాగుతూ సమాంతరంగా అన్యభాష నేర్చుకునే ఏర్పాటు ఉండాలి. మాతృభాషని భూస్థాపితం చేసే దిశగా అడుగులు వేస్తూ పరభాషను బుర్రలోకి చొప్పించాలని చూడటం ఎంతమాత్రం హర్షణీయం కాదు. 
పుస్తక పఠనం రాన్రానూ తగ్గిపోతోంది? 
సాంకేతికత అభివృద్ధిచెంది, వాట్సప్, ఫేస్‌బుక్‌ లాంటివి అందుబాటులోకొచ్చి పుస్తక పఠనం కాస్త వెనకబడిందన్న మాట వాస్తవమే. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృతంగానే సాహిత్యం వస్తోంది. కానీ, అది ఎంతకాలం ఉంటుంది? ఎంత మందికి అందుతుంది? ఒక పుస్తకం అచ్చయితే అది గ్రంథాలయాల్లో, వ్యక్తుల పుస్తకాల అల్మారాల్లో సుమారు వందేళ్లపాటు నిలిచి ఉంటుంది. ఎక్కువమంది చదువుకోడానికి వీలవుతుంది. ఇదిలా ఉంటే, డబ్బు సంపాదనే చదువు లక్ష్యంగా భావించే తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి వల్ల పిల్లలకు సాహిత్యం పట్ల ఆసక్తి తగ్గిపోయింది. దాంతో వాళ్లలో సృజనాత్మక శక్తి దెబ్బతింటోంది.
సాహిత్యాన్ని ప్రజలకు ఇంకా చేరువ చేయాలంటే ఏం చేయాలి?
విభిన్న సాహిత్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే గ్రంథాలయాల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా చాలా గ్రంథాలయాలు చతికిలబడ్డాయి. వాటిని పటిష్ఠపరచాలి. సాహితీవేత్తలు సొంతంగా పుస్తకాలు ముద్రించుకోవడానికి ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించాలి. వీలైనన్ని పుస్తకాల్ని కొని గ్రంథాలయాలకు అందించాలి. పాఠశాలల్లో కూడా పాఠ్య పుస్తకేతర పొత్తాల పఠనాన్ని ప్రోత్సహించాలి. అలాగే.. కవులు, రచయితలు తోటి సాహితీవేత్తల నుంచి పుస్తకాలను ఉచితంగా ఆశించకుండా కొనడం అలవాటు చేసుకోవాలి.


నా 81 ఏళ్ల జీవితంలో ఆరు దశాబ్దాల సాహిత్య ప్రయాణం ఉంది. సాహిత్య రంగంలో అడుగుపెట్టినప్పుడు అప్పటి నా ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇంతకాలం సృజన జీవితంలో ఉంటానని అనుకోలేదు. ఈ జీవితం అంతగా ఆర్థిక ప్రయోజనం కలిగించకపోయినా నాకెంతో తృప్తిని, ఆత్మీయమిత్రుల్ని, పేరు ప్రతిష్ఠల్ని తెచ్చిపెట్టింది. ఇంతకన్నా కావాల్సింది ఏముంది!


శీలా వీర్రాజు 1939 ఏప్రిల్‌ 22న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ చదివారు. 1961 నుంచి రెండేళ్లపాటు హైదరాబాదు ‘కృష్ణాపత్రిక’లో పనిచేశారు. 1963 నుంచి 1900 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాదకులుగా పనిచేశారు. ‘కొడిగట్టిన సూర్యుడు, హృదయం దొరికింది, మళ్లీ వెలుగు (ఫ్రీవర్స్‌ కథలు), కిటికీ కన్ను, మళ్లీ వెలుగు, ఎర్రడబ్బా రైలు, ఒక అసంబద్ధ నిజం (ఖండికలు)’ వెలువరించారు. ‘పడుగు పేకల మధ్య జీవితం’ పేరుతో తొలిసారిగా ఫ్రీవర్స్‌ రూపంలో ఆత్మకథ రాశారు. ఫ్రీవర్స్‌లో ‘బతుకుబాట’ నవల ఆవిష్కరించారు. ‘వెలుగు రేఖలు, కాంతిపూలు, మైనా, కరుణించని దేవత’ ఆయన ఇతర నవలలు. 8 కథా సంపుటాలు ప్రచురించారు. 1969లో ‘మైనా’ నవలకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఉత్తమ నవలా పురస్కారం అందుకున్నారు. ‘శీలా వీర్రాజు కథలు’ సంపుటానికి 1991లో తెలుగు విశ్వ విద్యాలయం ఉత్తమ కథల సంపుటి బహుమతి దక్కింది. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి