తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ఊరూ వాడా తిరిగి పుస్తకాలు అమ్మాను

  • 184 Views
  • 6Likes
  • Like
  • Article Share

    శ్రీసత్యవాణి

  • హైదరాబాదు.
  • 8008578174

తెలుగులో నాలుగు మంచి పుస్తకాల పేర్లు చెప్పమంటే ‘ఏడుతరాలు’ ముందు వరుసలో ఉంటుంది. మన పుస్తకాలగూట్లో ‘చేగువేరా’ ఠీవిగా కనిపిస్తుంది. ఇవేకాదు మొన్నటి ‘రక్తాశ్రవులూ’, ‘స్పార్టకస్‌’, ‘చరిత్ర అంటే ఏమిటి’ పుస్తకాలు మొదలుకుని.. నిన్నటి ‘నిర్జనవారధి’ వరకూ అన్నీ తెలుగు పాఠకులను ఆకట్టుకున్న పుస్తకాలే! కానీ ఆ పుస్తకాలని పరిచయం చేసిన ఘనత మాత్రం హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌దే! అంటే గీతారామస్వామిదే! అవును ముప్ఫైరెండేళ్ల నుంచి ఆ సంస్థలో కీలక బాధ్యతలు వహిస్తున్న మహిశా సంపాదకురాలు గీతారామస్వామి. తెలుగు పుస్తకం గురించి ఆమె చెబుతున్న విశేషాలివి.
గీతారామస్వామి.. వినడానికి తమిళపేరులా ఉంది. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు.?
అవును మాది తమిళనాడే. కానీ మేం అక్కడున్నది తక్కువే! నాన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో చాలా చోట్ల తిరిగాం. ముంబాయి, నాగ్‌పూర్, ఢిల్లీ.. చివరికి నేను డిగ్రీ చదివే నాటికి హైదరాబాద్‌ చేరుకున్నాం. అప్పటికి నాకు తెలుగు ఒక్కముక్క కూడా రాదు. మేం అయిదుగురు ఆడపిల్లలం. అమ్మ గృహిణి. తనకు బాగా చదువుకోవాలని ఉండేది. కానీ తనెక్కడ బడికెళ్తుందో అన్న ఉద్దేశంతో వాళ్లన్నయ్య అంటే మా మావయ్య తనువేసుకొనే రవికలన్నీ చింపేశాడు. ఆ సంఘటన గురించి మా అమ్మ నాతో చెప్పినప్పుడల్లా పుస్తకం మీద, చదువు మీద నాకున్న ప్రేమ రెట్టింపయ్యేది. ఆడపిల్లల విషయంలో ఉన్న ఇలాంటి సంప్రదాయాలపై వ్యతిరేకత మొదలైంది. దాంతో ఎన్నో ఆంగ్ల పుస్తకాలు చదివా.
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టుని ప్రారంభించాలన్న ఆలోచన మీకెలా కలిగింది?
పుస్తకాలు నాలో నింపిన చైతన్యానికీ, మా ఇంట్లో పాటించే ప్రాచీన బ్రాహ్మణ సంప్రదాయాలకు మధ్య నేను చాలా సంఘర్షణకు లోనయ్యా. ఆడపిల్లవు.. ఈ పని చెయ్యకు అంటే అదే పని చేసేదాన్ని. ‘ఆడపిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేయాలి?’ అని అమ్మ సతమతమవుతుంటే ‘నాకొచ్చే ఉపకారవేతనంతో నేను చదువుకొంటూ, నాకు పెళ్లే వద్దు’ అని చెప్పేశా. అలా ఇంటి నుంచి బయటకు వచ్చేసి లలిత, రుక్మిణీమీనన్, జంపాల ప్రసాద్, అశ్విని, ప్రదీప్‌ వంటి స్నేహితులతో కలిసి యూనివర్శిటీలో మహిళల హక్కుల కోసం పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ వంటి విద్యార్థి సంఘాలను స్థాపించా. అప్పుడే వామపక్ష పార్టీలతో నాకు అనుబంధం ఏర్పడింది. నాకు కర్ణాటక సంగీతం వచ్చు. కానీ తెలుగు రాయడం రాదు. తెలుగు బుర్రకథలని హిందీలో రాసుకొని వాటిని రాష్ట్రమంతటా తిరిగి పార్టీ తరపున వినిపించేదాన్ని. అలాంటివి వద్దని నాన్న ఇంట్లో పెట్టి బంధించినా సరే పారిపోయి స్నేహితుల ఇంట్లో తలదాచుకొన్నా. షాక్‌ట్రీట్‌మెంట్‌ ఇచ్చినా సరే వినలేదు. ఎమర్జెన్సీ సమయంలో కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి కూడా వెశ్లా. ఒక్క నేననే కాదు.. ఆ సమయంలో అటు బెంగాల్‌ నుంచి ఇటు శ్రీకాకుళం వరకూ యువతలో విప్లవ భావాలు నిండుగా ఉండేవి. కానీ వాటిని సరైన దారిలో నడిపించేందుకు ఇతర భాషల్లో ఉన్నట్టుగా తెలుగులో సరైన సాహిత్యం లేదనిపించింది. అప్పుడే హెచ్‌బీటీ స్థాపించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టా. ఆ తర్వాత పార్టీతో సరిపడక బయటకు వచ్చేశా. కానీ ఆ భావాలు, ఆశయాలు మాత్రం నాలో అలానే ఉండిపోయాయి. దాంతో మిత్రులు సీకే నారాయణరెడ్డి, ఎమ్‌టీఖాన్, భరతుడు వంటి వారితో కలిసి హెచ్‌బీటీ ప్రారంభించాను.
హెచ్‌బీటీ ప్రచురించిన పుస్తకాలు జనాల్లోకి తేలిగ్గానే వెళ్లగలిగాయా?
లేదు. మొదట్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. హెచ్‌బీటీ తరఫున మొదటిసారిగా రక్తాశ్రువులు, వేమనపద్యాలు, కూలిగింజలు వంటి పుస్తకాలని ప్రచురించాం. అప్పటికి నాకు వివాహమైంది. నా భర్త సిరిల్‌ రెడ్డి. ఆయన లా ప్రాక్టిస్‌ చేస్తున్నారు. ఆయనవీ నాలాంటి భావాలు కావడంతో నా పనికి పూర్తి సహకారం లభించింది. దాంతో పుస్తకాలు పట్టుకొని నారాయణరెడ్డిగారితో కలిసి ఊరారా తిరిగి అమ్మడం మొదలుపెట్టా. నారాయణరెడ్డిగారు వయసులో పెద్దాయన. అయినా ఓపిగ్గా నాతో పాటూ తిరిగి సహకరించేవారు. ప్రతి ఊర్లోనూ రెండు బల్లలూ, టెంట్‌ వేసుకొని రోజంతా నిలబడి పుస్తకాలు అమ్మేదాన్ని. ఆ ఊüÁ్ల ఎవరైనా తెలిసిన వాళ్లుంటే సరే. లేకపోతే ఆ ఊరి బస్టాండుల్లోనే నిద్రపోయేదాన్ని. బాత్‌రూములు కూడా లేక ఇబ్బంది పడేదాన్ని. కొంతమందైతే నేనలా రోజంతా నిలబడి పుస్తకాలు అమ్మడం చూసి ఏమ్మా నీకు అమ్మానాన్నాలేరా? బతుకుదెరువు కోసం ఇంత కష్టపడుతున్నావా అంటూ జాలిపడేవారు. కానీ చాలామంది మాత్రం ఆప్యాయంగా చూసుకుని ఆ రోజుకి వాళ్లింట్లో భోజనం పెట్టేవారు. అలా రాష్ట్రంలో ఒక్క ప్రాంతం కూడా వదలకుండా తిరగానంటే నమ్ముతారా? ఆ సమయంలోనే నాకు తెలుగు బాగా మాట్లాడటం అలవాటయ్యింది. నాలుగేళ్లకి హెచ్‌బీటీ ప్రజల్లోకి వెళ్లి మంచి స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రజల్లోకి వెశ్లాలంటే ఓ పుస్తకానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
జీవితాన్ని గొప్పగా చిత్రీకరించే ఏ పుస్తకాలయినా సరే ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి. సోమర్‌సెట్‌ మామ్‌ పుస్తకాల్లో అటువంటి  గొప్పతనమే కనిపిస్తుంది. తెలుగులో ఏడుతరాలూ, ఆయుధం పట్టని యోధుడు, చేగువేరా, స్పార్ట్‌కస్, నేను ఫూలన్‌దేవి, ఇంట్లో ప్రేమ్‌చంద్, నిర్జనవారధి వంటి పుస్తకాలకు ఓ హోదా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే దళితులూ, ఆడవాళ్లూ, ముస్లింలు ఇలా జీవితాలని ఉన్నతంగా చిత్రీకరించిన పుస్తకాలన్నీ విజయవంతం అయ్యాయి.
ప్రచురణకర్తగా ఒక పుస్తకాన్ని ఎంపిక చేసే ముందు మీరే ప్రమాణాలు పాటిస్తారు?
పుస్తకం నుంచి పదిమంది ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఏకబిగిన చదివించే గుణం దానికి ఉండాలి. ప్రాథమికంగా ఈ అంశాలతో నేను పుస్తకాలని ఎంపిక చేస్తా. నిజానికి ఈ ప్రక్రియ కత్తిమీద సాము లాంటిది. ఆడవాళ్లు రాసిన పుస్తకాలు మగవాళ్లకి నచ్చవు. అందుకే మనకంటూ ఓ అభిప్రాయాన్ని ముందే ఏర్పరచుకుని ఏదో ఒక కోణంలోంచి చూడటం కన్నా నలుగురు పాఠకులకు ఆ పుస్తకాలని ఇస్తాం. వారి అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి. నేను మాత్రం పుస్తకంపై వచ్చే అన్ని విమర్శలని స్వీకరిస్తా. అవన్నీ ఎడిటింగ్‌లో అక్కరుకొస్తాయి. అయితే చాలామంది రచయితలు తాము రాసిందే వేదం అనుకొంటారు. పదిసార్లు సానబెట్టిన పుస్తకమే కశాఖండం అవుతుందని నేను నమ్ముతా. అలా ఓ పుస్తకం గురించి నిర్ణయించామని చెప్పడానికి ఆర్నెల్ల నుంచి రెండు సంవత్సరాల సమయం కూడా పట్టొచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో నేనో వడపోత పరికరాన్నీ, అద్దాన్నీ మాత్రమే. ఇప్పటికి హెచ్‌బీటీ ప్రారంభించి 32 ఏళ్లు అవుతోంది. కోశాంబి వ్యాసాలు, బాలగోపాల్‌ రచనలు వంటి అభ్యుదయ సాహిత్యంతో సహా 350 వరకూ ఆణిముత్యాల్లాంటి పుస్తకాలని ప్రచురించాం. 
పుస్తకాలు చదువుతున్న వాళ్లు తగ్గుతున్నారనేది వాదన. మీరేమంటారు?
గతంలో డబ్బున్నవాళ్లు, ఎగువ, మధ్యతరగతి వాళ్లూ మాత్రమే ఎక్కువగా చదివేవాళ్లు. ఇప్పుడు ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్లు చదవడం తగ్గించినమాట వాస్తవమే కావొచ్చు. అయినా పాఠకులు తగ్గుతున్నారనడం మాత్రం నిజం కాదు. అలా అయితే మా అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయ్‌? దీనికి కారణం.. దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు అంటే ఇంతకు ముందు ఎవరైతే చదువుకు దూరంగా ఉన్నారో వాళ్ల పిల్లలు పుస్తకాలు చేతపట్టారు. దాంతో పుస్తకాలు చదివే వాళ్ల సంఖ్య పెరిగిందే కానీ తగ్గలేదు. అంతేకాదు అక్షరాస్యతా శాతం కూడా పెరిగింది. దాని ప్రభావం అమ్మకాలపై కచ్చితంగా ఉంది.
యువత పుస్తకాలు చదువుతున్నారంటారా?
యువత అంటే కేవలం సిలబస్‌ పుస్తకాలు చదివే వాళ్లే అనడం సరికాదు. గ్రామీణ యువత ఎక్కువగా స్వీయచరిత్రలు చదవడానికి ఇష్టపడుతున్నారు. మధ్యవయస్కులు విద్యా సంబంధిత పుస్తకాలు చదువుతున్నారు. వాళ్ల పిల్లల చదువుల కోసం. ఆడవాళ్లు మాత్రం పుస్తకాలు చదవడంలో వెనుకబడే ఉన్నారని చెప్పొచ్చు. హిస్టరెక్టమీపై అవగాహన కోసం ఒక పుస్తకాన్ని ప్రచురిస్తే అది కనీసం వందల్లో కూడా అమ్ముడుపోకపోవడమే ఇందుకు నిదర్శనం. వాళ్లకు పుస్తకాల కంటే సీరియళ్లపైనే అభిమానం.
జీవితంలో కథ ప్రాముఖ్యత ఏంటి?
పిల్లల్లో సృజనాత్మక, ఊహా శక్తికీ మూలం కథలే. మా పాపకి  పన్నెండేళ్లు వచ్చేవరకూ చెప్పిన కథలు చెప్పకుండా చెప్పడానికి ప్రయత్నం చేశాను. తను మాత్రం ఇష్టమైన కథని పదేపదే చెప్పించుకొనేది. అంటే ఓ కథలో కొత్త కోణాలని వెతకటానికి వాళ్లు ప్రయత్నిస్తారన్నమాట. అందుకే తనకోసం ఇంట్లో చిన్న గ్రంథాలయమే ఉంది. నా దృష్టిలో చిన్నతనంలో కథలు వినని పిల్లలే అసలైన పేదవాళ్లు.
ప్రచురణకర్తలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం ఎలా ఉంది?
ప్రభుత్వం నుంచి అందే సహకారం తక్కువనే చెప్పాలి. కర్ణాటకలో చూస్తే ఒక పుస్తకాన్ని ప్రచురిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం 500 కాపీలను కొంటుంది. అది ప్రోత్సహమే కదా! కానీ మనకలా కాదు గ్రంథాలయాలనే ప్రోత్సహించడం లేదు. ఒక వేళ గ్రంథాలయాలకు పుస్తకాలు అందించాలన్నా కమీషన్లు ఇవ్వాల్సిన దుస్థితి.
తెలుగు బతకాలంటే ఏం చెయ్యాలి?
నాది తమిళం. నా భర్త మలయాళీ. కానీ మా అమ్మాయి లీలకి మేం కొన్నేళ్లు వచ్చేవరకూ తెలుగే నేర్పించాం. తనతో ఇంట్లో తెలుగే మాట్లాడేవాళ్లం. మా బంధువులు వద్దంటున్నా సరే మేం తెలుగు నేర్పించాం. కానీ ఇక్కడి అమ్మానాన్నలు ఏం చేస్తున్నారు? మమ్మీ డాడీ అనిపిలిపించుకొంటున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చక్కని తెలుగు మాట్లాడరు. మన పిల్లలతో తెలుగులో మాట్లాడటం, తెలుగులో కథలు చెప్పడం వంటి పనులు చేయడం ద్వారా తెలుగుని రక్షించుకోవచ్చు. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును తప్పని సరి చేయాలి. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు ఇంట్లో ఎలాగూ తెలుగే మాట్లాడుతున్నారు కనుక. తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించడం వల్ల తెలుగు గొప్పతనం బయటవాళ్లకు తెలుస్తుంది. ఇక్కడ రచయితలకూ ప్రోత్సాహంగా ఉంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం

  ముఖాముఖి


తెలుగు కోసం ఏడ్చేశా...

తెలుగు కోసం ఏడ్చేశా...

మహ్మద్‌ ఆర్‌.హెచ్‌.షరీఫ్‌

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

గ్రంథాలయమే కోవెలగా... వెలగా

పావులూరి శ్రీనివాసరావు

అక్షరాలా ‘కథా’నాయకుడు

అక్షరాలా ‘కథా’నాయకుడు

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి