జ్ఞానం

  • 1602 Views
  • 154Likes
  • Like
  • Article Share

జ్ఞానం

ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, రూ.లక్ష నగదు, అయిదు పుస్తకాలు పోయాయి. 
      ‘‘పుస్తకాలది ఏముందయ్యా...’’ అంటూ నగలు, నగదు చోరీ అయ్యాయని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. 
దర్యాప్తు సాగుతోంది. నెలలు గడుస్తున్నాయి. అయిదు నెలల తర్వాత కవి ఇంటికి ఒక పార్సిల్‌ వచ్చింది. తెరచి చూస్తే అందులో నగలు, నగదు! కవి భార్య ఆనందానికి అవధుల్లేవు. వాటిని కళ్లకద్దుకుంది. కానీ, కవి ముఖంలో దిగులు! 
      ‘‘పదేళ్లు కష్టపడి ఆ పుస్తకాలు రాశాను. అవి నా పంచప్రాణాలు. పంపేవాడు పుస్తకాలు పంపించి, నగలు, నగదు ఉంచేసుకున్నా బాగుండేది. కష్టపడితే సొమ్ము సంపాదించగలను. కానీ, పుస్తకాలు మళ్లీ రాయలేనే. అవి సరస్వతీ దేవి..’’ దుఃఖంతో కవి గొంతు బొంగురుపోయింది. ‘‘పోనిద్దురు బడాయి. మీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగలు, డబ్బు సాక్షాత్తూ లక్ష్మీదేవి. ఆ దొంగోడెవడో పిచ్చోడిలా ఉన్నాడు. పుస్తకాలు పోతేపొయ్యాయి. సొమ్ము దొరికింది. అంతే చాలు’’ అంది ఆయన భార్య. అంతలో ఆ పార్సిల్‌లో ఒక ఉత్తరం కనిపించింది. దాన్ని తెరచి ఆసక్తిగా చదవడం మొదలుపెట్టిందామె. 
      ‘‘కవిగారికి నమస్కారాలు. బీరువా తాళాలు పగలగొట్టి చూశాను. నగలు, నగదు పక్కనే పుస్తకాలు కనిపించాయి. అవేవో విలువైనవని ఎత్తుకొచ్చాను. బీరువాలో దాచారంటే వాటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేయో అని ఓపిగ్గా చదివాను. నగదు, నగలకన్నా గొప్ప నిధి దొరికింది.. జ్ఞాన నిధి. తప్పుచేశానని తెలుసుకున్నాను. ఆలోపు మా ఆవిడ పాతికవేలు ఖర్చుచేసింది. చెమటోడ్చి సంపాదించి కొద్ది రోజుల్లోనే ఆ డబ్బు పంపిస్తాను. పుస్తకాలు కూడా పంపించేస్తాను, నకలు తీసుకుని. వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో కూడా చదివిస్తాను. ఇప్పుడు నా దృష్టిలో నగలు, నగదుకన్నా పుస్తకాలే విలువైనవి. ఇట్లు.. దొంగతనాలు మానిన ఓ దొంగ’’
కవి ముఖంలో ఆనందం. ఆయన భార్య మదిలో ఆలోచనలు.. నగలు, నగదు గొప్పవా? జ్ఞానం గొప్పదా? 

సేకరణ: హరీష్‌ సాక, అమరచింత, వనపర్తి జిల్లా

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు