తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

సాహిత్యానికి ప్రతిరోజూ స్వర్ణయుగమే

  • 188 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి... జనం నాలుకల మీద నిలిచి... సాహితీ చరిత్ర పుటలను అలంకరించిన కవులు, రచయితలెందరో. వారందరి ఆశయం ఒక్కటే. ప్రజలను చైతన్యవంతులను చేయడం. దానికోసం తాము చెప్పాలనుకుంది చెప్పారు. చేయాలనుకుంది చేశారు. అయితే, కాలప్రవాహంలో ఈ అక్షర వ్యవసాయం రానురాను గాడి తప్పుతోందన్నది కొందరి మాట. అసలు రచయితలు ఎక్కడున్నారండీ... అన్నది మరో అడుగు ముందుకు వేసిన వారి మాట. వీటిల్లో ఏది నిజంగా నిజం? ఎవరిని అడగాలి అనుకుంటుంటే... సరిగ్గా అప్పుడే తట్టిన పేరు గొల్లపూడి మారుతీరావు.
      పాత్రికేయునిగా, రేడియో ప్రయోక్తగా, రచయితగా, సినీ రచయితగా, నటుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. దాదాపు మూడు తరాల మధ్య వారధిగా నిలుస్తూ వస్తున్న ఆయన్నే నేరుగా ఈ ప్రశ్నలన్నీ అడిగేశాం. రాయగలిగే ప్రతి వాడూ రచయితే అని చెబుతున్న ఆయన... తెలుగు సాహిత్యానికి ప్రతిరోజూ స్వర్ణయుగమే అంటూ... ఈ తరానికి బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని పంచుతున్నారు.
తె.వె.: మీ దృష్టిలో సాహిత్యమంటే...?

గొల్లపూడి: సమాజాన్ని ప్రతిఫలించేదే సాహిత్యం. అది... సమాజంలోని ఆలోచనలు, సమస్యలు, సందేహాలను విమర్శిస్తుంది. విశ్లేషిస్తుంది. సాహిత్య ధర్మమిదే. నిజానికి సాహిత్య ధర్మం అనేది కాలానుగుణంగా నడిచే ప్రక్రియ.
రచయిత, రచనలకు మీరిచ్చే నిర్వచనాలు?
మనిషి ఎలా ఉండాలి అంటే ఏం చెప్పగలం? ఇవి చెప్పగలిగే విషయాలు కావు. రచయిత ఎలా ఉండాలి, రచన ఎలా చేయాలి అంటే... తన అనుభవంలో నుంచి అది రావాలి. అనుభవం ఉన్న వ్యక్తులను చదివి అనుభవశాలి అవ్వాలి. తనదైన దృక్పథం ఏర్పరచుకోవాలి. జీవితం మీద స్పష్టమైన పరిశీలన, అవగాహన ఉండాలి. రాసే సామర్థ్యాన్ని పెంచుకోగలగాలి. రాసే ఉత్సాహం ఉండాలి. తాను చెప్పిన విషయానికి ఎదుటివాడు, పక్కవాడు స్పందిస్తున్నాడంటే ఆనందం కలగాలి. ఆలోచన కలగాలి. మంచి విమర్శ కోసం ఎదురు చూసే ఉత్సాహం కావాలి. ఇవన్నీ ఉంటే... ఓ రచయిత అనుకోవచ్చు. తను చెప్పగలిగిన, చెప్పాల్సిన ఓ విషయాన్ని... ఎదుటి వ్యక్తి అవగాహనలోకో, అనుభవంలోకో తీసుకురాగలిగే సామర్థ్యమున్న - సామర్థ్యాన్ని పెంచుకున్న - పెంచుకోవడానికి అవకాశమున్న ఓ వ్యక్తి చేసే ప్రక్రియ రచన.
ప్ర: ఆధునిక తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగమేది? ఎందుకు?
కాల్పనిక సాహిత్యం, భావకవిత్వ ధోరణి, నవ్యసాహిత్య పరిషత్తు... ఆ రోజులు ఒక తరహా సాహిత్యాన్ని ప్రతిఫలించాయి. ఇందులో రెండు కవితా ధోరణులున్నాయి. కలల ప్రపంచంలో విహరించే భావ కవితా పరంపర ఓ ఎత్తు. మన చుట్టూ ఉన్న సమస్యలను ప్రతిఫలిస్తూనే... సమాజంలోని దోపిడీ, అన్యాయాలను ఎండగట్టే రచనలు మరో ఎత్తు. ఈ రచనా విధానానికి ప్రప్రథమ వైతాళికుడు శ్రీశ్రీ. తల్లావఝ్జల శివశంకరశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణశాస్త్రి, నండూరి రామ్మోహనరావు... వీళ్లందరి సాహిత్యం ఓ రకం. శ్రీశ్రీది మరో విధమైన సాహిత్యం. నా ఉద్దేశంలో శ్రీశ్రీ తర్వాత వచ్చిన నవ్యసాహిత్య ధోరణి చాలా బలమైంది. కిందటి శతాబ్దపు ఆఖరు రోజుల్లో వచ్చిన ఈ సాహిత్యానికి తనదైన ఓ ముద్ర గానీ, తనదైన ఓ రూపం గానీ లేదు. ఎందుకంటే, ఈ ధోరణిలో వచ్చిన సాహితీ ప్రక్రియలన్నీ దేనికదే విభిన్నం. గత శతాబ్దంలోని సాహిత్య ధోరణులను ఎత్తి చూపాలను కుంటే... ప్రముఖంగా కనిపించేది, ఎక్కువగా ప్రభావితం చేసింది ఆధునిక కవిత్వ ధోరణి.
అంటే... కవితా యుగమే స్వర్ణయుగమా?
అలా అర్థం చేసుకోకూడదు. 20వ శతాబ్దపు చివర్లో ఈ సాహిత్యం చాలా ప్రభావాన్ని చూపింది. ఈ మధ్యలో పరిచయమైన సినిమా సైతం సాహితీ ధోరణుల్లో కొంత మార్పు తెచ్చింది. భావకవిత్వంతోపాటు సినిమా పాట పెరిగితే... సినిమాతో పాటు నవలా సాహిత్యం అభివృద్ధి చెందింది. అది ఎంత కాలం కొనసాగింది, ఎప్పటి వరకూ ప్రజలు ఆదరిస్తారు, కాలాన్ని ఎదిరించి ఎప్పటి వరకూ నిలిచి ఉంటుంది అనే అంశాల మీదే అది స్వర్ణయుగమా కాదా అనేది ఆధారపడి ఉంటుంది.
వస్తు స్వీకరణ, భావ వ్యక్తీకరణలో నాటితరం చేసిన అద్భుత ప్రయోగాలను ఈతరం కొనసాగిస్తోందా?
దీనికి నా సమాధానం ఒక్కటే. అది సత్యమో కాదో నాకు తెలియదు. ఒక ధోరణిని ప్రతిఫలించేట్టుగా సాహిత్యం ఈ రోజుల్లో నడవడం లేదేమో అని నేననుకుంటా. ఇది నా సొంత అభిప్రాయం. భావకవిత, విప్లవకవితా ధోరణుల్ని గుర్తు పట్టినంత స్పష్టంగా, స్ఫుటంగా ఇప్పుడున్న ధోరణుల్ని మనం గుర్తుపట్టలేం. ఉదాహరణకు... 60వ దశకం తర్వాత వచ్చిన ధోరణుల్లో ఎంతో కొంత ప్రభావితం చేస్తూ వచ్చింది నవలా సాహిత్యం. దీంతోపాటు ఎందరో కథారచయితలు వచ్చారు. వీరిలో అద్భుతమైన అభినివేశం, పరిణతి, ప్రక్రియా వైవిధ్యం సృష్టించిన వారు చాలా మంది ఉన్నారు. నవలలు, కథలు, కథానికల్లో ప్రత్యేకంగా ఒక ధోరణిగా మెచ్చుకోవాలి లేదా చెప్పుకోవాలి అంటే కథానిక సాహిత్యం. నేటి కథానిక సాహిత్యం మంచి ధోరణిలో, మంచి ప్రక్రియల్లో, మంచి ప్రయోగాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది నాకు.
సృజనాత్మకతలో గతకాలపు రచయితలతో ఇప్పటి వారు పోటీ పడుతున్నారా?
రచయితలకు సృజనాత్మకత చాలా అవసరం. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. పాతతరం రచయితల కంటే... ప్రక్రియలో ఈ తరం రచయితలు ముందున్నారు. వస్తువులో మాత్రం అంత వైవిధ్యం పట్టుకోవట్లేదు. అంటే వాళ్లు ఎంచుకునే, చెప్పే అంశంలో... కొత్తదనం కనిపించట్లేదు. పీడిత వర్గం గురించి చెప్పడం... ఇలా ఇంకొకటి... ఇంకొకటి... ఇలాగన్న మాట.
దీనికి కారణం?
ఏం లేదు. ఎక్కువ పరిశీలన ఉండాలి. ఎక్కువ అవగాహన కావాలి. ఇప్పుడు వస్తు వైవిధ్యం అంటే... వస్తువు ఎక్కణ్నుంచి దొరుకుతుంది? సమాజం వస్తువు. విషయాన్ని కొత్తగా చెప్పాలి. దానికి సమాజాన్ని అవగాహన చేసుకోవాలి. బాగా సాహిత్యాన్ని చదివి అవగాహన చేసుకోవాలి. అప్పుడే వైవిధ్యం సాధ్యమౌతుంది.
అస్పష్టత, సంక్లిష్టతలకు దూరంగా కలం కదలాలంటే...? 
ఈ విషయంలో మనం ఇదే ఉండాలి. ఇలాగే ఉండాలని చెప్పలేం. రచయితలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యక్తిని బట్టి, సమాజాన్ని బట్టి మారుతుంటాయి. రచయితలు మూడు ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. సమకాలీన సమాజం పట్ల నిర్దుష్టమైన అవగాహన ఉండాలి. ప్రముఖుల రచనలు ఔపోసన పట్టాలి. వస్తువు విషయంలో తనదైన దృక్పథం ఉండాలి. ఇవి ఉన్నప్పుడే రచయిత స్పష్టంగా కనిపిస్తాడు. ఆ రచనల్లో సాంద్రత కనిపిస్తుంది.
మానవ జీవితాన్ని ముడిసరకుగా చేసుకున్న రచనలు వస్తున్నాయా?
మానవ జీవితానికి సంబంధం లేకుండా ఏ రచయితా... ఏ రచనా చేయలేదు. ఇప్పుడే కాదు... అప్పుడూ అలాంటి రచనలు వచ్చాయి. ఎప్పుడైనా అలాంటివే వస్తాయి. మానవ జీవితంలో ఏ అంశాన్ని ఎన్నుకుంటారన్నది ఆయా రచయితలు, వారి దృక్పథాన్ని బట్టి ఉంటుంది. రావూరి భరద్వాజ ఒకలా తీసుకుంటారు... నేనొకలా తీసుకుంటాను... ఇంకొకరు... ఇంకోలా తీసుకుంటారు. ‘ఎంత మాత్రాన ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు’ అన్నారు అన్నమాచార్యులు. ఎవరెవరు ఎంతగా ఎత్తుకోగలిగితే... ఏ మేరకు ఎత్తుకోగలిగితే... వారి అవగాహన ఏ దశలో నిలిస్తే... ఏ స్థాయిలో నిలిస్తే... ఆ స్థాయిలో వారి రచనలు కూడా నిలుస్తాయి. 
మానవ జీవితపు లోతుల్ని తరచి చూడటమే సాహిత్య ప్రయోజనమా? 
సాహిత్యం అంటే జీవితానికి ప్రతిబింబం. సమాజంపై అభిప్రాయం. సామాజిక విశ్లేషణ. సమాజానికి ఇచ్చే సూచన. ఇదే లేకుంటే ఎలా స్పందించగలం. ప్రతిదీ మన జీవితం నుంచి రావాల్సిందే. సాహిత్యం పాఠకుడి అనుభవంలోకి వచ్చినప్పుడు... ఆ సాహిత్యానికి ప్రతిఫలమో, పర్యవసానమో దక్కుతుంది. రచయిత చెప్పిన విషయాన్ని బట్టి ప్రతిచర్య ఆధారపడి ఉంటుంది. కొత్తగా చెబితే అబ్బ... ఎంత బాగా చెప్పాడు అనుకుంటాం. ఆ కొత్తగా చెప్పడమనేది కూడా అవగాహనలోకి రావాలి. అవగాహనలోకి రాలేదంటే... ఏదో చెబుతున్నాడు మనకు అర్థం కావడం లేదయ్యా... ఏదో ఉపన్యాసంలాగా ఉందంటారు.
రచయితే పాఠకుడి స్థాయికి దిగాలా?
దిగడం... దిగకపోవడం అనే ప్రశ్నే లేదు. పాఠకుడి ఆలోచనను ఉత్తేజ పరచాలి. పాఠకుడి అనుభవంలోకి రావాలి. ఎంత గొప్పగా చెప్పే రచయిత అయినా... ఆ మేరకు మనిషి అనుభవాల్లోకి తొంగి చూడాలి. మనిషి అవగాహనల్ని అందుకోవాలి. మనిషి మేధస్సు దగ్గరకు రావాలి. జనాల ఊహల్లో నిలబడాలి. అప్పుడే రచయితకు, పాఠకుడికి మధ్య అవగాహన (ర్యాపో) ఉందని చెప్పగలం. అప్పుడే సాహిత్యం ప్రతిఫలాన్ని పొందగలదు.
ఏదైనా రచనకు కాలాతీత నాణ్యత రావాలంటే?
సమకాలీన సమస్యలతో ప్రమేయమున్న రచనలు అవసరం... ఆ సమస్యతోనే తీరిపోతుంది. మానవతా విలువలు, సర్వకాలీనమైన జీవుని వేదన ఉన్న రచనలు కాలాన్ని అధిగమించి బతుకుతాయి. ఇందుకు రామాయణమే గొప్ప ఉదాహరణ. అంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేదు. దాని¨ విలువలు వేరు. శతాబ్దాల నుంచి ప్రజల నాలుకల మీద నడయాడుతూనే ఉంది. మనుచరిత్ర, వసుచరిత్ర ఇలా ఎన్నో రచనలు సర్వజనీన విలువలను నింపుకున్నాయి. అందుకే నేటికీ వాటిని చదువుకుంటున్నాం.
కొత్త రచయితలను తయారు చేసే శక్తి ఏ సాహిత్యానికి ఉందంటారు?
అది వ్యక్తుల అభిరుచుల మీద ఆధారపడి ఉంటుంది. ముందైతే బాగా చదవాలి. మనకంటే ముందు వారు ఏం చేశారో... ఎలా చేశారో... ఎలా చెప్పారో అన్న విషయాల్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదట విద్వత్తు కావాలి. రెండోది వివేచన కావాలి. మూడోది విలక్షణమైన దృష్టి కావాలి. నాలుగోది తాను చెప్పే ధోరణి కావాలి.
ఈ నాలుగు ఉంటే మంచి రచనలు వస్తాయంటారా?
మంచి రచనలు కాదు... అసలు రచన రావాలంటేనే ఈ నాలుగు కావాలి. అది మంచి రచనా... కాదా... అన్నది కాలం నిర్ణయిస్తుంది. చెప్పే విషయంలో మనకు పూర్తి సామర్థ్యం ఉండి తీరాలి. రేడియోను బాగు చేసేవాడికి మొదట రేడియో గురించి తెలియాలి. దాన్ని మరమ్మతు చేయడం నేర్చుకోవాలి. తర్వాత తాను చేయడం ప్రారంభించాలి. తన అనుభవం నుంచి నేర్చుకోవాలి. అప్పుడు రేడియోను బాగు చేయడం వస్తుంది. రచన కూడా అంతే. ముందు పరిశీలించాలి... తర్వాత నేర్చుకోవాలి... ఆ తర్వాతే చేయాలి.
రచనల్లో చేసే హితబోధలకు, రచయితలు నిజజీవితంలో పాటించే విలువలకు సంబంధం?
అవసరం లేదు. నిజ జీవితంలో పాటించి... తను నేర్చుకున్న నిజాన్ని చెప్పినవాడు ప్రవక్త, మహాత్ముడు అవుతాడు. రచయిత కాడు. రచయితలందరూ తాము చెప్పినవన్నీ పాటించలేకపోవచ్చు. ఈ రెండూ... రెండు రకాలైన వేదికలు. ఈ రెంటికీ సంబంధం లేదు. తాను అనుభవంలో తెలుసుకున్న ఆదర్శాన్ని ప్రపంచానికి చెప్పేవాడు మహాత్మాగాంధీ అవుతాడు. నీవు పాటిస్తేనే ఆదర్శాలు చెప్పు అంటే... ఎవరూ చెప్పలేరు. చెప్పరు కూడా. తెలుగులో ఓ సామెత కూడా ఉంది. ‘నేను చెప్పింది చేయి... నన్ను చూసి చేయకు’ అని. రచయిత నిజానికి ఓ స్ఫూర్తిదాయకుడు. అది ఆయన చెప్పేవరకూ. అది ఆయన కూడా పాటించడమనేది వేరే విషయం. నిప్పులో దూకొద్దు ప్రమాదం అని రచయిత చెప్పాడనుకో... నువ్వు దూకావా అని అడిగితే ఎలా?
సమకాలీన తెలుగు సాహిత్యంపై మీ పరిశీలన?
నిజం చెప్పాలంటే, సమకాలీన సాహిత్యం మీద నాకు ఎక్కువ పరిశీలన లేదు. ఎందుకంటే, నేను ఎక్కువగా చదవలేదు. ‘వందేళ్ల కథకు వందనం’ కార్యక్రమం కోసం కథలు మాత్రం బాగా చదువుతున్నాను. ప్రపంచ సాహిత్యంతో పోటీ పడదగిన స్థాయిలో కథానిక సాహిత్యం వస్తోందని నా ఉద్దేశం. అయితే ఒకటే బాధ. నాటక రచనల విషయంలో మాత్రం... ఈ తరం వారు మాపాటి కూడా చేయలేదేమో అనిపిస్తోంది. కానీ... ఇది పరిశీలనతో చెబుతున్న మాట కాదని మీరనుకోవచ్చు. ఎందుకంటే... ఓ విధంగా నా అవగాహన తక్కువ. నా అవగాహన మేరకు మాత్రం... కథానిక సాహిత్యం చాలా మంచిది వస్తోంది.
నాటి నుంచి నేటి వరకూ రచనా భాషలో వచ్చిన మార్పులేంటి?
ఎన్నో రకాల మాటలు మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి మన మనసులోకి, మాటలోకి, రచనలోకి వచ్చేస్తుంటాయి. ఉర్దూలో నుంచి మనకెన్నో మాటలు వచ్చాయి. ఆంగ్లం నుంచి ఇంకెన్నో లభించాయి. కార్డ్, ట్రైన్‌... ఇలాంటివన్నీ. భేష్‌ అనే మాట మనది కాదు. తమాషా అనేదీ మనది కాదు. ఈ మధ్యలో వచ్చిన మాటలు పరిశీలిస్తే... నెటిజన్‌ అన్నారు. ఇంటర్నెట్‌ వచ్చింది గనుక. భాష స్వభావమేమిటంటే... పలుకుబడిలో నలిగిన ప్రతి మాటా... ఓ రూపాన్ని సంతరించుకుని... సాహిత్యంలోకి వస్తూ ఉంటుంది. అది కాలానుగుణంగా, సమాజాన్ని బట్టి వస్తూ ఉంటుంది. అది సహజం. సరిగ్గా చెప్పుకోవాలంటే... భాషావశ్యత (ఫ్లెక్సిబిలిటీ ఆఫ్‌ లాంగ్వేజ్‌). లేదా భాషా వెసులుబాటు. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే భావ ప్రకటన. ఇందులో భాగంగా... ఏది సులువుగా వివరించగలమో, చెప్పడం వల్ల ఏది సులువుగా అర్థమౌతుందో, కొన్ని వందల, వేల మంది ఏది మాట్లాడుతున్నారో... ఆ మాటలన్నీ నిలుస్తాయి. ఇది ఎక్కడా ఆగిపోవడానికి వీలు లేదు. ఇదో ప్రవాహం లాంటిది. నేను ఇలానే మాట్లాడతాను - నన్నయ గారు ఇలాగే రాశారు అని మనం అనం, అనడానికి లేదు. 
ఒకప్పటి రచనా కాన్వాసు చాలా పెద్దది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా?
ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే... ఇప్పటి రచనల్లో నేను చదివినవి చాలా తక్కువ. అయితే సినిమా విషయం తీసుకుంటే... మా కాలంలో వచ్చినన్ని అనువర్తనాలు (అడాప్టేషన్స్‌) ఇప్పుడు రావట్లేదు. ఆ రోజుల్లో సెక్రటరీ, చక్రభ్రమణం, రాక్షసుడు, మరణమృదంగం లాంటి ఎన్నో నవలలు చలనచిత్రాలయ్యాయి. అంత ముమ్మరంగా ఇవాళ అవుతున్నాయని అనుకోవట్లేదు. దానికి కారణం ఒక్కటే. కథానుగుణంగా సినిమా తీయడం కాకుండా... ప్రేక్షకులకు అప్పటికప్పుడు వినోదాన్ని పంచడమే దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారు. 
తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగం రావాలంటే?
ఇప్పుడు స్వర్ణయుగం లేదని ఎందుకనుకోవాలి.? నన్నయ కాలం నాటి స్వర్ణయుగాన్ని మనం గుర్తు పడుతున్నాం. శ్రీశ్రీ లాంటి వారి కాలంలో వచ్చిన సాహితీ స్వర్ణయుగాన్ని ఇప్పుడు మనం గుర్తిస్తున్నాం. నేటి సాహిత్య స్వర్ణయుగాన్ని 2050లో గుర్తుపడతారేమో... మనకేం తెలుసు. సాహిత్య ధర్మం ఏమిటంటే... కాలంతోపాటు తనకు తానుగా కొత్తగా సృష్టించుకోగలగాలి. తనకు తాను ఓ రూపాన్ని తెచ్చుకోగలగాలి. తనకు తాను కొత్తగా నిర్మితమవ్వాలి. ఆనాటి పరిస్థితులను బట్టి, సమాజంలో ఉన్న సంప్రదాయాల్ని బట్టి దానిలో మార్పు రావాలి. అది గొప్పదా... కాలాన్ని ఎదిరించి బతుకుతుందా లేదా అన్నది ఇవాళ చెప్పలేం. మనముందు తరాలు అంటే... మన మనవళ్లు చెప్పగలరు.
అంటే నేటి సాహిత్యంపై ఈ రోజు ఓ నిర్ణయానికి రాలేమంటారా?
కచ్చితంగా. మీ అబ్బాయి ఎలాంటి వాడో వాడు రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు నువ్వు చెప్పలేవు. 20 ఏళ్ల వయస్సులో చెప్పగలం... 30 ఏళ్ల వయసులో చెప్పగలం... 50 ఏళ్ల వయసులో చెప్పగలం. 20 ఏళ్ల వయసులో నీ కొడుక్కి ఏది మంచిదంటే... ఇరవయ్యేళ్ల కిందట అదే సందర్భంలో నీకు నీ పెద్దలు ఏది చెప్పారో అదే ఇప్పుడు నువ్వూ చెబుతావు. మన నీడ మనకు అక్కడే నిలబడ్డప్పుడు కనపడదు. అది ఎంత వరకూ వ్యాపిస్తుందన్నది చెప్పడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయానికి నేటితరం వారు ఉండకపోవచ్చు. అలాగే , సాహిత్యాన్ని ఇవాళ మనం నిర్ణయించలేం. కాలంతో పాటే విలువలు, సంప్రదాయాలు మారతాయి.  కాలాన్ని బట్టి రచనా సరళి మారుతుంది. మన అవసరాలు కూడా మారతాయి. ఈ ‘మార్పు’ గొప్పదా, మంచిదా, కాలం విడిచి నిలుస్తుందా అనే విషయాన్ని ‘కాలమే’ చెప్పగలదు. మీ జీవితం మీకు పాఠం చెబుతుంది. రేపటి జీవితానికి మీరు పాఠం నేర్పుతారు. అది ఏమిటన్నది కాలమే చెప్పాలి. చేయాలి. ఈ మధ్యలోనే మనం ఉంటాం.
ప్రస్తుతం తెలుగు ఏ పరిస్థితుల్లో ఉంది?
ఒకప్పుడు నేను తెలుగు వాణ్నని చెప్పుకోవడానికి గర్వపడే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి ఉందంటారా? మన మాతృభాష మున్ముందు అభివృద్ధి చెందాలన్న ఆశ, కోరిక రెండూ నాకున్నాయి. ఎందుకంటే నా వృత్తి, ప్రవృత్తి, వ్యాపకం అన్నీ భాషతోనే ముందుకు సాగాయి, సాగుతున్నాయి. ఒకప్పుడు విజ్ఞాన సముపార్జన కోసం చదివితే ఇప్పుడు ఉద్యోగ సముపార్జన కోసం చదువుతున్నారు. చదివిస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే సంపాదనకు అవసరమయ్యే చదువులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. భాషలోని తీయదనాన్ని, ఆత్మీయతను గుర్తించి, ఆస్వాదించి, ఆనందించే తత్వం... కనుమరుగు అవుతుందేమోనన్న భయం వేస్తోంది. ప్రపంచంలో నశించి పోయే భాషల జాబితాలో తెలుగు ఉందంటూంటే ఆందోళన కలుగుతోంది. ఈ భాషా  విజ్ఞాన భాండాగారాన్ని విస్మరించే రోజులు వస్తాయేమోనని బాధగా ఉంది. అయిదు పదులు దాటిన వారే తెలుగును క్షుణ్నంగా చదువుతున్నారు. కానీ, వారి పిల్లల్ని మాత్రం తెలుగులో చదివేందుకు, మాట్లాడేందుకు ప్రోత్సహించట్లేదు. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు. అయితే, ఈ మధ్యకాలంలో రోజురోజుకీ అంతర్జాలంలో తెలుగు భాష వినియోగం విస్తృతమవుతోంది. కొన్ని మీడియా సంస్థలు సైతం తెలుగుకు పెద్దపీట వేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే... తెలుగు భాషాభివృద్ధిపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.
మాతృభాష పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది?
ఆ బాధ్యత మీకు లేదంటారా! నాకు మాత్రం లేదంటారా! బాధ్యత వాళ్లది వీళ్లది అని నెట్టేయడం కాదు... తెలుగు వాళ్లంతా మాతృభాష పరిరక్షణ కోసం పూనుకోవాలి. ప్రభుత్వాలు, మీడియా సంస్థలు దీన్నో కర్తవ్యంగా చేపట్టాలి. వీళ్లందరి కంటే కూడా... తల్లిదండ్రులపైనే ఈ బాధ్యత ఎక్కువగా ఉంది. మనం ఏ మొక్క నాటితే ఆ చెట్టే పెరుగుతుంది. ఆ పళ్లే కాస్తాయి. మీ పిల్లలకు ఏ చదువు అందించాలను కుంటున్నారో... దాన్నే అందించండి. దాంతోపాటు... అమ్మ విలువ కూడా వారికి తెలియాలి కదా. అందుకే చిన్నతనం నుంచి పిల్లల చేత చక్కగా తెలుగు చదివించడం, వారికి తెలుగు వినిపించడంతోపాటు... ప్రతిరోజూ ఓ తెలుగు పద్యం నేర్పించండి. జాని జాని ఎస్‌ పాపా...తోపాటు... శ్రీరాముని దయచేతను లాంటి పద్యాలను నేర్పించండి. తెలుగులో వస్తున్న పిల్లల పుస్తకాలను చదివేలా ప్రోత్సహించండి.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి