తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగు భాష బంగారం... అందులో ఎంతో సింగారం

  • 150 Views
  • 26Likes
  • Like
  • Article Share

    మహమ్మద్‌ అన్వర్‌

  • హైదరాబాదు
  • 8008709985

      ‘‘అమృతం గొప్పదా? తెలుగు భాష గొప్పదా?’’
      - ఈ ప్రశ్న నన్నడగండి చెబుతా. అమృతం ఉందో లేదో తెలీదు. ఒకవేళ ఉన్నా...  అది అమ్మభాషంత కమ్మగా ఉండదని నా నమ్మకం. అలాంటి నా తెలుగు భాషా సౌందర్యాన్ని ఏమని పొగడాలి? ఎలా వర్ణించాలి? నేను కవిని కాదాయె. వర్ణనలు తెలియవాయె. కేవలం నటుణ్ని. అయితేనేం..? ఎన్నో అద్భుతమైన సంభాషణలు పలికే అవకాశం వచ్చింది. సుందరమైన భావాల్ని నింపుకొన్న పాటలకు అభినయించే అదృష్టం దక్కింది. అందుకే జన్మజన్మలకూ నేను తెలుగు భాషకి రుణపడి ఉంటా.

      ‘అప్పు...డే తెల్లారిందా?’ - ‘అప్పుల అప్పారావు’ ఈ సంభాషణతోనే ప్రారంభం అవుతుంది.
      భాషని తెలివిగా విరిస్తే ఎంత అర్థం మారిపోయింది. ఎంత వినోదం పుట్టింది..? ఇలా నా సినీ జీవితంలో ఎన్నో.. ఎన్నెనో.. భాషాస్మృతులు. అసలింతకీ భాషని ఆస్వాదించే గుణం నాకెలా అబ్బిందో తెలియాలంటే నా సంగతులు కొన్ని మీకు చెప్పాల్సిందే.
      నిమ్మకూరు మాస్టారు అబ్బాయిని..! నా భాష గురించి ప్రస్తావించే ముందు ఆయన గురించి కాస్త చెప్పుకోవాలి. మా నాన్నగారు మహా నిక్కచ్చి మనిషి. ఆయన ముందు నేనూ ఓ విద్యార్థినే. మా నాన్నగారు భావ ప్రకటనకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఆయన ముందు తత్తత్త.. బేబ్బేబ్బే అని నసిగితే కుదరదు. మనసులో అనుకొన్నది వాక్య నిర్మాణ దోషం లేకుండా చెప్పేయాలి. ‘నీకేం కావాలో నువ్వు చెప్పలేనప్పుడు నేనేం ఇవ్వగలను?’ అనేవారు. ఆ మాట నాలో బాగా నాటుకుపోయింది. మా అమ్మకి సంగీతం వచ్చు. ఆమె మాటే పాటలా ఉండేది. నా మాటల్లో స్పష్టత రావడానికి నాన్నగారు ఓ కారణమైతే... శ్రావ్యత తోడవడానికి అమ్మ మూలం.
      బళ్లో చదువుకొన్న తెలుగు... మార్కుల వరకే. జీవితానికి కావాల్సిన చదువు... నందమూరి తారక రామారావుగారి దగ్గర నేర్చుకొన్నా. నా తెలుగు కథలో ఆయనెందుకు వచ్చారు.. అనుకొంటున్నారా? ఆయన మాకు దగ్గరి బంధువే. నేను చేసుకొన్న పుణ్యం కొద్దీ రామారావుగారి సాహచర్యం నాకు దక్కింది. మద్రాస్‌లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చదువుకొంటున్న రోజుల్లో వీలున్నప్పుడల్లా రామారావు గారిని కలుసుకొనేవాడిని. వెళ్లగానే..
      - ‘ఏదీ... ఆ సొరుగులో ఓ పుస్తకం ఉంది తీయండి..’ అనేవారు.
      అక్కడ రామాయణమో, భాగవతమో కనిపించేది.
      ‘రెండువందల పదిహేడో పేజీ తీయండి..’ అనే వారు.
      కిమ్మనకుండా తీసేవాణ్ని.
      ‘ఇప్పుడు చదవండి’ అని ఆజ్ఞలాంటిది వేసేవారు.
      చదవడం అంటే... లోలోపల కాదు. అందరికీ వినిపించేలా. రామారావుగారి ముందు మాట్లాడటమంటేనే బెరుకు. అలాంటిది పద్యాలు చదవడమంటే..? అయినా ధైర్యం తెచ్చుకొని చదివేవాణ్ని. ‘ఆఁ.. ఇప్పుడు చెప్పండి. ఆయన ఏమంటారూ..?’ అనేవారు. దానికి అర్థం చెప్పాల్సిందే. ఒకవేళ తెలియకపోతే కనుక్కొని మరీ చెప్పేవాణ్ని. అది నా భాషా సామర్థ్యానికి రామారావుగారు పెట్టిన పరీక్ష. ఇప్పుడు ఎలాంటి సంభాషణనైనా అవలీలగా పలుకుతున్నానంటే కారణం... ఆయనే. మహానుభావుడు... ఆయనకు శతకోటి దండాలు. అక్కడే త్రివిక్రమరావు, పుండరీకాక్షయ్యలు ఉండేవారు. పుండరీకాక్షయ్యగారు తెలుగులో దిట్ట. ‘కృష్ణావతారం’, ‘మహామంత్రి తిమ్మరుసు’ స్క్రిప్టులు నాచేతిలో పెట్టి చదవమనేవారు. ఈ సినిమాలు తీసింది ఆయనే. ఆ సినిమాల్లో ఎంత కమ్మని భాషండీ...? ఒక్కొక్క పద్యమూ చదువుతుంటే ఒళ్లు పులకించిపోయేది. ఏ పదాన్ని ఎక్కడ నొక్కాలి, ఇంకెక్కడ స్పష్టంగా పలకాలి? భావయుక్తంగా ఎలా చెప్పాలి? ఈ విషయాలన్నీ వీరి సాంగత్యంలోనే నేర్చుకొన్నా. ఈ గురువులకీ... పాదాభివందనాలు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడే భాష వినడానికి బాగుంటుంది అనే పేరొచ్చిందంటే కారణం.... వీరే.

* * *

      ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో నల్లబల్లపై ఓ వాక్యం నన్నెప్పుడూ ఆకర్షిస్తుండేది. ‘‘జీవితంలో ప్రతీదీ అనుకరణతో మొదలవుతుంది. ప్రతిసృష్టితో పూర్తవుతుంది’’ అని. భాష కూడా అంతే కావచ్చు. తన బిడ్డని ఒళ్లో కూర్చోబెట్టుకొని ‘అ... మ్మా...’ అంటూ అమ్మ తొలి పలుకులు నేర్పుతుంది. బిడ్డ అమ్మ పెదాల కదలికలను అనుకరిస్తుంది. అక్కడే భాషతో మన ప్రయాణం ప్రారంభమవుతుంది. అలా.. తొలి గురువు స్థానం అమ్మకి దక్కింది. అమ్మ నేర్పే భాష కాబట్టే అది అమ్మ భాష అయ్యింది. భాష నేర్చుకోవడం అంటే నాదృష్టిలో సంస్కృతిని, సంప్రదాయాన్నీ, పద్ధతులనూ నేర్చుకోవడమే. ప్రతీ తల్లీ తన బిడ్డకు కొన్ని కథలు చెబుతుంది. అక్కడి నుంచి సాహిత్యంపై ప్రేమ పుడుతుంది. అమ్మమ్మలు సామెతలు వల్లిస్తుంటారు. భాషపై మమకారం రెట్టింపు అవడానికి అవి దోహదం చేస్తాయి. అసలు తెలుగు భాషా సౌందర్యం సామెతలూ, నుడికారాల్లోనే ఉందంటే అతిశయోక్తి కాదేమో..?
అడ్డాలనాడు బిడ్డలు కానీ గెడ్డాలనాడు కాదు
      - ఎంత శ్రుతి ఉందండీ ఈ సామెత లో? ఒక్క వాక్యంలో ఎంత గొప్ప భావం.
కడుపు చించుకొంటే కాళ్లమీద పడుతుంది
      కడుపు చించుకోవడం ఏమిటీ¨? అది కాళ్లమీద పడటం ఏమిటీ? జీవితానికీ, అనుబంధాలకూ సంబంధించిన లోతైన విషయాన్ని ఇలా ఎలా చెప్పేశారు?
ఇవి మాత్రమేనా..? మరి పద్యం మాటో..? అది తెలుగువాడి సొత్తు. తెలుగు వాడికి మాత్రమే దక్కిన అద్భుతమైన నిధి. ఈ విషయం తెలిసినప్పుడల్లా గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ‘‘దేవ బ్రాహ్మణ మాన్యముల్‌ విడచి...’’ ఇలాంటి పద్యాలు పాడుతున్నప్పుడు, అందులో భావాన్ని మనసుకి ఎక్కించుకొన్నప్పుడు... ఆహా ఇది కదా మన తెలుగు భాష... అనిపిస్తుంది.

* * *

      అనుభవమే అన్నీ నేర్పిస్తుంది అంటారు. నా వరకు అది నిజం. నేనేం తెలుగు భాషని పుస్తకాలు చదివి నేర్చుకోలేదు. అసలు పుస్తకాలే చదవను. వినడం నాకు చాలా ఇష్టం. రేడియోలో అద్భుతమైన నాటకాలొచ్చేవి. ఏ పనిచేసుకుంటున్నా ఓ చెవి అటు పడేసేవాడిని. ఎవరైనా ఏదైనా ఓ పదం కొత్తగా వాడితే... ఇట్టే పట్టేసేవాడిని. నిజానికి నాకు ఇప్పటికీ  స్క్రిప్టు బట్టీపట్టే అలవాటు లేదు. ఎవరైనా చదివితే వింటా. అంతే. ఇక నా దర్శకుల గురించి చెప్పుకోవాలి. డీవీ నరసరాజు, జంధ్యాల, వంశీ... పెద్ద జాబితాయే ఉంది. వీళ్లు నా భాషనీ, నా యాసనీ మార్చేశారు. ముళ్లపూడి వారైతే మరీనూ. ‘పెళ్లిపుస్తకం’, ‘మిస్టర్‌ పెశ్లాం’ సినిమాలు చేశా ఆయనతో. భలే మాటలు. ఆయన ‘పంచదార’ అని రాసేవారు కాదు. ‘పందార’ అనేవారు. వంశీ అయితే గోదావరి యాస నా బుర్రలోకి ఎక్కించేశారు. ఇంట్లోవాళ్లు ‘ఏరా ప్రసాదూ..’ అని పిలిస్తే చటుక్కున ‘ఆయ్‌ఁ...’ అనేసేవాణ్ని ‘ఆయ్‌.. అంటున్నావేంట్రా సచ్చినోడా?’ అని ఆటపట్టించేవారు.
      పాత సినిమాల్లో మాటలు చాలా గంభీరంగా ఉండేవి. ‘ప్రభూ ఏమిటి మీ ఆన.. వచ్చుచుంటిరా..?’ ఇలా సాగిపోయేవి. ఆ తర్వాత ‘గుండక్కో.. గుండక్కా’ అంటూ  మాటలు వచ్చేశాయ్‌. ఇది సినిమాల్లో భాషాపరంగా వచ్చిన మార్పు. మేధావులతో, భాషా ప్రేమికులతో పనిచేయడం వల్ల.. నాకూ కొంత భాషాజ్ఞానం అబ్బింది. అవసరమైన చోట రెండు మాటలు మనమే అనగలిగే పరిస్థితి. పెద్ద పెద్దవాళ్ల మాటలన్నీ వినేసి. మనసులో దించేసుకొని నాకు కావాల్సినప్పుడు .. వాడేసేవాడిని. అది నాకు బాగా కలిసొచ్చింది.

* * *

      బంగారంతో ఏ వస్తువైనా చేసుకోవచ్చు. ఎన్ని మెరుపులైనా తీసుకురావచ్చు. తెలుగు భాష కూడా బంగారం లాంటిదే. దానికి ఎన్ని సొగసులో, ఇంకెన్ని మెరుపులో. స్వర్ణకారుడి పనితనాన్ని బట్టి బంగారానికి వన్నెలొస్తాయి. భాషకీ అంతే. అది వాడుకునే వాడి సత్తాపై ఆధారపడి ఉంటుంది. తెలుగు పాదరసం లాంటిది. ఎలాంటి ఆకారమైనా తీసుకొంటుంది.
      ఏందివయ్యా గట్లా చెబుతావ్‌...
      ఎప్పుడొచ్చేసినావ్‌రా బాబూ..
      యాండే పెసాదుగారో.. బాన్నారా...? ఆయ్‌ఁ.. రండి భోంచేద్దురుగానీ.. - ఎన్ని రూపాలు, ఇంకెన్ని శ్రుతులూ..? అన్నిచోట్లా తెలుగే. కానీ దాన్ని వాడుతున్న విధానం వేరు. ఓసారి నెల్లూరు వెశ్లా. అక్కడొకాయన.. ‘బజారుపోయి గుడ్లెత్తుద్దాం రా’ అన్నాడు. నాకు కంగారేసింది. బజారు పోయి గుడ్డలు ఎత్తడం ఏంటండీ అసహ్యంగా ఉండదూ..? అనుకున్నా. కానీ అక్కడ గుడ్లెత్తుదాం అంటే.. - బట్టలు కొనుక్కొందాం అని అర్థమట.
      కర్నూలు కడపల్లో దొబ్బడం అంటారు.. అంటే తొయ్యడం. మా కృష్ణా జిల్లాలో దొబ్బడం అంటే... బూతు. ప్రాంతం ప్రాంతానికి ఎన్ని వైవిధ్యాలు. ఒక్కొక్క యాసదీ ఒక్కో సౌందర్యం. అవన్నీ నా పాత్రల ద్వారా పలికే అవకాశం వచ్చింది.
      ‘తులసీదళం’, ‘ముత్యమంత ముద్దు’, ‘ఏప్రిల్‌1 విడుదల’ ఇవన్నీ నాకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు. అయితే ఇవి ముందు నవలారూపంలో వచ్చాయి. గమ్మత్తేమిటంటే ఈ నవలలు నేను చదవలేదు. చదివితే.. ఓ రకమైన ఊహాజనిత ప్రపంచంలోకి వెళ్లిపోతానేమో.. దానికి లోబడే నటిస్తానేమో అనే భయం. ‘నవల చదవకుండానే అంత బాగా చేశావా?’ అని యండమూరి వీరేంద్రనాథ్‌ కూడా ఆశ్చర్యపడిపోయేవారు. పాటలు.. మాత్రం చక్కగా వింటా. కార్లో కూర్చుంటే ఏదో ఓ పాట. ఘంటసాల, జిక్కి, సుశీల, పీబీ శ్రీనివాస్‌... మరీ ముఖ్యంగా భానుమతి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ - ఎవరిని కాదంటాం?
      ఆత్రేయ, కృష్ణశాస్త్రి, వేటూరి.. ఎవరిని వద్దంటాం..?
      ‘‘పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా ఆ కట్టుబడికి తరించదా పట్టుపురుగు జన్మా’’
      ‘‘రాధా మాధవుణ్ణిలే - ప్రేమారాధకుణ్ణిలే ’’
      - ఎన్ని చక్కని భావాలో..?
      ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఓనమాలు’ ఈ సినిమాలు చూశారంటే మరో రాజేంద్రప్రసాద్‌ కనిపిస్తాడు. ఆ సంభాషణల్లో జీవన సత్యాలు దాగున్నాయి.
      ‘‘రూపాయీ రూపాయీ నువ్వేం చేస్తావ్‌ అని అడిగితే, హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడిస్తాను. భార్యా భర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రీ కొడుకులను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితులను సైతం విడగొడతాను అందట’’
      ‘‘చదువుకుంటానంటే డబ్బులిస్తా, చదువు కొంటా అంటే ఇవ్వను’’
ఇలాంటి మాటలు పాత్ర ఔచిత్యాన్ని పెంచుతాయి. రఘురామ్‌ పాత్ర ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోందటే దానికి కారణం... ఇలాంటి సంభాషణలే.
      నాకు రాయడం కూడా అలవాటు లేదు. కానీ ఓ సందర్భంలో నాలోని భావుకుడు బయటకు వచ్చాడు. ఆ సందర్భం మీతో పంచుకోవాలనిపిస్తుంది. రచయిత జొన్నవిత్తుల, నేనూ ఓసారి చిలుకూరు వెళ్లి వస్తుంటే మధ్యలో గోశాల కనిపించింది. అక్కడ మూడొందల ఆవులున్నాయి. అన్నింటికీ దూడలున్నాయి. అయితే ఆవులు ఓ చోట. దూడలోచోట కట్టేశారు. నాకు పెద్ద అనుమానం వేసింది. దూడలన్నీ ఇంచుమించు ఒకేలా, ఒకే రంగులో ఉన్నాయి. ఏ ఆవుది ఏ దూడో ఎలా తెలుస్తుంది? తన దూడని గుర్తించి ఆవు పాలు ఎలా ఇస్తుంది. ఇదే అక్కడివారిని అడిగా. ‘కాసేపు ఆగండి.. మీకే తెలుస్తుంది’ అన్నారు. పాలిచ్చే సమయం వచ్చింది. దూడలకు కట్లు విప్పేశారు. ఒక్కో దూడకూ ఒక్కో పేరు ఉంది. ‘కల్యాణి...’ అని పిలవగానే ఆ దూడ పరుగెట్టుకొంటూ తల్లి దగ్గరకు వెళ్లిపోయేది. ‘శాంభవీ..’ అనగానే మరో దూడ.. అమ్మ దగ్గరికి పరిగెట్టేది. ఈ సన్నివేశం చూసి నాకు ఏడుపొచ్చేసింది. ఎందుకంటే చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమయ్యా కదా. అదంతా నాకు ఓ అద్భుతంగా అనిపించింది. వచ్చేస్తున్నప్పుడు గోశాల వాళ్లు ఓ పుస్తకం చేతిలో పెట్టారు. మీరు మా అతిథులు. వెళ్లేటప్పుడు ఏదో ఒకటి రాయండి.. అన్నారు. నాకా రాయడం చేతకాదు. కానీ.. ఆ సందర్భంలో మాత్రం కలం కదిలింది. ‘‘ఆవు ఆవులోన అమ్మ కనిపిస్తుంది. అమ్మ పాల కొరత ఆవు తీరుస్తోంది’’ అంటూ ఓ రెండు వాక్యాలు రాశా. మన భావాలే భాషగా మారతాయనే విషయం నాకు తొలిసారి అర్థమైంది. ‘ప్రసాదూ.. నీ జీవిత కథ రాయి..’ అంటుంటారు బాగా తెలిసినవాళ్లు. నేను రాయగలను అనే విషయం ఆ గోశాలలో తెలిసింది. ఆ స్ఫూర్తితోనే ఎప్పటికైనా నా కథ రాస్తా. అచ్చమైన తెలుగులో.

* * *

      ఇప్పటి సినిమాల్లో తెలుగు భాష ఏమైపోతోంది? ఈ సామెతలూ, నుడికారాలూ ఉంటున్నాయా? పాటల్లో అంత సాహిత్య విలువలు ఉంటున్నాయా? ఇలాంటి కంగారేం వద్దు. ఎందుకంటే మార్పు అనివార్యం. అయితే ఈరోజుల్లో కూడా మంచి భాష వినపడుతోందంటే.. రచయితలూ, దర్శకులూ చదువుకొన్నవాళ్లు రావడం వాళ్లకు తెలుగు భాషపై మమకారం ఉండటమే కాదు. ఓ ముళ్లపూడి వెంకట రమణ, ఓ జంధ్యాల, ఓ వంశీ, ఓ త్రివిక్రమ్‌.. ఇలా ప్రతి తరంలోనూ ఎవరో ఒకరు వస్తుంటారు. ఆ బాధ్యత భుజాన వేసుకొంటారు. ఆ నమ్మకం నాకుంది. అయితే ప్రభుత్వం కూడా భాషా పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. చాలా అమూల్యమైన పుస్తక సంపద ఉంది మనకు. పునర్ముద్రణకు నోచుకోని పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ ప్రభుత్వం గుర్తించి అలాంటి పుస్తకాలను పాఠకులకు అందుబాటులో తేవాలి. మరీ ముఖ్యంగా ఓ తెలుగు వాడిని మరో తెలుగు వాడు గౌరవించడం నేర్చుకోవాలి. దూరమైతేగానీ మనసులూ, మమతల విలువలు తెలీవు. తెలుగు భాషని దూరం చేసుకొని ఆనక తీరిగ్గా బాధ పడొద్దు. ఇప్పుడే కళ్లు తెరుద్దాం. తెలుగు భాషనీ, మాట్లాడుతున్నవారినీ గౌరవిద్దాం.

- రాజేంద్రప్రసాద్‌


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి