తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగుతోనే గెలిచా!

  • 135 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆదినారాయణ

  • బెంగళూరు.
  • 9972513029

తెలుగు వాణ్ని... తెలుగు మాధ్యమంలో చదువుకున్నా... తెలుగులోనే సివిల్స్‌ రాశా... గెలిచా... నేనే కాదు, అమ్మభాష వల్ల అఖిల భారత సర్వీసులకు ఎంపికైన తెలుగు వారు మరో 80 మంది వరకూ ఉన్నారు... ఉన్నతోద్యోగాలు సాధించడానికి తెలుగు పనికిరాదనుకునే వారి అభిప్రాయం శుద్ధ తప్పు... అని చెబుతున్నారు మేడిశెట్టి తిరుమల కుమార్‌. బెంగళూరులో ఆదాయపు పన్ను కమిషనర్‌గా పని చేస్తున్న ఈ ఐఆర్‌ఎస్‌ అధికారి నికార్సైన మాతృభాషాభిమాని. జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకోవాలనుకుంటున్న వారికి అమ్మభాష చక్కటి ఆలంబన అవుతుందంటున్న ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖీ...
తె.వె.: తెలుగుపై అభిమానమెలా పెంచుకున్నారు? 

మేడిశెట్టి: మాది రాజమండ్రిలో ఓ మధ్య తరగతి కుటుంబం. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా. తెలుగు భాషన్నా, సాహిత్యమన్నా చాలా ఇష్టం. అమ్మభాషపై అభిమానం పెరిగేందుకు ప్రధాన కారకులు మా గురువు గారు... ప్రముఖ కథా, నవలా, నాటక రచయిత కప్పగంతుల మల్లికార్జునరావు. ఇంటర్లో మాకు చరిత్ర బోధించే వారు. ఆయన వద్ద అద్భుతమైన గ్రంథాలయం ఉండేది. దాన్లోని మంచి పుస్తకాల్ని నా చేత చదివించారు. ఇంకా రాజమండ్రిలోని శాఖా, గౌతమీ గ్రంథాలయాల్లోనూ సాహిత్య దాహాన్ని తీర్చుకునే వాణ్ని. రోజూ తరగతులయ్యాక నాలుగైదు గంటలపాటు గ్రంథాలయాల్లోనే గడిపేవాణ్ని. చదివిన దానిపై నోట్సు రాసుకోవడం నాకలవాటు. దానివల్ల విషయ పరిజ్ఞానం పెరిగింది. తర్వాత ఆ పరిజ్ఞానమే అక్కరకొచ్చింది. అయితే... ఒక భాషగా మాత్రం ఆంగ్లాన్ని కూడా నేర్చుకున్నా. 
అమ్మభాషలో చదువు వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
అమ్మభాషను ఎంత బాగా నేర్చుకుంటే ఇతర భాషలపై అంత సులువుగా పట్టు సంపాదించవచ్చు. మాతృభాషలో విద్యా బోధనపై వందేళ్ల కిందటే గొప్ప వ్యాసం రాశారు కొమర్రాజు లక్ష్మణరావు. తెలుగు సాహిత్య పరిశోధకులు, చరిత్రకారులైన ఆయన ఆ వ్యాసంలో ‘సొంత భాషలో చదువుకోవడం - తల్లిపాలు తాగి పెరగడంతో సమాన’మని అంటారు. అది అక్షరసత్యం. చైనా, జపాన్, రష్యా... బాగా అభివృద్ధి చెందిన దేశాలు. అక్కడి వారికి ఆంగ్లం రాదు. యంత్రవిద్య (ఇంజినీరింగ్‌), వైద్య విద్యలతో పాటు విజ్ఞాన, ఖగోళ, న్యాయ శాస్త్రాలన్నింటినీ వారు అమ్మభాషలోనే నేర్చుకుంటారు. అందుకే ఆయా రంగాల్లో ఆ దేశీయులు మేధావులుగా ఎదుగుతున్నారు. 
ఆంగ్ల మాధ్యమ చదువుల వల్ల జరుగుతున్న నష్టమేంటి?
పేదలు, బలహీన, వెనుకబడిన వర్గాలు, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అమ్మభాషలో చాలా చక్కగా చదువుకోగలరు. కానీ, వారికి ఆ అవకాశం ఉండట్లేదు. ఆంగ్లం నేర్చుకోవటం లోనే సగం సమయం గడిచిపోతోంది. ఆ భాషను నేర్చుకోవటానికి పట్టే కాలంలో పదోవంతు వ్యయం చేస్తే చాలు అమ్మభాషలో బాగా విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు.
మొదట్లో సివిల్స్‌ పరీక్షలు ఆంగ్లంలోనే జరిగేవి కదా?
అఖిల భారత సర్వీసు పరీక్షల్ని ఆంగ్లంలో మాత్రమే రాయాలనే నిబంధన ఉండేది. 1978 వరకూ ఇదే పరిస్థితి. ఆంగ్లేయుల పాలన అంతమయ్యాక కూడా వారి విధానాలనే మనవారూ కొనసాగించారు. అయితే.... ఆంగ్లం ఎంత మందికి వస్తుంది? దేశ జనాభాలో నలభై శాతం మంది నిరక్షరాస్యులు. అక్షరాస్యుల్లోనూ 70 శాతం మంది పదో తరగతి కంటే ఎక్కువ చదువుకోలేని దుస్థితి. అప్పట్లో ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారు మాత్రమే ఆంగ్లాన్ని చదువుకోగలిగే వారు. దీని వల్ల ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల నుంచి వచ్చిన వారు మాత్రమే సివిల్స్‌ రాయగలిగే వారు. తర్వాత పాలకుల్లో మార్పు వచ్చింది. సంస్కరణల కోసం డీఎస్‌ కొఠారి సంఘాన్ని నియమించారు. విభిన్న భాషలు, సంస్కృతులు, సామాజిక వర్గాల సమాహారమైన మన దేశంలో సివిల్స్‌ పరీక్షలను రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషల్లోనూ నిర్వహించాలని ఆ సంఘం సిఫార్సు చేసింది. దీన్ని 1979లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దేశ సివిల్‌ సర్వీసు చరిత్రలో పెద్ద మలుపు ఇది. అలాగే, ఆ ఏడాది వరకూ సివిల్‌ సర్వీసులకు అభ్యర్థుల ఎంపికలో పలు విధానాలుండేవి. మూడు ప్రశ్నపత్రాల్ని రాస్తే ఐఏఎస్, రెండింటిని రాస్తే మరో సర్వీసు అంటూ ఎంచేవారు. కొఠారి సంఘం సిఫార్సులతో ఈ పద్ధతి మారింది. మొత్తం 29 సర్వీసులకూ ఒకే పరీక్ష వచ్చింది. భారతీయ భాషల సాహిత్యాన్ని కూడా ఐచ్ఛికాంశంగా ఎంచుకుని పరీక్షలు రాసే అవకాశమూ అప్పటి నుంచే ప్రారంభమైంది. 
సివిల్స్‌కు ఎంపికయ్యే క్రమంలో మీ అనుభవాలు?
మా నాన్న గారితో పాటు కప్పగంతుల మల్లికార్జునరావుగారి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి సివిల్‌ సర్వీసులపై ఇష్టం పెరిగింది. కానీ, ఆ పరీక్షలకు తయారయ్యేందుకు అప్పట్లో తగిన సమాచారం ఉండేది కాదు. 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏలో చేరా. అక్కడే ఆర్థికవేత్త ఆచార్య గోగుల పార్థసారథి శిష్యరికం చేశా. 1983లో చరిత్ర ఐచ్ఛికాంశంగా సివిల్స్‌ ప్రాథమిక పరీక్షల్ని రాసి నెగ్గా. ప్రధాన పరీక్ష శిక్షణ కోసం హైదరాబాద్‌ ఏపీ స్టడీ సర్కిల్‌కు వెళ్లా. పది రోజులపాటు వివిధ రకాలుగా పరీక్షించిన తర్వాత హాస్టల్లోకి తీసుకున్నారు. ప్రధాన పరీక్షకు వెళ్లేటప్పుడు ఆటో ప్రమాదానికి గురయ్యా. గాయాలకు కట్టు కట్టించుకుని ఏపీపీఎస్సీ పరీక్ష హాలుకు మెట్లెక్కి వెళ్లా. అప్పుడు లిఫ్టు లేదు. కింద అంతస్తులో రాసేందుకు అనుమతించలేదు. శక్తినంతా కూడగట్టుకుని పరీక్ష రాస్తూ స్పృహ కోల్పోయా. తొలి ప్రయత్నం విఫలమైంది. నిరుత్సాహపడలేదు. 1984లో మరోసారి పరీక్ష రాసి 268వ ర్యాంకు సాధించా. ఐపీఎస్‌ వచ్చింది. 1985 డిసెంబర్లో ఐఆర్‌ఎస్‌లో చేరా. తెలుగు సాహిత్యం, చరిత్ర నా ఐచ్ఛికాంశాలు. 1979-84 మధ్య తెలుగులో సివిల్‌ సర్వీసెస్‌ రాసిన వారిలో నాకే అత్యధిక మార్కులు వచ్చాయి.
తెలుగులో రాత, ఐచ్ఛికాంశాల ఎంపికలో మీ ఉద్దేశమేంటి?
ఆంగ్లంలో కంటే తెలుగులో మన భావాల్ని సూటిగా, స్పష్టంగా వ్యక్తీకరించవచ్చు. అందుకే తెలుగులోనే పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నా. అర్థశాస్త్రంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేసినప్పటికీ చరిత్ర అంటే నాకు ఇష్టం. అందుకే మరో ఐచ్ఛికాంశంగా దాన్ని తీసుకున్నా. తెలుగులో ప్రావీణ్యాన్ని సాధించేందుకు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య దివాకర్ల వెంకటావధాన్లు వద్ద పాఠాల్ని చెప్పించుకున్నా. గొప్ప అదృష్టమది. చరిత్రపై పట్టు కోసం చాలా శ్రమపడ్డా. తెలుగు అకాడమీ పుస్తకాలన్నీ కృతకమైన భాషతో ఉండేవి. అందుకే రొమిల్లా థాపర్, బిపిన్‌ చంద్ర వంటి చరిత్రకారుల ఆంగ్ల పుస్తకాల్ని చదివి, తెలుగులోకి తర్జుమా చేసుకుని నోట్సు రాసుకునేవాణ్ని. అప్పుడే సహవాసి అనువదించిన చరిత్ర పుస్తకాలను హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ప్రచురించింది.
ఇప్పటి పరిస్థితి?
మారింది. తెలుగులో సివిల్స్‌ రాసేందుకు కావాల్సిన వనరులన్నీ తెలుగులో పుష్కలంగా లభిస్తున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు శ్రమిస్తే అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం కష్టమేం కాదు. నిరంతరం చదవటం, రాయటం చేస్తే విజయం తథ్యం. ఐఆర్‌ఎస్‌లో చేరిన నాటి నుంచి తెలుగు మాధ్యమంలో పరీక్షల్ని రాసే వారికి సలహాలు ఇస్తున్నా. అలాంటి వారికి తగిన సహాయ సహకారాలు అందించేందుకు 1994లో రాజమండ్రిలో ‘సమతా సేవా సమితి’ని స్థాపించా. 
ఇప్పటి వరకూ తెలుగులో సివిల్స్‌ రాసి గెలిచిన వారెందరు?
తెలుగు మాధ్యమంలో సివిల్స్‌ రాసి విజయం సాధించిన మొదటి వ్యక్తి డి.కె.రావు. 1979లో ఆయన చరిత్ర, తెలుగు సాహిత్యాలు ఐచ్ఛికాంశాలుగా తీసుకుని అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. ఇప్పుడు గుజరాత్‌లో పని చేస్తున్నారు. నేటి వరకూ దాదాపు ఎనభై మంది తెలుగు మాధ్యమంలో/ తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకుని సివిల్స్‌ను నెగ్గారు. ప్రస్తుతం వారి వివరాలను సేకరిస్తున్నా. 
తెలుగులో సివిల్స్‌ రాసే వారి సంఖ్య పెరగాలంటే?
తెలుగు కూడా అన్నం పెట్టే భాష, అందులో చదువుకున్నా మంచి ఉద్యోగాలు వస్తాయనే భరోసాను పిల్లల్లో కల్పించాలి. తెలుగులో కూడా ఈ సివిల్స్‌ రాయోచ్చని కళాశాల, పాఠశాల విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించాలి. అప్పుడు చాలామంది తెలుగు వాళ్లు అఖిల భారత సర్వీసుల్లోకి వస్తారు. దీనికిగాను అధికార భాషా సంఘం ఒక సమాచార, సలహా కేంద్రాన్ని స్థాపించాలి. ప్రత్యేక అంతర్జాల వేదికనూ ఏర్పాటు చేయాలి. ఇందుకు కావాల్సిన సహాయ సహకారాల్ని అందించేందుకు నేను సిద్ధం.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి