-
తెలుగు వెలుగు
ఏప్రిల్ 2017
‘‘తెలుగు భాష గురించి రాయాలా?
తెలుగు గురించి మాట్లాడాలా..?
నాకెంత సంతోషమేసిందో..? నన్నింకోసారి తెలుగు మాస్టార్ని చేసింది. తెలుగు గురించి చెప్పుకోవడం అంటే, అమ్మ గురించి మాట్లాడుకోవడమే. నా గురించి నేను చెప్పుకోవడమే.
కానీ.. ఎక్కడి నుంచి మొదలెట్టను?
ఎవరితో శ్రీకారం చుట్టను?
ఒకరా, ఇద్దరా? తెలుగు భాషని వెలుగు భాషగా చేసిన మహానుభావులు ఎందరెందరో? వారందరికీ ఓ నమస్కారం పెట్టి, నాకెంతో ఇష్టమైన ఆ ఏడుకొండల వాడిని స్మరించుకొంటూ..
* * *
వందల కోట్ల మానవులు...
వారిలో 12 కోట్ల మందికి వెలుగు - తెలుగు! ప్రభుత్వాలు ముద్రవేయకపోయినా ఇది ప్రాచీనమే...
ఏ ప్రక్రియలోనైనా ఒదగటం భాషకు ఉండాల్సిన విశిష్ట లక్షణం. ఆ రకంగా చూస్తే తెలుగు వెలుగు ఏనాడైనా దేదీప్యమానమే! భాషామూర్తి, చదువులతల్లి ఎందరు కవిపండిత మునిగాయక జనావళిని పొదువుకుందో! ఆ ప్రస్థానం ఇప్పటిదా?? పదకొండో శతాబ్దం నాటిది. తెలుగుల కన్నయ్య- ఆదికవి నన్నయ్య- వినిపించే ప్రథమ నామం. ఆయన వెంటే త్రయంలోని తిక్కన, ఎర్రాప్రెగడలు. వారి మహాభారతాన్ని నేటికీ మర్చిపోలేం! ఆ రచనలో లేనిది ఎక్కడా కానరానిదనిపించుకుంది.
ప్రతి గుండెలో గుడికట్టుకున్న ధర్మమూర్తి రామయ్య- వాల్మీకి ఆర్తి కాదా! బసవన్నను కీర్తించిన పాల్కురికి... నిత్యపారాయణం నోచుకున్న పోతన భాగవతం... అక్షరమూర్తికి ఆభరణాలై అలరారాయి.
పదహారేళ్ళ వయసెలాంటిదో పదహారో శతాబ్దమూ అలాగ. అష్టదిగ్గజాల అండతో ఆకర్షించిన శ్రీకృష్ణదేవరాయలు... వారి ఆముక్తమాల్యద... అల్లసాని వారి మనుచరిత్ర... శివమెత్తిన ధూర్జటి... అందరిని తనవారిని చేసుకున్న తెనాలి రామకృష్ణకవి... పదహారో శతాబ్దాన్ని పరవళ్ళు తొక్కించారు.
17వ శతాబ్దంలోని ఉప్పెన- వేమన. నాటికులాల దురహంకారపు పోకడలని అలతి పదాలతో అనల్ప అర్థాలతో తూర్పారబట్టిన శైలి ఆ యోగిది. వారి పద్యాలు- నిత్యసత్యాలు. వాటిప్రభావమేనేమో- మానవతావాదం. మారాకు తొడిగింది. కందుకూరి వారి రాజశేఖర చరిత్రం నాటి హైందవ సమాజాన్ని హేళన చేసింది.
జాతీయవాదంతో తెలుగుజాతిని జాగృతం చేసిన చిలకమర్తి... పానుగంటి... మునిమాణిక్యం... నిజంగా జాతిరత్నాలే. తెలుగుభాషలోని పరిణామాల్ని పటిష్ఠపరచినవారే.
ఇక కన్యాశుల్కం వెలుగులోకొచ్చింది. ఇటీవలే 150వ వత్సర సంరంభం జరుపుకుంది- దాని వెలుగులు- గురజాడ వారి అడుగులు. భావాంబర వీధిలో విహారంతో ఓ కొత్తసొగసు... భావకవుల ముఠామేస్త్రి- దేవులపల్లి కృష్ణశాస్త్రి- వీరవిహారం నాటి జనుల కష్టాలని మరిపించింది. ఈయన మా సినిమావాడు కూడా నండోయ్. మరోవైపు తెలుగుతల్లికి వేయి పడగల గొడుగుపట్టిన విద్వచ్ఛక్తి విశ్వనాథసత్యనారాయణ. ఆనాడే ఆధునిక దళితకవిత్వానికి ధాతుపుష్టినిచ్చిన గుర్రంజాషువా!
అచ్చంగా జానపదశైలి మరొకెత్తు. అర్థమయిందిగా, ఇప్పుడు చెప్తోంది నండూరి వారి గురించేనని. తెలుగుజనానికి మరదలుపిల్ల- ఎంకి వారమ్మాయే! ప్రేమని తాత్త్వికంగా చెప్పిన ఈ మాటలు చూడండి- ‘‘నీకు ఒకే నేనుని- నాకెన్ని నువ్వులో...’’. ఉన్నవ వారి ‘మాలపిల్ల’- పేరు దగ్గర్నుంచే విప్లవసృష్టి...
తెలుగు భాషలో గౌరవసూచకం- శ్రీ... నాకూ ఒకటేనా అని రెండోది సాధించుకున్నవారు శ్రీశ్రీ- ఒక విస్ఫోటనం...
ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం
నా దాహం కూడా తీరలేదు.
ఒకటా- రెండా! వారా- వీరా...
ఏ లెఖ్ఖా లేదు...
అందుకే కుక్కపిల్లనీ అగ్గిపుల్లనీ కవితా వస్తువు చేసిపారేశాడు...
‘కవిత’నే కథానాయికగా చేసిన వాడు...
ఎన్ని చెప్పాలి... ఎన్నని చెప్పాలి... ఆ జీవితమే ఓ మహాప్రస్థానం...
ఆయన ప్రభావం పడనివారు తక్కువ...
నాకు వ్యక్తిగతంగా నచ్చిన కవి అలిశెట్టి ప్రభాకర్...అకాల మరణం చెందినవాడు. శ్రీశ్రీయే అన్నాడు -
‘సూర్యుడు మధ్యాహ్నమే అస్తమించాడు’ అని. అదీ ప్రభాకరుని ప్రకాశం.
మరో సాహితీ ప్రక్రియ - కథ...
తెలుగులో ఎందరు ‘కథా’నాయకులో.
కొడవటిగంటి కుటుంబరావు... చాగంటి సోమయాజులు...
రావిశాస్త్రి (ఈయన ‘ఆరు సారా కథలు’ చదివానండోయ్)
పాలగుమ్మి పద్మరాజు (ఈయన ‘గాలివాన’ కూడా...)
కొమ్మూరి వేణుగోపాలరావు (ఈయన పెంకుటిల్లు...)
గోపీచంద్... ఇలా ఇంకెందరో ఉన్నారు.
ఇన్ని వాదాల మధ్య ఏకాకి - స్త్రీవాదం.
ఆ స్త్రీకో గొంతునిచ్చిన వాడు - చలం.
అలాగే నగ్నముని లాంటి దిగంబర కవులు.
ఇక భక్తికవిత్వానికి రాగం.. తాళం జోడించిన త్యాగరాజాది వాగ్గేయకారులెందరో.
ఓ క్షణం... ఊపిరి పీల్చుకోనివ్వండి. ఓకె... క్లాసు తీసుకున్నాననిపిస్తే (ఎంతయినా లెక్చరర్నే కదా!) మాత్రం ఒక విషయం. నా దృష్టికొచ్చిన వారినే స్మరించుకున్నాను. ఇంకెందరున్నారో. వారికీ నా శతకోటి దండాలు.
ఒక పద్యం.... ఒక అవధానం... ఒక నాటకం... ఇంకెన్ని సొగసులున్నాయో!
ఇక మా సినీ కవులుండనే ఉన్నారు. సాహిత్య స్థాయిలో రచనలు చేసిన గేయరచయిత లెందరో! దానాదీనా - ఇంత సుసంపన్నం మన భాష.... దానికి వారసులం మనం... అది మన అదృష్టం...
ఇక నా గురించి అంటారా..?
నా జీవన చిత్రంలో ప్రతీ అంగుళమూ దైవికమే. నా ఇష్టదైవం వెంకన్న ప్రసాదమే!
దైవికంగా మరే సబ్జెక్టూ దొరక్క తెలుగు చదువుకున్నా. బహుశా నా ఉచ్చారణ బాగుండాలనేమో....! ఓసారి రజనీకాంత్ మెచ్చుకున్నారు. నా వేషం, ఉచ్చారణ, స్పష్టతలని. అదెప్పటికీ మర్చిపోలేని ప్రశంస. వ్యక్తిగతంగా మాది పెద్దకుటుంబం. సంపాదన ఎంత త్వరగా మొదలయితే అంత ఆనందం.
పాఠ్యపుస్తకాలు తప్ప మరేదీ చదివింది లేదు. పేపర్లు దిద్దటం తప్ప మరేమీ రచించింది లేదు.
తెలుగుమాస్టారు పద్యం చదువుతూ, దానికి అర్థం చెబుతూ ఉంటే, ఒళ్లంతా పులకరించిపోయేది. ‘తస్సాదియ్యా ఇంత ఉందా ఈ తెలుగులో..’ అనుకొనేవాడిని. మరో పద్యం చదివి - ‘మాస్టారండీ.. ఇందులో ఏముందండీ..’ అని అడగాలనే కుతూహలం వచ్చేది. అలా తెలుగుతో నా ప్రయాణం మొదలైంది.
ఆ తరవాత... పరిశ్రమలోకి ప్రవేశించా. తొలి పూజలందుకున్న జంధ్యాలతో సహా ఎందరో రచయితలతో ఇష్టాగోష్ఠి ఎన్నో సాహితీగోష్ఠులతో సమానం. ఫలానా పదం... ఇలాగే పలకాలి అని నా భాషని దిద్దించిన గురువాయన. తానేం చదివినా, రాసినా, తొలిగా నాకే వినిపించే తనికెళ్ల భరణి - సన్మిత్రుడు కావటం నాకెంతో ఇష్టం.
తెలుగు భాషకు ఒడిదుడుకులు తెలియనివి కావు. స్వర్ణయుగమూ దానికి తెలుసు - వివర్ణం చేసే పరిస్థితులూ దానికి తెలుసు.
నా నమ్మకమొక్కటే - ఏ ప్రపంచీకరణా ఈ ప్రాచీన భాషనేమీ చేయలేవు. దాని అభిమానులే దాని బలం. భాష జీవనది. అది ఎప్పుడూ పొంగిపొర్లుతూనే ఉంటుంది. భాష ఉధృతిని ఆపడం సముద్ర ప్రవాహాన్ని కట్టడి చేయడమే.
అన్నగారు చేసినంతగా ఏ ప్రభుత్వమూ చేయ(లే)దు. భాషకు ఓ మంత్రిత్వశాఖను ఏర్పరచటం, ఓ మంచి ఆలోచన. నిజంగా పనిచేస్తే!
చివరగా అలనాటి బ్రౌన్ దొర వంటి ఆంథ్రేతరుల సహా గిడుగు రామ్మూర్తి... సురవరం ప్రతాపరెడ్డి... రామోజీరావు ఇలా ఎందరో అభిమానులు - నాడూ నేడూ తెలుగుకు రక్షరేకలు.
వీరందరికీ అండగా ఏడుకొండల వాడుండగా -
అన్నమయ్య కీర్తనల కోసమైనా!
మీ
బ్రహ్మానందం