తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

  • 133 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పావులూరి శ్రీనివాసరావు

  • గ్రంథాలయాధికారి
  • గుడివాడ
  • 9440492235

తెలుగులో బాల సాహిత్యంపై తొలి పరిశోధకుడాయన... ఆ రంగంలో అయిదు దశాబ్దాల పైచిలుకు కృషి ఆయనది... డెబ్భైకి పైగా పుస్తకాల రచన, మరెన్నిటికో సంపాదకత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం, గ్రంథాలయ రంగంలో ఎనలేని కృషి ఆయన సొంతం... ఆసక్తిలో రేపటి తరంతో, ఉత్సాహంలో ఈ తరంతో పోటీపడే ఎనిమిది పదుల యువకుడాయన... ఆయనే గ్రంథాలయ గాంధీగా సాహిత్యాభిమానులు పిలుచుకునే వెలగా వెంకటప్పయ్య. ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి.

సాహిత్యం, గ్రంథాలయ రంగాలపై ఆసక్తి ఎలా పెంచుకున్నారు?
ప్రముఖ రచయిత చక్రపాణి తెనాలిలోని మా ఇంటికి సమీపంలో ఉండటం, బెంగాలీ పుస్తకాలను అనువదించటం; ‘చందమామ’(ఈ పత్రికలో చక్రపాణి పనిచేశారు)ను చదవటం; చలం, కొడవటిగంటి మొదలైన వారి పుస్తకాలు మా ఊరు నుంచే ప్రచురణకు నోచుకోవటం; చదువుకునే రోజుల్లో హేమాహేమీలైన గురువులూ ఉండటం ఇందుకు కారణం. ఇంటర్మీడియట్‌ తర్వాత గ్రంథాలయాధికారిగా ఉద్యోగంలో చేరాను. దాంతో ఎన్నో పుస్తకాలు చదివే భాగ్యం కలిగింది.
గ్రంథాలయ రంగం విషయానికొస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గ్రంథాలయాధికారిగా పనిచేసిన అబ్బూరి రామకృష్ణారావు, శరణు రామస్వామి చౌదరి, అడుసుమిల్లి శ్రీనివాసరావుల ప్రభావం ప్రధాన కారణం. గ్రంథాలయ రంగంలో విశేష కృషి చేసిన అయ్యంకి వెంకటరమణయ్య ప్రభావం గణనీయమైంది. అయ్యంకి వారు వంద ఎకరాల ఆసామి. అయితే తన కృషిలో భాగంగా చివరకు ఆస్తి మొత్తం కోల్పోయి... అవసాన దశలో మందులు కొనుక్కోవడానికీ ఇబ్బంది పడ్డారు.
ఇంటర్మీడియట్‌తో ఆపేశానంటున్నారు... పీహెచ్‌డీ చేశారు కదా?
చదువంటే నాకు చాలా ఆసక్తి. అందుకే, ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా బీఏ పూర్తి చేశా. తర్వాత బిఎల్‌ఐఎస్‌సీ. ఆ తర్వాత ఎంఏ. యాభైఒక్క ఏళ్ల వయసులో ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నాను. ‘తెలుగులో బాల సాహిత్యం - ఆంధ్రప్రదేశ్‌ బాలల గ్రంథాలయ ప్రగతి’ అనే అంశంపై చేసిన ఈ పరిశోధనకు ఉత్తమ సిద్ధాంత వ్యాసంగా త్రిపురనేని గోపీచంద్‌ స్వర్ణపతకం లభించింది.
మీ రచనలు?
ప్రధానంగా గ్రంథాలయ శాస్త్రానికి సంబంధించి వివిధ విశ్వవిద్యాలయాలకు 70 పుస్తకాలు రాశాను. ప్రస్తుతం వాడుకలో ఉన్న పదాలను చేర్చి శంకర నారాయణ ఇంగ్లిష్‌- తెలుగు, తెలుగు- ఇంగ్లిష్‌ నిఘంటువులను రివైజ్‌ చేశాను. బ్రౌన్‌ నిఘంటువును కూడా రివైజ్‌ చేశాను. సామాన్య ప్రజల వాడుకలో ఉన్న పదాలను నిఘంటువులో చేర్చడం బ్రౌన్‌ చేసిన గొప్ప పని. కడపలో పనిచేస్తున్నప్పుడు వేలాది పొడుపు కథలను సేకరించాను. అలాగే బాలగేయాలు కూడా... ఇటీవలే వెలువడ్డ తెలుగు శతక మంజరి, పొడుపు కథలు, సామెతలు, బాలల గేయాలు, జాతీయాలు అనే అయిదు పుస్తకాల  ‘పాత బంగారం’ సంకలనానికి సంపాదకత్వం వహించాను.
ఆ సంకలనం విశేషాలేంటి?
ఇది ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. దీని వెనుక 24 సంవత్సరాల ప్రయత్నం ఉంది. మొత్తం అయిదు పుస్తకాలు ఈ సంకలనంలో ఉన్నాయి. వీటిలో మొదటిది ‘తెలుగు శతక మంజరి’. దీని మొదటి భాగంలో 27 శతకాలు పూర్తిగా, శతక భాగాలతో మరో 60 శతకాలను రెండో భాగంలో పొందుపరచాం. ప్రసిద్ధ శతకాలతోపాటు ఎక్కువ మందికి తెలియనివి కూడా కూర్చాం.
 రెండోది పొడుపు కథలపై. వాటిపై సమగ్ర పుస్తకం ఇంతవరకు రాలేదు. పొడుపు కథలు అన్ని వయసుల వారినీ ఆలోచింపజేసే వినోద గుళికలు. విజ్ఞాన వీచికలు. సామాజిక అవగాహనకు, లోకజ్ఞాన పెంపుదలకు ఆలంబనలు. ముఖ్యంగా పిల్లల్లో చురుకుదనం, వివేచనా శక్తి పెంచే అనుభవ సారాలు. పల్లీయుల ఆచార వ్యవహారాలకు, అలవాట్లకు, సంస్కృతికి అద్దంపట్టే జీవిత సత్యాలు. ఈ పుస్తకంలో నాలుగువేల పొడుపు కథలు, పొడుపు పద్యాలు వివరణలతో ఉన్నాయి. సామెతలు, బాలల గేయాలు, జాతీయాలపై మరో మూడు పుస్తకాలు తెచ్చాం.
ఎన్ని సామెతలను సేకరించారు?
తెలుగు సామెతలు అనాదిగా వాడుకలో నిలిచి ఉన్నాయి. తెలుగు వాఙ్మయానికి ఇంపుసొంపును చేకూర్చాయి. వీటిలో తెలుగింటి వాతావరణం, ఆనవాయితీలు, వావి వరుసలు, వేడుకలు, సాధక బాధకాలు, ఈతిబాధలు కనిపిస్తాయి. వాడీ, వేడీ, చమత్కారం, సద్భావం ఇమిడి ఉంటాయి. సామెతల వాడకం జీవితానికి మరింత జీవాన్ని తెస్తుంది. ఈ పుస్తకం విషయానికి వస్తే ఇందులో మనం అనునిత్యం వాడే సుమారు పదిహేనువేల సామెతలను ఇచ్చాం. 1868లో కెప్టెన్‌ కార్‌ అనే విదేశీ ఉద్యోగి సేకరించి ఆంగ్లంలోకి అనువదించి ముద్రించిన సామెతలనూ చేర్చాం.
బాలల గేయాలపై ఎన్నో పుస్తకాలు వచ్చాయి కదా. మీ పొత్తం ప్రత్యేకతేంటి?
మనిషికి భాషా బోధన అమ్మ ఒడిలో జోలపాటతో మొదలవుతుంది. శిశువు పెరిగే కొద్దీ జోలపాట స్థాయిని దాటి పాట ఎన్నో తీర్ల సాగుతుంది. లాలిపాటలు, జోలపాటలు, పాలపాటలు, ఉగ్గుపాటలు తెలుగులో తొలి బాలగేయాలు. ఈ పుస్తకంలో లాలి, జోల పాటలతో పాటు పండుగ పాటలు, ఆటపాటలు, ఎగతాళి పాటలు, తొక్కు పలుకులు మొదలైనవి ఉన్నాయి.
జాతీయాలను ప్రత్యేకంగా కూర్చడంలో ఉద్దేశమేంటి?
సామాజిక జీవనంలో వచ్చే మార్పులు జాతీయాల పుట్టుకకు మూలకారణం. ఇవి భాషకు జవజీవాలు కల్పించడమేగాక, సులభ అవగాహనకు తోడ్పడతాయి. వ్యవహార జ్ఞానాన్ని, లోకజ్ఞతను పెంపొందిస్తాయి. నిత్య వ్యవహారంలో జాతీయాలు ఎంత ఎక్కువగా వాడితే భాష అంత వినసొంపుగా ఉంటుంది. ముఖ్యంగా కలికి గాంధారి వేళ, కరణం దస్త్రం, పోలీసు గద్దలు, తాళి పెరిగిపోయింది లాంటి జాతీయాలను పుస్తకంలో వివరించాం. మన భాష రమ్యతను తెలియజేయడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందన్నది మా భావన. తెలుగు దినపత్రికల్లో విరివిగా ప్రయోగంలో ఉన్న కొత్త జాతీయాలనూ ఇందులో చేర్చాం.
‘పాత బంగారా’న్ని వెలుగులోకి తేవాలన్న ఆలోచనకు మూలం?
జాతికి శ్వాస భాష. ఏ భాషకైనా జనం నోళ్లలో నానే జాతీయాలు, పొడుపు కథలు, సామెతలు, గేయాలు ఆయువుపట్లు. ఇవి జానపదులు సృష్టించిన భాషా సంపద. ఇదే భాషకు ప్రాణం, ఆధారం. జానపదుల భాష పల్లెల్లో పుట్టి, పల్లెల్లో పెరిగి అక్కడి ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ జీవం తొణికిసలాడుతూంటూంది.  కడపలో గ్రంథాలయాధికారిగా పనిచేసేప్పుడు ఈ విషయం గమనించాను. కమ్మని భాష అంటే నిఘంటు పదాల కూటమి కాదు. సందర్భోచితంగా అలవోకగా, అతి సహజంగా జనుల నోట వెలువడే సామెతలు, జాతీయాలు, పదబంధాలు, జంటపదాలు, ఊతపదాలు, తిట్లు, శాపనార్థాలు, నుడికారాలు తెలుగు నేల నలుమూలలా గాలిస్తే, అలాగే ఇతర ప్రాంతాల తెలుగువారిని కలిస్తే, తెలిసే కొత్త పదాలు, నుడికారాలు అపారం, అసంఖ్యాకం, అగణితం. ఇది తెలుగు జాతికి గర్వకారణం. సాధారణ సంప్రదాయ నిఘంటువుల్లో కనిపించని జానపద సంపదలో ఒక తావున లభించేది తక్కువే. ఉన్నది కాస్తా పలు తావుల్లో సంప్రదించేందుకు వీలులేకుండా ఉండిపోయింది. ఇదే నాకు స్ఫూర్తిగా నిలిచి, నా చేత ఈ పని చేయించింది.
సేకరణలో ఎవరైనా సహకరించారా?
రాయలసీమ జాతీయాలను సేకరించేందుకు పుట్టపర్తి నారాయణాచార్యులు ఎంతో సహకరించారు. సామెతలు, జాతీయాల వాడకం తెలంగాణలోనూ ఎక్కువే. ఇక్కడి వాటి సేకరణకు గుడిపూడి సుబ్బారావు సాయం చేశారు. ఇది ఎంత సమగ్రమైన ప్రయత్నమైనా సేకరించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.
సాంకేతికత అణువణువునా పెరిగిన తరుణంలో గ్రంథాలయాల ప్రాధాన్యత ఏంటి?
ఎంత సాంకేతిక విజృంభించినా పుస్తకం జీవితాంతం తోడుగా ఉండే గొప్ప స్నేహితుడు. ఏ దేశంలోనూ చదివే అలవాటు తగ్గలేదు. అయితే మన రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో మంచి పుస్తకాలు ఉండటం లేదు. ఇక అమెరికా, ఇంగ్లాండ్‌ లాంటి దేశాల్లో గ్రంథాలయాలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు! అక్కడ ప్రభుత్వంకంటే ప్రజల నుంచి వచ్చే విరాళాలే గ్రంథాలయాల నిర్వహణకు ప్రధాన ఆధారం. ఉదాహరణకు న్యూయార్క్‌ గ్రంథాలయాన్నే తీసుకుంటే ప్రజలే వేల డాలర్లు విరాళాలిస్తారు. వారు గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటారు కనుక దాన్ని కాపాడాలనుకుంటారు. ఇదే భావన మన దగ్గరా రావాలి.
రాష్ట్రంలో ప్రస్తుతం గ్రంథాలయాల పరిస్థితి?
ఏమీ బాగాలేదు. ఒకప్పుడు ప్రజలే గ్రంథాలయాలను నడిపేవారు. ఇవాళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. గ్రంథాలయాల నిర్వహణ నానాటికి తీసికట్టుగా మారింది. చట్టంలో గ్రంథాలయాలు- విద్యారంగంలో విశిష్ట సేవలందించిన వారే అధ్యక్షులుగా నియమితులవ్వాలని ఉంది. అయితే ఏ ప్రభుత్వమూ దీనిని గౌరవించిన పాపాన పోలేదు. ఇందులోనూ రాజకీయాలే ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు గ్రంథపాలకులు సేవాభావంతో పనిచేసేవారు. ఇవాళ అలాంటి పరిస్థితి అసలే కనిపించదు. సాహిత్య అకాడమీ, నేషనల్‌ బుక్‌ ట్రస్టు ప్రచురించే పుస్తకాలు మనకు గ్రంథాలయాల్లో మచ్చుకైనా కనిపించవు. కేవలం సిబ్బందికి జీతాలు ఇవ్వడం తప్ప చాలా గ్రంథాలయాలు మరెందుకూ పనికి రాకుండా పోయాయి.
ఇప్పుడొస్తున్న బాల సాహిత్యాన్ని పరిశీలిస్తున్నారా? అది నేటి పిల్లల అవసరాలు తీర్చే స్థాయిలో ఉంటోందా?
ఒకప్పుడు చాలా మంచి పుస్తకాలు వచ్చేవి. ఇప్పుడు అలాంటివి రావట్లేదు. వచ్చినా ఏ ఇద్దరు ముగ్గురివో వస్తాయి. ఇప్పుడు నేను కొన్ని పుస్తకాలు ఎడిట్ చేస్తున్నాను. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడిగా బాల సాహిత్యం విషయంలో కృషి చేస్తున్నాను. సాహిత్య అకాడమీ పుస్తకాలు రాజ్యాంగం గుర్తింపు పొందిన 22 భాషల్లో వస్తాయి. అయితే నేటి బాల సాహిత్యం అంత గొప్పగా ఉండట్లేదు.
సాహిత్యాన్ని పిల్లలకు దగ్గర చేయాలంటే...
‘చేసి చూపడం’ ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆసక్తికరంగా ఉంటూ పిల్లల సృజనాత్మకతను తట్టి లేపేవిగా ఉండాలి. పిల్లలకు ప్రత్యేకంగా విజ్ఞాన సర్వస్వం రావాలి. వచ్చే పుస్తకాలు కూడా రంగుల్లో ఉండాలి. పుటలు పెద్ద పరిమాణంలో ఉంటే మంచిది. బాలభారతం పత్రికలా ఉండాలి. మంచి పుస్తకాలు, పత్రికలు ప్రతీ బడికి చేరేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. కర్ణాటక ప్రభుత్వం సాహిత్య అకాడమీ పుస్తకాలను అక్కడి పాఠశాలలకు ఉచితంగా పంచింది.
ఇంగ్లిష్‌ కామిక్స్‌ ఆకట్టుకున్నంతగా తెలుగు బాలసాహిత్యం పిల్లలను ఆకర్షించక పోవడానికి కారణం?
తెలుగులో తెలుగు వాతావరణం ప్రతిబింబించే కాశీమజిలీ కథలు, మర్యాద రామన్న కథలు, తెనాలి రామకృష్ణుని కథలు లాంటివి పూర్తిగా బొమ్మలతో ఆకట్టుకునేలా రావాలి. అంతేతప్ప ఇంగ్లిష్‌ నుంచి రాబిన్‌సన్‌ లాంటివి అనువదించడమో, అనుకరించడమో చేయడంవల్ల లాభం లేదు.
తెలుగు భాషను భావితరాలకు అందించాలంటే?
వీలైనన్ని మంచి పుస్తకాలు ప్రచురణకు నోచుకోవాలి. ఇంగ్లిష్‌లో పాపులర్‌ ఇంగ్లిష్‌ పేరుతో వాడుక భాషలోని పదాలతో చిన్న చిన్న పుస్తకాలు అచ్చువేస్తారు. అలా తెలుగులోనూ వెయ్యి పదాలతో కేవలం 100- 150 పేజీలతో పుస్తకాలు రావాలి. వీటిని తక్కువ ధరకు అందించగలగాలి. ఇక ప్రముఖ పాత పుస్తకాలను పెద్ద పరిమాణంలో, వీలైనన్ని బొమ్మలతో, కంటికి శ్రమ కలగకుండా ఉండేలా కొత్తగా రూపొందించాలి. అప్పుడే పాఠకులను ఆకట్టుకోగలం. చదివే అభిలాష పెంచాలంటే మంచి పుస్తకాలను ముద్రించటమే ప్రధాన అంశం. ఇలాంటి ప్రయత్నం రామోజీ రావులాంటి వారే చేయగలరు.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి