తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఇటు స్వేదం.. అటు వేదం 
‘దాశరథీ’ రచనా పయోనిధీ

  • 231 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

జీవితం అనుభవించడమే కాదు సార్థకం చేసుకున్నాను అని ఎవరైనా అనగలుగుతున్నారంటే ఆ వ్యక్తి నిజంగా సార్థక జీవే. 86 ఏళ్ల వయసులో శరీరం సహకరించకపోయినా మంచానికే పరిమితం కాక తప్పని పరిస్థితి ఉన్నా ఇంకా చైతన్యం తొణికిసలాడటం సార్థక జీవులకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. దాశరథి రంగాచార్య(జననం- 1928 ఆగస్టు 28)  నూటికి నూరుపాళ్లు అలాంటి వారే. ఆయన్ని ఇటీవల తెలుగు వెలుగు బృందం కలిసింది. భాష, సాహిత్యం తదితర అంశాలపై దాదాపు మూడు గంటలసేపు రంగాచార్య తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. దానికి సంక్షిప్త రూపమిది...
‘‘నాకు
అసంతృప్తి లేదు. అర్థించడం తెలియదు. నా జీవితం డబ్బుకంటే ఎంతో విలువైనది. స్వామి నాకు సమస్తం సమకూరుస్తున్నాడు’’ అంటారు దాశరథి రంగాచార్య. ఆయన రచనలను చదవడం మొదలుపెడితే వదిలిపెట్టడానికి మనసొప్పదు. ఆ రచనా కౌశలం అంత బలమైంది. చదవడం పూర్తి చేస్తే ఆ రచనల్లోని సంఘటనలను, పాత్రలను మరచిపోవడం కష్టం. అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆలోచింప చేస్తాయి. కాలక్షేపం కోసం చదువుదామనుకునే వారిని కూడా ఆయన రచనలు లాక్కుపోతాయి
      రంగాచార్య ఒక నిర్దిష్ట కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నవలా రచయితగా మారారు. వట్టికోట ఆళ్వారుస్వామి 1938కి ముందు తెలంగాణలో ఉన్న పరిస్థితులను గ్రంథస్థం చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ‘‘ప్రజల మనిషి’’ అలా తెలంగాణ నుంచి వచ్చిన తొలి నవల అయింది. ఆళ్వారు స్వామి రెండో నవల ‘‘గంగు’’. అకాల మరణంవల్ల కొంతమేరకే పూర్తి చేయగలిగారు. ఆయన మిగిల్చి పోయిన కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి తాను నవలా రచయితనయ్యానంటారు రంగాచార్య. అయితే ఆళ్వారు స్వామికి, రంగాచార్యకు ఓ తేడా ఉంది. ఆళ్వారు స్వామి అట్టే విద్వత్తు ఉన్నవాడు కాదు. ఇంగ్లాండ్‌లో నవలా రచనకు ఆద్యుడైన డేనియల్‌ డీఫో లాంటివారు ఆళ్వారు స్వామి అంటారు రంగాచార్య.
      రంగాచార్య తొలి నవల ‘చిల్లర దేవుళ్లు’ అపారమైన జనాదరణ పొందింది. ఇక రంగాచార్య కలం ఆగలేదు. ఒక్క చిల్లర దేవుళ్లు మినహా ఏ రచననూ ఆయన తిరగరాయాల్సిన అవసరమే లేక పోయింది. తొలి నవలను మాత్రం రెండు సార్లు తిరగరాశానంటారు ఆయన. 86 పుస్తకాలు వెలువరించారు. 36,000 పేజీలు స్వదస్తూరీతో రాశానంటారు ఆయన. తెలంగాణ జనజీవిత చిత్రణలో భాగంగా చిల్లర దేవుళ్లు, మోదుగు పూలు, జనపదం నవలలు రాశారు. ఆ తర్వాత అనేక నవలలు వెలువరించారు. వీటితో పాటు భారత, రామాయణ భాగవతాలను చక్కని వచనంలో అందించారు. అయినా ఆయనకున్న సాహితీ తృష్ణ ఆగలేదు. నాలుగు వేదాలనూ తెలుగులోకి అనువదించారు. ఒంటిచేతి మీద నాలుగు వేదాలనూ తెలుగులో రాసింది ఆయన ఒక్కరే.
      కథా రచనలోనూ ఆయన కృషి తక్కువేమీ కాదు. అయితే కథా రచయితగా కన్నా నవలా రచయితగానే ఆయన లబ్ధప్రతిష్ఠుడు. ఆయన కథలన్నీ నవలలుగా విస్తరింపదగినవే. 
      ‘‘సరిగ్గా ఊహ తెలియక ముందునుంచే తప్పనిపించినప్పుడు నిరసన తెలియజేసే స్వభావం’’ నాది అనే రంగాచార్యకు అవసరమైనప్పుడు తిరగబడే తత్వం కూడా ఉంది. బళ్లో చదువుతున్నప్పుడే నిజాం వ్యతిరేక సమ్మె చేయించారు. ఆయనను పాఠశాల నుంచి బహిష్కరించడమే కాకుండా మరెక్కడా చదువుకోకుండా నిషేధం విధించారు. నిజాం ప్రభుత్వం పదిహేడో ఏటనే రంగాచార్యను అరెస్టు చేసింది. పోలీసు నిర్బంధం నుంచి తప్పించుకున్న రంగాచార్య 1948 నాటి పోలీసు చర్య వరకు అజ్ఞాతవాసం గడిపి నిజాం ప్రభుత్వం మీద పోరాటం చేశారు. ఈ తిరగబడే స్వభావమే ఆయనను వామపక్ష భావజాలానికి చేరువ చేసింది. తెలంగాణ సాయుధ సమరంలోకి దూకేలా చేసింది. ప్రజా ఉద్యమాలన్నింటిలోనూ ఆయనకు పాత్ర ఉంది.
      తాను కమ్యూనిస్టును అయినందువల్లే వేదాలను తెలుగులో రాయగలిగానంటారు. కమ్యూనిస్టు కాకపోతే ఆ పని చేయగలిగే వాడిని కాదన్నది ఆయన అభిప్రాయం. తెలంగాణ జన జీవితాన్ని చిత్రించిన వ్యక్తి, కమ్యూనిస్టునని గర్వంగా చెప్పుకునే వ్యక్తి భారత, రామాయణ భాగవతాలే కాకుండా వేదాలూ రాయడం వైరుధ్యంగా కనిపించవచ్చు. ఆయన తాత్విక ధోరణిలో మార్క్సిజానికి ఎంత ప్రాముఖ్యముందో భగవదారాధనకూ అంతే ప్రాధాన్యం ఉంది. ‘‘నాకున్నదల్లా దైవభక్తే తప్ప మత విశ్వాసం కాదు’’ ఇది ఆయన నిశ్చితాభిప్రాయం. నిజమైన దైవభక్తులు సమాజాభ్యుదయానికి విధిగా అడ్డుతగులుతారన్న నియమం ఏమీ లేదుగా!
      వేదం రాసినా తన వేదం మాత్రం కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టోనే అంటారు రంగాచార్య. ‘‘మార్క్స్‌ కాపిటల్‌ ఆచరణాత్మకమైంది. అది రాసే క్రమంలో ఆయన యూరప్‌ మొత్తం తిరిగాడు. అన్ని చోట్లా ఆయనను తరిమేశారు. చివరికి ఇంగ్లాండులో తన పని పూర్తి చేశాడు. అంతటి గొప్ప ప్రజాస్వామ్య దేశం ఇంగ్లాండ్‌’’ అంటారాయన.
      ‘‘జీవనయానం’’ రంగాచార్య ఆత్మకథ. ‘‘జీవనయానం నా అంతట నేను రాసింది కాదు. ఒక సంపాదకుడు బలవంతపెడితే రాశాను. అయితే అందులో 1995 దాకానే వివరాలున్నాయి. ఇప్పుడు చెప్పుకోదగ్గ పరిణామాలూ లేవు’’ అంటారు. రంగాచార్య జీవితంలో పురోగమనతత్వం ఎంత బలంగా ఉంటుందో, ఆయన జీవన విధానం సంప్రదాయాలను అంతే శక్తిమంతంగా ప్రతిఫలిస్తుంది. ‘జీవనయానం’ ఆయన సొంత కథే అయినా అది ఒక తరం కథ. ఈ తరం వారిలోనూ స్ఫూర్తిని నింపగలిగిన నిత్యచైతన్య స్ఫూర్తి.
      నవలల్లో తెలంగాణ మాండలికం మొట్టమొదట వాడిందీ రంగాచార్యే. అయితే ఆయన నవలల్లో సంభాషణల్లో మాత్రమే మాండలికం ఉంటుంది తప్ప మిగతా భాగం ప్రామాణిక భాషలోనే ఉంటుంది. లేకపోతే అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే అవకాశం లేకుండా పోతుందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. మాండలికం వాడటం ఆయన దృష్టిలో కేవలం ప్రయోగం కోసం కాదు, నిర్దిష్ట ప్రయోజనం కోసం. ‘‘నవలల్లో సంభాషణలు మాండలికంలో రాసినా మిగతా భాగం ప్రామాణిక భాషలో రాశాను. మొత్తం నవల మాండలికంలో రాయకూడదు. జిల్లా జిల్లాకూ భాషలో తేడా ఉంటుంది. ఉండాలి కూడా. అయితే వీరందరికోసం నేను ఒక్కో పుస్తకం రాయాలా? అందుకే ప్రామాణిక భాషలో మిగతా భాగం రాశాను’’ అంటారు రంగాచార్య. ‘‘నేను చిల్లర దేవుళ్లు నవలలో ఉర్దూ ఎక్కువ వాడాను. మోదుగు పూలు నవలలో తక్కువ వాడాను. ఇక జనపదంలో అయితే అసలే వాడలేదు. జనపదంలో సాయుధ పోరాట అనంతర సంఘటనలున్నాయి’’ అంటారు.
      తెలుగు భాషకు ప్రమాదం పొంచి ఉందన్న వాదనను ఆయన పరాస్తం చేస్తారు. 1100 ఏళ్ల నుంచి తెలిసిన చరిత్ర ఉన్న తెలుగుకి ముప్పేమీ లేదనీ అయితే భాష కాలానుగుణంగా మారడం సహజమని ఆయన అంటారు. దేనికైనా మార్పు సహజమనీ, మారే లక్షణం ఉంది కనుక, మారేదేదైనా నిలుస్తుందని, అందుకే తెలుగు కచ్చితంగా మనగలుగుతుందని ఆయన నమ్మకం. ‘‘తెలుగు అంటే నగరాల్లో మాత్రమే చూసి నిర్ణయానికి రాకూడదంటారు. తెలుగు భాష ఉంటుందా పోతుందా అనేది తెలుసుకోవాలంటే మనం పల్లెలను సందర్శించాలి. సంస్కృతం నిలిచినప్పుడు తెలుగు ఎందుకు నిలవదు’’ అన్నది ఆయన ముక్తాయింపు.
      తెలుగు భాషంటే ఎంత అభిమానమో ఉర్దూ అన్నా అంతే అభిమానం. ‘‘నాపై ఉర్దూ రచనల ప్రభావం ఉంది. జిలానీ బానో రచనల్లో తెలుగు ప్రభావం చాలా ఎక్కువ. తెలుగు జీవితాన్ని ఉర్దూలో రాయగల ప్రతిభావంతురాలు జిలానీ బానో’’ అంటారు. ఆమె కథలు కొన్నింటిని తెలుగులోకి అనువదించారు కూడా.
      ‘‘చిల్లరదేవుళ్లు నవలకు అమిత జనాదరణ దక్కినా నాకు ఇష్టమైన నవల మాత్రం మోదుగుపూలే’’, అందులో విప్లవం ఉన్నందువల్లే ఆ నవల తనకు ఇష్టమంటారు. చిల్లర దేవుళ్లు 1938కి పూర్వం తెలంగాణ జన జీవితాన్ని చిత్రించింది. 1971లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వెండితెరకూ ఎక్కింది. హిందీ, ఇంగ్లిషు భాషల్లోకి అనువాదం అయింది. కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు ఎం.ఏ. విద్యార్థులకు ఈ నవలను పాఠ్యాంశంగా నిర్ణయించాయి. ఈ రచన మీద ఇంతవరకు ఆరు ఎం.ఫిల్‌ పట్టాలు వచ్చాయి. ఇవన్నీ నవల ప్రాచుర్యానికి నిదర్శనాలు.
      మోదుగుపూలు నవలలో అన్నీ సజీవ పాత్రలే, ఆనాటి సమాజానికి ప్రతీకలే. ‘జన్మజన్మాల బూజు నిజాం’కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు ఇది ప్రతిరూపం. ప్రజా ఉద్యమాలను రంగాచార్య ఎంత శాస్త్రీయంగా అర్థం చేసుకోగలరో ఈ నవల రుజువు చేస్తుంది.
      ‘అమృతంగమయ’లో ‘‘ఈ దేశంలోకి ఇంగ్లీష్‌ వాడు అడుగు పెట్టినప్పుడే మన దేశం పతనం ప్రారంభమైంది’’ అనిపించారు కేశవస్వామి పాత్ర చేత. ప్రస్తుత దశలో ప్రజా ఉద్యమాలకు ఆస్కారం లేకుండా పోతోందన్న ఆవేదన వెలిబుచ్చారు. అని ఉద్యమం, విప్లవం అంశాలపై తర్క సహితమైన, శాస్త్రీయమైన భావాలు వ్యక్తీకరించగల ఉద్యమశీలి రంగాచార్య.
      ‘అమృతంగమయ’నవలలో ఈ సంభాషణను చూస్తే రంగాచార్య అవగాహనా శక్తిలోని లోతు ఎంత అపారమైందో అర్థం అవుతుంది. ‘‘అయ్యగారూ! వెలుగుకు భ్రమిసిన, అక్కరకు వస్తదని తెచ్చిన, అపచారం అయింది మన్నించండి. లాంతరు కొంచపోత. కుమ్మరోళ్ల నోళ్లల్ల నేనెందుకు మట్టికొట్టాలె’’ భూషయ్య లాంతరు పట్టుకున్నాడు. లేవబోయాడు.
      కేశవ స్వామి భూషయ్యను కూర్చోబెట్టాడు.
      ‘‘భూషయ్యా! నీవు చేసిన అపరాధం- అపచారం ఏమీ లేదు. అగ్గిపెట్టెను నిలవరించగలిగామా? వీడు- తెల్లవాడు- ప్రపంచాన్నే భ్రమలో పడేశాడు... మనకు లాంతర్లే కాదు, అనేకం తప్పవు. వాడు మన జీవన విధానాన్నే మసి చేస్తాడు... ఇంగ్లీషువాడు అడుగు పెట్టిన నాడే ఈ దేశపు పతనం ప్రారంభమైంది. ఈ దేశాన్ని ఆ మహాత్ముడే రక్షించాలి’’ అంటాడు.
      పిరాట్టమ్మ లాంతరు అందుకుని సాగింది. ఆమె వెంట చీకట్లు సాగుతున్నట్లనిపించింది.
      పాశ్చాత్య నాగరికత మన నాగరికతను ఎలా కబళించిందో ‘అమృతంగమయ’లో భారతీయ జీవనాన్ని, గ్రామ వ్యవస్థనీ, స్వయం పోషకత్వాన్నీ ఐరోపా వ్యాపార సంస్కృతి ఎట్లా దెబ్బతీసిందో అత్యంత వాస్తవికంగా చిత్రించారు రంగాచార్య. అయితే ఆయన గతాన్ని పట్టుకుని వేలాడే లక్షణం ఉన్నవారు కాదు. భవిష్యత్తు మీద ఆయనకు బోలెడు ఆశలున్నాయి. 1948 నుంచి 1967 దాకా ఉన్న పరిస్థితిని ‘జనపదం’ నవలలో చిత్రిస్తే రానున్న కాలం ఎలా ఉంటుందో ‘రానున్నది నిజం’లో రూపుకట్టించారు. ఈ కల నెరవేరి సోషలిజం ఇంకా సాకారం కానందుకు చాలామందికి వ్యథ కలిగినట్టుగానే రంగాచార్యకూ అది వ్యథాభరితమే. ఉద్యమించాలన్న తపన ఇప్పటికీ ఆయనలో సచేతనంగానే ఉంది.
      వివిధ సందర్భాలలో భిన్న అంశాలపై ఆయన వ్యాసాలూ రాశారు. ‘అక్షర మందాకిని’, ‘శబ్దశ్వాస’ అలాంటి వ్యాసాల సంపుటులే. తెలంగాణ జనజీవనంలోని ఘట్టాలను అక్షరీకరించడమే కాకుండా సమకాలీన సమస్యలనూ ఆయన వ్యాఖ్యానించారు.
      రంగాచార్య మొదటినుంచీ ఉద్యమ ప్రాణి. 1959లో మారేడుపల్లిలో ఆయనకు మునిసిపాలిటీ ఒక ఇంటిని కేటాయించింది. అక్కడో పేదవాడ ఉండేది. అక్కడ ఉండే వారంతా పల్లెలవారు. కడుపు చేత పట్టుకొని పట్నం వచ్చినవారు. కొంతకాలం తరువాత ఈ స్థలం తనదేనని దిగాడు ఒక దాదా... గూడెం వాళ్లంతా రంగాచార్యను ఆశ్రయించగా, గుడిసెవాసులను రక్షించడానికి ఉద్యమం నిర్వహించారు. విజయం కనుచూపు మేరలో ఉండగా భూస్వామి వలపన్నాడు... వాడు డబ్బు చూపాడు... వీళ్లు లొంగిపోయి గుడిసెలు విప్పుకొని వెళ్లిపోయారు.
      ప్రజా ఉద్యమాలను సహితం డబ్బు సంచులు కొనే ధనస్వామ్యం ఇది. ఆ జీవితాలు, ఆ పోరాటం దాశరథి మనసు మీద చెరగని ముద్ర వేశాయి. దానికి అక్షరాకృతే ‘మాయజలతారు’ నవల.
      అనువాదంలోనూ ఆయన తన నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నారు. బెంగాల్‌ కరవు మీద భవానీ భట్టాచార్య రాసిన ‘‘బీ’ ్ర్త్న ౯i్ట’( ్చ ్మi్ణ’౯’’ నవలను ‘దేవుని పేరిట’గానూ, మిర్జా పన్యా కవయిత్రి కథను ‘ఉమ్రావ్‌జాన్‌ అదా’ అన్న నవల రాస్తే దాన్నీ రంగాచార్య తెలుగులోకి అనువదించారు. 
      ఇక్బాల్‌ కవితలకు అనుసృజన చేసి తెలుగు పాఠకులకు అందించారు. ఆయన కవితలూ అల్లారు.
‘‘అగ్గిరవ్వ వచ్చి ఆవము కాల్చును
 పురుగు చేరి చెట్టు చెరిచి వేయు
 చెడు తలంపు చేరి చెరచురా నరులను
 విశ్వజనుల వాణి వినర రంగ’’
అని ఆటవెలదుల్లో చెప్పారు. ఆయన బాలల సాహిత్యమూ సృజించారు. గాంధీ జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నింటినీ కలిపి ‘మహాత్ముడు’, వివేకానందుడి జీవితాన్ని ‘వివేకానందుడు’గానూ, కాళిదాసు శాకుంతలాన్ని ‘శకుంతల’గానూ పిల్లల కోసం అందించారు. ‘బుద్ధజీవిత సంగ్రహం’ కూడా రాశారు. 
      అయితే ఆయనకు చేతగానిదీ ఒకటుంది. అదే పొగడటం. ఆ పనే చేస్తే ఆయన దాశరథి రంగాచార్యే కాదు. తెలుగువాళ్లకు ఇంతటి అమూల్య సాహితీ సంపద దక్కేదే కాదు. నమ్మినదాన్ని ఆచరించడం, చూసినదాన్ని వాస్తవిక దృక్పథంతో అక్షరాలలో కూర్చడం మాత్రమే ఆయన చేయగలరు.
      ‘‘ఉద్యమాలే ప్రధానం కానీ నాయకులు కాదు. ఉద్యమమే సుందరయ్యనూ, చండ్ర రాజేశ్వరరావునూ నడిపించింది’’ అంటారు. ఉద్యమాలు కొనసాగుతున్నప్పుడు నవలలు రావడానికి ఆస్కారం లేదంటారాయన. ఒక వ్యవస్థ మారుతున్న క్రమాన్ని కవితలు, కథలు, అక్షరబద్ధం చేయగలుగుతాయనీ, ఉద్యమాన్ని సమగ్రంగా బేరీజు వేసుకునే అవకాశం ఉన్నప్పుడే నవల వెలువడుతుందని ఆయన అంటారు. ఇప్పుడు ఉద్యమాలు లేవు కనుక మంచి నవలలు రావడం లేదంటారు.
      రంగాచార్య అగ్రజుడు దాశరథి కృష్ణమాచార్యదీ ఇదే బాట. అయితే ఆయన సినిమా పాటల రచయితగా కూడా ప్రసిద్ధులు. మీరు సినిమాలవైపు ఎందుకు వెళ్ల లేదు అంటే ‘‘నాకు సినిమా కంటే మునిసిపాలిటీ ఉద్యోగమే మంచిదనిపించింది’’ అంటూ ముగించారు.


     మన దేశం క్యాపిటలిజం తాత అయింది. అమెరికాకు పూర్తిగా దాసోహం అంటున్నాం. అలాంటప్పుడు ఉద్యమాలు రావటం కష్టం. విప్లవం భారత దేశం నుంచి రాలేదు. రష్యా నుంచి వచ్చింది. అలాగే కార్మిక దేశం నుంచే విప్లవాలు రావాలి. మన దేశం ఇప్పటికీ వ్యావసాయిక దేశమే. అందుకే ఇక్కడ ఉద్యమాలు రావు. స్వతస్సిద్ధంగా తయారయ్యే శక్తి భారత్‌కు లేదు.


     నేను కథలు రాయమంటేనే రాశాను తప్ప నా అంతట నేను రాయలేదు. నా కథల్లో జీవితంలో ఏదో ఒక కోణం ఉంటుంది. అలా అని నా కథలు చెడ్డవి కావు


     ఇప్పుడంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. డబ్బే స్ఫూర్తి, డబ్బు కోసమే చదువుతున్నారు. కనుక చదువూ అంతంత మాత్రమే. ఇక జ్ఞానం అసలేలేదు అని సమాజ పతనంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 


     ప్రపంచీకరణ మనిషినీ, దేశాన్నీ, ఖండాలను ముంచివేసే మహాసముద్రం... ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వమూ గొంతు విప్పలేకున్నది... ఒకే ఒక్క దేశం(ప్రజలు కాదు, ప్రభుత్వం మాత్రమే) ఇంత దుశ్చర్యకు పాల్పడుతుంటే ఎదురు మాట్లాడటానికి ప్రయత్నించడంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రయత్నం జరగాలో అంతా జరగట్లేదని వ్యథగా ఉంది... స్వాతంత్య్రం, శాంతి, సహనం కోరే ప్రజలు, ప్రజా సంఘాలు ఎదిరించవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మనం మేల్కోకుంటే రానున్న తరాలు మనల్ని క్షమించవు. రాబోయే తరాల బిడ్డలను మనం బానిసల్ని చేసిన వారమవుతాం అని ఆవేదన వ్యక్తం చేస్తారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి