విలువ

  • 2881 Views
  • 27Likes
  • Like
  • Article Share

విలువ

‘‘నా జీవితం విలువ ఎంత?’’ దేవుణ్ని అడిగాడో వ్యక్తి. అతనికి ఓ రాయి ఇచ్చాడు దేవుడు. ‘‘ముందు నువ్వెళ్లి దీని విలువ తెలుసుకుని రా...’’ అన్నాడు. 
      ఆ వ్యక్తి మొదట ఓ పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్లాడు. ‘‘ఈ రాయి విలువ ఎంత ఉంటుంది?’’ అని అడిగాడు. ‘‘దీనికి అయిదు పండ్లు ఇస్తాను. ఇచ్చేస్తావా?’’ అన్నాడా వ్యాపారి. దేవుడు ఆ రాయిని అమ్మమనలేదు కాబట్టి ఆ వ్యక్తి తల అడ్డంగా ఊపాడు. తర్వాత ఓ కూరగాయల వ్యాపారి వెళ్లాడు. అతనేమో ‘‘ఈ రాయికి పది కేజీల కూరగాయలిస్తాను’’ అన్నాడు. 
      ‘‘దీని విలువ ఎంతేంటో చెప్పగలరా?’’ ఓ నగల వ్యాపారికి ఆ రాయిని చూపిస్తూ అడిగాడు ఆ వ్యక్తి. ‘‘రూ.50 లక్షలు ఇస్తాను, అమ్ముతావా?’’ కళ్లలో ఆశల మెరుపులతో బదులిచ్చాడు వ్యాపారి. ‘‘అమ్మను’’ అని చెబుతూ ఆ వ్యక్తి వెనుదిరగబోయాడు. ‘‘సరే... కోటి రూపాయలు ఇస్తాను’’ అన్నాడు వ్యాపారి. ఈ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ, దేవుడికి కోపం వస్తుందని అక్కణ్నుంచి వచ్చేశాడు. ఆ తర్వాత వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్లాడు. అతను ఆ రాయిని పరీక్షించి, ‘‘ఇది మీకెక్కడ దొరికింది? నా ఆస్తి మొత్తం ధారపోసినా దీని విలువకు సరితూగదు. అసలు దీనికి ఎవరూ ఖరీదు కట్టలేరు’’ అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో. ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. వెంటనే దేవుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. 
      ‘‘ఈ రాయిని నువ్వు వేర్వేరు వ్యక్తులకు చూపించావు కదా. వాళ్లందరూ తమ తమ స్థాయులను బట్టి దాని విలువను నిర్ణయించారు. నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం వాస్తవం చెప్పాడు. నువ్వూ ఈ రాయి లాంటివాడివే. నీ జీవితమూ వెలకట్టలేనిదే. కానీ, నీకు తారసపడే మనుషులందరూ వాళ్ల వాళ్ల స్థాయులను బట్టి నీ జీవితానికి వెలకడతారు. నువ్వు వాళ్లకి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెలకడతారు. నేను మాత్రం అలా వెలకట్టలేను. నాకు తెలుసు... నువ్వో అమూల్యనిధివి’’ అని నవ్వుతూ చెప్పాడు దేవుడు. 

* * *

      మన జీవితాన్ని మనం ప్రేమించాలి. ఆస్వాదించాలి. 

- సేకరణ: జనగామ శ్రుతివల్లి, కామారెడ్డి

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు