తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

తెలుగు కోసం ఏడ్చేశా...

  • 142 Views
  • 1Likes
  • Like
  • Article Share

    మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

  • తిరుపతి
  • 7893761212

తెలుగుభాషపై మమకారం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు అతిముఖ్యమైంది. మాతృభాషాభిమానానికి అసలు సిసలు చిరునామాగా నిలిచే తమిళనాడులో … తమిళ భాష మధ్య తెలుగును  అక్కడి వారు కాపాడుకుంటున్న తీరు ఆదర్శనీయం. మాతృభాష రక్షణకు అక్కడి వారు చేస్తున్న కృషి, పడుతున్న కష్టాలను ‘తెలుగు వెలుగు’తో పంచుకున్నారు హోసూరు శాసనసభ్యులు పి.గోపీనాథ్‌. పన్నెండేళ్లుగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్షం నేతగా ఉన్న తెలుగు వ్యక్తాయన. 
తె.వె: తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లోని తెలుగువారికి హోసూరు తెలుగు ప్రజల మధ్య ఉన్న ప్రధాన తేడా? 
గోపీనాథ్‌: చాలా తేడా ఉంది. శ్రీకృష్ణదేవరాయలకు ముందు నుంచే ఇక్కడ తెలుగు జాతి స్థిరపడింది. ఇక్కడిలాగే తమిళనాడులో తెలుగువారు ఎప్పటినుంచో స్థిరనివాసం ఏర్పరచుకున్న ప్రాంతాలు కోకొల్లలు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఇతర ప్రాంతాల్లోని తెలుగువారిలో ఒక ప్రత్యేక భావన వచ్చింది. తాము పరాయిరాష్ట్రంలో ఉన్నందున ఇక ఇక్కడి భాషే తమ మాతృభాష అని నమ్మడం, దాన్ని అక్కున చేర్చుకోవడం ప్రారంభించారు. ఇలా క్రమంగా మాతృభాషకు దూరమవుతూ వచ్చారు. దీనికితోడు ప్రభుత్వం సైతం తమిశానికి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలో తమిళేతర భాషలు లేకుండా చేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. ఇలా ప్రజల్లో పెరుగుతున్న భావన, ప్రభుత్వ తీరు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు తమ మాతృభాషకు దూరం అవుతుండటానికి ప్రధాన కారణం. కానీ ఇక్కడి మట్టి మహిమ ఏమంటే ఇతర ప్రాంతాల వారిలా మేం మాతృభాషను వదులుకోలేదు. ‘‘మాతృభాష లేకుంటే మనం లేం, మన భాషను మరిచామంటే కన్నతల్లిని మరిచినట్టే’’... ఈ భావన ఇక్కడి మట్టిలో పుట్టిన ప్రతి తెలుగోడిలో నాటుకుపోయింది. తమిళనాడులో... అదీ కర్ణాటక సరిహద్దుకు కేవలం 4 కి.మీ. దూరంలో ఉన్నాం. దాంతో ఈ రెండు రాష్ట్రాల ప్రభావం మాపై ఎక్కువగానే ఉంది. అయినా మేం ఇంకా మా కన్నతల్లి నీడలోనే ఉన్నాం.
తమిళ నాట కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు గగనమవుతున్న తరుణమిది. అలాంటిది మీరు వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. తెలుగుభాషకు మీరు చేస్తున్న పోరాటమే దీనికి కారణమా?
ఇక్కడి ప్రాంత ప్రజలకు భాషపై ఉన్న మమకారం, ప్రేమ చెప్పలేనిది. భాషకోసం ఏదైనా చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. వారిలో నేనూ ఒకణ్ని. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమంటే మన కుటుంబ ఆస్తులను వారసులకు ఎలా పంచుతామో భాష, సంస్కృతిని కూడా మన పిల్లలకు భద్రంగా అందించాలి. ఉదాహరణకు... తంజావూరును తెలుగు రాజులు పాలించారు. అక్కడ తెలుగువారు హోసూరు జనాభా కంటే ఎంతో అధికం. మధురై, కోయంబత్తూరు లాంటి ప్రాంతాలతోపాటు తమిళనాడులోని అనేక చోట్ల తెలుగువారి జనాభా తమిళుల కంటే అధికం. కానీ ఇప్పుడక్కడ తెలుగు చదువుకునే వారు ఉన్నారా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. అక్కడున్న ప్రస్తుత తరం కనీసం తమ మాతృభాషలో మాట్లాడలేని పరిస్థితి. మాతృభాషకే దూరమైతే ఇక మన అస్తిత్వం ఇంకేముంటుంది..? భాషంటే మనకు వస్తే సరిపోయేది కాదు. వచ్చే తరాలకు కూడా అందించాలి. భాష భవిష్యత్తులో ఎప్పటికీ నిలిచిపోవాలి. ఆ బాధ్యత ప్రతీ తెలుగోడిపైనా ఉంది. దీని కోసం కృషి చేయాలి. ఈ భావనే నేను రాజకీయాల్లోకి రావటానికి పురిగొల్పింది. మా కుటుంబం సుదీర్ఘ కాలం నుంచి రవాణా వ్యాపారంలో ఉండటం వల్ల ఆర్థికంగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. అందుకే పూర్తిగా తెలుగు సేవే ఊపిరిగా బతుకుతున్నాను. నా ఉద్దేశం, మార్గం తెలుసు కాబట్టే నియోజకవర్గ ప్రజలూ ప్రోత్సహిస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న లక్ష్యమే నేను అనుక్షణం మన భాష గురించి పోరాడేలా చేస్తోంది.
ఇప్పటి వరకూ మీరు చేసిన కృషితో సంతృప్తి చెందుతున్నారా?
హోసూరు నియోజకవర్గంలో అన్నీ తెలుగు పాఠశాలలే. అయినా  గత 30 ఏళ్లుగా ఇక్కడ తెలుగు పండితులు లేరు. తెలుగుమాధ్యమ పాఠశాలల్లో ఇతర ఉపాధ్యాయుల ఖాళీలను కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. తెలుగు బోధకులు లేకుండా విద్యార్థులు తెలుగుపై పట్టు సాధించటం అసాధ్యం. నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవగానే ఈ సమస్యనే ప్రాధాన్యాంశంగా తీసుకున్నాను. శాసనసభలో అనేకమార్లు ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాను. గత పన్నెండేళ్ల కాలంలో ఇక్కడ వెయ్యికిపైగా ఉపాధ్యాయుల ఖాళీలను పూరించారు. రెండోసారి ఎన్నికయ్యాక నా ఒత్తిడి మూలంగా ప్రభుత్వం ఇక్కడి తెలుగు మాధ్యమం పాఠశాలల్లో ఒకేసారి 567 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి నియోజకవర్గంలో తొలి తెలుగు ప్రభుత్వ డిగ్రీ కశాశాల కూడా ప్రారంభమైంది. దీంతో ఇక్కడ ప్లస్‌టూ వరకు చదువుకున్న తెలుగు విద్యార్థులు తెలుగు చదివేందుకు మరోప్రాంతానికి వెశ్లాల్సిన ఇబ్బంది తప్పింది. తెలుగువారితోపాటు ఉర్దూ మాతృభాష కలిగిన ముస్లింల జనాభా కూడా ఇక్కడ ఎక్కువే. మనలానే వారికి కూడా వారి మాతృభాషపై మమకారం ఉంటుందన్న వాస్తవాన్ని తెలుగు భాషాభిమానిగా గ్రహించగలను. కానీ ఇక్కడ వారు తమ మాతృభాషలో చదువుకునే పరిస్థితి లేదు. స్వాతంత్య్రానికి పూర్వం 1940లో ఏర్పాటుచేసిన ఒక ఉర్దూ ప్రాథమిక పాఠశాలే ఇప్పటికీ ఉంది. వారు ఉర్దూలో చదువుకోవాలంటే బెంగళూరుకు వెశ్లాల్సిన పరిస్థితి ఉండేది. వారి కోసం కూడా పోరాడాను. ఇప్పుడు వారికి ఉర్దూలో చదువుకునేలా పన్నెండో తరగతి వరకూ పాఠశాల సైతం ఏర్పాటైంది. వాళ్లే కాదు తమిళులు, కన్నడిగులు, మలయాళీలు కూడా వారి మాతృభాషలోనే చదువుకునేలా పాఠశాలలను ఏర్పాటు చేయించాను. నా అమ్మభాషతో పాటు ఇతరుల మాతృభాషలను సైతం గౌరవించి వాటి కోసం కృషి చేయడం, ఫలితాల్ని సాధించడం ప్రజాప్రతినిధిగా నా విజయాలు. దీంతో తెలుగు ఎమ్మెల్యే అయినా మా భాషను కూడా ప్రోత్సహిస్తున్నాడన్న సంతోషం వారిలో ఉంది. ఇలా గత 12 సంవత్సరాల పదవీకాలంలో భాషకు సంబంధించి వ్యక్తిగతంగా చేసిన కృషి సంతృప్తిని కలిగిస్తున్నా, ప్రభుత్వపరంగా జరుగుతున్న అన్యాయం మాత్రం ఆవేదననే మిగులుస్తోంది.
తమిళనాడులో తమిళేతర భాషలు ఉండరాదన్న లక్ష్యంతో 2006 నుంచి ప్రభుత్వం ‘నిర్బంధ తమిళ’ చట్టం అమలుచేస్తోంది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు...?
ఈ విషయమే ఇప్పుడు మా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మా మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేమని ఇక్కడి ప్రభుత్వానికి అనేకమార్లు స్పష్టం చేశాం. తెలుగుతో పాటు ఇక్కడి రాష్ట్రభాష తమిశాన్ని కూడా నేర్చుకుంటామని అంటున్నాం. అలాగే నేర్చుకుంటున్నాం. మాతృభాషను వదిలి ఎన్ని భాషలను నేర్చుకున్నా సంపూర్ణ వికాసం సాధించలేం. కనీసం పాఠశాల విద్య తప్పనిసరిగా మాతృభాషలో అభ్యసిస్తేనే ఇతర భాషలను సైతం అవలీలగా నేర్చుకోగలం. ఈ విషయం ఇక్కడి ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. తెలుగుతో పాటు తమిళం కూడా నేర్చుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అయినా తమిళం మీద అభిమానంతో ఇతర భాషలను నామరూపాల్లేకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నట్టుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉంది. ఇందులో భాగంగానే కరుణానిధి నేతృత్వంలోని గత ప్రభుత్వం 2006లో నిర్బంధ తమిళ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని మీద శాసనసభ లోపల, బయట అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ప్రభుత్వం స్పందించకపోవటంతో మన భాష ఏమైపోతుందోనన్న ఆవేదనతో శాసనసభలో ఏడ్చేశాను. మీసాలున్న మగాడు ఏడిచాడు అని తోటి శాసనసభ్యులు ఎగతాళి కూడా చేశారు. భాషపై నాకున్న అభిమానం అలాంటిది. ప్రస్తుతం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య ఉన్నారు. తెలుగువారు తెలుగులోనే చదివేందుకు అవకాశమిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి తెలుగు సంఘాలకు హామీ కూడా ఇచ్చారు. దీనిపై రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా. ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హోసూరులోని తెలుగు సంఘాలన్నింటితో సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో చెన్నై ఇతర ప్రాంతాల తెలుగు సంఘాలనూ కలుపుకుని రాష్ట్ర సమాఖ్యగా విస్తరించనున్నాం. దీని ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతాం.
తమిళనాడు శాసనసభలో తెలుగులో మాట్లాడే ఏకైక శాసనసభ్యుడు మీరే. దీనిపై మీ సొంత పార్టీలో, సహచర శాసనసభ్యుల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా?
కాంగ్రెస్‌ జాతీయ పార్టీ. అన్ని భాషలనూ సమాన దృష్టితో చూస్తుంది. భాషాభిమానాన్ని అధిష్ఠానం ప్రోత్సహిస్తుందే కాని అడ్డుపడదు. కానీ నా తమిళ సహచరుల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది. నేను శాసనసభపక్షనేతగా ఎన్నికైనపుడు అంతా వ్యతిరేకించారు. తమిళనాడు శాసనసభలో ఒక తెలుగోడు శాసనపక్షనేతగా ఎలా ఉంటాడు...? అని అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇప్పటికీ అదే అసంతృప్తితోనే ఉన్నారు. ఒక సమస్య గురించి అంకితభావంతో పని చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎలాగూ ఉంటాయి. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను. నేను నా అమ్మ భాష కోసం పోరాడుతున్నాను... పోరాడుతూనే ఉంటాను.
తెలుగు కోసం ఇంతగా పోరాడుతున్నారు. భాషకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారం ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి సహకారం శూన్యం. మా ఒత్తిడితో అప్పటి ముఖ్యమంత్రి ఓసారి స్పందించినా ఫలితం దక్కలేదు. నేను రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక 2008లో ఆంధ్రపప్రదేశ్‌ ముఖ్యమంత్రిని కలిశాను. మా సమస్యలను విన్నవించాను. ఆయన ప్రస్తుత శాసనసభ ఛైర్మన్‌ చక్రపాణి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేశారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సాల్లోని తెలుగువారి సమస్యలను గుర్తించి, అక్కడి ప్రభుత్వాలతో పరిష్కారాల్ని చర్చించడం ఆ కమిటీ బాధ్యత. మా సమస్యలను విన్న తరువాత కమిటీ అధ్యక్షుడు చక్రపాణి ఇక్కడి ముఖ్యమంత్రిని కలుద్దామని చెన్నై వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఆయనను కలిసేందుకు ఆసక్తి చూపలేదు. అప్పటి శాసనమండలి సభాపతి అవడియప్పన్‌తో చక్రపాణికి మంచి స్నేహం ఉంది. అయినా అవడియప్పన్‌ కూడా చక్రపాణిని కలిసేందుకు ఇష్టపడలేదు. విద్యాశాఖమంత్రి కూడా ఏవో వంకలు పెట్టి తప్పించుకున్నారు. ఇలా తమిళనాడు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవటంతో ఆ కమిటీ తన ప్రయత్నాలను విరమించుకుంది. కమిటీ ఎలాంటి ప్రభావం చూపకపోయినా అప్పటి పాలకులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటే ఇక్కడ తెలుగు వికసించేది. మహారాష్ట్రలో ఉన్న ఒక తమిళ పాఠశాలను మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయిస్తే కరుణానిధి జోక్యం చేసుకున్నారు. తమిళంలో చదివే ఒక్క  విద్యార్థి ఉన్నా ఆ పాఠశాలను నడపాల్సిందే అని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ఆ పాఠశాలకు అయ్యే వ్యయాన్ని మా ప్రభుత్వమే భరిస్తోంది. అలాగే మలేషియాలోనూ తమిళ పాఠశాలలను మా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇది తమిళంపై ఇక్కడి ప్రభుత్వ చిత్తశుద్ధి. ఈ స్థాయి చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికీ ఉండాలి. అది కొరవడటంతోనే మాకీ దుస్థితి.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి