తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

బాలసాహిత్యం అంటే బాలల హితమే

  • 113 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

ఒక రచయిత ఎంత ప్రతిభావంతులో చెప్పడానికి, తన రచనలు, వాటికి లభించిన పురస్కారాలు సరిపోతాయి. కానీ ఆ రచనల వెనుక ఉన్న నిబద్ధత తెలియడానికి, వాటి నేపథ్యం, వాటిలోని విలువలు చూడాల్సిందే! అలాంటి అరుదైన రచనలు చేసిన రచయిత్రి డి.సుజాతాదేవి. బాలసాహితీవేత్తగా తెలుగువారికి ఆవిడ సుపరిచితురాలే! పిల్లల పెంపకంపై ఆమె ఈనాడు ఆదివారంలో ‘ఆటలో అరటిపండు’ ధారావాహికను వెలువరించారు. వాటి సంకలనానికి 2013 సాహిత్య అకాడమీ ‘బాలసాహిత్య’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తెలుగువెలుగుతో పంచుకున్న ఆమె అంతరంగాలు..
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పుట్టాను. అమ్మానాన్నలు ఇద్దరూ ఉద్యోగస్థులే కావడంతోనూ, మా చిన్నాన్నగారికి పిల్లలు లేకపోవడంతోనూ, వారింట్లోనే ఎక్కువగా పెరిగాను.
నా చిన్నతనంలో జానపద కళలు విరివిగా ఉండేవి, అప్పటికప్పుడు వారు కల్పించి చెప్పే కథలు ఎంతగానో ఆకట్టుకునేవి. అప్పటి విద్యాభ్యాసం కూడా సృజనని ప్రోత్సహించేదిగా ఉండేది. వీటన్నింటికీ నా కల్పనా శక్తి తోడయ్యింది. ఏదన్నా ఊరికి వెళ్లి వస్తే, అక్కడి విశేషాలని కథలు కథలుగా చెప్పి, అందరినీ మెప్పించేదాన్ని. పుస్తకాలు చదవడమూ ఎక్కువే.. అక్షరాలు నేర్చుకోవడంతోనే, పుస్తకాలు చదవడం మొదలుపెట్టేశాను. మనం గొప్పగొప్ప పుస్తకాలు అనుకుంటున్నవన్నీ 10, 11 ఏళ్ల వయసులోనే చదవగలిగాను. దైవం అనుకూలిస్తే, నేను కూడా అలాంటి చక్కటి కథలు రాయగలనన్న ఆశ అప్పటికే మొదలైంది.
      ఇప్పటికీ నా కథల్లో అనుబంధాలకీ, విలువలకీ ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం, ఆనాడు నేను పెరిగిన స్వచ్ఛమైన వాతావరణమే! నా కథానేపథ్యాలు కూడా ఎక్కువగా పల్లె జనాలకీ, వాళ్ల వృత్తులలో ఎదుర్కొంటున్న బాధలకీ సంబంధించి ఉంటాయి. అలాంటి రచనలు చేయడం కష్టమే అయినా.. నా మనసుని కదిలించే జీవితాలను కథలుగా మార్చేందుకు, ఎంత శ్రమకైనా వెనుకాడేదాన్ని కాను. వాళ్లని కలిసి, మాట్లాడి, వాళ్ల ఇళ్లకి వెళ్లి.. ఆ ఇతివృత్తాలకు ఓ అక్షరరూపం ఇచ్చేదాన్ని. అలా వెలువరించిన నా కథలు మూడు సంకలనాలుగా వచ్చాయి.
బాలసాహిత్యంలోకి..
నేను గొప్పగా భావించిన విలువలన్నీ, పిల్లలకి చెప్పాలన్న తపనతో బాలసాహిత్యంలోకి అడుగుపెట్టాను. పిల్లల వ్యక్తిత్వాలని ఎలా రూపొందించాలో తల్లిదండ్రులకి చెప్పేందుకూ రచనలు చేశాను. ఎందుకంటే పిల్లలని పెంచడం అంటే ఒక తరాన్ని తయారుచేయడం.. ఎంత బాధ్యతతో కూడుకున్న పనో కదా ఇది! ఎవరో అన్నట్లు ‘మంచి పంట కోసం రైతు మేలిరకం విత్తనాలని తయారుచేసుకున్నంత శ్రద్ధగా, జాతి ఔన్నత్యం కోసం మన పిల్లలని గొప్పగా రూపొందించాలి’. ఇందులో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం.. ఈ ముగ్గురిపైనా సమానబాధ్యత ఉంది. 
      ఇప్పటి పిల్లలు అమ్మ ఒడిలోంచి నేరుగా బడిలోకి వెళ్తున్నారు. ఇంట్లోకంటే, బడిలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అందుకే పిల్లలు ఏ నేపథ్యంలోంచి వచ్చినా, వారిపై ఉపాధ్యాయుల ప్రభావం తప్పక ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయులకు కూడా సరైన శిక్షణ ఇచ్చేందుకు సర్వశిక్షా అభియాన్‌లోనూ పాలుపంచుకున్నాను. పిల్లల చేత కథలు చెప్పించడం ఎలా! అన్న విషయంపై ఎన్నో చర్చల్లో పాల్గొన్నాను. పిల్లల చేత కథలు చెప్పించడం వల్ల, వారిలో నిగూఢంగా ఉన్న సృజనకి పదును పెట్టినట్లవుతుంది. వారి ఊహలకి అక్షరరూపం ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు! సమస్య వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి అన్న విచక్షణ, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్న ఔచిత్యం అలవడతాయి.
పిల్లలకు సాహిత్యం ఎందుకు!
పిల్లల వ్యక్తిత్వ వికాసంలో సాహిత్యం పాత్ర విస్మరించలేనిది. మనం నేరుగా చెబితే పిల్లలకి విసుగ్గా తోచే ఎన్నో విలువల్ని, కథల ద్వారా వారి మనసుల్లో నాటగలం. అందుకోసం తల్లిదండ్రులూ కొంత సమయాన్ని కేటాయించక తప్పదు. పిల్లలు పెద్దలకి అనుగుణంగా మారడం కాదు, పెద్దలే పిల్లలకు అనుగుణంగా మారాలి. పిల్లలకి అందుబాటులో చక్కటి పుస్తకాలను ఉంచాలి, తమకి తీరిక దొరికినప్పుడు ఆ పుస్తకాలలోని విషయాలను చదివి వినిపించాలి. బాలగేయాలను వినిపించాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నా, తెలుగు పుస్తకాలనూ చదివించాలి.
      అలాగే రచయితలు కూడా ఇప్పటి తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రచనలు చేయాలి. గేయాలూ, బొమ్మలూ, కథలే కాదు, విజ్ఞాన సంబంధమైన రచనలు కూడా విరివిగా రావాలి. అందుకనే నేను కెమిస్ట్రీ కథలు, డా.కొక్కొరొక్కో (పోషకాహారం), సుజలాం- సుఫలాం (పర్యావరణం), చిట్టడవిలో చిన్నప్రాణులు (జీవవైవిధ్యం) వంటి భిన్నమైన రచనలు ప్రయత్నించాను. అసలు చక్కగా రూపొందించగలిగితే, పాఠ్యపుస్తకాలను సైతం ఉత్తమ బాలసాహిత్యంగా తీర్చిదిద్దవచ్చు. 
ఇతర మాధ్యమాలలో..
టీవీల్లోనూ అంతర్జాలంలోనూ విజ్ఞానవినోదాలు అందుబాటులో ఉన్నాయి కదా అనుకోవడానికి లేదు. వాటిలో విజ్ఞానంతో పాటు హింస, పెడధోరణులు కూడా పొంచి ఉన్నాయి. వాటిని చూసి ఆనందించి, ఆచరించే తరాలు ఎటువైపు పయనిస్తాయి? అలాగని మారుతున్న సాంకేతికతని పిల్లలకి దూరంగా ఉంచలేం. అందుకనే అంతర్జాలంలో కూడా తెలుగు బాలసాహిత్యం విరివిగా రావాలి. మనం ఏ సాహిత్యమైతే పిల్లలకి అందడంలేదని బాధపడుతున్నామో, ఆ మొత్తాన్నీ పిల్లలకి తిరిగి అందజేయవచ్చు. దానికి తెలుగువెలుగు వంటి సంస్థలు పూనుకోవాలి.
      బాలల కోసం ఉద్దేశించిన కార్టూన్‌ పాత్రలు కూడా తర్కానికి అతీతంగా ఉంటున్నాయి. ఎంతసేపూ ఎగరడం, తన్నుకోవడం తప్ప పిల్లల్లో విలువల్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కలిగించేవిగా ఉండటం లేదు. పిల్లలకు ఊహ తెలిసీ తెలియడంతోనే, ఇటువంటి అద్భుతరసానికి అలవాటుపడటంతో.. మానవీయ కోణంలో ఉండే కరుణరస సాహిత్యం వారికి రుచించడం లేదు.
ప్రభుత్వం వంతుగా..
ఒకప్పుడు రాష్ట్రప్రభుత్వ ‘బాలల అకాడమీ’ బాలసాహిత్యం కోసం ఎంతో కృషి చేసింది. పిల్లల కోసం ఎన్నో పుస్తకాలనీ, క్యాసెట్లనీ రూపొందించింది. అందులో పనిచేసిన బుడ్డిగ సుబ్బరాయన్‌ వంటివారు బాలల కోసం ఎంతగానో తపించేవారు. అటువంటి అకాడమీని అర్ధాంతరంగా మూసేశారు. దాన్ని పునరుద్ధరించాలి. అలాగే తెలుగుభాషను నేటి తరాలకు దగ్గర చేసేందుకు, బోధనాంశాలలో తగిన మార్పులు తీసుకురావాలి.
      మాతృభాష ప్రాభవం తగ్గిపోతోందన్న వేదన కేవలం తెలుగువారికే పరిమితం కాదు. ఆంగ్లభాష ప్రభావం అన్నింటినీ ముంచెత్తుతోంది. వేదాల్లో అన్నీ ఉన్నాయి అన్నట్లు, ఆంగ్లంలో అంతా ఉందట అనుకుంటున్నాం మనం. కానీ అన్నీ ఉన్నా, మన ఉనికిని మనం పోగొట్టుకున్న తరువాత, ఏముండి మటుకు ఏం లాభం! ఆంగ్లభాష నుంచి నేర్చుకోవడంలో తప్పులేదు.. కానీ మన భాషలో కూడా అటువంటి విజ్ఞానాన్ని సృష్టించే ప్రయత్నం జరగాలి.
నేను- నా సాహిత్యం
చిన్నచిన్న మాటలతో, తక్కువ వాక్యాలతోనే చక్కటి భావాలను పలికించగలనన్న నమ్మకం నాకుంది. కథ రాయడం అనేది నన్ను చాలా కదిలిస్తుంది. నేను కోరుకున్న భావతీవ్రత, కథలోకి వచ్చేంతవరకూ ప్రయత్నిస్తూనే ఉంటాను. నా కథల్లో బాగా తృప్తినిచ్చినవి.. మనస్తత్వాల గురించి రాసిన ‘చిరునామా’, సమాజంలోని వైరుధ్యాల గురించి రాసిన ‘చేపలు’, ఒక స్త్రీ గురించి రాసిన ‘ఆమె’, జీవన సంఘర్షణల నేపథ్యంలో ‘గెలుపు’. ఇతరుల రచనలలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు, బుచ్చిబాబు రచనలు, శరత్, ప్రేమ్‌చంద్‌ల అనువాదాలు నాకిష్టం.
రచనలు ఎలా ఉండాలంటే!
మనిషి జీవితం చాలా విచిత్రమైంది, భిన్నమైన మనస్తత్వాల వాళ్లు, భిన్నమైన పరిసరాలలో జీవిస్తున్నారు. అలాంటి వాళ్లు ఏదైనా సమస్యని ఎదుర్కొన్నప్పుడు, తీసుకునే నిర్ణయం వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అలాంటి పాత్రలను మనం రచనలో వ్యక్తీకరించగలగాలి. ఆ పాత్రతో మనం ఏకీభవిస్తామా లేదా అన్నది వేరే విషయం. మానవనైజాన్ని చెప్పడం మన లక్ష్యం. పాఠకులపై బలమైన ముద్ర వేసే ఇటువంటి పాత్రలను సృష్టించాలంటే, రచయితల్లో నిరంతర పరిశీలన, సహేతుక ఆలోచన ఉండాలి. తన రచనలోని మంచీచెడులను నిస్సందేహంగా విమర్శించుకోగలగాలి.
      నేను పెద్దల కోసం కథలు రాశాను, పెంపకం గురించి వ్యాసాలు రాశాను, పిల్లల కోసం కథలూ గేయాలూ రాశాను.. కానీ పిల్లల కోసం రాయడమనేది నా ధర్మంగానూ, ముఖ్యమైన బాధ్యతగానూ భావిస్తాను. ఆ పని చాలా భక్తితోనూ, శ్రద్ధతోనూ చేస్తాను. నా వ్యాసంగం నిరాటంకంగా సాగడంలో మావారు డోకల నారాయణరావుగారు, ముగ్గురు అమ్మాయిల సహకారం ఎంతో ఉంది.
గుర్తింపు మాత్రమే కాదు మార్పు కూడా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని విశ్వవిద్యాలయాలు ఇప్పుడిప్పుడే బాలసాహిత్య రచయితలను గుర్తిస్తున్నాయి. ఇది సంతోషమే కానీ, గుర్తింపు మాత్రమే కాదు కావలసింది.. మార్పు కావాలి. తాము ఏ ఆశయం కోసమైతే రచనలు చేస్తున్నారో, అవి బాలల్లో నాటుకున్నప్పుడే రచయితకు నిజమైన తృప్తి. ఒక రచయితగా జీవనోపాధిని పొందే పరిస్థితులు ఎలాగూ లేవు. కానీ, మా పిల్లలు తెలుగు చదవలేరని చెప్పడం, గొప్పగా మారిన ఈ రోజుల్లో రచయితలు ఎదురీదక తప్పదు. బాలసాహిత్యంతో మీరు ఏం సంపాదించారని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను నా మనసుకు నచ్చిన విధంగానే రచనలు చేశాననీ, వాటిని చదివిన వారిపై ఎంతోకొంత ప్రభావాన్ని చూపాయన్న తృప్తే నేను సాధించిన గొప్ప విజయం!


మేటి తరాల కోసం 
సాహిత్య అకాడెమీ మనసు గెలుచుకున్న పుస్తకం ‘ఆటలో అరటిపండు’. డిసెంబరు 2003 నుంచీ 2004 డిసెంబరు వరకు, ‘ఈనాడు ఆదివారం’లో ధారావాహికగా వెలువడిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. మేటి తరాలను తీర్చిదిద్దడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తతో ప్రతీ వ్యాసం నడుస్తుంది. కేవలం ఉపోద్ఘాతాలిచ్చే సాధారణ వ్యాసాలు కావివి. ఒక కథావాతావరణంలో, పిల్లల్నీ వాళ్ల పరిసరాల్నీ నెలకొల్పుతూ ఏదో ఓ పాత్ర ద్వారా వాస్తవాన్ని గుర్తింపచేస్తాయి. వ్యాసం ముగిసేసరికి అందులోని భావం పాఠకునిలో ఇంకిపోతుంది. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లల ముందు ఎలా మెలగాలి, పోలికలు ఎలా ఉండకూడదు, ప్రోత్సాహం ఎలా ఉండాలి.. ఇలా ప్రతి వ్యాసమూ పిల్లల పెంపకానికో పాఠమవుతుంది. బాల్యం గురించి మనం ప్రత్యక్షంగా చూసిన, అనుభవించిన పరిస్థితులు అడుగడుగునా జ్ఞప్తికి వస్తాయి. కొన్నిసార్లు చురకలు వేస్తాయి, కొన్నిసార్లు హెచ్చరిస్తాయి. మొత్తమ్మీద పిల్లల పెంపకంపై మనకున్న అపోహలని దూరం చేస్తాయి, సదభిప్రాయాలని బలపరుస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి