తెలుగు వెలుగు కి స్వగతం

bannerimg

ప్రజాపక్షం కానిది కళకాదు!

  • 1233 Views
  • 10Likes
  • Like
  • Article Share

కర్నాటి లక్ష్మీనరసయ్య అంటే నడిచే జానపద విజ్ఞాన సర్వస్వం. ఒకటి రెండు కాదు, ఎన్నో జానపద కళల మీద ఆయన పట్టు అనితర సాధ్యం. కళాకారుడిగా, కళారూపాల చరిత్రకారుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా ఆయన కృషి తెలుగునాట చైతన్యజ్యోతులను వెలిగించింది. తొంభై ఏళ్ల వయసులోనూ తరగని ఉత్సాహంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న కర్నాటితో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి..
తె.వె.: తెలుగునాట ఎగసిన సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలతో మీకు అవినాభావ సంబంధం ఉంది కదా.. ఆనాటి అనుభవాలు, జ్ఞాపకాలు..?

కర్నాటి: ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో ప్రజానాట్యమండలి పక్షాన ‘ముందడుగు’ నాటకం ప్రదర్శించటానికి వెళ్లాం. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ‘మండలి’లో మేమూ భాగం పంచుకుంటాం అంటూ ఎందరో యువకులు ముందుకొచ్చారు. అదొక గొప్ప జ్ఞాపకం. నా జీవితాన్ని మలుపుతిప్పిన ఘటన కూడా అప్పుడే జరిగింది. ఈ నాటకానికి సాధన చేసుకుంటున్న సమయంలో డాక్టర్‌ గరికిపాటి రాజారావు అక్కడికి వచ్చారు. ఆయనతో అదే తొలి పరిచయం. బుర్రకథ దిగ్గజాలు షేక్‌ నాజర్‌, రామకోటి, పురుషోత్తంలతో కూడా ఆ రోజే పరిచయం కలిగింది. వీరందరి సాహచర్యం నా జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. ‘‘దిగిపొమ్మని జగత్తంత / నగారాలు కొడుతున్నది / దిగిపోవోయ్‌ దిగిపోవోయ్‌ / ఇదే మాట ఇదే మాట / పదే పదే అనేస్తాను....’’ అంటూ దాశరథి సభల్లో ఎంతో గంభీరంగా ఉపన్యసించేవారు. ప్రేక్షకులతో పాటు వేదిక మీద ఉన్న మాలోనూ వీరావేశం కలిగేది. ఇంకా ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు... రజాకార్ల దాడులు, పోలీసుల ఒత్తిడి, వేధింపులు ఎన్నో ఉన్నాయి. కొన్నాళ్లు రహస్యజీవితం కూడా గడిపాను.
ఆ కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు?
మా కళా బృందాల మీద లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఓసారి ప్రదర్శన మధ్యలో ఉండగానే దాడి జరిగింది. తలో దిక్కుకు పారిపోయాం. పరిగెత్తి, పరిగెత్తి ఓ మాదిగ గూడెం చేరుకుని, ఓ గుడిసె ముందు కూలబడ్డా. ఆ ఇంటి మహాతల్లి నా పరిస్థితి చూసింది. వాళ్లకే రోజు గడవని పరిస్థితి. పచ్చిమిరపకాయని రోట్లో నూరి, కుండ మీద మూతపెట్టిన మూకుడులో గంజి పోసి ఇచ్చింది. అప్పుడు నాకదే అమృతం. ప్రాణం నిలిచింది. ఆ ఇల్లాలు నిలిపిన ప్రాణమే ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చింది. ఆ తల్లికి శతకోటి దండాలు. మధిరలో ఆంధ్రమహాసభల సందర్భంగా ప్రదర్శన ఇస్తున్న సమయంలో స్థానిక గూండాలు దాడి చేశారు. జనం భయంతో పరుగులు తీశారు. కళాకారులం కొందరం కర్రలు పట్టుకుని గూండాలను ఎదిరించాం. మాతోపాటు సభకు వచ్చిన వీరనారి పోతినేని లక్ష్మీదేవి రాళ్లు విసిరి, గూండాల్ని బెదరగొట్టింది. ఆ తర్వాతా ఎన్నో పోలీసు కేసులు పెట్టారు మా బృందాల మీద. అరెస్ట్‌ చేశారు కూడా. కానీ, మనం ప్రదర్శనలు ఇచ్చేది మన కోసం కాదు. ప్రజల కోసం. వారి మూఢవిశ్వాసాలు పోగొట్టాలి. వాళ్లలో చైతన్యం తీసుకురావాలన్న ఆలోచన మమ్మల్ని మరింత బలపరిచేది. ఒక్కోసారి చనిపోదామన్నంత గడ్డుపరిస్థితులు వచ్చేవి. కానీ, జనం కోసం బతకాలన్న ఆలోచన నన్ను నిలబెట్టేది. సమసమాజం ఏర్పడాలనేది నా జీవితాశయం. అందుకోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలని నాకు నేనే ధైర్యం చెప్పుకునేవాణ్ని.
పదులకొద్దీ జానపద కళల మీద మీకు పట్టు ఉంది. విభిన్న కళారూపాలకు సంబంధించిన అంతటి విజ్ఞానాన్ని ఎలా సముపార్జించారు?
మాది మధ్యతరగతి రైతు కుటుంబం. కృష్ణాజిల్లా తిరువూరు తాలూకా, గంపలగూడెం జమీందారిలోని తునికిపాడు స్వగ్రామం. కుటుంబం పెద్దది, రాబడి తక్కువ కావటంతో తెలంగాణలోని దెందుకూరు గ్రామానికి కుటుంబాన్ని మార్చారు పెద్దలు. దెందుకూరులో పదుల సంఖ్యలో కళారూపాలు ప్రదర్శించే కళాకారులు ఉండేవారు. దాసరి భాగవతులు, యానాది భాగవతులు, బుర్రకథలు, ముదిరాజుల భజనలు, బృందావన భజనలు, కోలాటాలు.. అబ్బో.. ఎన్నో కళారూపాలు ఉండేవి. ఇవన్నీ నిశితంగా పరిశీలించేవాణ్ని. నాకు తెలియకుండానే నేను చేసిన మరొక గొప్ప పని ఒకటుంది. బిచ్చగాళ్లు, పల్లకీలు మోసే బోయీలు, రజకులు, తులసి పూజ చేసే అమ్మమ్మలు, పొలాల దగ్గర తత్త్వాలు పాడే వృద్ధులతో సహా పసిపిల్లలకు జోలపాడే అమ్మల వరకు అందరినీ పరిశీలించేవాణ్ని. వారు పాడే పాటలు జ్ఞాపకం పెట్టుకునేవాణ్ని. అలాగే, ప్రకృతిని బాగా పరిశీలించేవాణ్ని. ఇవన్నీ నాకు అనంతమైన విజ్ఞానం కలిగించాయి. మా ఊళ్లో పశువులు కాసే పిల్లలు పాడే పాటలు తమాషాగా ఉండేవి. ‘‘ఘుమ్ము ఘుమ్మున పెరుగు తరచగ/ కోరి విని ప్రార్థించు కృష్ణుడు/ అమ్మ వెన్నాయనుచు కవ్వము/ నణచి పట్టగనూ/ నమ్మరా కృష్ణమ్మ పెరుగులో/ నడుమ గుమ్మడు తిరుగులాడును/ నమ్మకున్నను ఘుమ్ము ఘుమ్మను/ నాదమిటవినుమీ - కృష్ణా గుమ్మడిడుగో!!’’.. ఇలా సాగిపోయేవి. మా తాతమ్మ నాకు జో కొడుతూ పాడిన పాట కూడా బాగా గుర్తుంది. ‘‘ఏడవకు కుశలవుడ, రామకుమారా, ఏడిస్తే నిన్నెవ్వరెత్తుకుందూరు?/ ఉంగరమ్ములు గొనుచు, ఉయ్యాల గొనుచు/ ఊర్మిళా పినతల్లి వచ్చెనేడవకు/ పట్టుటంగీ గొనుచు పులిగోరు గొనుచు/ భూదేవి అమ్మమ్మ వచ్చెనేడవకు...’’ ఇలా ఎన్నో పాటలు మనసులో ముద్రించుకుపోయాయి.
కళారంగం మీద మీలో ఆసక్తి ఎప్పుడు మొగ్గ తొడిగింది? అది ఎలా వికసించింది?
పదహారో ఏట నుంచి నాకు కళారంగం మీద ఆసక్తి విపరీతంగా పెరిగింది. అదొక మమకారంగా మారింది. ఒక్క నాటకమే కాదు.. ఏ కళా ప్రదర్శన జరిగినా మొదటి నుంచి చివరి దాకా విడిచిపెట్టకుండా చూసేవాణ్ని. అమ్మా నాన్నా కూడా ఏమీ అనేవాళ్లు కాదు. ఏ కళారూపం చూసినా ఆ మాధుర్యం మనసులో జీర్ణించుకుపోయేది. అలౌకిక ఆనందానికి గురిచేసేది. క్రమంగా ఈ కళాప్రేమ వికసించి, రంగస్థలం మీద నేను కాలుపెట్టేందుకు స్ఫూర్తినిచ్చింది. అనంతమైన కళాయానంలో నాకు ఎందరో మహానుభావులు ప్రేరణనిచ్చారు. వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి, జమలాపురం కేశవరావు, పుచ్చలపల్లి సుందరయ్య, సర్వదేవభట్ల రామనాథం ఇలా ఎందరో పెద్దల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వీరందరూ నాకు గురుతుల్యులు.
మిమ్మల్ని చైతన్యోద్యమాల వైపు నడిపించిన ప్రత్యేక సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
తెలంగాణలో జరిగిన ఆంధ్రమహాసభలు నాలో తెలియని ఆవేశాన్ని, చైతన్యాన్ని కలిగించాయి. ప్రజల కష్టాల్ని, వారి సమస్యల్ని కళ్లకుకడుతూ అక్కడ జరిగిన కళాప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ తరహా ప్రదర్శనలు ఇవ్వటం కూడా అదే తొలిసారి అనుకుంటా. అప్పటి నుంచి నాలో చైతన్యం కలిగింది. కళను కేవలం కళగా కాకుండా, ప్రజాసంక్షేమం కోసం వినియోగించాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఇప్పటికీ అదే మార్గంలో నడుస్తున్నా. నా చిన్నతనంలో జరిగిన మరో సంఘటన... ఊళ్లో ఏదో జాతర జరుగుతోంది. పూనకం వచ్చిన వ్యక్తిని వీరతాడుతో బాదుతున్నారు. అతడు ఆవేశంతో ‘నన్ను ముంచారురో! నాకు కొలుపులు చెయ్యకపోతే మీ ఊరు నాశనం చేసేస్తా’ అంటూ ఊగిపోతు న్నాడు. ఇంతలో ఊరిపెద్ద బోడేపూడి రాఘవయ్య అక్కడికి వచ్చారు. ‘అమ్మోరు మహిమ...ఎంతకొట్టినా దెబ్బలు తగలటం లేద’ని ఆయనతో అక్కడివారు చెప్పారు. అలాగా... అంటూ ఆయన ఆ తాడుతో పూనకం వచ్చిన వ్యక్తిని రెండు దెబ్బలు వేశారు. అతడు ‘అయ్యో.. బాబో.. కొట్టకండి సామీ!’ అంటూ పరుగులు తీశాడు. ఈ సంఘటన నాలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించింది. మూఢనమ్మకాల వల్ల జరుగుతున్న మోసాలు, ప్రజలు పొందుతున్న నష్టాలు అర్థమయ్యాయి. ఎలాగైనా, ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యాలని నిశ్చయించు కున్నా. ఇలాంటివే మరికొన్ని సంఘటనలు నన్ను చైతన్యోద్యమాల వైపు నడిచేలా చేశాయి.
వేలకొద్దీ బుర్రకథా ప్రదర్శనలు ఇచ్చారు కదా. ఆ కళను ఎలా అభ్యసించారు? మీకు ఇష్టమైన బుర్రకథలేవి?
మా ఇంటి చావడిలో బుర్రకథ సాధన చేసేవాళ్లు. అలా, వాటిపట్ల ఆసక్తి కలిగింది. క్రమంగా ఆ ఆసక్తి,  అధ్యయనం చేయించింది. పోతు వీరయ్య దగ్గర, దొడ్డవరపు వేంకటస్వామి శిష్యుల దగ్గర బుర్రకథ నేర్చుకున్నా. గుడ్డి జంగంగా ప్రసిద్ధి పొందిన రామకోటయ్య దగ్గర దరువులు, పట్లు నేర్చుకున్నా. సిర్విశెట్టి సుబ్బారావు చెప్పే వీరుల కథలంటే నాకు ఇష్టం. సుంకర సత్యనారాయణ రాసిన కష్టజీవి, గుడ్డి జంగం రాసిన సర్దార్‌ పాపడు, వరాహావతార చరిత్ర, పల్నాటియుద్ధం కథలంటే చెప్పలేనంత ఇష్టం. షేక్‌ నాజర్‌తో కలిసి చలనచిత్రాల్లో బుర్రకథలు చెప్పాను.
నాటక ప్రదర్శనలూ విరివిగా ఇచ్చారు. దర్శకత్వమూ చేశారు. రంగస్థలంతో మీ అనుబంధం ఎలా మొదలైంది?
చిన్నతనంలోనే నాటకాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. తెలిసీ తెలియని వయసులో పెద్దవాళ్లని అనుకరించేవాణ్ని. మిత్రులందరం కలిసి నీలి దుప్పట్లు తెరలుగా కట్టి, వచ్చీరాని పద్యాలు, పాటలు పాడుతూ నాటకాలు వేసేవాళ్లం. ఏ నాటకమో మాకే తెలియని నాటకం వేసేవాళ్లం. నాకు ఎనిమిదేళ్ల వయసులో తొలిసారిగా ముఖానికి రంగు వేసుకున్నాను. కొణతమాత్మకూరు గ్రామంలో మా మేనమామ నల్లమల శివరామయ్య ఇంట్లో ఉంటున్న సమయంలో వేసిన ‘కనకతార’ నాటకంలో బాలుడి వేషం నాది. ‘నేను నాటకం వేస్తున్నానోచ్‌’ అంటూ ఊరంతా తిరిగి చెప్పా. కానీ, సాయంత్రం అయ్యేసరికి, భయం వేసి దాక్కున్నా. పెద్దవాళ్లు లాక్కొచ్చి, ముఖానికి రంగు వేశారు. ఉన్నవి రెండు డైలాగులే. అవీ చెప్పలేకపోయాను. అలా, రంగస్థలం మీద నా ప్రయాణం మొదలైంది.
మీకు ఇష్టమైన కళాకారులు, రచయితలు, మీ మీద ప్రభావం చూపిన పుస్తకాలు, వ్యక్తులు, సంఘటనలు..?
మా ఊళ్లో బిచ్చమెత్తుకునే షేక్‌ మొహియుద్దీన్‌ ప్రభావం నా మీద ఉంది. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, త్యాగరాజ కృతులు అద్భుతంగా పాడేవాడాయన. కోలాహలం నరసరాజు పద్యాలు పాడటం నేర్పించారు. సాతాని రామానుజయ్య దగ్గర త్యాగరాజ కృతులు నేర్చుకున్నా. గరిమెళ్ల, చిట్టిప్రోలు పాటలు రాసి, స్వయంగా పాడేవాళ్లు. అవి కూడా నన్ను ప్రభావితం చేశాయి. డి.వి.సుబ్బారావు హరిశ్చంద్ర నాటకం మర్చిపోలేను. క్రమశిక్షణకు ఆయన నాటక సమాజం మారుపేరుగా ఉండేది. దెందుకూరుకు చెందిన డప్పు కళాకారులు గౌరయ్య, కన్నయ్య ఆంధ్రదేశంలోనే పేరుపొందిన వారు. నాకెంతో ఇష్టులు. మా ఊరివాళ్లయిన గాలిబ్‌ సాహెబ్‌, మదార్‌ సాహెబ్‌ దగ్గర కర్రసాము నేర్చుకున్నా. కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, కాగడా లాంటి పత్రికల్ని అప్పటి పరిస్థితుల్లో చాటుగా చదివేవాళ్లం. వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. పొన్నలూరి రాధాకృష్ణమూర్తి రాసిన ‘అల్లూరి సీతారామరాజు’ పుస్తకం నామీద ఎంతో ప్రభావం చూపించింది. ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలలోని ‘‘ఆదికాలమున అందరి జనులు / అన్నదమ్ములండీ / నీ నా భేదము లేక లోకము / నడుస్తుండెనండీ...’’ లాంటి పాటలు నాలో సమతాభావాలు పెంచాయి. మాగ్జిం గోర్కీ ‘అమ్మ’ నవల అభ్యుదయ భావాలు కలిగించింది.
జానపద కళలకు సంబంధించిన అనేక రచనలు చేశారు. ‘కళావైభవం’ వంటి ఉద్గ్రంథాలు తెచ్చారు. ఈ రచనల వెనుక మీ లక్ష్యం ఏమిటి?
అనంతమైన కళాసంపద మనకు ఉంది. దాన్ని కాపాడుకుని, భావి తరాలకు అందించాలి. కళలన్నీ ఈవిధంగా వారసత్వంగా వచ్చినవే. మన పెద్దలు చెప్పకపోతే మనకు ఈ కళలు ఎక్కడ నుంచి వచ్చాయి? మనం సృష్టించలేదు కదా వీటిని? అందుకనే, నా బాధ్యతగా దాదాపు అన్ని జానపద కళల చరిత్రను గ్రంథాల రూపంలో తీసుకువచ్చాను. వీటిని పాఠకులు బాగా ఆదరించారు కూడా. అయితే, నా పుస్తకాల్లోని కళారూపాలన్నీ అక్షరాల రూపం దాటి, వేదికలపై ప్రదర్శనలు జరుపుకుంటూ, సజీవంగా నిలిచిన రోజునే నాకు సంతృప్తి కలుగుతుంది.
కళకు మీరిచ్చే నిర్వచనం ఏంటి? కళాకారుల బాధ్యతలేంటి?
సమాజాన్ని చైతన్యపరిచేది, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేదే కళ. ప్రజల అవసరాలు తీర్చలేనిది ఎప్పటికీ కళ కాదు. నా వరకు నేను ఈ సత్యాన్ని నూరుశాతం నమ్మాను. ఆచరించాను. కళాకారుల బాధ్యత కూడా ఇందులోనే ఉంది. పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ పోషణ, అందుకు అవసరమైన ధన సంపాదన అవసరమే. ఎవరూ కాదనలేని బాధ్యత అది. అయితే, ఇతరులకు భిన్నంగా కళాకారులకు సమాజం మొత్తం సొంత కుటుంబంతో సమానం. తోటి కళాకారులూ ఆ కుటుంబ సభ్యులే. వీరందరి బాగోగులూ కళాకారుడి బాధ్యతే అవుతుంది. అలాగే, కళను కళగా పోషించాలి. ఒకరి ఆదేశంతోనో, ఆశ్రయం కోసమో కళాప్రదర్శన చెయ్యకూడదు. ప్రజాహృదయాల నుంచి పెల్లుబుకితే ఏర్పడిన కళారూపాలివి. వీటి పవిత్రతను కాపాడటం కళాకారులందరి ప్రాథమిక బాధ్యత.
తెలుగునాట ప్రస్తుతం జానపద కళలకు లభిస్తున్న ఆదరణ మీద మీ పరిశీలన?
అందరికీ తెలిసిందే.. కొన్ని జానపద కళల పేరు కూడా నేటి తరానికి తెలియదు. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్లు ఎన్నో కళలు ఆదరణ కోల్పోయాయి. డప్పులు, బుర్రకథలు వంటి కొన్ని కళలకే ఆదరణ లభిస్తోంది. ఆధునికత పేరుతో దేశాలు దాటి మన వంటింట్లోకి చొచ్చుకువచ్చిన పాశ్చాత్య సంస్కృతీ పెద్దమ్మ కారణంగా కళలకు ఆదరణ తగ్గిపోతోంది. ఎవరో చెబితే ఆదరించటం కాదు. మన తల్లిదండ్రుల్ని ప్రేమించమని, ఆదరించమని, గౌరవంగా చూడమని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కళారూపాలను ఆదరించే విషయం కూడా ఆ కోవలోకే వస్తుంది.
జముకుల కథ లాంటి కళలు అంతర్థానమవుతున్నాయి. కళాకారులూ ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే మనం కోల్పోయేదేంటి? జానపద కళలను ఎలా కాపాడుకోవాలి?
నిజమే... ఎన్నో కళలు కనుమరుగవుతున్నాయి. ఇందువల్ల కోల్పోయేది కేవలం కళను మాత్రమే కాదు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రజల్ని భౌతిక ఉత్పత్తుల్ని తయారుచేసే శక్తిగా మాత్రమే గుర్తిస్తున్నారు. అది తప్పు భావన. ఆధ్యాత్మిక విలువలకు తరగని ప్రేరణ ఇచ్చేది ప్రజలే. అన్ని మహాకావ్యాలకు, నాటకాలకు ప్రజలే మూలకారకులు. ప్రపంచ సంస్కృతికి కూడా ప్రజలే కర్తలు. ప్రజల అనుభూతులకు జానపద కళలు నిలయాలు. జాతి విలక్షణత అక్కడి కళలో ప్రతిబింబిస్తుంది. కళారూపాలకు అవసరమైన జీవద్భాషను ప్రజలే అందిస్తారు. ఇలా, కళలు, ప్రజలు ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. కళను కోల్పోతున్నామంటే, అక్కడి ప్రజల సంస్కృతి, భాష.. ఒకటేమిటి, సర్వస్వం కోల్పోతున్నట్లే. జానపద కళల్ని కాపాడుకోవాలంటే పల్లె జీవనం బాగుండాలి. ప్రకృతితో మమేకమై జీవించే సనాతన ఆచారం తిరిగి వ్యవహారంలోకి రావాలి. అప్పుడే ప్రకృతికి ప్రతీకలైన జానపద కళల ఉనికి సజీవంగా ఉంటుంది. దీంతోపాటు, కళారూపాలన్నిటి చరిత్రతో సహా సమస్త వివరాలను అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి, శాశ్వతంగా భద్రపరిచే చర్యలు తీసుకోవాలి. కళాకారులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక, ప్రజల నుంచి హార్దిక సాయం కావాలి. కళాకారులకు ప్రభుత్వం తగిన వేదికలు కల్పించాలి. కళను ఆదరించి, కళాకారులను ప్రోత్సహించే బాధ్యత ప్రజలు తీసుకోవాలి.
తెలుగు భాష స్థితిగతుల మీద మీ అభిప్రాయం? భాషను కాపాడుకోవాలంటే ఏ స్థాయిలో, ఎలాంటి కృషి జరగాలి?
నిజానికి ఈ ప్రశ్న చాలా ఆవేదన కలిగించేది. భాష నేర్చుకోవటం లేదు సరికదా, దానికి కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు ఇప్పటితరం. తెలుగు భాష వైభవాన్ని నిండుగా ఆస్వాదించిన మా తరానికి ఇప్పటి పరిస్థితులు తీవ్రమైన బాధ కలిగిస్తున్నాయి. నిజానికి భాష అంటే సమాచారం ఇచ్చిపుచ్చుకునే మాధ్యమం మాత్రమే కాదు. అదొక సంస్కృతి. జీవన వ్యవస్థ. మన ఉనికి చాటే చైతన్య దీపిక. ఏ భాషలో మాట్లాడితే ఏం అనే వికృత భావనలు ఇప్పటితరం నుంచి వినిపిస్తున్నాయి. అమ్మా! అని నోరారా పిలిచిన తియ్యదనం ‘మమ్మీ’లో ఉండదు. మన జాతీయాలు, సామెతల్లో ఉన్న అందం మరోభాషలో సాధించలేం. మన భాషను కాపాడుకోవటం అంటే మన తల్లిని గౌరవించుకోవటమే. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవటమే అవుతుంది. భాషా పరిరక్షణ ఏ ఒక్కరి కర్తవ్యమో కాదు. ప్రభుత్వం, ప్రజలు సమష్టిగా కలిసి నిర్వహించాల్సిన బాధ్యత అది. ప్రతి ఇల్లూ తెలుగు నిలయం కావాలి. ప్రతి గుండెలో తెలుగు అక్షరాల చప్పుళ్లు వినబడాలి. అన్నిటికన్నా ముఖ్యం మన భాషను మనం ప్రేమించాలి. తెలుగులో మాట్లాడటం హోదాను తగ్గిస్తుందనే ఆలోచన నుంచి బయటకు రావాలి.
ప్రస్తుతం వస్తున్న తెలుగు సాహిత్యం ఎలా ఉంది? సమకాలీన కవులు, రచయితల దృష్టి కోణాల మీద మీ పరిశీలన, అభిప్రాయం...?
కొంతవరకు బాగానే ఉంది. కానీ, మనవైన సంస్కృతీ మూలాల నుంచి బయటకు వస్తోందా నేటి సాహిత్యం అనిపిస్తోంది. ఏవో ఒకటి రెండు ప్రక్రియలు మినహా మిగిలిన ప్రక్రియల్లో చెప్పుకోదగిన సాహిత్యం రావట్లేదు. రచయితలు కూడా తాత్కాలిక, తక్షణ ప్రతిఫలాన్ని ఆశించకుండా, సమాజాన్ని చైతన్యపరిచే దిశగా మరిన్ని రచనలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ఉద్యమాల వైపు నడిపించే సాహిత్యం రావాలి. మనవైన కళారూపాలు, సంస్కృతీ వైభవాన్ని చెప్పే రచనలు రావాలి. అన్నిటికన్నా మిన్నగా మన తెలుగును తెలుగులా మిగిల్చే రచనలు రావాలి.

 


వెనక్కి ...

మీ అభిప్రాయం