భాగ్యవంతుడు

  • 1331 Views
  • 13Likes
  • Like
  • Article Share

భాగ్యవంతుడు

ఎప్పటికైనా నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తాను కూడా చేరాలని లక్ష్మీపతి ఆకాంక్ష. అందుకోసం రాత్రింబవళ్లూ కష్టపడ్డాడు. సంపాదనే ధ్యేయంగా బతికాడు. 40 ఏళ్లలోపే కోటీశ్వరుడయ్యాడు. అందమైన భవనాలు రెండు మూడు కట్టించాడు. అయినా సంతృప్తి లేదు. తన ప్రత్యేకత తెలిసేలా నగరం మధ్యలో ఒక ఇంద్రభవనం నిర్మించాలని అనుకున్నాడు. దానికోసం మరింత కష్టపడ్డాడు. అనుకున్నది సాధించాడు. 
      ఆరోజు గృహప్రవేశం. నగరంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. ఒక్కో దేశం తాలూకూ విశిష్టతల కలబోతగా ఉన్న ఆ ఇంటిని చూసి అందరూ ‘ఔరా’ అనుకున్నారు. లక్ష్మీపతిని అభినందనల్లో ముంచెత్తారు. కార్యక్రమం ముగిశాక అతను తన పడకగదికి వెళ్లి కాస్త నడుం వాల్చాడు. అతని భార్యాపిల్లలు ఇంకా ఫోన్లలో ముచ్చట్లాడుతున్నారు. ఆరోజు అతనికి కంటినిండా నిద్రపోవాలనిపించింది. నెమ్మదిగా కళ్లు మూతలుపడుతుండగా ‘‘నేను వెళ్తున్నాను’’ అని చెవిలో ఎవరో గుసగుసగా అన్నట్లు వినిపించింది. కళ్లు తెరచి చూశాడు. ఎవరూ లేరు. మసక మసగ్గా చీకటి. ‘‘ఎవరది’’ అన్నాడు. ‘‘నేను వెళ్తున్నా’’ మళ్లీ ప్రతిధ్వనిస్తూ వచ్చిందా స్వరం. ‘‘అదేంటి, నువ్వు వెళ్లిపోతే నేను చచ్చిపోతాను కదా!’’ కంగారుగా అన్నాడు లక్ష్మీపతి. ఎందుకంటే, ఆ ప్రతిధ్వని అతని ఆత్మది! ‘‘వొద్దు.. వెళ్లొద్దు. చూడు నీకోసం ఎంత గొప్ప భవంతి కట్టించానో. ఎంత డబ్బు సంపాదించానో. అంతా నీ తృప్తి, ఆనందం కోసమే కదా’’ అన్నాడు లక్ష్మీపతి. 
      ‘‘ఆనందమా? ఎక్కుడుంది? మధుమేహం, బీపీ, అల్సర్‌ లాంటివి నీ ఒంట్లో తిష్ఠవేశాయి కాబట్టి కోరుకున్నది తినలేను. అసలు అడుగు తీసి అడుగేయడానికి నువ్వెంత ఆయాసపడతావో మనిద్దరికీ తెలుసు. నీ శరీరం మొత్తం ఒక వ్యాధుల పుట్ట. నువ్వే చెప్పు, శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?!!’’ అతను తీక్షణంగా వింటున్నాడు.
      ‘‘నువ్వు కట్టించిన ఈ అందమైన భవంతితో నాకేంటి సంబంధం. నీ శరీరమే నా అసలైన ఇల్లు. దాన్నిండా రుగ్మతలేే. నాకు ఇందులో రక్షణ లేదు. సుఖం లేదు. అన్నిటికన్నా ముందు నీకొచ్చింది డబ్బు జబ్బు. అప్పటి నుంచి సరిగా నిద్రపోయావా? సమయానికి తిన్నావా? విశ్రాంతి గురించి ఆలోచించావా? రోగాలు చుట్టుముడుతున్నా పట్టించుకున్నావా? ప్రతి క్షణం పక్కవాళ్లతో పోల్చుకుంటూ, పోటీపడుతూ ఒత్తిళ్లు, కుతంత్రాలు, ఈర్ష్యాసూయలతో నీ శరీరాన్ని నింపేశావు. దాన్ని గుల్ల చేసేశావు. అందుకే నేనిక ఇందులో ఉండలేను. వెళ్తున్నా’’ ఆత్మ నిష్క్రమిస్తుంటే, అతను నిస్సహాయంగా ఉండిపోయాడు. 

* * * 

‘ఆరోగ్యమే మహా భాగ్యం’. దాన్ని కాపాడుకుంటేనే అసలైన ఆనందం. 

సేకరణ: అంబల్ల జనార్దన్, ముంబయి

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు