తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

పుస్తకాలకు స్థలమే లేదు!

  • 83 Views
  • 0Likes
  • Like
  • Article Share

‘ఆడుతూ పాడుతూ, లీలామహల్‌ సెంటర్, బ్లేడ్‌బాబ్జీ, కెవ్వుకేక, మిస్టర్‌ పెళ్లికొడుకు’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు దేవీప్రసాద్‌. రెండు దశాబ్దాలుగా దర్శకత్వ విభాగంలో ఉన్న ఆయన విస్తృతంగా పుస్తకాలు చదువుతుంటారు. మంచి చిత్రకారులు కూడా. ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో నటుడిగానూ గుర్తింపు పొందిన దేవీ ప్రసాద్‌తో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి...

పుస్తక పఠనం మీద ఆసక్తి ఎలా మొదలైంది? 
పాఠశాలలో చదివే రోజుల్లో ప్రతిరోజూ మా అమ్మకి గ్రంథాలయం నుంచి పుస్తకాలు తెచ్చివ్వడం అలవాటు. ఆమె వల్ల గొప్ప రచయితల పేర్లు తెలిసినా నా పఠనం మాత్రం సినిమా పత్రికల వరకే ఉండేది. బాపట్ల ఆర్ట్స్‌ కళాశాలలో చేరాక అక్కడ పుస్తకాలు చదివి చర్చించే మిత్రుల వల్ల సాహిత్యాభిలాష మొదలైంది. ఒకరి పుస్తకాలు ఒకరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేవాళ్లం. చదివిన తర్వాత కథనం, ముగింపు, మలుపులు లాంటి వాటి మీద చర్చలు జరిగేవి. అలా పుస్తకాలు విరివిగా చదవాలనే ఆసక్తి కలిగింది. పఠనం పట్ల ఉన్న ఈ అభిలాషే సినిమాల వైపు నడిపించింది. మనుషుల్ని అర్థం చేసుకోవడానికీ, నన్ను నేను కొంతైనా తెలుసుకోగలగడానికీ పుస్తకం ఉపయోగపడింది. 
మీ కుటుంబ నేపథ్యం?
మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు, అమ్మ అక్కమాంబ. నేను పుట్టింది గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర కనగాల గ్రామం. నాన్నగారు ప్రభుత్వ ఫార్మసిస్టు. పుట్టిన ఊరులో నేనున్నది చాలా తక్కువ. నాన్నగారి ఉద్యోగరీత్యా మాచర్లలో అయిదో తరగతి వరకు చదివాను. పది వరకు సత్తెనపల్లిలో, కళాశాల చదువు బాపట్ల ఆర్ట్స్‌ కాలేజీలో సాగింది. మా తాతగారు ఊళ్లో ఉన్నంత వరకు అంటే నా పదిహేనేళ్ల వయసు వరకు అప్పుడప్పుడు పుట్టిన ఊరు వెళ్తుండేవాణ్ని. తర్వాత ఆయన కూడా మా దగ్గరికి వచ్చేశారు. 
తెలుగులో మీకు బాగా నచ్చిన రచయిత?
నచ్చిన రచయితలెందరో ఉన్నారు. కానీ త్రిపురనేని గోపీచంద్‌ ‘అసమర్థుని జీవయాత్ర’తో పుస్తకాల మీద ఆసక్తి పెరిగింది. ఇంటర్‌లో ఉన్నప్పుడు అది చదివాను. అంతకు ముందు కూడా కొన్ని పుస్తకాలు చదివాను. కానీ, పుస్తక పఠనం మీద ఆసక్తి పెరగడానికి ఆ నవలే కారణం. అది నన్ను చాలా కదిలించింది. ఆ తర్వాత గోపీచంద్‌ సాహిత్యం మొత్తం చదివేలా చేసింది. ఆయన మీద అభిమానం పెంచింది. అసమర్థుని జీవయాత్రలో సీతారామారావు పాత్రని ప్రతి ఒక్కరూ తమలో తాము చూసుకోవచ్చు. అప్పట్లో రచయితలు జీవితాల్ని మథించి రాశారు. 
చదువుకునే రోజుల్లో ఏవైనా రచనలు చేశారా?
ఇంటర్‌ చదివే రోజుల్లో కళాశాల పత్రిక కోసం ఒక కథ రాశాను. దాని పేరు సరిగా గుర్తులేదు. అందులో ఒకబ్బాయి గోడల మీద ఒకమ్మాయి గురించి తప్పుగా రాస్తుంటాడు. ఒకసారి అతని అక్కకి వేరొకరితో సంబంధం అంటగడుతూ గోడల మీద రాతలు కనిపిస్తాయి. అలా రాసేది అతని అక్కే. తమ్ముడిలో మార్పు కోసం ఆమె అలా చేస్తుంది. అప్పట్లో కళాశాల గోడల మీద ఇలాంటివి నిత్యం కనిపిస్తూ ఉండేవి. వాటిని చూసి ఈ కథ ఆలోచన వచ్చింది. అప్పుడప్పుడూ కవితలు కూడా రాస్తుంటాను. అయితే, వాటిని ఏ పత్రికకీ పంపను. అప్పట్లో ఆయా అంశాలకు సంబంధించి పత్రికలకి లేఖలు బాగా రాసేవాణ్ని. 
ఎక్కువగా ఎలాంటి రచనలు చదువుతుంటారు?
అందుబాటులో ఉన్నవి ఎలాంటి రచనలైనా చదువుతాను. జీవిత చరిత్రలంటే బాగా ఇష్టం. మహాత్మా గాంధీ సత్యశోధన, చార్లీ చాప్లిన్, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్, మార్క్‌ట్వైన్, టాల్‌స్టాయ్‌ జీవిత చరిత్రలు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ‘అనుభవాలూ - జ్ఞాపకాలూనూ’, గొల్లపూడి ‘అమ్మకడుపు చల్లగా’, తెలుగు సినిమా నిర్మాతలు కాట్రగడ్డ మురారి ఆత్మకథ ‘నవ్విపోదురుగాక’, డి.వి.నరసరాజు ‘అదృష్టవంతుని ఆత్మకథ’, బుచ్చిబాబు ‘అంతరంగ కథనం’, ముళ్లపూడి ‘కోతికొమ్మచ్చి, ఇంకోతికొమ్మచ్చి’, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు జీవితం గురించి ఆయన సతీమణి రాసిన పుస్తకం ఇలా చాలా చదివాను. చలం మ్యూజింగ్స్‌ అన్నా ఇష్టం. జీవిత చరిత్రలు చదివితే మనం జీవించని మరో జీవితాన్ని చూసినట్టుంటుంది. 
కోడి రామకృష్ణ లాంటి ఉద్దండుల దగ్గర పని చేశారు మీరు. అప్పటితో పోల్చితే సినిమాల్లో జన సామాన్య భాష తగ్గిపోతోంది కదా? 
కోడి రామకృష్ణ కథకంటే కథనానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. భాష, యాస పాత్రోచితంగా ఉండేలా జాగ్రత్తపడేవారు. నిజానికీ, అప్పట్లో కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావు లాంటి దర్శకులు పల్లెటూళ్లలో పుట్టి పెరిగి వచ్చారు. వాళ్లకి ఆ మూలాలు, పల్లె ప్రజల భాష బాగా తెలుసు. ఆ భాషను తమ సినిమాల్లో చాలా సహజంగా పండించేవారు. ఇప్పుడు సినీ రంగంలోకి వస్తున్న వాళ్లు చాలా మంది నగరాలు, పట్టణాల్లో పుట్టిపెరిగిన వారే. వాళ్లకి పల్లెటూళ్ల యాసలు సరిగా తెలియడం లేదు. గతంలో చెన్నైలో సినీ పరిశ్రమ ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లు ఉండేవారు. సినిమాలో నెల్లూరు మాండలికం వాడాలంటే ఆ ప్రాంతం నుంచి వచ్చిన డబ్బింగ్‌ కళాకారులతో సంభాషణలు చెప్పించేవారు. సంభాషణలు రాసేటప్పుడు కూడా ఆ యాసకు సంబంధించిన వారిని దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్లతో చర్చిస్తూ రాసేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. 
మీరు తీసిన సినిమాల్లో సింహభాగం హాస్యప్రధానమైనవే. ఇప్పుడు హాస్యం పేరుతో ద్వంద్వార్థాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కదా?
ద్వంద్వార్థాలతో కూడిన హాస్యం గతంలో కూడా ఉంది. తొంభైల్లో అది మొదలైంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ద్వంద్వార్థాల హాస్యాన్ని ఎవరూ ఆదరించట్లేదు. అందరూ హాయైన హాస్యాన్నే కోరుకుంటున్నారు. అలాంటి హాస్యమే ఇప్పటి సినిమాల్లో ఎక్కువగా ఉంటోంది. పూర్తినిడివి హాస్య చిత్రాలు రూపొందించేవారు తక్కువైనా హాస్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఇక తెలుగులో నాకు నచ్చిన హాస్య రచయితలు పొత్తూరు విజయలక్ష్మి, జంధ్యాల, సత్యానంద్‌. గతంతో పోల్చితే ఇప్పుడు హాస్యం రాసేవాళ్లు తగ్గిపోతున్నారు. హాస్యప్రధాన సాహిత్యం గొప్పది కాదనుకునే అపోహ దానికి కారణం కావచ్చు. అలాగే, దాన్ని అందరూ రాయలేరనేది కూడా ఒక వాస్తవమే.
బొమ్మలు వేయడం ఎలా నేర్చుకున్నారు? ప్రదర్శనలు ఏవైనా ఏర్పాటు చేశారా? 
చిన్నప్పుడు సినిమా వాల్‌పోస్టర్ల మీద ఈశ్వర్, గంగాధర్‌లు గీసిన బొమ్మలు చూసి నోటు పుస్తకాల్లో గీయడం ప్రారంభించాను. ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు గీయడం తప్ప ఎగ్జిబిషన్లు పెట్టేంత స్థాయి కళాకారుణ్ని కాదు నేను.
ఇరవై ఏళ్లుగా దర్శకత్వ విభాగంలో ఉన్నారు కదా.. ఈ రెండు దశాబ్దాల్లో రచన, భాష, కథనం పరంగా సినిమాల్లో మీరు గుర్తించిన మార్పులేంటి? 
సమాజంలోలాగే సినిమాల్లో కూడా మార్పులు సహజం. గతంతో పోల్చితే ప్రస్తుతం సినిమా సంభాషణల్లో, కథనంలో నాటకీయత తగ్గింది. ఇప్పుడు సహజత్వానికి ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో సంభాషణలు కొంచెం పెద్దగా ఉండేవి. ఇప్పుడది తగ్గింది. అవసరమైతే తప్ప ప్రసుత్తం ఎవరూ నాటకీయ సంభాషణలు రాయట్లేదు. కథనం కూడా సంప్రదాయ పద్ధతులకి భిన్నంగా, వైవిధ్యంగా ఉంటోంది.
‘నీదీ నాదీ ఒకే కథ’లో నటనకి మీకు మంచి పేరొచ్చింది. ఒక దర్శకుడు, రచయిత నటుడైతే ఉండే సౌలభ్యమేంటి?
దర్శకుడి ఆలోచనలను సులువుగా అర్థం చేసుకుని నటించడానికి అవకాశం ఉంటుంది. ‘నీదీనాదీ ఒకే కథ’ తర్వాత దాదాపు 16 సినిమాల్లో నటుడిగా అవకాశాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు పూర్తయ్యాయి. కొన్ని ముగింపు దశలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన క్రాక్‌ చిత్రంలో కూడా నటించాను. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నటుడిగా తీరిక లేకుండా ఉన్నాను.  
నటన, దర్శకత్వం రెండిట్లో మీకు సంతృప్తినిచ్చేది?
దేనిలోనూ ఇంతవరకు సంతృప్తిపడింది లేదు. పూర్తిగా సంతృప్తి అనేది ఎప్పుడూ ఉండదు. సినిమా ఎంత బాగా తీసినా ఇంకొంచెం బాగా తీసుండాల్సింది అనిపిస్తుంటుంది. అందుకే విజయవంతమైన చిత్రాల విషయంలో కూడా కొంచెం అసంతృప్తి ఎక్కడో మిగిలే ఉంటుంది. నటన విషయమైనా అంతే. దర్శకుడు చెప్పిన సూచన మేరకు అప్పుడు బాగానే నటిస్తాం. తర్వాత చూసుకుంటే ఇంకొంచెం బాగా చేసుండాల్సింది అనిపిస్తుంది. అందరికీ అలాగే ఉంటుందనుకుంటా! అయితే నటుడిగా కన్నా దర్శకత్వంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే దర్శకత్వం పూర్తిగా మన సృష్టి. అది చాలా కష్టం కూడా. నటన కొంత సులువు.
సినీ రచనలోకి రావాలనుకునే యువతరానికి మీ సూచనలేంటి?
ప్రస్తుతం రాణిస్తున్న రచయితలకు మించి అలరించగల భిన్నమైన రచనా సామర్థ్యం తమకుందా లేదా అని నిష్కర్షగా ఆత్మవిమర్శ చేసుకుని సినీ రంగంలోకి రావాలి. దర్శకుల ఆలోచనలను అనుసరిస్తూ వారిని ఒప్పిస్తూనే తమదైన ప్రత్యేకతను కోల్పోకుండా ప్రేక్షకులను మెప్పించగలిగేలా రాయగల చాతుర్యం ముఖ్యం. సినీ పరిశ్రమలోకి వెళ్తే ఎన్నో కష్టాలు, ఉపవాసాలు తప్పవని అందరూ అంటుంటారు. నేనైతే అలాంటి కష్టాలు అనుభవించలేదు. కానీ, కష్టాలు పడేవాళ్లూ, సునాయాసంగా వాటిని దాటేసేవాళ్లూ ఎప్పుడూ ఉంటారు. ఇష్టమైన లక్ష్యం కోసం పడే కష్టం అంతగా బాధించదు.
సాహిత్యం మీద అవగాహన లేని వాళ్లే ఎక్కువగా సినీ రచనలోకి వస్తున్నారు కదా?
నిజమే! సాహిత్యం చదువుకుని వచ్చినవాళ్ల ప్రమాణాలు వేరే స్థాయిలో ఉంటాయి. నేను సహాయ దర్శకుడిగా వెళ్లిన కొత్తలో సినీ రచయితలందరూ సాహిత్యం మీద పట్టున్నవాళ్లే. పరుచూరి సోదరులు, సత్యానంద్, సత్యమూర్తి, గణేష్‌ పాత్రో ఇలా అందరూ ఉద్దండులు. వాళ్లందరి ఇళ్లలో పెద్ద గ్రంథాలయాలుండేవి. ఇప్పుడొస్తున్న సినీ రచయితల్లో సాహిత్యం చదువుకున్నవాళ్లు తక్కువ మందే ఉంటున్నారు. అయితే అదే సమయంలో బుర్రా సాయిమాధవ్‌ లాంటి బాగా చదువుకున్న వాళ్లూ కనిపిస్తారు.
సమకాలీన తెలుగు సాహిత్యం చదువుతుంటారా? కొత్తతరం ఎలా రాస్తోంది?
అవకాశం ఉన్న మేరకు చదువుతుంటాను. కొత్త తరం కొత్తగానే రాస్తోంది. అప్పుడప్పుడు నన్ను సాహితీ సభలకు పిలుస్తుంటారు. వీలుంటే వెళ్తుంటాను. హైదరాబాదు పుస్తక ప్రదర్శనను ఏటా సందర్శించి పుస్తకాలు కొంటుంటాను. అక్కడ చాలా మంది రచయితలు కలుస్తుంటారు. అలా నేను కొనిపెట్టుకున్న పుస్తకాలు ఇంట్లో చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో కొత్త పుస్తకాలు పెట్టుకోడానికి స్థలమే లేదు!
పుస్తక పఠనానికి మీకు సమయం ఉంటుందా? 
వీలున్నప్పుడు చదువుతాను. దర్శకత్వ విభాగంలో ఉన్నప్పుడు అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి అస్సలు సమయం ఉండదు. నటన విషయానికొస్తే సెట్‌లో షాట్‌కి షాట్‌కి మధ్య కొంత విరామం దొరుకుతుంది. ఆ సమయాన్ని పఠనానికి ఉపయోగించుకుంటున్నాను. షూటింగ్‌కి వెళ్లేటప్పుడు తప్పకుండా పుస్తకాలు తీసుకెళ్తాను. ప్రస్తుతం చండీదాస్‌ ‘హిమజ్వాల’ మళ్లీ చదువుతున్నాను. చాలా ఏళ్ల కిందట దాన్ని చదివాను. ఒకే సమయంలో వేర్వేపు పుస్తకాలు కూడా చదువుతుంటాను. 
ప్రస్తుత తరంలో పుస్తకాలు చదివే అలవాటు పోతోంది. పిల్లల ఊహాశక్తి, సృజనాత్మకత, విచక్షణా జ్ఞానం  మీద అది ప్రభావం చూపుతుంది కదా? 
కచ్చితంగా. మా చిన్నప్పుడు బళ్లో ఉపాధ్యాయులే పుస్తకాల్ని చదవడానికి ప్రోత్సహించేవారు. కాలేజీలో కూడా మంచి సాహిత్యం చదవండని చెప్పేవారు. ఇప్పుడు అలా చెప్పేవాళ్లు ఎంతమంది? మా అబ్బాయి ఇంటర్‌ పూర్తిచేసి ఆర్కిటెక్చర్‌ చదువుతున్నాడు. పుస్తకాలు బాగా చదువుతాడు. కానీ, తెలుగు పుస్తకాలు చదవడంలోనే సమస్య అంతా. తెలుగు పుస్తకాలు చదవడానికి పాఠశాలల్లోనే ప్రాధాన్యమివ్వట్లేదు. నిజం చెప్పాలంటే, తెలుగు ఒక సబ్జెక్టుగా చదువుతున్నా కూడా పిల్లలకు అదంటే ఒక భయం. అమ్మభాష మీద ప్రేమ కలిగించకపోవడం వల్ల వచ్చిన భయం అది. మేం చదువుకునే రోజుల్లో మాస్టార్లు తెలుగు మీద చాలా మమకారం పెంచారు. వాళ్ల వల్లే నాలుగు పుస్తకాలు చదవగలిగాం. ఇప్పుడా పరిస్థితి లేదు. అమ్మానాన్నలు, ఉపాధ్యాయుల్ని చూసే పిల్లలకు మాతృభాష పట్ల ప్రేమ కలుగుతుంది. వాళ్లు పట్టించుకోకపోతే భాషాభిమానం ఎలా వస్తుంది. మాతృభాష విషయంలో అమ్మానాన్నల దగ్గర నుంచే పిల్లల జీవితాలు గాడి తప్పుతున్నాయేమో అనిపిస్తుంటుంది. 
ఇంగ్లీషు చదువుకుంటేనే గొప్ప అనే భావన ఇప్పుడు పెరిగింది కదా? 
అవును. ఇంగ్లీషు అనేది ఒక భాష మాత్రమే. దాన్ని నేర్చుకుంటే మంచిదే. చదివితే మంచిదే. కానీ, దానికోసం అమ్మభాషను వదిలేయడం చాలా బాధాకరం. చైనా, జపాన్‌ లాంటి దేశాలు మాతృభాషతోనే అభివృద్ధి చెందాయి. నేను చెన్నైలో సహాయ దర్శకుడిగా పనిచేసి వచ్చాను. తమిళుల భాషాభిమానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎంత గొప్ప చదువులు చదివినవారైనా సరే అక్కడ ప్రతి ఇంట్లో తమిళ పుస్తకాలుంటాయి. రిక్షా తొక్కేవాడు కూడా తమిళ పుస్తకాలు చదువుతాడు. మాతృభాషంటే వాళ్లకంత అభిమానం. అవసరమైతే తప్ప ఇంగ్లిష్‌లో మాట్లాడరు. అందుకే అక్కడ అన్ని పత్రికలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఆ భాషాభిమానం మనకు లేదు. పాఠకులు పెరిగితేనే రచయితలు పెరుగుతారు. ప్రస్తుతం మన దగ్గర రచయితలు క్రమంగా తగ్గిపోతున్నారు. మనం ఎంతసేపటికీ ప్రఖ్యాత రచయితలుగా పాత తరం వాళ్ల పేర్లే చెప్పుకుంటున్నాం. 


కోడి రామకృష్ణగారి దగ్గర సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు సత్యానంద్‌ గారితో పనిచేసే అవకాశం లభించింది. జంధ్యాలగారితో పనిచేయలేదు. కానీ, ఆయన రచనా విధానం నాకు చాలా ఇష్టం. అడవిరాముడు, శంకరాభరణం, శ్రీవారికి ప్రేమలేఖ ఇలా జంధ్యాల అటు హాస్యం, ఇటు వ్యాపారాత్మకంగా కూడా రాయగలరు. ‘ఆహా’ సినిమాకి సహ దర్శకుడిగా ఉన్నప్పుడు జంధ్యాల గారితో అందులో విజయకుమార్‌ పాత్రకి డబ్బింగ్‌ చెప్పించాను. ఆయన డబ్బింగ్‌ చెప్పగలరా అని ఆ చిత్ర నిర్మాత నాగార్జున మొదట్లో సందేహం వ్యక్తం చేశారు. నేనాయన్ని ఒప్పించాను. జంధ్యాల అంత గొప్ప రచయిత, దర్శకులు అయ్యుండి కూడా చిన్న కుర్రాణ్ని నేను సూచించిన విధంగా డబ్బింగ్‌ చెప్పారు.


కథలు, నవలలు, కవితలు అన్నీ చదువుతాను. కవుల్లో నాకు నచ్చినవారు చాలా మంది ఉన్నారు. శ్రీశ్రీ, సినారె, నందిని సిధారెడ్డి, శివారెడ్డి, అఫ్సర్, మెర్సీ మార్గరెట్, కొత్తగా రాస్తున్న సిద్ధార్థ కట్టా ఇలా అందరి కవిత్వాలు చదువుతుంటాను. వీళ్లందరి పుస్తకాలు నా దగ్గరున్నాయి. నాకు బాగా నచ్చిన కవితల్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తాను. ఆ రచయితకు ఫోన్‌ చేసి మాట్లాడతాను కూడా. కథల విషయానికొస్తే కొత్తగా అన్వీక్షికి ప్రచురణల వాళ్లు యువ రచయితల కథలతో పుస్తకాలు తెస్తున్నారు. అవి బాగుంటున్నాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి