తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

నాది ముళ్ల దారి

  • 106 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మనీష పరిమి

  • యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా manishaparimi70@gmail.com

తరతరాల సామాజిక అణచివేతతో మరుగున పడిన స్వరాల వేదనని బలంగా, పదునుగా వినిపిస్తున్న రచయిత్రి జూపాక సుభద్ర. పల్లె మట్టి పరిమళాన్నే తన అక్షర శ్వాసగా చేసుకున్న ఆవిడ.. కథలు, కవితలు, వ్యాసాలతో నిచ్చెనమెట్ల సమాజంలోని వివక్ష, దోపిడీల కోణాలను కళ్లకుకడుతున్నారు. కులం పోతేనే దళిత మహిళకు విముక్తి అని ఘంటాపథంగా చెప్పే సుభద్రతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి... 
మీ కుటుంబ నేపథ్యం?

మా అమ్మా నాన్నలకు పన్నెండు మంది సంతానం. నేను పదకొండోదాన్ని. మాది వ్యవసాయ కుటుంబం. చదివించే స్తోమత ఉన్నా, మా ఊళ్లో బడి (ఇప్పటికీ) లేదు. బస్సు సౌకర్యం కూడా లేదు. నా తోబుట్టువులెవరికీ చదువు లేదు. నేను పుట్టేనాటికే వాళ్లందరికీ బాల్యవివాహాలు అయిపోయాయి. మా అన్న, చుట్టాలు సింగరేణి కార్మికులు. మా పెద్దన్నకు పిల్లలు లేకపోవడంతో వాళ్ల దగ్గరే పెరిగాను. అక్కడే చదువుకున్నా. నేను చదువులో చాలా చురుకు. అన్ని తరగతుల్లో మొదటి స్థానమే. మా టీచర్లు నన్ను బాగా అభిమానించేవారు. నాకు పాటలు పాడటం, నృత్యం లాంటివి ఇష్టం. కానీ కొందరు టీచర్లు నేను అందంగా కనపడట్లేదని నన్ను ప్రోత్సహించేవారు కాదు. దాంతో చదువులోనైనా నన్ను నేను నిరూపించుకోవాలనే పట్టుదల ఉండేది. ‘ఇంత మంది బిడ్డలున్నా, ఇన్నెకరాలు పొలమున్నా.. పట్టా కాగితాలు చదివి చెప్పాలంటే వేరేవాళ్ల దగ్గరికి వెళ్లాల్సొస్తోంది. నువ్వు బాగా చదువుకుంటే ఆ బాధ ఉండదు కదా’ అనేవాడు మా నాన్న. చదువు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. పది తర్వాత పెళ్లి చేయాలనుకున్నారు. మా ఇళ్లల్లో ఎనిమిదేళ్లకే పెళ్లి చేసేవాళ్లు. అందరూ ‘పిల్ల బాగా చదువుతోంది’ కదా, చదుకోనివ్వు అని నాన్నకి చెప్పడంతో ఇంటర్‌ కోసం నన్ను వరంగల్‌ హాస్టల్లో చేర్చాడు. అలా వరంగల్లులోనే ఇంటర్, డిగ్రీ, చరిత్ర, తెలుగులో పీజీ పూర్తిచేశా. 
రచనల వైపు ఆసక్తి ఎలా కలిగింది? 
కళాశాల రోజుల్లో విద్యార్థి సంఘం ఉద్యమాల్లో పాల్గొనేదాన్ని. పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నినాదం ‘చదువు, పోరాడు’ బాగా నచ్చింది. వాళ్లు చెప్పే సమానత్వం, న్యాయం లాంటివి నన్ను ఆకర్షించాయి. పుస్తకాలు బాగా చదివేదాన్ని. రష్యా, చైనా సాహిత్యం, మార్క్స్, చలం, కొడవటిగంటి, కందుకూరి, గురజాడ పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాల్లో నన్ను నేను అన్వేషించుకునేదాన్ని. వాటిలో నేనెక్కడ? నా జనం ఎక్కడ? అనే ప్రశ్నలు నన్ను వెంటాడేవి. పాఠ్యపుస్తకాల్లోని బొమ్మల్లో ఒక్క దానిలో కూడా మా అమ్మ, అక్క లాంటి మనుషులు కనిపించేవారు కాదు. సంక్రాంతి గురించి గొప్పగా చెప్పేవారు. కానీ, మా దగ్గర ఆ పండగ కనిపించదు. బతుకమ్మ చేసుకుంటాం. ‘ఆ పుస్తకాల్లో ఉండేదంతా వైవిధ్యంగా ఉంది. వాటిలో గోచీలు కట్టుకునే మనుషులు లేరు. మా కట్టూ బొట్టూ, సంప్రదాయాలు ఎక్కడా లేవు. ఎందుకని?’ అనే ప్రశ్నలు నన్ను వెంటాడేవి. వాటిని చూశాక నాది కానిది నేను చదువుతున్నాను అన్న భావన వచ్చింది. నా అనుభవాలకూ, పుస్తకాల్లో ఉన్నవాటికీ ముడిపడేది కాదు. అప్పుడే నిర్ణయించుకున్నా, వీళ్లు రాయలేదు కదా, మా గురించి నేనే రాస్తా అని. నా పర్యావరణం పెద్దది. అందమైంది. 
స్త్రీవాదులు కోరుకునే విముక్తికీ, దళిత మహిళలు కోరే విముక్తికీ తేడా ఉందంటారు మీరు. ఎలా?
మన దేశంలో స్త్రీవాదాన్ని విదేశీ తెల్ల మహిళల నుంచి తెచ్చుకున్నారు. మహిళలకు మగవాళ్లతో సమానత్వం కావాలని స్త్రీవాదం చెబుతుంది. అది అందరు ఆడవాళ్లకు సరిపోదు! మన దేశంలో కుల వివక్షలు, దొర వివక్షలు, దొరసాని పెత్తనాలున్నాయి. భర్త దొరైతే దొరసానికి అన్ని వసతులు కల్పిస్తాడు. దొరసాని దొరకు మాత్రమే బానిస. కానీ, దళితుడు దొరకు బానిస. అంటే ఆ దళితుడి భార్య బానిసకు బానిస. పితృస్వామ్యం అంటేనే ఆధిపత్య కులాల మగస్వామ్యం. అది తన ఆడవాళ్లనీ, బహుజన ఆడవాళ్లూ, మగవాళ్లనీ వ్యవస్థీకృతంగా లోబరచుకుంది. కులహింసలు, ఉత్పత్తి జీవుల మీద జరిగే హింసల గురించి స్త్రీవాదం మాట్లాడదు. దళిత, బహుజన మహిళల చదువు గురించి మాట్లాడదు. మూడు దశాబ్దాల నుంచి గృహ హింస అంటారుగానీ, సమాజ హింస గురించి మాట్లాడరు. ఈ కులం వల్ల ఈ వృత్తులు అంటగడుతున్నారు అన్నదాని గురించి మాట్లాడరు. వాటిని అప్రస్తుతం చేశారు. దొర తన భార్యని నాలుగ్గోడల మధ్య మర్యాదగా చూసుకుంటాడు. ఉత్పత్తి కులాల మహిళలకు లేచింది మొదలు కడుపు నింపుకోడానికి అన్వేషణతోనే సరిపోతుంది. ఆధిపత్య కులాల మహిళలకు వెట్టిచాకిరీలు లేవు. వాళ్లకి కావాల్సింది మగవాళ్లతో సమానత్వం అంతే! కానీ ఉత్పత్తిలో ఉన్న మహిళలకు సంబంధించిన కుల, సమాజ హింసలు, శ్రమదోపిడీ సంగతేంటి? నేను దళిత స్త్రీవాదానికి కూడా వ్యతిరేకం. స్త్రీవాదాన్ని నల్ల వాళ్ల నుంచి ఎందుకు తెచ్చుకోలేదు? ఎందుకంటే అక్కడ నల్లవాళ్లు అణచివేతలో ఉన్నారు! స్త్రీవాదం అంటేనే ఆధిపత్యాల వాళ్లది. ఆధిపత్య కులాల మహిళలు ఇంట్లో పిల్లల పనులే చేస్తారు. కానీ, సమాజం మరుగుదొడ్లు కడిగే, రోడ్లు ఊడ్చే మహిళల సంగతేంటి? వారి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు? ఇదే దళిత మహిళావాదం. దళిత స్త్రీలు కోరుకునే విముక్తి కులం పోవడమే. కులం పోతేనే సమానత్వం వస్తుంది. 
బడుగుల గురించి రాసే రచయిత్రులూ, బడుగుల నుంచి వచ్చే రచయిత్రుల సంఖ్య తక్కువగానే ఉండటానికి కారణం?
అసలు బడుగులకు చదువు ఎక్కడుందీ? ఊడ్చుకుంటూ, ఇటుకలు మోసుకుంటూ, కలుపు తీసుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ బతికేవాళ్లే నేటికీ ఎక్కువ. వాళ్లింకా తిండి కోసం వెతుకులాటలోనే ఉన్నారు. ఒకసారి నేనొక అమ్మాయిని చూశాను. బాల్య వివాహం చేస్తే 12 ఏళ్లకు పిల్లాణ్ని ఎత్తుకుని వచ్చింది. అలాంటి దుస్థితిలో ఉంది దళిత మహిళ. స్త్రీవాదం వచ్చిన కొత్తలో అదో మోజు. అప్పటికి చదివేవాళ్లు, రాసేవాళ్లంతా పై వర్గాల వాళ్లే. వాళ్లు ఆధిపత్య కులాల ఆడవాళ్ల సమస్యల్ని బయటికితెచ్చారు. బహుజన మహిళల సాధక బాధకాలు, వెట్టిహింసల వరకూ వాళ్లు రాలేదు. 
ఒకప్పుడు జానపద గీతాల సృష్టికర్తలు మహిళలే కదా. అదంతా ఇప్పుడు కనుమరుగవుతోంది...
పాటకు పనికి దగ్గరి సంబంధం ఉంది. పని చేసిన మహిళలే జానపద సృష్టికర్తలు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల అది క్రమంగా కనుమరుగువుతోంది. కానీ, పూర్తిగా కనుమరుగవలేదు. తెలంగాణలో ఇంకా ఉంది.  
‘రాయక్క మాన్యం’ కథలో డక్కలి మహిళ జీవితాన్ని చిత్రించారు. ఇలాంటి అట్టడగు వాళ్ల జీవితం సాహిత్యంలోకి అంతగా ఎందుకు రావట్లేదు?
మన దగ్గర పూర్వం నుంచి సీత గురించి చాలా గొప్పగా రాశారు. ఇప్పటికీ రాస్తున్నారు. కానీ తాటకి, శూర్పణఖల గురించి రాయరు. ఈ మహిళల బాధల గురించి పట్టించుకోరు. అంటే చారిత్రకంగా కూడా బహుజన మహిళల గురించి ఏమీ లేదు. అక్కడా వివక్షే! ఇంటి ముందు ఊడ్చడానికి వచ్చే ఆమెకూ ఓ జీవితం ఉంటుంది. కానీ ఆమె పుట్టు పూర్వోత్తరాలు, ఆమె అంతరంగం ఎవరికీ పట్టదు. అందుకే వాళ్ల జీవితాలు కథల్లోకి అంతగా రావట్లేదు. డక్కలి వాళ్లు కథలు చెబుతారు. పాటలు పాడతారు. వాళ్లకి ఒక సంస్కృతి ఉంది. కానీ వాళ్ల కళల్ని గుర్తించరు. వాళ్ల గురించి కూడా అందరికీ తెలియాలి. అందుకే నేను అవన్నీ నమోదు చేయదలచుకున్నా. అందుకే రాశా. 
ప్రపంచీకరణ తర్వాత దళిత మహిళలకు కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యలేంటి? అవి మన సాహిత్యంలో ఎంతవరకూ వ్యక్తం అవుతున్నాయి?
ప్రపంచీకరణ తర్వాత పర్యావరణం దెబ్బతింది. పంటలు నాశనమయ్యాయి. కూలి పనుల్లేక పట్టణాలు, నగరాలకు వలసలు పెరిగాయి. ఈ క్రమంలో మహిళల మీద హింసలు పెరిగాయి. వేతనాలు కూడా మహిళలకు, పురుషులకు వేరు. వాళ్లకు ఉండటానికి నివాసాలు లేవు. మురికి కాలువల పక్కన, రోడ్ల పక్కన ఉండాలి. అత్యాచారాలు పెరిగాయి. అభివృద్ధి పేరుతో అంతటా వేగం పెరిగిందిగానీ, వీళ్ల బతుకు ప్రమాదంలో పడింది. వలసల వల్ల వీళ్ల పిల్లలకు చదువు లేదు. వాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకం. ఇవి మచ్చుకే తప్ప పూర్తిగా సాహిత్యంలోకి రావడంలేదు. 
రవీంద్రభారతిలో బహుజన మహిళలతో కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా?
2017 నవంబరులో ‘బహుజని’ పేరుతో పది మంది మహిళా రచయిత్రులం శ్రామిక బహుజన మహిళలతో కార్యక్రమం ఏర్పాటు చేశాం. డక్కలి, చిందు, బైండ్ల, మాష్టి, శారదకాండ్రు, కోయ, గోసంగి లాంటి మహిళలతో అందులో మాట్లాడించాం. వాళ్ల కళలను ప్రదర్శింపజేశాం. వారి పాటలు, కథలు వినిపించాం. అవన్నీ పుస్తకంగా తీసుకురావాలనుకుంటున్నాం. 
దళిత అస్తిత్వవాద స్పృహ మొదలయ్యాక దళిత మహిళల నుంచి ఎలాంటి వైవిధ్య సాహిత్యం వచ్చింది? 
కారంచేడు, చుండూరు సంఘటనలు అన్ని ఉద్యమాలని ప్రశ్నించాయి. అప్పటి నుంచి దళిత అస్తిత్వవాద స్పృహ పెరిగింది. ఎంతో మంది రచయిత్రులు వచ్చారు. గోగు శ్యామల, నేను కలిసి తెచ్చిన ‘నల్లరేగడిసాల్లు’, గోగు శ్యామల ‘నల్లపొద్దు’ సంకలనాలు ఎంతో మందిని వెలుగులోకి తెచ్చాయి. ‘నల్లరేగడిసాళ్లు’లో డక్కలి, చిందు, మాష్టి తదితర మహిళల జీవితాలు చిత్రితమయ్యాయి. ఎం.ఎం.వినోదిని ‘బ్లాక్‌ ఇంక్‌’, చల్లపల్లి స్వరూపరాణి ‘మంకెనపువ్వు’, జాజుల గౌరి ‘మన్నుబువ్వ’, రాయలసీమ నుంచి ఎండపల్లి భారతి ‘యదారి బతుకులు’, సిస్టర్‌ అనసూయ ‘విముక్తి’ నవల, ‘సృష్టికర్త’ శతకం, తాళ్లపల్లి యాకమ్మ ‘కెరటం’ నవల, ఇంకా బొజ్జ విజయ భారతి, మేరీ మాదిగ, కన్నారం ఝాన్సీ, మానస ఎండ్లూరి, స్వేచ్ఛ ఇలా చాలా మంది రచయిత్రులు వచ్చారు. కొలకలూరి స్వరూపరాణి పద్యాలు కూడా రచించారు. గోసంగి మహిళల మీద గంధం విజయలక్ష్మి రాశారు. వీళ్లందరిదీ అద్భుతమైన సాహిత్యం. తమ అస్తిత్వాల గురించి, కులం, వెట్టి చాకిరీ, హింస, లింగ వివక్షలు ఇలా చాలా వాటి గురించి వీరు మాట్లాడుతున్నారు. 
గతంతో పోల్చితే కవులు, కవయిత్రులు పెరుగుతున్నారుగానీ, వాసి ఉన్న కవిత్వం తక్కువే అనే విమర్శ ఉంది కదా..?
అలా ఎలా నిర్ణయిస్తారు? ఎలా రాశారనే కాకుండా ఏం రాశారనేది కూడా చూడాలి. అందులోని వస్తువుని చూడాలి. ఎందుకంటే కడుపు నిండిన వాడి భాష వేరు. ఆకలితో ఉన్నవాడి భాష వేరు. నీడలో మాట్లాడితే హాయిగా అనిపిస్తుంది. కానీ, ఎండలో గుండె మండేవాడి భాష గురించి కూడా ఆలోచించాలి. చాలా పత్రికలు ఏం రాశారు అన్నది పక్కనపెట్టి, ఎలా రాశారు అన్నదానికే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ స్థితి మారాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో రచయిత్రులు దృష్టి సారించాల్సిన అంశాలేంటి?
ప్రతి మనిషికీ ఆర్థిక, సామాజిక వెసులుబాటుండాలి. నచ్చింది చేసే అవకాశముండాలి. ప్రతి మనిషీ మానవతా గౌరవాలు కలిగి ఉండాలి. మనిషి జీవితానికి ఒక స్వయంప్రతిపత్తి ఉండాలి. కానీ అది లేదు. సామాజిక మానవ గౌరవం ఉండాలి. అది గాయపడింది. ప్రతి వ్యక్తీ ఉన్నత విద్య, ఉన్నత నైపుణ్యాలు కలిగి ఉండాలి. లేనితనం పట్ల ఒక నిరసన, ఒక అసంతృప్తి, ఆ గాయాల పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి. అసమానతలు, అమానవీయత పట్ల నిరసన, అసంతృప్తి ఉండాలి. వీటి మీద నేటి తరం దృష్టిసారించాల్సి ఉంది. 
సమాజం ఎంత విద్యావంతం అవుతున్నా, ఇంకా మూఢనమ్మకాలు, అవిద్యలోకి జారిపోతోంది. అది సాహిత్యంలో ఎంత వరకు ప్రతిఫలిస్తోంది?
ఇప్పటి విద్యంతా మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవడమే. విదేశాలకు వెళ్లి డాలర్లు తేవడమే. మానవ సంబంధాలు అవసరం లేదన్నట్లున్నారు. ఇదే దేశాభివృద్ధి అనుకుంటున్నారు. కానీ, మనిషి ప్రకృతిని చదవాలి. దానికి మూఢనమ్మకాలు లేవు. వర్తమాన సామాజిక సమస్యలకు, మానవ సంక్షోభాలకు సరైన పరిష్కారాన్నిచ్చేదే శాస్త్రీయ దృక్పథం. ప్రస్తుతం సమాజంలో అది లోపించింది. ఆధ్యాత్మికత, విశ్వాసాల పేరుతో మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. వీటివల్ల లబ్ధి పొందే పాలక సమూహాలు సాహిత్యాన్ని అడ్డుకుంటున్నాయి. వాటిని సాహిత్యంలో ప్రస్ఫుటం కానివ్వకుండా వ్యవస్థీకృతంగా పక్కన పెడుతున్నారు. ప్రభుత్వాలు శాస్త్రీయతను ప్రోత్సహించాలి. మనిషే దైవం, మనిషే దయ్యం. మన భయాలే దయ్యాలు. జంతువులకు ఇలాంటి మూఢాచారాలు ఉండవు. మనిషికే ఇవన్నీ.
పితృస్వామ్య భావజాలం నుంచి సమాజం బయటపడటానికి సాహిత్యం ఎలా ఉపకరిస్తుంది? 
పితృస్వామ్యం అంతా ఒకటి కాదు. మహిళలంతా ఒకటి కాదు. దళిత మహిళావాదం రావాలి. పితృస్వామ్యాలు కాదివి, మగ స్వామ్యాలు. బానిస స్వామ్యాలు. మగ బానిస స్వామ్యాలు అనాలి. దళిత మగవాళ్లకి ఇంట్లోనే ఆధిపత్యం. బయటికెళ్తే వాళ్లు బానిసలే. సామాజికంగా, ఆర్థికంగా బలవంతులే పితృస్వామ్యం చూపిస్తున్నారు. దీన్నుంచి బయటపడితే సమాజం బాగుపడుతుంది. అసమానతలు తొలగుతాయి. కుల సమానతలు వస్తాయి. పితృస్వామ్యంలో కులం, లింగ బేధాలున్నాయి. అవి పోవాలి.  
ఇన్నేళ్ల మీ సాహితీ ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకుంటే ఏమనిపిస్తుంది? 
నేను ఇరవయ్యేళ్ల నుంచి రాస్తున్నాను. చాలా తక్కువ రాశాను. వేసిన దారిలో నడవటం సులువు. కానీ నాది రాళ్లూ రప్పలున్న ముళ్ల దారి. నా అస్తిత్వవాదంతో నేను రాస్తున్నా. నా చదువు నాకు ఆలోచననిచ్చింది. జీవితం అనుభవాన్నిచ్చింది. మొదట్లో చిన్నచిన్నవి రాసేదాన్ని. మంచి స్పృహతో రాసింది మాత్రం 2000 నుంచి. ప్రతిదాన్నీ అణగారిన కోణం, ఎవరూ మాట్లాడని కోణం నుంచి రాస్తుంటా. మట్టి మహిళల దృష్టి కోణం నుంచి రాస్తున్నా. అనుభవ జ్ఞానంతో రాస్తున్నా. 
మీ ఉద్యోగం గురించి...
రచనలకు సమయం సరిపోవట్లేదని ఉద్యోగ విరమణ చేయాలనుకుంటున్నా. రెంటినీ సమన్వయం చేసుకోవడం కొంచెం కష్టమే. ఊర్లో జరిగే పండగలు, పెళ్లిళ్లకు వెళ్లడం కూడా తక్కువే. రాత్రుళ్లు, ఖాళీ సమయాల్లో రాసుకునేదాన్ని. దానివల్ల ఆరోగ్యం కూడా పాడయ్యింది. 
సమకాలీన తెలుగు కథ ఎలా ఉంది?  
బాగుంది. అస్తిత్వంతో రాస్తున్నారు. అయితే, ఆ అస్తిత్వ స్పృహ ఇంకా పెరగాలి. నేనెక్కడ? అనే అన్వేషణతో రచన మొదలవ్వాలి. వాళ్ల చరిత్ర లోతుల్లోకి వెళ్లాలి. ఆ ప్రయత్నం కొంత జరుగుతోందిగానీ, ఇంకా ఎక్కువ జరగాలి. 
ఆంగ్ల మాధ్యమం బడుల వల్ల దళితులు చదువుకి దూరమయ్యే ప్రమాదం ఉందని మేధావులు అంటున్నారు..? 
అన్ని స్థాయిల్లో ఉచిత విద్య ఉండాలి. ఎవరికి కావాల్సిన మాధ్యమాన్ని వారు ఎంచుకునే అవకాశం అందరికీ ఉండాలి. చదువును మధ్యలో ఆపేసిన వాళ్లను గుర్తించి, మళ్లీ కొనసాగించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆంగ్ల విద్య దళితులకు అందుబాటులో ఉండాలి. అందరూ ఒకే దగ్గర చదివేలా ప్రోత్సహించాలి. 
మాతృభాషల్లోనూ ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశముండాలని ప్రధాని తరచూ చెబుతున్నారు. దీనిపై మీరేమంటారు?
బాగుంది. మంచిదే! అయితే అభివృద్ధి, అవకాశాలు ఏ భాషా మాధ్యమంలో ముడిపడి ఉన్నాయో, ఆ భాషా మాధ్యమాలు అందరికీ అందుబాటులో ఉండాలి. అది అందరికీ శ్రేయస్కరం!


నాదైన నా భాష మరుగున పడిపోకూడదని నా రచనల కోసం దాన్ని ఎంచుకున్నాను. తెలంగాణ తెలుగు గూడెం భాష బతికుండాలని దాన్ని ఎంచుకున్నా. అది లేత మామిడిలాంటి భాష. కల్మషం లేని భాష. నేను అనుభవించిన బాధని సొంత భాషలోనే చెప్పాలి. అప్పుడే దాని భావం అర్థమవుతుంది


హాస్టల్లో ఉన్నప్పుడు నేను, నాతోటి వాళ్లందరం గ్రూప్స్‌ రాశాం. జనరల్‌ నాలెడ్జ్‌ మీద నాకు మంచి పట్టుంది. రాసినవాళ్లందరిలో నాకే ఉద్యోగం వచ్చింది. దాని మీద కూడా చాలా మంది దుష్ప్రచారాలు చేశారు. ఇంటికెళ్తే పెళ్లి అంటారేమోనని భయపడి, ఒక్కపూట తిని, ఎంతో కష్టపడి నేను చదువుకున్నాను. ఆకలిని పెట్టుబడిగా పెట్టి చదువుకున్నాను


ఉద్యోగం.. రచనా వ్యాసంగం
జూపాక సుభద్ర పీహెచ్‌డీ చేస్తూ గ్రూప్స్‌ పరీక్షలు రాసి సహాయ సెక్షన్‌ అధికారిగా ఎంపికయ్యారు. మూడేళ్లు డిప్యుటేషన్‌ మీద మంథని వెళ్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. అప్పట్లో మరో మహిళతో కలిసి సుభద్ర ఒక గదిలో ఉండేవారు. నెల తర్వాత ఆ ఇంటి యజమానికి వీళ్ల కులం తెలిసి, గది ఖాళీ చేయించారు. అప్పుడు మొదటి కథ ‘శుద్ధి చేయాలి’ రాశారు. ఉద్యోగ జీవితంలో అదనపు కార్యదర్శి స్థాయికి వచ్చారు. ‘సచివాలయ మహిళా సంఘం’ స్థాపించి సౌకర్యాల కల్పనకు కృషి చేశారు. ‘సచివాలయ సారస్వత వేదిక’ కూడా ఏర్పాటు చేశారు. సాహితీ జీవితంలో ఉద్యమ నేపథ్యంలో కవితలు, కథలు, వ్యాసాలు రాశారు.. రాస్తున్నారు. ఎన్నో విశ్వవిద్యాలయాల సదస్సుల్లో పాల్గొన్నారు. 2007 నుంచి 11 ఏళ్ల పాటు భూమిక పత్రికకు వ్యాసాలు రాశారు. అవి త్వరలో పుస్తకంగా రాబోతున్నాయి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి