తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగులో మాట్లాడితే... అదో తుత్తి

  • 136 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తెలుగు వెలుగు బృందం

ఏవీఎస్‌ పేరు చెప్పగానే ‘మిస్టర్‌ పెశ్లాం’లోని గోపాల్‌ పాత్ర చటుక్కున గుర్తొస్తుంది. ‘ఉత్తినే...’ అంటూ నత్తినత్తిగా మాట్లాడే తీరు తలచుకోగానే నవ్వొచ్చేస్తుంది. అయితే నిజ జీవితంలో ఆయన భాష స్పష్టంగా, అందంగా... ఇంకా చెప్పాలంటే హుందాగా ఉంటుంది. ఎంతసేపు మాట్లాడినా అందులో వాక్యనిర్మాణ దోషాలుండవు. ఎందుకంటే ఆయన స్వతహాగా పాత్రికేయుడు కాబట్టి. భాషంటే ఆయనకు మమకారం, మహా ప్రేమ. ‘ఆంధ్రా షెల్లీ అంటూ కృష్ణశాస్త్రికి బిరుదు ఇవ్వడం ఏమిటండీ..? ఆయన షెల్లీ కంటే గొప్పోడు’ అంటారాయన. ఆయనకు తెలుగు రచయితలంటే అంతటి అభిమానం. ఇటీవలే ఏవీఎస్‌ తెలుగు ప్రేక్షకుల్ని శోక సముద్రంలో ముంచి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఏవీఎస్‌ చివరి ముఖాముఖి ‘తెలుగు వెలుగు’ పాఠకుల కోసం...
‘ఉత్తినే’ అడుగుతున్నాం... అనుకోకుండా మీ తెలుగు భాషా పాండిత్యం ఎక్కడ ఎలా మొదలైందో కాస్త చెబుతారా?
బహుశా... అమ్మ పొత్తిళ్లలోనే అనుకొంటా. అందుకే మనం నేర్చుకొనే మొదటి భాషని ‘అమ్మ భాష’ అంటున్నాం. నా తెలుగుకి మా అమ్మే మొదటి పంతులమ్మ. లాలపోస్తూ ఎన్నో కథలు చెప్పేది. చందమామను చూపించి అన్నం తినిపిస్తూ ఇంకెన్ని ఊసులు వల్లించేదో.? అసలు మన సంస్కృతిలోనూ, సంప్రదాయాల్లోనూ ఉన్న గొప్పదనం ఇదేనేమో..? తొలి పాఠాలన్నీ అమ్మనాన్నల దగ్గర నుంచో, తాతయ్య నానమ్మల దగ్గర నుంచో నేర్చుకొంటాం. అలా బడికి వెళ్లకుండానే ఎన్ని పాఠాలు బుర్రకి ఎక్కేశాయో!
తెలుగులో మొదటి మార్కులన్నీ మీకేనా..?
తెలుగు పాఠాలంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా వేమన పద్యాలు. నాలుగే ‘నాలుగు ముక్కల్లో జీవన సారాన్ని భలే బోధించారే’ అనిపిస్తుంది. అంత సూటిగా, స్పష్టంగా చెప్పగలిగే కవి ఎవరున్నారు? నేను కూడా అలాంటి చిన్న చిన్న పద్యాలు రాయడానికి ప్రయత్నించేవాడిని. కొన్నాళ్ల తరవాత వాటిని చదువుకొంటే నాకే నవ్వొచ్చేది. కానీ... నాలోని రచయిత అలా చిన్నప్పుడే బయల్దేరాడు. ఇక మార్కుల విషయానికొస్తే మిగతా సబ్జెక్టుల కంటే తెలుగులోనే ఎక్కువ మార్కులొచ్చేవి. అవి ఎన్ని అని మీరడక్కూడదు, నేను చెప్పకూడదు. చెబితే మిగతా విభాగాల్లో నేనెంత ‘గొప్ప’ విద్యార్థినో మీకు అర్థమైపోతుంది.
ఇంతకీ పుస్తకంతో స్నేహం ఎప్పటి నుంచి?
చిన్నప్పటి నుంచీ ఉంది. కాకపోతే మరీ ఇంత ఉధృతంగా లేదు. చందమామ, బాలమిత్ర నాకు మంచి నేస్తాలు. తమాషా కథల్ని ఇష్టపడేవాణ్ని. విక్రమార్కుడు కథల్లో పొడుపు కథలుంటాయి. ‘ఈ చిక్కుముడి విప్పకపోతే నీ తల వెయ్యి వక్కలైపోవు గాక...’ అనగానే మనం కూడా ఆ చిక్కుముడి విప్పడానికి ప్రయత్నిస్తాం. మెదడుకు మేత పెట్టే అలాంటి కథలు ఇప్పుడెక్కడ? కాన్వెంట్‌ నుంచి రాగానే పిల్లలకు హోంవర్క్‌ల బాధ్యతలు. ఆ తరవాత టీవీలకు అతుక్కుపోతున్నారు. అక్కడ కార్టూన్‌ల హడావుడి. చదవడం అంటే స్కూలు పుస్తకాలే అనుకొంటున్నారంతా. కానీ అసలైన చదువు ఇలాంటి కథల్లోనే ఉందని ఎప్పుడు తెలుసుకొంటారో ఏమిటో? ఆ తరవాత శ్రీశ్రీ, చలం, కృష్ణశాస్త్రి వీళ్లంతా నన్ను రాత్రిళ్లు నిద్ర పట్టకుండా చేసేవారు. చలం భావాలు మనం భరించగలమా? కొరడాతో కొట్టినట్టుండేవి ఆ రచనలు. శ్రీశ్రీ శైలి అర్థం చేసుకొనే కొద్దీ ఒళ్లు పులకించిపోయేది. శ్రీశ్రీని చదవకపోతే తెలుగు సాహిత్యం పూర్తవుతుందా? ‘ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం..’ అంటాడాయన. నిజంగా ఆయన్ని చదవడం ఓ తీరని దాహం లాంటిదే. ఇక తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’లో ఒక్కోపేజీ తిప్పండి. తెలుగు భాషలో ఎంత చిక్కదనం ఉందో అర్థం అవుతుంది. వీరందరినీ చదవడం ఒక ఎత్తు. దేవులపల్లి కృష్ణశాస్త్రి మరో ఎత్తు. ఇంతమంది కవులు, రచయితలూ మనకున్నందుకు తెలుగువారిగా అందరం గర్వించాలి.
పాత్రికేయుడిగా పనిచేశారు కదా..? ఆ విషయంలో భాష మీకెంత తోడ్పాటు ఇచ్చింది?
నాకంటూ ఓ గుర్తింపు తీసుకొచ్చింది నేను నేర్చుకొన్న భాషే. చమత్కారం నిండిన శీర్షిక పెడితే ‘ఇది కచ్చితంగా సుబ్రహ్మణ్యందే’ అనుకొనేవారు. పదాల గారడీ చేసేవాడిని. ప్రవేశికలో నా ముద్ర చూపించాల్సిందే. ఓ మంచి కథనం రాస్తే ఎంత సంతృప్తి ఉండేదో..? ఇవన్నీ చేయాలంటే భాషపై పట్టుండాలి కదా? భాష నేర్చుకొంటే సరిపోదు. దాన్ని తెలివిగా వాడటం, సందర్భానుసారంగా ప్రయోగించడం తెలిసుండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతుడినే. నాకేదో గొప్ప భాషా పాండిత్యం ఉందని చెప్పడం లేదు. తెలిసిన ఆ కాస్త భాషనీ తెలివిగా ఉపయోగించుకొన్నానంతే. పాత్రికేయ వృత్తిని వదిలేసినా నా రచనా వ్యాసంగం మాత్రం కొనసాగింది. కొన్ని కథలు రాశా. అవి అచ్చయ్యాయి కూడా. ‘ఉత్తినే’ పేరుతో వ్యాస సంపుటి రాశా. సమకాలీన విషయాలకు వ్యంగ్యం జోడించి రాయడం వల్లే ఆ వ్యాసాలకు గుర్తింపు దక్కింది. ‘నాకెప్పుడు మనసు బాలేకపోయినా నీ ‘ఉత్తినే’ పుస్తకం చదువుతుంటా’ అంటుంటారు సన్నిహితులు. వాళ్లు ‘ఉత్తినే’ అన్నా.. లోలోపల చాలా సంతోషించేవాణ్ని. చిన్ని చిన్ని కవితలూ రాసేవాణ్ని. అయితే అవన్నీ రాజకీయ అంశాలతోనే సాగేవి.
నటుడిగా మీ ప్రయాణంలో భాష ఎంత వరకూ దోహద పడింది?
నటుణ్ని కాకముందు నేనో మిమిక్రీ కశాకారుణ్ని. చాలామంది గొంతుల్ని అనుకరించేవాణ్ని. ఒకొక్కరిదీ ఒక్కో శైలి. ఒక్కో యాస. అవన్నీ అర్థం చేసుకొనే కదా... వారిని బాగా అనుకరించేది. ఎన్టీఆర్‌ ఒకలా మాట్లాడేవారు. ఆయన భాష ఓ స్థాయిలో ఉండేది. దాన్ని అవగాహన చేసుకోకపోతే ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు. ఎవరి గొంతులో ఏ పదం ఎలా పలుకుతుంది? అని తెలుసుకోవాల్సిందే. అందుకోసం ప్రత్యేకమైన సాధన చేసేవాణ్ని. ‘దాన వీర శూర కర్ణ’లాంటి సినిమాల్లో ఎన్ని అపురూపమైన సంభాషణలు ఉన్నాయో? వాటిని సినిమా డైలాగులే అని తీసి పారేయలేం... అర్థం చేసుకొని, ఒక్కొక్క పదంలోని మాధుర్యం తెలుసుకొంటే భాషపై ప్రేమ పెరుగుతుంది. నాతొలి చిత్రం ‘మిస్టర్‌ పెశ్లాం’. నాకు ఎంత అదృష్టమంటే, తెలుగు సినిమా భాషకు ఓ కొత్తదారి చూపించిన రమణగారితో నాకు సాన్నిహిత్యం కలిగింది. ‘ఉత్తినే..’ అనే ఆ సినిమాలో వాడా. అది నా జీవితంలో ఎంతగా ముడిపడిపోయిందో? రమణగారి సంభాషణలు భలే గమ్మత్తుగా ఉండేవి. మా బంధం సినిమాలకే పరిమితం కాలేదు. సినిమాల్లేనప్పుడూ ఆయన్ని కలుస్తుండేవాణ్ని. ‘కోతి కొమ్మచ్చి’ పుస్తకం చదువుతుంటే ఆయనతో మాట్లాడినట్టే ఉంటుంది. అంత గొప్ప శైలి ఆయనది.
ఇప్పటి సినిమాల్లో తెలుగు ఎలా ఉంది?
సినిమా కళాకారుడిగా నా రంగాన్ని తక్కువ చేయలేను. అలాగని ఓ భాషాభిమానిగా ఊరుకోలేను. కొన్ని సినిమాలు చూస్తే భాష దిగజారిపోతుందనిపించేది నిజమే. కానీ అవే ప్రామాణికాలు కావు కదా..? స్వర్ణయుగం రోజుల్లోనూ కొన్ని చెత్త సినిమాలొచ్చాయి. ఇప్పుడూ కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి. ‘మిథునం’ చూశా. ‘అద్భుతః’ అనిపించింది. మనదైన భాష, మనదైన సంప్రదాయం, మనదైన అనుబంధం ఆ చిత్రంలో ఆవిష్కరించారు. ఒక్క ఇంగ్లిషు సంభాషణ అయినా ఉందా? ఒక్క ద్వంద్వార్థం అయినా ధ్వనించిందా? మరి అలాంటి సినిమాల్ని మనం ఎందుకు ప్రోత్సహించం? మంచి సినిమాలు రావు, రావు అంటారు. వస్తే ఎందుకు పట్టించుకోరు? చెత్త సినిమాలు వచ్చినప్పుడు ధర్నాలు చేస్తుంటారు. పోస్టరుపై పేడ కొడుతుంటారు. మరి ‘మిథునం’లాంటి మంచి సినిమా వస్తే వరుసలో నిలబడి టికెట్టుకొని సినిమా చూడొచ్చు కదా? మనకూ ఇప్పుడు మంచి రచయితలు వస్తున్నారు. ‘గమ్యం’, ‘వేదం’, ‘పిల్లజమిందార్‌’, ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’, ‘ఓనమాలు’... ఇలాంటి సినిమాల్లో సంభాషణలు మనసుకు హత్తుకొన్నాయి. అంటే మంచి రచయితలు వస్తున్నారనే కదా అర్థం. 
భవిష్యత్తులో మన భాష ఎలా ఉండబోతోంది?
ఎలా ఉంటుందో పక్కన పెట్టండి. ఎందుకంటే అది మన చేతుల్లో ఉంది. భాష అభివృద్ధి ఇంట్లోనే ఉంది. మన పిల్లలతో మనం ఏ భాషలో మాట్లాడుతున్నాం? వారికి ఏం నేర్పిస్తున్నాం? అనేది ఆలోచించాలి. ‘హాయ్, బాయ్, అంకుల్, ఆంటీ..’ ఇలాంటి మాటలు మన ఇంట్లో పిల్లలు మాట్లాడుతుంటే మనం మురిసిపోతుంటాం. మాట్లాడండి, పరాయి భాషలు నేర్చుకోండి. కాదనేవారు ఎవరు? అదీ పురోభివృద్ధిలో భాగమే. కానీ.. మన భాష మర్చిపోతే ఎలా? తెలుగులో పదాలకు కొరత ఎక్కడుంది? ‘ఇంటర్నెట్‌’ అనే పదాన్ని ఇప్పుడు ‘అంతర్జాలం’ అని మార్చారు. అంతర్జాలమా? మరీ ఇంత తెలుగు అవసరమా? ఎవరు పలుకుతారు? అనుకొన్నారు. కానీ తరవాత అదే అలవాటైపోయింది కదా..? రైలుని ధూమశకటమని పలకాల్సిందే అని ఎవరూ అనరు. కానీ అందుబాటులో ఉన్న పదాల్ని మర్చిపోతే ఎలా? ‘ఎవరో ఒకరు వాడకపోతే కొత్త పదాలు ఎలా పుడతాయి?’ అని పింగళివారన్నట్టు ‘ఎవరూ వాడకపోతే ఉన్న పదాలు మాసిపోతాయి’. ఆ ప్రమాదం గుర్తించాలి. ఇద్దరు తెలుగువాళ్లు కలిసినప్పుడు మరో భాష ఎందుకు? తెలుగులో మాట్లాడితే అదో తుత్తి. పరాయి భాషలో మాట్లాడితేనే గౌరవం, హోదా వస్తాయా? ఏ భాషలో మాట్లాడాం అనేది కాదు, ఎంత స్పష్టంగా మాట్లాడాం, మన భావాల్ని అవతలి వారికి అర్థమయ్యేలా ఎంతో బాగా చెప్పాం అనేదే ప్రధానం.
భావి తరాలకు స్వచ్ఛమైన తెలుగు దొరుకుతుంది అంటారా?
మన సంస్కృతి, సంప్రదాయాలకు మనం విలువ ఇస్తున్నంత కాలం తెలుగు భాష బతుకుతుంది. సంక్రాంతి పండుగ అంటే తెలియనివాడికి గొబ్బెమ్మ అంటే ఏం తెలుస్తుంది? అదో పిండివంటకం అనుకొంటాడు. కాబట్టి మనదైన సంప్రదాయాలను గౌరవించడం కూడా భాషలో భాగమే.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి