అంతర్జాలం
 

  • 740 Views
  • 5Likes
  • Like
  • Article Share

అంతర్జాలం
 

ప్రదీప్‌ అత్తారింటికి వచ్చాడు. మర్యాదలవీ ఘనంగా జరుగుతున్నాయి. రెండు రోజుల తర్వాత మావగారు బ్యాంకుకు వెళ్తూ ‘‘నువ్వూ వస్తావా?’’ అని అల్లుణ్ని అడిగారు. పొద్దుటే అత్తగారు చేసిపెట్టిన అల్లం పెసరట్టు కడుపులో బరువుగా ఉండటంతో అది అరుగుతుంది కదా అని బయల్దేరాడు ప్రదీప్‌. ఇద్దరూ కాలినడకనే బ్యాంకుకు చేరుకున్నారు. అక్కడ మావగారు దరఖాస్తు నింపి డబ్బులు తీసుకున్నారు. వాటిని ఎవరికో పంపడానికి మళ్లీ దరఖాస్తు నింపారు. ఇదంతా అయ్యేసరికి ఓ గంట పట్టింది.    
      ‘ఇక్కడ ఇంతసేపు కష్టపడటం ఎందుకండీ? ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఉంది కదా?’’ మావగారితో అసహనంగా అన్నాడు ప్రదీప్‌. ‘‘ఎందుకది? ఏంటి ఉపయోగం?’’ ఆయన ఎదురు ప్రశ్నించారు.   
‘‘ఇంటి దగ్గర నుంచే మీరు అన్ని బిల్లులూ కట్టొచ్చు. డబ్బులు బదిలీ చేయొచ్చు. అంతెందుకు? మీకు కావాల్సిన వస్తువులన్నీ అంతర్జాలం ద్వారా తెప్పించుకోవచ్చు’’  
‘‘ఇవాళ ఇక్కడికి వచ్చాక నా పాతమిత్రుల్ని నలుగురిని కలిశాను. చూశావు కదా బాబూ! బ్యాంకు ఉద్యోగులతో కూడా నాలుగు మాటలు మాట్లాడాను. వచ్చేటప్పుడు దార్లో తెలిసినవాళ్లందర్నీ పలకరించాను. ఇంకో సంగతి, మొన్న మీ అత్తగారు కిరాణాకొట్టు దగ్గర కళ్లుతిరిగి పడిపోయింది. అప్పుడు ఆ కొట్టతనే ఆటో కట్టించి ఆవిణ్ని ముందు డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లి చూపించి, ఇంటికి తీసుకొచ్చాడు. మీరందరూ మాకు వాట్సప్‌ ఫొటోలు పంపుతూ దూరంగానే ఉన్నారు కదా బాబూ! మరి మాకు ఇక మానవ సంబంధాలేముంటాయి? టెక్నాలజీ తప్పు కాదు. కానీ, ఇంట్లోనే ఉండి అన్ని పనులూ చేసేసుకుంటే ఈ వృద్ధాప్యంలో మాకు తోడు ఎలా దొరుకుతుంది బాబూ? కిందటేడాది జబ్బుపడ్డాను గుర్తుందా? నేనెప్పుడూ మాంసం తీసుకునే కొట్టతను నన్ను చూడటానికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోజూ పేపర్‌ వేసే అబ్బాయి, పాలు తెచ్చిపెట్టే కుర్రాడు.. వీళ్లందరూ నన్ను పరామర్శించారు. ఈ అనుబంధాలను అంతర్జాలం తెచ్చిపెట్టగలదా? నేను నా ఫోనుకో, కంప్యూటర్‌కో పరిమితమైతే వీళ్లందరూ నా వాళ్లయ్యేవారా?’’  
      ప్రదీప్‌ తల నేలకి వాలిపోయింది. 
* * *
      నాలుగు గోడలు దాటి నలుగురితో మాట కలిపి చూడండి! జీవితమంటే ఏంటో తెలుస్తుంది.

సేకరణ: బొడ్డు మహేందర్‌
చెన్నూరు, ఆదిలాబాదు 
 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు